తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-5

4
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

బక్క కోపం:

రైలాట జోరుగా సాగిపోతున్నది. ఐదారుగురు పిల్లలు వేసవి ఎండని సైతం లెక్క చేయకుండా పల్లెటూరులోని ఓ ఇంటి ఆవరణలో రైలాట అడుకుంటున్నారు. వారంతా దాదాపుగా ఒక ఈడు వారే. కాకపోతే అందులో ఒకడు మాత్రం వారికంటే చిన్నోడు. ఆట జోరుగా సాగిపోతున్నా మధ్యమధ్యలో కాసేపు అలకలు, అంతలో పకపకలు. ‘ఇక చాల్లేరా రైలాట, సూర్యుడు నడినెత్తికి చేరుతున్నాడు, లోపలికి వచ్చి నీడ పట్టున ఆడుకోండి’ అని అంటున్నా, ఈ ‘పిల్ల రైలు’ ఆగడం లేదు. ఇంకా జోరు పెంచేసింది.

ఈ ముచ్చట 1964 మే నాటిది. వేసవి సెలవులు కావడంతో గుంటూరు నుంచి బస్సెక్కి ఆడవి రావులపాడుకి వచ్చేశాం.

అసలు ఈ ప్రయాణానికి పది పదిహేను రోజుల నుంచే పెద్ద ప్లానింగ్. చుట్టుపక్కల స్నేహితులకు మా ఊరి ప్రయాణం గురించి గొప్పలు చెప్పేవాడ్ని. ‘మా ఊరు ఎంత బాగుంటుందో తెలుసా? మా ఇంట్లో బోలెడన్ని ఆవులుంటాయి. ఎద్దులుంటాయి. వాటికి కొమ్ములుంటాయి. మరే, నేనైతే ఆ కుమ్ములకు రంగులేస్తాను తెలుసా. మరేమో, ఆవులను, ఎద్దులను తమాషాగా పేర్లు పెట్టి పిలుస్తాం. అవి కూడా అలా పిలవగానే మావైపు చూస్తాయి తెలుసా.. ఇంకేమో, మా బామ్మ మేం వెళ్లేసరికే బోలెడు మిఠాయిలు తయారుచేసి సీసాల్లో నింపి ఉంచుతుంది. నాకు అక్కడ బోలెడు మంది స్నేహితులు. చదువుకోమని ఎవరూ అనరు తెలుసా..’ ఇలా బోలెడు కబుర్లు చెప్పేసరికి పట్నం స్నేహితుల్లో కొంత మంది నేను చెప్పే కబుర్లను ఆశ్చర్యంతో వినేవారు. వారిలో ఒకడైతే ‘ఒరేయ్, నేనూ వస్తానురా’ అని మారాం చేసేవాడు. ఆ రోజుల్లోనే గుంటూరు నుంచి నేరుగా జగ్గయ్యపేటకు ఫాస్ట్ పాసింజర్ బస్సు సౌకర్యం వచ్చేసింది. ఇది ఎర్ర రంగులో ఉండేది. ఉదయం గుంటూరులో బయలుదేరి మూడు గంటల్లో నందిగామకు చేరేది. మధ్యలో కంచికచర్ల దగ్గర మా అమ్మ జామకాయలు కొంటుండేది. ‘ఇక్కడి జామకాయలు బాగుంటాయిరా, తినండి’ అంటూ పిల్లలకు పంచేది.

గొప్పలు చెప్పడం కాదుకానీ, మా ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. ఊరి మధ్యలోనే మా ఇల్లు. దానికి దగ్గర్లోనే గాంధీ విగ్రహం ఉండేది. ఆ పక్కనే పంచాయితీ ఆఫీస్ ఉండేది. ఆ రోజుల్లో పంచాయితీ రేడియో వింటూ పనులు చేసుకుంటూ ఉండేవారు. రాత్రి పది గంటలకు ప్రసారాలు సమాప్తం అనేటంతటి వరకు వింటుండేవారు. ఒక్కోసారి రాత్రి పూట హరికథలు ప్రసారం చేసేవారు. రేడియో కాకుండా వినోదం అందించడానికి అప్పుడప్పుడు బుడబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దు ఆడించే వాళ్లు వస్తుండేవారు. వానలు ఎంతకీ పడకపోతే కప్పలకు పెళ్ళిళ్లు చేసేవారు. అదో వింత తంతు. ఇలాంటి ఆచారాలు పల్లెల్లో నేటికీ ఉన్నాయి. ఇవన్నీ మరోసారి చెబుతానులేండి. రైలాట దగ్గరకు వెళదాం, పదండి.. చుట్టుపక్కల పిల్లలను పోగేసి రకరకాల ఆటలు. అందులో రైలాట, బస్సాట అంటే నాకెంతో ఇష్టం. రైలాటలో ఎక్కువ సార్లు నేనే రైలింజన్ గాడినన్నమాట. ‘కూ..చుక్..చుక్..’ అంటూ ఇంజన్ గాడు ముందుకు పోతుంటే, ఇంజన్ చొక్కా పట్టుకని వెనుక ఒక బోగీగాడు వాడి చొక్కా పట్టుకుని మరో బోగీగాడు..ఇలా రైలు పెట్టెలు ముందుకు కదులుతుండేవి. ఆటే కదా అని గార్డ్ పెట్టె లేదనుకోకండి. అదీ ఉండేది.

అందరిలోకి చిన్నోడు, పొట్టిగా ఉండేవాడ్ని సెలెక్ట్ చేసి గార్డ్ పెట్టెగా పెట్టేవాళ్లం. వాడి చేతికి ఓ గుడ్డ ముక్క, వీలుగా ఉంటే ఆకుపచ్చ రంగుది ఇచ్చేవాళ్లం. గుడ్డ ముక్క దొరక్కపోతే అమ్మ జాకెట్ లాక్కొచ్చేసేవాడ్ని. ఆ బోగీ గాడేమో రైలు చివర్లో ఆ గుడ్డ ముక్కని గాలిలోకి అటూ ఇటూ ఊపితేనే ఇంజన్ గాడు బయలుదేరాలి. అది ఆటలోని రూలన్న మాట. కానీ కొన్ని సార్లు అలా జరగదు. ఎందుకంటే గార్డ్ గాడు చిన్నోడు, వాడి మాట మనమెందుకు వినాలి. పైగా ఇంజన్ గాడినాయె. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఇంజన్ కదిలించేదన్న అదో రకం భావన ఉండేది. దీన్నే ‘బాసిజం’ అంటారేమో, నాకప్పుడు గొప్పగొప్ప పదాలు తెలియవు కదా. కానీ ఆ కాసేపు నేనే గొప్ప, రైలుకి ఇంజన్ గొప్ప అన్న భావం మాత్రం బాగా బలంగా ఉండేది. మిగతా పిల్లలకు ఈ బాసిజం ఎలగబెట్టాలని ‘మాకూ ఇంజన్ ఛాన్స్ ఇవ్వరా’ అంటూ అడిగే వారు. ‘నేనేమో నో ఛాన్స్’ అనేవాడ్ని.

కాసేపు అలగడాలు, కోపతాపాలు క్యూకట్టేవి. సరే, రైలు స్టేషన్ వద్ద ఆగినప్పుడు ఉడకబెట్టిన శనగలు అమ్మేవాడు, తాటిచాప, ఎర్ర గోళీలు, తేగలు, పీచు మిఠాయి అమ్మేవాడు, వచ్చేవారు. ఉత్తిత్తిగానే.

ఈ పాత్రలు కూడా మాలోని ఒకరిద్దరు పోషించేవారు. అంతేనా, అంటే ఇంకా కొన్ని పాత్రలు ఈ రైలాటను రక్తికట్టిస్తుంటాయి. అందులో ప్రధాన పాత్ర టికెట్ కలెక్టర్. ఈ టీసీ గాడేమో వీర ఫోజెట్టి మా అందరి దగ్గర (అంటే అప్పుడు, ఆ కాసేపు మేము ప్రయాణీకులం కదా) టెకెట్లు ఉందో లేదో చెక్ చేసేవాడు. ఇంకా ప్రయాణీకుల్లా కాసేపు నటించాలన్న మాట. ఇలా ఎన్నో సన్నివేశాలతో రైలాట యమ జోరుగా సాగుతుండేది. రైలు ఇంజన్ ఎటు వెళితే మిగతా బోగీగాళ్లు అటే కదలాలి. ఇది మా ఆటలోని మరో రూల్. కానీ ఒక్కోసారి ఈ రూల్ తల్లక్రిందులవుతుండేది. సడన్‌గా బోగీగాళ్లలో ఒకడు లింక్ చొక్కా వదిలేసి తుర్రుమనేవాడు. మరికొన్ని సార్లయితే రైలు వేగం తట్టుకోలేని ‘అర్భక బోగీగాడు’ ప్రక్కకు వొరిగి పడిపోయేవాడు. దీన్నే ‘బోగీ పట్టాలు తప్పడం’ అని అంటారని తర్వాత తెలిసిందనుకోండి. ఇలాంటి ప్రమాదాలు మా రైలు మాత్రం ఆగదు.

చలాకీ రైలు:

‘పిల్ల కూతల’ చలాకీ రైలు ఎలాంటిదంటే, పెరట్లో తిరగడమే కాదు, ఒక్కోసారి ఇంటి మెట్లెక్కేది. ఉయ్యాల బల్ల ఎక్కి ఊగేది. రైలు మంచాలు కూడా ఎక్కేసేది. బల్లలెక్కి దూకేది. ధాన్యం బస్తాల మీదకెక్కి జారేది.

అలా పోతున్నప్పుడు కొండలెక్కిన ఫీలింగ్ వచ్చేసేది. వేప చెట్టు చుట్టూ గిరగిరా తిరిగేది. కొష్టంలో కట్టేసిన ఆవుల మధ్యలోంచి రయ్యిరయ్యిన పోయేది.

బొగ్గుల కుంపటి – దోసకాయ పచ్చడి:

అలా రైలాట జోరుమీద ఉన్నప్పుడు, అప్పుడు ముక్కుకు సోకింది నాకు ఇష్టమైన వాసన. అది బొగ్గుల కుంపటి మీద దోసకాయ కాలుస్తుంటే వచ్చే వాసనన్నమాట. నాకు చాలా ఇష్టం. దోసకాయలు మా పొలంలోనే పండేవి. అప్పుడప్పుడు పొలం వెళ్ళినప్పుడు చూసేవాడ్ని బోలెడు దోసకాయల్ని. పొలం గట్టున కూర్చుని ఒకటి రెండు దోసకాయలు తినేసి, పక్కనే ఉన్న కాలవలోని నీళ్లు తాగిన రోజులు నాకు ఇప్పటికీ బాగానే గుర్తున్నాయి.

దోసకాయ ఎండాకాలం ఎక్కువగా దొరకవు. అలాంటప్పుడు దోసకాయ మీద మమకారం మరీ పెరిగిపోతుండేది. ఎంత ఎండాకాలమైనా దోసకాయలు పెరట్లో ఒక్కోసారి బాగానే కాసేవి. అప్పుడు పండుగే పండుగ. దోసకాయతో పచ్చడి చేసినా, పప్పు చేసినా, కూర చేసినా ఆవకాయ పెట్టినా నేను ఇష్టంగా తినేవాడ్ని. దోస వొరుగుల సంగతి స్పెషల్‌గా చెప్పాల్సిందే. ఇప్పుడు కాదులెండి. తర్వాత గుర్తుపెట్టుకుని చెబుతాను.

వంటింటి విప్లవం:

సరే, దోసకాయలు ఎర్రగా మండుతున్న బొగ్గుల సెగకి కాలుతూ రంగు మారుతుండేది. అంతలో దోసకాయ పైపొర చిట్లి లోపల ఉన్న నీరు పైకి ఉబికి వచ్చేది. దోసకాయంతా బాగా కాలడానికి మధ్యమధ్యలో కాయను అటూ ఇటూ తిప్పేవాళ్లు. ఇప్పట్లోలాగా పట్టకార్లు వంటివి లేవు. చేతికి నీళ్లు రాసుకుని మండే కుంపట్లోకి చెయ్యి దఢాలన్న పోనిచ్చి కాయని తిప్పేవారు. ఇదో ఆర్ట్ అనుకునేవాడ్ని. ఒక్క దోసకాయల్నేకాదు, మండే పొయ్యి మీద నుంచి సలసలా ఉడుకుతున్న గిన్నెలన్ని కూడా చాలా నేర్పుగా క్రిందకు దింపేవారు. ఆ రోజుల్లో (60వ దశకంలో అన్న మాట) వంట అంటే కట్టెల కుంపటో, బొగ్గుల కుంపటో ఉండాల్సిందే. ఇప్పట్లా గ్యాస్ పొయ్యిలు కనబడేవికావు.

వంటింటి పనులతో సతమతమయ్యే ఆడవారికి గ్యాస్ రాక చాలా ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదో విప్లవాత్మక మార్పు. కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యిమీద రోజూ వంటచేసే ఆడవాళ్ల మనసులు కుతకుతలాడిపోయేవి. కానీ ఏమీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రత్యామ్నాయం లేని రోజులు. అలాంటప్పుడు వంట గ్యాస్ వచ్చి వేడెక్కిన వారి మనసులపై పన్నీరు జల్లింది. గ్యాస్ గట్టు రావడం, నిలబడి హాయిగా వంట చేయగలిగే రోజు వస్తుందని 60వ దశకంలోని ఆడవారు కలలో కూడా ఊహించి ఉండరు.

మండువా ఇల్లు:

మాది ఒకప్పుడు పెద్ద మండువా ఇల్లేనట. కాకపోతే ఆర్థిక అవసరాల నిమిత్తం సగం అమ్మేశారని మా బామ్మ చెబుతుండేది. నాకు ఊహతెలిసే సరికే సగం చీలిన మండువా ఇల్లే ఉండేది. మండువా ఇల్లు పూర్తిగా నేను చూసింది సినిమాల్లోనే. ఇప్పటికీ అక్కడక్కడా మండువా ఇల్లు ఉన్నాయని చెబుతుంటారు. కానీ చూసే అవకాశం రాలేదు. మండువా ఇల్లు నూటికి నూరుశాతం వాస్తు పరంగా నిర్మిస్తారట. గాలీ వెలుతురు, నీటి ప్రవాహం, వాన నీరు నిలవచేసే విధానం ఇలా అన్నింటా పర్ఫెక్ట్ ఇల్లంటే అదేనని చెప్పేవారు. అలాంటి ఇంటిని నిలువునా చీల్చి సగభాగం అమ్మేయడం వల్ల చాలా కష్టాలు వస్తాయని వాస్తు పండితులు చెప్పడం నేనూ ఆ తర్వాత విన్నాను.

మండువా ఇల్లు సగభాగమే మాకప్పుడు ఉన్నప్పటికీ అదే విశాలంగానే కనిపించేది.

భోషాణం ఇంటికో భూషణం:

అడవిరావులపాడులో అయితే ఈ పెంకుటింట్లోనే రెండు భోషాణాలు ఉండేవి. సైజుని బట్టి ఒకటి పెద్ద భోషాణం, రెండవది చిన్న భోషాణం. అసలు నా పేరు (నాగభూషణ రావు)లో ‘భూషణ’ అన్న పదం ఈ భోషాణాలను చూసే పెట్టి ఉంటారని గట్టిగా నమ్మేవాడ్ని. అలా కాదనీ, చిన్న తాతగారి పేరు పెట్టారని ఆ తర్వాత తెలిసింది. ఈ భోషాణాలు ఉన్న ఇల్లు హై క్లాస్ ఇల్లు కింద లెక్క. ఎంతో విలువైన పత్రాలు, నగలు, నగదు వంటివి కూడా ఈ భోషాణంలో భద్రపరచుకుని రాత్రి పూట ఇంటి పెద్ద ఆ భోషాణానికి కాపలా అన్నట్లు దానిమీదనే పరుపు వేసుకుని పడుకునేవారు.

ఏమిటో చిన్ననాటి జ్ఞాపకాలు కదిలిస్తే అవి ఎటుపోతుంటాయో వాటికే తెలియదు. ఇక నేను ఎలా అదుపు చేయగలను చెప్పండి.

సరే, ప్రస్తుతానికి కుంపటి పొయ్యి మీద కాలుతున్న దోసకాయ గురించీ, ఆ వాసన గురించి చెప్పుకుంటున్నాము కనుక, అతి కష్టం మీద అక్కడికే వస్తాను. పదండి. పొలంలో పండిన దోసకాయలు తెచ్చి బొగ్గుల కుంపటిమీద కాల్చి క్రిందకు దింపి సుతారంగా నలిపి ఆపైన కాస్తంత ఉప్పు, కారం కలిపితేచాలు దోసకాయ పచ్చడి రెడీ. ఈ టేస్ట్ మాత్రం గ్యాస్ పొయ్యిమీద దోసకాయ కాల్చినప్పుడు రాదని నా గట్టి నమ్మకం.

బామ్మకు కోపం వచ్చింది:

దోసకాయ కాలుతున్న వాసన ముక్కికి తగలగానే రైలాటలో ఇంజన్ గాడినైన నేను రూట్ మార్చి వంటింట్లోకి రైలుని తీసుకొచ్చేశాను. మా బామ్మ దోసకాయలు కాలుస్తూ ఇటు మా రైలువైపు చూసింది.

కోపం వచ్చి కసురుకునేది. ‘పోండర్రా పిల్లలూ, వంటింట్లో ఆటలేంటిరా, అంత దొడ్డి ఉందిగా అటు పోయి ఆడుకోండి..’ అంటూ కసురుకుంది. అంతే మా రైలు హర్ట్ అయింది. ఇంజన్ గాడికి కోపం వచ్చింది. కోపం అనడం కంటే ‘ఖోపం’ వచ్చిందనడం సరైనది. ముఖం ఎర్రబారింది. ముక్కు పుటాలు అదిరాయి. నాకు ఎప్పుడు గట్టిగా ఖోపం వచ్చినా వీడిది బక్క కోపం. కాస్త బలంపడితే అదే తగ్గుతుందని మా అమ్మ అనడం నాకు గుర్తే.

బలం పట్టడమేమోగానీ, అనుభవాలు నేర్పిన పాఠాలే మనిషిని మారుస్తుంటుందని ఆ తర్వాత కాలం నేను యువకునిగా మారినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆ సంగతల్లోకి వెళదాం, పదండి.

గొంతు ఎర్రబడింది:

ఇప్పటి వరకు చెప్పిన రైలాట, బామ్మకు కోపం రావడం, నేను అలగడం వంటి సంఘటనలు జరిగిన చాలా కాలానికి, అంటే నేను యువకుడిగా అవతారం ఎత్తిన కొన్నాళ్ళకి ‘గొంతు ఎర్రబడింది’ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక మనిషిలో ఆవేశాలు, కోపతాపాలు ఎందుకు వస్తాయో, మరెందుకు చప్పబడిపోతుంటాయో తెలియజెప్పే ప్రయత్నమే ఇది.

‘నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగిరిపోతే,

నిబిడాశ్చర్యంతో వీరు –

నెత్తురు కక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే’ – శ్రీశ్రీ

యువకుని గొంతు ఎఱ్ఱబడింది. ఆవేశం పాలు ఎక్కువైంది. అప్పటి వరకు పట్టించుకోని సాహిత్యం, పాటలు మనసుని కలవర పరిచేవి. ఏదో తెలియని నూతన ఆవేశం మత్తులా కమ్మేసేది.

‘నేను సైతం

ప్రపంచాగ్నికి సమిధనొక్కటి

ఆహుతిచ్చాను’ – అని శ్రీశ్రీ రాసిన వాక్యాలైతే ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సమాజంలో మనకున్న బాధ్యతను ఈ వాక్యాలు గుర్తుచేస్తూనే ఉంటాయని నాకనిపించేది. అలా అని జీవితంలో నేను విప్లవ సాహిత్యం వైపునే పూర్తిగా ఒరిగిపోలేదు. నవ్య సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర మరిచిపోకూడదన్న స్పృహ మాత్రం శ్రీశ్రీ సాహిత్యంతోనే మొగ్గతొడిగిందని చెప్పగలను.

కుళ్లు సమాజాన్ని కడిగేయాలనీ, ఉతికేయాలని ఆ రోజుల్లో అనిపించేది. మూఢాచారాల పేరిట పేరుకుపోతున్న మురికిని కడిగేయాలనిపించేది. ఎటు చూసినా ఎన్నో సమస్యలు, లంచాలు, నిరుద్యోగం, అవినీతి అక్రమాలు ఇలా ఎన్నో సమస్యలు. ఎవ్వరినీ సుఖంగా ఉండనీయని పరిస్థితి. అందుబాటులో ఉన్న అభ్యదయ సాహిత్యం, ఆపైన సినిమాల్లో స్ఫూర్తినిచ్చే పాటలు, సన్నివేశాలు. వెరసి నేను కూడా కుర్రాడిగా ఉన్నప్పుడు శ్రీశ్రీ సాహిత్యం పట్ల కొంతలో కొంత ఆకర్షితుడనయ్యాను. అంత మాత్రాన కేవలం శ్రీశ్రీ రచనలే ప్రేరణ కలిగించయనడం సరికాదులేండి. వేమన శతక సాహిత్యం చదివే వాడిని. అభ్యుదయ భావాలున్న రచనలు ఎవరు రాసినా అవి నా మనసుకు హద్దుకునేవి. ఇంటర్మీడియేట్ నుంచి నేను ఎంచుకున్నది సైన్స్ సబ్జెక్ట్. అయినప్పటికీ డిగ్రీ నుంచీ మరీ ముఖ్యంగా పిజీ అప్పటి నుంచీ జ్ఞానం అనంతమైనదన్న భావన బలపడసాగింది. ఈ క్రమంలో భాగంగానే తెలుగు పద్యాలు, పాటలు, కథలు, నవల పట్ల ఆకర్షితుడనయ్యేవాడిని.

ఆలోచనలు రేకెత్తించే ఏ రచన అయినా చదవడానికి ఇష్టపడేవాడ్ని. ఈ లక్షణం ఆవేశాన్ని పెంచేది. ఏ రచన అయినా సరే, ఆలోచనా శక్తిని పెంచితే ఫర్వాలేదు, కానీ ఈ ఆవేశం మత్తుగా మారకూడదని ఆ తర్వాత కాలంలో బాగానే అర్థమైంది. ఇతరుల రచనల వల్ల మనలో మార్పు రావడం ఒక ఎత్తైతే, మనం సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే తత్వం అలవరచుకోవడం మరో ఎత్తు అనుకునేవాడ్ని. సమాజంలో పేరుకుపోతున్న మూఢనమ్మకాలు, అసమానతలను ఎండగట్టిన రచనలు, కవితలు, పద్యాలంటే ఇష్టపడేవాడ్ని. జెండా పట్టుకుని విప్లవం బాట తొక్కకపోయినా విప్లవ సాహిత్యంలోని ఆవేశం కంటే సామాజిక చైతన్య స్పృహ నాకు నచ్చేది.

చివరకు ఈ ఇష్టం ఎక్కడిదాకా వెళ్ళిదంటే వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసేటప్పుడు ఆయా రచనల్లోని కొన్ని వాక్యాలను సందర్భోచితంగా కోట్ చేసేటంతటి దాకా. ఈ క్రమంలోనే అన్నమాచార్య కీర్తనల్లోని సామాజిక స్ఫూర్తి కూడా నచ్చేది.

“నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటు నిద్ర – అదియు నొకటే|

మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే

చండాలుడుండేటి సరిభూమి యొకటే”

అలాగే, ఘంటసాల భగవద్గీత తరచూ వినడం వల్ల భగవద్గీత చదవాలనిపించేది. ఇంట్లోని భగవద్గీత పుస్తకం తీసుకుని వాటిలో కొన్ని శ్లోకాలు, వాటి అర్థాలను పదేపదే చదివేవాడిని. జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం భగవద్గీతలో ఉన్నదన్న భావన కలిగేది. మచ్చుకు కొన్ని శ్లోకాలు ప్రస్తావిస్తాను.

“విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః”

విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందునూ, శునకమూ, శునకమాంసము వండుకొని తినువానియందునూ పండితులు సమదృష్టి కలిగియుందురు.

నాలో ఆలోచనలు రేకెత్తించిన మరో శ్లోకం..

“క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి”

“కోపం వలన అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం, దాని వలన బుద్ధీ చెడతాయి; ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు.”

క్రోథము వల్ల మనిషి అధోగతికి ఎలా పడిపోతాడో చాటి చెప్పిన శ్లోకం నా దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చదువుకోలేమో. ఈ శ్లోక ప్రభావమే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ‘ఒక్క క్షణం’ అన్న రూపకం రాయడానికి దారితీసింది.

ఆస్తికత్వం, నాస్తికత్వం ఈ రెంటిలో ఏ మార్గాన జీవనయానం సాగించినా మనమంతా మరిచిపోకూడని కోణం ఒకటుంది. అదే ‘మానవత్వం’. ఈ రకమైన ఆలోచనలుండటం వల్లనే ఎవ్వరూ నన్ను కేవలం ఒక గాటికి కట్టేయడానికి వీలుపడేది కాదు.

స్నేహితులు, బంధువులతో చర్చలు జరిగినప్పుడు కొందరికి నేను దేవుడిని నమ్మేవాడిగానూ మరికొందరికి దేవుడు లేడనే వాడిగానూ, ఇంకొందరికి విప్లవ భావాలున్నవాడేమో అని అనుకునేలా చేసింది. ఈ తరహా పరిపక్వతే ముందు ముందు విభిన్న రచనలు చేయడానికి సాయపడిందేమో అని ఇప్పుడు నాకనిపిస్తున్నది. అంతే కాదు, నిజమైన జర్నలిస్ట్గా ఎదగడానికి కారణం అయిఉంటుంది. నిజమైన జర్నలిస్ట్ అన్న పదం వాడటాన్ని ఎవ్వరూ తప్పు పట్టరనే అనుకుంటున్నాను. ఈ లక్షణం వల్లనే విశాల దృష్టి అలవడింది.

జ్ఞానం విచ్చుకుంటున్నకొద్దీ, అన్ని శాస్త్రాలు ఒకానొక చేట ఏక బిందువులో కలిసినట్లనిపించేది. ఇది ఎలాంటిదంటే అంతరక్షయానానికి బయలుదేరిన వ్యక్తికి ముందుగా ఈ భూమి పెద్దదిగా కనబడవచ్చు. అందులో సముద్రాలు, ఖండాలు, దేశాలు కూడా కనిపించవచ్చు. రాకెట్ లేదా అంతరిక్ష నౌక ఇంకా ముందుకు సాగుతున్న కొలదీ ఈ భూమి చిన్నదైపోతుంటుంది. ఇంకా వెళుతున్నకొలదీ మన సౌర కుటుంబమే చిన్నదిగా కనపడుతంది. చివరకు మన సౌరకుటుంబం ఏదంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. విశాల విశ్వంలో మనమెంత అన్న సత్యం అవగతమవుతుంది. దీన్ని మన చదువులకు అన్వయించుకుంటే.. మొదట్లో విభిన్నంగా కనిపించే జ్ఞాన నదులు చివరకు సముద్రంలో కలిసిపోతాయన్న భావన కలుగతుంది. అన్ని సబ్జెక్ట్ సారం ఒకటేనని తెలుస్తుంది. అంతే కాదు ఒక సబ్జెక్ట్ (ఉదాహరణకు సైన్స్) మరొక సబ్జెక్ట్ (ఉదాహరణకు ఎకొనమిక్స్) ప్రారంభ స్థాయిలో వేరువేరుగా కనిపించినా విహంగ వీక్షణ స్థాయికి వెళ్ళి చూసినప్పుడు కలిసిపోవడాన్ని గమనించవచ్చు. ఏడు రంగులు తిరిగి తెల్లటి కాంతిలో కలిసిపోవడాన్ని ఇక్కడ మనం గుర్తుచేసుకోవచ్చు.

మనిషి పుట్టినప్పుడు స్వచ్ఛంగానే తెల్లటి కిరణంలాగానే ఉంటాడు. కానీ తర్వాత కాంతి రేఖ తన పయనంలో సప్త వర్ణాలను ప్రదర్శించినట్లుగానే పుట్టిన శిశువు తన జీవన యానంలో ఏడు రంగులను ప్రదర్శిస్తూనే ఉంటాడు. వీటిలో ఎరుపు వర్ణం మనిషిలోని కోపానికి ప్రతీక అనుకుంటే ఆకుపచ్చ అభివృద్ధికి సంకేతంగా అనుకోవచ్చు. తెల్లటి కాంతిలో ఏడు వర్ణాలు ఉంటాయని చెప్పడానికి మా సైన్స్ మాష్టారు ఒకటి రెండు ప్రయోగాలు చేసి చూపించేవారు. అందులో పట్టకం (Prism) గుండా తెల్లటి కాంతి కిరణం పంపినప్పుడు కాంతి కిరణం ఏడు రంగులుగా విడిపోవడం చూసి ఆశ్చర్యపోయేవాళ్లం. అలాగే ఒక వృత్తాకార అట్టముక్క పై ఏడు రంగులను సమాన స్థాయిలో వేసి ఆ అట్టముక్కను వేగంగా తిప్పినప్పుడు అది తెల్లగా మారడం కూడా మాకప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ ఆశ్చర్యం ఆలోచనలను రేకెత్తించేది. పెరిగి పెద్దయ్యాక ఈ కాంతి కిరణంలోని ఏడు వర్ణాల సూత్రాన్ని జీవన సూత్రానికి ముడిపెట్టేదాకా ఆలోచనలు సాగాయి. ఏడు రంగుల సమ్మేళనమే తెల్లటి కాంతి కిరణం. ఈ సూత్రాన్ని ఆత్మ, పరమాత్మలకు ముడిపెట్టే విధంగా కూడా ఆలోచనలు సాగేవి. అయితే ఇవేవీ ఒక్క రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు. ఆలోచనల పరిణామ క్రమానికి చాలా కాలమే పట్టింది.

కాల చక్రం భ్రమణం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంటుంది. ఈ పాఠాలే నిత్య సత్యాలని తెలుసుకునేలోపు మానవ జీవిత కథ కంచికి చేరుతుంటుంది. ఈ యువకునిలోని ఆలోచనలు ఎలా పరిపక్వత చెందాయో, ఇంకా ఏం చెప్పబోతున్నాడో..

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here