తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-6

6
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

అడ్డతొక్కుడు:

[dropcap]చి[/dropcap]న్నప్పుడు సైకిల్ తొక్కడం ఓ పెద్ద సాహసం. సైకిల్ మీద వెళ్ళే వాళ్లంతా నా దృష్టిలో పెద్ద హీరోలు. సర్కస్‌లో కూడా ఇలాంటి హీరోలు కనబడేవారు. ఓ సారి జెమినీవారి సర్కస్‌కి వెళ్ళాను. సైకిల్ మీద ఎన్ని సాహసాలు చేసేవారో. సైకిల్ నడపడమే గొప్ప అని నేను అనుకుంటుంటే, ఒకే సైకిల్ మీద ఒకరిమీద మరొకరు ఎక్కుతూ సైకిల్‌తో విన్యాసాలు చేయడం చూసిన నేను బోలెడు ఆశ్చర్యపోయేవాడ్ని. ఎప్పటికైనా జీవితంలో సైకిల్ నేర్చుకోవాలని అలాంటప్పుడే శపథం లాంటిది చేశాను. ఇదే జీవితాశయం అన్నట్లు ఉండేది తపన. ఇలాంటి తపనే చాలా పెద్దయ్యాక కారు నేర్చుకోవాలనుకున్నప్పుడు కలిగింది. మధ్యలో ఎడ్లబండి కూడా కాసేపు నడిపానులేండి. సైకిల్ అడ్డతొక్కుడు అనే సాహస కార్యం గురించి ఇప్పుడు చెబుతాను.

చిన్నప్పుడు బక్క కోపం, ఆ పైన మొండితనం. కానీ, కొత్త విద్యలు నేర్చుకోవాలన్న తపన గట్టిగా ఉండేది. సైకిల్ నేర్చుకోవాలన్న కోరిక బలపడింది. ఓ రోజున మంగళగిరిలోని మెయిన్ రోడ్ గుడి గోపురానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళాను. కాస్త దూరం పోగానే, కుడి పక్కన సైకిళ్ళను అద్దెకు ఇచ్చే షాపు కనబడగానే అక్కడ ఆగాను. బ్లూకలర్ నిక్కరు, బొమ్మల హాఫ్ హ్యాండ్స్ షర్ట్‌తో పాటు నోట్లో వేలు కూడా వేసుకుని చాలా అమాయకంగా షాపు దగ్గర నిలుచుంటే, షాపులో పనిచేస్తున్న కుర్రాళ్లు నా వైపు అదోలా చూస్తున్నారు.

ఆ షాపు ముందు ఓ పది దాకా సైకిళ్లు బారుతీరి ఉన్నాయి. పక్కనే గాలి కొట్టే పంపు, పంచర్ పడితే చూడటానికి ఓ అల్యూమినియమ్ బకెట్‌లో నీళ్లు కూడా ఉన్నాయి. ఓ పన్నెండేళ్ల కుర్రాడు చకచకా పనిచేసుకుంటూ పోతున్నాడు. సైకిల్ ట్యూబ్ లోకి గాలి నింపి ట్యూబ్‌ని ఎంతో నేర్పుగా వంచుతూ, బక్కెట్ నీళ్లలో ముంచుతూ పంచర్ ఎక్కడ పడిందోనని చూస్తున్నాడు. అనుమానం వచ్చిన చోట చేతి వేలుని ట్యూబ్‌కి గట్టిగా ఆనిచ్చి చెక్ చేస్తున్నాడు. వాడి శ్రమ ఫలించింది. ట్యూబ్‌లో ఒక చోట నుంచి గాలి నీటి బుడగల్లా పైకి వస్తున్నాయి. ట్యూబ్‌ని బయటకు తీసి పంచర్ పడిన ప్రాంతాన్ని ఓ పెన్సిల్ మార్క్‌తో సున్నా చుట్టి మరో పనివాడికి ఇచ్చాడు. వాడేమో పంచర్ పడిన చోటని బాగా రుద్దీ నీటి తడి ఆరిపోయాక ఆ ప్రాంతంలో పసుపు రంగున్న ఒక ట్యూబ్‌లో నుంచి మందులాంటిది తీసి ట్యూబ్ పై పూసి పంచర్ పడిన చోట ఓ నల్లటి రబ్బరు ముక్కని అంటించాడు. ఆ తర్వాత కుర్ర పనివాడేమో ట్యూబ్‌ని నేర్పుగా సైకిల్ టైర్ లోకి దూర్చి గాలి కొట్టాడు.

నోట్లో వేలేసుకుని ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంతలో సైకిల్ మీద వచ్చిన వ్యక్తి ఒకడు అద్దె సైకిల్ అప్పగించాడు. షాపు వాడు టైమ్ చూసుకుని అద్దె డబ్బులు వసూలు చేశాడు. షాపు యజమాని డబ్బులు తీసుకోవడం, వాటిని గల్లాపెట్టెలో వేసుకోవడం చూస్తూ – ‘ఆహా, ఎప్పటికైనా నేనూ వీడంత వాడ్ని కావాలి. ఇలాగే బోలెడు సైకిళ్లు కొనేసి అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదించాలి’ – అనుకున్నాను. అంతే కాదు సైకిల్‌కి పంచర్ వేయడం కూడా నేర్చుకోవాలి. మధ్యలో పంచర్ పడితే సైకిల్ తోసుకురావడం కష్టం కదా, అందుకే మనమే ఆ విద్య కూడా నేర్చుకుంటే పోలా అని అనుకునేవాడ్ని. ఇది ఆ తర్వాత నిజమే అయింది. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు లేదా ఇంటర్ చదవుతున్నప్పుడు నందిగామ – అడవి రావుల పాడు మధ్య గతుకుల మట్టి రోడ్డుపై సైకిల్ మీద తిరిగేవాళ్లం. సైకిల్‌కి ఈ పంచర్ కిట్ పెట్టుకునే వాళ్లం. ఏ ముల్లో గుచ్చుకుని టైర్‌కి గాలి పోతే మనమే నేర్పుగా పంచర్ వేసుకునే స్థాయికి ఎదిగామన్నమాట. చాలా గొప్పగా ఫీలయ్యేవాడ్ని. మనకు అవసరమైన పని సులువుగా జరిగేలా చూసుకునే లక్షణం అలా అలవడిందన్నమాట.

సరే, అద్దె సైకిల్ షాప్ దగ్గర నుంచి చాలా దూరం వచ్చినట్లున్నాము. మళ్ళీ అక్కడికే వెళదాం పదండి..

“ఏయ్, అబ్బాయి, నీకేం కావాలి” – అడిగాడు షాప్ వాడు. నోట్లో వేలు తీసి – సైకిల్ కావాలి – అనేసి మళ్ళీ నోట్లో వేలు వేసుకున్నాను. ఏది కావాలో తీసుకో అన్నాడు. అక్కడున్నవన్నీ పెద్ద ఎత్తుగా గుఱ్ఱాల్లా ఉన్నాయి. సైకిళ్లు తయారు చేసేవారిపై నాకు బోలెడు కోపం వచ్చేసింది. పిల్లల అవసరాలు వీళ్లు పట్టించుకోరా, హాయ్.. అంటూ విసుక్కున్నాను. ఎత్తైన సైకిల్ ఎలా ఎక్కాలో వాటిని ఎక్కి సైకిల్ తొక్కడం ఎలాగో అర్థంకాలేదు. అయితే సైకిల్ సీటుపైకి ఎక్కకుండానే అడ్డ తొక్కుడుతో సైకిల్ రయ్యిన పోనీయవచ్చని స్నేహితులు అప్పటికే చెప్పి ఉండటంతో ధైర్యం చేసి ఒక సైకిల్ తీసుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను.

తర్వాత తెలిసిన విషయం ఏమంటే, పిల్లల కోసం పొట్టి సైకిళ్లు అమ్ముతున్నారని. పెద్ద సిటీ నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ అయితే “ఆడపిల్లల – అంటే లంగాలు వేసుకునే అమ్మాయిలు ఈజీగా సైకిల్ నడపడానికి ప్రత్యేక సైకిళ్లు (ముందున్న రాడ్ వొంపుగా ఉండే సైకిళ్లు) సిటీల్లో అమ్ముతున్నారు తెలుసా” అని చెప్పాడు. మళ్ళీ బోలెడు ఆశ్చర్యం. మా ఇంట్లో అప్పట్లో సైకిల్ లేదు. పెద్దలంతా నడిచే వెళ్ళేవారు. అలాంటప్పుడు నాకోసం చిన్న సైకిల్ కొనమని చెబితే ఇంకేమైనా ఉందా.. అందుకే ఇలాంటి కోరికని మనసులోనే కట్టేశాను.

ఈ సంఘటనలన్నీ దాదాపు 1960ల్లో మంగళగిరిలో జరిగినవి. అప్పట్లో మంగళగిరి చాలా చిన్న ఊరే. మెయిన్ రోడ్డు మీద కూడా సైకిళ్లు, రిక్షాలు తప్పా మోటారు వాహనాలు తిరగడం చాలా అరుదు. మంగళగిరిలో గూడు రిక్షాలు ఎక్కువగా తిరిగేవి. సీటు రిక్షాలు ఆ తర్వాత కాలంలో గుంటూరులో చూశాను. మెయిన్ రోడ్డుకి ఒక వైపున పానకాల స్వామి కొండ ఉంటుంది. స్వామి గుడికి వెళ్ళడానికి మెట్లదారి ఉంటుంది. ఈ రోడ్ల మీదనే సైకిల్ టైర్‌ని దొర్లించుకుంటూ రయ్యిన వెళ్లే ఆట కూడా ఆడేవాడ్ని. అంతేకాదు, సైకిల్ రిమ్‌ని తోసుకుంటూ పోయే ఆటన్నమాట. రిమ్ గాడిలో ఓ కర్ర ముక్క ఆనించి రిమ్‌ని బలంగా తోసి ఆ పైన ఈ కర్ర సాయంతో దాని వేగం పెంచాలి. అయితే రిమ్ అంచు సరిగా లేకపోతే కర్ర ముక్క చక్రంలో ఇరుక్కుని ప్రమాదాలు జరుగుతుండేవి. అయినా ఇలాంటి ఆటలు ఆగవు. ఇవన్నీ నేర్చేసుకున్నానన్న ధీమాతోనే అడ్డతొక్కుడు దగ్గరకు వచ్చామన్న మాట.

పానకం తాగే స్వామి:

పానకాల స్వామి గుడికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. స్వామి వారి విగ్రహం నోరు తిరుచుకుని ఉంటుంది. ఆ నోట్లోకి పానకం పోస్తుంటారు. చిత్రమేమంటే ఎంత పానకం లోపలకు పోస్తే స్వామి వారు దాంట్లో సగం తాను త్రాగి మిగతాది భక్తుల కోసం అన్నట్లు బయటకు కక్కుతారని చెప్పేవారు. అలా కక్కుతున్నప్పుడు ‘గుళక్.. గుళక్’ అంటూ శబ్దం వస్తుందని పూజారులు చెప్పేవారు. నా చిన్నప్పుడు అలాంటి శబ్దం విన్నట్లు గుర్తు. అంత మహిమగల స్వామి. మరో చిత్రం చెప్పనా, రోజూ స్వామి వారి సన్నిధిలో పానంకం తయారుచేస్తూ స్వామికి సమర్పిస్తున్నా అక్కడ నేలపై ఒక్క చీమ కూడా కనబడకపోవడం నిజంగా ఆశ్చర్యమే.

ఏనుగు ఆకారంలో కొండ:

ఇంకో చిత్రం చెప్పేస్తున్నా, శ్రద్ధగా వినుకోండి. పానకాల స్వామి గుడికి పైన కొండ శిఖరంమీద గండాల స్వామి గుడి ఉంది. ఈ కొండ పడుకున్న ఏనుగు ఆకారంలో ఉండటం విశేషం. ఇది అగ్నిపర్వతమనీ, శాంతిపజేయడానికే పానకం పోస్తుంటారని అంటారు. గండాల స్వామి గుడికి వెళ్ళాలంటే మెట్ల దారి లేదు. పశువులు, గొర్రెల కాపర్ల నడక దారి లాంటిదొకటి ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే అక్కడకు వెళుతుంటారు. మేము ఓ నలుగురు పిల్లలం ఓ రోజు గండాల స్వామి గుడికి వెళ్ళాల్సిందేనని ప్లాన్ చేశాము. పెద్దోళ్లకు చెప్పకుండా పానకాల స్వామి గుడిదాకా మెట్లదారిన వెళ్ళి అక్కడి నుంచి భయం భయంగా కొండ ఎక్కి గండాల స్వామి గుడికి చేరాము. అక్కడ ఓ దీపం వెలుగుతూ కనిపించింది. ఈ దీపం దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని గండాలు వచ్చినా అవన్నీ ఇట్టే తొలిగిపోతాయట. చాలా చిన్నప్పుడే నేను చేసిన అతి పెద్ద సాహసం ఇది. కొండ శిఖరాన ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో నాకు తెలియదు. తెలిసిన వారు చెబితే సంతోషిస్తాను.

జీవితంలో అనేక గండాలను దాటుకుంటూ ఈ రోజున ఆనాటి విశేషాలు మీతో పంచుకుంటున్నానంటే బహుశా ఆ స్వామి వారి దయేనేమో. పాత జ్ఞాపకాలు తలుచుకుంటున్నప్పుడు మనసు అటూ ఇటూ పరిగెడుతుంటుంది. ఏమీ అనుకోకండేం.

సరే, మళ్ళీ అడ్డతొక్కుడు దగ్గరకు వస్తాను. మంగళగిరి మెయిన్ రోడ్డులో కొండవైపున పెద్ద రథం వెనుక బారుగా ఉండే పెంకుటిళ్లలోని ఒక ఇంట్లో ఉండేవారం. అద్దెకు తీసుకున్న సైకిల్‌ని నెమ్మదిగా తోసుకుంటూ ఇంటికి దగ్గరకు తెచ్చాను. విషయం తెలిసి పెద్దోళ్లు కసురుకుని, ఇంత పెద్ద సైకిల్ తొక్కితే కాళ్ళు విరుగుతాయంటూ భయపెట్టేసి, ఆ సైకిల్‌ని రయ్యిన తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చేసి వచ్చారు. మనం హర్టయ్యాం. అవమా ఏంటి?

సైకిల్ నేర్చుకోవడంలోని మొదటి ప్రయత్నం అలా బెడిసికొట్టింది. అయినా ఆశ చావలేదు. తోటి పిల్లలు సైకిల్‌ని అడ్డతొక్కుడుతో నేర్చేసుకుంటున్నారు. మనం నేర్చుకోకపోతే ఎలా..? అందుకే ఒక వ్యూహం పన్నాను. పెద్దోళ్ళకి చెబితేనే కదా సమస్యలన్నీ, అసలు చెప్పకుండా నేర్చుకుంటే పోలా.

ఈ ఆలోచన కార్యరూపం దాల్చింది. వేరే షాప్‌కి వెళ్ళి అద్దె సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళకుండానే సందుల్లో నేర్చుకోవడం మొదలెట్టాను. అసలే, అడ్డతొక్కుడు. బాలెన్స్ కుదరడం లేదు. రోడ్డు వాలుగా ఉండటంతోనూ, గతుకులు ఎక్కువ కావడంతోనూ బొక్కబోర్లా పడ్డాను. అంతే..

కొద్ది రోజులు మోకాలికి కట్టు. గాయం తగ్గడానికి చాలా రోజులే పట్టింది. అయినా అడ్డతొక్కుడుతో సైకిల్ మీద రయ్యిన పోతున్నట్లు కలలు వస్తుండేవి.

సైకిల్ తొక్కడమన్న కల చివరకు నెరవేరింది. ఒకానొక శుభముహూర్తాన బాలెన్స్ కుదిరింది. అడ్డతొక్కుడుతో సైకిల్ నడపడం వచ్చేసింది. అయినా అడపాదడపా క్రింద పడటం మామూలే. ఇంట్లో వాళ్ళ అరుపులు మామూలే. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకనిపిస్తున్నది, ఏ పని అయినా మొదట్లో కష్టంగానే ఉంటుంది. కానీ పట్టుదలతో ముందుకు సాగితే అదే పని సులువుగా మారుతుంది.

రెండు జీవన సూత్రాలు :

శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఒక చక్కటి సందేశాత్మక పాట ఉంది.

‘మత్తు వదలరా
నిద్దుర మత్తు వదలరా.’

ఈ పాటలో ఒక చోట..

‘కర్తవ్యం నీ వంతు
కాపాడుట నా వంతు.
చెప్పడమే నా ధర్మం
వినకబోతే నీ కర్మం.’

మన పని మనం చేసుకుంటూ పోవాలి. దాని ఫలితం ఆ భగవంతుడే అందజేస్తాడు. అంతే కాదు, ఆ పనిలో ఎదురయ్యే కష్టాల నుంచి పరమాత్మే బయటపడేస్తాడన్నఅనంత అర్థాన్ని ఈ రెండు లైన్లలో నిక్షిప్తం చేశారు సి. నారాయణ రెడ్డి గారు.

శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి చేసిన గీతోపదేశంలో కూడా ఇదే సూత్రం కనబడుతుంది.

‘కర్మలయందే నీకు అధికారం కలదు.
లేదు కర్మ ఫలమునందు.
అట్లని కర్మలు చేయడం మానరాదు’
– అని భగవద్గీత చెబుతున్న జీవన సూత్రం.

నాకు ప్రేరణగా నిలిచిన రెండు సూత్రాల్లో ఒకటి: పని – వేగం – ఫలితం

రెండవ సూత్రం: పని- విజయం ఆనందం

ఏ పని చేపట్టినా ఆ పనిని వేగంగా చేయగలగాలి. చక్కటి ఫలితం రాబట్టగలగాలి. అలాగే, ప్రతి పనిలోనూ పూర్తి విజయం దక్కకపోవచ్చు. కొన్ని సార్లు అపజయం ఎదురుకావచ్చు. అలాగని పనులు మానేసి మూలన కూర్చుకోడదు కదా. ఇక పని వల్ల వచ్చే విజయం మనకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉత్సాహం మన ఆరోగ్యంపైన కూడా ప్రభావితం చూపిస్తుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. అలా అని నిరంతరం కష్టాల కడలిలాగానూ ఉండదు. ఎప్పటికప్పుడు ఆనందాలను వెతుక్కుంటూ ముందుకు సాగడమ మనం చేయగలిగినది. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం చేయాలి, పెళ్ళి చేసుకోవాలి. దాదాపుగా అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అనుకున్నవన్నీ జరగడానికి కొందరికి నల్లేరు మీద నడక కావచ్చు. (నల్లేరు – చూ. 8) మరి కొంత మందికి గతుకుల బాటలో పయనం.

నిరుద్యోగ పర్వం:

ఓ నలభై ఏభయ్యేళ్ల క్రిందట ఆడపిల్ల ఎదిగితే పెళ్ళి చేసి పంపితే చాలు అనుకునేవారు. అలాగే మొగపిల్లాడు ఎదిగితే వాడి కాళ్ల మీద వాడు నిలబడితే చాలని సాధారణ, మధ్యతరగతి ఇళ్లలో ఆ రోజుల్లో వినబడే మాట. ఇప్పటి చదువులకీ ఆనాటి చదువులకు ఎంత తేడా ఉన్నదో అంతే తేడా ఉద్యోగ అవకాశాల్లోనూ ఉంది. చదువు పూర్తికాగానే ఉద్యోగం రావడం అంటే పెళ్లీడుకొచ్చిన పిల్లకు వెంటనే వరుడు వెతుక్కుంటూ వచ్చి ఎగరేసుకువెళ్లడం లాంటిదని అనే వారు. అందరికీ ఆ పరిస్థితి ఉంటుందా.. ఉండదనుకోండి.

నేను డిగ్రీ చదివింది తెలుగు మీడియంలోనే. అది కూడా సైన్స్ సబ్జెక్ట్. 1975 ప్రాంతంలో తెలుగులో సైన్స్ సబ్జెక్ట్ రిఫరెన్స్ బుక్స్ చాలా తక్కువగా ఉండేవి. మరీ ముఖ్యంగా బిట్ పేపర్‌కి సంబంధించిన సమాచారం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా అరుదు. దీంతో బిట్స్ కూడా టెక్స్ట్ బుక్ తిరగేస్తూ మనమే కుస్తీ పట్టి తయారు చేసుకోవాల్సి వచ్చేది.

అసలు తెలుగు మీడియంలో బీఎస్సీ చదివి పొరపాటు చేశానేమో అని ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడే అనుకునేవాడ్ని. తెలుగు మీడియం సరే, అందునా అటు పల్లె ఇటు పట్టణం గాని ఊర్లోని కాలేజీలో అదీ కూడా అప్పుడే బీఎస్సీ కోర్స్ ప్రవేశపెట్టినప్పుడే ఫస్ట్ బ్యాచ్‌లో చేరడం అదనపు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కానీ ఏం చేస్తాం. ఇంట్లో పరిస్థితులు, ఖర్చులు, ఇతర భయాలు గడప దాటనీయకుండా చేశాయి. ఇలాంటి కుటుంబాలు మా ఊర్లో చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితిని నాతోటి వాళ్లు చాలామందే ఎదుర్కున్నారు. నా విషయంలో అదే జరిగింది. నందిగామ కేవీఆర్ కాలేజీలో బీఎస్సీ పెట్టిన ఏడాదే ఆ ఊర్లోనే పెద్దలకు ఊరట కలిగింది. సైన్స్ డిగ్రీ మన పిల్లలు ఇక్కడే ఉండి పూర్తి చేయవచ్చన్న ఆనందం అది. నాతో బాటుగా మా ఊరి వాళ్లు, చుట్టు పక్కల ఊర్ల వాళ్లు చాలామందే సైన్స్‌లో డిగ్రీ కోర్సులో చేరారు. అలా సొంత ఊర్లోనే బీఎస్సీ చేయడం మాకూ ఆనందంగానే ఉండేది. ఇంటి భోజనం, నడక దూరంలోనే కాలేజీ. హుషారుగా జోరుజోరుగా సాగిపోయింది చదువు. బాగా చదువుకుంటున్న ఏడెనిమిది పిల్లల్లో నేనూ ఒకనిగా గుర్తింపు పొందాను. బావిలోని కప్పలకు బయట ప్రపంచం తెలియదు కదా. అలాగే పోటీ ప్రపంచం ఎలా ఉంటుందో అప్పట్లో నాకు తెలియలేదు.. చూడలేదు.

నందిగామలో కాలేజీ రావడంతోనే ఆ ఊర్లో చదువుకున్న వారి శాతం ఏటికేడు బాగా పెరిగింది. చుట్టు పక్కల పల్లెల నుంచి కూడా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కాలేజీలో చేరేవారు. ఇదో విప్లవం. ఈ కారణంగా నందిగామ వాతావరణం మారిపోయింది. ఊర్లోని వ్యాపారస్థులు కూడా అప్పటి వరకు తమ పిల్లలను కేవలం వ్యాపారానికే పరిమితం చేసిన వారు కూడా తమ పిల్లలకు డిగ్రీ వరకు చదువు చెప్పించడానికి మొగ్గు చూపారు. క్రమక్రమంగా విద్యావంతులు ఎక్కువ మంది ఉన్న ఊరిగా నందిగామ పేరు తెచ్చుకుంది.

డిగ్రీ చదువు అయ్యాక ఎమ్మెస్సీ – ఇది ఇంగ్లీషు మీడియంలో అందునా బొంబాయి వంటి చోట్ల చదవాల్సి వచ్చినప్పుడు తెలిసింది, ఇంగ్లీష్ భాషను గట్టిగా వంటబట్టించుకుని ఉంటే, ఎమ్మెస్సీ చదువు ఎంతో ఈజీగా సాగి ఉండేది కదా అని. టెన్త్ వరకు హిందీ కూడా ఉండేది కదా, పోనీ హిందీ అన్నా బుఱ్ఱకెక్కిందా అంటే అదీ లేదు. హీందీ అంటే ఎగతాళి. హై, హూ అంతేగా అని జోక్ లేసుకునేవాళ్లం. బొంబాయి చేరాక హిందీ, మరాఠీ భాష మాట్లాడేవారి మధ్య నా పరిస్థితి అరకత్తెరలో పోక చెక్కే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, జీవితం మనం చెప్పినట్లో మనం ఆశించినట్లో సాగదు. దాని ప్రయాణ మ్యాప్‌ని భగవంతుడు ఎప్పుడో నిర్దేశించాడు. మనం పడుతున్న కష్టాలే రేపటి సుఖ జీవనానికీ సోపానాలు అవుతాయని మనకు తెలియకపోవచ్చు. కష్టాల్లోనే సుఖాలు వెతుక్కునే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని బొంబాయిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను. మరో విషయం కూడా అర్థమైంది. పెద్దపెద్ద టార్గెట్స్ పెట్టుకుని ప్రయాణం సాగిస్తే కనీసం చిన్నచిన్న విజయాలైనా మనం అందుకోగలుగుతాము. అదేదో సినిమాలో వెంకేటష్ అన్నట్లు, ‘ఐఏఎస్, ఐపీఎస్..’ అంటూ వెంకటేష్ చెబుతుంటే, ప్రకాష్ రాజు సీరియస్‌గా చూడటంతో అతగాడేమో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఫీలవడం.. ఇదంతా, పైకి కామెడీ సీన్‌లా అనిపించినా, అందులో సత్యం దాగుంది. జీవితాన్ని ఎంజాయ్ చేసే తత్వం స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి కుర్రాళ్లు చాలా మందే కనబడేవారు. లక్ష్యం పెద్దదిగా పెట్టుకో, నీ శక్తి మేరకు కృషి చేయి, ఆ పెద్ద లక్ష్యం నెరవేరకపోయినా ఆ కృషి కారణంగా చిన్నచిన్న విజయాలు, ఆనందాలు నీ సొంతం కావచ్చు. ఈ సూత్రం నిరుద్యోగ పర్వంలోనే కాదు, జీవన యానంలో చివరి వరకు మనకు అక్కరకు వచ్చేదే.

నేనూ వెంకటేష్ లాంటి వాడినే. భారీ లక్ష్యాలు పెట్టుకున్నాను. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. 67 ఏళ్ల వయసులో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలకు సంకల్పం చెప్పుకుని పని ప్రారంభించడం, ఆ లక్ష్యాలను చేరలేకపోయినా చిన్న విజయాలు దరి చేరడం. వాటితో ఆనందంగా ఉండటం ఓ అలవాటుగా మారింది. పని – విజయం – ఆనందం అన్న సూత్రం చివరకు మనిషిని సంతృప్తి దశకు తీసుకువెళుతుంది. అలాగే జీవన యానం సాఫల్య వంతం అయినదా, కాలేదా అన్నది కూడా మనకు కలిగిన ఆనందం స్థాయిని బట్టి ఉంటుంది. ఈ సమాజం నిన్ను గుర్తించకపోవచ్చు. నిన్ను హీరోగా భావించకపోవచ్చు. కానీ పని – విజయం – ఆనందం అన్న సూత్రాన్ని నమ్ముకున్న వారిలో కలిగే అనుభూతి చెక్కుచెదరనిది.

ఆకలి రాజ్యం:

సరే, పని కావాలి కదా ముందు. పని అంటే అప్పట్లో మధ్యతరగతి వారి దృష్టిలో ఉద్యోగమే. ముఖ్యంగా నాటి బ్రాహ్మణ కుటుంబాల నేపథ్యంలో నేను ఈ మాటలు రాస్తున్నాను. మిగతా సామాజిక వర్గాల పరిస్థితికీ సాధారణ బ్రాహ్మణ సామాజిక వర్గ పరిస్థితికి చాలా విషయాల్లో తేడాలు ఉండివి. పిల్లవాడు ఎదిగాడంటే విద్యాబుద్ధులు అయ్యాయంటే ఇక మిగిలినవి రెండు. ఒకటి ఉద్యోగం. రెండవది పెళ్ళి. నిరుద్యోగ సమస్య ఎక్కువగానే ఉన్న రోజులవి. ఈ నిరుద్యోగ అంశం మీదనే అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ‘ఆకలి రాజ్యం’ ఒకటి. కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సినిమా. శ్రీశ్రీ కవిత్వం, ఆకలి కేకలు, బతకడం అంటే ఉద్యోగమే కాదని, ఏ పనైనా చేసి బతకవచ్చని సందేశమిచ్చిన చిత్రం. పెద్ద పెద్ద లక్ష్యాలు తీరనప్పుడు నిరాశపడి ఆవేదన చెంది శూన్యం ప్రయాణించడం కంటే ఏదో ఒక ఉపాధి చేజిక్కించుకుని సమాజంలో గౌరవంగా బతకడం వంటి అంశాలు బుర్రలోకి ఎక్కిన రోజులవి. పైగా కుర్రాడిని కావడంతో శ్రీశ్రీ కవిత్వ ప్రభావం, నా పైత్య ప్రభావం ఒళ్లంతా పాకింది. అలా అని సాంప్రదాయ కుటుంబం కాబట్టి భగవద్గీత సారం తెలుసుకునే ప్రయత్నం కూడా మరోపక్క సాగింది.

ఏదో ఒక పక్కకు వొరిగిపోయి అలాగే సాగిపోయే నైజం నాకు లేదు. బహుశా ఇదే నా వైరుద్య జీవితం, అవి అందించిన సత్ఫలితాలకు బీజం వేసిందేమో. నా యీ జీవన యాత్ర పూర్తిగా చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుంది.

సూటిపోటి మాటలు:

నిరుద్యోగ పర్వంలో నేను ఎదుర్కున్న మరో ఇబ్బంది సూటిపోటి మాటలు. చాలా కాజువల్‌గా అడిగినప్పటికీ, “ఏరా, ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, గట్టిగా ట్రై చేయలిరా..” అన్న మాటలు సూదుల్లా గుచ్చుకునేవి. చిత్రమేమంటే ఇలా మాట్లాడే వారు సహాయం చేయరు. మాట సాయం చేయరు.

అలాంటప్పుడు మనసు గాడి తప్పుతున్నప్పుడు నన్ను అక్కున చేర్చుకున్న పుస్తకం భగవద్గీత. పుస్తకమే కాదు, ఘంటసాల మాష్టారి భగవద్గీత కేసెట్లు. (చూ- 9) ఆనాటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు కూడా చెదరని మనసుకు ఊరట కలిగించేవి. ఘంటసాల పాడిన ఓ పాట ప్రస్తావిస్తాను.

‘కల కానిదీ,
విలువైనదీ’ – అన్న పాటలో
‘అగాధమౌ
జలనిధి లోన
ఆణి ముత్య మున్నటులే,
శోకాల మడుగున దాగి
సుఖమున్నదిలే,
ఏదీ తనంత తాను
నీ దరికి రాదు,
శోధించి సాధించాలి ,
అదియే ధీర గుణము..
కల కానిదీ.. విలువైనదీ..’

ఇలాంటి పాటలు వింటున్నప్పుడు నిరాశ నిస్పృహలుపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుంటాము.

నా జీవితంలో అప్పటికీ, ఇప్పటికీ పాటల ప్రాధాన్యత చాలానే ఉంది. అలా అని నేను గాయకుడిని కాను. కానీ మంచి పాటలను బుర్రకెక్కించుకునే వాడ్ని. అనేక సందర్భాల్లో కష్టాలు ఎదురైనప్పుడు ఈ పాటలు ఊరట కలిగించాయి. ఈ ధోరణి వల్లనే ఏమో, ఆరు పదుల వయస్సు దాటాక ‘మంచి పాట – మనసులోని మాట’ అన్న శీర్షికన ఒక కార్యక్రమం రూపకల్పన చేయడం సాధ్యపడింది.

నా లెక్క ఇంతే:

ఆ రోజల్లో బ్యాంక్ ఉద్యోగాలు బాగానే పడుతుండేవి. కాకపోతే మనం లెక్కల్లో పూర్. ఇప్పటికీ అంతే. వేలల్లో లక్షల్లో ఎవరైనా మాట్లాడుతుంటే నాకు చమటలు పట్టేస్తాయి. రైల్వే ఉద్యోగాలు గుమాస్తా ఉద్యోగాలు వంటివి కూడా పేపర్లో వాంటెడ్ కాలమ్స్‌లో కనబడేవి. మిడిమిడి చదువులతో పోటీ పరీక్షలు గట్టెక్కె పరిస్థితి లేదు. పైగా మా ఊర్లో ఆ రోజుల్లో కోచింగ్ సెంటర్స్ లేవు. పోటీ పరీక్షలు ఎలా రాయాలి, వాటికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయాల్లో గైడ్ చేసే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మన ఒంటికి సరిపడే ఉద్యోగాల వేట ప్రారంభించాను.

తొలి ఇంటర్వ్యూ:

ఆ రోజుల్లో మెడికల్ రిప్రజెంటేటీవ్స్ పోస్టులు పడేవి. ఇవి కూడా మనకు సరిపడేవి కావనుకోండి. కాకపోతే మా ప్రెండ్ అప్లై చేస్తూ నా చేత కూడా చేయించాడు. ఇంటర్వ్యూకి రమ్మనమని కబురొచ్చింది. విజయవాడ మమతా హోటల్‌లో ఇంటర్వ్యూ. సరే బాగానే ఉంది కదా అని విజయవాడ వెళ్ళాము. వారడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు చెబుతాను. అవి చాలు ఫలితం ఎలా ఉందో వివరంగా చెప్పకుండా..

***

“మీరు ఏం చదువుకున్నారు?”

“ఎమ్మెస్సీ”

“ఈ జాబ్ కి ఎందుకు అప్లై చేశారు?”

“మా ఫ్రెండ్ చేస్తూ నా చేత చేయించాడు”

“మేమడిగిన ప్రశ్నకు మీ సమాధానం ఇదేనా, ఇంకేమైనా చెబుతారా?”

“లేదు, ఇదే నా సమాధానం”

“సరే, మీకు వేటిలో ఆసక్తి ఉంది?”

“నాకా.. పిల్లలకు పాఠాలు చెప్పడమంటే ఇష్టమండి. ఇంకా.. మిమిక్రీ చేయడమంటే ఇష్టమండి”

ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లు ఉలిక్కి పడ్డారు. “మరండీ, ఏఎన్నార్, ఎన్టీఆర్, సీఎస్సార్ గొంతులు దింపేస్తానండి”

“మీరు ఆప్లై చేసిన ఉద్యోగానికీ మీరు చెబుతున్న మాటలకీ ఏమిటీ సంబంధం?”

“ఏమో, నాకు తెలియదు. ఆఁ.. మీరు జాబ్ ఇస్తే, ఇలా సరదాగా మిమిక్రీ చేసి నవ్విస్తూ సేల్స్ పెంచుతానండి”

“అబ్బో అలాగా.. చూడండి, సమాధానాలు ఆలోచించి చెప్పండి”

“అలాగే”

“ఇంకా ఏం ఇష్టం”

“నాటకాలు ఆడటం. డైరెక్షన్ చేయడం”

వింటున్న వాళ్లు మరో సారి ఉలిక్కి పడ్డారు. సర్దుకున్నాక..

“ఓహో.. అలాగా, బాగుంది”

“బాగుందీ – అంటే నాకు మీరు ఉద్యోగం ఇచ్చినట్లేనా..”

“ఆ.. అది తర్వాత చెబుతాము. మీరు వెళ్లండి”

***

ఆ తర్వాత అర్థమైంది. మనం అన్ని ఉద్యోగాలకు పనికిరాము. మనం చేయగలిగిన ఉద్యోగాల లిస్ట్ ముందు తయారు చేసుకుని వాటికే అప్లై చేయాలనుకున్నాను. వాటిలో ఒకటి పాఠాలు చెప్పడం, రెండవది చదివిన సైన్స్ సబ్జెక్ట్ లోనే పరిశోధనా రంగానికి పరిమితమయ్యే ఉద్యోగాలు వెతుక్కోవడం.

మరి ఈ కుర్రాడు నిరుద్యోగ పర్వం నుండి ఎలా బయటపడ్డాడు. ఎలాంటి ఉద్యోగంలో స్థిరపడ్డాడు? అందులో ఎలా తన కెరీర్ ని మలుచుకున్నాడో..? చూద్దాం ఏం జరగబోతున్నదో.. కాలం ఎటు తీసుకెళ్లబోతున్నదో..??

ఫుట్ నోట్స్:

8. నల్లేరు మీద నడక: ఇది పల్లెటూర్లలో వాడుకలో ఉన్న నానుడి. నల్లేరు అన్నది ఒక రకం తీగ మొక్క. ఈ మొక్క కాండం చతురస్రాకార స్తంభంలాగా ఉంటుంది. ఈ నల్లేరు తీగలను తెంపి వాటిని రహదారి మీద గుంటలు, గోతులున్న చోట్ల పోస్తుంటారు. వర్షాకాలంలో గుంటల్లో ఎడ్ల బండి చక్రాలు ఇరుక్కుపోకుండా క్షేమంగా గుంటలు, గోతులు దాటించడానికి ఈ నల్లేరు తీగల కుప్ప సాయపడుతుంటుంది. నల్లేరు తీగల వల్ల చక్రం జారకుండా పట్టుకోల్పోకుండా ఉంటుంది. నల్లేరు వేసిన రోడ్డు మీద బండి నడక సునాయాసంగా ఉంటుంది. ఎడ్లు కూడా అలసిపోవు. ఏ పని అయినా సులువుగా కేక్‌వాక్‌గా జరిగిపోతుంటే ఈ నానుడి వాడుతుంటారు.

పత్రికల్లో కూడా హెడ్డింగ్స్‌లో ‘నల్లేరు మీద నడక’ అన్న ప్రయోగం తరచూ కనబడుతుంటుంది. అయితే నా మీడియా మిత్రుడొకడు ఓసారి హెడ్‌లైన్‌లో నల్లేరు మీద నడక అన్న ప్రయోగం తప్పుగా ఉపయోగించాడు. నిజానికి మేటర్‌లో ‘అతి కష్టపడుతున్నాడన్న’ అర్థం ఉంటే హెడ్డింగ్‌లో నల్లేరు మీద నడక అని పెట్టడం వ్యతిరేక అర్థం వచ్చేసింది. సరే, పత్రికల్లో ఇలాంటి తప్పులు చాలానే దొర్లుతుంటాయి. సందర్భం వ్చచినప్పుడు అలాంటివి మరి కొన్ని ప్రస్తావిస్తాను.

9. క్యాసెట్స్: మెమొరీ స్టోరేజీ పరిణామ క్రమం గురించి చెప్పుకునేటప్పుడు క్యాసెట్ల స్వర్ణ యుగం గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. నేను యువకునిగా ఉన్నప్పుడు ఈ క్యాసెట్ల హవా ఉండేది. క్యాసెట్ లోని టేప్ మీద ధ్వని ముద్రణ జరిగేది. 70వ దశకం రోజుల్లో అనేక సినిమా క్యాసెట్లు విరివిగా దొరికేవి. విజయవాడ లెనిన్ సెంటర్ కి వెళ్ళి దానవీర శూర కర్ణ, యమగోల వంటి సూపర్ హిట్ సినిమాల డైలాగ్‌ల క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్మడయ్యేవి. అదే లెనిన్ సెంటర్‌కి ఈ మధ్య (2024) వెళితే క్యాసెట్లు మచ్చుకి కూడా లేవు. కొంత కాలం సీడీల యుగం నడిచినా అవీ కనుమరుగవుతున్నాయి. ఇప్పుడంతా పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌ల యుగం నడుస్తోంది అక్కడ.

మెమొరీ స్టోరేజీ పరిణామ క్రమంలో ఇప్పుడు ‘క్లౌడ్’ పెద్ద పీట వేసుకుని కూర్చుంది. ప్రతి చోటా క్లౌడ్‌లో పెట్టామన్న మాట వినబడుతోంది. మొదట్లో చాలా ఆశ్చర్యం వేసింది. మేఘాల్లో సమాచారం నిక్షిప్తం చేయడమేమిటీ! సినిమాల్లో నారదుడు తన వద్ద బోలెడంత సమాచారం దాచుకుని (భద్రపరుచుకుని) మేఘాల్లో సంచరిస్తూ కావలసిన వారికి, కావలసిన సమయానికి చేరుస్తుంటాడు. ఈ రకంగా ఆలోచిస్తుంటే, రేపో మాపో క్లౌడ్‌కి నారదుడే ఆధ్యుడన్న కొత్త వాదన మనోళ్లు లేవనెత్తుతారనే అనిపిస్తోంది.

క్యాసెట్లు రావడానికి ముందు సినిమా పాటలు, మాటలు వినాలంటే గ్రామ్‌ఫోన్ రికార్డ్ కొనేవాళ్లం. ఘంటసాల భగవద్గీత గ్రామ్‌ఫోన్ రికార్డ్ మీద ప్లే చేసి వినడం చాలా మంది ఇళ్లలో చూశాను. చిన్నప్పుడు రేడియో పెట్టెలోంచి మాటలు వస్తుంటేనే ఆశ్చర్యపోయిన నాకు – పళ్లెం లాంటి గ్రామ్‌ఫోన్ రికార్డ్ నుంచి పాటలు, మాటలు వినబడటం మరింత ఆశ్చర్యమేసేది. మరి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తర్వాత చెబుతాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here