తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-7

3
10

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

భయం నీడలో..:

భయం- నా చిన్నప్పుడు నిత్యం వెంటాడేది.

భయం- రాత్రిళ్లు సరిగా నిద్రపోనిచ్చేది కాదు.

భయం- రాత్రి వేళ ఆకాశం వైపు చూడనిచ్చేది కాదు.

భయం – ఒంటరిగా నడవ నిచ్చేది కాదు.

భయం, వయస్సుతో సంబంధం లేని ఫీలింగ్. మన మనసు వీక్‌గా ఉంటే మన నీడే మనల్ని భయపెడుతుంటుంది.

‘ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు’ అని ఓ సినీ రచయిత అన్నాడు. కానీ, అలా తోడుగా వెన్నంటి వచ్చే నీడే ఒక్కోసారి మనల్ని భయపెట్టేస్తుంటుంది. ఏదో తెలియని శక్తి మనల్ని వెంబడిస్తున్నదన్న భావన. అలాంటప్పుడు ఒళ్లంతా జలదరించడం మామూలే కదా. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదేమో.. నా జీవితంలో భయం చుట్టూ తిరిగిన సంఘటనలను గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

మఱ్ఱి చెట్టు క్రింద శవం:

పల్లె భయపడుతోంది. వారం రోజుల నుంచి రాత్రియిందంటే చాలు గజగజా వణికి పోతున్నది. దీనికి బలమైన కారణమే ఉంది. మఱ్ఱి చెట్టు క్రింద రాత్రి పూట పడుకున్న వ్యక్తి పొద్దుటికల్లా శవమై పడి ఉన్నాడు. ఈ చెట్టు ఊర్లోని దక్షిణ దిక్కున శ్మశానానికి వెళ్లే దారిలో ఉంది. ఈ మఱ్ఱి చెట్టు చుట్టూ భయంకరమైన కథలు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ శవం కథ అలాంటిదే.

ఇదంతా 60వ దశకంలోని మాట. మా ఊర్లో (అడవిరావులపాడులో) ఓ కుర్ర గ్యాంగ్ ఉండేది. ఈ గ్యాంగ్‌కి పనేమీలేదు. పగలంతా ఈ మఱ్ఱి చెట్టు క్రిందనో, లేకుంటే దానికి పక్కనే ఉన్న వేప చెట్టు క్రిందనో కూర్చుని అష్టాచెమ్మా, పేకాట వంటి ఆటలు ఆడుకునే వారు. వారిలో ఒకరిద్దరికీ మందుకొట్టే అలవాటు కూడా ఉందని చెబుతుండేవారు. ఈ గ్యాంగ్ లోని ఓ కుర్రాడే మఱ్ఱి చెట్టు క్రింద శవమై కనిపించాడు. పట్టుమని పాతిక కొంపలు లేని ఊరుని ఈ సంఘటన కుదిపేసింది. ఎక్కడ ఇద్దరు తారసపడినా ఈ శవం కబుర్లే.

సరిగా అలాంటప్పుడే మేము గుంటూరు నుంచి సెలవలు కదా అని ఈ ఊరు వచ్చాము. ఇరుక్కుపోయాము. ఆ రోజుల్లో పల్లెల్ని అనేక భయాలు చుట్టుముడుతుండేవి. ఆ భయాల్లో ప్రధానమైనది దెయ్యం భయం. తలచుకుంటేనే వెన్నులో వణకు పుడుతుంది. పట్టుమని పాతికేళ్లు లేని కుర్రాడు రాత్రి ఆ చెట్టు క్రింద పడుకోవడమేమిటీ, తెల్లారేసరికి శవమై పోవడం ఏమిటీ. ఇదే చర్చ. అందర్నీ కలచి వేసింది. ఏ రోగం లేదు, ఏ రొష్టు లేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు. కానీ పంతం, పందెం ఇతగాడి ప్రాణం తీసిందని ఊరి జనం అనుకుంటున్న మాట. రాత్రంతా మఱ్ఱి చెట్టు క్రింద పడుకుని వస్తాననీ పందెం కాశాడట ఈ అర్భకుడు. అలాగే పడుకున్నాడు. కానీ తిరిగి లేవలేదు. ఊపిరాడక చనిపోయాడనీ, దెయ్యం అతని పీక నులిమి చంపేసిందని చెప్పుకునేవారు.

పల్లెలో భయాలు ఒక రకంగా ఉండేవి కావు. ఎండాకాలం వచ్చిందంటే ఆరు బయటనే పడుకునేవారు. అప్పట్లో చాలా పల్లెల్లో కరెంట్ లేదు. ఒక వేళ ఉన్నా ఇళ్లకి కరెంట్ పెట్టించుకున్న వారి సంఖ్య వేళ్లమీద లెక్కించ వచ్చు. వీధిలో లైట్లు కూడా సరిగా ఉండేవి కావు. ఏదో ప్రధాన వీధిలో ఒకటో రెండు వీధి లైట్లు వెలిగి ఆరుతుండేవి. పంచాయితీ రేడియో మాత్రం వినబడుతుండేది. అదే పెద్ద కాలక్షేపం. కానీ ఎంత సేపు, రాత్రి పూట ‘ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం’ అనగానే పంచాయితీ రేడియో మూగబోయేది. ఆఫీస్ లైట్ ఆరిపోయేది. ఇక తర్వాత అంతా అంధకారమే. నిశ్శబ్దం ఆవరించేది. అప్పుడప్పుడు వీధి కుక్కలు అరుస్తుండేవి. ఆ అరుపులు పగటి పూట అరుపుల్లా ఉండేవి కావు. ఏదో భయానక దృశ్యం చూశాక వణుకుతో అరిచినట్లు ఉండేవి. ఆ అరుపులకు కొట్టంలో కట్టేసిన ఆవులు కూడా భయంతో అదో రకంగా కాస్తంత శబ్దం చేసేవి. కీచురాళ్ల ధ్వనులు కూడా చాలా స్పష్టంగా వినిపించేవి. బయట మంచాలేసుకుని పడుకునే వారికి వెంటనే నిద్రపడితే సరి. లేకుంటే ఈ భయానక వాతావరణం వారికి ముచ్చెమటలు పట్టించేవి. మరీ నాబోటి పిల్లలకు..

ఆ రోజుల్లో అంటే 60వ దశకంనాటి రోజుల్లో చాలా మంది ఇళ్లలో నులక మంచాలు ఉండేవి. వాటిని ఎక్కడి కావాలంటే అక్కడికి తేలిగ్గా మోసుకుని వెళ్లే వీలుండేది. ఎండాకాలం ఆ నులక మంచం మీద నీళ్లు జల్లితే మంచం చల్లబడేది. దీంతో అవి ‘ఏసీ మంచం’లా ఉండేవి. అప్పట్లో ఏసీ, నాన్ ఏసీ అన్న పదాలే నాకు తెలియవనుకోండి.

వేసవి సెలవలప్పుడు మా ఊరు వెళితే సాయంత్రం చల్లబడగానే జీతగాడు బుంగలతో (చూ. 10) నీళ్లు తోడి ఇంటి ఆవరణలో నీళ్లు జల్లేవాడు. అప్పటి దాకా వేడెక్కిన మట్టి నేల ఈ బుంగల నీటితో చల్లబడేది. అప్పుడొచ్చే మట్టి వాసన పీలుస్తుంటే అదో రకం ఆనందమేసేది. జీతగాడు అలా నీళ్లు జల్లడం మేము ఆ తిడిసీ తడవని మట్టిలో పిచ్చిపిచ్చిగా ఎగరడం, వాడేమో కసురుకోవడం, మేమేమో అలగడం ప్రతి సాయంత్రం రిపీట్ అయ్యే సీన్. ఇళ్లలో కరెంట్ లేదు కనుక రాత్రి భోజనాలు చాలా త్వరగా అయిపోయేవి. సాయంత్రం ఆరున్నర, ఏడింటి కల్లా గుడ్డి దీపాల కాంతిలోనే భోజనాలు కానిచ్చి బయట వేసిన మంచాలెక్కి పడుకునే వాళ్లం. అప్పుడు మొదలయ్యేది అసలైన ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత భయంతో వణికే కథలు.

నిద్ర వచ్చే వరకు జీతగాడో, పక్కింటి పిల్లలో వచ్చి కథలు, పాటలు పాడేవారు. మా పక్కింట్లో దాక్షాయణి అనే పది పన్నెండేళ్ల అమ్మాయి, పెద్ద నాపసానిలా కబుర్లు చెబుతుండేది. మధ్యమధ్యలో పాటలు పాడుతుండేది. అలా విన్న ఒక పాట..

‘శివుని మెడలో నాగరాజా,

చిన్ని పార్వతి పిలిచెను దేవా

దేవి పలుకు ఆలకించరా,

శివ నాగరాజా,

తల్లి పలుకు విన్నవించరా..’

– అంటూ పాడేది. నాకు నాగరాజు అని ముద్దు పేరు ఉండేది. మా అమ్మ నన్ను కడుపుతో ఉన్నప్పుడు ఆమెకి కలలో పాములు కనిపిస్తుండేవట. దీంతో అబ్బాయి పుడితే నాగరాజు అని పిలుచుకుంటామని మొక్కుకుందట. అలాగే చేసింది. అప్పటి నుంచి నాగరాజు అనే చాలా మంది నన్ను పిలుస్తుంటారు. ఇప్పటికీ అంతే. మా ఊర్లోని బంధువులు, మిత్రులు నన్ను నాగరాజు అనే పిలుస్తుంటారు. దాక్షాయణి ఈ పాట పాడుతుంటే నన్ను ఎగతాళి చేయడానికే నా పేరు కలిపేస్తూ పాడుతున్నదని అనుకునేవాడ్ని. నిజానికి ఈ పాట నాగుల చవితి పండుగ నాడు పాడుకునేదని ఆ తర్వాత తెలిసిందనుకోండి.

రాత్రి పూట పాటలే కాదు ఊర్లోని వింత వింత కబుర్లు కూడా దొర్లుతుండేవి. అలాంటప్పుడే మమ్మల్ని భయపెట్టడానికా అన్నట్లు దెయ్యం కబుర్లు చెప్పేవాళ్లు. నేనైతే తెగ భయపడేవాడ్ని. మఱ్ఱి చెట్టు, దెయ్యాల దిబ్బ, శ్మశానం, ఊరి ఉమ్మడి బావిలో శవం..వంటి పదాలు విన్నప్పుడల్లా వణకుపుట్టేది. అన్నం సయించేది కాదు. మా బామ్మ మాత్రం ధైర్యం చెప్పేది. ‘ఇవన్నీ నమ్మవద్దురా. ఉత్తిత్తి కబుర్లే సుమీ’ అని అంటుండేది. మా అమ్మ మాత్రం ఆ రెండు చెట్లున్న వైపు వెళ్లకండి అంటూ హుకుం జారీ చేసేది. బామ్మకున్నంత ధైర్యం ఉండేది కాదు అమ్మకి. ఫలానా వారింటికి వెళ్లకండి, ఫలానా వీధిలో ఆడుకోకండి..అంటూ ఆంక్షలు పెట్టేది. ఊర్లో మంత్ర తంత్రాలు తెలిసిన ఒకాయన ఉండేవాడు. ఆయన ఇంటి ఛాయలకు కూడా అమ్మ వెళ్ళనిచ్చేది కాదు. చాతబడి అన్న మాట అప్పుడే విన్నాను. వెంట్రుకలు, గోళ్లు ఎక్కడబడితే అక్కడ పడేస్తే వాటిని ఏరుకెళ్ళి చేతబడి చేస్తారట. అప్పుడేమో మనకు బోలెడు కష్టాలొస్తాయట. ఇలా ఊర్లోని మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్లు. నేను నమ్మేవాణ్ణి.

మా బామ్మ కూడా అప్పుడప్పుడు భయపడుతుండేది. ఆమె భయం తనకేదో అవుతుందని కాదట, మాకు ఏమైనా జరుగుతుందేమో అనేనట. అందుకే అప్పుడుప్పుడు కసురుకునేది. ఎందుకు కసురుకునేదో ఆ చిన్న వయసులో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత యండమూరి ‘దయ’ వల్ల చాతబడి, కాష్మోరా వంటి క్షుద్ర విద్యలున్నాయని తెలుసుకుని వాటి గురించి చదువుతూ భయపడేవాళ్లం. చదవడం ఎందుకూ భయపడటం ఎందుకూ అని ఎవరైనా అన్నా, ఆ రకం కథలు మమ్మల్ని అటువైపు లాక్కునేవి.

మఱ్ఱి చెట్టు – శవం పుకార్లలోని లాజిక్ ఆ తర్వాత చాలా కాలానికి గాని తెలియలేదు.

ఆకాశంలో శవ యాత్ర:

అర్థరాత్రి వేళ ఆకాశంలో ఓ నలుగురు వ్యక్తులు నులక మంచం మీద శవాన్ని పడుకోబెట్టి మోసుకుపోతుంటారు. ఆ వింత దృశ్యం ఆకాశంలో కదులుతుంటుంది. ఎవరైనా చూశారో రక్తం కక్కుకుని చస్తారు.

ఈ తరహా పుకారొకటి నా చిన్నప్పుడు బాగా వ్యాపించింది. పల్లెటూర్లలో ఎండాకాలం వచ్చిందంటే ఆరుబయట మంచాలు వేసుకుని హాయిగా పడుకునే వారికి ఈ పుకారు వెన్నులో వణుకు పుట్టించేది. మేమప్పుడు పిల్లలం కదా, రాత్రి పూట బయట పడుకోవాలంటే హడలు. అలా అని ఇంట్లో పడుకోలేము. ఎందుకంటే ఆ రోజుల్లో పల్లెల్లోని చాలా ఇళ్లలో కనీసం కరెంట్ ఉండేది కాదు. లోపల ఇంకా చీకటి. ఒక్కోసారి గాలి స్తంభించేది. అలాంటప్పుడు మా బామ్మమో చేతిలో విసిన కర్రతో మాకు విసురుతుండేది. అది కాసేపే. ఆమె చెయ్యి నొప్పి పుట్టడం చేతనో, లేదా నిద్రలోకి జారుకోవడం వల్లనో విసిన కర్ర ఊగడం ఆగిపోయేది. ఆ రోజుల్లో మాకైతే ఫ్యాన్లు ఉంటాయన్న సంగతి తెలియదు.

భయం చుట్టూ తిరిగే పుకార్లు ఒక ఊరు నుంచి మరొ ఊరికి పాకిపోతుండేవి. ఇంచుమించు ఒకే మోస్తరు కథలు వినబడుతుండేవి. ఈ విషయంలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా ఉండేది కాదు. అలాంటిదే రాత్రి వేళ ఆకాశంలో శవ యాత్ర భయం.

ఆ రోజుల్లో ఇప్పటిలా అపార్ట్‌మెంట్ కల్చర్ లేదు. ఎటాచ్డ్ బాత్ రూమ్స్ చాలా మంది ఇళ్లలో ఉండేవి కావు. ఇళ్లు కూడా పెద్దవిగా ఉండేవి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ. ఈ ఆవరణలో ఒక మూల స్నానాల గది ఉండేది. 60వ దశకంలో చాలా ఇళ్ళలో టాయిలెట్ సౌకర్యం ఇంటి ఆవరణలోనే ఉండేది కాదు. మరీ పల్లెల్లో అయితే ఊరి చివర్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలను టాయిలెట్ కోసం ఉపయోగించేవారు. వీటిని బహిర్భూమి అని పిలిచేవారని నాకు గుర్తు. ఆడవారికీ, మగవారికీ వేరువేరుగా ఈ టాయిలెట్ ప్రాంతాలు ఉండేవి. మా ఊర్లో వాగు పక్కన ఈ అవసరాలు తీర్చుకునేవారు. వాగు కూడా అప్పుడప్పుడు పొంగుతుండేది. తుపాన్లు వచ్చినప్పుడు వరదొచ్చి వాగు పొంగి ఊర్లోకి నీళ్లు వచ్చేస్తుండేవి. అలాంటప్పుడు ఊరికీ సమీపాన ఉన్న పట్టణానికీ సంబంధాలు తెగిపోయేవి. మా సెలవలు అయిపోవస్తున్నా, వాగు పొంగడం వల్ల వెంటనే వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పెద్ద పెద్ద ఇళ్లలో రాత్రి పూట మూత్ర విసర్జనకు పోవాలంటే ఏదో ఒక మూలకు పోవాలి. అసలే భయాలు. అందునా రాత్రి వేళ. నిద్ర మధ్యలో లేచి ఆ పని పూర్తి చేసుకోవాలంటే అదో పెద్ద సాహసకృత్యమే. దినదిన గండమే. పోనీ పక్కన పడుకున్న వారిని లేపుదామా అంటే ఒక పట్టాన లేవరాయె. మనకి తొందరాయె. ఇలాంటి నరకయాతన సంఘటనలు అప్పట్లో చాలా ఇళ్లలో జరుగుతూనే ఉండేవి.

నిద్ర మధ్యలో లేచినప్పుడు ఆకాశం వైపు చూడాలంటే భయం. కానీ చూడకుండా ఉండలేము. పైకి చూస్తే ఏదో మేఘాలు కదులుతున్నట్లు అనిపించేవి. చిత్ర విచిత్ర ఆకారాల్లో మేఘాలు కదులుతుండేవి. వాటిలో కొన్ని స్థిరంగా ఉంటే, మరి కొన్ని చకచకా పరిగెడుతుండేవి. అలాంటి మేఘాల్లో ఒక్కోసారి పుకార్లలో చెప్పినట్లే ఒక శవం, దాన్ని నలుగురు మోస్తున్నట్లు కూడా కనిపిస్తుండేవి. నాకు అలా కనిపించలేదు కానీ, కొంతమందికైతే ఆకాశంలో శవయాత్ర కనిపించిందట. రక్తం కక్కుకుని చస్తామన్న భయం వారిని చాలా కాలం వెంటాడేది. ఇలాంటి సంఘటనలను తెల్లారాక కథలు కథలుగా చెప్పేవారు. ఫలానా ఊర్లోని వారు ఆకాశంలో ఇలాంటి వింత చూశారనీ, వారిలో చాలా మంది వింత వింత జబ్బులతో మరణించారనీ కూడా చెప్పుకునే వారు. ఇవన్నీ వింటూ నాబోటి బక్క ప్రాణులు భయంతో వణికిపోవడాలు ఆ రోజుల్లో మామూలే.

ఓ స్త్రీ రేపు రా..:

మరో పుకారు కూడా ఆ రోజుల్లో బాగానే భయపెట్టేది. రాత్రి వేళ , మరీ ముఖ్యంగా అమావాస్య రోజున అర్ధరాత్రి వేళలో జుట్టంతా విరబోసుకున్న ఓ స్త్రీ వీధుల్లో తిరుగుతుండేదట. ఎవరింట్లోనైనా దీపాలు వెలుగుతుంటేనో లేదా మాటలో వినబడుతుంటేనో ఆ ఇంట్లోకి వింత ఆకారం దూరి చంపేస్తుందట. అది కచ్చితంగా ఆడ దెయ్యమేనని చెప్పేవారు. ఈ భయంతోనే రాత్రి కాగానే పల్లె మౌనం దాల్చేది. ఎవరికి వారు తలుపులు బిడాయించుకుని పడుకునే వారు. నిద్రపట్టకపోయినా పడుకున్నట్లు నటించేవారు. అలాంటి వాళ్లు తెల్లారాక రకరకాల కథలు చెప్పేవాళ్లు. అర్ధరాత్రి వేళ గజ్జెల శబ్దం వినిపించిందనీ, ఆ శబ్దం తన ఇంటి దాకా వచ్చిందని, ఎవరో తలుపు తట్టినట్లు అనిపించిందనీ చెప్పేవారు. ఈ దెయ్యం స్త్రీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి తలుపు మీదనో లేదా గోడమీదనో ‘ఓ స్త్రీ రేపు రా..’ అని వ్రాయాలని చెప్పేవారు. దెయ్యం స్త్రీ ఒక వేళ తమ ఇంటికి వచ్చినా ఆ వాక్యం చదువుకుని వెనక్కి తిరిగి వెళ్ళి పోయేదట. ఇదో మూఢ నమ్మకం అని తర్వాత తెలిసింది. ఒక వేళ ఆ దెయ్యం స్త్రీ కి చదువు రాకపోతే ఆ వాక్యం ఎలా చదువుతుందని ఓ ఫ్రెండ్ అడ్డంగా వాదించేవాడు. నాకూ అలాంటి ఆలోచనే వచ్చినా, పైకి చెప్పేవాడ్ని కాదు. అప్పట్లో భయపడటమొక్కటే తెలుసు. ఆ తర్వాత వెన్ను ముదిరాక, భయం తగ్గింది. అంతే కాదు, భయపడటానికి విరుగుడు భయపెట్టడమే అని తెలుసుకున్నాను. ఆ క్రమంలోనే దెయ్యం కథలు, నవలలు చదవడం, సినిమాలు చూడటం నేర్చుకున్నాను. దెయ్యం సినిమా వచ్చిందంటే చాలు చూడాలనుకునే వాడ్ని. భయం పోవాలంటే బాగా భయపెట్టే సినిమాలు చూడాలన్నది నా సిద్ధాంతం. అయితే అదంత తేలిక కాదు. భయంతో వణికిపోతూనే దెయ్యం సినిమాలు చూసేవాడ్ని. ఆ తర్వాత ఇతరుల్ని భయపెట్టడానికి కథలు అల్లేవాడ్ని.

పీజీ చేశాక కొన్నాళ్లు వైజాగ్‌లో ఉన్నాను. అప్పుడు మా చిన్న మామయ్య గారి పిల్లల్ని, వాళ్ళ ప్రెండ్స్‌ని అప్పుడప్పుడు ఇలాంటి దెయ్యం కథలు చెప్పి భయపెట్టేవాడ్ని. కథ చెప్పేటప్పుడు నాటకీయత ఎక్కువగా జోడించడం వల్ల పిల్లలు భయపడేవాళ్లు. ఈ లక్షణం ఇప్పటికీ ఉంది. భయపెట్టడం ఓ సరదా. అలా అని నాకు భయం అంటే తెలియదనుకోకండి. నేను భయస్తుడిని. గోడ మీద బల్లిని చూస్తే భయం. చీకటి అంటే భయం. కానీ భయానికి దెయ్యం కథలు వినేవారు దొరికితే మాత్రం నేనేదో గొప్ప ధైర్యస్థుడిలా ఫోజు పెడుతుంటాను. ఇది సీక్రెట్. అయ్యో మీకిప్పుడు చెప్పేశానే.

ఆమె ఎవరు?

సినిమా వాళ్లు బహు చమత్కారులు. సీన్‌కి తగ్గట్టుగా ప్రాపర్టీస్ భలేగా సిద్దం చేస్తుంటారు. భయపెట్టే సినిమా తీసేటప్పుడు వాళ్లంతా ఒకే మూసలో తీస్తుంటారు. ఉదాహరణకు దెయ్యం సినిమాలే తీసుకోండి. అప్పటికీ ఇప్పటికీ ఒకే తరహాలో భయపెట్టాలని చూస్తుంటారు. చాలా కాలం వరకు దెయ్యం అంటే ఆడ దెయ్యాన్నే చూపించేవారు. ఇది పక్కా నో డౌట్. దెయ్యం అంటే తెల్ల చీర కట్టుకుని, జుట్టు విరబూసుకుని కనిపించాల్సిందే. ఇది కూడా పక్కా. రాత్రి వేళ దెయ్యం ఊరికే తిరిగితే మజా ఏముంటుందనుకుంటారేమో ఈ సినిమా వాళ్లు. అందుకే, ఓ పాట పెడతారు. ఆ పాట మొత్తం ఒకేసారి రాదు. కథను సాగదీస్తూ మధ్యమధ్యలో ఈ పాట ముక్కలు ముక్కలుగా వస్తుంటుంది. చివరకు ఎప్పుడో క్లైమాక్స్‌కి ముందు ఎండ్ అవుతుంటుంది. ‘ఆమె ఎవరు?’, ‘అంతస్తులు’, ‘జగమే మాయ’ వంటి సినిమాలు నన్ను బాగా భయపెట్టాయి. ఆ రోజుల్లో ఆడవాళ్లు ఎక్కువగా చీరలే కట్టుకునే వాళ్లు. చీరల్లో ఎన్నో రంగులుండేవి. కానీ దెయ్యానికి మాత్రం ఎందుకో తెలియదు కానీ, తెల్ల చీర అంటే బాగా ఇష్టమనుకుంటా. అందుకే ఏ దెయ్యం సినిమా చూసినా సదరు దెయ్యం గారు తెల్ల చీర కట్టుకోవాల్సిందే, జుట్టు విరబూసుకోవాల్సిందే. ఒక్కోసారి వెలిగే కొవ్వొత్తిని చేతిలో పట్టుకుని దెయ్యం తిరుగుతుంటుంది. కాగడాలు, నిప్పు కట్టెలు పట్టుకుని తిరిగే దెయ్యాలను నా చిన్నప్పుడు మా ఊర్లో ‘కొరివి దెయ్యాల’ని పిలిచే వాళ్లు. కొరివి దెయ్యాలు శ్మశానాల్లో తిరుగుతుంటాయట. వాటిని చూస్తే కాటి కాపర్లంతటి ‘ధీరులే’ భయపడేవారట. ఇలాంటి కబుర్లు ఆ రోజుల్లో వినబడుతుండేవి.

సినిమాల్లో తొలి తరం దెయ్యాలు తెల్లచీర కట్టుకున్నా ఆ తర్వాత డైరెక్టర్లు కొంత మార్పు తీసుకొచ్చారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల హవా జరుగుతున్న రోజుల్లో చీకట్లో స్పష్టంగా కనబడాలంటే తెలుపు రంగు చీరైతే ఎక్కువగా భయపెట్టవచ్చని దర్శకులు భావించి ఉంటారు. అంతే కాదు, చేతిలో కొవ్వొత్తి వెలుగు మిణుకుమిణుకు మని వెలుగుతుంటే భయం అన్నది కెమేరాకి ఎక్కువ పట్టేస్తుందని అనుకునేవారేమో. కలర్ సినిమాలు వచ్చాక దెయ్యాల రూపురేఖలు మారిపోయాయి. పైగా సమాజంలో చీరల కట్టుకునే ఆడవారి శాతం బాగా తగ్గిపోతున్నప్పుడు దెయ్యాలు ఇంకా చీరలే కట్టుకోవడం నాకెందుకో ఇప్పటికీ నచ్చదు.

దెయ్యాల సినిమాల దర్శకుల సంగతి ప్రస్తావించాను కనుక, విజయ నిర్మల గురించి చెప్పుకోవాలి. విజయ నిర్మల ‘దేవుడే గెలిచాడు’ అన్న సినిమాకి డైరెక్ట్ చేసింది. ఇందులో ఆమె అప్పటి వరకు దెయ్యాన్ని చూపే తంతుకు భిన్నంగా దెయ్యాన్ని చూపించింది. ఈ సినిమాలో దెయ్యం ఒక జ్యోతిలా కనబడుతుందే తప్ప, మానవ శరీరంలా కనబడదు. నాకు గుర్తున్నంత వరకు ఇలాగే ఉంటుందీ ఈ సినిమాలో. ఈ సినిమా ఇప్పుడు చూద్దామంటే అందుబాటులో లేదు. ఇది చదువుతున్న వారు ఎవరైనా ఈ సినిమా తాలూకు లింక్ పంపితే చూసి మరో సారి భయపడటానికి ప్రయత్నిస్తాను.

జగమే మాయ:

నేను కాలేజీ చదువులతో బిజీగా ఉన్న రోజుల్లో (ఉత్తినే బిజీ అనేశా. నిజానికి వారానికి ఓ సినిమా చూసిన జాలీ రోజులవి) ‘జగమే మాయ’ అన్న సినిమా ఓ టూరింగ్ టాకీస్‌లో చూశాను. ఈ టాకీస్‌ని మా ఊరికి చివర్లో ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేకి ఓ పక్కగా ఉండేది. ‘జగమే మాయ’ సినిమా రెండో ఆటకి చూద్దామని మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. సరే నేనూ బయలుదేరాను. రెండో ఆట (సెకండ్ షో) రాత్రి పది గంటలకు మొదలయ్యేది. ఇప్పట్లో లాగా టైమ్ అంటే టైమ్‌కి షోలు మొదలు కావు. జనం తక్కువగా ఉంటే – “మరో అరగంట చూద్దాం, ఇంకో నాలుగు పాటలు గొట్టం మైక్‌లో వినిపించ్రా” అని మేనేజర్ అంటుండేవాడు. సినిమా హాల్ పైన మైక్ గొట్టం తగిలించేవారు. గ్రామ్ ఫోన్ రికార్డ్ లతో పాటలు వినిపించేవారు. హాల్లో జన సాంద్రతను మేనేజర్ పరికించి ఓ అరగంట అటో ఇటో షో టైమ్‌ని జరుపుతుండేవాడు.

‘జగమే మాయ’ దెయ్యం సినిమా అని నాకు తెలియదు. ఫ్రెండ్ ఛలో అంటే నేనూ ఛలో అనేశాను. ఆ సినిమాలో ఇప్పటికీ ఓ సీన్ నాకు బాగా గుర్తు.

రాత్రి పూట కారు రయ్యిన పోతున్నది.

డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కి అనుమానం వచ్చింది.

ఎవరో వెనక సీట్లో ఉన్నారనిపించింది.

అప్పటి వరకు ఖాళీగా ఉన్న వెనుక సీట్లో ఎవరో కదులుతున్న శబ్దం.

కారు పక్కకు తీసి ఆపాడు.

వెనక్కి చూశాడు.

అంతే..

(భయంకరమైన మ్యూజిక్)

ఆ భయంకర ఆకారం చూసి నాకు గుండె ఆగినంత పనైంది. అలాంటి సినిమా చూడటం ఒక ఎత్తైతే చూశాక చిమ్మ చీకట్లో నడుచుకుంటూ ఇళ్లకు చేరడం మరో ఎత్తు. పేరుకు నేషనల్ హైవేనే కానీ, అప్పుడప్పుడు వెళుతుండే బస్సు, లారీల హెడ్‌లైట్ వెలుతురు తప్ప ఏ రకమైన వెలుతురు లేదు. ఎవరో వెనక ఫాలో అవుతున్నారన్న భయం నన్ను ఆవహించింది. దీంతో పరుగో పరుగు. ఎలాగో ఇంటికి చేరాను. విషయం తెలుసుకున్న ఇంట్లో పెద్దోళ్లు పాపం ఏమీ అనలేక నా క్షేమం కోసం ఆంజనీయ దండకం చదివారు.

పాతాళ భైరవి:

భయం చుట్టూ ఆలోచనలు సాగుతున్నాయి కనుక ‘పాతాళ భైరవి’ గురించి చెప్పకపోతే అసంతృప్తిగా ఉంటుంది. 1950ల్లో వచ్చిన విజయా వారి ‘పాతాళ భైరవి’ సినిమాని సెకండ్ రిలీజో ఆ తర్వాత రిలీజో అయినప్పుడు, గుంటూరులో చూశాను. అప్పట్లో హిట్ అయిన సినిమాలను అడపదడపా రిలీజ్ చేస్తుండేవారు. మంచి సినిమాలు ఎన్ని సార్లు రిలీజ్ చేసినా జనం టిక్కెట్ల కోసం కొట్టుకునే వాళ్లు. ఇప్పటిలా యుట్యూబ్ లోనో టివీల్లోనో పాత సినిమాలు ఇంట్లో కూర్చునే హాయిగా చూసే అవకాశం అప్పట్లో లేదు కనుక సినిమా చూడాలంటే హాల్‌కి వెళ్ళాల్సిందే. టికెట్ కొనుక్కోవాల్సిందే. ఆ రోజుల్లో టికెట్‌ని ముందుగానే రిజర్వేషన్ చేసుకునే అవకాశం సిటీస్‌లో ఉందేమో గానీ చాలా చోట్ల లేదనే గుర్తు. టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. చిత్రమేమంటే బుకింగ్ తెరిచే దాకా బుద్దిగానే క్యూలో నిలబడ్డవారు కాస్తా, బుకింగ్ తెరిచినట్లు లైట్ వెలగ్గానే ఇక చూసుకోండి, హడావుడి మొదలవుతుంది. అది చివరకు తోపులాటకు దారి తీస్తుండేది. ఒకరి మీద మరొకరు ఎక్కేసేవారు. నేల టికెట్, బెంచీ టికెట్ దగ్గర ఈ తోపులాటలు ఎక్కువగా జరుగుతుండేవి. పైగా హీరోల పట్ల ఉండే వీరాభిమానం ప్రేక్షకుల చేత వీర విన్యాసాలు చేయిస్తుండేది. కుర్చీ, రిజర్వ్ కౌంటర్లు కాస్తంత మెరుగ్గా ఉండేవి. ఇక్కడ క్యూలైన్ తక్కువగా ఉండేవి. పైగా వచ్చేవారంతా క్లాస్ పీపుల్ కాబట్టి హుందాగా ఉండేవారు. అయినా చేంతాడంత క్యూ ఉండటంతో అందరికీ టికెట్ దొరకుతాయన్న గ్యారెంటీ లేకపోవడంతో క్యూ డిగ్నిటీ గాడి తప్పేది. నేల, బెంచీ టికెట్ ధరలు నా చిన్నప్పుడు పావలా, 40 పైసలు ఉండేవి. రిజర్వ్ టికెట్ ధరలు రూపాయి వరకు ఉండేవి. నేల టికెట్ల అమ్మకానికి ఓ రూలంటూ ఉండేది కాదు. లోపల కిటకిటలాడుతున్నా, ప్రేక్షకులు ఇరుకిరుగ్గా కూర్చున్నా ఇంకా టికెట్లు ఇస్తుండేవారు. ‘నేల ఈనిందంటే ఇదేరా’ అని మా ఫ్రెండ్ కామెంట్ చేస్తుండేవాడు.

నేల , బెంచీ క్లాస్‌ల వరకు తప్పని సరిగా మొగవారికీ, ఆడవారికి మధ్య చెక్కలతో చేసిన అడ్డు గోడలుండేవి.

సరే ఆనాటి సినిమా హాళ్ల గురించి మరిన్ని విషయాలు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ‘పాతాళ భైరవి’ సినిమా సంఘటన దగ్గరకు వెళదాం.

గుంటూరులో ‘పాతాళ భైరవి’ సినిమా చూసి చాలా భయపడ్డాను. నాకు ఊహ తెలిసిన తర్వాత నన్ను బాగా భయపెట్టిన తొలి సినిమా ఇదే. దెయ్యం సినిమాలైనా, మంత్ర తంత్రాలున్న సినిమాలైనా సీన్ చూస్తుండటం కంటే ఆ టైమ్‌లో వచ్చే మ్యూజిక్ నన్ను బాగా భయపెట్టేసేది. ‘పాతాళ భైరవి’ సినిమాలో మాంత్రికుడు ఎస్వీ రంగారావు సీన్లోకి వచ్చినప్పుడల్లా గుండె దడదడ లాడేది. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా కళ్లు మూసేసుకుని, చెవులను రెండు చేతులతో కప్పేసుకుని సీట్‌లో ఓ మూలగా కూర్చోవడం అలవాటైంది.

అలా ‘పాతాళ భైరవి’ చూస్తుంటే ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా, మధ్యలో కరెంట్ పోయింది. సినిమా ఆగిపోయింది. అప్పట్లో కరెంట్ ఆగిపోతే కొన్ని థియేటర్లకు జనరేటర్ సౌకర్యం ఉండేది కాదు. మళ్లీ కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పట్లో చాలా థియేటర్లలో సినిమాలు సింగిల్ ప్రొజెక్టర్‌తో నడిచేవి. దీంతో ఇంటర్వెల్‌కి ముందు ఒకసారి, అలాగే ఇంటర్వెల్ తరువాత మరోసారి కూడా షో ఆగిపోతుండేది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దామని ఓ సారి మా ఫ్రెండ్ గాడిని వెంటేసుకుని ప్రొజెక్టర్ రూమ్‌కి వెళ్ళాము. అక్కడుండే ఆపరేటర్‌ని అడిగితే, మొదట్లో విసుక్కున్నా ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు. సినిమా మొత్తం నాలుగు చక్రాల్లో చుట్టిన రీలు చుట్టలతో థియేటర్‌కి చేరేవి. సింగిల్ ప్రొజెక్టర్ ఉన్నప్పుడు ఒక రీల్ చుట్ట అయిపోగానే దాన్ని తీసి మరొక రీల్ ప్రొజెక్టర్‌లో అతి నేర్పుగా అమర్చాలి. ఈ పని పూర్తి కావడానికి ఓ ఐదారు నిమిషాలు పడుతుంది. డబుల్ ప్రొజెక్టర్ ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక దాంట్లో రీల్ అయిపోగానే రెండోది అందుకుంటుందన్నమాట. అందుకన్న మాట సింగిల్ ప్రొజెక్టర్ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ముందొకసారి,ఇంటర్వెల్ తర్వాత మరోసారి అదనపు బ్రేక్‌లు ఇవ్వాల్సి వచ్చేది. అలా సింగిల్ ప్రొజెక్టర్‌ని దగ్గరగా చూడగలిగాను.

చాలా పెద్దయ్యాక యుకె వెళ్ళినప్పుడు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ సినిమా హాల్‌లో (చూ. 11) బాహుబలి-2 సినిమా చూశాను. థియోటర్ వాళ్లు అలనాటి ప్రొజెక్టర్‌ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. దాన్ని ఎగ్జిబిట్‌గా పెట్టారు. అక్కడో ఫోటో దిగినప్పుడు నా చిన్నప్పుడు చూసిన సింగిల్ ప్రొజెక్టర్, ఆ నాటి సంఘటనలు గుర్తుకొచ్చాయి.

సరే, ‘పాతాళ భైరవి’ సినిమా ఇంటర్వెల్ తర్వాత కరెంట్ లేకపోవడంతో బొమ్మ ఆగిపోయింది. కరెంట్ చాలా సేపటి వరకు రాలేదు. హాళ్లో జనం ఈలలు, కేకలు వేసినా ఏం లాభం లేకపోయింది. ఉక్కబోతతో జనం బయటకు వచ్చేస్తున్నారు. ఓ గంట గడిచింది. అప్పుడొచ్చింది కరెంట్. అప్పటికే సెకండ్ షో చూడటం కోసం జనం వచ్చేస్తున్నారు. సినిమా రెండోసారో మూడో సారో రిలీజ్ అయింది కనుక మొదటి షోకి కూడా జనం పలచగానే ఉన్నారు. దీంతో సెకండ్ షోకి వచ్చిన జనాలకు కూడా టికెట్లు ఇచ్చేసి మొదటి నుంచీ ఆట చూపిస్తామని చెప్పారు. ఆ రోజుల్లో కొన్ని హాళ్లకు జనరేటర్ ఉండేది. కొన్నింటికి ఉండేది కాదు. ఒక వేళ జనరేటర్ ఉన్నా తరచుగా పనిచేయడం మొండికేస్తుండేది. నా ‘పాతాళ భైరవి’ సినిమాకు ఏదో అలాంటి ఇబ్బందే వచ్చినట్లుంది.

కరెంట్ వచ్చేసింది కనుక సెకండ్ షో వాళ్లనూ లోపలకి తోలేయడంతో వారి మధ్య కూర్చుని నేను మళ్ళీ మొదటి నుంచి ఆట చూశాను. టైటిల్స్ పడ్డాయి. రాజకుమార్తె తోట రాముడి ప్రేమలో పడింది. ఆ తర్వాత మాంత్రికుడు తెర మీదకు వచ్చేశాడు. మ్యూజిక్ భయపెట్టేస్తుందనే అనుకున్నా. కానీ ఈ సారి అలవాటైపోయింది. భయపడలేదు. చాలా రిలాక్స్‌డ్‌గా చూశాను. అప్పుడనిపించింది, భయం అన్నది విషయం తెలియనంత వరకే ఉంటుంది. లాజిక్ తెలిస్తే భయం గాయబ్. ఈ సూత్రం జీవితమంతా గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను.

దెయ్యాలను పిలిచే బోర్డ్ Ouija:

ఒంట్లో భయం తగ్గి హేతువు కనుక్కునే రోజుల్లోనే దెయ్యాలను పిలిచే బోర్డ్ గురించి తెలిసింది.

మనకు బాగా కావలసిన వాళ్లు చనిపోతే వాళ్ల ఆత్మలు మన చుట్టూనే అంటే మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయట. మన మంచి కోరే ఆత్మలను పిలిచినా అవి మనల్ని ఏమీ చేయవనీ అలా పిలవడానికి ఓ సింపుల్ టెక్నిక్ ఉందని ఓ ప్రెండ్ చెప్పాడు. వాడి కబుర్లు చాలా ఆసక్తిగా విన్న నేను మరో ఫ్రెండ్ సాయం తీసుకుని దెయ్యాలను పిలిచి వాటితో మాట్లాడే బోర్డ్ ఒకటి తయారు చేశాము. ఆ బోర్డుని Ouija అంటారనీ, దాని చుట్టూ బోలెడు పరిశోధనలు జరిగాయని అప్పట్లో నాకు తెలియదు. ఈ బోర్డుని బయట నుంచి కొనుక్కోవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అసలు ఈ బోర్డు ఎందుకని వాడ్ని అడిగాను. అప్పుడు వాడు చాలా తెలివైన వాడిగా ఫోజు పెట్టి చాలా సంగతులు చెప్పేశాడు.

“ఒరేయ్, దెయ్యాలు మాట్లాడవురా, అలాగే అవి సినిమాల్లో చూపించినట్లుగా కనబడవు. అసలు వాటికి శరీరం ఉండదు. శరీరమే లేకపోతే తెల్లటి చీర కట్టుకోవడం, చేతిలో కొవ్వొత్తి పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందిరా. ఆలోచించు. సినిమా వాళ్లు చూపించేదంటా ట్రాష్. నిజం ఏమిటంటే దెయ్యాలున్నాయి. కాకపోతే అవి సినిమా దెయ్యాలు కావు. దెయ్యాల్లో మంచివీ ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. మనం మంచి దెయ్యాలను పిలిస్తే మనకేమీ కాదు. నేను అలా మంచి దెయ్యాలతో మాట్లాడాను తెలుసా..”

ఇలా వాడు చెప్పుకుపోతుంటే నాకు బోలెడు ఆశ్చర్యం వేసేది. వాడప్పుడు మహా ధైర్యస్థుడిలా కనబడేవాడు. ‘పాతాళ భైరవి’ మాంత్రికుడి కంటే మహా మంచి వాడిగా కనబడేవాడు. ఇంకా వాడిలా చెప్పాడు..

“ఒరే, నీకు దెయ్యాలతో మాట్లాడాలని ఉంటే చెప్పు. చాలా ఈజీరా. ఈ మధ్య కాలంలో మన ఇంట్లోనే చనిపోయిన వాళ్లను తలచుకుంటూ పిలిస్తే వాళ్లు వస్తారు, మనతో మాట్లాడతారు, మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. పైగా మన భవిష్యత్తు చెబుతారు..” అంటూ చెప్పాడు వాడు.

ఇదేదో బాగుంది అనుకున్నాను. వాడితో కలిసి దెయ్యాలను ఆవాహన చేసే బోర్డు తయారు చేశాము. ఆ బోర్డు తయారు చేయడం చాలా సింపుల్.

ఒక అట్ట తీసుకున్నాము. దాని మీద ఓ తెల్ల కాగితం అంటించాము. ఆ కాగితం మీద వృత్తాకారంలో ఇంగ్లీష్‌లో లెటర్స్ అంటే A to Z పెన్నుతో రాశాము. మధ్యలో ఓ చిన్న వృత్తం చుట్టాము. దానికి ఒక వైపు YES అని మరో వైపు NO అని రాశాము. ఈ రెండు వృత్తాలకు మధ్యన నెంబర్స్ సున్నా నుంచి పది వరకు అంకెలు వేశాము. ఆ బోర్డు మీదనే ఒక చోట తూర్పు, పడమర అంటూ దిక్కుల పేర్లు రాశాము. చివర్లో ఆ బోర్డు క్రిందనే ‘గుడ్ బై’ అంటూ రాశాము.

అలా తయారైన బోర్డ్‌ని ఇంట్లోకి తీసుకొచ్చాము. ఇంట్లో వాళ్లు ఏమిటిదని ఆశ్చర్యంగా అడగడం, మేము చాలా గొప్ప వాళ్లమన్నట్లు బిల్డప్ ఇచ్చి దాని గురించి చెప్పడం, వాళ్లు కసురుకోవడం చకచకా జరిగిపోయాయి. అయినా మా ప్రయత్నం మానుకోలేదు. ఎవ్వరూ చూడకుండా వాడూ నేనూ ఇంట్లోనే ఓ మూలగా కుర్చీలు వేసుకుని కూర్చుని మధ్యలో చిన్న బల్ల మీద ఈ బోర్డు పెట్టుకుని దెయ్యాలను పిలిచే ఆట ప్రారంభించాము. విక్స్ డబ్బా మూత తీసుకున్నాము. దానిపై మా చూపుడు వేళ్లు సుతారంగా ఆనించి మంచి దెయ్యాలను ఆవహన చేయడం మొదలెట్టాము.

చిత్రం.. నేను ఊహించలేదు. అనుకోకుండా నా ప్రేమేయం లేకుండానే విక్స్ మూత కదలడం మొదలుపెట్టింది. ఫ్రెండ్ గాడేమో వెంటనే – “ఎవరు నీవు?” అని అడిగాడు. నేనేమో ఉత్కంఠతో “బామ్మవా..?” అన్నాను. చిత్రంగా మూత కదులుతూ ‘ఎస్’ అన్న అక్షరాలు రాసిన వైపు కదిలింది.

“సక్సెస్” అన్నాడు ఫ్రెండ్ గాడు. ఇంట్లో వాళ్లకు తెలిసాక కొంత మంది మా పార్టీలో చేరారు. ఇక బామ్మ అనబడే ఆ దెయ్యాన్ని ప్రశ్నలు వేయడం, సమాధానాల కోసం విక్స్ మూత కదలుతుండటం ఇదంతా బోలెడు ఆశ్చర్యాన్ని కలిగించింది.

భయం గుట్టు విప్పే సైన్స్:

చీకటి- భయం అయితే వెలుతురన్నది- సైన్స్. హేతువు తెలిస్తే భయం పారిపోతుంది. ఇప్పటి దాకా భయపెట్టిన సంఘటనల వెనుక వాస్తవ కోణాలు వెలుగు చూడగానే పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది. మ్యాజిక్ షోలో టెక్నిక్ తెలియనంత వరకే ఆశ్చర్యం. తెలిస్తే ఓస్, ఇంతేనా.. దీనికేనా అంతగా ఆశ్చర్యపోయింది అని అనుకుంటాము. దెయ్యాలను పిలిచే బోర్డ్ విషయంలోనూ అంతే. లాజిక్ ఆలోచిస్తే, చనిపోయిన మా బామ్మకు ఇంగ్లీష్ రాదు. అలాంటప్పుడు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాల కోసం వాడిన మూతను ఎస్ -నో అన్న పదాల వైపు ఎలా కదిలించింది| తర్వాత కాలంలో జాగ్రత్తగా ఆలోచిస్తే మూత మీద వేసిన చేతి వేళ్లు వారికి తెలియకుండానే వారి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాల వైపు వారే కదిలిస్తుంటారని అర్థమైంది. ఇది మైండ్ చేసే డ్రామా. ఏ దెయ్యమో సమాధానాలు చెప్పడం లేదు. మనలోని ఆలోచనలే ఆ పని చేయిస్తున్నాయి. అసంకల్పితంగా మనమే మూతను కదిలిస్తున్నామని తెలిసింది. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని వారు నేటికీ ఈ బోర్డుని విశ్వసిస్తున్నారు. ఇంకొంత మంది దీన్నో కాలక్షేపం ఆటగా భావిస్తున్నారు.

మొదట్లో ప్రస్తావించిన మఱ్ఱి చెట్టు క్రింద శవం సంఘటన , ఆకాశంలో శవయాత్ర, ఓ స్త్ర్తీ రేపు రా సంఘటనలు – వీటన్నింటిలో లాజిక్ ఉంటుంది. అది తెలిస్తే భయం పోతుంది. బోటనీ సబ్జెక్ట్ వీరోచితంగా చదువుతున్న రోజుల్లో ఒక విషయం అర్థమైంది. పెద్ద పెద్ద చెట్ల క్రింద రాత్రి పూట పడుకుంటే ఊపిరి అందదు. నిద్ర పట్టినా ఎవరో గొంతు నులిపేస్తున్నారన్న భయం ఆవహిస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోవచ్చు. ఇదేదో ఆ చెట్టు మీద ఉన్న దెయ్యం చేయడం లేదు. ఆ చెట్టుకున్న సహజ లక్షణమే ఆ పని చేస్తున్నది. ఆశ్చర్యంగానే అనిపించవచ్చు.

చెట్టు జీవక్రియలు – లాజిక్:

ప్రతి చెట్టు మనలాగానే శ్వాస పీల్చుస్తుంటాయి. అంటే అచ్చు మనలాగానే ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డై ఆక్సైడ్ వదిలిపెడుతుంటాయి. అలాగే పగటి పూట సూర్యరశ్మి సాయంతో మొక్కలు, చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకుంటూ శక్తిని సంపాదించుకుంటాయి. దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. రాత్రి కాగానే సూర్యరశ్మి ఉండదు కనుక ఈ ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మిగిలే జీవ లక్షణమల్లా శ్వాసక్రియ మాత్రమే. ఈ కారణంగా పగటి పూట కంటే రాత్రి పూట చెట్ల దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడ పడుకున్న వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాలి మరీ ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మఱ్ఱిచెట్టు క్రింద లేదా పెద్ద చెట్ల క్రింద రాత్రి పూట పడుకుంటే, ఆ సమయంలో సరిగా గాలి వీచకపోతే శ్వాస ఆగియే ప్రమాదం ఉండవచ్చు. ఈ కారణంగానే భయాలు వ్యాపించాయి. నిజం తెలిస్తే దెయ్యం భయం ఇట్టే మాయమవుతుంది.

అలాగే, అర్ధరాత్రి ఆకాశంలో శవం కనబడటం వెనుక కూడా లాజిక్ ఉంది. మేఘాలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. వాటిని తదేకంగా చూస్తున్నప్పుడు మన ఆలోచనలకు తగ్గట్టుగా అవి కనబడవచ్చు. ఎవరికో ఆకాశంలో మంచం, దాని మీద శవం, నలుగురు మోసుకెళుతున్నట్లు ఆకారాలు కనబడి ఉండవచ్చు. అలాంటి వాడు చేసిన ప్రచారంతో ఇదో పెద్ద సంచలనం సృష్టించి ఉండవచ్చు.

ఓ స్త్రీ రేపు రా సంఘటన అంతా బూటకం. జనంలోని భయాన్ని క్యాష్ చేసుకునే వారు వేసే ఎత్తుగడల ప్రభావం ఇదంతా.

భయం చీకటి లాంటిదైతే జ్ఞానం వెలుతురు వంటిది. జ్ఞానం పెంచుకుంటే మూఢ నమ్మకాలు తొలిగిపోతాయి. ఈ రకంగా ఆలోచించే అవకాశం సైన్స్ సబ్జెక్ట్ నాకు అందించింది.

భయపడుతూ జీవిస్తుంటే ఎప్పటికీ ఏదో నీడలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అదే ధైర్యంగా ముందుకు సాగిపోతుంటే భయం పారిపోతుంది. జీవన యాత్రలో భయం ఒక చీకటి అధ్యాయం.

ఫుట్ నోట్స్:

10. బుంగ: బావి లోంచి నీళ్లు తోడుకునే ఒక రకం పాత్ర. బకెట్ లా కాకుండా బిందె లా ఉంటుంది. బుంగ మెడకి తాడుని ఉరి తాడులాగా బిగించి దాన్ని బావిలోకి వదులుతారు. అప్పట్లో చాలా మంది ఇళ్లలో బావులకు చుట్టూ చెప్టాలు (నిలబడి నీళ్లు తోడుకునే ప్రదేశం), గిలకలు (దీని సాయంతో సునాయాసంగా నీళ్లు తోడుకోవచ్చు) ఉండేవి కావు. చప్టాలు లేని బావుల పైన బాగా ఎండిన ఓ తాటి కాండం వేసేవారు. ఒక కాలు బయట, మరో కాలు ఈ తాటి మొద్దు మీద వేసి కాళ్ల పంగజాపి రెండు చేతులతో బుంగని దింపి చకచకా నీళ్లు తోడేవారు. ఇదో ఆర్ట్.

11. వందేళ్లనాటి సినిమా హాల్:

నేను 2017లో ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు అక్కడ వందేళ్లనాటి సినిమా హాల్‌ని చూడటం తటస్థించింది. ఆ వివరాలు ఇప్పుడు చెబుతాను.

భారతీయ సినిమా చరిత్రను తిరగ రాసిన బాహుబలి-2 సినిమాని UKలోని చారిత్రాత్మక సినిమాహాల్లో (105 ఏళ్ళనాటి) చూడటం నాకు కలిగిన ఓ చక్కటి అనుభవం. Elland లోని Rex Cinema థియేటర్ని 1912లో నిర్మించారు. అప్పటికి అంటే 1912 నాటికి భారతీయ సినిమా ఇంకా పురుడుపోసుకోలేదు. 2012లో శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్న Rex cinema థియేటర్ అనేక మరమ్మతులకు నోచుకున్నా బయటి రూపురేఖల్ని ఏమాత్రం మార్చకుండా అలాగే ఉంచడం విశేషం.

1937లో తెలుగు సినిమా (‘భక్త ప్రహ్లాద’తో) అవతరించగా 1913లో ఇండియన్ మూకీ సినిమా రూపుదాల్చింది.

ఇక ఈ హాల్ ప్రాంగణంలో 1930నాటి ప్రొజెక్టర్‌ని ఎగ్జిబిట్ చేశారు. హాల్ లోపల తెర (స్టేజ్) క్రింద Conn 651 Organ (మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్) ఉంచారు. ప్రతినెలా మూడవ ఆదివారం స్టేజ్ ప్రదర్శనలు (ప్రధానంగా నృత్య, సంగీత రూపకాల్లాంటివి) నిర్వహిస్తుంటారని తెలిసింది.

పూర్వం మూకీలు నడుస్తున్నప్పుడు కొంతమంది గాత్రధారులు, వాయిద్యకారులు తెర దిగువున నిలబడి ప్రదర్శితమవుతున్న మూకీ చిత్రకధకు తగ్గట్టు డైలాగులు, నేపధ్య సంగీతాన్ని వినిపించేవారట. Conn 651 Organ – పెద్ద మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని తెర క్రింద చూడగానే ఏదో బుక్‌లో చదివిన ఈ విషయాలు గుర్తుకొచ్చాయి.

105 సంవత్సరాల చరితగలిగిన Rex థియేటర్‌లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిస్‌ప్లేలో ఉంచిన పేపర్ కటింగ్స్, ఫోటోలు చూస్తుంటే పాతకట్టడాలకు వీరిస్తున్న గౌరవం, వాటిని కాపాడుకోవాలన్న తపన కళ్ళకుగట్టినట్లు కనిపించింది. హాట్సాఫ్.

తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచిన బాహుబలి-2 ఈ శతాబ్ది థియేటర్‌లో చూడగలగడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇంటర్వెల్‌లో అలనాటి ప్రొజెక్టర్ చూసినప్పుడు నా చిన్నతనంలో ఓ హాల్‌లో చూసిన ప్రొజెక్టర్ గుర్తుకు వచ్చింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here