ట్విన్ సిటీస్ సింగర్స్-11: ‘పాట నా శ్వాస.. పాట నా భాష!’ – శ్రీ అంజి తాడూరి -1వ భాగం

0
7

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – 12 గంటల నిర్విరామ సినీ సోలో పాటలు పాడి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో సంచలన గాయకునిగా తన పేరు నమోదు చేసుకున్న శ్రీ అంజి తాడూరి గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

’12 గంటల నిర్విరామ సినీ సోలో పాటలు పాడి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో సంచలన గాయకుని గా తన పేరు నమోదు చేసుకున్న యువ గాయకులు శ్రీ అంజి తాడూరి! వినసొంపైన మధుర గాత్రం. ఘంటసాల, బాలు గారు పాడిన క్లిష్టమైన గీతాలను సైతం అలవోకగా ఆలపించగల టాలెంటెడ్ సింగర్. కర్నాటక సంగీతం పట్ల అవగాహన కలిగి వుంటం వల్ల – స్వరాలతో కూర్చిన గీతాలను ఎంచుకుని గానించడం ఈ గాయకుని ప్రత్యేకత. ‘నా పాట పంచామృతం’, హాయి హాయిగా ఆమని సాగే, శివ శంకరి.. వంటి గీతాలను ఆలపించి పలువురి సంగీత ప్రతిభావంతుల చేత శభాష్ అనిపించుకున్న ప్రజ్ఞావంతుడు ఈ గాయకుడు. వుండేది నల్గొండ. అయినా ‘ఎంతెంత దూరాలైనా ప్రయాణించి వెళ్తాను పాట కోసం’ అని అంటారు. ‘పాట అంటే నాకు ప్రాణం. పిచ్చి ప్రేమ. అమ్మతో మాట్లాడకుండా అయినా వుండగలను కానీ, పాటని ఆలపించకుండా మాతం బ్రతకలేను..’ అని అంటారు ఈ సంగీత కళారాధకుడు. ‘స్వర శిఖర’, ‘స్వర గంధర్వ ‘ బిరుదులను కైవసం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ సింగర్ – అంజి తాడూరి గారితో జరిపిన ఇంటర్వ్యూ ఇదిగో చదవండి.

***

♣ హలోండీ అంజి గారు!

* నమస్తే మేడం!

♣ ముందుగా అభినందనలు తెలియచేస్తున్నానండి. 12 గంటల పాటు నిర్విరామంగా సోలోస్ పాడి, ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో ఒక రికార్డ్ సృష్టించినందుకు!

* థాంక్యూ మేడం. (సంతోషం తో వెలిగిపోతున్న వదనంతో.. చెప్పారు)

♣ ఈ సాహసం ఎలా సాధ్యమైంది మీకు? స్ఫూర్తి ఏమిటి?

* నిజంగానే సాహసోపేతమైన నిర్ణయమేనండి. ఇంత వరకు ఎవరూ స్పృశించని ఒక నూతన సంగీత ప్రక్రియతో రికార్డు నెలకొల్పాలనే ఆలోచనతో ఈ ’12 గంటల నిర్విరామ సినీ సోలో సంగీత విభావరి’ ప్రదర్శనా కార్యక్రమాన్ని తలపెట్టాను. అలా, ఒక రికార్డుని క్రియేట్ చెయ్యాలనుకున్నాను. చేసాను. నిజంగానే ఇదొక సాహసోపేత నిర్ణయం. దేవుని ఆశీస్సులతో విజయాన్ని సాధించానని చెప్పాలి.

♣ ఎన్ని పాటలు పాడారు ఆనాటి రికార్డ్ నెలకొన్న కార్యక్రమంలో?

* 12 గంటల్లో 118 పాటలు పాడాను. అలా పాడటం ఒక రికార్డ్.

♣ వరసగా ఎక్కడా ఆగకుండా పాడారా?

♣ అవునండి. ఎక్కడా విరామం లేదు. 12 గంటలూ పాడుతూనే ఉన్నాను.

♣ ప్రోగ్రాంకి ఎవరెవరు విచ్చేసారు?

* ఆ రోజు ప్రోగ్రాంకు వచ్చిన వారిలో పెద్దలు గౌరవనీయులు శ్రీ వంశీ రామరాజు గారు ప్రముఖులు. అలాగే, లయన్స్ విజయ్ కుమార్ గారు, త్రినాధ రావు గారు, శంకరం వేదిక అద్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు.

సరస్వతీ ఉపాసకులు శ్రీ దైవజ్ఞశర్మ గారు.. రాధాకృష్ణ గొల్ల గారు, – ఇంకా చాలా మంది ప్రముఖులు విచ్చేశారు. తమ హర్షాన్ని తెలియచేసారు. అలానే, నన్ను అమితంగా అభిమానించే వాళ్ళు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సభ కిట కిటలాదింది. మా నల్గొండ వాసులు ప్రేమతో వచ్చి ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

♣మీరు పుట్టిపెరిగింది నల్గొండ కదూ?

* అవునండి. వుంటోంది కూడా నల్గొండలోనే.

♣ నల్గొండనించి హైదరాబాద్ కి తరచూ వచ్చి ప్రోగ్రాంస్ చేయడం అంటే కష్టమేమో కదూ?

* అవునండి. చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయమే. కానీ నాకు పాట అంటే పిచ్చి.. ఎంత పిచ్చి అంటే.. పాట కోసం సముద్రాన్ని ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్లమన్నా వెళతాను.. అంత పిచ్చి ప్రేమ. పాటను ప్రేమించినంత స్థాయిలోనేను ప్రేమించేది ఇంకేదీ లెదు ఈ విశ్వంలో! ( ఉద్వేగంతో కావొచ్చు, కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి..)

♣ యువ గాయకుడు అంజి గారి గురించి మీ మాటల్లోనే తెలుసుకోవాలనుంది.

* తప్పకుండానండి. నా పేరు అంజి తాడూరి. మా అమ్మానాన్నలు – శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ స్వామి గారు. మాది శోభనాద్రిపురం. గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. చుట్టూ పచ్చని పంట పొలాలు. నిరంతరం సరిగమలు పాడుకుంటుంటూ, సెలయేళ్లు, గలగలగలు. ఆప్యాయంగా పలకరిస్తూ, మా వూరి మంచి మనుషుల మధ్య కలిసి జీవించడం అదృష్టంగా భావిస్తాను. అందమైన ప్రేమానుబంధాలకు పెట్టిన పేరు మా ఊరు. మా శోభనాద్రిపురం. మా కుటుంబంలో మేము నలుగురం. అక్క, నేను, తమ్ముడు. చెల్లి.. మాది మధ్య తరగతి కంటే కూడా ఒక మెట్టు కిందే అనుకోండి.

అమ్మ నాన్నలు కష్టజీవులు. అయినా, మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. మనీ కంటేనూ మంచితనానికే విలువనివ్వడం నేర్పారు. వాళ్ళకి నా మీద ఆశలున్నాయి. కలలూ వున్నాయి. వాళ్ల కల నెరవేరుస్తూ ఏదో ఒక రోజూ గొప్ప గాయకుణ్ణి కావాలని కృషి చేస్తున్నాను. ఎంత వరకు నా ఆశయాన్ని నేను చేరుకుంటానో అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న!

♣ ఎప్పట్నించి పాటలు పాడుతున్నారు?

* నాకు పాటలు పాడాలని ఆలోచనా కాలంతో పాటు మధ్యలో వచ్చింది కాదు. నా చిన్నతనం నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టంగా పాటలు పాడే అలవాటు ఉండేది. మా నాన్నగారు ప్రతి రోజూ రేడియోలో పాటలు వింటూ పని చేసేవారు. అలా నేనూ, ప్రసారమయ్యే ప్రతి పాటను శ్రద్ద గా వినేవాడిని. విన్న పాటలను తిరిగి పాడుకుంటూ.. అలా ప్రాక్టీస్ చేసుకునేవాడిని.

♣ మిమ్మల్ని ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారు?

* అందరూ ప్రోత్సహించారు అనే చెప్పాలి. నా చిన్నతనంలో నా చుట్టుపక్కల వాళ్ళు నా పాటలు వింటూ మురిసిపోయే వాళ్ళు. చదువుకునే రోజుల్లో శ్రీనివాస్ అనే మా గురువు గారు, అలాగే నా మిత్రుడు బి. శ్రీనివాస్ నన్ను అమితంగా అబిమానించి ఆదరించారని చెప్పాలి. వాళ్ళు పది మందికీ నా పేరుని చేర వేసారు. అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నా. సుందరాకాండలో పాటలను పాడించుకునేవారు. ఆ తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా ఉండేది. నాకు మంచి భవిష్యత్ ఉందని అంటూ ప్రశంసలు కురిపించేవారు. అలా అందరూ నన్ను పొగుడుతుంటే, మా నాన్నగారు చాలా ఆనందించేవారు. మా అమ్మగారు మాత్రం భయపడేది. ఎందుకంటే తన బిడ్డకి దృష్టి తగులుతుందేమో, ఓర్వలేక ఎవరైనా ఏదైనా ఆపద కలిగిస్తారేమో అనే భయంలో ఉండేది. సహజంగా గ్రామీణ ప్రాంతాల వారిలో ఇలాటి భయాలు, నమ్మకాలు సహజంగా ఎక్కువ గానే వుంటాయి.

♣ ఇప్పుడు కూడా భయపడుతుంటారా? మీకు దిష్టి తగులుతుందని? (నవ్వులు)

* ఆ భయం అమ్మలో ఇంకా అలానే ఉంది. ఎంతైనా అమ్మ కదా!

♣ నిజమేనండి. దేశానికి రాజు అయినా, తల్లికి మాత్రం బిడ్డే కదా! అంజి గారు! ఇప్పటి దాకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు?

* బయట ఇచ్చిన ప్రదర్శనలు దాదాపు రెండు వేలకు పైనే వుంటాయి మేడం.

♣ రెండు వేలా? బాప్ రే…

* అవునండి. వివాహాది ఇతర శుభకార్యాలలో జరుపుకునే ఈవెంట్స్ చేస్తుంటా. సింగర్‌గా కూడా నాకు చాలా అవకాశాలు వస్తుంటాయి. ఇది నా స్వప్నం అని చెప్పాలి. వృత్తిరీత్యా గాయకుడు గానే ఉంటూ బ్రతకాలి అనేది నా జీవిత ధ్యేయం. అది దృష్టిలో పెట్టుకుని నేనొక సాంస్కృతిక సంస్థను ప్రారంభించాను. అదే – ‘స్వరమాధురి మ్యూజికల్ ఈవెంట్స్’.. మరియు ‘స్వర మాధురి సాంస్కృతిక సేవా సంస్థ.’ ప్రపంచ రికార్డులు పొందిన వేదిక శ్రీ త్యాగరాయ గాన సభ యందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పలువురి ప్రముఖుల మన్ననలు పొందుతున్నాం. మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ గాయకుడిగా నా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాను.

♣ ప్రొఫెషనల్ సింగర్‌గా చెప్పండి. మీరు అందుకుంటున్న పారితోషికం మీకు సంతృప్తినిస్తోందా?

* లేదండి. ఎన్ని ప్రోగ్రాములు చేసినా, కేవలం బ్రతకడానికి సరిపోయేంత మాత్రమే దొరుకుతోంది. గుర్తింపు వున్న మాట వాస్తవమే కానీ, నేను చేరుకోవాల్సిన స్థానం మాత్రం ఇది కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. నా స్వప్నం వేరు. నా ఆశయ సిధ్ధి కోసం వేచి చూస్తున్నాను. ఇంకా ఇంకా ఎదగాలని తపిస్తున్నాను.

♣ ఎదగడానికి ఎలాటి కృషి చేస్తున్నారు?

* ఎదగాలంటే, అవకాశాల కోసం తిరగాలి. పెద్ద పెద్ద వాళ్ల చుట్టూ… తిరగాలి. ఒకసారి కాదు… మళ్లా మళ్ళా వెళ్ళి కలుస్తుండాలి. అందుకు సహనం కావాలి. ఓర్పు వహించాలి అవకాశం వచ్చేదాకా! టాలెంట్ తప్పని సరిగా వుండాలి. ఈ మూడూ నాకున్నాయి. ఎంతైనా భరించగలను. కానీ, సంసార బాధ్యతలున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అవసరాలు, నన్ను వెనక్కి లాగుతున్నాయి. ఏదో సాధించి తీరాలన్న తపనేమో ముందుకు తోస్తోంది. అటు ఆశయం ఇటు అవసరం, అటు హృదయం ఇటు ఆర్ధికావసరం.. ఈ రెంటి నట్ట నడుమా నిత్యం ఘర్షణే. నిజం చెప్పాలంటే పరిస్థితులతో యుద్ధం చేస్తున్నా. నేను ధనవంతుణ్ణి అయితే, బ్రతుకంతా ప్రతి క్షణమూ పాడుకుంటూ.. పాటలు నేర్చుకుంటూ బ్రతికేద్దును కదా అని ఆశగా అనుకుంటుంటాను. కానీ నాకు అలాటి అవకాశం లేదు.

♣ మీరేం చేస్తుంటారు?

* ఒకప్పుడు బాగా బ్రతికిన వాణ్ణి. వెహికల్స్ వుండేవి. వ్యాపారం అంతా సజావుగానే సాగిపోతోందని అనుకున్నంతలో పరిస్థితులు తారుమారైపోయాయి. బిజినెస్‌లో తట్టుకోలేని నష్టం వచ్చింది. ఋణ భారం మోయలేనంతగా పెరిగింది. అప్పులు తీర్చడం నా వల్ల కాలేదు. కష్టాలు చీకట్లు కమ్మి, మనిషిని ఎలా చుట్టుకుంటాయో అనుభవంలో తెలిసింది. ఇక నా పని అయిపోయింది. నా ప్రాణమైన పాటకి దూరమైపోయాక, బ్రతుకు బ్రతికీ ఎందుకు అనిపించింది. అప్పుడు నా భుజం తట్టి, ధైర్యం చెప్పి, నన్ను బ్రతికించింది – ఒకే ఒక్క వ్యక్తి… నా భార్య శైలజ. నీకు నేనున్నా, అని భరోసా ఇచ్చిన ఏకైక నేస్తం ఆమె. నా నిజ జీవితంలో – సినిమాలో హీరో కష్టాలనుభవించానని చెప్పాలి. అప్పులు తీర్చి ఒడ్డున పడటం కోసం నేను ఆటో నడపడానికి నిశ్చయించుకున్నాను. పరువు ప్రెస్టేజీల కంటే, ఎక్కడి అప్పులు అక్కడ తీర్చి, ఎవరికీ పైసా బాకీ లేకుండా బయటపడాలన్నది నా ధ్యేయం. అలాటి పరిస్థితుల్లో ఒక లక్ష అప్పుచేసి, ఆటో కొని, జీవితాన్ని తాజాగా పునః ప్రారంభించాను. నాలుగేళ్లల్లో అప్పులన్నీ కట్టేసాను.

♣ మరి సంగీత సాధన?

* మా గురువు గారు శ్రీ పురుషోత్తమాచార్యులు గారి దగ్గర కెళ్ళి, సంగీతం నేర్చుకుంటూ, స్వరాలను ప్రాక్టీస్ చేస్తుండేవాణ్ణి. ఎలా అంటే ఆటో నడుపుతూనే! పగలంతా ఆటో నడుపుతూ, సాయంకాలాలేమో గురువు గారి దగ్గరకెళ్ళి సంగీతం నేర్చుకుంటూ, ఆ నొటేషన్ కాగితాన్ని ఆటోలో నా ఎదురుగా వున్న స్పాంజ్ ముక్కకి గుండు సూదితో గుచ్చి, అలా సంగీత పాఠాలన్నీ సాధన చేసేవాణ్ణి. అంత పిచ్చి నాకు సంగీతమంటే. అలా మెల్ల మెల్లగా నా పాటల ప్రపంచానికి తిరిగి దగ్గర గా వచ్చేసాను. నా అదృష్టం ఏమిటంటే, మా గురువు గారి ఆశీస్సులు నాకు లభించడం. వారి దగ్గర నాకు కలిగిన పరిచయాలు, స్నేహాలు, విలువైన వారి సలహాలు అందుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అలా రీ ఎంట్రీ జరిగింది. ఈ రీ ఎంట్రీ మొదలైంది. ఈ మలుపులో నాకు చేయూతనిచ్చి, గాయకునిగా వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం కేవలం శ్రీమతి పావని గారు మాత్రమే! పాట పట్ల నాకున్న అంకిత భావాన్ని ఆమె గుర్తించారు. వారు నిర్వహించే ఎన్నో కార్యక్రమాలలో నాకు ప్రధాన గాయకునిగా అవకాశాలను కలిగించారు.

అంజి తాడూరి- Cell: 9640215297, 8919421720

(ఇంటర్ వ్యూ రెండో భాగం వచ్చే సంచికలో…)

***

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here