ట్విన్ సిటీస్ సింగర్స్-12: ‘పాటకి పూర్తి న్యాయం జరగాలంటే గాయకునికి శాస్త్రీయ సంగీతం తెలిసి వుండాలి!’ – శ్రీ మంథా వేంకట రమణ మూర్తి

1
6

ట్విన్ సిటీస్ సింగర్స్-12: ‘పాటకి పూర్తి న్యాయం జరగాలంటే గాయకునికి శాస్త్రీయ సంగీతం తెలిసి వుండాలి!’ – శ్రీ మంథా వేంకట రమణ మూర్తి

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – పాట అంటే స్వచ్ఛమైన ఆరాధన కలిగి ఉండి, శ్రుతి, లయ, తాళ భావ జ్ఞానమెరిగి గీతాన్ని ఆలపించాలనేదే స్పష్టమైన సిద్ధాంతం ఉన్న శ్రీ మంథా వేంకట రమణ మూర్తి గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

[dropcap]’ర[/dropcap]మణ పాటలు బాగా పాడతాడు’ అనే మా వాళ్ళ ప్రోత్సాహంతో గాయకుణ్ణి అయ్యాను. వేదికల మీద అనేక పాటలు పాడి, ప్రేక్షకుల గుర్తింపునీ, ప్రశంసలనీ, సన్మానాలని, అవార్డ్స్‌ని అందుకున్నా! అయినా, మనసులో ఏదో తెలీని వెలితి. ఒక అసంతృప్తి నన్ను వెంటాడసాగింది. ప్రొఫెషనల్ సింగర్స్‌లా ఎందుకు పాడలేకపోతున్నాను? నా పాటని ఎలా మెరుగులు దిద్దుకోవాలి? అనే అన్వేషణ మొదలుపెట్టాను. సినీ సంగీతంలో నిష్ణాతుణ్ణి కావాలనే ఆశయంతో నా ఈ ప్రయాణంలో ఒక కొత్త మజిలీ మొదలైంది. అది ఎలా అంటే…’ అని చెబుతున్న గాయకులు – శ్రీ మంథా వేంకట రమణ మూర్తి గారు వృత్తి రీత్యా ప్రస్తుతం దామరచర్లలో నివసిస్తున్నారు. ‘యాదాద్రి థెర్మల్ పవర్ స్టేషన్ – ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సివిల్‌గా ఉన్నత పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రూపకల్పన, నిర్మాణం, వినియోగం నించి – రాగం, తానం, పల్లవి వైపు మనసు ప్రవహించడం తనకూ చిత్రం గానే తోస్తుందంటారు. భేషజాలెరుగని మనిషి. అందరితో కలివిడిగా కలిసిపోతూ, హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ వుంటారు. స్థాయీ భేదాలకు అసలు తావీయని సంస్కారం ఆయన సొంతం.

ఇక పాట మాటకొస్తే – చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా పాటని ప్రెజెంట్ చేయాలంటారు. వేదిక మీద పాడేటప్పుడు మరింత నిబద్ధతతో కూడిన డిసిప్లెయిన్ గాయకునికి చాలా అవసరమంటారు. అనడమే కాదు, ఆచరణలో కూడా ముందుటారు. మైకు ముందు పాట పాడుతున్నప్పుడు దృష్టి, ఏకాగ్రత అంతా పాట మీదే కేంద్రీకృతమై వుంటుంది. తనకంటే తన సహ గాయని పెర్ఫార్మెన్స్ బావుంటే వెంటనే స్పందిస్తారు. ‘ఆ గమకం ఎంత బాగా వేసారండి! నాకు కుదరలేదు కానీ..’ అంటూ మనఃస్ఫూర్తిగా మెచ్చుకునే సంస్కారం ఈ గాయకునికి సొంతం.

‘తనని తాను విమర్శించుకునే ఏ కళాకారుడు కానీండీ, ఏ రంగంలో వున్నా రాణిస్తాడు’ – అనే కొటేషన్‌కి అచ్చమైన అర్థం – శ్రీ మంథా వేంకట రమణ మూర్తి గారు అని పలువురి ప్రశంసలు పొందిన గాయకులు!

రమణ మూర్తి గారికి పాట అంటే స్వచ్ఛమైన ఆరాధన. శ్రుతి, లయ, తాళ భావ జ్ఞానమెరిగి గీతాన్ని ఆలపించాలనేదే స్పష్టమైన సిద్ధాంతం. ప్రేమకు ఎల్లలు లేనట్టే గాయకులకూ వయో పరిమితి వుండదంటూ నవ్వేస్తున్న రమణ మూర్తి గారితో జరిపిన సంభాషణ ఇలా.. ఆసక్తికరంగా సాగింది.

***

♣ నమస్తే రమణ మూర్తి గారు!

* నమస్కారమండి దమయంతి గారు!

♣ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఇంత బిజీగా వుంటూ కూడా మీరు ఇన్నేసి పాటలు నేర్చుకోడానికి సమయం ఎలా దొరుకుతోంది?

* అందుకే ఇంత ఆలస్యమైంది.. వేదిక మీదకి రావడానికి (నవ్వులు). అంతకు ముందు లోయర్ జురాల హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా వున్నప్పుడు క్షణం తీరిక దొరికేది కాదు. చాలా బిజీగా వుండేవాణ్ణి. పాటలంటే ఎంత మక్కువ వున్నా, దూరం కావాల్సి వచ్చింది.

♣ మరి పాటకి ఎలా దగ్గరయ్యారు?

* ప్రస్తుతం దామరచర్లలో ‘యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‍లో ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్‌గా కూడా బిజీనే. మరి సమయం ఎలా దొరుకుతోందీ అంటే… ఇక్కడొక నిజం చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడంతో.. పని విభజనలో కూడా వాద వివాదాల మధ్య మనస్తాపంతో బాటు కాసింత విరామం కూడా దొరుకుతోంది. వృత్తి రీత్యా ఇది కొంత నిరాశని కలిగిస్తున్న అంశంగానే చెప్పక తప్పదు. ఎలా అంటే – క్షణం తీరిక లేకుండా పనిచేసే ప్రొఫెషనల్‌కి, జీరో స్థాయిలో పని దొరకనప్పుడు కలిగే నిరాశానిస్పృహలు మాటలకందవు.

ఏం చేయడానికీ తోచని సందర్భాలలో ఏదో ఒక వ్యాపకాన్ని వెతుక్కోవడం మనిషి తత్వం కదా! సరిగ్గా నేనూ అంతే. ఇరుకు ప్రపంచంలో ఒక విశాలమైన మార్గం దొరికింది. అదే సంగీతం! ఒక నాటి కాలంలో అదొక హాబీగా, సరదాగా, పది మంది ముందు పాడిన ఆ పాటే నా ఎదురుగా దేవతలా నిలబడినట్టైంది.

కలత పడ్డ మనసుకి, నలత పడిన మనిషికీ ఒక గొప్ప ఔషధం సంగీతం అని అన్నారు ఒక మహానుభావుడు. ఔషధం మాత్రమే కాదు, అమృతం కూడా అని అంటాను నేను. సంగీతం అమ్మ వొడి వంటిది. మనల్ని పసివాణ్ణి చేసి లాలిస్తుంది. మనసులోని గాయలని మాపుతుంది. బాధల్ని మాయం చేస్తుంది. ముఖ్యంగా సినీ సంగీతం – పామరుని నించి పండితుని వరకూ అలరించి ఆనందాన్ని పంచే కరుణ గల దేవతగా అభివర్ణించక తప్పదు.

♣ సినిమా పాటల పట్ల ఎప్పట్నించీ మీకింత మక్కువ కలిగింది?

* నా చిన్నప్పట్నించి కూడా!.. సినిమా సంగీతం అంటే చాలా ఇష్టం! చెవి కోసుకునేవాణ్ణి. వినడం కాదు, విన్న పాటని విన్నట్టు పాడేసేవాణ్ణి. ఏ విషయం పట్ల కానీండీ, ఏ అంశం పట్ల కానీండీ, ఒకసారి నాకు ఆసక్తి కలిగితే, – ఇక దాని అన్వేషణ మొదలుతుంది. ఆ విద్యని నేర్చుకునే వరకు వదిలే వాణ్ణి కాదు. కొత్త సబ్జెక్ట్స్ పట్ల మక్కువెక్కువ. విజయం సాధించే దాకా, పట్టు వదలను.

ఉదాహరణకొక సంఘటన చెబుతాను.

నా చిన్నప్పటి మాట! వైజాగ్‌లో వుంటుండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగా – కోర్ట్ క్వార్టెర్స్ కడుతున్నారు. అవన్నీ బహుళ అంతస్థుల భవనాలు. అద్భుతమైన ఆ కట్టడాల నిర్మాణమే నేను సివిల్ ఇంజినీర్ కావడానికి స్ఫూర్తిగా మారింది. పట్టుదలతో ఇంజినీరింగ్ పట్టా సాధించాను. అప్పట్లో ఎంసెట్ రాంక్ రావడం, వచ్చినా సీట్ సాధించడం ఎంతో కష్టతరంగా వుండేది. గీతం యూనివర్సిటీలో – బి.ఇ, పూర్తి చేసాను. – ఆర్.ఇ.సి (ఇప్పుడు నిట్) లో ఎంటెక్ చేసాను.

అలాగే పాటలో కూడా అంచలెంచలుగా- మధుర గానాల మహల్స్‌ని నిర్మించుకుంటున్నా.. (నవ్వులు).

♣ వేదిక మీద మీ తొలి ప్రదర్శన ఎక్కడ,ఎప్పుడు జరిగింది?

* చిన్నప్పట్నించీ కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని పాటలు పాడినా అది మామూలు విషయంగానే భావిస్తాం. కానీ, పదిమందిలో పాడిన పాటే ప్రదర్శన అని చెప్పుకోవాలి. అలా నేను ఇంటెర్మీడియట్ చదువుతున్నప్పుడు వేదిక మీద పాడే అవకాశం దక్కింది. ‘శివ రంజని.. నవరాగిణి.. ‘ పాట పాడి అందరి మెప్పు పొందాను. ఆ సందర్భంగా తొలి సారిగా నేనందుకున్న ఆ చప్పట్లు నా చెవిలో అందమైన సంగీతంలా వినిపిస్తూనే వుంటాయి. తొలి ప్రశంసల పరవశపు పరవళ్ళు ఏ కళాకారుడి హృది నించి చెరిగిపోని జ్ఞాపకాలు అని అంటారు బహుశా! అందుకేనేమో! ఆ రోజునించీ కాలేజ్‌లో నా పేరు పక్కన ‘ గాయకుడు..’ అనే మాటని టాగ్ చేసారు. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్!

♣ పాటల కోసం సమయాన్ని కేటాయించేవారా మరి?

* లేదండి. కేటాయించలేకపోయాననే నిజాన్ని ఒప్పుకోవాలి. చదువుకోడానికే సమయం సరిపోయేది కాదు. మరో పక్కన పోటీ పరీక్షలు. ఆ పరుగుల వేగంలో కాలం ఇట్టే దొర్లిపోయేది. విరామం ఎక్కడని? ఇలా చదువు పూర్తి కాగానే అలా – ఎ.పి.ఎస్.ఎ.బి.లో, ఎ.ఇ. గా ఉద్యోగం దొరికింది. సీలేరు లో పోస్టింగ్. అక్కడ ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. ‘మోహన ప్రియ ఆర్కెస్ట్రా’లో కీ బోర్డ్ ప్లేయర్ సూర్యారావ్ గారు నా కూనిరాగాలనీ, హమ్మింగ్‌నీ విని ముచ్చటపడి, పాట పాడాలని కోరారు. సరే అన్నాను. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి..’ ఘంటసాల గారి పాటని ఎంచుకున్నాను. మొట్టమొదటి సారి ఆర్కెస్ట్రాలో పాడిన ఈ పాట నన్నక్కడ హీరోని చేసేసిందంటే నమ్మండి. (నవ్వులు). అలా అడపాదడపా ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ప్రాంతీయ గుర్తింపు పొందడం జరిగింది. ప్రొఫెషన్‌లో బిజీగా వున్నా, కొంత వరకు అలా వెసులుబాటు కలిగింది. పాట పాడుకునే వాంఛ కూడా తీరుతూ వచ్చింది. మా పాటల ప్రోగ్రామ్స్‌కి, పల్లె ప్రజలు వందల్లో వచ్చేవారు, చూడటానికి! ఎంతమందంటే – ఆరేడు వందల మంది జనం! వారి ఎదురుగా ప్రదర్శన ఇవ్వడం… ఒక గొప్ప అనుభవం అయితే, అన్ని వేల కరతాళ ధ్వనుల్లో మునిగి తేలిన అనుభవం మరొక అపురూపమైన అనుభవంగా చెప్పుకోవాలి. అలా ఆకాశంలో విహరిస్తూ.. హిమాలయాలను ముని వేళ్ళతో స్పృశించినప్పటి పరవశం కలిగేది. (నవ్వులు)

♣ గాయకులుగా మీరు మరచిపోలేని సంఘటన ఏదైనా ఎదురైందా?

* వుంది వుంది. ఆ మరపురాని సంఘటనేమిటంటే ఆ రోజు వేదిక మీద – బాలు, సుశీల గారు పాడిన యుగళ గీతం – ‘ఈ నాడు కట్టుకున్న బొమ్మరిల్లు..’ ఒక పాట పాడాను. పాట పూర్తయిందో లేదో, చప్పట్ల వర్షం మధ్య.. ఒక పెద్దావిడ వేదిక మీదకు పరుగు పరుగున వచ్చి, పట్టలేని ఆనందంతో నన్ను అభినందించి, తన గుప్పిట్లోని రెండు నోట్లను భద్రంగా నా చేతిలో వుంచి ఆశీర్వదించారు. అనుకోని ఈ సన్నివేశం నన్ను పులకాంకితుణ్ని చేసింది. ఆనాడు వేదిక మీద నాకు జరిగిన మహా సన్మానంగా, మరచిపోలేని సత్కారంగా భావిస్తుంటాను ఇప్పటికీను! – ఇది నా జీవితంలో నేనందుకున్న ప్రతిష్ఠాత్మక అవార్డ్ అని చెప్పాలి. అలా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. వారి అభిమానం, ప్రోత్సాహాలే నాకెంతో ఉత్సాహాన్నిచ్చి, నన్నెంతగానో ముందుకు నడిపించాయి.

♣ ప్రేక్షకుల ఆదరణకి మించిన అవార్డ్ వుండదు. నిజమే. మరి ట్విన్ సిటీస్ సింగర్‌గా ఎప్పుడు మారారు? ( నవ్వులు).

* అంతలో.. ఎడీ డిజైన్స్‌గా విద్యుత్ సౌధకి షిఫ్ట్ అవడం, హైదరాబాద్‌కి బదిలీ అయి కుకట్‍పల్లిలో స్థిరపడటం జరిగింది. అఫీషియల్ ఫంక్షన్స్, స్వాతంత్ర దినోత్సవాలు, గణ తంత్ర దినోత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు నా చేత దేశ భక్తి గీతాలు పాడించుకునేవారు. ఇటు మా కాలనీలో వినాయక చవితి, నవరాత్రులప్పుడు చాలా పందిళ్ళు, హడావుడి వుండేది. పాటల కార్యక్రమాలలో పాల్గొనాలని పట్టుబట్టేవారు. అలా అక్కడ సినీ విభావరీలలో పాల్గొనేవాణ్ణి.

♣ ప్రేక్షకుల ఫర్మాయిష్ ప్రతి గాయనుకీ వుంటుంది కదూ?

* అవును. వుందండీ! పదే పదే పాడమని ప్రేక్షకులు నన్ను అడిగి పాడించుకున్న పాట.. ‘నా చెలియ పాదాలు.. హంసలకే పాఠాలు.. తాను పలికితే చాలు – తేనె జలపాతాలు..’ ఒక హోష్‌లో సాగిపోయేదిలేంది ఈ పాట! (నవ్వులు).

♣ త్యాగరాయ గాన సభకి ఎలా పరిచయమయ్యారు?

* అదీ చిత్రం గానే జరిగిందని చెప్పాలి. 2015లో త్యాగరాయ గానసభతో పరిచయం అయింది. మొట్టమొదటి సారిగా ‘సుజారమణ కల్చరల్ అసోసియేషన్’లో పాల్గొనే అవకాశం దొరికింది. అలా ఆ వేదిక మీదకి పరిచయం అయి, పాడాను. ఆ వెనకే, అనేకానేక సంస్థల విభావరులలో పాడాను.

♣ ఇప్పటి దాకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి వుంటారు?

* దరిదాపు 60 ప్రోగ్రమ్స్‌లో పాడాను. అనేక పెద్ద పెద్ద వేదిక ల మీద కూడా పాటలు పాడి, ప్రముఖుల చేత, పాపులర్ సంగీత దర్శకుల చేత, పెద్దల చేత – శభాష్ అనిపించుకున్నప్పుడు ఆనందం ఉప్పొంగిపోయేది. కానీ, సరిగ్గా అప్పుడే నాలో ఒక ఆవేదన కూడా ఆరంభమైంది.

♣ ఆవేదనా? ఎందుకు?

* పెద్ద పెద్ద సంస్థలకు గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, సెలెబ్రెటీస్ అతిథులుగా విచ్చేసినప్పుడు వారి ముందు పాడేటప్పుడు నాలో నాకే తెలీని జంకు కలిగింది. నాకప్పుడు శాస్త్రీయ సంగీతం రాదు. తప్పు దొర్లితే ‘నవ్వుతారేమో’ అనే సంకోచంతో కూడిన భయం కూడా కాదు అది. పాట పెర్ఫెక్ట్‌గా రావడం లేదేమో అనే బాధ! ప్రొఫెషనల్ సింగర్‌లా ఎందుకు పాడలేకపోతున్నాను నేను? నేను పాడుతున్న విధానంలో ఏదో కొరత వుంది. అదేమిటీ? నా గాత్రానికి మెరుపైన మెరుగులు దిద్దుకోవడమెలా? అని అన్వేషిస్తూ వచ్చాను.

♣ ఈ సందేహం మీలో కలగడానికి కారణం ఏమైనా వుందా?

* కారణం అంటే – ఎవరూ నన్ను ఏమీ విమర్శించలేదు కానీ, పెద్దలు వేదిక మీద మాట్లాడే మంచి మాటలు నాకెంతో స్ఫూర్తిని ఇచ్చాయి అని చెప్పాలి.

‘ఏ గాయకుడైనా సరే, – సంగీతం నేర్చుకుని, సినిమా పాట పాడినప్పుడు కలిగే ఆనందం, ఆ తృప్తి అద్వితీయంగా వుంటుంది’ అనే మాధవపెద్ది సురేష్ గారి మాటలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. వారి మాటలు అక్షర సత్యాలు. ఆ మధురానుభూతి ఎలా కలుగుతుందీ అంటే స్వానుభవంలోనే తెలుసుకోవడం సాధ్యమౌతుంది.

♣ మాధవపెద్ది సురేష్ గారి సూక్తిని మరి ఆచరణలోకి తీసుకోవడం జరిగిందా?

* అహా! ఆలస్యం చేయకుండా వెంటనే లలిత సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను. మా గురువు గారు శ్రీ మండా సర్వేశ్వర రావ్ గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నాను. వారి శిక్షణలో ఎన్నో మెళకువలు తెలిసాయి. డైనమిక్స్ గ్రహించగలిగాను. పాటని ప్రెజెంట్ చేయాలంటే ఆ గానంలో దాగిన ఆంతర్యాలని, టెక్నిక్స్‌ని, కొంత వరకు అవగాహన చేసుకోగలిగానూ అంటే అదంతా మా గురువు గారి సంగీత శిక్షణ వల్లే అని చెప్పాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా వారికి నా హృదయ పూర్వక అభివందనాలతో బాటు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

♣ సినిమా పాటకీ లలిత సంగీతానికి సంబంధం ఏమిటంటారు?

* నా దృష్టిలో రెండూ లలిత సంగీతాలే. అయితే, సినిమా పాటలో కంటేనూ లలిత గీతాలలో సంగీత, సాహిత్య భావ ప్రకటనకు విస్తృతమైన స్వేచ్ఛ వుంటుంది.

♣ అయితే, సినిమా పాటలు పాడటానికి లలిత సంగీతం నేర్చుకుంటే చాలంటారా?

* చాలా మంచి ప్రశ్న వేసారు. చాలు అనే ప్రశ్నే వుండదండి- సంగీత శాస్త్రం ఒక పెద్ద సముద్రం! అంతా ఒడిసి పట్టడం సాధ్యమే!? నేర్చుకోవాలనే తపన, తహ తహలు వుంటే కనక.. జీవితమంతా సంగీతం నేర్చుకోవడంలోనే గడిపేయొచ్చు. అంత మధురమైన సబ్జెక్ట్ సంగీతం. అయితే మీ ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వాలంటే, సినిమా పాట పాడాలనుకునే ప్రతి గాయనీ గాయకులు – తప్పని సరిగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తీరాలనే చెబుతాను.

అల్లిబిల్లిగా పాడుకునే వారికి అవసరం లేదనుకోవద్దు. వారికీ శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం అవసరమే. వేదికల మీద పాడాలనుకునే వారికి మరింత అవసరం. ప్రజాదరణ పొందిన పాపులర్ సాంగ్స్ వుంటాయి చూడండి వాటిలోని గమకాలు, డైనమిక్స్ కనక పలకపోతే, ఆ ఫెయిల్యూర్ చాలా ఘోరంగా వుంటుంది. పాట బాగా పాడకపోయినా ఫర్వాలేదు కానీండీ, కర్ణ కఠోరంగా పాడితే మాత్రం – అది నిజంగా హింస పెట్టడం వంటిదే. (నవ్వులు) రసజ్ఞులైన ప్రేక్షకుల మనసులని శ్రావ్య గానాలతో అలరించాలి కానీ, హింసించకూడదు కదా! (నవ్వులు) అందుకే శాస్త్రీయ సంగీతంలో కనీసం బేసిక్స్ అయినా తెలిసి వుంటే, పాటకి న్యాయం చేయగలుగుతారు.

♣ కర్నాటక సంగీతం నేర్చుకుంటున్నారు కదూ?

* అవునండి. శ్రీ నాగేశ్వర రావు గారి దగ్గర శిష్యునిగా చేరాను. వారు వైజాగ్‍లో వుంటారు. ఆన్‌లైన్‌లో సంగీతం నేర్చుకుంటున్నాను. రోజూ సాధన చేస్తుంటాను.

♣ అప్పట్లో పాడిన పాటలకీ ఇప్పుడు మీరు పాడుతున్న పాటలకీ తేడా వున్నట్టు గమనించారా?

* ‘రమణ మూర్తి చాలా బాగా పాడుతున్నాడు..’ అనే ప్రశంస ఒక్కటే ఒక నిదర్శనం. మనం ఎలా పాడుతున్నామో మనకి తెలిసి పోతుందండి. పాట బాగా వచ్చిందని అందరి కన్నా ముందే మన మనసు మనకు చెబుతుంది. అదే ఆత్మ తృప్తినిస్తుంది. సరిగ్గా ఇక్కడే నాకు గుర్తుకొస్తాయి – సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారి మాటలు అక్షర సత్యాలుగా!

♣ మీ కుటుంబం లో సంగీతం నేర్చుకున్నవాళ్లున్నారా?

*లేరు కానీ, మా అమ్మ గారు భక్తి గీతాలు, లలిత గీతాలు పాడుతుండేవారు. బహుశా ఆ కళే నాలోనూ జొరబడిందేమో.. (నవ్వులు)

* మీకు ఎవరి పాటలంటే ఎక్కువ ఇష్టం?

* చిన్నప్పట్నించి కూడా, నాకు ఘంటసాల గారి పాటలంటేనే పరమ ఇష్టం. ఎంత ఇష్టమంటే – ఏదేని ఒకటీ అరా సినిమాలలో కనక ఆయన పాటలు లేకపోతే ‘అదేమిటీ..!! ఘంటసాల గారి పాట లేకపోవడ మేమిటీ? అంటూ తెగ చింతించేవాణ్ణి. అలా పదే పదే వాపోతుంటే, మా వాళ్ళు నన్ను ఆటపట్టించే వాళ్ళు. ఆ బాధలోంచి బయటపడేయడం కోసం.. మా అన్నయలు నాకు క్విజ్ పెట్టే వాళ్ళు. (నవ్వులు)

♣ క్విజా!!? దేనికీ?

* ‘నీకు ఘంటసాల పాట మీద ఎంత పట్టు వుందో చూద్దాం పట్టు..’ అంటూ.. ఆయన పాటల్లోంచి ప్రశ్నలు గుప్పించేవాళ్ళు. పాటకి ముందు మ్యూజిక్ బిట్ ఇచ్చి ఏ పాటో కనుక్కోమనేవారు. అలానే పల్లవికీ చరణానికి మధ్య ఇంట్రొల్యూడ్స్ నోటితోనే మోగించి పాట పాడమనే వారు.. అన్నిటికీ ఇట్టే జవాబు చెప్పేవాణ్ణి.. వాళ్ళ మ్యూజికల్ బిట్ పూర్తి కాకుండానే ఆన్సర్ చెప్పేసేవాణ్ణి. (నవ్వులు) నాకు అంత గొప్ప ఆరాధనండీ.. ఘంటసాల మాస్టారు అంటే!!

♣ వేదికల మీద ఘంటసాల గారి పాటలలో మీరు మక్కువగా పాడిన పాటలు?

* మూగమనసులు, దేవదాసు, దేవత, వెలుగు నీడలు.. ఈ చిత్రాల్లోని సోలోస్ బాగా పాడుతుండేవాణ్ణి. గాదరింగ్స్‌లో మా ఫ్రెండ్స్, బంధువులు ‘రమణా నువ్వు ఈ పాట బాగా పాడతావు..’ అంటూ అడిగి మరీ పాడించుకునేవారు. మనసున మనసై, కల ఇదనీ, ముద్దబంది పూవులో.. పాడుతా తీయగా చల్లగా…ఇలా ఎన్నో మధుర గీతాలున్నాయి.

♣ లలిత గీతాలు కూడా పాడుతున్నారు కదూ?

* అవునండీ.. అవకాశం చిక్కినప్పుడల్లా లలిత గీతాన్ని కూడా కలుపుకుంటున్నాను. అమితమైన అభిమానం కలిగింది లలిత సంగీతం పట్ల. నాకిష్టమైన పాట – ‘శిలను మల్లె పూవు పూచిందట.. తెలుసా మీకెపుడైనా..!’ ఈ గీతమంటే చాలా ఇష్టం నాకు.

♣ ఇతర రాష్ట్రాలలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చినట్టు చెప్పారొకసారి..

* మా గురువు గారి దగ్గర సంగీత శిక్షణలో వున్నప్పుడే వారి ఆధ్వర్యంలో కటక్‌లో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ‘ఇంటెర్నేషనల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్’ లో నే పాడిన హిందీ పాటకీ, బెస్ట్ సింగర్ అవార్డ్ వ్వచ్చింది. తెలుగులో ‘సందెపొద్దుల కాడ’ అనే పాటకి… కూడా అవార్డ్ వచ్చింది. ఈ అనుభవం మరపురాని మధురమైన గుర్తుగా వుండిపోయింది.

♣ బాలు గారి చేతుల మీదుగా అవార్డ్ కూడా అందుకున్నారు ఏ సందర్భంలో ?

* ప్రముఖ గాయకులు శ్రీ వై ఎస్ రామకృష్ణ గారు ఒక భారీ ప్రోగ్రామ్ చేసారు. ఆ రోజు – ఎస్ పి బాలు గారికి ‘జేసుదాసు అవార్డ్’ ప్రదానం జరుగుతోంది. ఆ శుభతరుణంలో వేదిక మీద పాట పాడే గొప్ప అవకాశం దొరికింది. ‘నిరంతరము వసంతములె.. మందారములా మరందములే..’ అనే గీతాన్ని ఆలపించాను. అబ్బో! నేనూహించని స్థాయిలో ప్రశంసలు, పొగడ్తలు అందుకున్నాను. మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. మహా గాయకులు శ్రీ బాలుగారి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం అపురూపమైన అదృష్టం!! శ్రీ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

♣ పాటని ప్రెజెంట్ చేసేటప్పుడు మీరెలాటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు?

* పాటని చాలా జాగ్రత్తగా వింటాను. నా తోటి సింగర్స్ ఎలా పాడుతున్నారో.. చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తుంటాను. నేను రాసుకునే పాటలో – సూచనలన్నీ స్పష్టంగా , క్లియర్‌గా రాసుకుంటాను. ఎక్కడ గమకం వుందో, ఎక్కడెక్కడ మాడ్యులేషన్స్ మారుతుంటాయో.. ఇంటర్ల్యూడ్ ఏ ఇన్స్ట్రుమెంట్ బిట్‌తో ఎండ్ అవుతుందో వంటి అతి సూక్ష్మమైన నోట్స్ కూడా నోట్ చేసుకుంటా. ఎంత పెర్ఫెక్ట్‌గా వున్నా, వేదిక మీద వంద శాతం సక్సెస్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసామన్న తృప్తి వుండదు. ఎక్కడో అక్కడ చిన్న చిన్న మెరుపులు మిస్సౌతుంటాయి. తప్పదు. అంగీకరించాలి ఆనందంగా…(నవ్వులు)

♣ మీలో నాకు నచ్చే విషయం – మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం, ఇతరుల కామెంట్స్‌ని శ్రధ్ధగా కన్సిడర్ చేయడం. ఇవన్నీ గమనించాక అడుగుతున్నాను. మీకు విమర్శలంటే ఇష్టమా?

* భలే గమనించారండీ! అవును. నేను విమర్శలని చాలా ప్రీతితో స్వీకరిస్తాను. కళాకారులకు విమర్శలెప్పుడూ కొత్త జ్ఞానాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్నిస్తాయి. ‘నువ్ అద్భుతంగా పాడావు.’ అని మెచ్చుకునే వాళ్ళు మనకెంత ముఖ్యమో, ‘బాబూ! నువ్వీ పాటలో..ఇదిగో, ఇక్కడ తప్పు పాడావు’ అంటూ సరిదిద్దే విమర్శకుడు కూడా మనకు అంతే ముఖ్యం అని గుర్తించాలి. అలాగే, మరికొందరు – మన ముఖం ముందు బావుందని మెచ్చుకుంటూనే, చాటుగ వెళ్ళి విమర్శిస్తుంటారు. ‘ఆ! వాడి ముఖం ఏం పాడాడులే..వదిలేయ్..’ అంటూ. ఆ మాటలు ఎలాగో అలా.. వాయు తరంగాల ద్వారా మన చెవులకు చేరుతుంటాయి. (నవ్వులు) అలాటి పరిస్థితుల్లో కూడా విమర్శకుల మీద మనం కోపం తెచ్చుకోకూడదు. ‘ఆయన అలా అన్నాడంటే నా పాటలోనే ఏదో లోపం వుండి వుంటుంది. సరిదిద్దుకోవాలి అనే పాజిటివ్ వే లో తీసుకోవాలి. పట్టుదల పెంచుకుని, మరింత శ్రద్ధ తో ఆ పాటని సాధన చేసి, అద్భుతంగా ప్రెజెంట్ చేయాలి. విమర్సించిన వారితోనే ఔరా అనిపించుకోవాలి..!

♣ కొంతమంది సింగర్స్, పాటలోని అసలు సంగతుల కంటె మరో రెండు గమకాలు చేర్చి పాడుతుంటారు.. మీరు కూడా అలాటి ప్రయోగాలు చేస్తుంటారా?

* సినిమా పాట ఒక అద్భుతమైన శిల్పం. అది ఆల్రెడీ అద్భుతంగా తయారు చేసి మన చేతికి చిక్కిన సౌందర్య శిల్పం. సంగీతంలో నిష్ణాతులైన పండితులు స్వరపరచిన స్వరబద్ధమైన, రాగశుధ్ధమైన గీతానికి చేర్పులు కూర్పులు అవసరం వుండదు. ఒక వేళ ఒక గమకాన్ని ఎక్కువగా చేర్చినా అది పాట అందాన్ని ద్విగుణీకృతం చేయాలే తప్ప, చిన్నబుచ్చకూడదు. ముఖ్యంగా మేము గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే…శ్రోతల చెవులకి చాలా అలవాటైన ట్యూన్స్, హృదయానికి హత్తుకునున్న పాటలు.. కొన్ని వుంటాయి. అవి ప్రజల నోట్లో నానిన పాటలు. ఈ పాపులర్ సాంగ్స్ పాడేటప్పుడు – నొటేషన్స్ ఖచ్చితంగా స్పష్టంగా వున్నవున్నట్టుగా … అలానే పలికి తీరాలి. పాటని యధాతథంగా ప్రెజెంట్ చేయడమొకటే మంచి సంప్రదాయం. ఉదాహరణకి హిమగిరి సొగసులు, హాయి హాయిగా ఆమని సాగే వంటి క్లాసికల్ సాంగ్స్‌కి ఎక్కువ గమకాలు వేసి, తనకున్న సంగీత ప్రతిభని ప్రదర్శించాలనుకుంటే అది అక్కడ విజయవంతం కాని పని. అలా అని, తక్కువ చేసినా పాట నొప్పదు.

అసలు సినిమా క్లాసికల్స్, సెమీ క్లాసికల్స్‌ని పాడేటప్పుడు – ఉన్న పాటని ఉన్నట్టు పాడటమే ఓ ప్రహసనం లాటిది. చాలా కష్టమైన ప్రక్రియ. అందులో, ఘంటసాల మాస్టారు గారు పాడిన క్లాసికల్స్ లో కొన్నిట్ని టచ్ చేయాలంటేనే గొంతు వొణుకుతుంది. శివశంకరి, రసిక రాజ, ఈ మధు మురళీ గాన లీల..వంటివి ప్రధానం గా చెప్పుకోవాలి.

♣ ఇలాటి కష్టతరమైన పాటలు పాడేటప్పుడు మీరు ఎవరి గైడన్స్ అయినా తీసుకుంటారా?

* సలహాలు తీసుకుంటానండి. శ్రీ చక్రవర్తుల శ్రీనివాసాచారి గారికీ, మా అన్న గారికీ పాట పాడి వినిపిస్తాను. వారిద్దరూ మంచి క్రిటిక్స్. సద్విమర్శలతో బాటు సలహాలిస్తారు. పాటలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు. అలాగే మన సీనియర్ సింగర్ శ్రీ వేణుగోపాల్ గారు కూడా మంచి మంచి సూచనలు ఇస్తారు. సీనియర్స్‌తో చేసే ఈ డిస్కషన్స్, వారి ముందు చేసే సాగించే రిహార్సల్స్ వల్ల మనకి తెలీకుండానే మనకు మంచి శిక్షణ దొరుకుతుంది. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

వందమంది ప్రేక్షకుల ఎదుట – స్టేజ్ మీదకి డైరెక్ట్‌గా వెళ్ళి, పాడటం కంటేనూ… ఇలా తర్ఫీదు పొంది, పాడటం వల్ల మంచి సింగర్‌గా గుర్తింపబడతారు అని నా అభిప్రాయం.

♣ కొత్త గా పాడాలనుకునే సింగర్స్ కి మీరిచ్చే సలహా?

* ప్రధాన సూత్రం ఒక్కటే. శాస్త్రీయ సంగీతంలో కనీస పరిజ్ఞానం, అవగాహన వుండి తీరాలి. అది మొదటి అర్హత. ఇప్పుడు మనకున్న యువ గాయనీ గాయకులనే ఉదాహరణగా తీసుకోండి. శ్రీకృష్ణ, శ్రీరాం, హేమచంద్ర, సునీత, జగద్ధాత్రి సింగర్స్ – వెలుగులో వున్న వీరందరూ కూడా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న వారే! వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకడుగు వేస్తే, నూతన గాయనీ గాయకులకు కూడా ఉజ్వల భవిష్యత్తు వుంటుంది.

♣ చాలా సంతోషమండీ, రమణ మూర్తి గారు. సంచికతో ఎన్నో విషయాలను పంచుకున్నందుకు! సంగీతం పట్ల మీకున్న ఆసక్తి, పాట పట్ల మీకు ఆర్ధనా అనురక్తి ఎంతో మంది గాయనీ గాయకులకు స్ఫూర్తి గా నిలవాలని కోరుకుంటూ, మరిన్ని మంచి మంచి సంగీత విభవరీలను మీ నించి ఆశిస్తూ… శలవా మరి!

* ధన్యవాదాలండి. సంచిక పత్రిక సంపాదకులకు, పరివారానికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ అభివందనాలు.

సెల్ : 80962 77478

 


   


Songs links

1. Ninnu talachi

2.Ee madhu maasam lo

3. Divinundi Bhuviki Digivache

4. komte chooputo

5. Veena venuvaina sarigama vinnava

6. guttameeda guvva

7. raave raadha

https://www.smule.com/MVRMurthy64

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here