ట్విన్ సిటీస్ సింగర్స్-3: గంధర్వ గాయకులు ఘంటసాల గారి ఏకలవ్య శిష్యులు- త్రినాథ రావ్‌!

5
9

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన ‘గంధర్వ గాయకులు ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుణ్ని నేను’ అని విశ్వసించే గాయకులు శ్రీ త్రినాథ రావ్‌ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

[dropcap]గా[/dropcap]యకులు శ్రీ త్రినాథ రావ్ గారి గాత్రం ఎంత గంభీరంగా వుంటుందో, మనిషీ అంత హుందాగా, ఫ్రెండ్లీగా, కలుపుగోలుగా వుంటారు. ఆయన మాట ఎంత పదిలమో, పాట కూడా అంతే. ఎంతో శ్రద్ధగా పాడతారు. పాడేటప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడరు. చాలా ఈజీగా, స్వేచ్ఛగా, హాయిగా పాడతారు. పాటని, సాహిత్యాన్ని, ఫీల్ అవుతూ పాడటం ఈ గాయకుని లోని ప్రత్యేక లక్షణం.

త్రినాథ రావ్ గారి పేరు ఒకసారి వినగానే ‘గుర్తుండిపోయే’ పేరనిపించింది. శ్రీమతి ఆమంత గారు నిర్వహించే సంగీత విభావరీలో మొట్టమొదటి సారిగా ఈ గాయకునితో నాకు పరిచయం కలిగింది. వీరు కేవలం గాయకులు మాత్రమే కాదు. నాటక రంగంలో కూడా ప్రవేశముందని తెలుసుకున్నాను. అంతే కాదు, ప్రతి రోజూ త్యాగరాయ గానసభకి విచ్చేసి,ముందు వరసలో ప్రత్యేక అతిథుల కోసం కేటాయించిన సీటులో ఆశీనులై, వేదిక మీద పాడుతున్న ప్రతి సింగర్ పాటనీ ఆలకిస్తారు. చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేకుండా అందర్నీ ఆనందంగా అభినందిస్తారు. ప్రతి సాంస్కృతిక సంస్థల నిర్వాహకులని దుశ్సాలువాతో సత్కరించి, నాలుగు మంచి మాటలు మాట్లాడి, తమ హృదయ స్పందనలను తెలియచేస్తారు.

కళాకారులందర్నీ ఒకే రీతిన పలకరించడం, పరామర్శించడం, శుభాకాంక్షలను అందచేయడం త్రినాథ రావ్ గారి కళా హృదయ సంస్కారానికి నిదర్శనం.

ఒక గాయకుని విలువ మరొక గాయకుని కిమాత్రమే తెలుస్తుంది. కానీ ఆ భావాన్ని వ్యక్తపరిచే కళాకారులు మాత్రం అరుదు. అలా అరుదైన వ్యక్తులలో శ్రీ త్రినాథ రావ్ గారు ఒకరు.

వీరితో జరిపిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలిసాయి. వాటన్నిటినీ ఏర్చి కూర్చి మీకందిస్తున్నాను.

ఈ గాయకునితో నా ఇంటర్వ్యూ ఎలా మొదలైందంటే –

***

♣ త్రినాథ రావ్ గారూ, ముందుగా మీకు నా నమస్కారాలు.

* నమస్కారమమ్మా..

(ఎప్పట్లానే చిరునవ్వుతో ఆత్మీయంగా పలకరించారు.)

♣ మీ పేరు వినంగానే తెలుగు వారేనా అని సందేహం కలిగింది నాకు. చాలా యూనిక్ name! మీ పేరు వెనక కథ చెప్పాలి. (నవ్వులు)

* నేను అక్షరాలా తెలుగు వాణ్ణి. తెలుగంత స్వచ్చమైన తెలుగువాణ్ణండి (నవ్వులు).  నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టాను. అక్కడ త్రినాథ వ్రత కల్పం అని చాలా ప్రాచుర్యంలో వుండేది. అలా మా తల్లి తండ్రులు నాకు త్రినాథ రావ్ అని పేరు పెట్టారు.

మీరు నా పేరు గురించి అడుగుతుంటె నాకు చప్పున సినారె గారు గుర్తుకొస్తున్నారు.

ఆ మహా కవి అనేక సభలలో నా గురించి మాట్లాడుతూ అంటుండే వారు. ‘త్రినాథ రావ్ – సంగీతంలో, నటనలో, భాషణంలోనూ నాథుడు కాబట్టి, అందుచేత త్రినాథుడు అని అనడం సబబు అనీ ప్రశంసిస్తుండేవారు.

♣ సినారె గారి మాటల్లొ నిజముందండి. మీ భాషా ఉచ్చారణా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలోనే చదువుకున్నారా?

* నా విద్యాభ్యాసమంతా పాలకొల్లులోనే. 1978లో స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా చేరి, అక్కణ్నించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఎదిగాను. పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్‌లో వుండి, కళాకారులకీ, కళా సేవా సంస్థలకీ నా పరిధిలో నేను చేయగలిగినంత సహాయా సహకార సేవలను అందించగలిగాను. ఆ ఆ అదృష్టం నాకు దక్కినందుకు నాకెంతో గర్వంగా వుంటుంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, తృప్తిగా వుంటుంది.

(నిండుగా నవ్వుతూ చెప్పారు.)

♣ స్వధర్మం, వృత్తి ధర్మం కలిసి రావడం నిజంగా ఆ వ్యక్తి చేసుకున్న అదృష్తమే త్రినాథ రావ్ గారు. అసలైన కళాకారుని సంస్కారానికి నిదర్శనం మీ ఆదర్శం. అవునూ, అసలు మీకు పాటల పట్ల మక్కువ ఎలా కలిగింది?

* ఎలా అంటే, చిన్నతనం నించీ అస్తమానం పాటలు పాడుకుంటుండేవాణ్ణి. నాలో ఈ ఆసక్తిని కనిపెట్టి, మా చిన్నాన్న గారు ఒకసారి, నన్ను తనతో తీసుకెళ్ళి, దేవాలయంలో పాడించారు. అక్కడ అదురు బెదురూ లేకుండా పాడినందుకు పెద్దలు సంతసించి, శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రతిమని బహుమతిగా నాకందించారు. అందరూ మురిపెంగా చూసారు ఆ సన్నివేశాన్ని. అప్పుడు నేను 3 వ తరగతి చదువుతున్నా.

♣ మరి స్కూల్ లో కూడా పాడుతుండెవారా?

* ఆహా! బ్రహ్మాండంగా పాడుతుండే వాణ్ణి. నేను పాడకుండా స్కూల్ అసెంబ్లీ జరిగేది కాదు. ఏ కారణంగా అయినా నేను స్కూల్‌కి రాని పక్షంలో అసెంబ్లీ అయినా ఆగిపోయేదేమో కానీ, నా పాట లేకుండా అసెంబ్లీ మాత్రం జరిగేది కాదు. వందే మాతరం గీతాన్ని అందరూ పాడే స్టయిల్‌లో కాకుండా.. వైవిధ్య రాగంలో పాడేవాణ్ణి (అంటూ తను అనుసరించే బాణీలో గీతాన్ని పాడి వినిపించారు..)

ఇప్పటికీ హైదరాబాద్ సభలలో పాడాల్సి వస్తే, వందేమాతరం గీతాన్ని నేను ఈ బాణీ లోనే పాడుతుంటాను.

♣ వందే మాతరం పాట చాలా బావుంది. ఎవరు ట్యూన్ చేసారు? మీరేనా?

* నేను కాదండీ. (నవ్వులు) ఇది సాంప్రదాయ బాణీ. బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే గురుతుండి వుండొచ్చు…

♣ ఈ ట్యూన్ లో వందేమాతరం గీతాన్ని నేనెక్కడా విన్నట్టు గుర్తులేదండి..ఎవరైనా పాడగా విన్నారా ?

* నేనూ ఇంత వరకు ఎవరి నోటా ఈ బాణీలో విన్లేదు. నేను పాడే ఈ గీతానికి ప్రముఖమైన గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ప్రతి సభలోనూ ప్రార్థనా గీతంగా నన్ను ఈ బాణీ లోనే పాడమని కోరుతారు ఇప్పటికీను.

♣ ఎప్పట్నించి వేదిక మీద పాటలు పాడుతున్నారు?

* చదువుకునే రోజుల్నించే, వేదికల మీద పాడటం అలవాటైంది. స్కూల్లో, కాలేజీలలో, ఆఫీస్ కార్యక్రమాలలోనూ.. పరిషత్తుల్లోనూ.. అలా అలా నేనెక్కడుంటే అక్కడ నాకు అవకాశాలు పుష్కలంగా దొరుకుతుండేవి.

♣ ఆ వేదికలన్ని ఒక ఎత్తు ఐతే, ఇక్కడ త్యాగరాయ గాన సభలో మీకు దొరికిన అతి ప్రత్యేకమైన గుర్తింపు వేరని భావిస్తున్నా.

* గుర్తింపు కోసమని కాదు కానీ, త్యాగరాయ గాన సభ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎనలేని గౌరవం. మీరన్నట్టు, నేనెక్కువగా త్యాగరాయ గాన సభలో పాడుతుంటాను.

♣ సినీ గీతాలను ఆలపించడంలో మీకు గురువులెవరైనా వున్నారా? లేక నిష్ణాతుల నించి శిక్షణ తీసుకోవడం కానీ జరిగిందా?

* సినీ గీతాలను నేను ఎవరి నించీ నేర్చుకోలేదండీ. నేను పాడే సినిమా పాటలన్నీ కూడా నా అంతట నేను స్వయంగా నేర్చుకున్నవే.

అయితే నాకు గురువులున్నారు. – ఇద్దరు. ఇద్దరూ ప్రత్యక్ష గురువులే. ఎవరంటే – శ్రీ విన్నకోట మురళీ కృష్ణ గారు – నాకు ఎన్నో లలిత గీతాలను నేర్పారు. అలాగే శ్రీ జి.వి.ప్రభాకర్ గారు – అన్నమాచార్య కీర్తనలు నేర్పారు. వీరి నించి ఎన్నో మెలకువలు నేర్చుకున్నాను. అందుకు వారిరువురికీ సంచిక ద్వారా నా కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటున్నాను.

♣ మీ పాట పై ఎవరి ప్రభావం వుందని భావిస్తున్నారు?

* నేను ఘంటసాల గారి వీరాభిమానినండి. నా పాటలపై తప్పకుండా ఆ గంధర్వ గాయకుని ప్రభావం చాలా వుంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నాను.

♣ అంటే మీరు ఘంటసాల వారికి ఏకలవ్య శిష్యులు అని అనొచ్చు కదా?

* (నవ్వుతూ..) ఖచ్చితంగా అనొచ్చు. నా చిన్నప్పట్నించీ ఆయన పాటలు వింటూ పెరిగిన వాణ్ణి. ఇప్పటికీ అదె అలవాటు. ఆయన్ని వినడం, నేర్చుకోవడం. ఆ గాత్ర మాధుర్యానికి బానిసలం కాలేని గాయకులెవరని?

త్యాగరాయ గాన సభలలో జరిగే అన్ని సినీ సంగీత కార్యక్రమాల్లోనూ, ఘంటసాల వారి గీతాలు తప్పని సరిగా చోటు చేసుకుని వుంటం ఎంతైనా గర్వకారణం. అందుకే ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతున్నారు.

♣ అదిసరే, మీకు త్యాగరాయ గాన సభతో గల అనుబంధం గురించి చెప్పండి. చాలా ఆసక్తికరమైన సంగతి కదూ?

* నేను నా వృత్తి రీత్యా, దేశ విదేశాల్లో తిరిగీ తిరిగీ చివరికి 2008లో హైదరాబాద్ వచ్చి చేరాను. 2014లో ఇక్కడినుండే రిటైర్ అయ్యాను. ఈ ఆరేళ్ళుగా నాకు వీలు చిక్కినప్పుడల్లా గానసభకి వస్తుండేవాడ్ని. క్రమక్రమంగా ఇప్పుడు నాకు గాన సభే మొదటి ఇల్లుగా మారిపోయింది. ఎప్పుడైనా వెళ్లలేకపోతే ఎంతో వెలితిగా ఫీలౌతా. ఇదొక చిత్రమైన అందమైన బంధం అయితే మరో విచిత్రానుబంధం ఏమిటంటే, ఒక రోజు కనిపించకపోతే నా అభిమాన ప్రేక్షకులు కూడా విపరీతంగా బాధపడిపోతారు. ఫోన్ చేసి ఎందుకు రాలేదని కనుక్కుంటారు. ఎలా వున్ననో అని పరామర్శిస్తారు. గానసభతో, అభిమానులతో నాకంత గాఢమైన అనుబంధం పెనవేసుకుపోయిందని చెప్పడంలో ఎలాటి సందేహం కానీ, అతిశయోక్తి కానీ లేదు గాక లేదు.

♣ అవునండి. అదొక దేవాలయం అన్న భావన కలుగుతుంది. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే ఆ గాన సరస్వతి దేవి కూడా. మీరు కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నట్టు, ఒక ప్రభుత్వ కళాశాలలో చేరి, ఫీజ్ కట్టిన రసీదుని సోషల్ మీడియాలో పోస్ట్ చెస్తూ చెప్పారు. నిజానికి ఎంతో మంది సీనియర్ సిటిజెన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారనిపించింది. రిటైరయ్యాక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనిపించడానికి గల కారణం?

* నేను నా సంగీత జీవితంలో చేసినటువంటి అతి పెద్ద నెంబర్ 1 పొరబాటు ఏమిటంటే – శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేకపోవడం. ఆ కొరత ఎప్పుడూ నా మనసులో గుచ్చుకుంటూనే వుండేది. ఆ వెలితినీ, దిగుల్నీ దూరం చేసుకోవాలనే గట్టి సంకల్పానికి నాందిగా సంగీతానికి శ్రీకారం చుట్టాను. అయితే, నా దృష్టిలో – సంగీతాన్ని నేర్వడానికీ, వయసుతో నిమిత్తం లేదన్నది నా గట్టి అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే ఇందులో చేరాను. పేపర్‌లో ప్రకటన చూసి అప్లై చేసి, క్లాసులో జాయిన్ అవడం జరిగింది. అప్పటికే 2 నెలల క్లాసులు అయిపోయినా, కూపప్ చేయడానికి ఐ ట్రై మై బెస్ట్ లెవెల్.

‘నాకూ శాస్త్రీయ సంగీతం వచ్చు..’ అనే స్థాయికి చేరుకోవాలన్నదే నా ఆశయం. ఆ ప్రయత్నంలో భాగం గానే నా కృషి నేను చేస్తున్నాను. అవును. ఆ పట్టుదలతోనే కొనసాగిస్తున్నాను.

త్యాగరాయ గాన సభలో వేదిక – ముందు వరసలో మా ఎదురుగా మీరు కుర్చుని కనిపించకపోతే, సింగర్స్‌కి ఉత్సాహం వుండదు. కొత్త గాయనీ గాయకులను మెచ్చుకునే తీరు అలాటిది. పాట బావుంటే వెంటనే మెసేజ్ చేయడమో, లేదా వేదిక మీదకి వచ్చి ప్రశసించి వెళ్ళడమో చేస్తుంటారు. అప్పుడు ఆ కళాకారులు పొందే ఆనందం ఎంత గొప్ప గా వుంటుందో!

♣ చాలా మందికి మల్లే, మీలో ఇగో లేదు అని అంటుంటారు.

* గానించడం ఒక గొప్ప కళ కదండీ! పాటలు పాడే గాయని గాయకులంటే నాకు ఎనలేని గౌరవం. ఒకో గళం ఒక్కో అందమైన వర్ణం. వీనులవిందైన విభిన్న స్వరాలను విని, ఆనందించడం అంటే చాలా ఇష్టం. కళాకారులను ప్రోత్సహించడంలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతుంటాను. అదే – కళా హృదయానికి అసలైన నిర్వచనం అని కూడా భావిస్తాను.

స్టేజ్ మీద పాడుతున్న వారి గానాన్ని వింటూ ఆ పాటలో అలా లీనమై అలౌకికమైన ఆనందానుభూతులను పొందుతాను.

ఒక గాయకుడు గానీ, గాయని గానీ గొప్పగా పాడి వినిపిస్తున్నప్పుడు పట్టలేని ఆనందంతో నా కళ్ళు చెమర్చుతాయి అంటే నమ్మండి !

నాకు పాట అంటే అంత ప్రేమ. ఆరాధన. గొప్ప పూజ్య భావం. ఈ హృదయం ఆ భగవంతుడు నాకిచ్చిన గొప్ప అపురూప వరంగా స్వీకరిస్తాను.

అందుకే ప్రతి కళాకారుణ్ణి నేను స్వయంగా వెళ్ళి అభినందిస్తుంటాను. మీరు చెప్పినట్టు ఆ విషయంలో నాకస్సలు ఇగో అన్నదే లేదు.ఆ మాటకొస్తే, ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ హేట్ మోస్ట్ ఈజ్ ఈగో.

♣ మీ వృత్తికీ మీ హాబీకి సంబంధం లేదు. ఒకటి ఆర్థిక లావాదేవీలతో సతమయ్యే ఉద్యోగం. మరొకటి హృదయాన్ని ఆనందంలో ముంచెత్తే కళారాధనా భావం. వృత్తి ప్రవృత్తులు భిన్న ధృవాలైనప్పుడు ఓ – మనిషి సంఘర్షణకి గురి అవుతాడని అంటారు. మీ అనుభవంలో అదెంతవరకు నిజమని భావిస్తారు?

* ఇట్ ఆల్ డెపెండ్స్ ఆన్ వన్స్ ఎబిలిటీ టు మేక్ అ జుడిషియస్ బాలన్స్ బిట్వీన్ దీజ్ టు.

నాకు సంబంధించినంతవరకు నాకెప్పుడూ ఈ విషయంలో ఇబ్బంది కలగలేదని ఖచ్చితం గా చెపుతానండీ. అటు నా వృత్తిని సమర్ధవంతంగా నిర్వహిస్తూనే నా ప్రవృత్తికీ కూడా! అంటే ఈ రెండింటికీ సమాన న్యాయం చేకూర్చానన్న సంతృప్తి నాకుంది.

♣ నటనా రంగం లో కూడా మీకు ప్రవేశం వుందని తెలిసింది..

* అవునండీ, నాకు నాటన అంటే కూడా చాలా ఇష్టం. ఆకాశవాణి కేంద్రంలోను, టీవీ లోనూ ఎన్నో నాటికలలో పాల్గొన్నాను. కోట శ్రీనివాసరావు వంటి ప్రముఖులతో స్టేజ్ డ్రామాలలో నటించడం, పలు ప్రదర్శనలివ్వడం జరిగింది.

♣ ఈ నాటకానుభవంతో సినిమాలలోనూ నటించాలని ప్రయత్నించలేదా?

* అవకాశాలు వచ్చాయి. నటించాను (నవ్వులు). అంకుశం, హనుమంతు చిత్రాల్లో అతిథి పాత్రలలో కనిపిస్తాను. అయితే, పాటలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

♣ అంటే గాయకునిగా మిగిలిపోవాలనుకున్నారన్నమాట! మీ నటనానుభవం మీలోని గాయకునికెంతో ఉపకరించిందనుకుంటున్నాను. ఎలా అంటే – పాటలో భావాన్ని గుప్పించ గల సామర్థ్యం కలుగుతుందేమో కదూ? అసలు పాటలో భావాన్ని జొప్పించేందుకు సింగర్స్ చేయాల్సిన కసరత్తు ఏదైనా వుందని భావిస్తున్నారా? వుంటే అది ఏమిటంటారు?

* కసరత్తు అంటూ ఏమీ వుండదండీ. పాటను పూర్తిగా అర్ధం చేసుకుని, సాహిత్యంలో కవి గుప్పించిన మనోభావాన్ని మన గళంలో నింపుకోగలిగితే ఆ ఫీల్ అనేది దానంటదే వచ్చేస్తుంది. నా పాటల్లో నేను అనుసరించే విధానం ఇదే. మీరూ గమనించవచ్చు నేనిక్కడ ఇస్తున్న నా పాటల లింక్స్ చూస్తే మీకే అర్ధమౌతుంది.

♣ ఇప్పుడు వేదికల మీద ఎక్కడ చూసినా ట్రాక్ మీద అంటే కరఒకె మీద పాడుతున్నారు. అయితే కరఒకె కీ – లైవ్‌కీ మధ్యన వ్యత్యాసం ఏమైనా? లేక దగ్గరతనముందా? వుంటే అదెలా అంటారు, లేదంటే ఎలా, ఎందుకు?

* నాకు తెలిసినంత వరకు కరఒకె కీ లైవ్ కీ ఒకే ఒక్క వ్యత్యాసం వుంది. అదేమిటంటే – లైవ్‌లో గాయకుడికి తన గాత్ర ధర్మాన్ని బట్టి అందుకోగలిగేంత శృతిని ఎంచుకుని, పాట పాడుకోవచ్చు. కరఒకెలో అయితే ఆ సౌలభ్యం వుండదు. సింగర్స్ పొరబాట్లను సరిదిద్దే మ్యుజీషీయన్స్ అక్కడ మనకి కనిపించరు (నవ్వులు).

♣ మీరిలా నవ్వేస్తుంటే మిమ్మల్నొక ప్రశ్న వేయాలనిపిస్తోంది.

* వేయండి, వేయండి (నవ్వులు). మీరడిగే వారు నేను చెప్పేవాణ్ణి. జవాబుదారుణ్ణి కదా.. (నవ్వులు)

♣ మీరెప్పుడూ హాపీగా నవ్వుతూ కనిపిస్తారు. మీ సంతోషం వెనకున్న సీక్రెట్ తెలుసుకోవాలనుంది.

* (ఒక్క సెకను కాలం ఆగి చెప్పారు ) లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విచ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఎంజాయ్ ఎవిరీ మూమెంట్ ఆఫ్ ఇట్. అనేది నేను నమ్మి ఆచరిస్తున్న సిద్ధాంతం. ఈ ప్రక్రియలో సంగీఎతం ఒక ముఖ్యమైన సాధనం.

♣ మ్యూజిక్ మానసిక ఆరోగ్యానికెంతో సహాయకారిణిగా పనిచేస్తుందనీ మన మానసిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. నిజమేనంటారా?

* అవునండి. ఇందులో ఏ మాత్రం అబద్ధం లేదు. ఉదాహరణకి మనం ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మంచి మధురమైన పాటొకటి విన్నా, లేదా పాడుకున్నా, కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోతాం. ఇది ప్రతి ఒక్కరి అనుభవైద్యకమైన విషయమే. మనిషినీ, మనసునీ సేద తీర్చే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే వుందని చెప్పక తప్పదు. నేను చెబుతున్నది నూటికి నూరు శాతం సత్యమండి.

♣ గాయకునిగా అనుభవాలు, ప్రదర్శనలు, పొందిన విజయాలు, అవార్డులు?

* నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతుండంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పాటల పోటీలో నాకు ప్రథమ బహుమతి లభించింది. ఫస్ట్ ప్రైజ్‌గా గణపతి ప్రతిమని అందుకున్నాను. ఆనాటి నుండి నా పాటల ప్రస్థానం నిర్విఘ్నంగా ఇలా నిరంతరం కొనసాగుతూనే వుంది. దాదాపు ఇప్పటి దాకా వెయ్యి పాటలకు పైనే పాడాను. ఊహ వచ్చాక వేదిక మీద పాడిన మొట్ట మొదటి పాట ఘంటసాల వారి అద్భుత గీతం – ‘నా హృదయములో నిదురించే చెలీ.. ‘

నేను సర్వీస్ లో వుండంగా ఆరేళ్ళు ఆడిటర్‌గా దేశవిదేశాలలోను, అనేక ప్రాంతాలలోను పర్యటించడం జరిగింది. వెళ్ళిన ప్రతిచోటా అక్కడి తెలుగు వారు పాట పాడమని నన్ను కోరేవారు. అడిగి మరీ పాడించుకునేవారు.

మారిషస్‌లో తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాటలు పాడటం ఒక గొప్ప అనుభూతి!

కాలిఫోర్నియాలో పేరొందిన బాటా సంస్థ వారి కార్యక్రమంలో నా పాటలను వినిపించే గొప్ప అవకాశం దక్కింది.

పాలకొల్లులో ప్రముఖ సంగీత కళాకారులుండేవారు. వారిలో ముఖ్యంగా మాండలిన్ శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్, వంటి గొప్ప కళాకారులతో నాకు మంచి పరిచయం భాగ్యం కలిగింది.

♣ మీరు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాడుతుంటారు కదా, మరి మీకు సొంత సంస్థ వుందా?

* లేదండి. నాకు సొంత సంస్థ అంటూ ఏమీ లేదు. అన్ని సంస్థలూ నావే. కళాకారులందరూ నా వారే అని భావిస్తాను. ఇదొక పెద్ద సంగీత కుటుంబం (హాయిగా నవ్వేస్తూ..).

♣ కర్నాటకసంగీతంలో కూడా ప్రవేశించారు కాబట్టి, శిక్షణ తర్వాత, శాస్త్రీయ గాత్ర సంగీత కార్యక్రమాలలొ కూడా పాల్గొని కచేరీలు చేయాలని కోరుకుంటున్నా..

* లేదండి. కన్సర్ట్స్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. శాస్త్రీయ సంగీతంలో బేసిక్స్ నేర్చుకోవాలనేది ముఖ్యోద్దేశం. కనీస అవగాహన కలిగి వుంటం, తద్వారా నా పాటను మెరుగుపరచుకోవాలనే ఆశయంతో సంగీతంలోకి ప్రవేశించాను. అంతే!

♣ నాటకరంగంలో నటులుగా కూడా కొనసాగాలనుకుంటున్నారా?

* తప్పకుండానండీ. సంగీతం, నటన రెండూ నాకు రెండు కళ్ళు లాటివి.

♣ మీ భవిషత్తు ప్రణాళికలు?

* సాంస్కృతిక సంస్థల ద్వారా పాట మీద అభిరుచి వున్న గాయనీ గాయకులకు అవకాశం కల్పించడమే నా ప్రణాళిక.

♣ నూతన గాయనీ గాయకులకు మీరిచ్చే సలహాలు?

* పాట మీద మమకారం పెంచుకోవాలంటాను. ఒక గీతాన్ని బాగా పాడగలగాలంటే ఎంతో సాధన అవసరం. ఇతర గాయకులనెవర్నీ అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు. మనం మనదైన సహజసిధ్ధమైన గాత్రంతోనే అందంగా పాడడానికి కృషి చేయాలి. ఒరిజినాలిటీ ముఖ్యం. పాటని ప్రెజెంట్ చేసేటప్పుడు సింగర్ క్రమశిక్షణతో నడచుకోవాలి. నిజాయితీగా పాటని ప్రేమించగలిగి వుండాలి.

♣ మీకున్న అనుభవాన్ని పురస్కరించుకుని, సినిమాలో కూడా పాడేందుకుప్రయత్నించవచ్చు కదా?

*నా అంతట నేను ప్రయత్నించను. నా పాట విని ప్రముఖులెవరైనా పాడమంటే మాత్రం తప్పకుండా పాడతాను. అంతే కానీ, సినిమాలలో పాడాలనే వెంపర్లాట కానీ, క్రేజ్ కానీ నాలో లేదు.

♣ మా ‘సంచిక’ ఆన్లైన్ మాగజైన్ పై మీ అభిప్రాయం?

* మాగజైన్ చూస్తున్నాను. చదువుతున్నాను కూడా. మంచి సాహిత్యాభిరుచి గల పత్రిక. వెరైటీ అంశాలతో ఆకర్షణీయం గా వుంది. మన ట్విన్ సిటీస్ సింగర్స్ ఫీచర్ ఆరంభించి మంచి పని చేస్తున్నారు. ఇదొక గొప్ప ప్రయత్నం. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మీ ప్రయత్నం ఎంతైనా అభినందనీయమం. కంటెంట్ చాలా బావుంది. సింగర్స్ అందర్నీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చే గొప్ప యత్నం. భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసి, విజయాలు సాధించాలని అభిలషిస్తున్నాను.

♣ చాలా థాంక్సండి త్రినాథ రావ్ గారు. అడిగిన వెంటనే ఇంటర్వ్యూ కోసం సమయాన్ని కేటాయించి, నా ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా జవాబులిచ్చినందుకు సంచిక తరఫున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. త్రినాథ రావు గారు. మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* చాలాసంతోషమమ్మా దమయంతిగారు. మీ ఇంటర్వ్యూకి నన్ను ఎంచుకుని, విభిన్న అంశాలపై నా అభిప్రాయాలను తెలియచేసే అవకాశాన్ని కలగచేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

       

trinadh rao:

cell no 9000008571, trinadh5554@hotmail.com

  1. Chintalapudi Trinadha Rao Papai navvali
  1. Chintalapudi Trinadha Rao Neelala ningilo
  1. Chintalapudi Trinadha Rao Mama kuthura neetho matundi
  1. https://www.youtube.com/watch?v=mLnRue8SyEk

 5 Chintalapudi Trinadha Rao idi ye ragamu

6 Chintalapudi Trinadha Rao eenadu kattukunna bommarillu

  1. Chintalapudi Trinadha Rao Bhale manchi roju

8 ch. Trinadha Rao and T. Laalitha Rao…. emo emo idhi nakemo emo ainadh

9 Chintalapudi Trinadha Rao Yamaho nee yama yama

  1. Chintalapudi Trinadharao – Mavi chiguru tinagane
  1. Interview in DD – Chintalapudi Trinadha Rao in DD YADAGIRI 09-10-17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here