ట్విన్ సిటీస్ సింగర్స్-6: ‘నా జీవన జీవం గానం, నా సంస్థ నా ప్రాణం..’ – శ్రీమతి శారద!

0
9

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికన ‘ నా జీవన జీవం గానం, నా సంస్థ నా ప్రాణం’ అనే మధుర గాయని శారద గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

[dropcap]శ్రీ[/dropcap]మతి ఆమంత గారు శారదని పరిచయం చేస్తూ, ‘ఈమే శారద! పాటలు పాడుతుంది. మంచి గాయని. నా ప్రోగ్రామ్స్ అన్నిటినీ తనే చూసుకుంటుంది. నా కో-ఆర్డినేటర్, నా రైట్ హాండ్’ అంటూ ఆత్మీయంగా అలా పరిచయం చేసారు.

నెమ్మది, నిదానానికి మారుపేరులా వుండే శారద – ‘తానొవ్వక ఇతరులని నొప్పించక..’ అనే మార్గాన్ని ఎంచుకుని అనుసరించడం మూలాన ఆమెకి అందరూ మిత్రులే అని తెలుసుకున్నాను.. వ్యక్తిగా ఎంత మంచి పేరుని సంపాదించుకున్నారో, గాయనిగా, శ్రీ శారదా మ్యూజిక్ అకాడెమీ వ్యవస్థాపకురాలిగా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా అంతే మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నారు.

ఆమె నిర్వహించే ప్రతి సినీ విభావరీలోనూ – గాయనీ గాయకులందరూ ‘శారదా మ్యూజిక్ అకాడెమీ’ని తమ సొంత సంస్థగా భావించడం ఎంతైనా అభినందనీయం.

తాను ఎదుటి వారిని, వారి వ్యక్తిత్వాలను గౌరవించడం వల్ల తనని వ్యక్తిగా ఇష్టపడతారనీ, పాటలను ఎంచుకోవడంలో సింగర్స్‌కి పూర్తి స్వేచ్చనివ్వడం వల్ల తన సంస్థలో పాడాలని పలువురు గాయనీ గాయకులు కోరుకుంటారని చెబుతారు శారద. అందర్నీ అర్థం చేసుకుని ముందుకెళ్తే సమస్యలనేవే ఉత్పన్నమవ్వవు అని, తనని అర్థం చేసుకునే వారు తన స్నేహితులవడం ఆ దేవుని ఆశీస్సు అంటూ వినమ్రంగా చెబుతారు.

గాయనిగా తనని శ్రేయోభిలాషులు అడిగే ప్రశ్న ఏమిటంటే – ‘ఎప్పుడూ అవే పాటలు పాడతావెందుక’ని ప్రశ్నిస్తుంటారని, ‘ఆ పాటలనే తానెక్కువగా సాధన చేయడం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రెజెంట్ చేస్తానని, కొత్త పాటలు నేర్చుకున్నా సాధన లేనప్పుడు వేదిక మీద పాడే సాహసం చేయనని’ తన స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అంతే కాదు ఒక సింగర్, ప్రోగ్రామర్‌గా మారినప్పుడు – ఆ కార్యక్రమంలోని అన్ని పాటలూ తనే పాడాలని తహతహలాడటం కూడదంటూ సలహాగా సూచిస్తారు. ప్రోగ్రామ్ సక్సెస్‌కే తను ప్రాధాన్యత ఇస్తాననీ, అందులో భాగంగా నూతన యువ గాయనీ గాయకులకు, ప్రతిభావంతులకు మాత్రమే అవకాశాన్నిచ్చి పాడిస్తానని అదే తన ప్రోగ్రామ్స్ సక్సెస్‌కి ఫార్ములా అనే రహస్యాన్ని చెప్పారు.

సినిమా పాటలు పాడటం ఆషామాషీ వ్యవహారం కాదని, అందుకు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ఒక్కటే వుంటే సరిపోదని కూడా చెపుతారు.

అలా అని, కేవలం సినిమా పాటలతో వివాహాది శుభకార్యాలని నిర్వహించేయొచ్చు అనుకుంటే, పాటలో తాళం తప్పినట్టే అంటూ నవ్వుతారు. అందుకే తను ఎప్పటికప్పుడు పెళ్ళి కార్యక్రమాలను కొత్తగా డిజైన్ చేసుకుంటానని, ప్రోగ్రామ్స్‌లో నూతన ప్రక్రియలని ప్రవేశ పెడుతుంటానని, ఏ ప్రోగ్రాం చేసినా, అందులో సృజనాత్మకత లోపించినప్పుడు అది ప్రేక్షకుల మనసులని రంజింప చేయలేదంటూ ఇది తాను కనుగొన్న సత్యం అంటూ లోతైన విశ్లేషణని వినిపించారు. ఇంకా ఎన్నో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను, మనకు తెలీని కోణాలను ఆవిష్కరిస్తూ, ఆ కబుర్లన్నీ మనసు విప్పి, మన సంచికతో పంచుకున్నారు.

శారదతో నే జరిపిన ఈ ఇంటర్‌వ్యూని ఇదిగో మీముందుంచుతున్నాను.

ప్రత్యేకంగా మీరు చదవడం కోసం.

***

> హలో శారద గారూ, ఎలా వున్నారు?

* బావున్నా మేడం. మీరు ఇంటర్వ్యూ అని చెబితే, నాకు ఆనందంతో బాటు భయమూ వేసింది. ఏం జవాబులు చెబుతానో అని.

> భలే వారే. భయమెందుకు? మన సంచిక మీ అందరి కోసం ఏర్పాటు చేసిన వేదిక ఇది. మీ గురించి మీరు చెప్పుకోడానికీ, మీ సాధక బాధలు వినడానికీ, మీలోని టాలెంట్ ని వెలుగులోకి తీసుకు రావడానికే ఈ పందిరి వేసాం. మీరు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. అయినా నేను మిమ్మల్ని ప్రశ్నలేస్తానని ఎందుకు అనుకుంటున్నారు. మనం కబుర్లు చెప్పుకుందాం (నవ్వులు).

* కబుర్లయితే సరే. ఇష్టమే. అయితే అడగండి, చెబుతా (అంటూ నవ్వారు).

> మిమ్మల్ని నేను మొదటి సారిగా ఆమంత గారి ప్రోగ్రాంలో చూసినప్పుడు అనుకున్నా – మీరు తెలంగాణా ఆడపడచు అని. కానీ తర్వాత తెలిసింది, మీ పుట్టింటి వారు కడపకి చెందిన వారని. హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చారు?

* నేను ఇక్కడే హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. మీరు ఊహించింది నిజమే. నేను తెలంగాణా ఆడపడచుని. ఆ మాటకొస్తే రెండు గడపలకి ఆడపడచునే.

> సినిమా కార్యక్రమ నిర్వాహకురాలిగా, గాయనిగా మీకంటూ ఒక ప్రత్యేకతని కాపాడుకుంటూ మీదైన గుర్తింపుని పొందారు. ఎప్పట్నించి సినిమా పాటలు పాడుతున్నారు?

* దరిదాపు ఇరవై యేళ్ళ నించి పాడుతున్నాను. చిన్నప్పట్నించీ, రేడియో వినడం, పాటలని శ్రధ్ధగా ఆలకించడం, విన్న పాటలను మననం చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ పాడుకోవడం నాకొక ఇష్టమైన హాబీగా వుండేది. అదే క్రమం క్రమంగా నన్ను గాయనిగా మార్చేసిందని చెప్పాలి.

> మీకు శాస్త్రీయ సంగీతంలో కూడా ప్రవేశముందని, వివాహానంతరం సాధన చేసారని విన్నాను?

* అవునండి. వివాహానంతరం, పిల్లలు పుట్టాక, పిల్లల అమాయక సలహా మీద నేర్చుకున్నాను.

> అంటే?

*(నవ్వుతూ) అదొక పెద్ద కథ. నాకు చిన్నతనంలోనే పెళ్ళి చేసారు మా వాళ్ళు. అత్తారింటికొచ్చాక, సంసార బాధ్యతలతో సతమతమయ్యేదాన్ని. ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక, నా బాధ్యతలు రెట్టింపు అయ్యాయే తప్ప తగ్గింది లేదు. ఇంటిపనుల్లో నిత్యం సతమయ్యే నాకు రేడియోలోని పాటలే నాకు వినోదమైనా, విందైనా. పాట విన్నప్పుడల్లా మనసంతా ఆనందం పరచుకునేది. కాలం గడుస్తోంది. పసి పిల్లలు పెరిగారు. స్కూల్‌కి వెళుతున్నారు. అప్పుడనిపించింది. నేనెలానూ సంగీతాన్ని నేర్చుకోలేకపోయాను, నా పిల్లలకైనా నేర్పించాలని ఆశ కలిగింది. ముగ్గురికీ – గాత్రంలో కానీ, వాయిద్యాలలో కానీ శిక్షణ నిప్పించాలని నిశ్చయంగా అనుకున్నాను. కానీ ఎక్కడ జేర్పించాలో తెలిసేది కాదు. పేపర్ తిరగేసి, అడ్రస్సులు సేకరించి బుక్‌లో రాసి పెట్టుకునేదాన్ని.

పిల్లల కోసమని వారికి అనువైన సమయంలో పాఠాలు చెప్పే సంగీతం టీచర్స్ కోసం అన్వేషణ సాగేది. అలా ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ దొరికింది. వెళ్ళి, వారితో మాట్లాడి ఎంతో ఆనంద పడిపోతూ ఇంటికొచ్చి పిల్లలతో చెప్పాను “రేపట్నించి మీరు సంగీతం క్లాసులకి వెళ్తున్నారు” అని. వాళ్ళు సంతోషించడానికి బదులు ఏడ్పు ముఖాలు పెట్టారు. ఆ టైం మరి వాళ్ళు క్రికెట్ ఆడుకునే టైం కదా. అందుకు ఏడ్పన్నమాట (నవ్వులు). ససేమిరా వెళ్ళమంటే వెళ్ళమని మొండికేసారు. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు వెళ్లరని అడిగితే, ఆసక్తి లేదని చెప్పారు. ముగ్గురూ ఒకటే మాట మీద వున్నారు. అన్ని విషయాలలో విభేదించుకునే అన్నదమ్ములు ఇక్కడ మాత్రం ఐక్యమత్య గీతం పాడారు. ఆటల మీద మోజు కదా (నవ్వులు).

వాళ్ళ మెజారిటీ ఎక్కువ కదా. నేనొక్కదాన్నే ఏం గెలుస్తాను? (నవ్వులు). ఉక్రోషమొచ్చింది నాకు కూడా. వాళ్ళ ముగ్గురితోనూ మాట్లడటం మానేసా. ఒకరోజేమో అంతే. లోలోన బాధపడుతున్నానని గ్రహించి వాళ్ళేమన్నారంటే – ‘మమ్మీ సంగీతం నీకంత ఇష్టమైతే, మాకు నేర్పించే బదులు నువ్వే నేర్చుకోవచ్చు కదా’ అంటూ సలహా ఇచ్చారు. ఆ మాటలకి కోపంగా చూసాను కానీ, వాళ్ళ అమాయక ముఖాలు చూసి నవ్వొచ్చింది. మనసులోనే నవ్వుకున్నా.

పిల్లలు సహజంగా చెప్పి మాటే అయినా, అది నన్ను ఆలోచింపచేసింది. నిజమే కదా, నా ఇష్టాలను వాళ్ళ మీదెందుకు రుద్దండం. వాళ్ళు చెప్పినట్టు నేనే నేర్చుకుంటే సరి కదా అనిపించింది. రెండ్రోజులు నిద్ర పోకుండా ఆలోచించి, నిర్ణయం తీసుకున్నాను. సంగీత నేర్చుకోడానికి సిధ్ధపడిపోయా. అలా.. అలా కింగ్ కోటీలో శ్రీ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ గవర్న‌మెంట్ కాలేజ్ లో సీటు సంపాదించుకుని, రెగ్యులర్‌గా క్లాసెస్‌కి వెళ్తుండేదాన్ని.

ఎవరైనా సంగీతం ఎందుకు నేర్చుకుంటున్నావ్ అని అడిగితే మా పిల్లలు నేర్చుకోమన్నారు అందుకని జవాబిచ్చేదాన్ని సరదాగా. నిజం కూడా అదే.

> ఇల్లూ, సంసారపు బాధ్యతల నడుమ – కాలేజ్‌కి వెళ్ళి రావడం అంటే ఎలా సాధ్యమైంది?

* మీరడిగిన ప్రశ్ననే అప్పుడప్పుడు నన్ను నేను చాలా సార్లు అడుగుతూ వుంటాను (నవ్వులు).

పొద్దున నిద్ర లేచిన దగ్గర్నించి ఒక్క క్షణమైనా తీరిక లేని నాకు, సంగీతానికి సమయం దొరకడం విచిత్రంగానే తోస్తుంది. పొద్దున పిల్లల్ని స్కూల్స్‌కీ, ఆయన్ని ఆఫీస్‌కీ పంపి, ఇంటి పనులు పూర్తి చేసుకుని, ఇంత టిఫిన్ తిని నా టూ వీలర్ మీద బయల్దేరేదాన్ని. అక్కడ 1 గంట సేపు క్లాస్ కోసం రానూ పోనూ 3 గంటల ప్రయాణం చేసేదాన్ని. వస్తూ వస్తూ పిల్లల్ని స్కూల్ నించి పికప్ చేసుకుని, ఇంటికొచ్చి, వాళ్ళకి స్నాక్, పాలు ఇచ్చి, బయటకెళ్ళి మార్కెట్ పనులు చూసుకుని, ఇంటికొచ్చాక, మళ్లా డిన్నర్ ప్రిపరేషన్‌లో బిజీ అయిపోయేదాన్ని. ఇటు వంట చేస్తూనే అటు పిల్లల చేత హోం వర్క్ చేయించేదాన్ని. ఇన్ని పనులు చేస్తూ ఒక చెవిని మాత్రం సంగీతం వినడం కోసం కేటాయించేదాన్ని (నవ్వులు). ఏ రాత్రో నిశ్శబ్ద సమయాలలో కుర్చుని పాఠాన్ని నెమరేసుకునేదాన్ని. పగలు కాలేజ్‌కి వెళ్లబోయే ముందు – గంటా, అరగంట సేపు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేదాన్ని. మా వారు సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేస్తారు. ఆయన చాలా సిన్సియర్ – వర్క్ విషయంలో. ఎప్పుడూ ఆఫీస్ పనుల్లో నిమగ్నమై వుండేవారు. ఇంట్లో అయినా ఆయనకి విశ్రాంతి దొరకాలని కోరుకునేదాన్ని. ఆయన చిన్నప్పట్నించీ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన్ని అర్థం చేసుకోగలను, అందుకే ఇంటి బాధ్యతలు ఎక్కువగా నేనే చూసుకునేదాన్ని. కానీ, కాలేజ్ కెళ్లడం కోసం మెరుపు వేగంగా పనులు పూర్తి చేసేదాన్ని. ఇప్పుడనిపిస్తుంది, అలా ఎలా సాధ్యమైంది నాకు అని. మీ ప్రశ్నే వేసుకుంటాను. ‘నా నిత్యవారీ దిన చర్యలలో నా ఈ బిజీ షెడ్యూల్ లో ఎక్కడ ఏ చిన్న జాప్యం జరిగినా అక్కడ క్లాస్ మిస్ అవుతుంది. జాగ్రత్త’ అనే ఒక్క కాషన్ నా మైండ్‌లో రికార్డ్ అయి వుండేదేమో! బహుశా ఆ హెచ్చరికే నన్నలా జడిపించి, పరుగులు తీయించిందని ఇప్పుడు అర్థమౌతుంది (నవ్వులు).

> మీరు జడుపు అని అంటే నాకు వెంటనే పెద్దల మాట గుర్తొస్తోంది. విద్య పట్ల విద్యార్ధికి శ్రధ్ధతో బాటు భయభక్తులూ వుండాలని అంటారు అందుకే!

* అవునండి. పాట అంటే నాకు భయమెక్కువ. భక్తితో కూడిన భయం. అందుకే అన్ని పాటలు తెలిసినా, సాధన చేయకుండా పాడను. ముఖ్యంగా నా గాత్ర ధర్మాన్ని గౌరవిస్తాను. నాకనువైన పాటలనే ఎంచుకుని పాడుతుంటాను. సినిమా పాటలు ఈజీగా అనిపిస్తాయి విండానికి. కానీ చాలా టఫ్‌గా వుంటాయి పాడటానికి అనేది మాత్రం నిజం.

> ఎన్నేళ్ళు నేర్చుకున్నారు సంగీతాన్ని?

* నాలుగేళ్ళు. సర్టిఫికేట్ కోర్స్ చేసాను. పరీక్ష రాసి ఉత్తీర్ణురాలయ్యాను. అయితే చివరి సంవత్సరానికి ముందు మా అమ్మ గారు కాలం చెందారు. ఆ షాక్‌లో నేను దరిదాపు కోమా స్టేజ్‌లో కెళ్ళిపోయాను. తిరిగి కోలుకోడానికి సమయం పట్టింది. మా స్నేహితురాలు, నేను మామూలు మనిషిని కావడం కోసం నన్ను బలవంతంగా తిరిగి కాలేజ్‌లో జేర్పించింది. సంగీతం నాలోని బాధని తాత్కాలికంగా మరిపించింది. అలా, నాలుగో సంవత్సరం కూదా పూర్తి చేసి, పరీక్ష రాసి పాసయ్యాను. అమ్మ దీవెన – అదంతా.

> మరి ఆ తర్వాత డిప్లొమా కోర్స్‌ని కంటిన్యూ చేయలేదా?

* లేదండి. పిల్లలు చదువుల్లో టర్నింగ్ పాయింట్ కొచ్చేసారు. టెంత్, నైంత్, సెవెంత్‌లో వున్నారు. వాళ్లని గైడ్ చేయడం కోసం నా సమయాన్ని కేటాయించేదాన్ని. ట్యూషన్ క్లాసులు, ఎగ్జామ్స్, స్కూల్‌లో ఇంటర్నల్ పరీక్షలు, ఈ పర్యవేక్షణలో నేను సంగీతాన్ని కంటిన్యూ చేయలేననిపించింది అదీ కాక, డిప్లొమాలో థియరీ వుంటుంది. ఎంత కష్టమంటే, సబ్జెక్ట్ మీద చాలా కాన్సంట్రేషన్ అవసరం.

> మీ పిల్లలు సంగీతాన్ని ఏక కంఠంతో వ్యతిరేకించారని చెప్పారు. మరి సుజిత్ ఎలా మంచి గాయకుడయ్యాడు?

* అదొక చిత్రమైన మలుపు అని చెప్పాలి. ఒకసారి మా సుజిత్ పాట పాడి వినిపించాడు. ఆశ్చర్యపోయాను. వాణ్ని వెంటనే, సంగీతంలో జేర్పించాను. అక్కడ హరిప్రియ (హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరు) మేడం మా వాడి పాట విని, ఎవరి దగ్గర నేర్చుకున్నావ్ సంగీతాన్ని అని అడిగితే మా అమ్మ దగ్గర అని జవాబు చెబుతుంటే విని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నా కళ్ళు నాకు తెలీకుండానే వర్షించాయి. నిజంగా నాకు తెలీదు వాడు నన్ను గమనిస్తున్నాడని కానీ, వింటున్నాడు అని కానీ, పాడాలని తహ తహలాడుతున్నాడని కానీ.. నాకు తెలీదు. అలా, నేను వాడి పాటకి స్ఫూర్తిగా నిలవడం, అంతా ఆ శారదా దేవి కృప గానే భావించాను.

> సుజిత్ – శాస్త్రీయ సంగీతాన్ని ఎంత వరకు నేర్చుకున్నాడు?

* నాలానే, సర్టిఫికెట్ కోర్స్ చేశాడు కానీ పరీక్ష రాయలేదు. అకడమిక్ స్టడీస్‌కి ప్రాధాన్యతనివ్వడం వల్ల అక్కడితో ఆగాల్సి వచ్చినా, ఆ తర్వాత, వైజర్స్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంజినీరింగ్ కాలేజ్ ఫంక్షన్స్‌లో సుజిత్ పేరు మారుమోగేది. ఆర్. విశ్వనాథ్ గారి ఆశీస్సులతో మొదటి సారిగా త్యాగరాయ గాన సభ వేదిక పై పాడాడు. ఆ తర్వాత ఆమని గారి సినీ గీతాల పోటీలో బహుమతి గెలుచుకున్నాడు. సినీ సంగీత దర్శకులు శ్రీ కోటి గారి చేతుల మీదుగా ప్రైజ్ నందుకున్నాడు. శ్రీ శ్రీనివాస్ నాయుడు గారు మా సుజిత్‌కి వేదిక పై అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు. బయట కమర్షియల్ ప్రోగ్రామ్స్, ఇంకా ఈవెంట్ ఆర్గనైజర్స్ వాడిని ప్రొఫెషనల్ సింగర్‌గా మార్చేసారు. వాడి పాకెట్ మనీ వాడే సంపాదించుకునేవాడు. క్రమంగా కారు కూడా కొనుక్కునే ఆర్థిక స్థాయికి వరకు ఎదిగాడు. వాడికి పాట పట్ల ఎంత పూజ్యభావమో.. అప్పుడప్పుడు నన్ను సయితం టీజ్ చేస్తుండేవాడు. అలానా పాట పాడటం? అని. పాటకి శృతి, లయ తాళం మాత్రమే కాదు మమ్మీ.. మాడ్యులేషన్ కూడా వుండాలి అంటూ నాకు సలహా ఇచ్చేవాడు. నేను వాడిలా సినిమా పాటలు పాడలేకపోయినా.. వాడికి ఆ విద్య వంటపట్టిందని ఎంతగానో పొంగిపోయేదాన్ని. పట్టేసేవాడు. పిన్న వయసులోనే, మెట్టు మెట్టుగా ఎదుగుతూ వచ్చి… చివరికి…

(ఆమె మాటల్ని కావాలనే అడ్డుకుంటూ అడిగాను)

> శారదా మ్యూజిక్ మీ సొంత సంస్థ. ఎప్పుడు ప్రారంభించారు?

* 2014లో. నేనప్పటికే పెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తుండేదాన్ని. సొంత సంస్థ వుంటే, నా ప్రోగ్రామ్స్‌ని నేను నా అభిరుచికి తగినట్టు రూపకల్పన చేసుకోవచ్చనే ఆశయంతో, సొంత సంస్థని నెలకొల్పాను. దీని వెనక కూడా ఒక పెద్ద కథ వుంది. చెప్పమంటారా?

> చెప్పండి చెప్పండి.. ఏమిటా కథ.

* నాలా, పాటల పిచ్చిలో, సంగీతారాధనలో మునిగివున్న వాళ్ళ చుట్టూ, కొంతమంది ఘరానా మోసగాళ్ళు చేరతారు. ఎలా అంటే, ప్రముఖ విద్వాసుడో, పాపులర్ సెలెబ్రిటీ ఎదుటో మీ చేత పాడిస్తాం. మీకు ఉజ్వల ల భవిష్యత్తు వుంటుంది. అంటూ మాటలతో బోల్తా కొట్టిస్తారు. ఆ తర్వాత డబ్బు గుంజుతారు. ఇలానే నమ్మి, నిజమే అనుకుని నేనూ కొంత డబ్బు ఇచ్చి ప్రోగ్రామ్‌కి వెళ్ళాము. పెద్ద వేదిక. ఆర్గనైజర్ చెప్పినట్టే, ముందు వరసలో ప్రముఖులందరూ ఆశీనులయ్యారు. పాటలు మొదలయ్యాయి. ఇంకా పిలుస్తాడు అని చివరి దాకా వెయిట్ చేసాక, టైం అయిపోయిందంటూ పాడించకుండానే వెనక్కి పంపేసాడు ఆ పెద్ద మనిషి. విపరీతమైన నిరాశ కలిగింది. మరో పెద్ద మనిషి, మాతో సోలోస్ పాడిస్తానని చెప్పి, డబ్బు తీసుకుని తీరా వేదిక మీద బృందగానం లోకి నెట్టి నిలబెట్టాడు. మైక్ స్విచ్ ఆఫ్ చేసి, పాడమన్నాడు. నేను పాడలేదు. మా అబ్బయి నా కంటే ముందుగా హాల్ బయటకొచ్చి నిలబడ్డాడు. ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలీదు. అవమాన భారానికి, కళ్ళంట నీళ్ళు తిరిగాయి. రెండు రోజులు అన్నం సయించలేదు. ఇంతగా మోసం చేస్తారా పెద్ద మనుషులై వుండి? అని లోలోన బాధ పడుతూ కుర్చున్నా. నా మనోవేదనకి మందు దొరికినట్టు మెదడులో మెరుపులాటి ఆలోచన మెరిసింది. ఈ సంస్థల వారిని నమ్మడం కంటే, నేనే సొంతంగా సంస్థని నెలకొల్పితే? అని. వెంటనే పంతులు గారి దగ్గరకెళ్ళి, విషయం వివరించి, మంచి పేరు సూచించవలసిందిగా కోరాను. ఆయన నవ్వి, అమ్మవారి పేరు, నీ పేరు ఒకటే కదా. మరో పేరెందుకు నీ సంస్థకి అన్నారు. అలా ఆయనచేత చెప్పించింది శారదా మాతే అని స్ఫురణకి మనసు పులకరించింది. అమ్మవారిని మనసులోనే ప్రార్థించుకుంటూ, శారద మ్యూజిక్ అకాడెమీ అని నామకరణం చేయడం జరిగింది.

మా తొలి ప్రదర్శన సాయిబాబా దేవాలయంలో భక్తి గీతాల కార్యక్రమంతో ఆరంభించాం. ఆ తరవాత ఎన్నో సంగీత విభావరీలు, వివాహాది ఇతర శుభకార్యల ప్రోగ్రామ్స్ చేసాం. అప్పట్లో ఆర్కెస్ట్రా కూడా చేసేవాళ్ళం.

> ఆర్కెస్ట్రాకీ, పెళ్ళి ప్రోగ్రామ్స్‌కి తేడా ఏమిటి?

* ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ రెసెప్షన్స్ వంటివి. నైట్ ప్రోగ్రామ్స్ వుంటాయి. లేట్ నైట్ అవుతుంది – ప్రోగ్రాం పూర్తయేసరికి. నా మనస్తత్వానికి సరిపడలేదని చెప్పాలి. ముఖ్యం గా ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లం. వెహికల్స్ లేని లేడీ సింగర్స్‌ని డ్రాప్ చేయాల్సిన నైతిక బాధ్యత స్వయంగా నేనే తీసుకునేదాన్ని. అందర్నీ ఇళ్ళకి చేర్చి నేను ఇంటికి తిరుగుముఖం పట్టేసరికి – అప్పుడు సమయం ఎంతయ్యేదంటే – తెల్లవారు ఝాము అయ్యేది. మా అబ్బాయి కాలేజ్ టైంకి నిద్ర లేచే వాడు కాదు. నాకు రెండు రోజుల పాటు పెళ్ళి మబ్బు పట్టి నట్టుండేది (నవ్వులు). చాలా అలసట అనిపించేది.

అందుకే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయడం లేదు. పార్టీ వారు, అభిమానంగా మరీ మరీ అడిగితే, రిలేషన్ మెయింటెయిన్ చేయడం కోసం, ఒక్కోసారి పెద్దల పట్ల గౌరవం కొద్దీ కమిట్ అవుతుంటాను.

> పెళ్ళి ప్రోగ్రామ్స్ కూడా మీ సంస్థ పేరు మీదే నిర్వహిస్తుంటారా?

* అవునండి. అందుకే నేను సంస్థని ఏర్పాటు చేసుకున్నాను. ఒకసారి నేను పెళ్ళికెళ్ళినప్పుడు, అక్కడ వేదిక మీద పాడుతున్న పాటలు, వాయిద్యాలు, గానాలు పేలవంగా అనిపించాయి. ఇంకా వెరైటీ గుప్పిస్తే బావుండేది కదా అని. ఎలా చేసుండాల్సిందో, అని మా సుజిత్‌తో మాట్లాడుతుంటే, మనం అలా చేద్దాం మమ్మీ అన్నాడు. వాడి సహకారం నాకెప్పుడూ వుండేది, ప్రతి ప్రోగ్రాం లోనూ వాడు స్టేజ్ మీద నిలబడితే చాలు, నాకెంతో ధైర్యమొచ్చేసేది. వాడి పాటే నా ప్రోగ్రాం సక్సెస్‌కి మూలాధారం (కళ్ళొత్తుకుంటూ..చెప్పారు).

> మరి మీ ప్రోగ్రామ్స్‌లో ఆ వైవిధ్యాన్ని ఎలా గుప్పించగలిగారు?

* నేను చేసే ప్రోగ్రామ్స్‌లో – నాకు నేను ఇచ్చుకునే ప్రాధాన్యత కంటే నా సంస్థ పేరు ప్రతిష్ఠలకే ఇంపార్టన్స్ ఇస్తానండి. అందుకే, నా కంటే బాగా పాడే సింగర్స్ కోసం వెదుకుతుంటాను. వాళ్ళు కూడా యువ గాయనీమణులనే ఎంచుకుంటాను. నా దగ్గర ఎలానూ, మా వాడు సుజిత్ వుంటాడు కాబట్టి, అడగంగానే వచ్చేసేవారు ఫిమేల్ సింగర్స్. వాడితో కలిసి పాడాలని ఉత్సాహాం వుండేది. అయితే, మా సుజిత్‌కీ నేను రెమ్యునరేషన్ ఇచ్చేదాన్ని. ఇవ్వకుంటే ఏమనేవాడంటే, మమ్మీ ఈ కాసేపు నేను ప్రొఫెషనల్ సింగర్ని అనుకో, నువ్వు కోరితే వచ్చానని అనుకో అని నవ్వేవాడు. బయట వాళ్ళకంటే మరో ఐదు వందలు ఎక్కువే ఇచ్చే దాన్ని. మళ్ళా ప్రోగ్రామ్ వుంటే నన్నే పిలవాలి అని సంతోషపడిపోయేవాడు. ఆ డబ్బు ఇంత్లోకే వాడతాడనుకుంటే అది నా పొరబాటు అని అర్ధమైంది ఆ తర్వాత (నవ్వులు). ఎప్పుడైనా అనేదాన్ని, ఈ నెలలో నీకు మొత్తం పదివేలు ఇచ్చాను కదరా అంటే ‘తప్పు. నువ్వలా లెక్కలు అడగకూడదు’ అని నవ్వేవాడు. దుబారా చేసేవాడు కాదు. దాచుకునే వాడు. దాచి, కారు కొనుక్కోవాలని … (కళ్ల నీళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తుంటే..)

> (ఆమెని ఆ మూడ్ నించి డైవర్ట్ చేయాలని వెంటనే ప్రశ్నందుకున్నాను) అది సరే, పెళ్ళి ప్రోగ్రామ్స్‌లో మీ ప్రెజెంటేషన్ గురించి చెబుతున్నారు… అది పూర్తి చేయండి..

* నేను ప్రతి అంశం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను మేడం. వేదిక మీద అమర్చే చెక్క రోళ్ళు, రోకళ్ళు, రాజస్తానీ రంగు రంగు వర్ణాల బుట్టలు, గిఫ్ట్స్, దాండియా స్టిక్స్, దాండియా డాన్సర్స్ డ్రెస్సులు.. అన్నీ కళ కళలాడుతూ కనిపించాలి. స్టిక్స్ రంగు వెలిసినా, విరిగినా వాట్ని వాడను. పాటలు కూడా పెళ్ళి పాటలను ప్రత్యేకంగా సేకరించి ఫైల్ చేసిపెడతాను. తెలుగు, తమిళ్, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ భాషల గానాలను కూడా దాండియాలో చేర్చి పాడిస్తాను. తెలుగులో సైతం, తెలంగాణా ఆంధ్రా ప్రాంతాలలో కొన్ని జిల్లాల జానపదాలు దాండియాకి అనువుగా వుంటాయి. ప్రైవేట్ ఆల్బమ్స్‌లో ఆణిముత్యాల్లంటి పాటలు దొరుకుతాయి. వాటిని వెంటనే రికార్డ్ చేసి ఈ పాటను నా నెక్స్ట్ పెళ్ళి ప్రోగ్రాం పాడించాలని డైరీ లో రాసుకుంటాను. ఆ పాటను ఆయా సింగర్స్‌కి పంపి, నేర్చుకుని రావాలని కోరతాను. పెద్ద పాటను ఒక్కటే పాడి కంటే వివిధ వర్ణాల పూల మాలలా, విభిన్న గీతాల పల్లవీ చరణాలతో ఏర్చి కూర్చిన దాండియా సాంగ్స్ నా ప్రత్యేకం అని చెప్పాలి. అలానే, సీతారాముల కళ్యాణం అనే పాటలో వధువు వరుని పేర్లను పలకడం వల్ల పార్టీ వారు ఎంతో సంతోషిస్తారు.

> దాండియా అనే ముచ్చట మన వివాహ సాంప్రదాంలోకి ఎలా వచ్చి చేరిందంటారు?

* అంటే, హైదరాబాద్ విభిన్న సంస్కృతీ సాంప్రదాయ సమాహారం కదా, అలా అడాప్ట్ చేసేసుకున్నాం.. అదనపు కళగా… (నవ్వులు) అలానే, మెహిందీ ఫంక్షన్స్ కూడా ఆ వరసలోకి వచ్చి చేరిందే.

> మెహిందీ ఫంక్షన్స్ కూడా చేస్తారా?

* ఓ యస్. చేస్తాం. నా దగ్గర ఉర్దూ, హిందీ, భాషల్లో పాడే సింగర్స్ వున్నారు. వారి చేత పాటలు పాడిస్తాను. తెలుగులో సినిమా పాటలు, అన్నమయ్య పదాల కోసం తెలుగు సింగర్స్‌ని తీసుకెళ్తాను. అదొక గాన కళా వైభవం అని చెప్పాలి. మెహిందీ ఫంక్షన్స్‌లో అమ్మాయి కలలు, ఊహలు, రూపం, ఆమె రాసుకునే ప్రేమ లేఖల మీద పాటలని ఏర్చి కూర్చుకుంటాను. నా సొంత ఐడియాసే ఇవన్నీను.

> అక్కడ కూడా దాండియా నృత్యాలు వుంటాయా?

* దాండియా అంటే కోలాటాల నృత్యాలు. వాళ్ళు కోరితే ఏర్పాటు చేస్తాను. ఎక్కువగా డోలక్ పాడ్స్ మీద పాటలే వుంటాయి. ఎక్కువగా హిందీ పాటలే చోటుచేసుకుంటాయి. మెహిందీ సాంగ్స్ కోసం పాత బస్తీ నించి సింగర్స్ వస్తారండి. తెలుగు జానపదాలూ ఒప్పుతాయి కానీ ఈ తరం వారు ఇష్టపడరు. మన సంస్కృతి కాదు కాబట్టి సాంప్రదాయ గీతాలలో కూడా ఎక్కడా గోరింటాకు మీద పాటలు కనిపించవు. అందుకే ఉత్తరాదికి వెళ్ళి వెత్తుకోవాలి పాటల్ని తప్పదు.

> పెళ్ళి ప్రోగ్రామ్స్ కాకుండా ఇంకా ఏ ఇతర ఏ ఏ అక్కరలకు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు?

* అన్నీను. బారసాల, ఉయ్యాల పండగ, (తొట్టెలో వేయడం అంటారు) పుట్టినరోజులు, పెళ్ళి రోజులు, సష్టిపూర్తి దినోత్సవాలు, వోణీ ఫంక్షన్స్, ధోతీ ఫంక్షన్, శ్రీమంతం, పదవీ విరమణ పార్టీ, గెట్ టు గెదర్స్, గార్డెన్స్ విహారలప్పుడు, కార్తీక వన భోజనాలు, రిసార్ట్స్‌లో జరిగే మల్టీ నేషనల్ కంపెనీ ఎంప్లాయీస్ ఫామిలీ గెట్ టు గెదర్స్.. ఇలా అన్ని ఫంక్షన్స్‌కీ అనువైన పాటల కార్యక్రమాలని తీసుకుంటాను. సక్సస్‍కి నా వంతు కృషి ఎప్పుడూ వుంటుంది. ప్రోగ్రామ్ అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను. మూడో వ్యక్తికి కానీ పార్టీకి కానీ అప్పచెప్పే ప్రసక్తి వుండదు. ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని, అడ్వాన్స్ తీసుకున్నాక, మరో ప్రోగ్రమ్ వారు వచ్చి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఒప్పుకోను. నా మొదటి కమిట్‌మెంట్‌కే కట్టుబడి వుంటాను. అదొక ప్రథమ సూత్రంగా వుంటుంది నా సిధ్ధాంతాలలో.

> మిమ్మల్నొక ముఖ్యమైన ప్రశ్న వేయాలి. మీకు సంగీతం పట్ల, కార్యక్రమ నిర్వహణల పట్ల, ఇంత అవగాహన ఎలా కలిగింది? మీ తల్లితండ్రులకు సంగీతం వచ్చా?

* అస్సలు రాదండి. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న గారు సుబ్బారాయుడు గారు  సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసేవారు. మా అమ్మ అంకమ్మ గారు. ఇంటి ఆర్థికావసరాలకు తన చేయూతగా టైలరింగ్ చేసేవారు. అమ్మ కుట్టే డిజైనర్ బ్లౌజులకు మంచి డిమాండ్ వుండేది ఆ కాలంలోనే… ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్లతో నెక్ షేప్స్‌తో బ్లౌజులు కుట్టేది. వారికి సంగీతం అంటే ఏమిటో తెలీదు. నాకే పాటల పిచ్చి వుండేది. ఇంట్లో మెల్లగా పాడుకోవడమే తప్ప, ఇలా వేదిక మీద పాడతానని కలలో కూడా అనుకోలేదు. ఇప్పటికీ మా బంధువులు నన్ను అంటుంటారు – “బాపనోళ్ళ లెక్క నీకుందుకు సంగీతమూ పాటలు? ఫలానా కులం వారికి మల్లే” అని వెక్కిరించేవారు. సంగీతం విశ్వజనప్రియమైనదని నా అభిప్రాయం.

> మీ భవిష్యత్తు ప్రణాళికలు?

* చాలా వున్నాయండి. సీనియర్స్ కోసం, ఇటు యువ సింగర్స్ కోసం ఎన్నో ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ చేయాలనుంటుంది. అన్నిటికీ డబ్బు సమస్యే. వున్నంతలో – అటు తరానికి ఇటు తరానికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. స్పాన్సరర్స్ వుంటే ఏ గ్రేడ్ సింగర్స్‌ని పెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు.

> ఇప్పుడు మీ సంస్థలన్నీ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ డబ్బు ఎలా వస్తుంది?

* నా సంస్థకి ఎవరూ డోనర్స్ లేరండి. ప్రోగ్రామ్స్ కూడా సింగర్స్‌ని కలుపుకుని, షేరింగ్ పధ్ధతిలోనే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇందులో లాభం వుండదు. నష్టం వచ్చినా, భరించడానికి సిధ్ధంగా వుండాలి. అద్భుతంగా పాడే సింగర్ ఖర్చు భరించడానికి ముందుకు రారు. ముందుకు వచ్చిన సింగర్స్ అద్భుతంగా పాడలేకపోవచ్చు. ఈ రెంటి మధ్య ప్రోగ్రామర్ ఇరుక్కుపోతున్న మాట వాస్తవం. నా సంగీత విభావరీలన్నీ – క్లిక్ అయేలా జాగ్రత్త పడుతుంటాను. అందులో నేను పాడినా, పాడలేని కష్టతరమైన సాంగ్స్ జోలికి వెళ్ళను అందుకే! (నవ్వులు).

> ప్రభుత్వం నించి సహకారం వుంటే బావుంటుందనుకుంటున్నారా?

* అందరకీ గవర్న్మెంట్ సాయం అంటే కష్టమే. కానీ క్వాలిటీ చూసి అయినా ఫండ్స్ అరేంజ్ చేస్తే, వేణ్ణీళ్ళకి చన్నీళ్ళన్నట్టు – ఖర్చుల భారం తగ్గుతుంది. సంస్థలు నిలబడగలుగుతాయి. కొత్తగా ఆలోచించి నూతన ప్రక్రియలు ప్రవేశ పెట్టే వెసులుబాటు వుంటుంది. ముఖ్యంగా మరుగున పడ్డ మన సంగీత సాహిత్య గాన ప్రదర్శనలు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం దక్కుతుంది.

> వేదిక మీద పాడాలని ఉవ్విళ్ళూరే గాయనీ గాయకులు మీ సపోర్ట్ ఎలా వుంటుందా?

* తప్పకుండానండి. నా సంస్థ ద్వారా ఎంతో మంది నూతనగాయనీ గాయకులని పరిచయం చేసాను. వయసుతో సంబంధం లేదు. ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు.

> మీ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారని విన్నాను.

* సేవా కార్యక్రమాలని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నానండి. పెద్దల ఆర్థిక సహకారాన్ని కూడా అర్థించాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా అయితే, మా అబ్బాయి పేరు మీద అవార్డ్‌ని నెలకొల్పి, ప్రతి యేడూ ఒక టాలెంటెడ్ సింగర్‌కి ఈ అవార్డ్ నివ్వాలని నిర్ణయం తీసుకున్నాను. వారిలో… మా సుజిత్‌ని, వాడి జ్ఞాపకాలని సజీవంగా చూడాలని… (అంటూ దుఃఖం ఆపుకోలేక, రెండు చేతుల్లో ముఖం దాచేసుకున్నారు..).

(బాధతో తలొంచేసుకున్నాను. సుజిత్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. కాంపస్ సెలెక్షన్‌లో జాబ్ సిధ్ధంగా వుంది. మరో వైపు ముమ్మరంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. అంతా శుభప్రదంగా జరిగిపోతున్న తరుణంలో .. ఈ అఘాయిత్యం జరిగిపోయింది. చెట్టంత కొడుకుని పోగుట్టుకున్న ఆ తల్లి గర్భ శోకం సముద్ర ఘోష.. ఎవరు ఓదార్చినా ఎంతగా అణచాలని ప్రయత్నించినా సాధ్యమౌతుందా?.. మాటల్లో తప్పిస్తూ వచ్చాను కానీ, పగిలిన గుండెని అతికించగలమా!!..).

కొంత సేపటికి తేరుకుని మామూలు మనిషి అవుతూ.. ‘ఏమీ అనుకోకండి మేడం..’ అంటుంటే.. మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది.

> (ఎప్పట్లానే అన్నాను ఓదార్పుగా) మీరు గతాన్ని మర్చిపోవాలి అని అనను. కానీ, సుజిత్ కిష్టమైన సంగీత కార్యక్రమాలను మీరు కొనసాగించాలి. మీ పెద్దబ్బాయి మహేష్ కూడా సింగర్ కదూ, అతన్నీ వెలుగులోకి తీసుకు రావాలి. మీ అబ్బాయి పెళ్లిళ్ళకి మమ్మల్నందర్నీ పిలవాలి. మీ మనవళ్లతో ముని మనవళ్లతో కలిసి పాటలు పాడుతూ నవ్వుతూ కనిపించాలి…

* (ఉప్పెన తర్వాత వెలుతురిలా నవ్వుతూ…) అలానే మేడం. మీ ఇంటర్వ్యూ ద్వారా నేను థాంక్స్ చెప్పుకోవచ్చా అండీ?

> ఎవరికి చెపాలనుకుంటున్నారు?

* నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మీకు, సంచికకు, ఈ పత్రికా సంపాదకులకు చాలా థాంక్స్ మేడం. అలానే మా అబ్బాయి లేత గాత్రాన్ని వింటూనే  మెచ్చుకుని ప్రోత్సహించిన గురువులు – గౌరవనీయులైన హరిప్రియ గారు (హైదరాబాద్ సిస్టర్స్), మాధవీ లత గారు (నిత్యసంతోషిణి సోదరి) గారికీ, మా వాడు ‘అన్నా’ అని పిలుచుకుంటూ, అమితంగా ఇష్టపడే కీ బోర్డ్ ప్లేయర్ సూర్య తేజ గారికీ (సుజిత్‍కి గైడన్స్ ఇచ్చేవారు), తమ ఆల్బంలో పాడించిన శ్రీ త్రినాథ రావ్ గారికీ, మాస్టర్ జీ కి, వేదికనందించిన ఆర్.విశ్వనాథ్ గారికి, వాణ్ని బిడ్డలా ప్రేమించి, ఆదరించి, వెన్ను తట్టి ముందుకు నడిపిన ప్రతి పెద్ద మనసుకీ, ప్రముఖులకీ, నాకు అండగా నిలుస్తున్న మీ అందరికీ, త్యాగరాయ గాన సభలో హాల్స్ ఇచ్చి ప్రోగ్రామ్స్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న శ్రీ త్యాగ రాయ గాన సభ అధ్యక్షులు, సోదరులు అయిన శ్రీ జనార్ధన మూర్తి గారికి.. శ్రీనివాస్ గారికి, నాకెన్నో పాటలు ఇచ్చి వేదిక మీద పాడించిన శ్రీమతి ఆమంత గారికి, ఇంకా.. నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు… అందరకీ పేరు పేరునా నా కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటున్నాను మేడం ( అంటూ చేతులు జోడించారు..).

సంచికతో మాట్లాడుతుంటే మనసు తేలికైనట్టుంది మేడం.. నిజం (అన్నారు స్వచ్ఛమైన మనసుతో..).

> సంతోషమండి. అలానే, మీ కృతజ్ఞతలని అందచేస్తాం. మా పత్రికని – మీ గ్రూప్ వారందరితో నిరభ్యంతరంగా షేర్ చేసుకోవచ్చు. సంచిక తరఫున  మీకు మా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీరు మరిన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని అభిలషిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ శారద గారు.

***

శ్రీమతి శారద

శ్రీ శారద మ్యూజిక్ అకడెమీ

6-64 బాలాపూర్ క్రాస్ రోడ్స్, మీర్ పేట్, హైదరాబాద్

సెల్ : 80080 85776 (వాట్సప్), 9985245442.

                       

 

  1. శ్రీ శారద మ్యూజిక్ అకాడమి | రాజులకే రారాజువు నీవే – సినీ గానసుమాంజలి | Live

https://www.youtube.com/watch?v=0HiTJZIT0tE

 

  1. https://www.youtube.com/watch?v=0HiTJZIT0tE

https://www.youtube.com/watch?v=0HiTJZIT0tE

 

  1. శ్రీ శారద మ్యూజిక్ అకాడమి & స్రవంతి ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ | సినీ సంగీత విభావరి | Live

https://www.youtube.com/watch?v=8YPi7JAqGdY

 

4.శ్రీ శారద మ్యూజిక్ అకాడమి | మధురభావాల సుమమాల – సినీ సంగీత విభావరి | Live

https://www.youtube.com/watch?v=XsfaI8R0D6g

 

  1. శ్రీ శారద మ్యూజిక్ అకాడమి | ఇదేమి లాహిరి… ఇదేమి గారడి – సినీ సంగీత విభావరి | Live

https://www.youtube.com/watch?v=TCZF2VcIwEw

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here