ట్విన్ సిటీస్ సింగర్స్-9: ‘నా ప్రేక్షకుల ఆదరాభిమానాలే నాకు కీర్తి కిరీటాలు..’ – ‘గాన కళా రత్న’ శ్రీమతి టి. లలితా రావ్

1
6

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – ‘అదెంత కష్టమైన పాట అయినా సరే ఇష్టంగా నేర్చుకుని, తదనుగుణ రీతిలో సాధన చేసి కాని వేదిక మీదకి రాను’ అనే శ్రీమతి టి. లలితా రావ్  గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

[dropcap]ఇ[/dropcap]టు అందమూ, అటు అందమైన స్వరమూ రెంటినీ సొంతం చేసుకుని, వెరసి ‘అందమైన గాయని’గా ప్రేక్షకులచే గుర్తింపు పొందిన గాయని – శ్రీమతి టి. లలితా రావ్!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టి పెరిగారు. వివాహానంతరం భర్త వృత్తి రీత్యా అనేక దేశ విదేశాలలో నివసించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తన అమ్మమ్మ గారి గాత్ర కళ, అమ్మగారి భక్తి గాన ఝరి, హరి దాసు అయిన తాత గారు – రేలంగి వెంకట రత్నంగారి గానమృత స్ఫూర్తి – తబలా, వయొలిన్ వాయిద్య కళాకారులు అయిన మేనమామల ప్రోత్సాహం – తను గాయని కావడానికి ప్రేరణగా నిలిచాయి అంటూ అభిప్రాయపడ్డారు.

పాట అంటే ప్రాణం. పాట కోసమే తాను పుట్టానేమో అని చాటుకుంటారు. పాట వింటూ ఆకలి దప్పులు కూడా మరచిపోయే సంగీత ఆరాధకురాలు- లలితా రావ్.

ఒక సారి వేదిక మీద సుశీలమ్మ గారి సమక్షంలో వారికి ఇష్టమైన గీతం – ‘నీ ఎదుట నేను..నా ఎదుట నీవూ ‘ అనే మధుర గీతాన్ని ఆలపించి, ‘శభాష్’ అనిపించుకున్న విజేత. ‘ఆ రోజు మరపు రాని మధురమైన రోజు’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. అనేక ప్రముఖ సాంస్కృతిక సంస్థలు నిర్వహించే అనేకానేక చిత్ర లహరి కార్యక్రమాలలో పాల్గొని, గత ఐదేళ్ళుగా వేదికలపై 700 పాటలు ప్రదర్శించి, పలువురి సినీ ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు, అనేక అవార్డ్స్‌తో బాటు పలు బిరుదులను కూడ కైవసం చేసుకున్నారు. ఒకసారి కృష్ణ, విజయ నిర్మల గారి నివాసంలో – ఆ ఇరువురూ కలిసి నటించిన చిత్రాల నించి హిట్ సాంగ్స్ పాడి వినిపించినందుకు గాను ఆ దంపతులు సంతోషంతో తనని ప్రశంసించి సత్కరించడం – ఒక అపురూపమైన అనుభవంగా పేర్కొంటారు.

త్యాగ రాయ గాన సభలో శ్రీమతి లలితా రావు గారు లేని పాటల ప్రోగ్రాం వుండదంటే అతిశయోక్తి కాదు. ‘అదెంత కష్టమైన పాట అయినా సరే ఇష్టంగా నేర్చుకుని, తదనుగుణ రీతిలో సాధన చేసి కాని వేదిక మీదకి రాను’ – అంటూ స్థిరంగా చెబుతున్న ఈ గాయని ప్రయాణం ఎలా మొదలైందీ అంటే…

ఇంటర్వ్యూ చదివి తెలుసుకుందాం..

***

హలోండీ. ఎలా వున్నారు లలిత గారు?

* బావున్నానండి. (నవ్వుతూ) ఇంటర్వ్యూ అడిగారు గుర్తుంది.. ఇవాళ రాగలరా ప్లీజ్?

హమ్మయ్య. ఇన్నాళ్ళకి వీలు చిక్కిందన్న మాట మీకు. సాయంత్రం రానా?

* (నవ్వులు) సాయంత్రం త్యాగరాయ గాన సభ మినీ హాల్‌లో శారద ప్రోగ్రాం వుందండి. మెయిన్ సింగర్ ని నేనే.. రేపు పన్నెండు గంటల ప్రోగ్రాం వుంది, మీకు ఇన్విటేషన్ పంపాను. తప్పక రావాలి. మళ్లా యెల్లుండి విజయవాడకి వెళ్తున్నాం.. ఈ నెలంతా బిజీ గానే వున్నా. మీరు వచ్చేయండి. ఎదురుచూస్తుంటాను.

ఇంటర్వ్యూ కోసం టైం కేటాయిస్తున్నందుకు థాంక్సండి. అరగంటలో వచ్చేస్తా.. నే వచ్చే లోగా, ప్రోగ్రాం వస్తే మాత్రం నో అని చేప్పేయండి.

* (నవ్వులు) భలే వారే. మీ కంటే ప్రోగ్రాం ముఖ్యమా?

థాంక్యూ. వస్తున్నా.

* థాంక్ యు. బై.

***

ఇంత బిజీ సింగర్ అవుతారని మీరెప్పుడైనా ఊహించారా?

* ఊహు. అస్సలు అనుకోలేదు. కానీ కల నిజమాయెగా అని పాడుకుంటుంటాను.

సినీ గీతాల పై మీకు మక్కువెలా కలిగింది?

* మక్కువ అనే మాట చిన్న మాటేమో నండి. ‘పిచ్చి’ అంటే సరిగ్గా సరిపోతుంది. పిచ్చిలో కూడా మహా పిచ్చి, నెంబర్ వన్ పిచ్చి అన్నమాట. (నవ్వులు). అంత మహాప్రేమ నాకు – పాటంటే.

ఎప్పట్నించి మీకింత వ్యామోహం కలిగింది పాటల మీద?

* నా చిన్నప్పట్నించి కూడా పాటల పిచ్చి వుండేది. ఎంత పిచ్చి ఇష్టమంటే, చెప్పలేనంత! పాట వినిపిస్తే చాలు, పరవశమై పోయేదాన్ని. మా ఇంట్లో రేడియో వుండేది కాదు. మా వెనకింటి వారింట్లోంచి వినిపించే పాటలు వింటం కోసం నేను గోడ దగ్గరే తిష్ట వేసేదాన్ని. మా అమ్మ గారు ‘అక్కడేం చేస్తున్నావ్?, ఎప్పుడూ అక్కడెందుకు తిరుగుతుంటావ్?’ అని కేకేసేవారు. అప్పుడప్పుడు విసుక్కునేవారు కూడా. ఇలా కాదని, ఏదో ఒక పని కల్పించుకుని, పాటలు వచ్చే సమయానికి ఎంచక్కా, గోడ దగ్గర చేరి అక్కడక్కడే తచ్చాడుతుండేదాన్ని. దండెం మీద బట్టలు ఆరేస్తూనో, ఆరినవి తీసి మడతలేస్తూనో, పూలు కోస్తున్నట్టో అలా నటించేసేదాన్ని. అమ్మ కేకేసినప్పుడల్లా, ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా అని చెప్పేదాన్ని. లేని పనులు అన్నీ కల్పించుకుని.. ఏ పని లేకపోతే, చెట్ల దగ్గర కుర్చుని చదువుకుంటున్నా అని చెప్పేదాన్ని. అప్పట్లో రేడియోలో చిత్ర లహరి పాటల కార్యక్రమం పరిమిత సమయాలలో మాత్రమే ప్రసారమయ్యేది. ఆ గంట సేపు – పాటలు వింటూ నేను నేనుగా మిగిలి వుండేదాన్ని కాదంటే, అర్ధం చేసుకోండి- పాటలంటే నాకెంత పిచ్చో! అన్ని పాట్లు పడేదాన్నన్నమాట, రేడియోలో వచ్చే సినిమా పాటలు వింటానికి.. (నవ్వులు). అప్పుడు నా వయసు ఏడేళ్ళు.

ఎక్కువగా ఎవరి పాటలు వింటుండేవారు.

* ఊహ తెలీనప్పుడు అందరి గాత్రాలు అద్భుతం గానే వున్నా, ఆ తర్వాతి కాలంలో ఘంటసాల గారి గాత్రానికి బానిసయ్యానని చెప్పాలి. ఆయన స్వరం వినిపించడం ఆలస్యం.. వొళ్ళంతా చెవులైపోయేవి. అంత ప్రాణం నాకు ఘంటసాలగారి పాట అంటే!

సహజంగా ఫిమేల్ సింగర్స్ తమ అభిమాన సింగర్స్ లత అనో సుశీల, జానకి, చిత్ర అనో చెబుతుంటారు కానీ మీరు ఘంటసాల గారి గాత్రానికి మంత్రముగ్ధులైనట్టు చెప్పడం ప్రత్యేకంగా అనిపిస్తోంది.

సరే మరి, మీ రేడియో కథ చెబుతా అన్నారు? మీ నాన్న గారిచేత రేడియో కొనిపించిన ఘనత మీదే కదూ? (నవ్వులు)

* అవును. మా ఇంట్లో కూడా రేడియో వుంటే హాయిగా పాటలన్నీ వినేయొచ్చని, మా నాన్న గారిని బతిమలాడి బామాడి నస పెట్టి మరీ ట్రాన్సిస్టర్ కొనిపించాను. దాని ఖరీదు 150 రూపాయలు. అప్పట్లో అది పెద్ద మొత్తమే.

అలా మీ సమస్య తీరిపోయిందన్నమాట?

* భలే వారే. అలా తీరితే అది సమస్య ఎలా అవుతుంది. సరిగ్గా అప్పట్నించి నా కష్టాలు మొదలయ్యాయి అని చెప్పాలి. పాటలు వినడానికి మరిన్ని కష్టాలు పడ్డాను.

అదెలా?

* ఎలా అంటే, మా నాన్న గారు రేడియో కార్యక్రమాలు వినే వారు. రైతు సమస్యలు, కార్మికుల కార్యక్రమాలు, వార్తలు. నేనెప్పుడైనా పాటల కోసం స్టేషన్ మార్చానో ఆయనకి కోపమొచ్చేసేది.

ఎందుకు కోపం?

* నాన్న గారికి పాటలంటే చికాకు. అసలా చప్పుడే వినిపించకూడదు.

అయ్యో! మరి ఎలా వినేవారు?

* అందుకు మార్గాలు వెదుకుతుండేదాన్ని. ఆయన ఆఫీస్ కెళ్ళే దాకా ఎదురుచూసేదాన్ని. కానీ, అప్పటికి పాటలైపోయేవి. రాత్రిళ్ళు తొమ్మిది దాటాక వచ్చే గంట సేపటి పాటల కార్యక్రమం కోసం పడికాపూలు కాసేదాన్ని. (నవ్వులు). ఆయన తొమ్మిదింటికల్లా నిద్ర పోతారు. ట్రాన్సిస్టర్‌ని తెచ్చుకుని నా దిండు మీద పెట్టుకుని, నిండా దుప్పటి కప్పేసుకుని, పక్క మనిషికి సైతం శబ్దం వినిపించనంత వాల్యూంలో రేడియోకి చెవి ఆంచి , ప్రాణాలు ఉగ్గపెట్టుకుని వింటుండేదాన్ని. ఒక్కోసారి, రేడియో చెవికి నొక్కుకుపోయి తెల్లారయేసరికి బాధపెట్టేది. తెల్లారాక చెవి ఎరుపు చూసి మా వాళ్ళు అడిగేవారు, అయ్యో, అదెమిటీ అని.

రాత్రి అటు వొత్తిగిలి పడుకున్నా. నిద్రలో తెలీలేదు. నొక్కుకుపోయిందేమో.’ అని చెప్పేసేదాన్ని. (నవ్వులు). ఇక పగలైతే రేడియోతో పాటు సమానంగా పాటలన్నీ పాడేసేదాన్ని. అదే సాధనగా మారిందని ఇప్పుడు తెలుస్తోంది – అలా పాటలన్నీ విని వినీ, పాడీ పాడీ ఆ కాలపు ఆ పాత మధురాలన్నీ కంఠతా వచ్చేసాయి. పాటతో బాటు మ్యూజికల్ బిట్స్ తో సహా మనసులో రికార్డైపోయాయి. అవే చెవుల్లో మారు మోగుతుంటాయి. నేనెప్పుడూ పాటకి వీరాభిమానిని. ఆ పాటే నాకు ఎందరో అభిమానులని సంపాదించి పెట్టిందంటే – ఆశ్చర్యంగా, ఆనందంగానూ వుంటుంది. ఇంతమంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నానూ అంటే, అదంతా, పాటని మనసారా పూజించుకున్న ఫలం అని భావిస్తా.

మీ అభిమానులలో నేనూ ఒకర్ననండి. మీరు సాధించిన విజయానికి అభినందనలు.

సరే, రేడియో దగ్గర ఆగాము. అక్కణ్ణించి కంటిన్యూ చేద్దాం. మీ వివాహానంతరం రేడియో వినే పూర్తి స్వేచ్ఛ కలిగిందేమో కదూ?

* అబ్బే. లేదండి. నాకు చిన్న వయసులోనే వివాహం జరిగిందండి. అందమైన కోడలు కావాలని మా మావగారు – పిల్ల కోసం వెదుకుతుంటే, నా గురించి తెలుసుకుని మా ఇంటికి వచ్చారు. చూసారు. వెంటనే ఇరు పక్షాల మధ్య మాటాలు జరిగిపోయాయి. పెళ్లైపోయింది. అప్పుడు నాకు 15 యేళ్ళు. ఇరవై నిండకముందే పిల్లలు, సంసారం, బాధ్యతలతో కాలం నడిచింది. అయితే గొప్ప సంతోషకరమైన వార్త ఏమిటంటే రేడియో వినే స్వేచ్చ పూర్తిగా కాకున్నా, కొంతలో కొంత నయం అని చెప్పాలి. (నవ్వులు). ఆయన బాంక్‌కి వెళ్ళిపోయేవారు. ఇక ఆయన వచ్చేదాక రేడియో అలా మోగుతూనే వుండేది. ఆయనకి అప్పట్లో పాటలంటే ఇష్టముండేది కాదు. ఇప్పుడు ఆయనా గాయకులయ్యారు లేండి, అది వేరే సంగతి. (నవ్వులు). నాకోసమని టేప్ రికార్డర్ కొనిచ్చారు. కాసెట్లు అయితే గుట్టల కొద్దీ వున్నాయి. ఘంటసాల గారి పాటల కాసెట్లు ఎన్ని కొనేదాన్నో! మూటల కొద్దీ.. వున్నాయి. ఇప్పటికీ వాట్ని అలానే దాచి వుంచాను. వాడుకలో లేకున్నా…పారేయలేను.

నాలుగు గోడల మధ్యనే సాగిపోతున్న మీ పాట వేదిక వరకు ఎలా వచ్చింది? మీకు తొలి అవకాశం ఎలా కలిగింది?

* అప్పట్లో సరదాగా బ్యూటిషియన్ కోర్స్ చేస్తుండేదాన్ని. పార్లర్‌లో మోగే ప్రతి పాటనీ హం చేస్తుంటె నా ‘కో ట్రైనర్’ అమీన నా స్వరం విని, తనకి పాటలంటే చాలా ఇష్టమని చెబుతూ, నాతో తన ఫేవరేట్ సాంగ్స్‌ని అడిగి పాడించుకుని ఆనందిస్తుండేది. ఒక సారి వాళ్ళింటికెళ్ళినప్పుడు, వాళ్ల ఫామిలీకి నన్నొక గాయనిగా కూడా పరిచయం చేస్తూ అందరిముందూ పాటలు పాడించుకుంది. ఆ మర్నాడు, ఫోన్ చేసి, తన కజిన్‌కి నా పాట చాలా నచ్చిందనీ, ఆయన మ్యూజిక్ ప్రోగ్రాం ఆర్గనైజర్ అనీ, ఆయన తన ప్రోగ్రాంలో నా చేత పాటలు పాడించాలని అనుకుంటున్నాడని చెప్పింది. ఆమె మాటలు వినంగానే ఎక్కడ్లేని కంగారు పుట్టుకొచ్చింది. అమ్మో స్టేజ్ మీద నేను పాడనని చెప్పేశా. నా వల్ల కాదు. నాకు స్టేజ్ అంటే చచ్చేంత భయం, వొణుకు. నాకలవాటు లేదని చెప్పేసా. ఆమె బ్రతిమిలాడినా విన్లేదు. ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఆ తర్వాత మళ్లా ఫోన్ చేసి అడిగింది. ఈ సారి అయినా పాడతావా లేదా అని. నో అన్నాను కానీ ఆమె ఊరుకోలేదు. కనీసం రెండు అయినా పాడాల్సిందే అంటూ పట్టుపట్టింది. కాదనడానికి సంస్కారం అడ్డొచ్చింది. రెండు హిందీ పాటలు సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసాను. ఒకటి – జరాసి ఆహత్, రెండు – తుమ్హీ మేరి మందిర్.. అప్పట్లో కరఒకే సదుపాయం లేదు. విని నేర్చుకోవడమే. నేను బెరుకు బెరుకుగా వెళ్ళి కుర్చున్నాను. స్టేజ్ చూస్తే కళ్ళు తిరిగాయి. అది పెద్ద బానర్. శ్రీ అల్తఫ్ అహంద్ గారి అజంతా ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఈవెంట్. వేదిక మీద ఈ చివర్నించి ఆ చివరిదాకా అర్కెస్ట్రా మ్యూజిషియన్స్. కీ బోర్డ్, తబలా పాడ్స్ గిటార్,సితార, ఫ్లూట్, డ్రంస్.. ఇంకా నాకు తెలీని పేర్లు గల ఇన్‌స్ట్రుమెంట్స్ కనిపించాయి… మరో పక్కన పేరుమోసిన సీనియర్ సింగర్స్. సినిమా స్టార్స్‌లా తళుక్కు తళుక్కున మెరుస్తూ హుషారుగా నవ్వుతూ అలవోకగా పాడేస్తున్నారు. వీళ్ళ మధ్య నేను జీరో అనిపించేసింది. భయంతో పారిపోవాలనిపించింది. మరోపక్కన ధైర్యం తగ్గిపోతున్నట్టనిపిస్తోంది. నా వంతు వచ్చినప్పుడల్లా, తర్వాత పాడుతా అంటూ కాలం గడుపుతూ వచ్చా. చివరికి – ఎలానో అలా ధైర్యం చేసి పాడేసాను. గ్రీన్ రూం లోకొచ్చిపడ్డాను. గుండె దడ తగ్గకముందే మ్యూజీషియన్స్ నా దగ్గరకొచ్చి నన్ను ప్రశంసలతో ముంచెత్తడమే కాదు, పూల దండలేసి, ఎంతగా కొనియాడారంటే నేను ఆ సత్కారానికి, ఆ ప్రశంసల జల్లులకి ఆనందంతో తబ్బిబ్బైపోయానంటే నమ్మండి. గుండె పట్టని ఆనందంతో మాటలు రాని దానిలా అలా చూస్తుండిపోయా. ఇంటికి ఎలా వచ్చానో తెలీలేదు. ఆ తర్వాతి మూడు రోజులు నిద్రే పట్టలేదు..పట్టలేని సంతోషంతో. సక్సస్ అంటే ఇంత అద్భుతంగా వుంటుందన్న మాట అని తెలుసుకున్నాను. ఆ మధురానుభూతిని మాటల్లో చెప్పలేను. నిజంగా వారిని నేను ఈ లైఫ్‌లో మరిచిపోలేనండి. అంత గొప్ప ప్రోత్సాహాన్నిచ్చి నాకెంతో పేరు తెచ్చిపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్స్‌లో చాలా పాటలు పాడాను. ఒకసారి ఓల్డ్ బస్తి ఓపెన్ గ్రౌండ్‌లో జరిగిన గ్రాండ్ ప్రోగ్రాం ఒక అందమైన స్వప్నంలా జరిగింది. ఆ తర్వాత రవీంద్ర భారతిలో పాడటం, అక్కణ్ణించి త్యాగరాయ గాన సభలోకి అడుగు పెట్టి, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయడం వరకు వచ్చాను.

త్యాగరాయ గాన సభలో మీ ఎంట్రీ ఎలా జరిగింది?

* ఒకసారి మ్యూజిక్ సిస్టం కొనడం కోసం వెళ్ళినప్పుడు, ఆసిఫ్‌తో పరిచయం కలిగింది. – ఆసిఫ్ ద్వారా వై ఎస్ రామకృష్ణ గారి గురించి తెలుసుకోవడం రవీంద్ర భారతిలో పాడటం జరిగింది. అక్కడ ప్రముఖ గాయని అఖిల గారు నా పాట విని, త్యాగరాయ గాన సభలో పాడండి అంటూ సలహా ఇచ్చారు. ఆ మర్నాడు – శ్రీనివాస నాయుడు గారి ప్రోగ్రాంకి రమ్మనడంతో వెళ్ళాను. ఆమె నన్ను అందరికీ పరిచయం చేస్తూ, నేను మంచి గాయని అని చెబుతుంటే, భలే సిగ్గేసింది, కొంచెం గర్వంగా కూడా అనిపించింది.

అలా అలా అన్ని సంస్థల వారితోనూ పరిచయాలు పెరిగి, వారు నిర్వహించే అనేక ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడం ద్వారా త్యాగరాయ గాన సభ వేదిక మీద పాపులర్ అయ్యానని చెప్పాలి. నన్ను ప్రోత్సహించిన వారిలో అమంత గారి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. వారి స్వరభారతి సాంస్కృతిక సంస్థ ద్వారా నన్ను చాలా ఎంకరేజ్ చేసారు. ఎన్నో వైవిధ్యభరితమైన గీతాలను పాడించారు. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

పాటలు సెలెక్షన్‌లో ఇబ్బంది పడిన సందర్భాలేమైనా వున్నాయా?

* వున్నాయండి. కొత్తల్లో కొన్ని ఫాస్ట్ సాంగ్స్ పాడటానికి బిడియపడేదాన్ని. చిగురేసే మొగ్గేసే వంటి పాటల్ని కూడా పాడటానికి మొహమాటపడి, పాడనని చెప్పేదాన్ని. ఒకసారి రామకృష్ణ గారు అన్నారు, గాయని అన్నాక, అన్ని రకాల పాటలని పాడగలిగి వుండాలని, అదే సింగర్ సక్సెస్‌కి రహస్యమని సలహాగా చెప్పారు. ధైర్యం చేసి పాడాను. ఆ నాటి ప్రోగ్రాంలో ఆ పాటే హైలైట్ అయింది. ఆ పిమ్మట, చాలా హుషారు గీతాలని కూడా పాడటం నేర్చుకున్నాను.

మీరు పొందిన అవార్డులు, సన్మానాలతో బాటు బిరుదులు కూడా అందుకున్నారు..

* బిరుదు గురించి ఎప్పుడూ గుర్తుండదండీ. అదిగో ఎదురుగా ఈ నిలువెత్తు ఫోటో చూస్తే తప్ప నాకు బిరుదులున్నాయని గుర్తుకురాదు. (నవ్వులు). ప్రతిష్ఠాత్మకమైన వంశీ సంస్థ ద్వారా ‘గాన కళా రత్న ‘ బిరుదుని అందుకోవడం, ఘన సత్కారాన్నందుకున్నందుకు గర్వంగానే వుందండి. అలానే ప్రతిష్ఠాత్మక సంస్థ ఎక్స్ రే ద్వారా బిరుదుని అందుకున్నాను. భయపడుతూ వేదిక పైకి అడుగులు వేసిన మెట్టు నించీ, ఇలా ఈ పై మెట్టు వరకూ వచ్చానూ అంటే అంతా సాయి కృప. అభిమానుల ఆదరణ.

గాయనిగా మారడానికి మీకు స్ఫూర్తినిచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

* మా తాతయ్య గారు హరికథలు చెప్పేవారు. మా అమ్మ గారు చాలా బాగా పాడేవారు. మా అమ్మ గారి గాత్రం చాలా బావుంటుంది. ఆమె వాయిస్ ఖంగున మోగేది. మైక్ అవసరం లేదు. అన్నమయ్య, రామదాసు, సాంప్రదాయ గీతాలు, మంగళ హారతులు – పెళ్ళి పాటలను ఎంతో అద్భుతంగా పాడేవారు. ఆమె వేదికల మీద పాడేవారు కాదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు, తమ తమ కుటుంబాలలో జరిగే అన్ని శుభకార్యాలకీ మా అమ్మ గారిని పాటలు పాడేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. పెళ్ళి కూతుర్ని చేసే సన్నివేశం నించి, అప్పగింతల దాకా ప్రతి ఘట్టానికి అంచలంచెలుగా సాంప్రదాయ పాటలుంటాయి. అవన్నీ అమ్మ సందర్భానుసారంగా, శ్రావ్యంగా, భావయుక్తంగా పాడేవారు. అప్పగింతల పాటకి… చలించని వారుండేవారా! అంతటి ఆర్ద్రత పుట్టించే స్వరం ఆమె సొంతం. వినే వారి కళ్ళల్లో కన్నీళ్ళూరేవి. అలా పాడేవారు. ఆమెదొక ప్రత్యేక స్వరం. మైక్. నాకు ఆ విద్య అబ్బలేదు. మా చెల్లికీ రాలేదు. అమ్మని తలచుకుంటే భలే గర్వంగా వుంటుంది. అయితే సినీ గీతాల పట్ల ఆమెకి ఆసక్తి లేని మాట వాస్తవం. రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య, సాంప్రదాయ పెళ్ళి పాటలు, భక్తి గీతాలు ఆలపించేవారు.

మీరు సంగీతం నేర్చుకున్నారా?

* లేదండి. అస్సలు తెలీదు. నేనిప్పుడు పాడుతున్న పాటలన్నిటికీ మూలాధారం, వినికిడి జ్ఞానం 50 శాతమని చెప్పాలి. మిగిలింది ప్రాక్టీస్. పాటని ఒకటికి పదిసార్లు సాధన చేస్తాను. ఇప్పడు మనకు ఎన్నో సౌకర్య సాధనాలు అందుబాట్లో వున్నాయి. వాట్ని అందిపుచ్చుకుని, ఎంతటి కష్ట తరమైన పాటని కానీండి అవలీలగా నేర్చుకోగల్గుతున్నాం. సింగర్స్ పాలిట ఇదొకవరం. మహా భాగ్యమని చెబుతా. ఎందుకంటే ఇంత సులువైన విధానాలేవీ లేని కాలాన్ని చూసిన దాన్ని, శ్రమపడిన దాన్ని కాబట్టి..

మీరు త్యాగరాయ గాన సభ ద్వారా పాపులర్ అయ్యారు..ఎంత కాలం నించి పాడుతున్నారు ఇక్కడ?

* ఐదేళ్ళు అయిందేమోనండి..

గానసభ ప్రేక్షకుల ప్రశంసలు చాలు నాకు, అవి వెల లేని అవార్డ్స్ అని అంటుంటారు?

* అవునండి. ప్రేక్షకులలో చాలా మంది సంగీత మేధావులున్నారు. సద్విమర్శకులున్నారు. పాట వీనుల విందుగా వుంటే వెంటనే స్పందించి తమ హర్షాన్ని తెలియచేస్తారు. ఒకోసారి వేదిక మీదకి వచ్చి తమ అభినందనలని అందచేస్తుంటారు. చాలా ఆనందంగా, థ్రిల్లింగ్‌గా వుంటుంది.. ఎంతైనా ప్రేక్షక దేవుళ్ళు కదా! ఈ సందర్భంగా నా అభిమాన ప్రేక్షకులందరకీ నా అభివందనాలు తెలుపుకుంటున్నాను.

మీ తాత గారి హరిదాసు అని చెప్పారు..వారి శిక్షణలో పద్యాలు నేర్చుకున్నారా?

* మా తాత గారు – రేలంగి వెంకట రత్నం గారు. హరిదాసుగా చాలా పాపులర్ ఆర్టిస్ట్. ఆయన వూళ్ళోకి వస్తే, చుట్టుపక్కల వాళ్ళు గుమికూడి కథ చెప్పమనేవారు. రాత్రుళ్ళు పనులన్నీ పూర్తి చేసుకుని, త్వర త్వరగా భోజానలు కానిచ్చేసి, మా ఇంటికొచ్చేవారు. వెన్నెల్లో మంచాలు వేసుకుని, ఆయన చెప్పే రాజు గారి కథలు వింటూ మైమరచి పోయేవారు జనం. కథ చెప్పడంలో మా తాతగారు ఆయనకాయనే సాటి అని చెప్పాలి. మా కుటుంబంలో తాత గారు హరిదాసు. మేనమామలు రాజా రావ్, భాస్కర్ మృదంగం, వైలనిస్ట్. ఈ ముగ్గురూ వేదిక మీద వుంటే ప్రేక్షకులకి వీనుల విందన్నమాటే. అమ్ముమ్మ, అమ్మ గాయనీ మణులు.

* పద్యాలు నేర్చుకోలేదు కానీ, ఏలూరులో వున్నప్పుడు భజన్స్ జరిగేవి. ప్రతి శనివారం జరిగే భజనా కార్యక్రమాలకు తప్పని సరిగా హాజరయ్యేదాన్ని. తాళం వేసేదాన్ని. ఇది కూడా నాకు తెలీకుండానే అలవడిన సాధన అని చెప్పొచ్చు. అలా తాళ జ్ఞానం అబ్బింది.

ఇప్పటి దాకా ఎన్ని సాంగ్స్ పాడి వుంటారు?

* సుమారు 700 పాటలు పాడాను.

పాటని ప్రెజెంట్ చేసేటప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకుంటారు?

* బాగా వినడం, పరిశీలనగా వింటం.. నోట్స్ ని అబ్జర్వ్ చేయడం చేస్తుంటాను.

మీ పాటలని మెరుగు పరచుకోవడంలో ఎవరి గైడెన్స్ అయినా తీసుకుంటారా?

* తీసుకుంటాను. రమణ గారు పెర్ఫెక్ట్ సింగర్.. చాలా మంచి మంచి సలహాలిస్తారు. బార్ కౌంటింగ్ నేర్చుకోమన్నప్పుడు నాకర్థం కాలేదు. దాని గురించి ఎంతో విశదీకరించి చెప్పారు. వినోద్ బాబు గారు కూడా రమణ గారి గురించి ప్రశంసించడం ఎంతైన ముదావహం.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకోవడం లేదా?

* చాలా మంది మేల్ సింగర్స్, సీనియర్ సింగర్స్ – సజెస్ట్ చేస్తూ, సలహాగా చెబుతున్నారు. ప్రముఖ గాయకులు శ్రీ బాలకామేశ్వర్ రావ్ గారు కూడా చాలా సార్లు చెబుతుంటారు. నాకేవైనా సందేహాలున్నప్పుడు పాట గురించి, ఆయన సలహాలు తీసుకుంటుంటాను. సంగీతంలో బేసిక్స్ అయినా, నేర్చుకుంటే, పాట వన్నె తేలుతుంది, ‘ఇంకా బాగా పాడతారు’ అంటూ చెబుతారు. కానీ సమయాన్ని కేటాయించలేకపోతున్నా. వీలు చిక్కినప్పుడల్లా శాస్త్రీయ సంగీతం వింటుంటాను.

సీనియర్ సింగర్స్ అయిన శ్రీ మిత్ర గారు, చంద్రతేజ గారు, బాల కామేశ్వర రావు గారితో కలిసి వేదిక మీద పాటలు పాడే గొప్ప అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా.

మీ సొంత సంస్థ శ్రీ సాయి లలిత మ్యూజి సంస్థ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చేతి డబ్బు పెట్టుకుని కార్యక్రమాలను చేస్తూ, ఎందరో కళాకారులను సత్కరిస్తుంటారు. సంతోషమే. కానీ ఎవరి చేయూతా ఏకుండా ఇంత ఖర్చుకి వెరవకుండా ప్రోగ్రామ్స్ చేయడం, భారమనిపించడం లేదా?

* ఆర్ధిక చేయూత వుంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయ గల్గుతాం. మా ప్రోగ్రామ్స్ క్వాలిటీ చూసి, కొంతమంది ముందుకు వస్తున్నారు. వాళ్లంతట వాళ్ళొస్తే బావుంటుందని నా అభిప్రాయం కూడా. మీరన్నట్టు ఖర్చుతో కూడుకున్నదే అయినా, పాటల మీద ప్రేమ కొద్దీ డబ్బు ఖర్చు చేస్తున్నాం. కష్టమైనా, ఇష్టంగా అన్నమాట. (నవ్వులు).

తెలంగాణా సాంస్కృతిక డిపార్ట్మెంట్ వారిని అప్రోచ్ అయితే, స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. ఐతే, కాలపరిమితి వుంటుంది. వెంటవెంటనే స్పాన్సర్ చేయరు.

మీరు ప్రైవేట్ రికార్డింగ్స్ చేయడం జరిగిందా?

* అవకాశాలు వచ్చాయండి. కానీ కుదరలేదు. ఇలానే పాటల కార్యక్రమాలలో బిజీగా వుంటం వల్ల. కానీ భవిష్యత్తులో ఒక సిడీ చేయాలనే సంకల్పం వుంది. ప్లాన్ చేస్తున్నాం.

మీ వారు టీ.వి. రావు గారు కూడా గాయకులుగా మారారు.. స్ఫూర్తిదాతలు మీరేనా?

* (నవ్వులు) అవునండి.

రావు గారు గురించి చెప్పండి. ఏం చేస్తుంటారు..

* ఆయన ఇండియన్ బాంక్‌లో చేసేవారు. ఆ తర్వాత స్టేట్ బాంక్ ఆఫ్ మారిషస్ లో.. ఉన్నత పదవీ బాధ్యతలని నిర్వహించారు.

పెళ్ళి చూపులకు వారొచ్చినప్పుడు పాట పాడారా, మీకెంతో ఇష్టమైనా గానం, ‘నీ ఎదుట నేను..’ అంటూ..

* (నవ్వులు) పెళ్ళిచూపులకు ఆయనొస్తేనే కదా పాడేందుకు.. (నవ్వులు). నేను టెంత్‌లో వుండంగానే వివాహం నిశ్చయమైపోయిందండి. మా వారు గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీలో. అప్పుడే బాంక్ ఆఫీసర్ అయ్యారు… వివాహానికి అందమైన అమ్మాయిని అడిగాడని, మా మావగారు పిల్ల కోసం వేట మొదలు పెట్టారుట. నన్ను చూసి, ఈమే తగిన కన్య నా కుమారుడికి అని డిసైడైపోయారు. మా నాన్నగారు చిన్న పిల్ల అన్నా విన్లేదు. చదువు వంక చూపించినా ఊరుకోలేదు. మా అబ్బాయి చదివించుకుంటాడు అంటూ మొత్తానికి ఒప్పించి వివాహం జరిపించారు. మేమిద్దరం ఒకర్నొకరం పీటల మీదే చూసుకున్నాం…అదే పెళ్ళి నాటి పెళ్ళి చూపులు.

చిత్రం ఏమిటంటే… ఎలా వుంటారో నా కాబోయే వారు అని ఇద్దరం తహ తహలాడాం. చూపులు కలిసాక ‘ఎంత అందగత్తె నా భార్య’ అని ఆయన, ‘ఎంత బావున్నారు ఈయన’ అని నేనూ సంతోషపడిపోయాం. (నవ్వులు).

మరి వివాహం తర్వాత మీ చదువు కొనసాగిందా?

* ఆయన ఊరుకోలేదు. నేను చదవనంటే కూడా, పసి పిల్లల బాధ్యతలని పంచుకుంటూ నా చేత ఎం.ఏ. వరకు చదివించారు. ఆయనకి చదువు పిచ్చి. నాకు పాటల పిచ్చి.

ఎంతమంది పిల్లలు?

* ముగ్గురండి. ముగ్గురూ ఆడపిల్లలే. పెద్దమ్మాయి ఇక్కడే హైద్రాబాద్‌లో వుంటారు. రెండో అమ్మాయి ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నారు అమెరికాలో, మూడో అమ్మాయి యు.కె.లో డాక్టర్. ముగ్గురూ సెటిల్ అయ్యారు.

మీకు సినిమా పరిశ్రమలో మిత్రులున్నారు కదా, మరి మీ అందం చూసి ఆఫర్స్ వచ్చి వుండాలేమో కదూ?

*(నవ్వులు). ఆహా, వచ్చాయండి. సినిమాలలో పాత్రలు, టీ వీ సీరియల్స్‌లో నటించమంటూ ఆఫర్స్ వచ్చాయి. ఈ మధ్యనే ప్రైవేట్ టీవీ చానెల్‌లో అనౌన్సర్‌గా కూడా ఆఫర్ వచ్చింది. చేయను అని చెప్పాను.

సహజంగా అందమైన స్త్రీలకు ఎదురయ్యే సమస్యలు మీరు కూడా ఎదుర్కొని వుండొచ్చేమో కదూ?

* చాలా వున్నాయండి అలాటి సంఘటనలు, సందర్భాలు, ప్రలోభాలు. కానీ ఏవీ నన్ను భయపెట్టలేదు. మనం నిజాయితీ గా వున్నంత కాలం ఏ దుష్ట శక్తులూ మనల్ని ఏమీ చేయలేవు.

మీరు మంచి భావుకురాలు అని గుర్తించాను. అందుకు నిదర్శనం – మీ జీవన విధానం. మీ ఇంటి కట్టడం, చిన్ని తోట, ఇంటిని కళాత్మకంగా తీర్చి దిద్దుకోవడాన్ని నేను చూసా.. మీ నెమ్మది తనం, అణకువ, కూడా చాలా మందిని ఆకర్షిస్తుంది. అజాత శత్రువుగా పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమైన సాధనో కదూ?

* మీరు చెప్పింది నిజం. నేను కొందర్ని క్షమించేస్తుంటాను. మన శత్రువులు మన సహనాన్ని పరీక్షిస్తూ వుంటారు. అయినా, నేను పాజిటివ్ మార్గం లోనే వెళ్తుంటాను. మనకు శత్రువే అయినా, వీరిలో నేను కనుగొనగల మంచి ఏమైనా వుందా అని చూస్తాను. మిత్రులుగా వున్నప్పుడు చేసిన మేలుని పోల్చి చూసుకుంటాను. అలా ఇతరులు నాకు తలపెట్టిన కీడు కంటే, చేసిన మేలునే గుర్తు పెట్టుకోవడం నాకలవాటై పోయింది. (నవ్వులు).

ఇంత మంచి ఆలోచనా విధానం ఎలా అలవడింది? పుస్తకాలు చదువుతుంటారా?

* అబ్బే లేదండి. సహజం గా పుట్టుకతో వచ్చిన లక్షణాలే. (నవ్వులు) ఇలాటివి చదివితేనో, నేర్చుకుంటేనో వస్తాయనుకోను.

మీ వారికి ఒకప్పుడు పాటలంటే చికాకు అని చెప్పారు.. మరి వారికి పాటల పై అంత ఆసక్తి ఎలా కలిగింది?

* ‘మా ఆవిడే’ అని చెపుతుంటారు అందరికీ. ఇంట్లోనే మ్యూజిక్ సిస్టం వుందండి. ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇద్దరం కలిసి.

మీ నివాసాన్ని పాటశాలకి దగ్గరకి చేర్చారు?

* (నవ్వులు) అవునండి. విజయ్ నగర్ కాలనీ నించి చిక్కడపల్లికి రావడం పోవడం ట్రాఫిక్‌లో కష్టమైపోయేది. నా అభిమానులందరూ, వరస ప్రోగ్రామ్స్‌ని చూసి, త్యాగ రాయ గాన సభలోనే వుండి పొండి అంటూ పొగిడేవారు. అదే నిజమైంది చివరికి. నా స్వగృహం ఇప్పుడు – గాన సభకి కూత వేటులో వుంది. నిరంతరం ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటుంటాను.

సినిమాలలో ప్రయత్నిస్తున్నారా?

* లేదండి. అస్సలు అలాటి ఆశలు నాకు లేవు. ఆసక్తి లేదు. పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులను ఆశించడం, వాటి కోసం పరుగులు తీయడం అవన్నీ నా సిధ్ధాంతాలకు వ్యతిరేకం. వేదిక మీద మాత్రమే పాడాలనే నిబంధనలూ వుండవు. నా ఆత్మ తృప్తి కోసం నేను పాడుకుంటాను. ఇంట్లొ ఒక్కదాన్నే కూర్చుని కళ్ళు మూసుకుని, తాదాత్మ్యం చెందుతూ.. నా అందమైన ప్రపంచంలో విహరిస్తూ స్వేచ్ఛగా పాడుకుంటాను. ఆకాశమే వేదికగా ప్రకృతి అంతా ప్రేక్షక హృదయంగా చేసుకుని పాడుకుంటాను. ఎంత అద్భుతమైన, అనిర్వచనీయమైన ఆనందమో అది, నే మాటల్లో వర్ణించలేను.

మీరు చేస్తున్న ఈ కృషికి ఎలాటి గుర్తింపుని పొందాలనుకుంటున్నారు?

* ప్రస్తుతం నాకు లభిస్తున్న గుర్తింపుకి చాలా తృప్తిగా వుందండి. నా పాట వినే నా ప్రేక్షకులు, ‘ఈమె బాగా పాడతారు. విని వెళ్దాం’ అని కూర్చుండిపోతారు. ఈ ప్రేక్షకులు, వారి అభిమాన, ఆదరణలే నాకు మెగా అవార్డ్స్‌తో సమానం. ఇక నే కోరుకునే కిరీటాలు ఏమీ లేవు.

కళా కారుని ఆనందానికి ఎంత నిండైన నిర్వచనాన్ని అందించారు! మీ పాటల పడవ ప్రయాణం ఇలాగే చల్లగా హాయిగా సాగిపోవాలని ఆశిస్తూ, అభినందిస్తూ.. సెలవా మరి. ధన్యవాదాలు లలిత గారు!

* మీకు, సంచిక పత్రిక సంపాదకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే.

***

   

 

***

***

మరికొన్ని పాటల లింక్స్:

Chandruni minchina andamolikinche

Chigurese moggese

eenati ee bandhamenatido

pachabottu cherigi podule.

Naa Chandamama Nwwve Bhama

Nee Jilugu Paita Needalona

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here