ట్విన్ సిటీస్ సింగర్స్

5
13

[box type=’note’ fontsize=’16’] జంటనగరాలలోని గాయనీగాయకులందరినీ తాను పేరు పేరునా సన్మానించి, సత్కరించి సంతోషపరచకపోయినా కనీసం వారి గురించి నాలుగు ముక్కలు రాసి, ఆ కళామూర్తుల్ని పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న సంకల్పంతో ఆర్ దమయంతి “ట్విన్ సిటీస్ సింగర్స్” అనే శీర్షికను ప్రారంభించారు. [/box]

[dropcap]ట్వి[/dropcap]న్ సిటీస్ సింగర్స్ గురించి నేనెందుకు రాయాలనుకున్నానంటే..

సినీ గీతాలతో కూడిన కార్యక్రమాలంటే నాకు చాలా ఇష్టం.

ఆ పంథాలో త్యాగరాయ గానసభకి వెళ్ళినప్పుడు వేదిక మీద పాడుతున్న గాయనీ గాయకులని చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలీని గాయనీ గాయకులు ఇంతమంది వున్నారా? అనిపించింది.

ప్రతి రోజూ సాయంకాలాలు గానసభకి వెళ్ళి పాటలు వినడం ఒక అలవాటుగా మారిపోయింది. పాటలు విని వూరుకోలేదు. ఈ సింగర్స్ ఎందుకు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు అని ఆరా తీసి నప్పుడు చాలా నిజాలు తెలుసుకోవడం జరిగింది.

పాడాలన్న తపనతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా తమ గానాన్ని వినిపించే ఈ సింగర్స్ ఏమాశిస్తున్నారు? అని తరచి చూస్తే, ఆలోచిస్తే – ఏమీ లేదు. కేవలం కళా తృష్ణ తప్ప మరో ఉద్దేశం వారికున్నట్టు కనిపించలేదు. ప్రేక్షకులను మనోరంజింపచేయడానికి తప్ప మరింకేమీ ఆశించని అచ్చమైన, నిస్వార్ధమైన, నిష్కళంకమైన హృదయాలు నవ్వుతూ మల్లె పూవుల్లా కనిపించాయి.

సాయంత్రం 5 గంటల నిండి రాత్రి 9.30 వరకు జరిగే సంగీత విభావరికి అయ్యే ఖర్చు పాతిక వేలు పై మాటే కానీ తక్కువ కాదు. ఆ సంస్థ ఆర్ధిక శక్తిని బట్టి భారీ గానూ వుండొచ్చు.

సాధారణ సంస్థలకి స్పాన్సరర్స్ వుండరు. చాలా సంస్థల వారు తమ సొంత ఖర్చుతోనే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అదొక పిచ్చి. వల్లమాలిన ప్రేమ. సినీగాన కళ పట్ల గల అమితమైన మక్కువ. అంతే కానీ, పైసా లాభం వుండదు. ఇంకా చెప్పాలీ అంటే ప్రతి కార్యక్రమానికి చేతి డబ్బులే పడతాయి. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో వుంటుంది.

ఏ ఆర్గనైజర్‌ని అడిగినా ఇదే మాట చెప్పేవారు.

ఆ తర్వాత నేనూ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని పాటలు పాడటం ప్రారంభించాను. సంస్థ ఖర్చులో నా వంతు నేనూ పంచుకుంటూ..

శ్రీమతి ఆమంత గారు నన్ను వేదికకి పరిచయం చేసారు. మొదట్లో తడబడినా.. మెల్ల మెల్లగా లైవ్‌లో పాడటం అలవాటైంది. కానీ సినిమా పాటలు పాడటం అంత సులువైన కళ కాదని ఇట్టే అర్థమైపోయింది.

వాయిస్ ఒక్కటి వుంటే చాలదు. పాట పెదవుల మీంచి కాదు హృదయంలోంచి పుట్టుకురావాలి.

శృతి లయ తాళం మాత్రమే కాదు, భావం, మాడ్యులేషన్, స్వరాన్ని హెచ్చు తగ్గులతో కలిపిన సమ్మేళింపులు, స్వర జ్ఞానంతో బాటు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానమూ వుంటే తప్ప సినిమా పాట రాణించదని పూర్తిగా తెలిసిపోయింది. మరో విషయం – వయసూ పరిగణనలోకి తీసుకోవాలి. దమ్ము తీసుకోకుండా రాగాన్ని ఆలపించడానికి సాధనతో బాటు శారీరక బలమూ అవసరమే. 🙂

లైవ్ ప్రోగ్రాంలో సౌండ్ – ప్రధాన పాత్రని పోషిస్తుంది. మైక్ సెన్స్ గాయనికి చాలా అవసరం. ఇది కాకుండా..మన గాత్ర సంస్కారమెరిగి గీతాలను ఎంచుకోవాలి. ఈ టెక్నిక్ చాలా మందికి తెలీక విఫలమైపోతుంటారు.

ఇవన్నీ నా వల్ల కాదని పాడటం వదిలేసి, సినీ గీతాల కార్యక్రమాలని నా అభిరుచి మేర నిర్వహించాలని, రసరమ్యమైన గీతాలను ప్రేక్షకుల ముందుంచాలని అభిలషించాను.

కానీ.. అదెంత ఖర్చుతో కూడుకున్న పనో.. అందులో దిగాక కానీ తెలీలేదు. ఫలితంగా నష్టపోయాను.

ఆ నష్టాన్నీ పూడ్చుకోవచ్చు. కానీ ఎంతోమంది కళాకారులు గాయనీ గాయకులు ఈ నష్టాన్ని భరించి, కష్టాన్ని ఇష్టంగా భరించి మరీ పాటలు పాడుతున్నారు. గాన కళని ప్రాణంగా భావిస్తూ సినిమా పాటలని ఆరాధిస్తున్నారు. అంతే కాదు, ప్రముఖుల జయంతోత్సవాలనూ వర్ధంతి సందర్భాలనూ ఏదీ మరచిపోకుండా వారి పేరు మీద ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలను నూతనంగా డిజైన్ చేస్తారు. అంజలి సమర్పిస్తారు. ఘంటసాల వారి పాటలకు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు.

ఏ సిరి ఆశించీ కానీ ఏ కీర్తి కిరీటాలను మోహించి కానీ – ఈ గాయనీ గాయకులు అంకిత భావంతో పని చేయడం లేదు.

కేవలం మీరు వింటే చాలు. మీ చప్పట్లు తప్ప మేమింక కోరేదేమీ లేదన్నట్టు – ప్రేక్షకుల కోసం మాత్రమే తమ గాత్రాన్ని అందిస్తున్నారు. మనసారా పాడుతున్నారు. తాము ఆనందిస్తూ గానం చేస్తారు. ఇతరులని ఆనందింపచేస్తూ సినీగీతాలకి పట్టాభిషేకం చేస్తున్నారు.

ఎంత ఉన్నతమైన సంస్కారం! మరెంత ఉన్నతమైన ఔన్నత్యం!

ఈ కళా సాంస్కృతిక సంస్థల గురించి కానీ, ఈ కళాకారుల గురించి కానీ అసలు ఎవరైన్నా పట్టించుకుంటున్నారా? ఆదరిస్తున్నారా? వీరికేమైనా సాంఘిక ఆర్థిక హార్ధిక సహాయ సహకారాలను అందచేస్తున్నారా అని యోచించినప్పుడు సమాధానం దొరకలేదు.

తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటయ్యాక, కొంత కాలంగా తమ కార్యక్రమాలకి ఫండ్స్ అందుతున్నాయని తెలియచేసారు కొందరు మిత్రులు. అయితే అన్ని సంస్థల వారికీ అవి అందడం లేదని మరి కొందరు చెప్పడం జరిగింది.

అంతలో – నేను అమెరికా ప్రయాణమై వెళ్ళడం వల్ల ప్రత్యక్ష కథనాలు తెలియలేదు.

కొన్ని సంస్థల వారు తమ పలుకుబడితో నాల్గు చోట్ల తిరిగి, నాలుగు కాసులు తెచ్చుకుని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుంటున్నారు.

కానీ అధిక సమయం సన్మాన సభకి కేటాయించడం వల్ల ఎక్కువ పాటలు పాడుకునే అవకాశం వుంటం లేదని తమ అసంతృప్తిని వెల్లడించారు.

ఈ కారణాల వల్ల ఏ సింగర్‌కైనా వేదిక మీద తనివి తీరా పాడుకోవడం అంటే – పిండి కొద్దీ రొట్టెలాంటిదే అనిపిస్తుంది.

కాలంలో మార్పులు చోటుచేసుకున్నాయి. త్యాగరాయ గాన సభ నిర్వహణా బాధ్యతలు శ్రీ జనార్థన మూర్తి గారు చేపట్టాక మినీ హాల్స్ ఉచితంగా ఇస్తూ మంచి మైక్ సెట్స్‌ని ఎరేంజ్ చేసి, కొత్త వారికి విస్తృతంగా అవకాశాలు ఇస్తూ కళాకారులని ఎంకరేజ్ చేస్తున్నారు. కళాకారులు ముఖ్యంగా సింగర్స్‌కి ఇది కాస్త ఊరటని కలిగిస్తున్న మాట వాస్తవం.

కొత్త కొత్త సంస్థలు నెలకొంటున్నాయి. వినూత్నమైన కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతి సాహితీ సభకి ముందు సినీ గీతాల కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశాన్ని కలగచేయడం వల్ల సింగర్స్ మరింత ఉత్సాహాన్ని ప్రదర్సిస్తున్నారు.

చాలా సంతోషకరమైన మరొక వార్త ఏమిటంటే – త్యాగరాయ గాన సభ మెయిన్ హాల్ కూడా రెంట్ లేకుండా ఉచితంగా ఇవ్వాలనే సంకల్పం తో తాము వున్నట్టు ఒకసారి జనార్థన మూర్తి గారు తమ ప్రసంగంలో తెలియచేసారు. అదే నిజమైతే సింగర్స్ పండగ చేసుకుంటారని చెప్పాలి.

సినిమా పాటని ప్రాణంలా భావించే సింగర్స్‌లో రిటైరైన వారున్నారు. గృహిణులున్నారు. ఉద్యోగులున్నారు. వయసు మీరిన వారు సైతం పాట పాడుకుని పరవశించే వారున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల పాడగలిగి వుండీ పాడలేక నిరాశపడుతున్న వారున్నారు. ఒక్క చాన్స్ దొరికినా బావుణ్ను అని ఎదురుచూసే నిరుద్యోగులున్నారు.

వీరందరినీ నేను పేరు పేరునా సన్మానించి, సత్కరించి సంతోష పరచకపోయినా కనీసం వీరి గురించి నాలుగు ముక్కలు రాసి, ఈ కళామూర్తుల్ని పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న సంకల్పం ఎప్పుడో కలిగింది.

మొన్నొకసారి, నా ఫేస్‌బుక్‌లో బాలు గారికి ఎంతో ఘనంగా జరిగిన వంశీ అక్కినేని పురస్కార ప్రదానోత్సవం గురించి రాసినప్పుడు.. లక్ష్మి పద్మజ గారు చదివి, నన్ను అభినందిస్తూ మెసేజ్ పెట్టారు.

‘చాలా బాగా రాశారు.. బాలు గారికి రాసినంతగా కాకున్నా.. మన త్యాగరాయ గానసభలో పాడుతున్న సింగర్స్ గురించి కూడా కొంత రాయొచ్చు కదా’ అని సూచించారు.

నా మనసులో ఎప్పట్నించో వున్న భావనే వారి నోటినించి విని ఉలిక్కిపడ్డాను.

నాకు రాయాలనే వుంది. కాని ఎవరు వేసుకుంటారు? అని ఆలోచించాను.

సరికొత్త ఆలోచనలకు సదా స్వాగతం అనే మన సంచిక సంపాదకుల మాటలు గుర్తొచ్చాయి. వెంటనే మురళీకృష్ణ గారికి ఫోన్ చేసి, నా ఆలోచన్ని పంచుకోవడం, విన్నాక వారు వెంటనే ఒప్పుకుని, ప్రోత్సహించడం జరిగింది.

పద్మజ గారి మాటల వల్లే ఈ ఫీచర్ రూపుదిద్దుకుంది కాబట్టి ముందుగా వారి ఇంటర్వ్యూతోనే ఈ శీర్షికని ప్రారంభించడం జరిగింది.

అలా ట్విన్ సిటీస్ సింగర్స్ – శ్రీకారం చుట్టుకుంది.

ఇదండీ నేనీ ఫీచర్ రాయడానికి వెనకున్న కథ.

ప్రియమైన పాఠకులు తప్పక చదివి, మీ మీ అభిప్రాయాల్ను, సలహాలను మాకంద చేయవలసిందిగా కోరుతున్నాను.

ఎందరో మహానుభావులు అందరకీ వందనములిడుతూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here