ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-10

0
9

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]అ[/dropcap]ఖిల్ విషయంలో ఏదైతే జరగకూడదని వసంత్ ఇన్నాళ్ళూ అనుకున్నాడో ఆ సంఘటనకి నాందీ ప్రస్తావన జరగనే జరిగింది.

ఆ కుర్రాడిని సూపర్ కిడ్‌గా ప్రపంచం ముందుకి తీసుకువెళ్ళే రోజు సడెన్‌గా వచ్చింది.

అదెలా జరిగిందంటే –

గణగణ మంటూ ఫోన్ మ్రోగింది.

ఫైల్ నుండి దృష్టి మారల్చకుండానే ఎడం చేత్తో ఫోన్ లిఫ్ట్ చేసాడు.

“హలో! వసంత్ కుమార్ స్పీకింగ్” అంటూ అవతల వైపుకి మెసేజ్ అందించాడు వసంత్.

వెంటనే బదులు వచ్చింది.

“హలో… మిస్టర్ వసంత్ కుమార్. నేను యస్సై వేదవ్యాస్‌ని మాట్లాడ్తున్నాను.”

“వాటే సర్‌ప్రైజ్ థింగ్. నేను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. బట్… మీరే నాకు ఫోన్ చేయడం రియల్లీ ఏ రేర్ వండర్.”

ఆశ్చర్యం ప్రకటిస్తూ కుడిచేతిలో ఉన్న ఫైల్‌ని మూసివేశాడు.

“నాకు ఫోన్ చేద్దామనుకున్నారా! ఎందుకని? మళ్ళీ ఏదైనా ప్రోబ్లమ్ క్రియేట్ అయ్యిందా?” ఆతృతగా అడిగాడు వేదవ్యాస్.

“నో సర్. అదేం లేదు. ఎవ్విరీ థింగ్ ఈజ్ ఓకే! పర్సనల్‌గా మీకే చేద్దామనుకున్నాను. మీకు తీరిక ఉన్నపుడు మిమ్మల్ని డిన్నర్‌కి పిలవాలని ఆలోచన అంతే!

“ఇట్స్ ఓకే! అలాంటివి నా కిష్టం వుండదు.”

“ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఏదైనా ఫంక్షన్ చూసుకొని పిలిస్తే బావుంటుందని ఆగాం. వచ్చే నెలలో అఖిల్ బర్త్‌డే వుంది. కనీసం అప్పుడైనా వీలు చూసుకొని తప్పక రావాలి.”

“థాంక్స్. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి” చెప్పాడు వేద.

“ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్ ఆర్ అవర్ డిపార్టమెంట్ సైడ్” కాస్త కంగారుగా అడిగాడు వసంత్.

“పోలీస్ డిపార్టుమెంట్ నుండి కాల్ అనగానే భయపడ్డం సర్వసాధారణమై పోయింది అందరికి. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా మేమూ గవర్నమెంట్ సర్వెంట్స్‌మి అని ఎందుకని అనుకోరు? అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లాగే పోలీస్ స్టేషన్‌ని కూడా ఒక ఆఫీస్‌గా పరిగణించరెందుకని. మీలాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఇదే భావనని కనబరచడం విచారకరం” నిట్టూర్టాడు వేద.

“మీ డిపార్టమెంట్‌పై ప్రజలకి ఏర్పడిన అభిప్రాయం అలాంటిది. పోలీస్ స్టేషన్ ఈజ్ నథింగ్ బట్ యమపురి అనే భావన జీర్ణించుకుపోయింది అందరిలో. అందుకు మీలోని కొందరు వ్యక్తులే కారకులు. ఇంతకూ మీరు ఏ విషయం…” అంటూ ఆగాడు వసంత్.

“మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. మీరు నాకో అరగంట టైమివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణం వీలవుతుందా?” సూటిగా అడిగాడు.

‘నాతో పర్సనల్‌గానా’ అనుకుంటూనే “ష్యూర్!” నాకు పెద్దగా పనే లేదీ రోజు. స్టేషన్‌కి రమ్మంటారా?” అనడిగాడు.

“స్టేషన్‌కి వద్దు. సరిగ్గా ఇరవై నిమిషాల అనంతరం మనిద్దరం హోటర్ సవేరాలో కలుసుకోబోతున్నాం – బీ రెడీ!” అంటూ ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దం.

***

ఫైల్ టేబుల్ మీద సర్ది ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా తన సీట్లోంచి లేచి బయటకు కదిలాడు వసంత్.

ఇద్దరూ అనుకున్న సమయానికి హోటల్ సవేరాలో సమావేశం అయ్యారు.

“చెప్పండి” అడిగాడు వసంత్.

“అఖిల్ తండ్రిగా మిమ్మల్ని ఒక సహాయం కోరుతున్నాను. మీరు కాదనరు అనే నమ్మకం నాకుంది” దృఢంగా అన్నాడు వేదవ్యాస్.

“ఆ రోజు మా అబ్బాయిని కాపాడారు. మా ఇంట్లో అందరికీ మీరంటే అభిమానమే. అలాంటి మీకు సహాయం చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరే పని చేయమన్నా చేయడానికి నేను సిద్ధమే!”

వేద మీద ఉన్న అభిమానాన్ని తెలియపర్చాడు వసంత్.

“మిస్టరీగా మారిన ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో మీ అబ్బాయి ఇన్‌వాల్వ్‌మెంట్ అవసరం ఉంది” అంటూ వసంత్ వైపు చూసాడు.

వేద గెస్ చేసినట్లుగానే వసంత్ ముఖం వివర్ణమయ్యింది.

“అఖిల్ ఆ కేసులో అతి కీలకమైన పాత్ర వహించగలడని నిర్ధారణ అయ్యేకే క్లోజ్ చేయబడిన ఫైల్‌ని తిరిగి ఓపెన్ చేయించాను. ఆ కేసు మిస్టరీ ఛేదించబడాలంటే మీ వాడే తిరుగులేని ఆయిధం. ఆధారం కూడా! అలాంటి కీలకమైన వ్యక్తి సహకారం కావాలి. కాబట్టి తండ్రిగా అందుకు మీ పర్మిషన్ అవసరం.”

చాలా స్లోగా వసంత్ మైడ్‌లోకి ఇంజక్ట్ చేశాడు వేద.

“వేరీ ఇంట్రస్టింగ్. మీ కేసుకి మా వాడు ఉపయోగపడడమేంటి? ఇంకా ఎనిమిదేళ్ళయినా పూర్తిగా నిండలేదు వాడికి. అన్నెం పున్నెం ఎరుగని పసివాడు. వాడు మీ కేసుని ఛేదించడమేంటి? ట్రాష్!” ముఖం చిట్లించాడు వసంత్.

వెంటనే వేద అన్నాడిలా.

“ఐ నో హి ఈజ్ ఎ సూపర్ కిడ్! అందరిలా సాధారణ బాలుడు కాదు. వాడు వండర్ బాయ్! జరిగిపోయిన గతం తాలుకు పుటల్ని వెనక్కి మరల్చి ఆనాటి సంఘటనల్ని ఉన్నదున్నట్లుగా మన కళ్ళ ముందు ఆవిష్కరించే అరుదైన అద్బుత బాలుడు. ఆ కుర్రాడికున్న ఆ ఆపూర్వమైన శక్తిని ఈ కేసుకి బేసిక్‌గా తీసుకోవాలన్నదే నా ప్లాన్.”

అప్పుడు… అప్పుడు ఉలిక్కిపడ్డాడు వసంత్. ఎక్కడో డైనమేట్ పేలిన ఫీలింగ్!

రెండు సెకన్ల నిశ్శబ్దమనంతరం అడిగాడు.

“వాడి గురించి ఇన్ని విషయాలు మీకెలా తెలుసు?”

చాలా గోప్యంగా ఉందనుకున్న అఖిల్ విషయం ఏకంగా పోలీసుల దృష్టిలో పడడం అతన్ని విభ్రాంతికి గురిచేస్తోంది.

“నాకు ఈ విషయం తెలియకపోతేనే అదొక విడ్డూరంగా భావించాలి. తెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వేదవ్యాస్ ఇక్కడ ఉన్నంతకాలం నగర నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియాల్సిందే! అలాగే అఖిల్ విల్ పవర్ కూడా నా కనుసన్నలను దాటి పోలేదు… పోదు” అన్నాడు.

వేద గొందులో అధికార స్వరం ధ్వనించింది.

వేదవ్యాస్ శక్తిసామార్థ్యాలు తెలియనివి కావు. అతను వచ్చాకే నగరంలో దోపిడీలు, దొంగతనాలు మోసాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.

వేద అంటేనే చీకటి బజార్‌కి హడల్. రౌడీమూకలు, చిల్లర గ్యాంగ్‌లు దాదాపుగా అంతరించాయి. కొన్ని మాఫియా ముఠాలు మాత్రం చాపక్రింద నీరులా తచ్చాడుతున్నాయి. తన ఏరియాలని కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అలా అన్ని వర్గాల మెప్పు పొందగలిగిన రేర్‌ మ్యాన్.

వసంత్ తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చాడు.

వేద కూడా వసంత్‌ని తొందర పెట్టదలచుకోలేదు. ఆలోచించుకునే వ్యవధి ఇవ్వదలచి తను మౌనంగా ఉండి పోయాడు.

“అఖిల్ అల్లరి బాలుడో… అద్భుత బాలుడో… వాణ్ని చూస్తూ చూస్తూ మీ డిపార్టమెంట్‌కి అప్పగించి ప్రమాదపు అంచుల్లోకి తోసేయమంటారా? దయచేసి మా వాడిని వదిలి పెట్టండి. వాడి ఉజ్వల భవిష్యత్‌ని నేల రాసే ప్రయత్నం చేయకండి. ఆ చిన్నారి మీ యజ్ఞంలో ఒక సమిధ కావడానికి నేను ససేమిరా ఒప్పుకోను. మీ కిచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను. ఐ ఆమ్ వెరీ సారీ. ”

ఎలాంటి మొహామాటం లేకుండా తన మనోభావాల్ని వెల్లడించాడు.

“పొరపడుతున్నారు మిస్టర్ వసంత్ కుమార్. మీరు అంతగా భయపడాల్సింది, బెంగపెట్టుకోవాల్సింది, అనుమానించాల్సింది ఏమీ లేదు. అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి. భయాందోళనలు చెందాల్సింది కూడా ఏమీ లేదు. మీవాడి కేమీ కాదు. నా మాట సావధానంగా వినండి.

నేను చెబుతున్న కేసు మిస్టరీ ఇప్పటికైనా వీడకపోతే ఈ నగరానికే ప్రమాదం. మన జాతికే అవమానం. కొమ్ములు పెంచి, కోరలు చాచి, తమ వికృత హస్తాలతో కొన్ని మాఫియా భూతాలు సమాజంలోని జన జీవనాన్ని అల్లకల్లోల పరుస్తున్నాయి.

అందులో భాగమే ఊహించని మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ. ప్రజల ఆస్తుల్ని భద్రపరిచే బ్యాంక్‌నే కొల్లగొట్టి నిర్భయంగా తిరుగాడుతున్నారంటే… ఆ నేరస్థులు మా డిపార్టమెంట్‌నే ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. వారు నిర్భీతితో విసుర్తున్న సవాల్‌కి ధీటైన వజ్రాయిధం మీ వాడు.”

కర్తవ్య పరాయణత్వం వేద ధ్యేయం. అది గుర్తించాడు వసంత్.

అయినా ఇబ్బందిగా ఫీలవుతున్నాడతను.

“అఖిల్ అద్భుత శక్తి ప్రపంచం దృష్యా ఇంకా వెలుగు చూళ్ళేదు. నాకు తెలిసి ఆ విషయం చాలా సీక్రెట్‌గానే వుంది. మీకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే… బెలూన్‌ల సాహసం అనంతరం మీ వాడిపై రహస్య నిఘా ఏర్పాటు చేయించాను. ఆ రోజు హస్పిటల్‌లో సైతం అఖిల్‌ని డాక్టర్ టెస్ట్ చేస్తున్నపుడు నా మనిషి అక్కడే ఉన్నాడు” అంటూ వసంత్ భావాల్ని పసిగడ్తున్నాడు వేద.

అతను చెబుతున్న విషయాలు ఒక్కొక్కటిగా వింటుంటే వసంత్ ముఖం పాలిపోతోంది.

“ఆ అతీంద్రయ శక్తి మీ అబ్బాయితో పాటు డెవలప్ అవుతుందో… సడెన్‌గా అంతరించిపోతుందో… తేల్చి చెప్పలేని సంకట పరిస్థితి. అందుకే వాడిలో ఈ శక్తి మాయమవక ముందే ఒక మంచి పని పూర్తవడానికి మీరు ఒప్పుకోండి. మీ వాడిలోని శక్తిని సమాజశ్రేయస్సుకై ఉపకరించనివ్వండి.”

వసంత్ మైండ్‌ని డైవర్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు వేద.

యస్సై చెప్పే విషయాలేవీ వసంత్‌కి మింగుడు పడడంలేదు. మనసంతా బ్లాంకయిపోయింది.

పట్టువదలని విక్రమార్కుడిలా చెప్పుకుపోయాడు వేదవ్యాస్.

“ఎంతమంది తమ రక్తాన్ని చిందిస్తే ఈ సుందర స్వప్నం మనకి దక్కింది. ఎందరు మహనీయులు ఆహర్నిశలు శ్రమించి పోరాడితే ఈ దేశం మనదయ్యింది. ఎందరు త్యాగధనులు ఆత్మార్పణం గావిస్తే మనకీ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఒకసారి మననం చేసుకోండి. ఆ త్యాగం మీ నుండి నేను కోరుకోడవం లేదు. జస్ట్ చిన్న హెల్ప్.

ఈ కేసులో ఇన్వాల్వ్‌ అవుతున్నందుకు మీ అబ్బాయికి ఎవరి నుండి కూడా చిన్న అపాయం జరగదు. జరగనివ్వను. అసలు వాడికి ఈ కేసుతో సంబంధంమున్నట్లే తెలియనివ్వనెవరికి. చివరకి మీ మిసెస్‌ కూడా. మీకూ నాకూ తప్ప మూడో కంటిక్కూడా తెలియదు.

రియల్లీ ఐ ఆమ్ ప్రామిసింగ్ విత్ యూ. బిలీవ్ మి.

ఈ దేశ పౌరుడిగా సదాశయంతో ఒక్కక్షణం నిదానంగా ఆలోచించండి. నన్ను మనస్పూర్తిగా నమ్మి మీ అబ్బాయిని నాకు అప్పగించండి. ప్లీజ్ కాదనకండి. నేను చెప్పేది వినండి.”

ఒక పోలీసాఫీసర్ నిస్వార్థంగా తన కర్తవ్య నిర్వహణ కొరకై అంతగా అభ్యర్థించడం… వసంత్‌లో కొంచెం మార్పు కలగడానికి దారి తీసింది.

అధికారం చెలాయించడం లేదు. వేదలోని ఆ సుగుణమే వసంత్‌ని ఆకట్టుకుంది.

తన స్వార్థం గురించి ఆలోచించేవాడు అథముడు. స్వకుటుబం ప్రయోజనం కోసం మథన పడేవాడు మధ్యముడు. సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పాటు పడేవాడే ఉత్తముడు అనే మాటలు ఎప్పుడో చదివినట్టు గుర్తు.

వేదవ్యాస్ అలాంటి ఉత్తమ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నాడన్పించింది వసంత్‌కి.

వసంత్‌లోని సంఘర్షణని, సందిగ్ధావస్థని పసిగట్టాడు వేద.

ఆ అవకాశాన్ని జారవిడుచుకోదలచుకోలేదతను.

అందుకే తుది ప్రయత్నంగా తన గొంతు విప్పి మళ్ళీ చెప్పాడిలా –

“మిమ్మల్ని నేను బలవంతం చేయడం లేదు. ఒత్తిడి అసలే చేయడం లేదు. అలాగే బెదిరించడం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా కేవలం సామాన్య వ్యక్తిగా మిమ్మల్నీ సహాయం చేయమని కోరుతున్నాను.

పై ఆఫీసర్లతో పట్టుపట్టి నా సెల్ఫ్ ఇంట్రస్ట్‌తో ఈ కేసుని ఓపెన్ చేయించాను. ఎలాగైనా నేరస్థుల్ని పట్టుకోవాలన్నదే నా దృఢ సంకల్పం, మీ అబ్బాయిలోని అతీంద్రియ శక్తిని వినియోగించుకి దోషుల్ని చట్టానికి అప్పగించాలని నా ఉద్దేశం.

అలా అని పూర్తిగా అఖిల్ మీదే ఆధారపడి నేనీ కేసు ఫైల్‌ని తెరవలేదు. మీరు కాదు అంటే నా పంథా మార్చుకుంటాను. మరొక రకంగా పథకానికి వ్యూహరచన చేస్తాను. ఎలాగైనా విజయం సాధించి తీరతాను. ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి. నేరస్థులు తప్పించుకు తిరగకూడదు.

మీరు ఒప్పుకుంటే అఖిల్ సహాయంతో కేసు మిస్టరీ కాస్త సులువుగా. మరింత తొందరగా వీగిపోయే అవకాశం ఉంది. అందుకే మిమ్మల్ని ఇంతగా అభ్యర్ధించడం.

చివరి సారిగా చెబుతున్నాను.

మీ వాడి ప్రాణాలకు నా ప్రాణాలడ్డం పెడతానని నేనీ క్షణంలోనే మీకు మాటిస్తున్నాను. మీ వాడికి ఏ విపత్తు సంభవించకుండా పూర్తి బాధ్యత స్వీకరిస్తాను. నా కంటి పాపలా కాపాడుకుంటాను. ఇది నా ప్రామిస్. ఇక తుది నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. మీ సమాధానం ఇప్పుడే తెలపాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా ఆలోచించండి. కాస్త సమయం తీసుకొని వీలైన తొందర్లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదో ఒకటి చెప్పండి. గుడ్‌బై.”

వసంత్‌కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వేదవ్యాస్ వచ్చినంత వేగంగా వేళ్ళిపోయాడక్కడి నుండి.

అతని వెంట వెళ్ళలేక పోయాడు వసంత్.

అక్కడే ఆగిపోయాడు. ఒంటరిగా కాసేపు గడపాలన్న ఉద్దేశంతో.

వసంత్ బుర్రని ఆలోచనలు చుట్టుముట్టాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అఖిల్‌ను వేదవ్యాస్‌కి అప్పగించడమా, మానడమా అనే డైలమాలో పడిపోయాడు.

అలా అరగంట గడిచింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదతను.

చివరికి ఒక నిర్ణయం తీసుకున్న వాడిలా వసంత్ ఉద్యేగంతో కదిలాడక్కడి నుండి.

***

వసంత్ ఆఫీసుకి వెళ్ళిన మరుక్షణం వేదవ్యాస్‌కి ఫోన్ చేశాడు.

అతడు తప్పక పోన్ చేస్తాడని యస్సైకి తెలుసు. అందుకనే బయటకు వెళ్ళే పని ఉన్నా వెళ్ళకుండా స్టేషన్‌లోనే ఎదురు చూస్తున్నాడు.

“నేను వసంత్‌ని మాట్లాడుతున్నాను. మీ ప్రపోజల్‌కి అంగీకరిస్తున్నాను. అఖిల్‌ని మీకు అప్పగించబోతున్నాను” అనే మాటలు అలల్లా సాగిపోయాయి అవతలి వైపుకి.

వసంత్ గొంతు స్టేషన్‌లోని రిసీవర్‌లో ప్రతిధ్వనించిన అనంతరం-

వేద పెదాలపై విద్యుత్ స్ఫులింగంలా మెరిసిందొక చిరునవ్వు. అది విన్న వెంటనే ఫోన్ క్రెడిల్ చేశాడు.

***

ఆదివారం.

మనీ మనీ బ్యాంక్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాక పాండవీయం మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నాడు.

సెలవు రోజు నాడు కూడా పూర్తి టైమ్ ప్రణిత కొరకు స్పెండ్ చేయలేక పోతున్నాడు.

అందుకని భర్త మీద కాస్త కినుకు వహించింది ప్రణిత.

ఆ విషయం తెలిసినా చేసేందేక తన లక్ష్యం మీద దృష్టి సారించడంలో నిమగ్నమై పోతున్నాడు పాండవీయం.

“ఎంత వరకు వచ్చింది బ్యాంక్ వ్యవహారం. ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ కన్పిస్తోందా?”

భర్త పక్కన కూర్చుంటూ అడిగింది ప్రణిత.

పెదవి విరిచాడు పాండవీయం.

“ప్రయత్నిస్తున్నా. అంత తొందరగా సాల్వ్ అయ్యేంది కాదుగా, ఈ బ్యాంక్ ప్రాబ్లమ్. ”

“ఎవరు ఇంట్రస్ట్ చూపుతారండీ! భద్రత లేని బ్యాంకులో తమ డబ్బు భద్రంగా వుంటుందని ఎవరు నమ్ముతారు?”

“ఆ నమ్మకం పెంచడానికేగా నా శ్రమ.”

“పాత డిపాజిటుదార్లకే డబ్బింకా తిరిగి చెల్లించబడలేదు. కొత్త వాళ్ళకి ఎలా కల్గుతుంది విశ్వాసం.”

“కాస్త టైమ్ పడితే పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా డబ్బు వారికి ఇవ్వడమేగా!”

“అప్పటికి చూడొచ్చు. అయినా ఎందుకండీ మీరు అనవసరంగా కష్టపడ్డం. మీది వృధా ప్రయాస అన్పిస్తోంది.”

చప్పున భార్య వంక అదోలా చూశాడు పాండవీయం.

“ఎప్పటికీ కాదు. నా మీద ఆపారమైన నమ్మకంతోనే పై అధికారులు నాకీ బాధ్యత అప్పచెప్పారు. నీవు డిస్కరేజ్ చేసినంత మాత్రాన విరమించుకుంటానా! మళ్ళీ మనీ మనీ బ్యాంక్ కష్టమర్ల మనీ బ్యాంక్‌గా విశిష్ట స్థాయిని చేరుకునే వరకు విశ్రమించేది లేదు” దృఢంగా చెప్పాడు పాండవీయం.

భర్త ముఖంలోని సీరియస్‌నెస్ చూసి కాస్త తగ్గింది ప్రణిత.

“అయినా ఎందుకండీ మీరు స్వయంగా వెళ్ళి ప్రతి ఒక్కర్నీ కలవడం. వాళ్ళని ఒప్పించడం. వ్యక్తిగతంగా రిస్క్ తీసుకుంటున్నట్టన్పిస్తోంది” అనునయంగా అంది.

“మానేయమంటావా?” కటువుగా అడిగాడు.

“బెటర్” అంటూ భర్త మూడ్‌ని మార్చే ప్రయత్నంగా గలగలా నవ్వింది.

భార్య నవ్వడంతో కాస్త ఫేసు ప్రసన్నంగా మార్చాడు పాండవీయం.

దాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళీ ప్రణిత అంది.

“ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప మనీ మనీ బ్యాంక్ కష్టమర్ల రాకపోకలతో బిజీ అవుతూ తిరిగి కళకళలాడ్డమనేది జరగనిపని.”

సర్రున చూసాడు ప్రణిత వైపు.

మళ్ళీ ఎక్కడ ఆయన మూడ్ మారుతుందోనని అలా అంటూనే కళ్ళు చిలికించింది చిలిపిగా.

“మనీ మనీ బ్యాంక్ గురించి కష్టమర్లకి అర్థం చేయిస్తే చాలు జనం సానుకూలంగా స్పందిస్తారన్న నాకుంది. జనంలోకి చొచ్చుకుపోవడానికి ప్రచారసాధనాలను మాధ్యమంగా ఉపయోగించబోతున్నాను. అంతే తప్ప మహాద్భుతమేదీ జరగాల్సిన పన్లేదు” అన్నాడు పాండవీయం.

కాని ఆ దంపతులకి తెలియదు.

మనీ మనీ బ్యాంక్ విషయంలో మహాద్భుతమే జరగబోతోందని!

అందుకు రంగం సిద్ధమవుతోందని!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here