ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-11

0
8

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]స[/dropcap]ర్వం తెలిసిన వాళ్ళు కూడా ఒకోసారి ఘోరమైన తప్పిదాలు చేస్తుంటారు.

తమ పై తమకు ఉండే అధిక నమ్మకం, తొందరపాటు వాళ్ళ చేత అలా చేయిస్తాయి. పొరపాటు జరిగి నష్టం వాటిల్లాక గానీ వారు విషయాన్ని గ్రహించరు. కాలానికి ఎదురీదడం వలన కలిగే కష్ట నష్టాల్ని తలచుకుంటూ తర్వాత పశ్చాత్తాపం చెందుతుంటారు.

సరిగ్గా యస్సై వేదవ్యాస్ విషయంలో కూడా అలా చింతించాల్నిన పరిస్థితి ఊహించని విధంగా ఎదురైంది.

అదెలా జరిగిందంటే –

మనీ మనీ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో కీలకమైన వ్యక్తిగా పరగణింపబడ్తున్న అఖిల్‌ని వినియోగించుకోవడానికి వసంత్ ఒప్పుకోవడంతో ఇక ఆలస్యం చేయదలచుకోలేదు వేదవ్యాస్. అనాలోచితంగా తన పథకం సిద్ధం చేసుకున్నాడు. అదెంత తొందరపాటో తర్వాత అనుభవంతో తెలిసివచ్చిందతనికి.

యస్సై ఈ ఎసైన్‌మెంట్ ప్రారంభించే ముందు మొట్టమొదట శత్రువుల గురించి తీవ్రంగా ఆలోచించాడు.

ఆ వర్గంలో ఎలాంటి కదలిక లేర్పడ్తున్నాయో అతను ఊహించగలడు.

వేదకి అందిన రిపోర్ట్స్ ప్రకారం శత్రువులు తన ఇన్వెస్టిగేషన్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదని, అసలు ఆసక్తే చూపడం లేదని తెలుస్తోంది. అందుకే ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.

అయితే వేద ఊహించిందే కరెక్ట్ అని…. శత్రువర్గం తనకి అందిన సమాచారం పూర్తిగా తప్పని త్వరలోనే అనుభవంలోకి రాబోతోందతనికి.

పోతే మనీ మనీ బ్యాంక్ మేనేజర్ పాండవీయానికి ఒక్కడికే వేదవ్యాస్ అల్లిన వ్యూహ రచన పూర్తిగా తెలుసు.

ఉదయం పదకొండు.

అఖిల్‌ని వెంటేసుకొని బ్యాంక్‌కి వెళ్ళాడు వేద. అత్యంత శక్తివంతమైన మైక్రోఫోన్ ఆ కుర్రాడికి అమర్చబడింది.

ఏ ఫలితాన్నాశించి భగవంతుడీ అద్భత ప్రక్రియని అఖిల్‌లో ప్రేరేపించాడో తెలీదుకానీ –

అతడి సహకారంతో చరిత్రలోనే అత్యద్భుతాక్షరాలతో లిఖించదగ్గ ఓ ప్రక్రియకి వేదవ్యాస్ శ్రీకారం చుడుతున్నాడు.

అందుకే ఉద్వేగ్నంగా ఉందతనికి.

ఏ వైపు నుండి ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా వున్న సాయుధులైన పోలీసులు కష్టమర్ల రూపంలో మనీ మనీ బ్యాంక్‌లో తిరుగుతున్నారు అప్రమత్తంగా.

యసై పడే హాడావిడి గమనిస్తున్నాడు అఖిల్. ఎందుకో అనిజీగా ఫీలవుతున్నాడా కుర్రాడు. అటూ ఇటూ బెరుగ్గా చూస్తున్నాడు. కట్టేసినట్లుందతనికి. పెదవి విప్పి ఒక్క మాటా మాట్లాడం లేదు.

తనని బ్యాంక్‌కి తీసుకురావడం, ప్రత్యేకంగా చూడడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నరో వాడి బుర్రకి అర్థం కావడం లేదు. ఎన్నో సందేహాలు వాడి మెదడుని తొలిచేస్తుంటే తట్టుకోలేకపోయాడు.

“అంకుల్… అంకుల్…” అంటూ ఏదో అడగబోయాడు. వెంటనే అడ్డు తగిలాడు వేద.

“అఖిల్ నేనొక విషయం చెబుతాను. చాలా జాగ్రత్తగా విను. కొనేరు హంపి అనే చిన్న బాలిక ఆ మధ్య ఫ్రాన్స్ దేశంలో జరిగిన చెస్ పోటీలో పాల్గొంది. అక్కడికి వచ్చిన 75 దేశాల ప్రత్యర్థుల్ని అవలీలగా తన మేథస్సుతో ఓడించి ‘అండర్-10’ బాలికల ప్రపంచ టైటిల్ సాధించింది. భారతదేశానికే గర్వ కారణమైంది. ప్రపంచమంతా ఆ అమ్మాయిని వండర్ గాళ్ అని ప్రశంసించని వారు లేరు. బోలెడంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అలా నీకూ గొప్ప పేరు రావాలంటే ఒక పని చెయ్యాలి నువ్వు” అంటూ ఆగాడు.

అఖిల్ తన వైపే ఆసక్తిగా చూడ్డం గమనించాడు.

నిజమే! మమ్మీ, డాడీ కూడా చెప్పారు. ఆ పాప వాళ్ళ అమ్మా నాన్నకి పేరు తెచ్చినట్టుగా మాకూ గొప్ప పేరు తేవాలి అని.

అందుకే హుషారుగా అన్నాడా కుర్రాడు. “మీరు చెప్పినట్టు చేస్తాను చెప్పండి అంకుల్” అని.

“వెరీ గుడ్!” అంటూ వెన్ను తట్టి అభినందించాడు.

“కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో, ఈ బ్యాంకులో ఎవరూహించని విధంగా ఒక రాబరీ జరిగింది 26.3 కోట్లు డబ్బు గల్లంతయ్యింది. ఇప్పటికీ ఆ దోపిడీ దొంగలెవరో ఆచూకీ కనుగోనబడలేదు. నేరస్థులు యధేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆ దొంగతనం అసలెలా జరిగింది ఎవరు చేసారు లాంటి వివరాలు నీవు నాకు తెలియజేయాలి. కేవలం నీ ఒక్కడి వలనే ఈ రాబరీ మిస్టరీ వీడిపోతంది. జరిగింది జరిగినట్లు నీవు చెప్పావంటే నీకు చాలా గొప్ప పేరు వస్తుంది. అవార్డు కూడా ఇప్పిస్తాను.”

చెప్పడం ఆపి కుర్రాడ్ని చూసాడు వేద.

ఆశ్చర్యచకితుడై వింటున్న అఖిల్ ఏదో చెబుదామని పెదవి విప్పాడు అలర్టయ్యాడు వేద!

***

అదే సమయంలో –

షణ్ముగం తన ముఖ్య అనుచరలైన కొందరి సమక్షంలో సమావేశమై కూర్చున్నాడు.

తను చేపట్టబోతున్న న్యూ బిజినెస్ వివరాలని వాళ్ళకి తెలియబరచి వాళ్ళని భాగస్థులని చేయడానికి పిలిపించాడు అందరిని.

సమావేశాన్ని ప్రారంభిస్తూ చెప్పడం ప్రారంభంచాడు.

“రహస్యంగా వుండి, చీకటి వ్యాపారాలు చేస్తూ డబ్బులు గడించే రోజులకి కాలం చెల్లింది. ప్రజలు తెలివి మీరిపోతున్నారు. నిజం చెప్పాలంటే అతి మూర్ఖులైపోతున్నారు. కొన్న వస్తువులపై పర్సెంటేజీలన్నా, ఉచితం అన్నా, సరికొత్త స్కీమ్‌లన్నా తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్థులే ఇలాంటి వాటికి ఆకర్షితమవడం మరీ విడ్డూరం. అందుకే వ్యాపారస్థులు వాళ్ళని మోసం చేయడం తేలికైపోతోంది.

వినియోగదారులకి తెలిసేలా దర్జాగా బిజినెస్‌లు ఓపెన్ చేయడం. అమాయకంగా వాళ్ళని నమ్మించడం. ఎవరూ చేతుల్ని వారి తల మీదే పెట్టేసి డబ్బుని దోచేయడం నేడు లెటెస్ట్‌గా జరుగుతున్న ప్రక్రియ. అందులో భాగంగానే మన ఫర్మ్ నుండి కూడా రకరకాల బిజినెస్‌లకి రూపకల్పన చేసాము.

అవి మంచి ఫామ్‌లో ఉన్నాయి. అందులో నుండి కాల పరిమితి ముగిసిన వాటిని త్వరలో ఎత్తివేయబోతున్నాం. ఈలోగా కొత్త వాటికి రంగం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. లేకపోతే శాఖోపశాఖలుగా విస్తరించిన మన సంస్థ కూకటి వేళ్ళతో సహా పెకలిపోయే ప్రమాదముంది. అందుకే ఒక చక్కని ప్లాన్ కొత్త బిజినెస్ కొరకై సిద్ధమైంది” అంటూ ఆగాడు.

మంత్రముగ్ధులై వింటున్నారంతా.

షణ్ముగం బ్రెయిన్‌లో రూపుదిద్దుకునే వ్యాపారలెన్నింటిలోనో భాగస్వామ్యులై, తమ తమ వాటాల కింద చాలా సొమ్ము కూడబెట్టుకున్నారు అక్కడ కూర్చున్నవాళ్ళు.

“మీ ఆలోచనల త్వరగా చెప్పేయండి. ఎవరు ఏ పనిని స్వీకరించి తమ వంతు పాత్ర నిర్వహించాలో వివరిస్తే తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం” అన్నాడొక బిజినెస్ పార్టనర్.

నాగస్వరం విన్న త్రాచుల్లా తలలు ఊపారు మిగతావాళ్ళు.

అందరి ముఖాల్లో కనబడుతున్న ఆతృతని పసిగట్టిన వాడిలా షణ్ముగం అసలు విషయం ప్రకటించాడు.

“ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నా స్వంత ఆలోచన మాత్రం కాదు. మ్యాగజైన్‌లో పడిన న్యూస్ నా దృష్టిలో పడింది. దాన్ని కూడా జోడించి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త ప్యాకేజ్‌గా మలిచాను. ఇది ఫ్లాట్‌ల బిజినెస్‌కి రిలేటెడ్ అనుకోవచ్చు. లేదా అపార్డమెంట్స్ వ్యాపారంగా పరిగణించవచ్చు. దీనికి ముందు ఆ మ్యాగజైన్‌లో ప్రచురింతమైన మ్యాటర్ ఏమిటో వినండి.”

అందరూ సైలెన్స్ అయిపోయారు.

షణ్ముగం తనదైన ధోరణిలో చెప్పుకుపోసాగాడిలా.

“హీరో సిల్వెస్టర్ స్టాలెన్‌ని తన పార్టనర్‌గా ప్రకటించి న్యూయార్క్‌లో అపార్టమెంట్స్ కట్టే ప్రకటన చేసాడొక వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశం న్యూయార్క్‌లోని మాన్‌హటన్. ఇక్కడికి సమీపంలో అపార్టమెంట్స్ అనే సరికి ఆకర్మాతులైన కోటీశ్వరులందరూ క్యూ కట్టారు.

కొందరు ఉన్న ఇండ్లని అమ్మేసి, మరికొందరు అప్పులు చేసి మరీ అక్కడి ప్లాట్‌లని బుక్ చేసుకున్నారు. మిగతా ప్రదేశాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఉంటుంది అక్కడి రేటు. కానీ ఉన్నరేటుని ఏకంగా పది రెట్లకి పెంచారు. అయినా కేవలం మూడే మూడు రోజుల్లో ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు మొత్తం డబ్బంతా కట్టేసారు.

ఇండ్లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, పార్క్, షాపింగ్ కాంప్లక్స్, స్కూల్, బార్ వంటివి కూడా ఉంటాయని ప్రకటించారు. అందుకే కొనుగోలుదార్ల నుండి ఆ ప్రకటనదారుడికి మొత్తం 15 కోట్ల డాలర్లు చేతులు మారాయి.

అసలా ప్రకటన ఇచ్చి సొమ్ము చేసుకుంది మరేవరో కాదు. సిల్విస్టర్ స్టాలెన్ బాల్య మిత్రుడట!

తర్వాత ఈ ప్రహసనమంతా మోసమని, హీరో సిల్వెస్టర్‌కి దీనితో ఎలాంటి సంబంధం లేదని తెలిసిన జనం రియల్ ఎస్టేట్ బిల్డర్ పైన కోర్టులో దావా వేశారు. అది వేరే విషయమనుకోండి” ఆగాడు క్షణకాలం.

అందరూ ఊపిరి బిగపట్టి షణ్ముగం చెప్పేది టెన్షన్‌గా వింటున్నారు.

ఒకసారి కలయ చూసి కంటిన్యూ చేసాడిలా.

“సినీ స్టార్లంటే విదేశీయులకి సైతం ఎంత మోజు ఉందో ఇక్కడ మనం గుర్తించాల్సిన మెయిన్ పాయింట్. అదే సినిమా స్టార్లపై మన వాళ్ళకి ఉండే క్రేజ్‌ని బలహీనతగా చేసుకొని మనం ప్రోసీడ్ అవ్వాలి. అయితే అక్కడ ఆ వ్యక్తి చేసిన పొరపాటు మన దగ్గర తిరిగి దొర్లకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసాననుకోం…”

అతనా వాక్యం పూర్తి చేయక ముందే మెరుపువేగంతో షణ్ముగానికి చేరిందో న్యూస్… వాళ్ళ సమావేశానికి తీవ్ర అంతరాయం కల్పిస్తూ.

ఆ న్యూస్‌కి అతనెంతలా కదిలిపోయాడంటే –

ఇమ్మిడియేట్‌గా ఆ కాన్ఫరెన్స్‌ని వాయిదా వేసి తన ప్రైవేట్ చాంబర్‌లోకి వెళ్ళిపోయాడు.

తన ఉనికి ఏ మాత్రం తెలియకుండా పొదలమాటున సంచరిస్తున్నాననుకుంటున్న నల్లత్రాచు పొంచి ఉన్న ప్రమాదం తన వైపు దూసుకు వస్తోందని పసిగడితే కసిగా బుసలు కొడ్తుంది. అలర్ట్ అయితే బయటపడుతుంది. అశక్తురాలైతే ప్రమాదానికి బలి అయిపోతుంది.

తనకి అందిన న్యూస్ వింటూనే కాళ్ళ కింద భూభాగం కదలినట్లు భయకంపితుడయ్యాడు షణ్ముగం.

ఒక భయానక పిడుగు స్లోగా తన మీదే పడిన ఫీలింగ్. భూభాగం బ్రద్దలై అందులో కూరుకుపోతున్న అనుభూతి.

షాక్‌కి గురైన వాడిలా విలవిల్లాడాడు కాసేపు. ఆయిన మనోధైర్యం కోల్పోలేదతను. అదే షణ్ముగం ప్రత్యేకత. తుఫానులో చిక్కుకున్నా నిబ్బరంగా ఉండగలడు.

తన మెదడుకి పదను పెట్టాడు. చివరికి… తనకి అందిన వార్తకి ప్రతిగా – ఎదురు దెబ్బ తీయడమా, తోకముడిచి పలాయనం చిత్తగించడమా… అనే మీమాంసలో పడిపోయాడు చాలా సేపు.

***

అక్కడ –

“ఆ వివరాలు నాకెలా తెలుసు అంకుల్?”

వాడి ముఖంలో ప్రశ్నార్థకం. చూపుల్లో అమాయకత్వం.

అఖిల్ సమాధానం వినగానే వ్యాస్ ఉత్సాహం చప్పున చల్లారింది.

“పర్వాలేదు. నీకెంత టైమ్ కావాలంటే అంత టైమ్ తీసుకో. నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనరు. దేనికీ అడ్డు చెప్పరు. జరిగింది జరిగినట్లు చెప్పు.”

వేద మైండ్ పజిల్డ్‌గా మారుతుంటే కూల్ అవుతూ అడిగాడు.

నిస్సహయంగా చూస్తుండిపోయాడా కుర్రాడు.

“కమాన్… కమాన్…”

“నాకేమీ తెలియడం లేదంకుల్.”

ఇబ్బందిగా ముఖం పెట్టాడు. గతి తప్పిన స్వరంలా ఉంది వాడి గొంతు.

“తొందరేమీ లేదు. ఈ పరిసరాలనన్నింటినీ బాగా గమనించు. నెమ్మది నెమ్మదిగా గుర్తు తెచ్చుకో.”

అఖిల్‌ని మూడ్‌లోకి తెచ్చే ప్రయత్నమే తప్ప మరో విషయం ఆలోచించడం లేదతను.

ఆ దోపిడీ సంఘటన ఎలాగైనా వాడి చేత చెప్పించాలన్న తపనతో ఉన్నాడు.

“సారీ అంకుల్, నాకేదో భయం భయంగా ఉంది. మీరేం అడుగుతున్నారో నేనేం చెప్పలో అస్సలు అర్థం కావడం లేదు” అన్నాడు.

పిరికితనం ప్రవేశించింది వాడిలో.

“భయం దేనికి? నేనున్నాగా! ఇక్కడ గుర్తుకు రాకుంటే అటు వైపు పద.”

అంటూ అఖిల్‌ని లాకర్ల గది వైపు తీసుకుపోయాడు.

“ఇదిగో… ఈ లాకర్స్‌ని బాగా పరిశీలించు. ప్రదేశంలోకి ఎవరో చోరబడి, ఏదో చేశారు. గుర్తుకు తెచ్చుకో నిట్టూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. ట్రై చేయ్.”

అఖిల్‌ని ఊపిరి సలపనివ్వనంత తొందపెట్టేస్తున్నాడతను.

బెదిరిపోయిన ఆ కుర్రాడి కళ్ళు నీటి కుండలయ్యేందుకు సిధ్ధంగా ఉన్నాయి.

“అఖిల్! డోన్ట్ వేస్ట్ టైమ్! త్వరగా చెప్పేసెయ్!”

టెన్షన్… కుర్రాడి ద్వారా నేరం తెలుసుకోవాలన్న తొందరపాటు… ఎందుకు పెదవి విప్పడం లేదన్న శంక… వీటితో వివేచన కోల్పోయిన వేద బలవంతపెట్టేస్తున్నాడా పిల్లవాడ్ని.

గుండెలో గూడు కట్టుకున్న గుబులు కుదిపేసింది అఖిల్‌ని.

“మరే నాకేమీ గుర్తుకు రావడం లేదంకుల్. మమ్మీ డాడీ గుర్తుకు వస్తున్నారంతే. ఇక్కడుడొద్దు. ఇంటికి వెళదాం అంకుల్…” అంటూ భురుమని ఏడ్చేసాడు వాడు.

అప్పుడు… అప్పుడు… తన వైపు నుండి కాక, పిల్లాడి పరంగా ఆలోచించాడు వేదవ్యాస్.

అఖిల్‌ని అనవసరంగా మానసికంగా హింసిస్తున్నానేమోనన్న తలంపు రావడంతో వేద విచలితుడయ్యాడు.

చప్పున వాడిని దగ్గరకు తీసుకున్నాడు.

చెమర్చిన వాడి కళ్ళని ఆప్యాయతతో తుడిచాడు.

“నిట్టూ ఏడవకు. వెంటనే మమ్మీ డాడీల దగ్గరికి వెళ్ళిపోదాం సరేనా?” అంటూ ఓదార్చాడు.

తన ప్లాన్ వికటించడంతో హార్ట్ అయిన వేద తొలిసారిగా తన కర్తవ్యనిర్వహణలో ఎదురైన అపజయాన్ని జీర్ణించుకోలేక భారంగా కదిలాడక్కడి నుండి.

ఆ క్షణంలో అతను తీసుకున్న సరియైన నిర్ణయమేంటంటే –

అఖిల్‌ని ఇంకా విసిగించకుండా, కష్టపెట్టకుండా అడిగిన వెంటనే వాళ్ళింటికి చేర్చడం.

వేదవ్యాస్‌కి మరొక విషయం తెలియదు.

అతి త్వరలో రెండవ పరాజాయాన్ని చవిచూడబోతున్నానని.

***

అత్యవసర సమావేశ నిమిత్తమై యస్సై వేదవ్యాస్‌ని పిలిపించాడు సి.ఐ ద్వివేది. ఆఫీసుకు కాదు తన ఇంటికి.

మనీ మనీ బ్యాంక్ దోపిడి ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఏ ఇన్‌ఫర్మేషన్ కూడా ఆయనకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వేదవ్యాస్ కూడా ద్వివేదిని అధికారికంగా అనధికారికంగా కలవక చాలా రోజులయ్యింది.

పాయింట్ టు పాయింట్ ఎవ్విరీ మూవ్మెంట్ ఇన్‌ఫర్మేషన్ తనకి అందజేయమని యస్సైని ఆదేశించకపోయినా పై అధికారిగా సంబధిత సమాచారం తెల్సుకోవాలనే ఉద్దేశంతో అతన్ని రమ్మన్నాడు ద్వివేది.

“వాట్ ఈజ్ ద మ్యాటర్? సడెన్‌గా పిలిపించారేంటి” అడిగాడు.

“నీ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చిందో తెల్సుకుందామని” చెప్పాడు ద్వివేది.

“జరుగుతోంది. బలమైన సాక్ష్యాధారాల కొరకు ప్రయత్నిస్తున్నాను.”

“యూ మీన్…. నేరస్థులెవరో తెల్సిందా.”

అలా ప్రశ్నిస్తున్న ద్వివేది అంతరంగం ఉత్కంఠభరతిమైంది.

పెదవి విప్పి ఏదో చెప్పబోయిన వేద సిక్స్త్ సెన్స్ హెచ్చరికతో చప్పున మాట మార్చాడు.

“నో సార్!” అంటూ అఖిల్‌ని బ్యాంక్‌కి తీసుకెళ్ళిన విషయం మాత్రం చెప్పాడు.

“కేవలం ఆ కుర్రాడి మీదే ఆధారపడి నీ ఇన్వెస్టిగెషన్ కొనసాగుతోందా?” సి.ఐ భృకిటి ముడువడింది.

“ఏదీ ఇదమిత్థంగా చెప్పలేను. కావచ్చు, కాకాపోవచ్చు. ఈ కేసుని టేకప్ చేసే ముందే మీకు చెప్పాను. దర్యాప్తుని ఎలా కొనసాగిస్తానో చెప్పను అని. ఇప్పుడు అదే చెబుతున్నాను. చెప్పబోనని ప్లీజ్… అండర్‌స్టాండ్ మీ సర్.”

అతడి అభ్యర్ధనని మన్నిస్తున్నట్టు సరేనని తలూపాడు ద్వివేది.

“బట్… ఫస్ట్ చాయస్ టు మాస్టర్ అఖిల్. ఆ పిల్లవాడి ద్వారానే ఈ కేసు మిస్టరీ చేదించబడుతుంది. దేరీజ్ నో డౌట్.”

“అఖిల్ ద్వారా క్లూ దొరకకుంటే?” సందిగ్థతని పెనవేసుకున్నాయా చూపులు.

“అలా జరగని క్షణాన మరో కోణం నుండి నా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వేద దేన్నైనా ప్రారంభించాడంటే దాని అంతు… అంతం చూడాల్సిందే తప్ప తోకముడిచి వెనుదిరగడం నా లైఫ్ డైరీలోనే లేదు సర్” కాస్త ఎగ్జైట్‌మెంట్‌కి కిలోన్యాడు.

“డోంట్ బి రెయిజ్!” చిన్నగా నవ్వాడు ద్వివేది.

మనిషికి ఎదురుగాలి తగిలినప్పుడు టెన్షన్‌కి లోనవడం సహజాతి సహజం. అనుకున్నది అనుకున్నట్టుగా కేసు దర్యప్తు సాఫీగా జరగకపోవడంతో వేద పరిస్థితి అలాగే ఉండి ఉంటుందని భావించాడాయన.

“నాకు తెలుసు. నీది మొసలి పట్టని. నీటిలోకి వచ్చి చేరిన ఎంతటి బలమైన జంతువైనా మొసలి పట్టుకు గింజుకోవలసిందే! అలాగే నీలో ఊపిరి ఉన్నంతకాలం నీ లక్ష్యం నెరవేరేదాకా ఎవరినీ వదిలిపెట్టవని నాకు తెలీదా?”

అపజయయంలో ఒక చిన్న ఓదార్పు ఆ వ్యక్తి ఆత్మస్థయిర్యానికి ఆయుధం అవుతుంది. అందుకే వేదవ్యాస్‌ని ఉత్తేజపరిచాడా ఆఫీసర్.

ఒక్క క్షణం కళ్లు ముసుకొని తన అంతరంగ అలజడిని తగ్గించుకున్నాడు వేదవ్యాస్.

“అఖిల్ ద్వారా దోపిడీ వ్యవహారం బట్టబయలవుతోందనే రహస్యం నేరస్థులకి తెలిసి అఖిల్‌కి ఏదైనా ప్రమాదం తలపెడితే. జరగానిది జరిగినపుడు… వాళ్ళ తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోగలమా?” ప్రశ్నించాడు సి.ఐ.

“తెలిసే అవకాశం లేదు. అయినా ఆ కుర్రాడికి ఫుల్ స్పెషన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. వాడి కెలాంటి ప్రమాదం లేదు. వాటిల్లదు. సారీ సార్ మీకీ విషయం చెప్పడం మరిచాను. నేలస్థుల నీడ కూడా వాడి మీద పడకుండా గట్టి బందోబస్తు జరిగింది. ఈ విషయం సీక్రెట్‌గా ఉంచాను.”

“ఇట్స్ ఓకే! ఫుల్ పవర్స్ నీకే ఇచ్చాగా! దానికి సారీ ఎందుకు? మనకి కావాల్సింది దోపిడీదారులు పట్టుబడడం.”

“థాంక్యూ సర్.”

“మళ్ళీ మాస్ మీడియాకి ఏదైనా సమాచారం అందిద్దామా.”

“అక్కర్లేదు సర్! ఈ మూవ్‌మెంట్‌లో వద్దు. అఖిల్ ఫోకస్ అవుతాడేమోనని! అందుకే ఆ బ్యాంక్‌కి అఖిల్‌ని తీసుకువెళ్ళిన విషయం పేపర్స్‌లో కవర్ కాకుండా జాగ్రత్తపడ్డాను. నా అనుమానం ఏంటంటే మనీ మనీ బ్యాంక్ దోపిడీకి ఈ సిటీలోని కొందరు బడావ్యక్తులకి లింక్ దేమోనని. అది కూడా ప్రత్యక్షంగానో!… పరోక్షంగానో… లేదా ఎలాంటి సంబంధమూ ఉండకపోవచ్చు. ఆ రకంగా కూడా నా దర్యాప్తు కదులుతోంది.”

“కొందరు వ్యక్తులపై అనుమానం ఉన్నపుడు అరెస్ట్ చేసి ఇంటారాగేషన్ ప్రారంభం చేయవచ్చు కదా! మార్గం సులువు అవుతుందేమో ఆలోచించు.”

“నో సార్! రంగంలోకి దిగాక అనుమానితుల్ని అడ్డు పెట్టుకొని సాక్ష్యాలును వెతకదల్చుకోలేదు. జరిగిన దోపిడీ మూలాల నుండి ఆధారాల వైపు దర్యాప్తును తీసుకువెళ్తాను. బలమైన ఆధారాలు లభించాకే నేరస్థుల్ని ఇంటరాగేట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. అందుకే ఏ చిన్న క్లూ దొరికినా ఆ వ్యక్తి బయోడాటా, దైనందిన కార్యకలాపాలు, అలా ప్రతి మూవ్‌మెంట్‌ని నా స్పెషల్ రూమ్‌లోని కంప్యూటర్‌లో భద్రపరుస్తున్నాను.”

“గుడ్! నువ్వు నేరస్థుల్ని చట్టానికి పట్టివ్వడమే లక్ష్యంగా ఈ యజ్ఞాన్ని చేపట్టావు. సో నీ అంతస్సాక్షి ప్రకారమే అత్యంత ధైర్యంగా మరింత పారదర్శకంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను.”

“మీరిచ్చిన స్ఫూర్తి నన్ను కార్యోన్ముఖున్ని చేస్తోంది సర్. నా ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి రాజకీయాలకు తావుండకూడదని, రాజకీయనాయకుల ప్రమయం అసలే ఉండకూడదని నేను కోరిన మరుక్షణం నా షరతులని మన్నించారు. నా దర్యాప్తు స్వచ్ఛందంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు వేరీ వేరీ థాంక్స్ సర్.”

వేదవ్యాస్‌లో తన పై ఆఫీసర్‌పైగల కృతజ్ఞతాభావం వెళ్ళడయ్యింది.

“ఇందులో నా గొప్పేమీ లేదు. నీ సమర్థత, పోరాటపటిమ నిన్నా దిశవైపు నడిపేందుకు సహకరిస్తున్నాయంతే.”

తన సబార్డినేట్‌ని అభినందించాడాయన.

“తేనెతుట్టెని కదలించనేకూడదు. కావాలని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కదిలిస్తే మాత్రం తేనేటీగలు దాడి చేసి మనల్నే చిత్ర వధ చేస్తాయి. ఆ అవకాశం వాటికి ఇవ్వకుండా చేయాలంటే అలర్టై వాటిని సమూలంగా నాశనం చేయగలగాలి.”

“ఈ కేసు కుడా అలాగే వుంది సర్. కావాలని మనమే కదిపాం. కాబట్టి ఇటు బ్యాంక్ నేరస్థుల్నే కాదు, రకరకాల ఏజన్సీల, ఫైనాన్స్‌ల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి ఘరానా మోసగాళ్ళని నేర చరితుల్ని వదిలి పెట్టకూడదని నా ఆలోచన” అన్నాడు వేద.

“టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్” అంటూ బిగ్గరగా నవ్వాడు ద్వివేది.

“నో! టోటల్ బర్డ్స్ ఎట్ వన్ షాట్” ఆయనతో శృతి కలిపాడు వేద.

ద్వివేదితో వ్యాస్ సమావేశం అలా ముగిసింది.

***

ద్వివేదిని కలిసొచ్చిన మరునాడు తన అసిస్టెంట్ ఒక సంచలన మెసేజ్ మోసుకు వచ్చాడు వేదవ్యాస్ దగ్గరకు.

మనీ మనీ బ్యాంక్ కేసుకి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం గల చిప్‌ని అతని స్పెషన్ రూమ్ నుండి ఎవరో తస్కరించారనేది దాని సారాంశం.

అది విని హతాశుడయ్యాడు వేదవ్యాస్. క్షణకాలం కాలం స్థంభించినట్లుయ్యింది.

బ్యాంక్ దోపిడీ కేసుకి సంబంధించిన ప్రాథమిక సమాచారమైన యాభై పేజీల నివేదిక అందులో నిక్షిప్తమై వుంది. తన సిబ్బంది కళ్లు గప్పి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆ చిప్‌ని ఎలా దొంగిలించారనేది అంతు చిక్కకుండా వుంది.

బ్యాంక్‌లో అఖిల్‌తో జరిపిన ప్రయత్నంలో వైఫల్యం…

అది జరిగిన అయిదు రోజులకే ఆ కేసు తాలుకు చిప్ మాయమవడం…

అతడు అధైర్య పడడానికి ఆస్కారం ఇచ్చింది.

అదీ కాసేపే.

వేద మస్తిష్కం ఆలోచనల వెంట పరుగులు తీసింది.

నేరస్థుల ప్రత్యక్ష చర్య ప్రారంభమయ్యిందన్న మాట. ఇక ఉపేక్షిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎదురు దాడికి దిగారు ప్రత్యర్థులు. తన దర్యాప్తుని ఆటంకపరుస్తున్నారు. పరిశోధనని పటిష్ఠం చేయాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. సమరాంగన సార్వభౌముడనై నేరస్థుల్ని తరిమి తరిమి వెంటాడి వేటాడాల్సిన సమయం దగ్గర పడింది. వాళ్ళు ప్రాణభయంతో చేసే కదిలికలే నా దర్యాప్తుకి జీవనాధారాలు.

వేద ఆలోచనల్ని అర్థాంతరంగా ఆపేసి దిగ్గున లేచాడు.

కడలిగర్భంలోంచి ఉవ్వెత్తున పై కెగిసిన నీటి కెరటంలా… ఉద్వేగభరితుడై… ఆవేశంగా కదిలాడక్కడి నుండి.

యుద్ధ పర్వం ప్రారంభమయ్యింది.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here