ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-2

0
9

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]అ[/dropcap]దే తరుణంలో

వసంత్ పేపర్ చదవడం పూర్తి చేసి మార్కెట్‌కి బయల్దేరాడు. భర్త బయటకు వెళ్ళిన అనంతరం నివేదిత హాల్లోకి ప్రవేశించింది అఖిల్ ఒళ్ళు తుడుస్తూ.

ఆమె కంట పడిందా పాంప్లెంట్.

వంగి దాన్ని తీసుకుని తీరిగ్గా చదివింది.

విధి ఆడించబోయే రసమయ నాటకానికి నాందీ ప్రస్తావనగా.. ఆ క్షణంలో అంకురార్పణ జరిగింది.

అందుకే ఆసక్తిగా ఆ పాంప్లెట్‌ని భద్రపరిచిందామె.

***

సాయంత్రం ఆరు గంటలు.

ఆఫీసు నుండి వచ్చిన వసంత్ ఫ్రెషప్ కాగానే, భర్తకి కాఫీ కప్పు అందించి పక్కన కూర్చుంది నివేదిత.

అక్కడే హోమ్ వర్క్ చేస్తూ కూర్చున్న అఖిల్ తండ్రితో అన్నాడు.

“డాడీ! డాడీ! స్కూల్లో మేడమ్ చెప్పింది. పిక్నిక్ తీస్కెళ్తార్ట మమ్మల్ని” అని

“ఎక్కడికి?” అడిగాడు వసంత్.

మౌనంగా ఉండిపోయింది నివేదిత. స్కూల్ నుండి రాగానే తల్లికీ విషయం చెప్పి పర్మిషన్ అడిగాడు అఖిల్. కానీ డాడీ వచ్చాక ఆయనకి చెప్పమందామె.

అందుకే కొడుకు భర్తకి చెబుతుంటే కలుగజేసుకోలేదు నివేదిత.

“ఊరి బయట మామిడి తోటల్లోకట.” అన్నాడు వాడు.

“ఎప్పుడు వెళ్తున్నారు?”

“కమింగ్ ఫ్రైడే డాడీ!”

“నీకు వెళ్ళాలనుందా?”

అవునన్నట్లు తలూపాడు వాడు.

“సో! పర్మిషన్ గ్రాంటెడ్.”

తండ్రి మాటకి వాడి ముఖం వికసించింది.

సంతోషంతో తిరిగి హోమ్ వర్క్ చేయటంలో నిమగ్నమైపోయాడు.

అయితే ఆ పిక్నిక్ ప్రోగ్రామ్ అఖిల్ జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పబోతోంది!

***

సమయం సరిగ్గా రాత్రి పదకొండు గంటల ముప్ఫై నిమిషాలు. దాదాపు నగరమంతా నిద్రాదేవి ఒడిలోకి జారుకుని వుండి వుంటుంది.

కానీ ఓ అపార్టమెంట్‌లోని ఆ గదిలో మాత్రం ఉత్కంఠత ఆవరించి వుంది. వినాశనానికి దారి తీసే ఏ క్రూరపు ఆలోచనలకి ఇక్కడ అంకురార్పణ జరగబోతోందనే భయం పట్టుకుందా గదికి.

ఎందుకంటే..

త్రాచుల్లాంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ సమావేశమవబోతున్నారు.

ఈజీ చెయిర్‌లో అసహనంగా కదులుతోందో ఆకారం.

ముప్పావు గంట నుండి వెయిటింగ్‌లో వుంది ఆ ఆకారం, ముఖ్యమైన రెండవ వ్యక్తి కోసం.

అందుకే విసుగ్గా ఫీలవుతోంది.

మాటిమాటికీ చూపులు వాచ్‌ని తడుముతున్నాయి. చెవులు డోర్ శబ్దం కోసం చూస్తున్నాయి.

అదిగో అప్పుడు మ్రోగింది బజర్!

శబ్దం వినబడడం ఆలస్యం వెంటనే తలుపులు తెరుచుకోలేదు.

అలర్ట్ అవుతూ చెవులు రిక్కరించి, చూపుని డోర్ కేసి సారించిందా ఆకారం.

కాలింగ్ బెల్ శబ్దం ఆగింది. డోర్‌లాక్ హోల్‌లోంచి పెన్ టార్చ్ ఫోకస్ గదిలోకి పడింది. అలా రెండు సార్లు. తిరిగి బెల్ మోగింది. తర్వాత మరో సారి ఫోకస్.

అదిగో అదే సంకేతం!

కన్‌ఫర్మ్ అయ్యాక మరిక ఆలస్యం చేయ లేదు ఆకారం.

పరుగున వెళ్ళి లాక్ తీసి డోర్ ఓపెన్ చేసింది. రెండవ ఆకారం లోనికి వచ్చాక తిరిగి లాక్ వేసింది.

“హలో!” అంటూ విష్ చేసింది ఆకారం.

బదులుగా “హలో!” అంది రెండవ ఆకారం.

“మనం అనుకున్న టైమ్ కంటే చాలా లేటయినట్టుంది ఇక్కడకు రావాడం” సంజాయిషీ అడిగింది.

“నథింగ్” అంటూ భుజాలెగరేసింది.

“మరి నీ నైస్ పంక్చువాలిటీ?” వ్యంగ్యం ధ్వనించింది.

ఇలా రహస్యంగా ఏదో ఒకచోట ఎవ్రీ వీకెండ్ ఇద్దరూ మీట్ అవుతుంటారు. బిజినెస్ రీత్యా ఎక్కడ వున్నా, ఎంత బిజీగా వున్నా.

“ఈ రోజు మార్నింగ్ లేవడమే పదిహేను నిముషాలు లేటయ్యింది. ఇక్కడికి వస్తుంటే మార్గ మధ్యలో చిన్న ప్రోగ్రామ్ ఎటాచయ్యింది. అక్కడ కొంత టైమ్ స్పెండ్ చేయ్యాల్సి వచ్చింది. సో! ఈ రోజంతా నా టైమ్ టేబుల్ అలా అలా క్యాజువల్‌గా ఆలస్యమవుతూ వచ్చింది. దట్సాల్.”

చేసేది చీకటి వ్యాపారమే అయినా సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తుందా ఆకారం. అందుకే తనని తాను సమర్థించుకుంటూ పై కారణాలు తెలిపింది.

“బై ది బై! నీ న్యూ ఎసైన్‌మెంట్ ఎంతవరకొచ్చింది?” అంటూ మొదటి ఆకారాన్ని ప్రశ్నించింది.

“పికప్‌లో వుంది.”

“క్యాష్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నావ్?”

“సుమారు ఇరవై నుండి ముప్పై లక్షలు వరకు.”

“నీ ప్లానింగ్ ప్రకారం గోల్ పుర్తయినట్లేనా?”

“కేవలం ఫోర్టీన్‌ లాక్స్ కవరయ్యాయి.

“మిగతా ఎమోంట్..”

“ఫుల్‌ఫిల్ కావాలి..”

“ఇంకా ఎంత టామ్ పడుతుంది?”

“జస్ట్.. పది పదిహేను రోజుల్లో పూర్తి చేసేద్దాముకుంటున్నాను.”

“అప్పటికీ అవకపోతే?”

“ఏముంది? అనుకున్నది అనుకున్నట్లు జరక్కపోతే మరో పదిహేను రోజుల ఎక్స్‌టెన్షన్‌కి ప్లానింగ్ సిద్ధం చేస్తున్నా.”

“వేసిన ప్లాన్ ప్లాన్డ్‌గానే వుండాలి. అందుకే సరిగ్గా డీల్ చేస్తూ వుండు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు. ఎలాంటి లొసుగులు బయటకు పొక్కకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి.”

“వూ” కొడుతోంది.

“ఆర్ యూ ఫాలోయింగ్ మీ?”

“యసెస్. ప్రొసీడ్.”

“జనాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. అలాగే పోలీసు వ్యవస్థనీ. ఆదమరిచి ఉండకు. మనని వెన్నంటి పొంచి వుండే పోలీసుల నుండి ప్రమాదాన్ని పసికడుతూనే మరో వైపు జనాల్ని సరికొత్త టైపులో మోసగిస్తూ వుండాలి. అప్పుడే మన ఉనికి దెబ్బ తినదు.”

తలూపింది ఆకారం.

“అలా జరగని క్షణాన మనం ఘోరంగా స్లిప్ అవుతాం” మళ్ళీ తనే కంటిన్యూ చేసిందా రెండవ ఆకారం.

“ట్రెయినింగ్ తమరిదా కదా! నా స్టెప్స్ మిస్ అవడం జరగదు.”

“ఆ హోప్ ఉందనుకో”

“ఇక ఇంపార్టెంట్ టాపిక్ ఏమీ లేదు. ముగిద్దామా?”

“ష్యూర్.”

“ఓ.కె! గుడ్ నైట్” అంది మొదటి ఆకారం.

“గుడ్ నైట్” బదులుగా విష్ చేసింది రెండవ ఆకారం.

డోర్ లాక్ ఓపెన్ చేసి ఎప్పట్లా తిరిగి చీకట్లో కలిసి పోయిందా ఆకారం.. నిశ్శబ్దంగా!

వెనువెంటనే మొదటి ఆకారం అడుగులు కదిలాయి మరొక దిశగా.. వడి వడిగా!

సమాజం దృష్టిలో వాళ్ళిద్దరూ పేరు మోసిన బిజినెస్ టైకూన్స్.

అదే విధంగా హైటెక్ క్రిమినల్స్ కూడా.. చట్టం పరిధిలో!

***

ఉదయం.

ఎనిమిది గంటలు.

తనకూ బాల్యం వచ్చేసిందేమోనన్నట్లు తారు రోడ్డు మీద ఉత్తేజంతో పరుగులు పెటుతోంది స్కూల్ బస్.

లోపల పిల్లలంతా ఉత్సాహంగా రైమ్స్‌ని లయబద్ధంగా కోరస్‌గా పాడుతుంటే.. తాళం వేస్తున్నట్టు బస్‌కి ముందర కట్టిన బ్యానర్ గాలికి రెప రెపలాడ్తోంది.

గంట ప్రయాణానంతరం సిటీ ఔట్‌స్కట్స్‌లో వున్న విశాలమైన మామిడి తోటలోకి వచ్చి ఓ ప్రక్కగా ఆగిందా స్కూల్ బస్.

మొదట స్టాఫ్ దిగి, ఎవరి బ్యాచ్‌లోని పిల్లల్ని వాళ్ళు కిందికి దింపారు. అందరూ దిగాక మరో సారి అటెండెన్స్ ప్రక్రియ కొనసాగింది. తర్వాత వరుసక్రమంలో శాఖోపశాఖలుగా విస్తరించి వున్న ఓ పెద్ద మామిడి వృక్షం కిందికి పిల్లల్ని తరలించారు.

ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు కేవలం పాతిక దాకా వున్నారు. లేడీ టీచర్స్ ఆరుగురు. హెడ్ మిస్ట్రెస్,. ఇద్దరు అటెండర్స్‌తో కలుపుకొని మొత్తం ట్రూప్ సంఖ్య ముప్పై నాలుగు.

అందరూ హాపీగా ఉన్నారు.

కానీ వాళ్ళకి తెలీదు.

త్వరలో ఒక సంచలనం తమ మధ్యలో జరగబోతోందని, ఆ సంచలనానికి సాక్షీభూతులుగా తామంతా నిలవబోతున్నామని!

అందరూ ఒక చోట సమావేశమయ్యాక హెడ్ పిల్లల్నుద్దేశించి మాట్లాడింది.

“డియర్ స్టూడెంట్స్! చదువు చదువూ అని బోర్ ఫీలవకుండా మిమ్మల్ని ఉల్లాసపరచాలనే ఉద్దేశంతో.. రోటిన్‌కి భిన్నంగా సరదాగా సందడిగా గడపాలని మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చాం.

ఈ పిక్‌నిక్ ప్రోగ్రామ్ మీకొక మధురానుభూతిగా మిగిలిపోతుందని నా నమ్మకం. నేటి ప్రోగ్రామ్ షీట్ ప్రకారం ముందుగా పది పదిహేను నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజులుంటాయి. ఆ తర్వాత జాలీ జాలీగా వుండే కార్యక్రమాలుంటాయి.

అవి ఏంటో నేనిప్పడే చెబితే థ్రిల్లింగ్‌గా వుండదు మీకు. వెయిట్ చెయ్యండి. మీరే బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ బీ రెడీ!” అంటూ ముగించింది.

గేమ్స్ టీచర్ మేరీని పిలిచి తదుపరి కార్యక్రమం కండక్ట్ చేయమని ఆదేశించింది.

మిగతా టీచర్స్ పిల్లలకి వేడి వేడి పాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.

దాదాపు పది నిమిషాలు పిల్లలతో శారీరక్ చేయించింది మేరీ టీచర్. తర్వాత ఫైవ్ మినట్స్ రెస్టిచ్చింది.

టీచర్స్ తమ బ్యాచ్‌ల వారగా పిల్లలకి పాలూ బిస్కట్స్ సప్లై చేసారు. కాసేపు రిలాక్సయ్యాక నెక్ట్స్ ప్రోగ్రామ్‌కి సమయాత్తమయ్యారు.

కింద రెండు కార్పెట్స్ పరిచి అందరూ ఒక వలయాకారంలో కూచున్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యత డాన్స్ టీచర్ సుధారాణికి అప్పగించబడింది.

అందరూ ఉత్సాహంగా ఉన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అందామె.

“మన మధ్యలో ఉంచబడిన ఈ ప్లాస్టిక్ బుట్టలో కొన్ని చీటీలున్నాయి. ఒక్కక్కరూ వెళ్ళి ఒక చీటీ తీసుకొని తిరిగి మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. మీరు ప్రదర్శించాల్సిన రకరకాల అంశాలు ఆయా చీటీల్లో ఆల్రెడీ రాయబడి వున్నాయి.

నేను పిలిచిన వారు వచ్చి తమ తమ చీటీల్లో రాసివున్న అంశాన్ని అందరికీ వినపడేలా చెప్పాలి. తర్వాత ఆ అంశాన్ని అందరి ముందూ ప్రదర్శించాల్సి వుంటుంది. మీతో పాటుగా మేమంతా కూడా ఈ ‘ఫన్ గేమ్’ ప్రోగ్రామ్‌లో పాలు పంచుకుంటాం. ఓ.కె!”

ఆమె చెప్పడం ముగియగానే “ఈ..య్యా..” అని అరుస్తూ పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.

కానీ ఆ ఆనందానికి తెరదించూతూ –

తమలోని ఓ బాలుడే అందర్నీ విస్మయంలో ముంచెత్తే సంఘటనని సృష్టించబోతున్నాడని ఎవరూహించగలరు?

అలా ఊహిస్తే జరగబోయే పరిణామం మరోలా ఉండేదేమో!

“లెటజ్ స్టార్ట్!” అంటూ సుధా టీచర్ ‘ఫన్ గేమ్’ని ప్రారంభించింది.

సుధా టీచర్ సూచించినట్లుగానే అందరూ వరుసగా ఒక్కో చీటీ తీసుకుని తిరిగి తమ తమ ప్లేస్‌లో కూర్చున్నారు.

ఎవరికీ వారే చీటీలో వున్నది మనసులోనే చదువుకున్నారు.

కొందరు ముఖాలు ముసి ముసి నవ్వుల్తో వెలిగిపోతున్నాయి. నచ్చని అంశం వచ్చిందేమో, మరికొదరు గబుక్కున మొహాలు మాడ్చేసుకున్నారు. ఇంకొందరు గుంభనంగా కూచుండి పోయారు.

ఒక ప్రక్క అందరి హావభావాల్ని తిలకిస్తూ, చీటీలందరూ తీసుకోవడం పూర్తయ్యాక, ఆఖరున తాను లేచి వెళ్ళి మిగిలివున్న చోటీని తెచ్చేసుకుంది సుధారాణి.

అందరికీ ఆతృతగా వుంది. మిగతా వాళ్శకి ఏ చీటీ వచ్చిందో అందులో ఏమి రాసుందో తెల్సుకోవాలన్న ఉత్సుకత మొదలయ్యింది.

పిల్లల వంక ఓ సారి చూసి సుధా మేడమ్ చెప్పిందిలా.

“రక రకాల అంశాలను చేజిక్కించుకొని బహుశా అందరూ ప్రదర్శనకి సంసిద్ధులై ఉన్నారనుకుంటాను. పోతే ఎవరికి ఏ అంశం వచ్చినా ఎలాంటి బెరుకు లేకుండా ప్రదర్శించి కార్యక్రమాన్ని సఫలం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫన్ గేమ్ జస్ట్ సరదా కోరకే కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అందరూ తప్పకుండా పాల్గొనాలి. ఫస్ట్ నాతోనే ప్రారంభిస్తున్నా.”

తన చేతిలోని చీటీ తీసి అందులోని మ్యాటర్ బిగ్గరగా చదివింది.

‘మగాడిలా మీసాలు దువ్వుకుంటూ ఠీవిగా నడవాలి’ అని వుంది.

పిల్లలంతా మేడమ్ వైపు ఇంట్రస్టింగ్‌గా చూశారు, ఎలా అభినయిస్తుందా? అని.

ఆమె లేచి నిలబడింది.

శ్వాస పీల్చి బాడీని కాస్త ముందుకి పొంగించింది. ఎడమ చేతిని లూజుగా విదిలేసింది. కుడి చేతిని పైకెత్తి.. మీసాల్ని దువ్వింది. హుందాగా అడుగులు ముందుకు వేస్తూ, అందరిముందు నుండి నడుస్తూ ఓ రౌండ్ పూర్తి చేసింది.

ఆమె అభినయానికి రెండు నిమిషాలు పట్టింది.

సేమ్‌టు సేమ్ మగాడిలా యాక్టింగ్ చేసేసరికి పిల్లలు నోటిపై అరచేతులుంచేసుకొని పడీ పడీ నవ్వసాగారు. వాళ్ళ నవ్వుల్తో శృతి కలపుతూ వెళ్ళి కూర్చుందామె.

అందరికేసి ఓ సారి కలయచూసి, ఓ పాపని చెయ్యెత్తి చూపిస్తూ, “ఇప్పుడు శ్వేత వంతు. ఊ.. స్టార్ట్ చేయమ్మా!” అందా అమ్మయిని పురమాయిస్తూ.

తన వంతే ముందుగా వచ్చేసరికి బిక్కమొహం వేసిందా అమ్మాయి. ఒకట్రెండు సెకన్లు స్తబ్దుగా వున్నా చివరికెలాగో ధైర్యం చేసుకొని మెల్లగా లేచి నిలబడింది.

చీటీ తెరిచి చూస్తూ, గొంతు పెగుల్చుకొని “పిల్లిలా అరవడం” అని చెప్పి చప్పున తలదించుకొని నేల చూపులు చూడసాగింది.

ఆ అమ్మయికి బిడియం ఎక్కువ. ఫిఫ్త్ క్లాస్ అయినా అతిగా సిగ్గు పడ్తుంటుంది. నలుగురు ముందు నోరెత్తి గలగలా మాట్లాడి ఎరుగదు. అందుకే ఉన్నచోటు నుండి కదలకుండా బిగుసుకుపోయి నిలబడి పోయింది.

“అరవాలి… అరవాలి. పిల్లిలా అరవాలి” మిగతా పిల్లలంతా కోరస్‌గా కేకలు వేయసాగారు.

“శ్వేతా! అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? నేను యాక్టింగ్ చేసాను కదా! ఊ.. పిల్లిలా అరవాలి?” అంటూ ఎంకరేజ్ చేసింది మేడమ్.

పిల్లిలా అరవకపోతే ఇక లాభం లేదనుకొని నిల్చున్న చోటునుండి భారంగా కదిలిందా అమ్మాయి.

అందరి ముఖాలు వైపు చూస్తూ అభినయించే ధైర్యం చాలక, సెంకడ్ క్లాస్ చదువుతున్న చిన్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి వాడి ముఖంలో ముఖం పెట్టినట్లు పెట్టి ఒక్కసారిగా అరిచింది.

“మ్యావ్..! మ్యావ్..!!” అంటూ బిగ్గరగా.

అదే ఆ అమ్మయి చేసిన పెద్ద పొరపాటు.

తక్షణం ఏడ్పు లంకించుకున్నాడా కుర్రాడు. ఈ హఠాత్ సంఘటనకి ఉత్తినే బెదిరిపోయింది శ్వేత.

“ఏమైంది నిఖిత్? భయపడ్డావా?” అంటూ వాడి బ్యాచ్ మేడమ్ లలిత పరుగు పరుగున వచ్చిందక్కడికి.

పిల్లి అంటే సహజంగా చిన్న పిల్లలు కొందరు భయపడ్తారు అలాంటి ఫోబియా వీడికీ ఉందేమోనని అలా ప్రశ్నించిందామె కంగారుగా.

మరింత దగ్గరకొచ్చిన లలితా మేడమ్ వంగి, అనునయంగా ఏదో అడగబోతుంటే “అరవడమే కాదు. పిల్లి కరిచింది మేడమ్!” అంటూ చిలిపిగా నవ్వాడు నిఖిత్.

ఆ కుర్రాడు మహా గడుగ్గాయి. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా మోసబోయారు.

వాడి ఆకతాయితనానికి ‘వోరి పిడుగా!’ అనుకొని నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళింది లలితా మేడమ్.

సరదాగా నవ్వుకున్నారంతా.

“కాసేపు తాను ఏడుస్తున్నట్లు యాక్ట్ చేసి, మనల్ని ఏడిపించే ప్రయత్నం చేసిన ఆ చంటి వంతు ఇప్పుడు” అంటూ అనౌన్స్ చేసింది సుధామేడమ్.

భయపడుతూ నెమ్మదిగా మద్యకొచ్చి నిలబడ్డాడు.

తన చేతిలోని చీటీ తెరిచి అందరికీ వినపడేలా చదివాడిలా. “మేడమ్ కొట్టినట్లు ఏడ్వాలి” అని.

రెండు నిమిషాలు గిడచాయి. అయినా అభినయం ప్రారంభించలేదు. తలవంచుకొని మౌనంగా వున్నాడు.

“నిఖిత్ ఏడ్వాలి. నిఖిత్ ఏడ్వాలి” అంటూ పిల్లలంతా అరుస్తూ గోల గోల చేశారు.

అయితే ఏడ్పు బదులు నవ్వు వస్తోందా కుర్రాడికి.

అయినా తప్పదన్నట్లు పెదాలు బిగపట్టి విశ్వప్రయత్నం చేస్తున్నా విఫలమై, ఏడ్వలేక పోతున్నాడు.

వాడి అవస్థకి తమలో తామే నవ్వుకున్నారంతా.

“మేడమ్! ఏడ్పు రావట్లేదు” అన్నాడు మొహం అదోలా పెట్టి.

“అలా అనొద్దు. నిఖిత్ ట్రై చేయమ్మా!” అందొక మేడమ్ ఉడికిస్తూ.

“పోనీ ఏడ్పుకి బదులు బిగ్గరగా నవ్వనా?” అమాయకంగా అడిగాడు. ఒప్పుకుంది సుధా మేడమ్.

మరిక ఆలస్యం చేయకుండా తెరలు తెరలుగా నవ్వాడు ఎప్పటిలా తిరిగొచ్చి తన స్థానంలో కూచున్నాడు.

కావాలనే వాడు ‘ఏడ్పుని’ అభినయించలేదని తెలీదెవరికీ! కానీ నమ్మేసారంతా. అందుకే యమ సరదాగా వుంది నిఖిత్‌కి. తనలో తానే ముసి ముసిగా నవ్వుకొసాగాడు.

నెక్ట్స్ రమ్య పేరు సూచించబడింది.

తనని పిలిచిన మరుక్షణం ఏ జంకూ లేకుండా ఆ అమ్మాయి ఆక్టివ్‌గా లేచి నిలబడి ‘రుద్రమదేవి ఏకపాత్రాభినయం’అంది చీటీ చదువుతూ.

పిల్లంతా ఉత్సాహంగా సర్దుక్కూర్చున్నారు.

ఎలాంటి తడబాటు లేకుండా రమ్య ఓ డైలాగ్ అందుకుంది.

“ఈ సువిశాల కాకతీయ సామ్రాజ్యాధినేత యగు గణపతిదేవుడి ఏకైక కుమార్తెయైన వీరనారీమణి రుద్రమదేవితోనా ఆ శత్రురాజు బీరాలు పల్కుతున్నది. కదనరంగమున కేగిననాడు తెలుస్తుంది. ఆ పిరికి వాడి ప్రతాపమెంతో? శౌర్య పరాక్రమాలేపాటివో? హహ్హహ్హ..” అని రుద్రమదేవి ఆవహించిందేమోనన్నట్లు ఆ అమ్మాయి డైలాగ్స్ విసురుతుంటే చప్పట్లతో మార్మోగిపోయిందా ప్రదేశం.

అద్భుతమైన ఆమె అభినయ వాగ్ధాటులకి ముగ్ధులు కాని వారు, ప్రశంసించని వారు ఎవరూ ఉండరు.

వాస్తవానికి ఆ అంశం కాకతాళీయంగా తగిలిందామెకి. ఎందుకంటే గతంలో స్కూల్ డే ఫంక్షన్‌లో రుద్రమదేవి ఏక పాత్రను ధరించింది ఆ అమ్మాయే. అందుకే చాలా బాగా రక్తి కట్టించగలిగిందా సన్నివేశాన్ని.

మధ్యలోనే వారించింది సుధా మేడమ్.

ఆపేసి వెళ్ళి కూర్చుంది రమ్య.

ఒక్క క్షణం నిశ్శబ్దమనంతరం…

“సమయం దొరికితే చాలు, మనందర్నీ కూడగట్టి వ్యాయామం చేయించే మేరీ మేడమ్ మన మధ్యకి రావాలిప్పుడు” తిరిగి ఎనౌన్స్ చేసేంది సుధారాణీ మేడమ్.

వెంటనే లేచి, ‘సినిమా పాట పాడటం’ అంటూ చీటీలోని విషయం చదివి వినిపించింది మేరీ టీచర్.

సినిమా పాట అనే సరికి పిల్లలంతా ఆనందంతో వూగిపోయారు. హే..హే.. అంటూ హుషారుగా చప్పట్లు చరిచారు.

ఏ పాట పాడాలా అని క్షణం సేపు ఆలోచనలో పడిందామె. పిల్లలు ఆతృతగా చూసారామె వైపు.

ఈ మధ్యనే హిట్టయిన తెలుగు సినిమాలోని పాపులర్ సాంగ్‌ని తన గొంతు సహకరించిన రీతిలో పాడింది.

పిల్లలు, పెద్దలు అందరూ కోరస్‌లా అందుకున్నారా పాటని. పల్లవి, ఒక చరణం వరకు కొనసాగింది.

పాట పాడుతూనే కొందరు బడుద్ధాయిలు లేచి మూవ్‌మెట్స్ ఇవ్వబోతుంటే.. వాతావరణం కంట్రోల్ తప్పుతుందని హెడ్ వారించింది.

కాసేపట్లో సద్దుమణిగింది. తిరిగి ఎప్పటిలా నిశ్శబ్దం!

“తర్వాత ఎవరంటే..” అంటూ సుధారాణి పిల్లల్నోసారి పరికించి చూసింది.

తన చూపుని ముందుకు కొనసాగిస్తూ అలా మరొకరి పేరుని సూచిస్తూ బావుండేమేమో? ఆ ‘ఫన్ గేమ్’ని అందరూ చాలా సేపు ఎంజాయ్ చేయడానికి ఆస్కారం వుండేది.

కానీ జరగకూడనిది జరగనే జరిగింది!

విధి నిర్ణయాన్ని మానవ మాత్రులెవరూ త్రోసిపుచ్చజాలరనడానికి నిదర్శనంగా ఓ అబ్బాయి పేరుని సూచించిందామె.

ఎవరూహించని ఒక మహాయజ్ఞానికి రూపకల్పన జరగబోతోందనడానికి ఋజువుగా తన పేరు విన్పించే సరికి ఉలిక్కిపడ్డాడా కుర్రాడు.

ఆ అబ్బయి ఎవరో కాదు.

అఖిల్!

ఇక్కడ తదుపరి కార్యక్రమానికి అతడు ఉద్యుక్తుడవుతున్న సమయం..!

అక్కడ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అఖిల్ గురించి ప్రస్తావిస్తున్నారు.

అదేమిటంటే!

***

పోలీస్ స్టేషన్.

ఆ రోజు అఖిల్ చేసిన బెలూన్ సాహసమే పదే పదే యస్సై వేదవ్యాస్ స్మృతి పథంలో మెదలుతోంది.

ఆ విషయం గుర్తొస్తున్నప్పుడల్లా ఆశ్యర్యానికి గురవుతున్నాడతను. ఈ క్షణాన కూడా ఎందుకో అఖిల్ కళ్ల ముందు మెరిసాడు.

వేద ఆలస్యం చేయలేదు. అఖిల్ విషయాన్ని, గత బెలూన్ సంఘటనని యథాతథంగా తన బాస్ అయిన సి.ఐ. ద్వివేది ముందుంచాడు.

అంతా విని ఓ చిర్నవ్వు నవ్వాడు దివ్వేది.

“ఈ రోజు పేపర్ చూశారా” నవ్వడం ఆపి అడిగాడు.

“ఇంకా చూళ్ళేదు” సమాధానమిచ్చాడు యస్సై.

“స్పెషల్ న్యూస్ ఏమై వుంటుందబ్బా?” అనుకున్నాడు మనసులో.

తన టేబుల్ ‌పైనున్న ఓ ప్రముఖ తెలుగు డైలీని వేద ముందుకి తోసి, అండర్‌లైన్ చేయబడిన న్యూస్‌ని చదవమన్నాడు.

వేదవ్యాస్ చదవడం ప్రారంభించాడు.

ఆ న్యూస్ సంక్షిప్తంగా వుందిలా.

తొలిసారిగా ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక జీ.వో జారీకి కారణభూతుమవుతూ పిన్నవయసురాలైనా ప్రకాశం జిల్లా కనిగిరి నివాసిని చల్లా రమ్య అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏడవ తరగతి పరీక్షలు రాయబోతోంది.

చదవడం పూర్తయ్యాక టేబుల్ మీద పెట్టేసాడా పేపర్‌ని.

“చూశారుగా ఆ న్యూస్‌ని! ఇలాంటి వండర్ కిడ్స్ అరుదుగా ఉంటారు” అన్నాడు ద్వివేది తన కళ్ళద్దాల్ని సవరించుకుంటూ.

బదులుగా వేద తలపంకించాడు.

“ఈ అమ్మాయి సెవన్ ఇయర్సకి సెవెన్త్ పరీక్షలు రాస్తే తథాగత అవతార్ తులసి అనే బీహార్ కుర్రాడు తొమ్మిదేండ్లకే పదవ తరగతి పాసై ప్రపంచ రికార్డ సృష్టించాడ్సార్. చదువులో అనన్యమైన ప్రతిభ కనబరుస్తున్నాడట” తనకి తెలిసిన మరొక విషయాన్ని ప్రస్తావించాడు వేద.

“వీళ్ళే కాదు. కొరియా దేశస్తుడైన కిమ్ అనే బాలుడి ఐక్యూ 210 దాటిందట. అది కాదు వింత. నాలుగు సంవత్సరాలే వున్న ఆ పిల్లాడు నాలుగు భాషల్లో అనర్గళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ చూపరలని అబ్బురపరుస్తున్నాట్ట.”

“నిజమే సర్! మేధతో సంబంధం లేనివి కూడా మహా మహా మేథావుల్ని సైతం విస్మయానికి గురిచేసే రకరకాల కలియుగాద్భుతాలు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. పేపర్లలో చూస్తూనే వున్నాం. అంతేందుకు మన రవీంద్రనాథ్ ఠాగూర్ పదకొండేళ్ళకే కవిత్వం రాయడం మొదలు పెట్టి సాహితీలోకంలో సంచలనం సృష్టించడం మనకు తెలిసిందేగా!”

“తన ఏడవ ఏటే గణాంక పట్టికల్ని వివిద రీతిలో తయారు చేసి ప్రపంచ గణిత శాస్త్ర రంగాన్నే ఆశ్చర్యసాగరంలో ముంచలేదా సర్ సి.వి.రామన్. వీళ్ళంతా పిన్నవయస్సులోనే ఇన్ని అద్భుతాలు ఎలా సృష్టించగలుగుతున్నారు? ఎవరైనా రీజనింగ్ చెప్పగలిగారా? నో! ” పెదవి విరిచాడు ద్వివేది.

వాళ్ళ సంభాషణని ఇంట్రస్ట్‌గా వింటున స్టేషన్‌లోని మిగతా కానిస్టేబుల్స్ విస్తుపోతున్నారు. వాళ్ళ మాటల్లో దొర్లుతోన్న ఆశ్చర్యకర విషయాల్ని విని కాదు. ఆ ఇద్దరూ మేధా సంపత్తికి!

వేద మౌనంగా వుండపోయాడు.

“అపారమైన తెలివితేటల్తో, అపురూపమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించే ఇలాంటి బాల మేధావులు ఎందరో వున్నారు. అతి చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరుస్తూ నాడూ నేడూ ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట సంచలనం సృష్టిస్తూనే వుంటారు.”

ఇలాంటి వాళ్లతో ఆ కుర్రాడ్ని పోల్చడమా? నెవ్వర్! యాక్సిడెంటల్‌గా బెలూన్స్‌తో పాటు గాలిలో ఎగిరుంటాడు. దట్సాల్. ఇంత దానికే ఆ పిల్లవాడి మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. అనవసరంగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకండి” అంటూ కొట్టిపాడేశాడు ద్వివేది.

మాములుగా కుర్రకుంక అని తను తేలిగ్గా తీసిపారేసిన అఖిల్‌కి, తమకి మధ్య ఒక బంధం ఏర్పడబోతోందని సి.ఐ ద్వివేదికి తెలియదా సమయంలో!

కానీ వేద మాత్రం ఎందుకో అఖిల్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు.

మెదడుని ఆలోచనలు తొలిచేస్తుంటే, “అఖిల్‌లో కూడా ఏదో స్పెషాలిటీ ఉందన్పిస్తోంది సర్!” అని మాత్రం అనగలిగాడు.

“ఒక వ్యక్తిలో అద్భుత శక్తులుండడమంటే సామాన్య విషయం కాదు. అది గాడ్ గిఫ్ట్” బదులిచ్చాడు ద్వివేది.

ఏకాభిప్రాయం కుదరనపుడు ఎక్కువ మాట్లాడ్డం అనవసరమనుకున్నాడు వేదవ్యాస్. అందుకని నిశ్శబ్దంగా వుండిపోయాడు.

వాస్తవానికి గర్భస్థశిశువుగా ఉన్న అమృతఘడియల్లోనే అఖిల్‌కి గాడ్ గిఫ్ట్ లభించిందని..

అతడిలోని ఆ అద్భుతశక్తేంటో ప్రపంచానికి తెలియపరిచే సంఘటనకి సుముహుర్తం నిర్ణయించబడిందా రోజేనని…

వాళ్ళకేం తెలుసు?

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here