ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-7

0
12

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]ఆ[/dropcap]యన చెప్పిన పూజా వస్తువులన్నీ నివేదిత తెచ్చి పెట్టింది.

హాలులో ఒక చోట ఎర్రని వస్త్రం పరిచాడు. అఖిల్ వేసుకున్న దుస్తుల్ని విప్పేసి వాడికి ఎర్రని పంచె మొలచుట్టూ చుట్టి దక్షిణం వైపుకి ముఖం ఉండేలా ఆ వస్త్రం మీద కూచోబెట్టాడు. వాడి కెదురుగా పీటవేశాడు. ఆ పీటపై కూడా ఎర్రని వస్త్రాన్ని పరచి బ్యాగ్‌లోంచి తీసిన హనుమంతుడి పటాన్ని అక్కడపెట్టాడు.

“ఈ తతంగమంతా చూస్తూంటే నీకు భయం వేస్తోందా?” గుడ్లప్పగించి ప్రతీ చర్యని ఆసక్తిగా గమనిస్తున్న నిట్టూని నవ్వుతూ అడిగాడాయన.

అడ్డంగా తలూపుతూ “అదేం లేదు తాతగారూ” అన్నాడు వాడు.

“నీకస్సలు భయం కలగడం లేదా?” తిరిగి ప్రశ్నించాడు.

“భయం కలగడం లేదు గాని, మరే ఓ చిన్న సందేహం కలుగుతోంది” అన్నాడు.

“సందేహమా… ఏమిటది?”

“అందరికీ మీలా పిలకలుండవు. ఎందుకని?”

“అందరికీ అంటే…” అర్థం కానట్లు ముఖం పెట్టడాయన.

“మరే మా వీధి శివాలయం పూజారి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి మీలా పిలక లేదుగా. నాకులా చిన్న కటింగ్ మాత్రమే వుంటుంది. అందుకని అడిగాను.”

వాడి సందేహమేంటో అప్పుడర్థం అయ్యిందాయనకు. వెంటనే నవ్వొచ్చింది.

“నిజమే అందరికీ నాలా కొప్పు ఉండాలనేం లేదు. కేవలం వేదశాస్త్రాధ్యాయనం చేసిన వారికి మాత్రమే నాలా శిఖ తప్పని సరి. ఈ శిఖలో అయిదు రకాలుంటాయి. వాటికి పంచ, శిఖ, ధాత, హోత, గారి పప్ప లని పేరు. అందకే వీటిని పంచశిఖలంటారు. చిన్నవాడిని ఇవన్నీ నీకెందుగ్గాని. కాసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే నేను పూజ పూర్తి చేస్తాను. సరేనా?”

బుద్దిగా తలూపాడు వాడు.

ఎదుటివారు విసుగు చెందేలా విషయాన్ని కూలంకుషంగా చెప్పేవాడే, అందుకిది సమయం కాదని, పైగా ప్రశ్నించిందో పిల్లాడని వదిలేసాడాయన.

హనుమంతుడి పటానికి బొట్టు పెట్టి చందనం రాశాడు. ఆ పటం పాదల చెంత చిన్నరాగి పళ్ళాన్ని వుంచాడు. దానిలో ‘సిధ్ధ భజరంగ యంత్రం’ స్థాపించి, సింధూరంతో దానికి బొట్టు పెట్టాడు.

హనుమంతుడి పటంపై అక్షింతలు చల్లుతూ పూజ ప్రారంభించాడు. మంత్రపఠనం కావించుతూ తిరిగి ఆ అక్షింతల్నే యంత్రంపై పోసాడు.

నివేదిత ఓ ప్రక్కన కూర్చొని ఆయన పనుల్ని తిలకిస్తోంది. అఖిల్ మంత్రముగ్ధుడిలా నిష్ఠగా కూర్చుని ఉన్నాడు. అఖిల్ భక్తి ప్రపత్తుల్ని చూస్తుంటే ముచ్చటేస్తోందాయనకు.

వాడి నుండి దృష్టి మరలుస్తూ “మీ గోత్రనామాలేటమ్మాయ్” అని నివేదితని అడిగారు. చెప్పింది.

అఖిల్ కుడి చేతిలో నీరుపోసి గోత్రనామాల్ని బిగ్గరగా చదువుతూ వాడితో సంకల్పం చేయించాడు. నివేదిత మనోవాంఛితాన్ని స్మరిస్తూ ఆ నీటిని నేలపై వదిలింపచేసాడు.

తర్వాత రుద్రాక్షమాలని చేతులోకి తీసుకొని భక్తి శ్రద్ధలతో క్రింది మంత్రాన్ని జపం చేసాడు.

“ఓం హుం హుం హుం హ్రౌం హుం హుం హుం ఫట్.”

ఆ హాలంతా ప్రతిధ్వనించి తరంగాలు రూపేన ఆ ఇంటి అణువణువుని స్పర్శించేలా ఆ మంత్రలన్ని అతి స్పష్టంగా యాభై ఒక్కసారి ఉచ్ఛరించాడు.

ఆయనలా మంత్రాచ్ఛరణ కొనసాగిస్తున్నంత సేపూ నివేదిత భక్తిభావంతో కళ్ళుమూసుకొని దైవనామ స్మరణ కావించింది. తదనంతరం ఆ పూజారి 1,5,7 వత్తుల దీపాలతో స్వామికి హారతి సమర్పించాడు. దాంతో ఆ పూజాకార్యక్రమం ముగిసింది.

యంత్రానికి పూసిన సింధూరాన్ని తీసి అఖిల్ నుదుటిన దిద్దాడు. ఆంజనేయస్వామి ఫోటోవున్న చిన్న తాయెత్తుని వాడి మెడలో వేశాడు.

“బాబూ ఇది ఆంజనేయుని తాయెత్తు. ఈ తాయెత్తులో ఆయన విశ్వరూపం ఫోటో వుంటుంది. దీన్ని నీవు సదా ధరించాలి. ఇది నీ మెడలో వున్నంత కాలం ఎలాంటి విపత్తు నీ దరిదాపుల్లోకి కూడా రాదు. అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టకు. సరేనా?” అన్నాడు.

“ఓ అలాగే!” అంటూ తలూపాడు.

“మరే దీన్ని నేను కట్టుకుంటే ఏమౌతుంది స్వామీ? మంచి పేరొస్తుందా, క్లాసులో ఫస్ట్ వస్తానా?” అమాయకంగా అడిగాడు.

“ఏం ఇప్పుడు క్లాసులో ఫస్ట్ రావడం లేదా?”

“గతంలో వచ్చేవాడిని. మరే ఈ మధ్యే మా స్కూల్‌కి  కొత్తగా హిమశ్రీవాక్య అనే అమ్మయి వచ్చింది. ఆమె రాకతో నేను సెకండైపోయాను. మొన్నటి ఎగ్జామ్‌లో ఆ అమ్మయే ఫస్ట్ వచ్చింది” కాస్త ఉక్రోషం మిళితమైన గొంతుకతో గబాగబా చెప్పేసాడు.

“అదా సంగతి. ఇది కట్టాగా, ఇక నుండి ఎప్పటిలా క్లాస్‌కి నువ్వే ఫస్ట్ వస్తావు” వాడికి ధైర్యం చెప్పాడు.

ఆయన మాటలు విన్నాక నిట్టూ కళ్ళు కాంతితో మిలమిలా మెరిసాయి.

నివేదిత వైపు తిరిగి పూజారి అన్నాడు.

“అమ్మాయి, ఇది హనుమత్ సాధన. కష్టాలను, రోగ శోకాలను, వివిద పీడలను, సంతాపాలను, బాధలను తొలగించి సమస్త శుభాలను కల్గిసాడు హనుమంతుడు. ఎలాంటి వ్యాధి అయినా నివారణ అవుతుంది. అందుకే ఆయనకు సంకట మోచనుడని భక్తులు పేరిడారు. ఆ మూర్తిని స్వచ్ఛందంగా భక్తితో ధ్యానించడం వలన బలం, బుద్ధి, శక్తి సిధ్ధిస్తాయి. మానసిక దుర్బల స్థితులలో స్థైర్యం కూడా లభిస్తుంది ఇది తథ్యం.

వీలైతే ప్రతి మంగళ లేదా శనివారం ఈ హనుమదష్టకాన్ని అయిదేసి సార్లు బాబు చేత పారాయణ చేయించు. అంతా అనుకూలమే అవుతుంది.

పోతే తన మేలు కోసం గాని, లోక కల్యాణార్థం గాని  సాధనచేయాలి తప్ప ఇతరులకి హాని, అపకారం కలిగించడానికి మాత్రం వాడకూడదు. అలా జరిగిన పక్షంలో సాధకునికే ప్రమాదం. అందుకనే మరోసారి హెచ్చరిస్తున్నాను. పరమార్థం కొసం తప్ప ఈ సాధన స్వార్థభరిత కీడు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. గుర్తుంచుకో.”

గంభీర వదనంతో ఆయన ప్రవచిస్తుంటే భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా ఆలకించింది నివేదిత.

పూజారి మాటలకు కాస్త నొచ్చుకుంది.

“మీరు అనుమానిస్తున్నట్లు అలా ఎప్పటికీ జరగదు స్వామీ. నా చిట్టి తండ్రి ఆరోగ్యదృష్ట్యా మీ చేత ఈ పూజ జరిపించాను. అంతే తప్ప మరో చెడు తలంపే నా మనసులో లేదు. మేలు కోరుకునే దాన్నే కాని కీడు ఆశించేదాన్ని కాదు” అంది బాధగా.

“పూజాఫలితం విశదపరచడం నా వంతు బాధ్యత కాబట్టి చెప్పాను. నిన్ను కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా” ఆమె ముఖకవళికల్ని గమనిస్తూ అన్నాడాయన.

“చిన్నా స్వామీజీ కాళ్ళకి దణ్ణం పెట్టు” అంది అఖిల్‌తో. తల్లి చెప్పిన మరుక్షణం ఆయన కాళ్ళపై సాష్టాంగపడి పాదాభివందనం చేసాడు.

ఆ చిన్నారి వినయవిధేయతలకి ముగ్ధుడైన ఆ పూజారి వాడిని మనసారా దీవించాడు. తన చేతుల్తో పైకి లేవనెత్తి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నివేదిత అందించిన తాంబూలం స్వీకరించి అక్కడి నుండి నిష్క్రమించాడాయన.

ఇప్పడు నివేదిత మనసెంతో హాయిగా వుంది. పెద్ద గండం గడిచి ప్రశాంతత చేకూరినట్లయ్యింది.

కానీ అఖిల్ మస్తిష్కంలో మెల్లగా మొలకెత్తుతున్న ఆలోచనల్ని ఒక్కసారి ఆమె ఊహించగలిగి వుంటే ఆమె పరిస్థితి పూర్తి భిన్నంగా వుండేది. ఆమెలోని ప్రశాంతత మాయమై అతరంగం మళ్ళీ కల్లోల సాగరమయ్యేది.

ఎందుకంటే-

వాడి ఆలోచనలన్నీ ఇప్పుడు తాయెత్తు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ చిన్ని కంప్యూటర్ బుర్రలో.. తాయెత్తుపై పరిశోధన సాగించాలన్న తపన అప్పుడే మొదలయ్యింది. కానీ పైకి కన్పించే అరమరికల్లేని వాడి చిరునవ్వే నివేదితని ఆనందింప చేస్తోంది.

***

“సరే మీరే చెప్పండి. ఎంత డిపాజిట్ చేయమంటారో?” పాండవీయాన్నే అడిగాడు షణ్ముగం. అతనంత తొందరగా కన్విన్స్ అవుతాడని పాండవీయం ఊహించలేదు.

“మీ లాంటి హైటెక్ బిజినెస్‌మాన్ డిపాజిట్స్ మా బ్యాంక్‌లో ఉన్నాయన్న వార్త చాలు. మా బ్యాంక్‌కి అపూర్వమైన ప్రచారం లభించినట్టే. ఇకపోతే డిపాడిట్ ఎమౌంట్ మీ ఇష్టం. నేనడిగిన వెంటనే మీరు యస్ అనడం మా బ్యాంక్‌కు పూర్వదశ రాబోతోందనడానికి శుభసూచకంగా భావిస్తున్నాను.

ఎనీహౌ మా బ్యాంక్ స్థితిగతులు బాగా లేకపోయినా, లిఫ్ట్ ఇచ్చే సదుద్దేశంతో మీరు ఓకే అన్నారు. బ్యాంక్ తిరిగి ఎదిగితే మాత్రం ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. థాంక్స్ ఫర్ యువర్ కో-ఆపరేషన్.”

“నో నో. చేసేది చేయించేది నేనే అనేది శ్రీ కృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మధ్య నేనెవర్ని చెప్పండి. నాలో ఈ సంకల్పం కల్పించింది ది గ్రేట్ గాడ్. కాబట్టి అంతా ఆ దేవుడి చలవ. ఇందులో నా ప్రమేయం లేదు.”

“అది మీ మంచితనం. డిపాజిట్స్ ఎంత వేయాలో నేను చెబితే  బావుండదు. మీరెంత ఫిగర్ అనుకుంటున్నారో ఆ సంఖ్య మీ నుండే రానీయండి” అన్నాడు పాండవీయం.

“సరే ఇప్పుడు చెప్పడమెందుకు. మా వాళ్ళతో ఎమోంట్ పంపిస్తా, డిపాజిట్ చేసుకోండి. టైమ్ పీరియడ్ కూడా మీరే డిసైడ్ చేయండి.”

“చిన్న రిక్వెస్ట్…”

“చెప్పండి…”

“మీరెప్పుడైనా డిపాజిట్ చెయ్యండి. ఫర్వాలేదు. కాస్త ఆలస్యమైనా ఇబ్బంది లేదు. కానీ స్వయంగా మీరే వచ్చి మా బ్యాంక్‌ని విజిట్ చేస్తే బావుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బ్యాంక్ దాకా రమ్మనడం లేదు. సంఘంలో పరపతి వున్న మీ లాంటి వారు మా బ్యాంక్‌కి  రావడం ప్రస్తుత పరిస్థితుల్లో మాకెంతో ప్లస్ పాయింట్‌గా వుంటుంది” అంటూ కోరాడు పాండవీయం.

అప్పుడు ఆలోచన్లో పడ్డాడు షణ్ముగం.

అది గమనించి “ప్లీజ్. కాదనకండి” అంటూ అభ్యర్థించాడు పాండవీయం.

“చేసేది చేయేంచేది అంతా నేనే అనేది శ్రీ కృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మీ అభ్యర్థన మేరకు ఒప్పుకుంటున్నాను. స్వయంగా నేనే మీ బ్యాంక్‌కి వస్తాన్లెండి. బట్ ఓ కండీషన్” చెప్పాడు షణ్ముగం.

“మీ కండీషన్స్ అన్నింటిని మేం శిరసావహిస్తాం. చెప్పండి.”

“నేను మీ బ్యాంక్‌కి వచ్చి వెళ్ళేంతవరకు మీరు ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వకూడదు. మనీ డిపాజిట్ అనంతరం మీ ఇష్టం.”

షణ్ముగం అలాంటి కండిషన్ ఎందుకు పెట్టాడో పాండవీయానికి అర్థం కాలేదు. కారణం అడగబోయిన వాడల్లా చప్పున ఊరకుండిపోయాడు. ఆ విషయన్ని సీరియస్‌గా పట్టించుకోనూలేదు.

“మీరు చెప్పినట్లే జరుగుతుంది” అని హామీ ఇచ్చి పాండవీయం అక్కడి నుండి కదిలాడు.

అప్పుడు నవ్వాడు షణ్ముగం తన సహజధోరణిలో.

ఆ నవ్వు వెనక-

అతనిలో సరికొత్త ఆలోచనొకటి మెదిలింది పొదల మాటు నల్లతాచు కదలికలా.

***

ఏ రోజూ ప్రెస్ మీటింగ్‌లో పాల్గొనలేదు సి.ఐ ద్వివేది. తను కూడా స్వయంగా ప్రెస్ మీటింగులను ఏర్పాటు చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. ప్రచారం కంటే ప్రతిభ, పని పట్ల శ్రద్ధ, అంకితభావం ముఖ్యమని నమ్ముతాడు.

అలాంటిదీ రోజు-

ఆయనే స్వయంగా వర్తమానం పంపి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయించడం పలువుర్ని ఆశ్చర్యపర్చటడమే కాదు. మాస్ మీడియా రంగంలో సంచలన చర్చై కూచుంది.

అందుకే అన్ని మీడియాల నిండీ వచ్చిన రిపోర్టర్స్ అందరూ సి.ఐ ద్వివేది రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రిపోర్టర్స్ వెంటపడి ఏది అడిగినా ఏనాడు కూడా పెదవి విప్పని ద్వివేది ఇలా ప్రెస్ వాళ్ళందర్నీ స్వయంగా ఆహ్వానించాడంటే, ఏదో స్పెషల్ న్యూస్ ఉండకపోదని, ఎలాంటి న్యూస్ రిలీజ్ కాబోతోందోనని ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత నెలకొని ఉంది.

అందుకే ఆయనతో ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడాని విలేఖరులకి టెన్షన్‌గా వుంది.

ఎలర్ట్ అయిపోయారంతా.

వాస్తవానికి యస్సై వేదవ్యాస్ అభ్యర్థన మేరకు ద్వివేది ఆ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయించాడు.

ద్వివేది ఇచ్చిన సమయం దాటింది. అప్పటికే పద్దెనిమిది నిమిషాలు ఆలస్యమైంది. అయినా ఆయన ఆగమనం జరగలేదు.

పంతొమ్మిది.. ఇరవై నిముషాలు గడిచాయి..

అదిగో అప్పుడు..

తన చిరునవ్వును చూపరులకి అందిస్తూ హుందాగా మీటింగ్ హాల్‌లోకి ప్రవేశించాడాయన. గౌరవసూచకంగా లేచి నిలబడ్డారంతా.

రెండు చేతులూ జోడించి అందరికీ అభివాదం చేసాడు. సబార్డినేట్స్ ముందుగానే సెల్యూట్ చేశారతనికి.

తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు.

ఆయన రాకతో దూరదర్శన్, ప్రైవేట్ టీ.వీ చానల్స్ వారి వీడియోలన్నీ ఒక్కసారిగా స్టార్టయ్యాయి. పత్రికా రిపోర్టర్ల ఫ్లాష్ కెమేరాలు తమ పని తాము చకచకా చేసుకు పోసాగాయి.

అందరూ మౌనంగా ఉండి ఎవరూ పెదవి విప్పకపోవడంతో-

తన సహజగాంభీర్యాన్ని వదలి “ఇక మీరు మీ ప్రశ్నల శస్త్రాల్ని సంధించవచ్చు” అన్నాడు ద్వివేది.

వెంటనే రియాక్టవుతూ “మేం మీతో యిద్ధం చేయడానికి రాలేదు సార్” ఎవరో రిపోర్టర్ సరదాగా అన్నాడు.

“నిజమా! మరి రిపోర్టర్స్ నిరంతర అక్షర యోధులని విన్నానే” ఆ సమాధానం వినవచ్చిన దిక్కుగా చూపు సారిస్తూ చురక అంటించాడు.

మరో వైపు నుండి దూసుకు వచ్చిందో ప్రశ్న – “మీరు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం?”

“నథింగ్. నేనెప్పుడూ ప్రెస్ మీటింగ్స్‌లో అసలే పాల్గొనని నా మీద మీ మీడియా వాళ్ళంతా అభియోగం మోపారుగా. జస్ట్.. ఆ అపవాదు తొలగించుకుందామని. అంతే” చిరునవ్వుని మేళవిస్తూ సమాధానమిచ్చాడాయన.

“యూ మీన్.. దెరీజ్ నో స్పెషల్ మ్యాటర్. అవునా?” నిట్టూరుస్తూ పెదవి విరచాడో విలేఖరి.

“వెంటనే అలా చెబితే మీరు నన్ను వదలి పెడతారా?” ఎదురు ప్రశ్నించాడు ద్వివేది.

“అయితే విషయం ఏంటో సూటిగా చెప్పండి” మరొక విలేఖరి.

“ప్రభుత్వం ప్రజలు మాస్ మీడియా వాళ్ళు మరచిపోయిన ఓ కేసుని మా డిపార్టమెంట్ తిరిగి ఓపెన్ చేయబోతోంది. ఆ విషయం ముందుగా మీకు తెలపడానికే ఈ సమావేశం” చెప్పాడు ద్వివేది.

అందరూ ఆ న్యూస్ కవరేజ్ కోసం ఎలర్టయ్యారు.

రిపోర్టర్సందరి మనోభావాల్ని ప్రశ్నగా మలచి వదిలాడొక విలేఖరి – “ఏ కేసుని ఓపెన్ చేయబోతున్నారు?” అని. సమాధానం కోసం చెవులు రిక్కరించారు.

ఉత్తేజభరితమైన ద్వివేది పెదాల నుండి ఉద్వేగభరితంగా వెలువడ్డాయా మాటలు – “మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ కేసు.”

ఉలిక్కిపడ్డారంతా. రోమాంచితమైన శరీరాలతో ఒక్కసారిగా దిగ్గన లేచి కూర్చున్నారు.

“ఆ కేసు క్లోజ్ చేసామని ప్రకటించారుగా?” సందేహం వెలిబుచ్చారెవరో.

“వాస్తవానికా దోపిడీ కేసు క్లోజ్ చేయబడలేదు.. జస్ట్.. పెండింగ్‌లో పెట్టబడింది అంతే.”

“బ్యాంక్ దోపిడీకి గురయ్యాక కేసు దర్యాప్తు బాధ్యత సి.బి.సి.ఐ.డి వారికి అప్పగించబడిందిగా.  మళ్ళీ వాళ్ళే దర్యాప్తు కొనసాగిస్తున్నారా?”

“లేదు మా పోలీసు డిపార్టమెంట్.”

“ఎందుకు?”

మౌనం వహించాడు.

“దేశంలోనే పెద్ద పరిశోధనా సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) వంటి సంస్థలే అవినీతికి, లంచాలకు, బ్లాక్ మెయిలింగ్‌కి నిలయాలుగా పేరుపోందాయని పేరుంది కదా. అలాగే సి.బి.సి.ఐ.డి అందుకనే ఈ విచారణ సంస్థకి ఈ కేసు దర్యాప్తు సాధ్యం కాలేదంటారా?”

చప్పున ఏం చెప్పాలో అర్థం కాలేదాయనకి.

’పోనీ నేరస్థలతో లాలూచీ పడి కేసుని పెండింగ్‌లో పెట్టారంటారా?” అని ఈలోగా మళ్ళీ ఎవరో విలేఖరి అన్నాడు.

“నో. సిబిసిఐడి దర్యాప్తు బృందం యొక్క శక్తి సామర్థ్యాల్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మీరు అనవసరంగా నిందారోపణ చేస్తున్నారు” ఆవేశపడిపోతూ కాస్త తీవ్రంగానే బదులిచ్చారాయన.

“మరెందుకని మీ డిపార్ట్‌మెంట్ టేకప్ చేసిందీ కేసుని?” ఆయన్ని ఇరకాటంలో పడేయాలన్న తలంపుతో ప్రశ్నించాడింకొకాయన.

“కేవలం ఎలాంటి ఆధారాలూ, సాక్ష్యాలు లేవని లభ్యం కాలేదని ఆనాడు సి.బి.సి.ఐ.డి చేత కేసు పెండింగ్ పెట్టబడి అలా మరుగున పడింది. అంతే తప్ప మరో కారణం కాదు. పోతే సిబిసిఐడి వారి దర్యాప్తులో దొరకని సాక్ష్యాధారాలు మా డిపార్టమెంట్‌కి దొరికే అవకాశం ఉందని భావించడం వల్ల కేసుని మేం టేకప్ చేసాం. మా డిపార్టమెంట్ కోణం నుండి పరిశోధన కొనసాగిస్తే ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువని మేం అనుకొంటున్నాం.”

“ఇంతకీ మీ డిపార్ట్‌మెంట్ నుండి ఈ దర్యాప్తుకి నడుం కట్టిందెవరు?”

“ఈ కేసుని తన స్వంత రిస్క్‌తో టేకప్ చేసి విజయం సాధించడానికి సాహసించబోతున్నది మరెవరో కాదు. రియల్ హీమాన్ అంటూ మీ మాస్ మీడియా రంగాలన్నీ పొగిడిన యస్సై వేదవ్యాస్.”

ఆయన ప్రకటించడం ఆలస్యం కెమెరాలన్నీ వ్యాస్ వైపు తిరిగాయ్.

వేదని ప్రశ్నల్తో ముంచెత్తడానికి రిపోర్టర్సంతా సమాయత్తమవుతున్నారు.

***

గాలం తన ప్రాణాల్ని హరిస్తుందని తెలిసీ ఎర కన్పించగానే దానికి ఆశపడి గాలానికి చికిప్పోతుంది చేప. అది ఆ జలచర నైజం.

ఈ నేరమయ ప్రపంచంలో ఎదుటివారి ట్రిక్కులకి ప్రలోభపడి ఎన్నోసార్లు ఏదో ఒక విదంగా మోసాల వలలో పడి చింతిస్తూనే వున్నారు జనం. ఒకసారి జరిగిన పరాభవాన్ని గుణపాఠంగా మలచుకొని తెలివిగా వ్యవహరించాలన్న జ్ఞానమే నశించిపోతోంది. శతాబ్దాలు గడిచినా మార్పు జరగడం లేదు ఈ విషయంలో.

ఈ నిరంతర చైన్ సిస్టమ్‌లో నివేదిత కూడా తనకి తెలియకుండానే ఓ పార్ట్ కాబోతోందనడానికి నిదర్శనంగా జరిగిందొక సంఘటన.

అదేమిటంటే-

వంట పనంతా ముగించేసుకొని అఖిల్‌ని రెడీ చేసింది నివేదిత. పదకొండవుతోందప్పుడు. నిట్టూకి జ్వరంగా ఉండడంతో స్కూల్‌కి పంపలేదు. బవలంతంగా ఇంట్లో ఉంచేసింది, వాడు వెళ్తనంటే వారించి.

గృహలక్ష్మి ఏజన్సీస్‌కి సంబంధించిన పాంప్లెట్‌ని ఫైల్లోంచి బయటకు తీసింది. దాని చివరన ఉన్న అడ్రస్ ఒకసారి చెకప్ చేసుకుంది. బీరువాలోంచి కొంత క్యాష్ తీసి పాంప్లెంట్‌తో పాటుగా హ్యాండ్‌బ్యాగ్‌లో సర్దింది.

క్షణంలో డ్రెస్ మార్చుకొని, అఖిల్‌ని వెంటేసుకొని బయపడింది.

పదిహేను నిమిషాల్లో గృహలక్ష్మి ఏజన్సీస్ ముందు ఆలోలోంచి దిగింది. అక్కడ విపరీతంగా జనం వున్నారు.

ఆ జనమంతా సగం ధరలకే గృహోపకరణాలు అనే ప్రకటనకి ఆకర్షితులై వచ్చిన వాళ్ళు. అందులో ముప్పాతిక మంది స్త్రీలే వున్నారు.

నివేదిత అక్కడి వాతావరణాన్ని నిశితంగా పరిశీలించింది. అక్కడ మూడు కౌంటర్స్ కన్పించాయి. సెకండ్ కౌంటర్ దగ్గర వున్న క్యూలో జాయినయ్యింది. దాదాపు గంట గడిచాక ఆమె వంతు వచ్చింది.

కౌంటర్‌లో వస్తువు నమోదు చేయించి, దాని ఖరీదులో సగం క్యాష్ పే చేసి రిసీప్ట్ తీసుకుంది. ఫ్రిజ్ ఇష్యూ తేది ఆ రోజుకి ఇరవై అయిదవ నాడు వేయబడి ఉంది. ఆ రోజున వచ్చి ఫ్రిజ్ తీసుకుపోవచ్చు. ఆ నెక్ట్స్ మంత్ నుండి పరుసగా ప్రతి నెలా మిగతా ఎమౌంట్‌ని డివైడ్ చేసినట్లుగా పే చేయాల్సి వుంటుంది. అదీ ప్రోసీజర్.

రిసిప్ట్ తీసుకున్నాక, ఒక సారి ఏజన్సీ చైర్మన్‌ని కలవాలని ఛైర్మన్ గదిలోకి వెళ్ళింది. ఛైర్మన్ చెయిర్‌లో ఓ యువతి కూర్చొని వుంది. బాబ్డ్ హెయిర్ కటింగ్‌లో స్టయిలిష్‌గా వుంది. ముప్పై- ముప్పై అయిదు మధ్యన ఉండే తన వయస్సుని ఓ పదేళ్ళు తగ్గించుకోవాలన్న తాపత్రయం ఆమె డ్రెస్సింగ్‌ని బట్టి తెలుస్తోంది. చూడగానే ఆ విషయం అర్థమైంది నివేదితకు.

నివేదిత రాకను గమనించి “రండి కూచోండి” అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది.

వచ్చి కూర్చుంది నివేదిత.

కష్టపర్స్‌కి సంబంధించిన ఫైల్‌ని చూడ్డం ఆపి “చెప్పండి” అంది తలెత్తి చూస్తూ.

“నా పేరు నివేదిత. డిగ్రీ హోల్డర్‌ని. మా వారు అగ్రికల్చర్ ఆఫీసర్. మీ అడ్వర్టయిజ్‌మెంట్ చూసి మీ స్కీమ్‌లో పార్టిసిపేట్ అవ్వాలని వచ్చాను” తనని తాను పరిచయం చేసుకొంది.

“నా పేరు…”

ఆవిడ చెప్పబోయేంతలో “మిస్ శకుంతల” అని తనే చెప్పింది నివేదిత నవ్వుతూ.

ప్రశ్నార్థకంగా చూసింది ఛైర్మన్.

“మీ నేమ్ ప్లేట్ చూసి చెప్పా” అంది వేలు పెట్టి ఆవిడ టేబుల్ వైపు చూపిస్తూ.

నివేదిత చురుకుదనానికి అబ్బురపడింది శకుంతల.

ఆమె ఎడ్యుకేటెడ్ కావడంతో పరిచయం పెంచుకోవడం తన బిజినెస్‌కి ఎంతో అవసరం ఉంటుందన్న ముందు చూపుతో శకుంతల సంభాషణ కొనసాగించిందిలా.

“ఎంత మంది పిల్లలు?” అడిగింది.

“ఒక్క బాబు” అంటూ ప్రక్కకు చూసింది నివేదిత.

అఖిల్ అక్కడ లేడు. బయటే ఉండిపోయాడు.

’నిట్టూ లోపలికి రా నాన్నా” పిలిచింది రమ్మని చేత్తో సైగచేస్తూ. లోపలికి అడుగు పెట్టాడు వాడు.

వచ్చీ రావడంతోనే వాడి దృష్టి శకుంతల మీద పడింది. ఆవిడ కూడా చూసిందా కుర్రాడి వైపు. లిప్తకాలం పాటు అసంకల్పితంగా చూపులు కలిసాయి. ఆ పిల్లవాడి కళ్ళనుండి ఏదో సంకేతం తన కళ్ళని చేరిన ఫీలింగ్ కలగడంతో తత్తరపడిందామె. క్షణంలో తన కంగారుని కప్పిపుచ్చుకుంది. కానీ పెద్దగా పట్టించుకోలేదా విషయాన్ని.

సీరియస్‌గా తీసుకొని అఖిల్ వివరాలు ఆరా తీయించి పరిశీలిస్తే తెలిసి ఉండేదామెకి – వాడెంతటి అద్భుత బాలుడో.

ముంచుకు రాబోతున ప్రమాదాన్ని పసిగట్టి ఉండేది, తగు  జాగ్రత్తలో తానుండేది. కనీసం జరగబోయే అనర్థాన్ని ఊహించడానికైనా ఆస్కారం ఉండేది. కానీ మిస్యయ్యిందామె.

శకుంతల నుండి చూపులు మరల్చుకొని అఖిల్ తల్లి ఒడిలో చేరి గువ్వలా ఒదిగిపోయాడు.

“వీడేనండి మా బాబు. పేరు అఖిల్”

“బావున్నాడు” అంది.

ఆ గదిని పరిశీలనగా చూట్టంలో నిమగ్నమైపోయాడు వాడు.

“ముగ్గురు ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసి, ముగ్గురు మరుదులు ఉద్యోగస్థులయ్యేంత వరకు ఉమ్మడిగా ఉండడంతో ఇప్పటి వరకూ ఆర్థికంగా పుంచుకోలేకపోయాం. అందుకే ఖరీదైన వస్తువులేం కొనుక్కోలేకపోయాం. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి పోయాయి. ఒక స్కూటర్ కొన్నాం. ప్రస్తుతానికి ఫ్రిజ్ కావాలనుకుంటున్నాం. సగం డబ్బు చెల్లించానండి. 165 లీటర్ల నేవీ బ్లూ కలర్ ఫ్రిజ్ కావాలండి” తను ఆ స్కీమ్‌లో చేరడానికి గల నేపథ్యాన్ని వివరించింది వివేదిత.

“మీరే మోడల్ కోరినా, కంపెనీ ఏదైనా, మీరు ఆశించినట్లుగానే ఆయా వస్తువుల్ని మీకు అందించడానికి మేము సంసిద్ధంగా వున్నాం.”

“థాంక్స్…”

“ఇంతకీ ఏ కంపెనీ కావాలి.”

అప్లికేషన్ ఫారమ్‌లో ఆ వివరాలన్నీ ఉంటాయని తెలిసినా సంభాషణ కొనసాగింపు కోసం అడిగింది శకుంతల కావాలనే.

ఒక కంపెనీ పేరు చెప్పింది.

“గుడ్ సెలక్షన్” తనదైన ధోరణిలో ప్రశంసించింది.

బదులుగా నవ్వింది నివేదిత.

“ఈ రోజే మీరు మనీ పే చేసారు కదా. వారం రోజుల్లో మా ఆఫీనుండి మీకు ఒక అప్లికేషన్ ఫారమే వస్తుంది. మీరు కోరే మోడల్, కలర్, కెపాసిటీ తదితర వివరాలని అందులో మెన్షన్ చేసి ఆ ఫారమేని మాకు రీ-పోస్ట్ చేయవలసి ఉంటుంది చెప్పింది శకుంతల.

“తెలుసుకున్నానండీ మందుగానే” అంది నివేదిత.

“వెల్ మీ లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మా బిజినెస్‌లో పార్టిసిపేట్ కావడం హర్షణీయం. మీతో పాటుగా మీ కాలనీ వాళ్ళని మీ హజ్బెండ్ కోలీగ్స్‌నీ కూడా మా సేవలు అందుకునేలా చూడండి” అంది ప్లీజింగ్‌గా.

“తప్పకుండా. బై ది బై! వెళ్లొస్తానండి” లేచి నిలబడింది నివేదిత.

“ఉండండి, టీ రాబోతోంది” అంది వారిస్తూ.

“ఫర్వాలేదు. ఏమనుకోకండి. ఇంకా షాపింగ్ చేయాల్సి వుంది” అని చెబుతూ అఖిల్‌ని తీసుకొని బయటకు నడిచింది.

***

“దేశంలో ఇటీవలే వెలుగు చూసిన జె.యమ్.యమ్ ముడుపులు, చైన్ హావాలా కేసులపై అంత పెద్ద సి.బి.ఐ. పరిశోధనలే నత్త నడక నడుస్తూ దాని వైఫల్యాన్ని సూచిస్తున్నాయి కదా. అలాగే ఈ మనీ మనీ బ్యాంక్ దోపిడీ దర్యాప్తు ఇన్ని సంవత్సరాల తర్వాత కొనసాగుతోందా? ఈ సాగతీత ధోరణి కారణంగా కీలకమైన సాక్ష్యాలు అదృశ్యమయ్యే అవకాశాలు లేవంటారా? మరలాంటప్పుడు పరిశోధన ఎలా కొనసాగించగలరు?” అంటూ అడుగడుగునా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ని ఏకుతూనే గుక్క తిప్పుకోనీయకుండా వేదవ్యాస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

వేద పేదాలపై చిర్నవ్వు మెరిసిందో క్షణం. నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు.

“ఇంతవరకు ప్రాథమిక సాక్ష్యాలు సైతం లభ్యమవలేదు. అలాంటప్పుడు సాక్ష్యాలు అదృశ్యమవుతాయని మీరనడంలో అర్థం లేదు. బట్ వన్ థింగ్ వుయ్ హావ్ టు రిమెంబర్ నౌ. నేరస్థుడు ఎంత తెలివైనవాడైనా, నేరాన్ని ఎంత పకడ్బందీగా చేసినా ఎక్కడో ఒక చోట తప్పు చేయకుండా ఉండలేడని నేర చరిత్ర చెబుతోంది. నిజంగా అది సహజం. నేరం చేస్తున్నపుడు ఆ నేరస్థుడి వలన దొర్లే పొరపాట్లే అతడిని చట్టానికి పట్టిస్తాయి.”

వేద మాటలు ప్రతిధ్వనించాయా హల్లో.

“ఏమిటా పొరపాట్లు?” నిలదీసినట్లు అడిగాడో రిపోర్టర్.

“నాకు తెలీదు” అంటూ నవ్వి, “వాటినిప్పుడే వెల్లడి చేస్తానని మీరెలా భావిస్తున్నారు? ఇప్పుడిప్పడే ఈ మహా యజ్ఞానికి సంసిద్ధమవుతున్నాను. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలూ వాటంతట అవే తెరమీదకి వచ్చేస్తాయి. ప్రస్తుతం దర్యాప్తుకి శ్రీకారం చుట్టబడుతోందంతే” అని సమాధాన మిచ్చాడు.

“మరి అలాంటప్పుడు తిరిగి దర్యాప్తు మొదలయ్యిందని మీరిలా బహిరంగ ప్రకటన చేయడం నేరస్థులు జాగ్రత్తపడడానికి అవకాశం ఇచ్చినట్లు కాదా?” సందేహం వెలిబుచ్చాడో రిపోర్టర్.

“నో నెవ్వర్. నేరం చేసిన నేరస్థుడు మన్నుతిన్న పాములా ఎక్కడో ఒక చోట చడీ చప్పుడు కాకుండా దాగివుంటాడు. నేరస్థులు ఏ చోట దాగినా వెతికి వెతికి చట్టానికి పట్టిస్తాం” దృఢంగా పలికాడాయన.

“తలా తోకా లేదంటున్న ఈ కేసు దర్యాప్తుకి ఎలా ప్రొసీడ్‌వ్వాలని మీ ప్లాన్?”

“అది మాత్రం అడగకండి. నేరస్తులు చట్టపరిధిలోకి రావడానికి మరెంతో సమయం లేదు. వివరాలు అడగొద్దు. అది మాత్రం సీక్రెట్. పరిశోధన ఎలా కొనసాగుతుందనేది పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నాం” జవాబిచ్చాడు వేద.

“అత్యున్నత స్థాయి అవినీతిపరుల వలనో, రాజకీయ నాయకుల ప్రాబల్యం వల్లనో,  నేరస్థుల పరోక్ష ఒత్తిడితోనో, దర్యాప్తుకి తొలిదశలోనే వేదగారికి తీవ్ర అంతరాయం కలిగితే?” – ఈసారి ద్వివేదిని ప్రశ్నించారు…

“వేద ఎలాంటి వాడో మీకు తెలుసు. అసలీ ప్రశ్నే రాకూడదు. ఎవరికీ బెదరని లొంగని ఆఫీసర్ వేదవ్యాస్. మీ అంచనా ప్రకారం అలా జరిగితే… దర్యాప్తు సజావుగా కొనసాగడానికి… అవసరమైతే సుప్రీం కోర్టు నుండి కూడా అనుమతి తెచ్చుకుంటాం. అందుకు వెనుకాడేది లేదు” తీవ్ర స్వరంతో బదులిచ్చాడాయన.

“మనీ మనీ బ్యాంక్ దోపిడీ కేసు దర్యాప్తుకి నియమింపబడిన స్పెషల్ ఆఫీసర్‌గా ఎలాంటి ఒత్తిళ్ళు బెదిరింపులకు లొంగకుండా నా విధి నిర్వహణను పారదర్శకంగా నిర్వర్తిస్తానని మీకు హామీ ఇస్తూ ప్రతిన బూనుతున్నాను” నిజాయితీ ధ్వనించింది వేద మాటల్లో.

ఆ హలంతా చప్పట్లతో మార్మోగింది.

“నేను స్వేచ్ఛగా ముందుకు సాగాలంటే మీ సహకారం కూడా ఎంతో అవసరం” విలేఖరుల వైపు చూస్తూ అన్నాడు వేదవ్యాస్.

“పత్రికా ప్రతినిధులుగా మా సహాయసహకారాలు మీకూ మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకు ఎల్లప్పుడూ ఉంటాయి” అన్నారంతా ముక్తకంఠంతో

యస్సై ఆనందంతో తలూపాడు.

కాసేపు హాలంతా నిశ్శబ్దమైయింది.

“ఎనీ మోర్ క్వశ్చన్స్?” ప్రశ్నించాడు ద్వివేది. లేవన్నట్టుగా తల అడ్డంగా ఊపారంతా.

ధాంక్స్ చెప్పి లేచాడు ద్వివేది.

యస్సై వేదవ్యాస్ అతని వెంట కదిలాడు.

వాళ్ళిద్దరూ నిష్క్రమించడంతో ఆనాటి ప్రెస్ మీటింగ్ కార్యక్రమం ముగిసింది.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here