ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-9

0
8

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]పో[/dropcap]లీస్ జీప్ నగర వీధుల్లో రొటీన్‌గా పెట్రోలింగ్ జరుపుతోంది. ఆలోచనల్లో వున్న యస్సై వేదవ్యాస్ దృష్టి సడెన్‌గా ఒక బోర్డుపై పడింది. వెంటనే జీప్‌ని రివర్స్ తీసుకొమ్మని చెప్పాడు డ్రైవర్‌కి.

డ్రైవర్ జీప్‌ని వెనక్కి తీసుకొళ్ళాక తన కళ్ళబడిన బోర్డుకి ఎదురుగా రోడ్‌కి. అవతలవైపున పార్కింగ్ ప్లేస్‌లో జీప్‌ని స్టాండింగ్ చేయించాడు. షాప్‌కి తగిలించబడిన బోర్డ్ వైపు దృష్టి సారించాడు.

వేద భృకుటి ముడివడింది.

“గృహలక్ష్మీ ఏజన్సీస్. సగం ధరలకే గృహోపరకణాలు” అనే పెద్ద పెద్ద అక్షరాలు ఆకర్షణీయంగా వ్రాయబడి, చూపరులని ఇట్టే ఆకర్షించేలా వున్నాయి.

ఆ అక్షరాల్ని మరోసారి చదువుతూ ఊలిక్కిపడ్డాడు.

ఎక్కడో.. ఎప్పుడో విన్నట్టన్పించిదా మ్యాటర్. కాసేపు ఆలోచనల్లో పడ్డాడతను. అయితే గుర్తుకు రాలేదు.

వెంటనే హెడ్ కానిస్టేబుల్‌ని పిలిచి ఆ ఏజన్సీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా పబ్లిసిటీ మ్యాటర్ వుంటే పట్రమ్మని పంపాడు.

అయిదు నిముషాల్లో వెళ్ళి వచ్చి కొన్ని పేపర్స్‌ని వేదవ్యాస్‌కి అందజేశాడా కానిస్టేబుల్.

అక్షరం పొల్లు పోకుండా ఒకటికి రెండుమార్లు చదివాడు వాటిని.

అప్పుడు గుర్తుకు వచ్చిందతనికి. అందులో ఒక పాంప్లెట్‌ని ఓ రోజు ఇంట్లోనే చూసినట్టు.

ప్రస్తుతానికి అదికాదు అతనికి కావాల్సింది.

అలాంటిదే సేమ్ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు, పైగా చదవినట్టు బాగా గుర్తు. అదే గుర్తుకు రావడం లేదు.

తిరిగి ఆలోచనల్లో పడ్డాడు.

అలా అయిదు నిముషాలు గడిచాయి.

అనంతరం స్ఫురణకు వచ్చిందితనికి.

అంతే! కోపంతో మొహం ఎర్రబడింది. శ్వాస వేగం హెచ్చింది.

ఒకసారి మనసులో రివైండ్ చేసుకున్నాడా వార్తని.

నిజామాబాద్‌లోని ఆర్సుర్‌లో ‘బాలాజీ ఏజన్సీస్’ సంస్థ సగం డబ్బు చెల్లిస్తే చాలు. పదిపేను రోజుల్లో కష్టమర్లు కోరిన వివిధ గృహోపకరణాలు ఇస్తామని ప్రకటించింది. అది నిజమని నమ్మిన జనం తండోపతండాలుగా ఆ ఏజన్సీ మీద పడ్డారు. సగం డబ్బు చెల్లించి, తమ పేర్లని వస్తువుని ఆ ఏజన్సీలో నమోదు చేసుకున్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కలిగించడానికి ఆ ఏజన్సీ వాళ్ళు ముందుగా పేరు నమోదు చేసుకున్న కొందరికి సగం సొమ్ముకే వారు కోరుకున్న వుస్తువుని అందిచేసారు. దాంతో జనానికి ఆ ఏజన్సీ మీద గురి కుదిరింది. అతి తొందర్లోనే వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. అలా ఏజన్సీ వాళ్ళు విసిరిన ఉచ్చులో అనేక మంది చిక్కుకున్నారు.

చివరికి దాదాపు ఇరవై లక్షల పై చిలుకు సొమ్ము తమ చేతులు మారాక ఆ ఏజన్సీ వాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు.

మోసపోయిన మిగిలిన జనం వచ్చి స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చేదాకా ఆ విషయం పోలీసులకూడా తెలియదు.

ఇప్పుడా కేసుని ఆర్ముర్ టౌన్ యస్సై విక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. తన సబిషన్ తీసుకోవడానికి ఒక రోజు స్వయంగా వచ్చి కలిసాడు కూడా.

అదే ఘటన, అదే వద్ధతిలో తిరిగి నేడు నగరం నడిబొడ్డున పునరావృతం కాబోతోందన్న మాట.

నెవ్వర్! అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ మోసాన్ని ఆపాలి. కానీ, ఎలా… ఎలా ?

ఆ ఆర్మూర్ గ్రూప్ ముఠా వాళ్ళే ఇక్కడ ‘గృహలక్ష్మీ’ పేరుతో ఏజన్సీ ఓపెన్ చేశారా? లేక ఆ మఠా వేరా? ఈ ముఠా వేరా?

ముందీ మిస్టరీ ఛేదించాలి. వేదవ్యాస్ బుర్ర వేడెక్కి పోతోంది.

చివరికో నిర్ణయానికి వచ్చినవాడిలా ఆ ఏజన్సీ వైపు కదిలాడు, వెంట రాబోతున్న సిబ్బందిని అక్కడే ఆపేసి.

ఆ ఏజన్సీ ముందర జనం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని మోసాలు చేసేవారు బయల్దేరారు. సామాన్యుల అమాసయకత్వాన్ని ఓపెన్‌గా క్యాష్ చేసుకుంటున్నారు. వాటే వండర్? లేకపోతే సగం ధరకే వస్తువులు దొరకమేమిటి? ట్రాష్!

ఎంత వెర్రిగా నమ్ముతున్నారీ జనం. ఎంత గ్రుడ్డిగా వాళ్ళ ప్రకటనల్ని ఫాలో అవుతున్నారు. ప్రజలు కించిత్ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా గొర్రెదాటుడులా మోస కూపంలో పడిపోతున్నారెందుకని.

ఆ సమయంలో దీపపు కాంతి అకర్షణకి లోనై అందులో పడి కాలిపోయే శలభాలు గుర్తుకు వచ్చాయ్ వేదవ్యాస్‌కి.

మధ్యతరగతి మానవవుడు ఆశామోహాల్లో పడి, ప్రలోభాలకి లొంగిపోనంత కాలం ఇలాంటి బూటకపు ఏజన్సీలు పుట్టకా మానవు. ప్రజలు బోల్తా పడక మానరు.

ఆలోచిస్తూనే ఆ ఏజన్సీ లోపలకు ఎంటరయ్యాడు.

పోలీసుల వాసన తగిలి యస్సై వస్తున్నాడనే వార్త తెలియగానే తన గదిలోంచి బయటకు వచ్చింది శకుంతల.

ఎదురు వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంటూ అతన్ని తన వెంట గదిలోకి తీసుకు వెళ్ళింది.

ఆమెని చూడగానే ఎందకనో వేదవ్యాస్‌కి ఒక రకమైన అపూజ్యభావం ఏర్పడింది. ఒక స్త్రీని చూడగానే అలాంటి అభిప్రాయం ఏర్పడడం బహుశా వేద జీవితంలో తొలిసారేమో?

అయినా తన భావాల్ని బయటపడనీయకుండా ఆమె వెంట నడిచాడతను.

గదిలో కూర్చున్నారిద్దారు.

“ఆ… చెప్పండి… నేను మీకే విదంగా సాయం చేయగలను?” అని అడిగింది.

“ప్రజలకి చేస్తున్నారుగా బోల్డంత సేవ. అది చాలు” అన్నాడు నవ్వుతూ.

“ధాంక్స్ ఫర్‌ యువర్ నైస్ కాంప్లిమెంట్” బదులిచ్చింది.

అతడి వ్యంగ్యం అర్థం కాలేదామెకి.

“ఇట్స్ ఓకే! కెన్ ఐ చెక్ ఆఫ్ యువర్ రికార్డ్స్ ఇమ్మీడియట్లీ?”

“వై నాట్. ష్యూర్. బట్ వై ఇఫ్ దేరీజ్ ఎనీ కంప్లెంట్ ఫ్రమ్ ఎని కష్టమర్. ఆర్ ఎనీ ప్రోబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ ఫ్రమ్ అవర్ సైడ్?” చాలా తెలివిగా అడిగిందామె.

ఆ ప్రశ్నచాలు. అతన్ని ఇరకాటంలో పెట్టడానికి.

తాను ఏ ఆధారంతో ఏజన్సీ సోదా చేయడానికి వచ్చాడో తెలియపరచమని ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నిస్తోంది.

సో షి ఈ జ్ నాట్ ఓన్లీ పర్సన్ ఇన్‌సైడ్ ఆఫ్ దిస్ గ్రూప్. ఎవరో పెద్ద హస్తమే ఉండి ఉండాలి. లేదా తనని ఒక ట్రయల్ వేసైనా వుండాలి. ఏదైతేనేం తొందరపడకూడదు.

చాలా తెలివిగా, ప్లాన్డ్‌గా డీల్ చేయాలి ఇలాంటి వ్యవహారాల్ని. లేకపోతే ప్రత్యర్థులు జాగ్రత్తపడే అవకాశం వుంటుంది. ఆ ఛాయిస్ తనకు తానుగా రానీయకూడదు.

వేదవ్యాస్ ఆలోచన్లకి బ్రేక్ ఇచ్చి-

“నోనో నథింగ్ జస్ట్ ఫర్ క్యూరియాసిటీ. మిమ్మల్ని అనుమానిస్తున్నానని మీరనుకుంటున్నట్లున్నారు. అదేం కాదు” అంటూ మాటమార్చాడు.

“ఫర్వాలేదు. మీరు మమ్మల్ని శంకించినా, యు ఆర్ వెల్ కమ్! ఆఫీసులో అణువణువూ గాలించి మరీ చెక్ చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మా నిజాయితీని శంకించడం మా సంకల్పాన్ని వెక్కిరించడమే అవుతుంది గనక” అంటూ ఆగింది, యస్సై నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనని.

“సారీ మేడమ్ మీరు అపోహ పడ్తున్నారు. ఎలాంటి నెగెటివ్ థింక్స్‌తో నేనిక్కడి రాలేదు” అన్నాడుతను.

ఇంతలో ట్రేలో రెండు కప్పుల కాఫీ, రెండు కూల్ డ్రింక్స్ వచ్చాయి.

“తీసుకోండి. కూల్ కావాలో, హాట్ కావాలో” అంది అతనికి ఆఫర్ చేస్తూ.

“మీ అతిధి మర్యాదలకు థాంక్స్. విధి నిర్వహణలో ఉన్నపుడు ఇతరుల నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను. దట్స్ మై ఓన్ ప్రిన్సిపుల్. సారీ” అంటూ తిరస్కరించాడు.

“డ్యూటీలో లేనపుడు ఐ మీన్ ప్రైవేట్‌గా వచ్చి కలిస్తే ఏదైనా స్వీకరిస్తారన్నమాట” అంది నర్మగర్భంగా నవ్వుతూ.

ఆమె మాటల చాతుర్యానికి వేదవ్యాస్ తడబడ్డాడొక్క క్షణం.

“నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ కాలంలోనైనా నిప్పు నిప్పే! అయినా నాకు ప్రైవసీ ఏంటి? ఈ దేహంలో జీవం ఉన్నంత కాలం ఈ వేదవ్యాస్ పోలీస్ డ్యూటీ నిర్వహిస్తున్నట్టే!” అన్నాడు.

“ఎంతటి అగ్నిజ్వాలయినా ఎప్పుడో ఒకప్పుడు చల్లారక తప్పదు. అది ప్రకృతి ధర్మం.”

ఆమెతో వాదం పెంచుకోదలచలేదతను. మౌనమే సమాధానమయ్యింది.

“మా ఏజన్సీకి ఎందుకు వచ్చారో చెప్పడం లేదు.”

వేద వాలకాన్ని గమనించి మాట మార్చేసింది.

“మా అమ్మ కలర్ టి.వి కావాలని అంది. వివరాలు తెల్సుకుందామని వచ్చాను” చెప్పాడు కామ్‌గా.

ఒక్క క్షణం స్టన్నయ్యింది. అతను చెబుతున్నది నిజమో కాదో తేల్చుకోలేక పోయింది. అయినా తను బయటపడదలచుకోలేదమామె.

“కొంత ఎమౌంట్ పే చేసి వెళ్ళండి. మీ ఇంటికో ఫారమ్ వస్తుంది. దానిలో టి.వీ కంపెనీ, మోడల్‌, కలర్ తదితర వివరాలుంటాయి. దాన్ని ఫిలప్ చేసి మాకు పంపండి. మోడల్‌కి అనుగుణంగా డబ్బు సర్దుబాటుంటే మిగతా ఎమౌంట్ పే చేసి వస్తువు పట్టుకు పోవచ్చు. ఇదీ ప్రోసీజర్” చెప్పిందామె.

కాని ఆ సమయంలో శకుంతలకి ఒక విషయం స్ఫరణకి రాలేదు. విధి నిర్వహణలో వచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని చెప్పిన ఆ పోలీసాఫీసర్ తన స్వంత పని మీద వచ్చానని చెప్పాడెందుకని?

దాని గురించి పెద్దగా పట్టించుకోలేదామె. సీరియస్‌గా తరచి చూస్తే, ప్లాన్డ్‌గా వ్యవహరించేదేమో! కానీ మిస్సయిపోయింది.

డేగ జాడ దూరం నుండే చూచాయిగా కనిపిస్తున్నా నాగుపాము తగు జాగ్రత్తలు పడడం లేదంటే అది ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నట్టేగా.

వాస్తవానికి శకుంతల తన మస్తిష్కంలో మరోరకపు ఆలోచనలకి రూపకల్పన చేసుకుంటోంది.

“ఒకటి రెండు రోజుల్లో ఎమౌంట్ పంపిస్తాను.”

“వెల్‌కమ్.”

“అడిగిన వెంటనే స్వయంగా వివరాలందచేసినందుకు థాంక్స్” అన్నాడు వేద కుర్చీలోంచి లేస్తూ.

మర్యాద పూర్వకంగా తనూ లేచి నిలబడిందామె.

“మళ్ళీ కలుస్తాను.”

“నైస్ టు మీట్ యూ.”

అదే క్షణంలో ఆ ప్రత్యర్థులిద్దరూ ఎవరికి వారే తమ తమ మనసుల్లో విరుద్ధ భావాల్ని అవిష్కరించుకుంటున్నారు.

జరగబోయే ఆర్థిక పరమైన ప్రమాదాన్ని ఆపి, ఏ రకంగా ఈవిడిని దెబ్బతీయాలా అనే ఆలోచనతో యస్సై వేదవ్యాస్ బయటకు వెళ్ళిపోయాడు.

తను ఊహించినట్లు పోలీసు నీడ పడనే పడింది. అయితే ఇంత తొందరగా తమ ఉనికిని పసిగడతారనుకోలేదు.

మరి వేద వ్యూహం నుండి ఎలా తప్పించుకోవడం అనే ప్రశ్న బుర్రని తొలిచేస్తుంటే తన సీట్లో చతికిల పడింది శకుంతల.

***

శకుంతల గురించి రహస్యంగా ఎంక్వైరీ చేయించిన వేద, తనకి అందిన రిపోర్ట్స్ చూసి హతాశయుడయ్యాడు.

ఆమెకి సంబంధించిన వివరాలిలా వున్నాయి – శకంతల నగర మహిళామండలికి వర్కింగ్ ప్రెసిడెంట్. సంఘసేవకురాలు. డోనేటర్. ‘అందుకేనా తన ముందు అంత ధీమా ప్రదర్శించింది ఆ రోజు’ అనుకున్నాడు వేదవ్యాస్.

శకుంతల విషయంలో ఆచితూచి అడుగువేయాలని నిశ్చయించుకున్నాడు.

అందరూ స్వాములే! వాళ్ళ స్కామ్‌లు బయటపడితే కదా అసలురంగు తెలిసేది. అందుకే గృహలక్ష్మి ప్రాజెక్ట్ విషయంలో తొందరపడదల్చుకోలేదతను.

***

రాత్రి సమయం.

పది గంటలవుతోంది.

ఎప్పట్లా రహస్యంగా సమావేశమయ్యారా ఇద్దరు.

“ఎందుకీ అనుకోని అత్యవసర సమావేశం?”

“పోలీసు జాగిలాలు వెంటపడుతున్నాయ్!”

“ఎందుకని?”

“వాసన పసిగట్టినట్లన్నాయ్!”

“ఐసీ!”

“…”

“చేసేది. చేయించేది. అంతా నేనే! అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్.”

“జరగాల్సింది చూడు.”

“భయపడుతున్నావా?”

“భయం కాదు. ముందుగా జాగ్రత్త పడదామని.”

“అంటే?”

“బిజినెస్ క్లోజ్ చేసేయనా?”

“అదా నీలాంటి వాళ్ళు చేయాల్సింది కాదు. జెర్రిపోతులా పిరికితనం ప్రదర్శించకు. త్రాచులా బుసకొట్టడం నేర్చుకో!”

“…”

“ఎందుకలా మౌనంగా ఉండిపోయావ్?”

“సారీ! ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడానికి సంసిద్ధంగా ఉంటాను.”

“దట్స్ గుడ్! మనం చేయాల్సింది అదే! మొండిధైర్యం ఉంటే ప్రపంచాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు. ‘చేసేది చేయించేది అంతా నేనే’ అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. అలా అని మనవంతు కర్తవ్యం మనం మరవకూడదు.”

“అలాగే.”

“ఇంతకూ వెంటపడుతున్నది ఎవరు?”

“వ్యాస్. యస్సై వేదవ్యాస్.”

“…”

“ఏమాలోచిస్తున్నావ్?”

“అతని గురించే!”

“ఎందుకని?”

“నీకు అతని వ్యక్తిత్వాన్ని తెలియపరుద్దామని”

“కూరలో కరివేపాకు కాదా?”

“అంత సింపుల్‌గా తీసి పారేయకు.”

“బిస్కట్లకి తోకాడిస్తాడా?”

“అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దనేది. దేనికో ఒక దానికి ప్రతివారూ లొంగిపోతారనుకోవడం పొరపాటు. ఖాకీడ్రెస్ వేసుకున్న పిల్లిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అది మన ప్రొఫెషన్‌కి పనికి రాదు.”

“ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్…”

“ఘటికుడు. చాలా మొండివాడు. పైగా పట్టు పట్టాడంటే విక్రమార్కుడే! కదనరంగంలోకి దూకాడంటే అర్జనుడే!”

“వెరీ నైస్ పొగడ్త.”

“పొగడ్తలు కావు. వాస్తవాలు. శత్రువునెప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అది వీరుల లక్షణం కాదు. మనకంటే శత్రువు బలవంతుడనే నమ్మకంతోనే మనం పోరుకి సిద్ధపడితే విజయం హస్తగతమవుతుంది. ఎప్పుడైతే శత్రువుని తక్కువ అంచనా వేయడం ప్రారంభించామో అది ఓటమికి సంకేతం అన్నమాట.”

“మరిప్పుడేం చేయాలి?”

“జీవితం వైకుంఠపాళీ లాంటిది. ఏ నిమిషంలో నిచ్చెన తగిలి పైకెదుగుతామో, ఏ క్షణంలో పాము నోట బారినపడి అధఃపాతాళానికి జారిపోతామో తెలియదు.”

“‘చేసేది చేయించేది అంతా నేనే’ అనేది శ్రీ కృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. అందుకే మనం నిమిత్తమాత్రులం. అలా అని అచేతనంగా వుండనవసరం లేదు. చేతనత్వంతో నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు సాగడమే మన వంతు కర్తవ్యం. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావ్?”

“చేయదలుచుకున్నదేదో నేనే చేసేస్తే ఈ సీక్రెట్ మీటింగ్‌తో పనేంటి? నిన్నెందుకు రమ్మంటాను? సలహా ఇస్తావని కదా!”

“…”

“ఏం చేయమంటావ్? చెప్పు”

“ముందు ఆ పోలీసాఫీసర్ కదలికల్ని అడుగడుగునా పసికట్టడానికి నమ్మకమైన ఒక వ్యక్తిని నియమించు. ఆ రిపోర్ట్స్‌ని బట్టి చూద్దాం. మన మనిషి ఆ వేదవ్యాస్ గురించి అందించే సమాచారం ఆధారంగా మన ప్రోసీడ్ అవుదాం. అంత వరకూ సైలెన్స్‌గా ఉండటం బెటర్.”

“నైస్ సజెషన్.”

“ఆ రిపోర్ట్స్ అందేవరకు నువ్వు మాత్రం చాలా అలర్ట్‌గా వుండాలి. ఏ మాత్రం తొందరపడకు. ఎక్కడా కించిత్ తేడా కూడా రానివ్వకు. కాస్త దూకుడు ఎక్కువ నీవు. ఏ దిశ నుండయినా ప్రమాదం అనుక్షణం పొంచివుంటుందని మాత్రం మరవకూడదు. ‘చేసేది చేయించేది అంతా నేనే’ అనేది శ్రీ కృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మైండిట్!”

“ఓకే!”

“గుడ్ నైట్”

“గుడ్ నైట్”

***

కాని వాళ్ళకి తెలియని విషయం ఒకటుంది.

తాము నియమించబోయే సీక్రెట్ ఏజెట్ నుండి – గృహలక్ష్మి బిజినెస్ గురించి వేదవ్యాస్ పూర్తిగా మరచి పోయాడనే రిపోర్ట్ రాబోతోందని.

కేవలం వాళ్ళని తప్పుదారి పట్టించడానికే ఆ పోలీస్ ఆఫీసర్ పై ఎత్తుగడ వేసాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here