ఉదయ రాగం-2

1
6

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”సా[/dropcap]రీ ఉదయ్! మీరిచ్చిన కార్డు ఎక్కడో పడిపోయింది” అన్నది కాస్త లో స్వరంతో.

“అయితే కావాలని చెయ్యకపోవడం కాదన్నమాట. థ్యాంక్యూ! అప్పుడేదో అలవాటు ప్రకారం మా కస్టమర్లకు ఇచ్చినట్లు మీకూ విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ కలిసాం కాబట్టి మనం ఫ్రెండ్స్ అయిపొయినట్లే. అసలు కార్డెందుకు? నా నెంబర్ ఫీడ్ చేసుకోండి చెబుతాను” అంటూ నెంబర్ చెప్పాడు. ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకొని నెంబరు ఫీడ్ చేసుకున్నారు. అతను వీళ్ళ మొబైల్ నెంబర్లు ఇప్పుడూ అడగలేదు. కానీ వాళ్ళే చెప్పారు.

“ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి విసిగించనులెండి. సాధ్యమైనంత వరకూ మీ దగ్గర నుండి ఫోన్ కోసమే ఎదురు చూస్తాను. ఆ తరువాతనే నేను చేస్తాను.”

ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

“ఇక మీదటైనా నన్ను మీరు గారు అని పిలవకండి. ఉదయ్ అని పిలిస్తే సంతోషం. ఎందుకంటే మీరు నాకు వానదేవుడిచ్చిన స్నేహితులు” అన్నాడు.

“కలిసినప్పటి నుం చి ముగ్గురం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ సమయం పడుతుంది” అన్నది అరుణ.

వెంటనే అందుకుంది రవళి “అలాగే ఉదయ్! నువ్వు.. వింటున్నావా.. నువ్వు కూడా మమ్మల్ని పేర్లు పెట్టి పిలిస్తేనే వానదేవుడికి సంతోషం” అన్నది.

ముగ్గురూ నవ్వుకున్నారు.

అతనికి ఏదో ఫోన్ కాల్ వచ్చింది. “ఇక నేను బయలుదేరుతాను” అంటూ లేచాడు. వాళ్ళిద్దరూ అతనితో బయటకు వచ్చారు.

అతను కారెక్కుతుండగా అరుణ “ఉదయ్! నువ్వు మీ వర్కర్‌తో మాట్లాడుతున్నప్పుడు అతను సొంత పనిమీద తన ఊరెళుతూ ప్రమాదం బారిన పడ్డాడని నాకర్థమైయింది. నీకు బాధ్యత లేకపోయినా వచ్చి అతన్ని కలిసి వెళ్ళడం నాకు నాచ్చింది” అన్నది.

ఉదయ్ ఆమె వైపు ఒక క్షణం చూసి నవ్వుతూ కారు స్టార్ట్ చేసి చెయ్యూపుతూ వెళ్ళిపోయాడు.

“అయితే ఇతను శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అన్నమాట” అన్నది రవళి.

“మంచిదేగా! అయినా సినిమాల్లో చూపించే ఆదర్శాలు నిజ జీవితాల్లో ధనికులు చూపించడం చాలా అరుదు. చూపిస్తే ఇంకేం కావాలి? కొందరు అభాగ్యులకైనా మేలు జరుగుతుంది. అసలు ఉన్నవాళ్ళంతా బడుగు జనాల గురించి కాస్త పెద్దమనసు చేసుకుంటే ఎంత బావుంటుందో కదూ! మన దేశ రూపురేఖలే మారిపోవు?”

“వామ్మో! ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా దేవుడోయ్”

“సంతోషించాంలే పద”

“ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావ్”

“దేని గురించి?”

“అదే హాస్టల్ మానేసి మా ఇంటికి వచ్చెయ్యమన్నానుగా!”

“ఎందుకే మీ ఇంటికి? నేనెప్పుడూ నీతులు చెబుతుంటానని, పాత కాలపు మాటలు మాట్లాడుతానని అంటూ మీ అమ్మమ్మతో పోలుస్తుంటావు. నన్ను ఇంట్లో పెట్టుకొని ఎందుకు అవస్థ పడతావు?”

“నీలాంటి స్నేహితురాలి ఎడబాటు కొంచమైనా తట్టుకోలేనే! అర్థం చేసుకోవూ!”

“ఎడబాటులో తీయదనం నీకు తెలియటం లేదా?”

“నా ప్రశ్నకు సమాధానం చెప్పవా?”

“ప్రస్తుతం నాకు ఇలానే బావుంది. ఇంటర్న్‌షిప్ చేసేప్పుడు వచ్చి ఉంటాలే”

“ప్రామిస్?”

“ఇంతగా అడుగుతున్నావు. మా అమ్మ గుర్తొస్తున్నది రవళి”

నాలుగు కళ్ళూ చెమర్చాయి. రవళి బుగ్గపై అరుణ గట్టిగా ముద్దు పెట్టింది. చిన్నగా ఇద్దరూ క్లాసు రూము వైపు నడిచారు.

***

రోజులు రొటీన్‌గా దొర్లిపోతున్నాయి.

ఒకరోజు రాత్రి అరుణ భోజనం ముగించుకొని తన గదికొచ్చి క్లాసులో ప్రొఫెసర్‍ని అడగాల్సిన కొన్ని సంయాలను రాసుకుంటున్నది. అంతలో మొబైల్ మ్రోగింది. పేరు చూస్తే ‘ఉదయ్’ అని ఉంది. కొన్ని క్షణాలు ఆగి హలో అంటూ బదులిచ్చిం.

“హాయ్ అరుణ! ఎలా ఉన్నావు?”

“బాగున్నాను, నువ్వు?”

“నేనా, ఒక విధంగా అంత బాగాలేననే చెప్పాలి. ఆ విషయమే నీతో మాట్లాడాలనిపించింది. ఇలా ఫోనులో కాదు. రేపు ఆదివారమే కదా, సాయంత్రం నీ పనులు అయ్యాక ఒకసారి కలవచ్చా?” అడిగాడు.

అరుణ ఒక నిముషం పాటు ఏమీ మాట్లాడలేకపోయింది.

అతను “హలో హలో” అంటున్నాడు.

“ఆ వినపడుతున్నది. కానీ రేపు రవళి ఉండదు. వాళ్ళ బాబాయి వాళ్ళింటికి వెళుతుందిట.”

“నేను నీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వెక్కడికీ రానవసరం లేదు. నేనే పద్మారావు నగర్‌లో అప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేసిన చోటికి సాయంత్రం ఆరింటికల్లా వస్తాను. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. కాస్త ముఖ్యమైన విషయం, సరేనా?”

“సారీ ఉదయ్! నేనూ రేపు మా ఊరు వెళ్ళొద్దామనుకుంటున్నాను”

“ఓ అలాగా! ఇట్సోకే, సారీ అరుణ! కాస్త చొరవ తీసుకున్నట్లున్నాను. మరెప్పుడైనా కలుద్దాం లే!” అన్నాడు. అరుణ ఏమీ మాట్లాడలేదు. అతను కొద్దిసేపు ఆగాక ఫోన్ కట్ చేశాడు. అరుణ కాసేపు ఆలోచనలో పడింది.

ఒక పావుగంట తరువాత ఫోన్ చేసి “ఉదయ్! నువ్వు చెప్పిన సమయానికే వచ్చెయ్యి” అని చెప్పి పెట్టేసింది.

పక్కమీద పడుకున్నా ఆలోచనల అసహనంతో కాసేపు అటూఇటూ దొర్లుతూ ఎప్పటికో నిద్రలోకి జారిపోయింది.

మరుసటిరోజు ఆదివారం పీజీ ఎంట్రన్స్ కోచింగ్ క్లాసెస్ ముగించుకొని బయలుదేరి ఉదయ్ వస్తానన్న చోటికి చేరుకుంది.

అప్పటికే అతని బైకు ఒక ప్రక్కగా ఆపి ఎదురు చూస్తుండటం గమనించింది. అరుణను చూడగానే అతను దగ్గరకొచ్చి. “హాయ్ అరుణ! అదుగో ఆ రెస్టారెంట్‌లో కూర్చుందామా?” అడిగాడు. ఆమె అతన్ని అనుసరించింది.

మూలగా ఉన్న ఒక టేబుల్ దగ్గరకెళ్ళారు. అతను ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. కొద్దిసేపు మాటలు లేవు. ఆ తరువాత టీ త్రాగారు.

“చెప్పు ఉదయ్! ఏమిటి అంత అర్జంటు విషయం?” అడిగింది.

అతను ఆమె వైపు పరీక్షగా చూసి “నేను నా కుటుంబ విషయాలు నీకు చెప్పడం నీకు ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. నువ్వు నాకన్నా చిన్నదానివైనా జీవితం పట్ల నాకంటే ఎక్కువ అవగాహన గల వ్యక్తిగా కనిపిస్తావు. ఈ కొద్దిపాటి పరిచయం తోటే నీతో ఈ సీరియస్ మ్యాటర్స్ మాట్లాడాలనిపించడం నాకూ కాస్త వింత గానే ఉంది. కానీ నాకు ప్రస్తుతం నువ్వే సరైన వ్యక్తిగా కనిపిస్తున్నావు” అన్నాడు.

“నువ్వనుకున్నంత గొప్పదాన్నేం కాదు నేను, అయినా చెప్పు వింటాను” అన్నదామె చిన్నగా నవ్వుతూ.

“అప్పుడు కార్లో వచ్చేప్పుడు నేను యం.కాం చేసినా ఉద్యోగం ఇష్టం లేక చెయ్యట్లేదని చెప్పాను. కానీ నిజానికి మా నాన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరకుండా ఆయన వ్యాపార వ్యవహారాలు చూస్తున్నాను. ఇంటర్ తరువాత సివిల్ ఇంజనీరింగ్ చేయించాలని ఆయన కోరిక. నాకు ఇష్టం లేదన్నాను. ఎం.బీ.ఏ చేయ్యాలన్నాడు. చివరకు యం.కాం అయిందనిపించాను.

నాకు ఒక అక్క ఉంది. పెళ్ళై అమెరికాలో ఉంటున్నది. నన్ను ఎక్కడికీ పంపించడం మా నాన్నకు ఇష్టం లేదు. ఈ మధ్య వ్యాపారం బాగా పెరిగింది.

నాకూ ముందు బాగానే అనిపించింది. ఎక్కడో ఉద్యోగాలెందుకు, ఒక్కసారిగా చిన్నబాస్‌ని అయిపోయాను కదా అనుకున్నాను. సంవత్సరం పైనే గడిచింది. రానురాను అయిష్టత పెరిగిపోతున్నది. మా నాన్న వాడుక మాటల్లో వ్యాపార ధర్మం అనేమాట ఒకటి అప్పుడప్పుడూ వినపడుతుంటుంది. ఆ పేరుతో కొన్ని అవినీతి పనులు చెయ్యటం దగ్గర ఈ మధ్య నాకు ఆయనకు వాదనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అలాంటి పనులకు తను వెళ్ళడమో, మరొకర్ని పంపడమో చేస్తున్నాడు.

సక్రమంగా వ్యాపారం చెయ్యలేమా? అని నేనడిగితే పెద్దగా నవ్వి నన్ను అదోలా చూస్తాడు. అవినీతి అనే పదాన్ని చేర్చి నేను మాట్లాడితే ఆయనకు చాలా చిరాకు కలుగుతుంది.

“ఉడుకు రక్తం కదా కొంత కాలం తరువాత ప్రపంచం అర్థమౌతుంది” అనే మాట తరచూ అంటుంటాడు. మరోసారి “నీకు మీ అమ్మ మెతక లక్షణాలొచ్చాయి, ఖర్మ” అని నెత్తి కొట్టుకుంటాడు.

నాతో చదివిన స్నేహితులు కొందరు విదేశాలకు, కొందరు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ప్రస్తుతం ఇక్కడ నాకు సరైన మిత్రులెవరూ లేరు. మా బంధువులందరూ మా నాన్నకు భజన చేసేవాళ్ళే. ఈ రొష్టు భరించే కంటే ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకొని వెళ్ళాలని ఉంది. కానీ ఆయన పడనీయడు. పోలేను ఉండలేను. నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పగలవా?” అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“ఉదయ్! బయటకెళ్ళడం అంటే ఇదే ఊర్లోనా, వేరే ఊరా, ఎలాంటి ఉద్యోగం , అక్కడ ఈ విధమైన ఇబ్బందులు ఉండవా, లాంటి విషయాలు ముందు నువ్వు బాగా పరిశీలించుకోవాలి. ఒక్కో ప్రశ్నకి రకరకాల సమాధానాలు ఉంటాయి. ఆ విధంగా ఆలోచించావా?”

“అవన్నీ ఆలోచించలేదు. ముందు ఇక్కడి నుండి బయటపడాలి. ఈ ఊర్లో అయితే కాదు. మళ్ళీ ఆయనకు అవమానం అంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే నాకుగా నేను ఏదైనా సాధిస్తే తృప్తిగా ఉంటుంది అని పదేపదే అనిపిస్తున్నది. ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు”.

ఆమె చిన్నగా నిట్టూర్చింది. “ఉదయ్! మీ నాన్నగారితో మరో రెండు మూడు సార్లు సావధానంగా మాట్లాడు. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలు నిదానంగా చెప్పు. ఆ తరువాత సరైన నిర్ణయం తీసుకోవడానికి నీకొక అవగాహన ఏర్పడుతుందని నాకనిపిస్తున్నది” అన్నది.

“ఆయనతో సావధానంగా మాట్లాడటమా? నీకు మా నాన్న సంగతి తెలియదు”

“విడిగా ఏవో కబుర్ల మధ్యలో మనకు కావాల్సిన విషయం ప్రస్తావించడం వేరు. ఆ విషయమే ముఖ్యాంశంగా పెట్టి మాట్లాడటం వేరు. ముందు అలా ఒకటి లేదా రెండు సార్లు మాట్లాడితే కదా ఎవరి ఉద్దేశాలు ఎవరికైనా స్పష్టంగా తెలిసేది?”

ఉదయ్ కాసేపు ఆలోచించాడు. “సరే! నీ మాటెందుకు కాదనాలి? ఈ రాత్రికే మాట్లాడుతాను” అన్నాడు.

“చాలా సావధానంగా ఆయన మాటలు వింటూ నువ్వు చెప్పదలుచుకున్నది సౌమ్యంగా, ఇంకా వీలైతే కాస్త బ్రతిమాలుతున్నట్లు చెప్పు! తండ్రే కదా? అప్పుడు తేడా నీకే తెలుస్తుంది” అన్నది అతన్ని సూటిగా చూస్తూ.

“సరే నమ్మకం లేకపోయినా ప్రయత్నిస్తాను”

“బెస్ట్ ఆఫ్ లక్” అంటూ నవ్విం దామె.

ఇద్దరూ బయటకు వచ్చారు.

అతను వెళ్ళబోతూ “అరుణా! నువ్వు ఎంతో నిబద్ధతకల వ్యక్తిలా కనపడతావు. మీ అమ్మనాన్నలు నిన్ను పెంచడంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో కదా!”

“మా అమ్మ లేదు, నాకు తొమ్మిదేళ్ళ వయసప్పుడే చనిపోయింది. అప్పట్నుంచి పెంచింది నాన్నే”

“ఓ! అయాం సారీ! ” అంటూ తప్పు చేసిన వాడిలా నిలబడ్డాడు.

“ఇట్సోకే ఉదయ్! చాలా ఏళ్ళైందిగా! అమ్మలేదన్న నిజం మనసు అంగీకరించింది. కాకపోతే ఆమె గుర్తొచ్చినప్పుడల్లా మనసులో కాస్త బాధ కలగడం సహజమే. నువ్వు ఇప్పుడు బాధపడాల్సిన పనిలేదు” అన్నది చిన్నగా నవ్వుతూ.

“ఆమె లేకున్నా మీ నాన్న నిన్ను ఇలా పెంచాడంటే ఖచ్చితంగా మీ నాన్న మా నాన్నలాంటి కరుకు మనిషి కాదు”

“నాన్న ఎలా ఉన్నా నాన్నే! నాన్న గురించి చర్చ నాకు నచ్చదు, ఆపేస్తే బెటర్”

“చూశావా! ఈ విషయం లోనూ నువ్వు నాకంటే తెలివిగలదానవని అర్థమౌతుంది. ఎందుకంటే నచ్చని విషయం నీలా వెంటనే ఖండించడం నాకు చేతకాదు. అప్పుడు తలూపుతాను. తరువాత తెలుసుకుంటాను. అప్పటికి సమయం దాటిపోతుంది. మా నాన్న విషయం లోనూ అదే జరిగింది. అన్నిటికీ తలూపి ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను”

“అదంత ప్రమాదకరమైన విషయమేమీ కాదు. కాలం దాటిపోయినా విషయం అంత తొందరగా చేయిదాటి పోదు. దారిలోకి తెచ్చుకునే మార్గాలు ఉంటాయి”

“నీతో మాట్లాడుతుంటే ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడినట్లుంటుంది”

“అదిగో, నువ్వూ రవళిలానే అంటున్నావు. ఎవరికంటే ఏ విషయం లోనూ నేను పెద్దదాన్ని కాదు. నాకూ సంశయాలు, సందిగ్ధాలూ వస్తుంటాయి. తగిన వాళ్ళనడిగి తీర్చుకుంటాను. అంతేకాదు ఎంత ఆలోచించి ఎంతమందిని సలహా అడిగి చేసినా ఒక్కోసారి ఆ పనిలో ఎదురు దెబ్బలు తగలొచ్చు. అప్పుడు కూడా మన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ పోవాలి. డీలా పడిపోకూడదు. ఎందరికో ఉన్న అతి ఘోరమైన సమస్యలకంటే మనవి చాలా చిన్నవి. స్థిమితంగా ప్రయత్నిస్తే ముళ్ళపొదల్లోంచి కూడా మార్గాన్ని మలుచుకోవచ్చు. నీ సమస్య నువ్వు పరిష్కరించుకోగలవని నాకనిపిస్తున్నది ఉదయ్!”

అతను ఆమెను చూస్తూ ఉండిపోయాడు.

“ఎనీవే చాలా సేపయింది, కాస్త పనుంది. నేను బయలుదేరనా?”

“ఓ ష్యూర్! చాలా సమయం నా కోసం వెచ్చించావు, థ్యాంక్యూ”

“అయ్యో అంతొద్దు”

“రెండు మూడు రోజుల తరువాత కలుస్తా, లేకుంటే ఫోన్ చేస్తా, నీకేం ఇబ్బంది లేదుగా?”

“ఏంటి ఉదయ్ చిన్నపిల్లాడిలా? బై!”

ఉదయ్ బయలుదేరాడు.

అరుణ హాస్టల్ వైపు నడిచింది.

తన పనులన్నీ అయ్యాక భోజనాల సమయంలో రవళి నుంచి ఫోన్ వచ్చింది. ఆరోజు తను కాలేజీకి రాలేదు కనుక విషయాలు అడిగి తెలుసుకున్నది. మాటల మధ్యలో ఉదయ్ వచ్చి వెళ్ళిన విషయం చెప్పింది అరుణ.

“అవునా అతనెందుకొచ్చాడు?”

“తన కుటుంబ విషయాల సంబంధించి చిన్న సలహా గురించి”

“వాళ్ళ విషయాల గురించి నీకేం తెలుసని చెప్పడానికి?”

“ఏమో నన్ను పెద్దదాన్ని చేసి చెప్పావుగా, అందుకే అడిగాడేమో”

“నాకేదో అనుమానంగా ఉంది”

“అనుమానమా ఎందుకు?”

“నువ్వేం చేస్తున్నావిప్పుడు?”

“భోజనానికి వెళ్ళబోతున్నా”

“దార్లో ఉన్నా, ఐదు నిముషాల్లో నీదగ్గరకొస్తా”

“సరే రా! నువ్వూ ఇక్కడే భోజనం చేద్దువు”

కాసేపటికి రవళి వచ్చింది. ఇద్దరు కలిసి భోజనం చేసి గదికి వచ్చి కూర్చున్నారు. ఈలోగా అతను మాట్లాడిన విషయాలన్నీ అరుణ చెప్పగా విన్నది రవళి.

“ఇపుడు చెప్పు ఇందాక ఏదో అనుమానంగా ఉందన్నావు?”

“అవును, నువ్వు చెప్పిన కథ వింటే అలానే అనిపిస్తున్నది”

“కథా?”

“కాక మరేమిటి? అతను చెప్పింది పెద్ద సమస్యా? ఆయనగారు అంత నిజాయితీపరుడా? ఇంత చిన్న విషయాన్ని ఇంట్లో మాట్లాడుకొని తీర్చుకోలేడా? అదేదో జీవన్మరణ సమస్యలాగా నీతో చర్చలా? నీ దగ్గర తన ఇమేజ్ పెంచుకుంటూ వల విసురుతున్నాడేమో! అదే నా అనుమానం, లేకపోతే ఇంత కొద్దిపాటి పరిచయానికి వ్యక్తిగత విషయాలు ఎవరైన మాట్లాడుతారా?”

రవళి వైపు అరుణ ఆశ్చర్యంగా చూసింది. “నాకు అలా అనిపించలేదు. అతను కాస్త అమాయకపు మనస్తత్వం కలవాడుగా అనిపిస్తుంది. తను చెప్పుకోదగ్గ స్నేహితులెవరూ ఇక్కడ లేరుట. బంధువులకు చెప్పడం ఇష్టం లేదుట, నాకైతే అలాంటి అనుమానం రాలేదు మరి” అంటూ ఆగింది అరుణ.

“ఓకే ఏమీ లేకుంటే మంచిదే! కానీ జాగ్రత్త, నువ్వు అందరూ మంచివాళ్ళే అనుకుంటావు. నీలా అందరూ ఉండరు. పోయిన సంవత్సరం మన జూనియర్ శిరీష సంగతి గుర్తుందిగా! వాడెవడితోనో ఎఫైర్‌లో పడి చదువే కాదు జీవితాన్నే ముగించుకుంది”

“అబ్బ! అంత హార్ష్‌గా చెప్పకే. నేను అలాంటి విషయాల్లో చిక్కుకోవడమనేది జరగనే జరుగదు”

“నీ సంగతి నాకు తెలుసు అరుణా! ప్రస్తుత పరిస్థితి చెబుతున్నాను. అయినా ఇద్దరం ఒక్కసారేగా పరిచయం అయింది? నేను సలహా చెప్పేంతటి దాన్ని కాదనా అతని ఉద్దేశం?”

“నిజమేనే! నాకు తట్టనే లేదు. రేపు అతను ఫోన్ చేస్తే అదే చెపుతాను. పైగా ఇది పెద్దోళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. నా బుర్ర సరిగా పని చెయ్యకపోవచ్చు కూడా”

“నేను సరదాకి అన్నాను తల్లోవ్! నా పుస్తకాలే సరిగా పెట్టుకోవడం చేతకాదని మా అమ్మ ఇప్పటికీ తిట్టిపోస్తుంటుంది. ఇక పెద్ద పెద్ద సలహాలు ఇవ్వడమా?, ఎనీవే టేక్ కేర్, రేపు కలుద్దాం” తన స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది రవళి.

***

ఉదయ్‌కి టీ కప్పు అందించింది అమ్మ శకుంతల. “నాన్న కప్పు కూడ ఇటివ్యు” అడిగాడు. ఆమె కాస్త ఆశ్చర్యంగా చూస్తూ మరో కప్పు ఇచ్చింది. తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్న తండ్రి శంభుప్రసాద్‌కి అందించి తనూ ఎదురుగా కూర్చున్నాడు.

కొడుకును కాస్త తీక్షణంగా చూస్తూ “ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నమాట” అన్నాడు నవ్వుతూ.

“అవును నాన్నా! అదేం పని? నీకేం ఖర్మ! నా పరువేం కావాలి? లాంటి మాటలు వెంటనే అనకుండా కాస్త ప్రశాంతంగా విని ఆలోచించమని నా రిక్వెస్ట్” అన్నాడు ఉదయ్ తనూ చిరునవ్వు ప్రయత్నిస్తూ.

“అబ్బో! నీకు ముందర కాళ్ళకు బంధం వెయ్యడం కూడా వచ్చిందిరోయ్! చెప్పు అంత ముఖ్యమైన విషయమేంటో” అన్నాడు టీని కొద్దిగా చప్పరిస్తూ.

ఇందాకట్నుంచి వారి మాటలు వింటున్న శకుంతల వచ్చి ఉదయ్ ప్రక్కన కూర్చుంది.

“నాకుగా నేను ప్రయత్నించి ఒక ఉద్యోగం సంపాదించుకొని, కొంత అనుభవం, మంచి పేరు గడించాలని ఉంది. ఆ తరువాత అవసరమనిపిస్తే, నేను చెయ్యగలను అనిపిస్తే, సొంతంగా బిజినెస్ మొదలు పెడతాను లేకుంటే లేదు” అన్నాడు నిదానంగా.

శంభుప్రసాద్ ముఖంలో వెంటవెంటనే రంగులు మారాయి. చివరికి ఒక చిరునవ్వు అక్కడ నిదానంగా చోటు చేసుకుంది. “అలాగేలేరా! నా పలుకుబడితో సంబంధం లేకుండా నీకు నువ్వు ఎదగాలనుకున్నావు. అదేదో సినిమాలో హీరోలాగా. ఈ మధ్య మన వ్యాపార విషయాలూ నీకు నచ్చట్లేదని నసపెడుతూనే ఉన్నావు కూడా. నీ కోరిక ఎందుకు కాదనాలి? కాకపోతే నాకూ ఒక కోరిక ఉంది. అదీ నీకు చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. సరిగ్గా సమయానికి వచ్చి నువ్వే నా ముందు కూర్చున్నావు” అన్నాడు చాలా ప్రశాంతంగా.

ఉదయ్ ముఖంలో కాస్త సంతోషం, కాస్త ఏదో తెలియని అనుమానం దోబూచులాడాయి.

“ఏమీ లేదురా, మీ నాగరాజు మామయ్య నిన్ననే ఫోన్ చేశాడు. మరో రెండు నెలల్లో చాలా మంచి ముహూర్తం ఉందిట” అన్నాడు.

“ముహుర్తమా దేనికి?”

 “దేనికేంట్రా! నీకు సంధ్యకూ పెళ్ళి చెయ్యాలి కదా! ఏడాది క్రితం నుంచే అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నాడు. మావాడు వ్యాపారం చూసుకోవడం నేర్చుకుంటున్నాడు, కాస్త ఆగుదాము అని నేనే వాయిదాలు వేస్తూ వస్తున్నాను. ఇప్పుడిక కారణాలు చెప్పలేను. చక్కగా పెళ్ళి చేసేసుకుని హనీమూనూ అదీ ఇదీ అని ఆ ఊరు ఈ ఊరు తిరిగొచ్చి ఆ తరువాత నీ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకో. ఇల్లు వాకిలీ చూసుకొని ఆ అమ్మాయినీ తీసుకొనిపోదువు. మామయ్యకు నేను వివరంగా చెప్పి ఒప్పిస్తాలే” అన్నాడు.

“కాస్త ఆగు నాన్నా! సంధ్యకి నాకు పెళ్ళేంటి? ఆ ఉద్దేశమే కాదు ఊహ కూడా నాకు ఎప్పుడూ కలుగలేదు. ఎప్పుడో ఒకసారి అలాంటి మాటలు నాకు వినపడినప్పుడు ఏదో మాటవరసకి అన్నారులే అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా ఆ భావాలు ఉన్నట్లుగా ఎప్పుడూ నాతో ప్రవర్తించలేదు. ఆమె నా కంట పడటమే చాలా అరుదు. కనీసం బావా అని పిలిచే అలవాటు, చనువు కూడా ఏర్పడలేదు. మీరిద్దరు కూడా ఈ విషయమై ప్రత్యేకంగా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా మేనరికాలు ఎవరు చేసుకుంటున్నారిప్పుడు? చిన్నప్పుడు సంధ్యని ఎత్తుకుని ఆడించాను నాన్నా!” అన్నాడు కాస్త ఆవేశంగా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here