అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ‘యుగాది’ శుభాకాంక్షలు. ‘సంచిక’ ఉగాది ప్రత్యేక సంచికకు ఆహ్వానం. ఈ ఉగాది ప్రత్యేక సంచికతో తెలుగు సాహిత్య ప్రపంచంలో మరో నూతన వెబ్ పత్రిక ప్రయాణం ఆరంభమయింది.
ఇది తొలి అడుగు. ఎంతటి సుదూరమైన ప్రయాణమయినా ఆరంభమయ్యేది మొదటి అడుగుతోనే. ‘సంచిక’ వెబ్ పత్రికను నిర్వహిస్తున్న వారమంతా ఈ సాహితీ ప్రపంచంలో సంచిక ప్రయాణం సుదీర్ఘము, సుమధురము, సాహిత్య సుగంధ భరితము అయి సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ ఇతోధికంగా మేలు చేస్తుందన్న ఆశతో, దీర్ఘకాలిక దృష్టితో అడుగులు ఆరంభిస్తున్నాము.
ఏ ప్రయాణమైనా ఒక వ్యక్తి ఆరంభిస్తాడు. అతడు నడుస్తూ ఉంటే ఆ మార్గంలో ప్రయాణించేవారు ఇతరులు అనేకులు వచ్చి కలుస్తారు. అలా వ్యక్తిగతంగా ప్రారంభమైన ప్రయాణం సామూహికమై సామాజిక ప్రయాణంగా ఎదుగుతుంది. ఈ ప్రయాణంలో అందరూ ఒకటై, అడుగు ముందుకు పడాలన్న తపనతో, తమతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్ళాలన్న లక్ష్యంతో సాగితే ప్రయాణం విజయవంతమవడమే కాదు, లక్ష్యమూ సిద్ధిస్తుంది. కాబట్టి ‘సంచిక’ వెబ్ పత్రికను ఆరంభించడం ‘కొందరి’ ప్రయత్నమే అయినా కలసికట్టుగా పత్రికను ముందుకు నడిపించడం, విజయవంతం చేయటం అన్నది రచయితలు పాఠకులు అందరూ కలిస్తేనే సాధ్యమవుతుంది. అందుకని మా ఈ ప్రయత్నంలో అందరు భాగస్వాములై ‘సంచిక’ను స్వంతం చేసుకుని సలహాలు, సూచనలతో ఉత్సాహ ప్రోత్సాహ సహాయ సహకారాలు స్వచ్ఛందంగా అందించాలని మనవి. రచయితలు తమ రచనలతో, పాఠకులు తమ నిర్మొహమాటమైన అభిప్రాయాలతో ‘సంచిక’ను సాహిత్య విపంచికగా మలచి సాహిత్య ప్రపంచంలో ‘దారిదివ్వె’గా నిలుపుతారని ఆశిస్తున్నాము.
ఈ సందర్భంగా ‘సంచిక’ పత్రిక పాలసీని ప్రస్తావించడం అసందర్భం కాదనే అనుకుంటున్నాము.
‘ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః’ అన్న ఆర్యోక్తి ‘సంచిక’ పత్రికకి మార్గదర్శక సూత్రం. ‘అన్ని వైపుల నుండీ అందే ఉన్నతమైన ఆలోచనలను ఆహ్వానించటం’ ‘సంచిక’ సూత్రం. ఏదో ఒకేరకమైన రంగుటద్దాలు ధరించి ప్రపంచాన్ని చూస్తూ, అదే సర్వ ప్రపంచమని, మాకు కనిపించిందే నిజమని, అదే సత్యమని మిగతా అంతా అసత్యం, అభాస అన్న సంకుచిత్వానికి ‘సంచిక’ దూరం. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న వేద సూత్రాన్ని అక్షరాలా ఆచరించటం, భారతీయ ధర్మంలో, జీవన విధానంలో అంతర్గతంగా, అభిన్న అంగంలా పడుగులో పేకలా మిళితమైన ఆలోచన వైశాల్యాన్ని, లౌకిక సిద్ధాంతాన్ని సాహిత్య ప్రపంచంలో ఆచరణలో పెట్టటం ‘సంచిక’ ప్రధానోద్దేశం. అన్ని రకాల ఆలోచనలకు, భావజాలాలకు, సిద్ధాంతాలకు, వాదనలకు, అభిప్రాయాలకు ‘సంచిక’ సాహిత్య వేదికగా నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే రచనాంశంపై, రచన ప్రక్రియపై, రచనా విధానంపై ఎలాంటి ‘నియంత్రణలు’ లేవు. కేవలం ఒక నియమం ఏంటంటే రచయితలు సాహిత్యపరంగానే సభ్యత పరిధులలో తమ వాదనలు, అభిప్రాయాలను ప్రకటించాల్సి ఉంటుంది. దూషణలకు, అసభ్యతలకు ‘సంచిక’ వేదిక కాదు!
అన్ని వయసుల వారికీ, అన్ని అభిరుచుల పాఠకులకు అన్నీ అందించాలన్నది ‘సంచిక’ ఆశయం. అందుకే రచయితలు తమ మేధకు పదును పెట్టి, తమ సృజనాత్మకతను వినీల విశాల విహాయసంలో విశృంఖలంగా విహరింపజేస్తూ విభిన్నమైన రచనలు, వైవిధ్యభరితంగా విశిష్టమైన రీతిలో అందించాలని ‘సంచిక’ అభ్యర్థిస్తోంది. అన్ని రకాల రచనలకు ఆహ్వానం పలుకుతోంది.
తెలుగు పత్రికా రంగంలో వినూత్నమైన ప్రయోగాలకు తెరతీస్తు, ప్రామాణికాలు ఏర్పరిచి మార్గదర్శకంగా నిలవాలన్న ప్రయత్నాలు చేస్తోంది ‘సంచిక’. ఇందులో భాగంగా ‘సంచిక’ ప్రధానంగా ‘మాస’ పత్రిక అయినప్పటికీ, కొన్ని ఫీచర్లు వారానికి; కొన్ని ఫీచర్లు పదిహేను రోజులకు ఒకసారి అప్‌లోడ్ అవుతాయి. అలాగే ప్రత్యేక సందర్భాలలో ఆయా తేదీలలో ప్రత్యేక వ్యాసాలు, కథలు, కవితలు అప్‌లోడ్ అవుతాయి. అంటే ఈ మార్చ్ 26వ తారీఖున రామనవమి సందర్బంగా మైథిలి అబ్బరాజు కథ “హరివిల్లు”, జొన్నలగడ్డ సౌదామిని కథ “రేపటి పువ్వు” అప్‌లోడ్ అవుతాయి. పాఠకులు సైతం తాము చూసిన సినిమాల గురించిన విశ్లేషణలు, తాము హాజరైన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను పంపితే వెంటనే అప్‌లోడ్ అవుతాయి.
అలాగే, వినాయక చవితికి కార్టూన్ల పోటీ; దసరాకు వచన కవిత, పద్య కవితల పోటీ; దీపావళికి కథల పోటీలు ‘సంచిక’ నిర్వహిస్తుంది. పోటీల ప్రకటన వచ్చే ‘సంచిక’లో ఉంటుంది. అయితే అన్ని ‘పోటీ’లలో రెండు రకాల బహుమతులుంటాయి. ‘సంచిక’ ఎన్నుకున్న న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచనలకు ఇచ్చే బహుమతులతో పాటు, పోటీకి వచ్చిన రచనలన్నీ పాఠకుల ముందు ఉంచడం వల్ల పాఠకులు ఉత్తమ రచనలను తమ అభిప్రాయం ప్రకారం ఎన్నుకునే వీలుంటుంది. అంటే ఒకటి న్యాయనిర్ణేతల బహుమతి, రెండు పాఠకుల బహుమతి అన్నమాట. అయితే తమ అభిప్రాయం వ్యక్తపరిచే పాఠకులు పత్రికకు విధిగా సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. ఈ రకంగా ఉత్తమ రచనల నిర్ణయం విషయంలో ఎలాంటి వాద, వివాదాలకు తావు లేకుండా పారదర్శకతను పాటించి ప్రామాణికాలను ఏర్పరచాలన్న ప్రయత్నం ఇది.
ఈ రకంగా ఎన్నెన్నో ఆశలతో, ఆశయాలతో, ఆదర్శాలతో అత్యంత ఉత్సాహంగా సాహిత్య వేదిక ‘సంచిక’ మీ ముందుకు వస్తోంది. ఈ పత్రికను పేరుకు మాత్రమే నడిపిస్తున్నది మేము. కానీ దీనికి అండగా నిలిచి, వేలు పట్టి నడిపిస్తూ, నిలబెట్టే బాధ్యత మీదే. ‘సంచిక’ను విజయవంతం చేసే బాధ్యత మన అందరిదీ.
– సంపాదక బృందం
కస్తూరి మురళీ కృష్ణ
కనకప్రసాద్ బైరాజు
లంకా నాగరాజు
భాను ప్రకాష్ గౌడ
సలీం
వర్చస్వి
పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు