ఉగాది మళ్ళీ వచ్చింది

    2
    5

    [box type=’note’ fontsize=’16’]పసిపిల్లల సున్నితమైన మనస్సులలోని మృదుత్వాన్ని హృద్యంగా ప్రదర్శించిన కథ “ఉగాది మళ్ళీ వచ్చింది”.
    [/box]

    ఉగాది కారు వరకు నడిచి, డోర్ తీస్కొని లోపల కాలు పెట్టే లోపు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. వెనుక నవ్వుతూ అమ్మా, చిన్ని తమ్ముడు నవ్వుతూ చూస్తున్నారు.

    “వాడికి ఈ అక్క ఎక్కడికి వెళ్తుందో తెలియదు, రోజులాగే నాన్నతో కలిసి ఎక్కడికో వెళ్తోందనుకుంటున్నాడు. అమ్మ ప్రోత్సాహకరంగా చూస్తోంది. కారులో నాన్న గారు వెనుక సీట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. ముందర డ్రైవర్ తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రెడీ గా ఉన్నాడు బండి నడపడానికి…అందరికీ సమ్మతమే నేను ఈ బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వడం. అందరికీ ఆనందాన్ని కలిగించే విషయమయినప్పుడు, నాకు ఆనందమే”… అని ఒకసారి గట్ట్టిగా ఊపిరి తీసుకొని ముఖంలో ఆనందాల చిరుజల్లు నింపుకొని హాయిగా చెయ్యి వూపి టాటా చెప్పి కారులో కూర్చొంది ఉగాది.

    “నీ అడ్మిషన్ అయిపోయిన వెంటనే ఈ శనివారమే నేనూ తమ్ముడూ అందరం కలిసొస్తాం, మరి నీ స్కూల్ అంతా చూపించాలి మాకు..” అని అంటున్నది అమ్మ పార్వతమ్మ.

    ఆ మాటకు ఉష వెంటనే స్కూల్ ధ్యానం లో పడిపోయింది, తన క్రొత్త స్కూల్ ఎలా ఉంటుందో…ఏమేమి చూపించాలో అమ్మకీ, తమ్ముడికీ వాళ్ళొచ్చాక అని మనసులో అనుకుంటూ… కారులోంచి చెయ్యి ఊపుతూ ఆనందంగా ‘అలాగే’ అన్నట్లు తలకూడా ఊపింది.

    కారు కదిలి వెళ్ళిపోయాక పార్వతమ్మ లోపలికి వచ్చేసింది కొడుకుని తీసుకొని. మిగితా పరిచారికా బృందం కూడా మౌనం గా నడిచారు లోపలకు. వాళ్ళల్లో పెద్దదయిన కొండమ్మ…

    “పార్వతమ్మా…అంటున్నానని కాదు గానీ, పాపగారిని అంత దూరం పంపారు. ఇక్కడలేవా అమ్మా స్కూళ్ళు? మనమధ్య ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన పిల్ల”..అంటూ బాధగా మౌనం వహించింది.

    “లేదు కొండమ్మా… అలాగని కాదు. ఇది బోర్డింగ్ స్కూల్”
    “అంటే ఏంటమ్మా?”
    “అక్కడే ఉండి చదువుకుంటారు కొండమ్మా ఒకనాటి గురుకులం లాగ. దీనివల్ల పిల్లలు బాధ్యతాయుతంగా, ఎవరిమీదా ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా పెరుగుతారు. చదువుతోపాటు క్రమశిక్షణను కూడ నేర్చుకుంటారు. జీవితంలో వచ్చే ఏ సమస్యలకయినా ధైర్యం గా ఎదుర్కొనడానికి ముందుంటారు, పెద్దయ్యాక ధైర్యవంతులుగా, మంచి వ్యక్తులుగా ఉంటారు.. అక్కడి టీచర్స్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని అలా తీర్చి దిద్దుతారు”…
    “మనం నేర్పలేమా అమ్మా?”
    నవ్వింది, పార్వతమ్మ.
    “లేదు కొండమ్మా. మన పిల్లల మీద మనం కఠినత్వాన్ని చూపలేము, వాళ్ళు కాస్త ఏడిస్తే మనం నీరుగారిపోతాం. ఎప్పుడూ మనం వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాము కాబట్టి, వాళ్ళు ఎప్పుడూ అదే నేర్చుకుంటారు. ఎప్పుడో ప్రపంచంలో పడ్డాక గానీ, కష్ఠం సుఖం తెలియదు. ఆ కష్ఠానికి ధైర్యం లేక విల విల్లాడితేనో…”అంటూ … కలవరపడింది పార్వతమ్మ. అ కలవరపాటు ఆమె మొహంలో ప్రస్పుటంగా కనబడింది కొండమ్మకు.

    తల్లి దశలో అపురూపమయిన ఆలోచనలు పిల్లలయందు తప్పవు ప్రతి తల్లికీ. ఈ యమ్మదొక ఆలోచన తన పిల్లలకోసం. చాలా దూరదృష్ఠితో ఆలోచిస్తున్నారు భార్యాభర్తిలిద్దరు. ఈ ఆలోచనా కూడా కరక్టే… అని స్వగతంగా అనుకుంటూ …

    “అలాగేలేమ్మా… పెద్దవారు మీకు తెలియనివేముంటాయి?” అని అన్నది.
    “అంతేకాదు కొండమ్మా … ఆ స్కూల్ ఎంత ప్రశాంత వాతావరణంలో ఉంటుందనుకున్నావ్? చుట్టూ ప్రకృతే, అందమైన కొండలు, మధ్య మధ్యలో పూల వనాల్లాంటి పార్కులు, విహార యాత్రలు…గవర్నె మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే…” అంటూ అలా చెప్పుకుపోతోంది పార్వతమ్మ. అక్కడే ఉన్న ఆవిడ తమ్ముడు కాళి…

    “అవునవును… కూతురు వనకన్య అయ్యి పువ్వులు, పాదులూ చుట్టుకొని తిరుగుతూ వస్తుంది…మీ సౌందర్య ఆరాధనేమో గానీ, అది మాత్రం ఏ అశ్వినీ దేవతలానో తిరిగొచ్చేటట్లుంది” అని చలోక్తులు విసిరాడు.

    దానికి అందరూ గొల్లున నవ్వారు. అందరూ ఎందుకు నవ్వుతున్నారో తెలియకపోయినా చిన్నోడు కూడా ఆ నవ్వుల సందడిలో తన వంతూ సందడి చేశాడు.

    “ఎంత దూరం, 100 మైళ్ళు. మనమీ చిత్తూరులో ఉన్నంత వరకూ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళమవుతాము, మళ్ళీ ఈయనకు ఎక్కడకి ట్రాన్స్ఫర్ అవుతుందో… జిల్లా కలెక్టర్లని ఒక్క దగ్గిర ఉంచుతారా? ఈ తిరగడాలు మానేసి మేమే ఒక దగ్గిర ఉండిపోవాలి పిల్లల చదువులు పాడవకుండా ఈ తిరుగులాటలో…” అని అంటూ ఆవిడ లేచి వెళ్ళిపోయింది.

    మిగితావారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు.
    ************************
    *రిషీ వ్యాలీ స్కూల్*
    బాణం గుర్తు తో ఒక బోర్డ్ మీద వ్రాసి ఉంది. అది ఆ స్కూలు ఎటు ప్రక్క ఉందో మార్గాన్ని సూచిస్తోంది.
    కారు దాని ప్రకారమే కుడి వైపుకు తిరిగి కొండెక్కుతోంది. ఉగాది కారు విండో అద్దాన్ని క్రిందికి దించి…ముఖాన్ని కాస్త బయట పెట్టి, ఆ చల్లటి కొండ గాలిని ఆశ్వాదిస్తున్నది. కొండెక్కుతుంటే తాము అప్పటివరకూ దాటి వచ్చిన పల్లెటూళ్ళన్నీ కొండ క్రింద చిన్నవి గా కనిపిస్తున్నాయి, మధ్య మధ్యలో పూల వనాలు వాటికి రంగులను ఆపాదిస్తూ…ఒక అందమైన కాన్వాస్ చిత్రంలా ఆమె మనసులో ముద్రింపబడింది.

    “అబ్బా…ఎంత బాగుందో! ఈ ప్లేస్ కి తీసుకొచ్చి…అమ్మా, తమ్ముడికి ఇదంతా ఇలాగే చూపించాలి”…అని అనుకొన్నది ఉగాది.

    స్కూలు లోపలకెళ్ళాక… ప్రిన్సిపల్ మరియు ఇతర సిబ్బంది…సాదరంగా ఆహ్వానించారు వీళ్ళని. ఉగాది ప్రిన్సిపల్ గారి ఆఫీసులో వేసున్న పెద్ద బెంచీ మీద కూర్చొని బయట విండోలోంచి ప్రకృతి అందాలను చూస్తోంది… మధ్య మధ్యలో వాళ్ళ మాటలు తన చెవిన పడుతున్నాయి.

    “మదనపల్లె …దీనిప్రక్కనే ఉన్నాది, జిడ్డు కృష్ణమూర్తి గారి జన్మస్థలం. మహా తత్వవేత్త. ఆయన స్పూర్తితోనే ఈ స్కూల్ నడపబడుతోంది. ఆయన స్పూర్తినే పిల్లలకు ఎడ్యుకేషన్ రూపంలో, క్రమశిక్షణ రూపంలో వారి మానసిక పరిణితులను పెంచే విధంగా ఇక్కడి కరిక్యులం తయారు చెయ్యబడింది”… అంటూ ప్రిన్సిపల్ గారు చెప్పుకుపోతున్నారు.

    ఉగాదికి తత్వవేత్త అంటే తెలియలేదు. తెలుసుకోవాలనీ అనుకోలేదు…ఎందుకంటే ఇంతలో ఆమె దృష్ఠిని ప్రక్కత్రోవ పట్టిస్తూ ఒక అందాల రంగుల పిట్ట…”పీచ్ పీచ్” అని అరుచుకుంటూ దూసుకుపోయింది. దాని వెంటే ఉగాది మనసూ వెళ్ళిపోయింది.
    స్కూల్ జాయినింగు ఐపోయింది, ప్రిన్సిపల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి నాన్నగారు, డ్రైవర్ వెళ్ళిపోయారు… ఉగాది ని జాగ్రత్తగా స్కూలు వారికి అప్పజెప్పి. స్కూల్ టీచర్ మిస్. సునంద ఉగాదిని తనతో తీసుకొని మొదట హాస్టల్ రూం కి వెళ్ళింది. అక్కడా కొంతమంది పిల్లలు అందంగా నవ్వుతూ… లేచి నిలబడి… “గుడ్ ఈవినింగ్ టీచర్” అంటూ మిస్. సునంద ను గ్రీట్ చేశారు. అంతే అందంగా నవ్వుతూ మిస్. సునంద తిరిగి పిల్లల్కి గుడ్ ఈవినింగ్ చెప్పారు. అలా అందరినీ దాటుకొని … ఒక కాటేజ్ లాంటి అందమైన తన నివాసానికి వెళ్ళింది ఉగాది, మిస్. సునంద చెయ్యి పట్టుకొని.

    “ఉగాదీ…అమ్మ గుర్తొస్తున్నదా?”… అడిగింది సునంద.
    “ఊ..అని తలవూపి, మళ్ళీ వెంటనే అడ్డంగా తల త్రిప్పి…లేదు టీచర్, అమ్మా, తమ్ముడు ఈ సాటర్ డే వస్తారు గా, నేను వాళ్ళకి కొండ క్రింద విలేజెస్, ఫ్లవర్స్ చూపిస్తాను” అన్నది మెరిసే కళ్ళతో.

    సునంద… హాయిగా నవ్వేస్తూ.. ఫర్వాలేదు. పాప ఇక్కడ ఉండడానికి మానసికం గా ప్రిపేర్ చేసే తీసుకొచ్చారు పెద్దలు” అనుకొని మెల్లగా ఉగాది తో కబుర్లలో పడిపోయింది సునంద.

    ఉగాది తను దారిలో చూసిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పింది సునందకు.

    “ఉగాది కి మంచి మెమొరీ పవరుంది, పైగా చూసినది తన బ్రెయిన్ లో ఎట్టి కన్ ఫ్యూజన్ లేకుండా దేన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అలాగే అర్ధం చేసుకుంటున్నది. చదువుకి ప్రాబ్లం లేదు” అని ఉగాదిని ఆసాంతం అంచనా వేసుకున్నది. ఆ వింగ్ వైపున్న పిల్లలది బాధ్యతంతా సునందదే. సునంద గ్రూప్లోనే ఉగాది ఉన్నది.

    అప్పుడే సునంద దగ్గరకి ఒక అమ్మాయి వచ్చింది, ఆమే “మెహమూనా”. ఉగాది కి పరిచయం చేసింది మెహమూనా ని సునంద. అలాగే మెహమూనా కి చెప్పింది సునంద….

    “ఈ పాప పేరు ఉగాది. నీలాగే అయిదవ తరగతి చదవడానికి ఇక్కడికొచ్చింది. నీ క్లాసే కూడా. మరి ఉగాది కి ఫ్రెండ్ వి అవుతావా?” అని మృదువుగా అడిగింది మెహమూనా ని.

    మెహమూనా అంతే మృదువు గా “ఓ… అలాగే టీచర్”… అంటూ ఉగాది ప్రక్కకొచ్చి కూర్చున్నది. వాళ్ళిద్దరినీ అక్కడ వదిలి సునంద… మరో వైపుకు బయలుదేరింది.

    ఒక్క పది నిమిషాల్లో పిల్లలిద్దరూ స్నేహితులయిపోయారు. ఇద్దరు మెట్లు దిగి పరిగెత్తుకొని తోటలోకి వెళ్ళారు. ఇద్దరినీ ఒక్కసారిగా అబ్బురపరిచే దృశ్యం … కనబడగానే అక్కడికి చేరుకున్నారు.
    పారిజాత వృక్షం. చక్కని నిటారయిన బోదె, దాని పైన గుబురు గుబురు ఆకులతో ఒక పచ్చని టోపీలా అమర్చిన కొమ్మలు. వాటి రెమ్మలనుండి గుత్తులు గుత్తులు గా పారిజాతాలు!… పరిమళాలను అద్దుతూ వీచే గాలికి. పైనుండి చల్లని పండు వెన్నెల కూడా పారిజాతాల రంగుకు తీసిపోలేదు. పారిజాతాలతో పోటీపడుతూ వెన్నెల విరగబోస్తోంది. వెన్నెల అందం తోడయి పారిజాతాలకు మరింత వన్నె వచ్చింది. అదే వన్నె భూమినీ పరుచుకున్నది. ఆల్చిప్పల్లాంటి ఉగాది కళ్ళు భూమిపై పరుచుకొని ఉన్న వెన్నెల వన్నెల పారిజాతాలపై నిలిచింది.
    “మెహమూ…చూడు ఈ పువ్వులు ఎంతా బాగున్నాయో”
    “అవును కదా. ఉగాదీ..వీటి కాడలు ఎర్రగా ఎంత బాగున్నాయో?”
    అంటూ పిల్లలిద్దరూ క్రిందనున్న పూలను కొన్ని ఏరుకొని ఒళ్ళో వేసుకొని ఆ వృక్షం క్రింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఆ పూలను చూసుకొంటూ మురిసిపోతున్నారు. అక్కడే అలా కూర్చొని ఆ బెంచ్ చుట్టూ పరిగెడుతూ, నవ్వుతూ ఆనందించారు. వారికి మరో లోకమే గుర్తురాలేదు. వాళ్ళ అనందాల నవ్వులతో పారిజాత చెట్టు కూడా వంత కలిపింది. వీళ్ళు కిల కిలా నవ్వినప్పుడు కొమ్మలు ఊగుతూ జల జలా పారిజాతాలను వారిమీద గుమ్మరించేవి. అలా వీళ్ళద్దరికీ, ఆ పారిజాత వృక్షానికి స్నేహం కుదిరిపోయింది. ముగ్గురి స్నేహం గుబాళించింది.

    అప్పటినుండి ఉగాదీ, మెహమూ ఒకరంటే ఒకరు ప్రాణంగా మెలిగారు. మిస్. సునంద పర్యవేక్షణలో ప్రొద్దున్నే ఇద్దరూ జంటగా అయిదింటికి లేచే వారు, కాల కృత్యాలు అయ్యాక బ్రేక్ ఫాస్ట్, ఆపై యూనిఫాం ధరించి ఆయా కోసం రెడీ ఉండేవారు, ఆవిడ రావడానికి ముందే. ఇదంతా ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు ఒక లోకంలా చేసుకుంటూ పోయేవారు. మిగితా పిల్లలకు వెనుక పడాల్సినట్లుగా వీరిద్దరి వెనుక పడవలసిన అవసరం ఉండేది కాదు ఆయాకు గాని, సునందకు గాని. అంతా జంటగా చేసేవారు, ఒకరు ఒక పని మొదలు పెడితే, మరొకరు దాన్ని ఫాలో అయిపోయేవారు. ఆ తర్వాత క్లాస్ కి రెడీ, తిరిగి వచ్చాక హోం వర్క్ ఆపై కాస్త ఆటలు మళ్ళీ పారిజాతాలు. ఇదే రొటీను వాళ్ళిద్దరిదీ. సునందకు కూడా ముచ్చటేసేది. మిగితా పిల్లలకి ప్రకృతి రమణీయత గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ వీళ్ళిద్దరూ ఎక్కెడెక్కడో పుట్టి వచ్చినా అభిరుచులు సమానం. అవగాహన సమానం. ఒకరియందు ఒకరంటే బాధ్యత గా కూడా ఉండేవారు. కొన్ని రోజులకు సునంద కూడా వీళ్లలో ఒకతె అయిపోయింది. సున్నందతో కలిపి ఇప్పుడు నలుగురు స్నేహితులు.

    ఇలా రెండేళ్ళు గడిచింది. పిల్లలిద్దరూ ఏడవ తరగతి పరీక్షలు వ్రాశారు. ఆ పరీక్షలయున వెంటనే ఉగాది వాళ్ళ ఫాదర్ కి మరో జిల్లాకి ట్రాన్స్ ఫర్. పరీక్షలయ్యాక ఉగాది, మెహమూ ఇక పిల్లలందరూ వారి వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు. మెహమూ, ఉగాది అయితే పారిజాతాలకు టాటాలు చెప్పీ, చెప్పీ మళ్ళీ కలుస్తామని మాటిచ్చి ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. బోర్డింగ్ స్కూలంతా ఖాళీ.
    ***************************************
    శెలవుల్లో మెల్లగా తెలిసింది ఉగాదికి, ఇక తాను ఆ స్కూలుకి వెళ్ళబోనని. కించిత్తు బాధకలిగినా ఒక పెద్ద ఆశ. కొత్త స్కూలుకి అప్పుడప్పుడు శెలవులొస్తే … తనని రెషీ వ్యాలీ కి ఇంట్లో తీసుకెళ్తారనీ, అప్పుడు తాను మెహమూ ని, ఇతర ఫ్రెండ్స్ ని చూస్తానని. ఎందుకంటే తాను ఎంతో ఇష్ఠపడే స్కూల్ వాతావరణాన్ని, ఫ్రెండ్స్ ని ఎప్పుడూ మర్చిపోవద్దు…చిన్ననాటి ఫ్రెండ్స్ ఎప్పుడూ చిరకాల ఫ్రెండ్స్, ఆ స్నేహం ఎన్నాళ్ళయినా మనతో నే ఉంటుందని అమ్మ చెప్పింది అంతే కాదు సునందా టీచర్ కూడా అంటుండేది.

    అంతే కాకుండా ఉగాది మనసు ఆమె తోడి పిల్లలతో పోలిస్తే కాస్త భిన్నమైనది. క్రొత్త స్కూల్ కి వెళ్ళిపోవాలి, ఇక పాత ఫ్రెండ్స్ ని కలవబోనని తెలిసినా ఉగాది వంటరితనం గానీ, నిరాసక్తత గానీ చూపించలేదు. తన స్నేహం మీద తనకు అపార నమ్మకం, గౌరవం. ఇది ఒకరు నేర్పినది కాదు….మెహమూ తో నిరంతర స్నేహభావన తాను దూరంగా ఉన్నా, అలాగే సునందా టీచర్ తో మరియు వెండి వెన్నెల పారిజాత చెట్టుతో. ఆమెలో ఒక తత్వవేత్త ఉన్నాడు. నిరంతర స్నెహ భావన కొనసాగుతూనే ఉండడం వల్ల తనకు మెహమూ దూరమయ్యిందన్న భావనే రాలేదు, తనని రేపో మాపో చూడడానికి వెళ్తానన్న భావనే.

    ఈలోపుల ఉగాది వాళ్ళు క్రొత్త ఊరికి వెళ్ళిపోయారు. ఉగాది నాన్నగారు టీ.సీ. తీసుకురావడానికి రిషి వ్యాలీ ఒకసారి మళ్ళీ వెళ్ళారు, అప్పుడే స్కూల్ ఓపెన్ చేశారు. మెహమూ ని చూసి రమ్మని మరీ మరీ చెప్పింది తండ్రికి. టీ.సీ తీసుకున్నాక మెహమూని చూపించమని అడిగారు. అప్పుడు ఒక షాకింగ్ న్యూస్.
    శెలవుల్లో మెహమూ చనిపోయింది ఏదో జబ్బు చేసి హటాత్మరణం అని. ఈ వార్త భరించలేక ఇక అక్కడ ఉద్యోగం చెయ్యలేక సునందా టీచర్ రిజైన్ చేసేసింది అని.

    అదీ… మనసుని పిండేసే వార్త. భారమయిన గుండె తో అక్కడినుండి కదిలారు ఉగాది తండ్రి. ఈ వార్తను ఎలా చెప్పాలి ఉగాది కి? వెళ్ళగానే అడుగుతుంది నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? … ఇలా ఎన్నో ప్రశ్నలు. మెల్లగా నిజమే చెబుదామని నిర్ణయించుకున్నారు.

    కారు తిరుగుముఖం పట్టింది. ఇంటిముందు కారు దిగేసరికి రాత్రి అయ్యింది, పిల్లలందరూ నిద్రపోతున్నారు. ఆ రోజు గడిచిపోయింది. అక్కడ జరిగిన విషయాలూ, మెహమూనా విషయాలు అన్నీ పార్వతమ్మకు పూస గుచ్చినట్లు చెప్పారు. పాపం ఆవిడ కూడా అవాక్కయి …మెల్లగా చెబుదాములే మెహమూ గురించి ఉగాది కి అని అనుకున్నారు.

    ఉగాది లేచాక … తండ్రిని చూసింది.. కానీ ఎందుకో అడగలేదు.. తన పని తాను చేసుకుపోతున్నది. అలా రోజులు గడిచాయి. ఒకసారి హటాత్తుగా ఉగాది, మెహమూ గురించి తల్లితో చెప్పనారంభించింది, అలనాటి పాత స్కూలు ముచ్చట్లు. అప్పుడు పార్వతమ్మ …
    “ఉగాదీ… మెహమూనా గుర్తుందా ఇంకా?”
    “ఓ ..ఎలా మర్చిపోతాను? షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్”
    “ఉగాదీ …మెహమూనా కి ఏదో జబ్బు చేసినదట. మీ ప్రిన్సిపల్ చెప్పారు” అని అంటూ ఆగి ఉగాది మొహం లోకి చూసింది.
    ఉగాది కాస్త భృకుటి ముడివేసి “ఏమయ్యింది అమ్మా” అని అడిగింది.
    ” తెలీదటమ్మా… వాళ్ళ పేరెంట్స్ ఏమీ చెప్పలేదుట. పాపం మెహమూనా దేవుడి దగ్గిరకెళ్ళిపోయిందిట”
    అర్ధం కాలేదు ఉగాదికి. ప్రశార్ధకపు ముఖం పెట్టింది.
    “అదేంటమ్మా అలా అంటావ్?”
    “అవునురా .. మెహమూనా ఇక లేదు, చనిపోయిందిట” అని మెల్లగా చెప్పారు.
    ఉగాది ఆ మాటకు బాహాటంగా బాధపడలేదు, భీతి చెందలేదు ఫ్రెండ్ చనిపోయిందని.
    పార్వతమ్మకు అర్ధం కాలేదు. క్రొత్త పిల్లలతో పడిపోయినదని అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.
    కానీ ఉగాది మెల్ల మెల్లగా స్కూల్లో ఆటలకు, తమ్ముడితో ఆటపాటలకు తనని తాను దూరం చేసుకొన్నది. ఎలాగూ హైస్కూలు పిల్ల అయ్యి ఎదిగింది కదా, చదువు ఎక్కువయ్యి ఆటలు తగ్గించినది అని అనుకున్నారు.
    తమ్ముడికి అక్క మీద అసంతృప్తి మొదలయ్యింది. ఆమె ఆడటం లేదనీ, వీడు ఎంత పిలిచినా నిరాసక్తంగా ఉంటుందనీ… పిలిచీ పిలిచీ..వాడికి ఎలా తన అసంతృప్తిని బయట పెట్టాలో తెలియక..అక్కని కొట్టడం మొదలెట్టాడు. ఉగాది ఏడవడం మొదలు పెడుతోంది. ఇద్దరూ చిన్న చిన్న విషయాల మీద కూడా సఖ్యత లేకుండా తయారయ్యారు. వాడి బాధ ఒకలా ఉంది, ఉగాది మనస్తాపం మరోలా ఉంది. ఎట్టకేలకు ఇదంతా … తల్లికి అర్ధమయ్యింది. మిగితా అందరూ పిల్లలు కదా అని కొట్టిపడేస్తున్నారు గాని.

    “ఉగాదీ… ఎందుకమ్మా ఈ మధ్య అంత ఏడుస్తున్నావ్? పాత స్కూల్ గుర్తొస్తున్నదా? పోనీ వెళ్దామా ఒకసారీ?”
    అనగానే … తల్లి మీద వాలిపోయి బావురుమన్నది ఉగాది.
    పార్వతమ్మ కంగారు పడ్డారు. “ఏంటమ్మా? ఏం జరిగింది?”
    “మనం స్కూల్ కి వెళ్ళొద్దమ్మా… మెహమూనా దూరమయినట్లే నాకు మిగితా ఫ్రెండ్స్ కూడా ఉండరు” అని వెక్కి వెక్కి ఏదవడం మొదలు పెట్టింది.
    “ఏంటి తల్లీ… ఆ మాటలు?”
    “అవునమ్మా… మెహమూనా చనిపోయింది కదా. అందుకే నాకు భయమేస్తున్నది, తమ్ముడితో ఆడుకోవడంలేదు అందుకే”…అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
    వెంటనే ఉగాదిని దగ్గిరకి తీసుకొని కాసేపు అలా ఉండిపోయారు… ఆమె అపార్ధాన్ని, అభ్యంతరాన్ని, బాధని అర్ధం చేసుకున్నారు పార్వతమ్మ గారు. చాలాసేపు ఉగాదిని అలాగే ఏడ్వనిచ్చి…స్థిమిత పడ్డాక… అప్పుడు చెప్పడం ప్రారంభించారు.

    “నీ పేరేంటి?”
    “ఉగాది”
    “హు…ఉగాది ముందు వచ్చేది ఏ ఋతువు?”
    “శిశిర ఋతువు మమ్మీ”
    “శిశిర ఋతువు అని నీకెలా తెలుసు?
    “ఆకులన్నీ రాలుతాయి కదా మమ్మీ”
    “తరువాతి ఋతువేంటి?”
    “వసంతం” అంటూ తల్లి మొహంలోకి చూసింది ఉగాది.
    “హూ… వసంతంలో ఏం జరుగుతుంది నాన్నా?”
    “మళ్ళీ ఆకులు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి.. చాలా పిచ్చుకలు, చిలుకలు, పిట్టాలు”… అంటూ పాత స్కూల్ ప్రకృతి రమణీయతను వర్ణించడంలో పడిపోయింది.
    “హా…అంటే రాలిపోయిన ఆకులు, పువ్వులూ మళ్ళీ చెట్లకు చిగురించాయి, పువ్వులు పూసాయి. అలా క్రొత్తవి వచ్చాయని చెప్పేదే ఉగాది. ఉగాది వచ్చిందని లోకానికి చెప్పేదీ …
    అనగానే … మళ్ళీ ప్రకృతి తన్మయత్వంలో పడిపోయి … “కోయిలా”..అన్నీ నవ్వుతూ గట్టిగా చెప్పింది.
    “అలాగే … మెహమూ కూడా..” అని ఆగారు పార్వతమ్మ.. కూతురి మొహం లోకి చూస్తూ.
    ఆ మాటకు కాస్త ఆశ్చర్యం, కాస్త ఆర్ద్రత నిండిపోయాయి ఉగాది కళ్ళల్లో, అది చూసి పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
    “అవునమ్మా… ప్రకృతే మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ప్రకృతిలోని దశలు మానవ దశలకు చాలా దగ్గిరగా కనబడతాయి. శిశిరం పోయి వసంతం చిగురించినట్లే మెహమూ కూడా మళ్ళీ పుడుతుంది” అన్నారు.
    “నిజమా?” అంటూ అనందాన్ని ప్రకటించింది.
    “అలా ఎప్పుడు జరుగుతుంది మమ్మీ?”
    “ఆల్రెడీ జరిగిపోయింది”
    “అవునా? ఎలా? ఎక్కడ?”
    “నీతోనే…నీలోనే… నువ్వు ఉగాదివి కదా?”
    “అంటే?”
    “నీ జ్ఞాపకాలలో మెహమూ మళ్ళీ చిగురించింది. ఉగాదిగా ఆమె జ్ఞాపకాలకు పునర్జన్మనిచ్చావు”
    అలా అనగానే … ఉగాది కి చాలా సంతోషమేసింది. క్రొత్తగా అనిపించింది.
    “అవును ఉగాది… నిరంతరమయిన నీ స్నేహంలో మెహమూ కి నిష్క్రమణే లేదు. లే… ఇక మదన పడకు. ఈ ఉగాది వసంతం ఎప్పుడూ చిగురించేదీ, పూయించేదే తప్పా…ముకుళించేది కాదు” … అని కూతురిని దగ్గిరకు తీసుకొని ముద్దు పెట్టుకొన్నది తల్లి.
    ఆ మాటలు విన్నాక శిశిరం వెళ్ళి వసంతంలా రావడమే మానవదశ, అదే చేస్తోంది మెహమూ అనే ఒక భావన్లో పడిపోయింది ఉగాది … హు…అది అంత తేలికా లేదా కష్ఠతరమానటువంటి ఆలోచనకు తావే లేని పసిమనస్సు మాత్రం కుదుట పడింది… తమ్ముడితో ఆటపాటల్లో నిమగ్నమయ్యింది. (సమాప్తం)

    -శ్రీ సత్య ్గగౌతమి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here