తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు – 14: ఉమాపతి పద్మనాభ శర్మ

0
4

[box type=’note’ fontsize=’16’] “ఉమాపతి పద్మనాభశర్మ ఎన్ని కథలు రాశారో స్పష్టంగా తెలియడం లేదు. దొరికిన ఐదు కథల ద్వారా, కథకుడిగా శర్మగారి విశిష్టతను తెలుసుకుందాం” అంటున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

[dropcap]ఉ[/dropcap]మాపతి పద్మనాభశర్మ మెదక్ జిల్లా సిద్థిపేటలో 1936లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగినవారు. ప్రాంతీయ దేశ్య పద నిఘంటువు తయారుచేశారు. ‘తేజోవల్లరి’, ‘దేవీ మానస పూజ’ అనే పద్య కవిత్వం, ‘ఋతచేతన’ వచన కవిత్వా సంపుటాలను వెలువరించారు. 60వ దశకంలో మధ్యతరగతి మనస్తత్వాలను ప్రతిభింబించే చక్కని కథలెన్నో రచించారు. కథల సంపుటి వేసుకోవాలన్న ఆసక్తి రచయితకు లేకపోవడం వల్లా, వారి తదనంతరం వారి కుటుంబసభ్యులు పట్టించుకోకపోవడం వల్ల, వారు ఎన్ని కథలు రాశారో స్పష్టంగా తెలియడం లేదు. దొరికిన ఐదు కథల ద్వారా, కథకుడిగా శర్మగారి విశిష్టతను తెలుసుకుందాం.

‘మరపురాని వసంత’ కథలో యం.యస్.సి చదువుతూ, భార్యతో నగరంలో కాపురం పెట్టిన విద్యార్థి కృష్ణమూర్తి. ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్ళగా, ఆమె మీది బెంగతో చదువుమీద శ్రద్థ పెట్టలేకపోతాడు. ఆ ఇంట్లో యజమాని భార్య అయిన అందాల వసంతపై మనసు పారేసుకుంటాడు. ఒక వాన కురుస్తున్న రాత్రి ఎవరూ లేని సమయంలో, ఆమె గదిలోకి వెళ్ళి ఆమెను రేప్ చేసి పారిపోతాడు. అది జరిగిన పదకొండేళ్ళ తర్వాత, ఒక బుడబుక్కలవాడు జోతిష్యం పేరిట ఆ సంఘటన చెప్పడంతో, జ్యోతిషం మీద నమ్మకం పెంచుకుంటాడు. కొసమెరుపు ఏమిటంటే, ఆ బుడబుక్కలవాడు మారువేషంలో వచ్చిన వసంత మొగుడు రామనాథం కావడం. కృష్ణమూర్తి 11ఏళ్ళ కిందట వసంతను రేప్ చేయడానికి వెళుతూ డైరీ పట్టుకుని వెళ్ళడం ఏమిటి? అది చదివి వసంత మొగుడు బుడబుక్కలవాని వేషంలో ఇప్పుడు రావడం ఏమిటి? ఆ విషయం చెప్పి సాధించేదేమిటో అర్థం కాదు. పాఠకుడ్ని ఆశ్చర్యపరచే ఉద్దేశంతో ఈ కథ వ్రాసి వుంటారు.

“ఎంత బాగుంది చూచావురా వసుంధరా” అని తను చదివిన వసుంధర నవల గురించి వరదరాజులు తన మిత్రుడితో చెప్పడం విన్న క్లాసుమేట్ వసుంధర, తననే వేళాకోళం చేస్తున్నారని భావించి వారిని తిట్టిపోస్తుంది. తర్వాత నిజం తెలుసుకుని క్షమాపణ చెప్పుకోవడం ‘వరద రాజకీయం’లో చూడవచ్చు. ‘చంక్రమణం’లో లక్షాధికారి కూతురు రేఖ, బీదవాడైన తన ట్యూషన్ మేష్టారైన సత్యమూర్తిని ప్రేమిస్తుంది. మేనరికం వల్ల ఆమెకు కృష్ణమూర్తి పెళ్ళాం అనే ముద్ర పడిపోతుంది. తనను ఇష్టపడే కృష్ణమూర్తి తనకు నచ్చడు. తను అభిమానించే సత్యమూర్తి తనను పట్టించుకోడు. ఒక రాత్రి రేఖ ఇంట్లో నగలు దొంగతనం చేస్తూ సత్యమూర్తి దొరికిపోతాడు. అప్పుడు తన కథ చెపుతాడు. ధనవంతుల అమ్మాయి మాధురిని ప్రేమించానని బీదవాడ్ని కావడంతో ఆమె తిరస్కరించిందనీ, ధనవంతుడ్ని కావడానికి ఈ దొంగతనం చేశానని చెబుతాడు. ఆమెకు ఏం చేయాలో తోచదు. తాను సత్యమూర్తిని – మాధురి, కృష్ణమూర్తిని ప్రేమిస్తేగాని ఆ కథకు ముగింపు లేదని భావిస్తుంది. ఇది అయ్యేపనేనా అని ఆమె ఆలోచనకు రాదు. ఇంకో కథలో బస్టాండ్‍లో కనిపించిన కాలేజీ అమ్మాయి అరుణపై మనసు పారేసుకుంటాడు సుబ్బారావు. ఇద్దరి మధ్యగల అపోహలు వారు వారు రాసిన కథల వల్ల సమసిపోయి, వారు స్నేహితులైనారని ‘అరుణరాగం’ తెలియజేస్తుంది.

మైసయ్య గండాయి పాలెంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ‘మంత్రాల మైసయ్య’ అనే పేరుతో కొరకరాని కొయ్యగా తయారవుతాడు. చిన్నాచితకా వైద్యాలతో పాటు మంత్రతంత్రాలతో రోగాలు కుదురుస్తాడు. దయ్యాలను వదిలిస్తాడు. మైసయ్య కళ్ళు మంచివి కావని ఆ ఊళ్ళో ఒక్క రత్తికి తప్ప అందరికీ తెలుసు. ఆడి పేరు వినపడ్డా, ఆడు కనబడ్డా ముఖ్యంగా ఆడపిల్లలు భయపడి దాక్కుంటారు. వయసు పొంతంతో నిగనిగలాడుతున్న రత్తిని చూసి మైసయ్య చేయి వేయబోతాడు. కోపగించిన రత్తి వాడి దవడ పగలగొట్టి తిట్టిపోతుంది. ఆ అవమానాన్ని భరించలేక మైసయ్య ప్రతీకారం కోసం ఎదురుచూస్తూంటాడు. మైసయ్య వాడి ఆగడాల గురించి తెలుసుకున్న రత్తికి భయంతో జ్వరం వస్తుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడటంతో దయ్యం పట్టిందనీ, దానికి కారణం మైసయ్యేనని ఊరివాళ్ళు అనుకుంటారు. ఒక రాత్రి చీకటిలో వెంకయ్య, గుడిసెలోకి ప్రవేశించిన మైసయ్య మీదకు, అరుస్తూ హఠాత్తుగా రత్తి వాడి మీద దూకేసరికి, వాడు గుండె ఆగి చచ్చిపోతాడు. అలా ఆ ఊరికి మైసయ్య పీడ వదలిపోతుంది. అందర్ని హడలగొట్టే మైసయ్య తానే భయపడి చనిపోవడం ఆ కథకు కొసమెరుపు.

ఇందులోని మొదట నాలుగు కథలు కాలేజీ చదువులు, యువతీ యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణలు – ప్రేమల గురించి తెలియజేస్తాయి. అప్పటి ప్రజల మూఢనమ్మకాలు – విశ్వాసాలు, వాటిని ఆధారంగా చేసుకుని బ్రతికే మైసయ్య లాంటి మోసగాళ్ళ గురించి ‘మసిబారిన చందురుడు’ కథ తెలియజేస్తుంది. తెలంగాణ మాండలికంలో ఆ కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ కథలన్నీ 1958 నుండి 1969 మధ్యకాలంలో రాసినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here