నీలి నీడలు – ఖండిక 6: అస్పృశ్యత

0
3

వాడు నడువ నేలబీడుగా మారునా?
మనము త్రొక్కగ భూమి మంచిదగున?
వాడు త్రాగుగ నీరు వగరుగా మారునా?
మనము వాడ జలము మంచిదగున?
వాడుపీల్చగ గాలి పాడయిపోవునా?
మనము శ్వాసించగా మంచిదగున?
వాడు పొందగ కాంతి వాసి గోల్పోవునా?
మనమనుభవమందీ మంచిదగున?
వానిపైనున్న నింగియు కానిదగునా?
మనకు వర్తించు గగనంబు మహిమయుతమా?
ఎంచనెందును భేదంబు గాంచలేని
ఆతనిని యంటరాదంచు నాంక్షలేల? (11)

వాడు త్రవ్వినయట్టి బావి పనికివచ్చు
వాడు ధాత్రి పనికిరాడు మనకు
వాడు పితికినట్టి పాలు వాడగవచ్చు
వాడు ధాత్రి పనికి రాడు సతము
వాడు కొట్టిన పేళ్లు వాడుకొనగవచ్చు
వాడు ధాత్రి పనికిరాడు కరము
వాడు మోసిన వడ్లు వండుకోవచ్చును
వాడు ధాత్రి పనికి రాడు కడకు
వాడు కుట్టిన చెప్పులజోడు మనకు
పాదరక్షలుగా కాక ప్రాణరక్ష
లౌచునుండగ సతతంబు నఖిలజనుల
కంటరానట్టివాడౌటయంచితంబ (12)

జ్ఞానులును, యోగులును, మహాగానకళను
ప్రజ్ఞగలవారు, విజ్ఞులు, భక్తవరులు
విధులును, శాస్త్రవేత్తలు, వేలుగలుగ
నవని నస్పృశ్యులని వీరిననుటయెట్లు (13)

అరెరే! యేమిటి వీరి వెఱ్ఱి చెడుగౌయస్పృశ్యతా జాడ్యతన్
సరిగా జూడక సాటివారిని కడున్ సంస్కారహీనాత్ములై
పరమోత్కృష్టమునైన దేశగరిమన్ భావించకేనిచ్చలున్
కరుముంబంచములంచు వారిని మహాగర్వాన నిందించరే! (14)

చిత్తవృత్తులం బట్టియు చేయబడిన
వర్ణములు నాలుగేయౌను వాస్తవముగ
అయిదవది యెట్లు వచ్చెనో యాగమముల
ఘనపురాణ శాస్త్రాదుల గాంచగలమె? (15)

వేదాలు నాలుగు భేదాల నడగించె
పురుషార్థములు నాల్గు పుడమినొప్పె
వేనాల్గు ముఖాల వేదాల పఠియించె
యుగములు నాలుగై యుర్వినిల్చె
ఆశ్రమంబు నాల్గునవనిలో వెల్గొందె
ధర్మంబు నడచె పాదాల నాల్గు
మనుజ దశలు నాల్గు మహిలోన రూపొందె
‘నలుగురు’ ననుమాట కలినినుండె
ఇన్నిటను నాల్గుసంఖ్యయే మిన్ననౌదు
నొప్పుచునునుండ జగముననొప్పిదమయి
నాల్గుకులములు నౌటయే న్యాయమవగ
అయిదవది యుండెననుటకు నర్థమేమి? (16)

పూర్వకాలమందు పొడచూపనట్టియి
గతచరిత్రనెందు కానరాని
అంటరానితనము నవనికెటులవచ్చె
మనుజ సంఘమందు మంటరెప. (17)

బీజమే లేక పుట్టదు భూమిజంబు,
గర్జనములేక గురియదు ఘనమదెపుడు
అరయ ధూమంబు నగ్నిలేక
కారణము లేక జరుగదు కార్యమెద్ది! (18)

జాగరూకులమౌచును బాగుగాను
సంతతంబును యోచింప సుంతయేని
కానబడకుండ నుండునా కారణంబు
నేల లోతుకు ద్రవ్వంగ నీరు రాదే? (19)

మూర్ఖతయు, మొండితనమదిమోసులెత్త
అంటురోగాలే చేతనునటమటించు
మానవాళిని వెలివేసి రనుచు మిగుల
భావనంజేయ సరియైన పద్ధతియగు (20)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here