నీలి నీడలు – ఖండిక 6: అస్పృశ్యత

0
9

[box type=’note’ fontsize=’16’] “నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది ఆరవ ఖండిక ‘అస్పృశ్యత’. [/box]

[dropcap]అ[/dropcap]స్పృశ్యత – ‘నీలి నీడలు’ ఖండకావ్యంలోని ఆరవ ఖండిక.

***

వేదవిజ్ఞానంబు విస్తరిల్లినయట్టి
పుణ్యాతిపుణ్యమౌ భూమిలోన
క్షేమంబు బ్రజకిచ్చు శ్రీరామగాథచే
పరమపావనమైన వసుధలోన
ఉత్కృష్టగీత చేనున్మీలనంబౌచు
దార్మికతను వెల్గు ధాత్రిలోన
భూతదయనుదెల్పు బుద్ధుని బోధలన్
కరుణార్ద్రమైనట్టి ధరణిలోన
ఏమి పాపమొ? కర్మమదేమోగాని
మానవత్వానికే కడుమచ్చదెచ్చు
అంటరానితనంబది యధికమగుచు
అదుపులోనట్టి రోగమై వ్యాప్తిజెందె (1)

బ్రహ్మసృష్టినిలేదు వాణి బుద్దినిలేదు
శ్రావ్యమౌ సంగీతఝరిని లేదు
శ్రీశుమాటనులేదు, సిరిభావనన్ లేదు
ఆదిశేషుని నూహనసలులేదు
ఈశుని చర్యలనెందును నిదిలేదు
జగదంబ తత్వాన జాడలేదు
దేవలోకమునందు దీనిపోడయెలేదు
కాలుని నియమాల కానరాదు
అట్టి యసస్పృశ్యతా జాడ్యమవనియందు
ఎట్లు పుట్టెనో పెరిగెనో యెఱుగు కొఱకు
మనుజ గణమంత మమతతో మహితరీతి
ఆత్మపరిశీలనము చేయుటవసరంబు (2)

అంటుకొనని యంతనతిఘోరమైనట్టి
చెడ్డపనులువాడు చేసినాడ?
ముట్టరాని యంత దట్టమౌ మురికితో
కలిని జీవనంబు సలిపినాడ? (3)

నీతిరీతినేని, ప్రీతియనగనేమో
తెలియనట్టి వట్టి దెబెయతడ?
మనుజుడగుచు బుట్టి మానవత్వములేని
కఱకు మొఱకు నరుడ? కలుషమతియ? (4)

రోగాల పుట్టయై రోయబడెడువాడ?
హేయమౌ పనులను చేయువాడ?
కూరగుమ్మడివోలె క్రుళ్లిపోయినవాడ?
సమత మమతలేని కుమతియతడ?
పెద్దల మాటలన్ పెడచెవినిడువాడ?
దుష్కృత్యములజేయు ద్రోహియతడ?
పడతుల శీలమున్ పరగదోచివవాడ?
ప్రాణాలు తీసెడి పాపియతడ?
పలుకలేనివాడ, పిలుపు విననివాడ?
చెడ్డ కంపుతోడ జెలగువాడ?
భాషరానివాడ? పతితుడా? ఈతని
అంటరానిమనిషి యనుటయెట్లు? (5)

ఒక్క పొలముదున్నిబంగరుంబండించి
అతని దేశమునకునప్పగించు
దేశభక్తుడతడు, దివ్యాత్ముడాతడు
అంటరానివాడు నగునెయతడు. (6)

కర్షకుండునౌచు, కష్టజీవియనౌచు
హలము చేతబట్టి పొలము దున్ని
తగిన సస్యములను దండిగా పండించి
అవనికిచ్చు వానినంటరాద? (7)

జననమందులేదు, చావునందునలేదు
కాలపురుషునందు గాంచలేదు
నడుమనేలవచ్చె, కడలేనిరీతిగా
అంటరానితనపు మంటసెగలు. (8)

ఆ, శ్మశానమందు నగ్గివెట్టెటునప్డు
వాడునంటరాని వాడుకాడ?
అంటరానిబుద్దియప్పుడులేనిది
ఇప్పుడెటుల వచ్చె నెఱుగలేము? (9)

ప్రకృతిగుణములైన పంచభూతంబుల
మనకు వలెనె వాడు మహితవృత్తి
వాడుకొనుచునుండ వాంఛతో సతతంబు
అంటరానిమనిషి యనుటయెట్లు (10)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here