అట్లు వెలివేయబడి కుందునట్టిజనులు
తెలివిమీరియు నారోగ్యదీపితులయి
మంచిగను మారిపోవగ మానవతను
అక్కునం జేర్చికొంచును నాదరించి
సంఘచట్రాన కలుపుట సక్రమమగు. (21)
స్వార్ధపరులైన పెద్దలు సంఘమునను
పెత్తనంబునుజేయంగ జిత్తమందు
కాంక్ష జేసియు నేతలై యాంక్షవెట్టి
పంచములటంచు బిలచిరీ ప్రజలనెల్ల (22)
బలిమి కలిమియు గల యట్టివోలెల్ల
గుత్తపెత్తనముంజేసి కుట్రతోడ
పంచములటంచు బిలుచచు బాధ గూర్చ
భరతదేశపు కీర్తియు బండలవద? (23)
అగ్రవర్ణమనుచు నధమవర్ణమటంచు
విలువలేని యట్టి కులములనుచు
వింతభేదములను విడదీసి సంఘమున్
కలిని సమత మంటగలిపినారు. (24)
అంతతోబోక మిక్కిలి శాంతముగను
నడచు సంఘపు శకటమున్ నడువనీక
ఈర్ష్యవిద్వేషభావాల కిరవుజేసి
మంటగలిపిరి సమతను మానవతను (25)
కోరికోరి యిట్లు కొందరు పెద్దలు
కుత్సిమునజేయు కుట్రలకును
నిలయమౌదుమిగుల విలయాగ్నికీలలు
ప్రజ్వరిల్లె సంఘ పాలనమున (26)
ఇంతకన్నను దౌర్జాగ్యమెందుగలదు
స్వార్ధపరతంత్రులౌచును సాటిజనుల
మమతతో నాదరించుచు మనగలేని
అట్టివారిల పశుతుల్యులౌటనిజము. (27)
భరతదేశంబులోపల పరిఢవిల్లు
ప్రాంతములకును, వివిధమౌ భాషలకును
మతములకు జెందు మనుజుల మధ్యనెట్లు
భేదమనునది యుండదో ప్రీతినటటులె
నుర్వినస్పృశ్యతా భేదముండదగదు. (28)
ఈ విభేదములకునికెంత మాత్రము
తావునీయకుండ ధాత్రి జనులు
సమత మమత తోడ సామరస్యంబున
మెలగదలతురేని మేలు కలుగు. (29)