ఉప-దైవం

0
7

ఈ కథలోని పాత్రలు సంఘటనలు కేవలం కల్పితాలు. రచయిత స్వకపోల కల్పితాలు. ఈ పాత్రలు ఎవరినయినా పోలివుంటే అది యాదృఛ్ఛికం. రచయితకు సంబంధంలేదు.

***

 

[dropcap]పే[/dropcap]రిశాస్త్రికి మతి చలించిందన్నారు. ఆ క్షేత్రంలో ప్రధానమైన ఆలయంలోకి వెళ్ళే ముందు వరుసగా ఎన్నో ఉప దేవాలయాలున్నాయి. ఆ వరుసలో ఒక చిన్న గుడిలో పూజారి ఈ పేరిశాస్త్రి. ఈ మధ్య తనలో తాను మాట్లాడుకోవటం, అక్కడి ఉపదేవునితో సంభాషిస్తున్నట్లుండటం చేసేస్తున్నాడు. ఎవరో మిత్రునితో మాట్లాడుతున్నట్లు ఆ విగ్రహం వైపు చూస్తాడు.

“చూసావా?”
“…”

“అక్కడి నుండే చేతులు జోడించి అలా పారిపోతున్నారంతా”

“…”

“ఏమంటావు? అలసిపోయారా? నేనూ అలసిపోతున్నానిక్కడ. ఒక్కడు రాడు, కాస్త హారతి అద్దుదామంటే! నిన్ను చూస్తే నాకు జాలి. నన్ను చూస్తే నీకు వెటకారం. మనిద్దరినీ చూస్తే అక్కడి జనాలకి ఏమీ లేదు.”

‘నాకు నువ్వు, నీకు నేనూ, చూసుకుంటూ కూర్చుంటే..’ పాట కూడా పాడేస్తున్నాడు. ఆఖరుకి ఎవరో పుణ్యాత్ములు లోపలికి వస్తే అప్పటికప్పుడు ఆ పాటనే స్తోత్రంలా అనేస్తూ నామాలలోకి మార్చేసి నాలుగు పూలు పాదాల దగ్గర పడేసి హారతి ముట్టించి ఏదైనా కరెన్సీ నోటు రాలకపోతుందా అన్న ధైర్యంతో వెళ్ళి ఆఖరుకి నాలుగు నాణేలు చూసి వాటిని ఏరుకుని హుండీలో పడేస్తున్నాడు. ఆ విగ్రహం వైపు తిరిగాడు.

“నీకు కొన్ని చోట్ల చాల పెద్ద గుళ్ళున్నాయి. ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంది. పోనీ ఆ మాటలోనైనా నీకు సంతృప్తి. నేను ఎక్కడికి వెళ్ళినా నా యోగం ఇంతే. పోనీ కొబ్బరికాయలు కొడతానంటే అదీ కుదరడం లేదు. జనాలనే ఓ మూల కొట్టి అవతలకెళ్ళమంటున్నారు.”

ఇంతలో ఎవరో వచ్చారు.

“అయ్యగారూ! ఈ స్వామి ఎవరండీ?”

“అక్కడ గోడ మీద వ్రాసారు చదువుకోండి”

అతను నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు.

“పేరీ” అని వినిపించింది. చుట్టుతా చూసాడు. ఎవరూ లేరు. శఠగోపం క్రింద ఉంచిన మొబైల్ తీసి చూసాడు. అదీ మ్రోగటం లేదు.

“పేరీ”

లోపల అటూ ఇటూ చూసాడు.

“నా వైపు చూడు”

కొద్దిగా భయంగానే స్వామి వైపు చూసాడు.

“ఆ.. నేనే. జాగ్రత్తగా విను”

ఇదేంటి? స్వామి మాట్లాడుతున్నాడా? అనుకుంటూ దగ్గరగా చెవి ఆన్చాడు.

“ఆ.. జాగ్రత్తగా విను. నీకు మూర్ఖత్వం పేరుకొని పోయింది పేరీ”

“స్వామీ!”

“అవును. చక్కగా నా గురించి చెప్పకుండా గోడ మీద ఉన్నది చదువుకోమంటావా?”

“చెప్పి ఏమిటి ఉపయోగం స్వామీ? కంఠ శోష. అంతా విని వెళ్ళిపోతారు. మనిద్దరినీ ఎవరూ పట్టించుకునేవారు?”
“దానికో మార్గం చెబుతా విను.”

“స్వామీ!”

“పోటేశ్వరరావు అని చెప్పి ఉంటాడు. అతగాడికి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఇవ్వు. అక్కడక్కడ ఆ పుస్తకంలో నా గురించి కొన్ని లైన్లుంటాయి. అవి గట్టిగా దిద్దు. వాటి గురించి ఇంకాస్త గట్టిగా చెప్పమను. ఊపిరి బిగబట్టి మరీ చెప్పమను. అంతే. ఆ తరువాత నీకు ఊపిరి ఆడని పరిస్థితి వచ్చేస్తుంది…”

ప్రధాన ఆలయంలోని గంటలు ఆ సమయానికే మారుమ్రోగాయి. పేరిశాస్త్రి శరీరంలోకి విద్యుత్ తరంగాలు అలా పాకిపోయాయి.

***

“చాలామందికి తెలియని ఒక పరమ రహస్యం చెబుతున్నాను సుమా..” పోటోశ్వరరావు అశేష జనావళికి వివరిస్తున్నాడు. “..ఉజ్జైశ్వరం అనే గొప్ప క్షేత్రం గురించి మీరు విని ఉంటారు. అక్కడికి సామాన్యంగా మనమంతా తండోపతండాలుగా దైవదర్శనానికి నదీ స్నానాన్ని ఆచరించి వెళతాం. అలా వెళిపోతున్నప్పుడు రాజగోపురం ముందర ఎడమ ప్రక్కన వరుసగా ఓ తొమ్మిది ఉప ఆలయాలుంటాయి. మీరు జాగ్రత్తగా గమనించండి సుమా.. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉన్నది. ఇవ్వేళ నేను మీరు రాజగోపురం వైపు వెళుతున్నప్పుడు అయిదవ ఆలయం గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి..”

అందరూ ఊపిరి బిగబట్టారు. కొందరు మొబైళ్ళలో రికార్డింగ్ కూడా చేసుకుంటున్నారు.

“ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడి స్థల పురాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి. అక్కడ వెలసిన దైవం వెనుక కథ అక్కడి స్థల పురాణానికి పూర్తిగా అనుబంధంతో ఉంటుంది. ఆ స్థల పురాణాన్ని ఏ మాత్రం విస్మరించినా, అక్కడి పద్ధతిని, విధానాన్ని ఏ మాత్రం ప్రక్కన పెట్టి ప్రధానమైన దైవాన్ని దర్శనం చేసేసుకుని అమాంతం బండీ ఎక్కేసి మనం దైవ దర్శనం చేసేసుకున్నామని చంకలు గ్రుద్దుకుంటే పొరపాటు సుమా! మీకు ఆ ఫలితం దక్కదు. ఇకపోతే నేను మీకు చెబుతున్న ఆలయం గురించి.. అసలు ముందుగా మీరు ఈ ఆలయాన్ని ఎలా గుర్తించాలో చెబుతాను. మీరు జాగ్రత్తగా నడుచుకొంటూ వెళుతుంటే కుడి ప్రక్కన ఓ పేద్ద రావి చెట్టు – ఎంతో విశాలమైనది మీకు గాలికి వీస్తున్న కొమ్మలతో కనిపిస్తుంది. ఆ చెట్టు చుట్టూతా మీకు అతి ప్రాచీనమైన నాగ ప్రతిష్ఠలుంటాయి. ఆ చెట్టు దగ్గరకి మీరు రాగానే ముందర మీరంతా ఆ వృక్షానికి భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఈ అయిదవ ఉప ఆలయం ఎదురుకుండా మీకు రెండు నాగ ప్రతిష్ఠలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. వాటికి నమస్కారం చేసుకొని అటు స్వామి వారి వైపు చూడాలి. మీరు కావలిస్తే కొలుచుకోండి. ఆ చెట్టుకీ, అంతరాలయానికీ మధ్య సరిగ్గా 24 అడుగులుంటాయి. 24వ అడుగు దగ్గర మీరు ఖచ్చితంగా ఆగిపోవాలి. అప్పుడు మీరు అర్చక స్వాముల వారికి గోత్రనామాలు చెప్పి మీ సమస్య చెప్పుకుని అర్చన చేయించాలి. ఇక్కడ నైవేద్యానికి కేవలం పటికబెల్లం ఒక్కటే సమర్పించాలి. మరి ఏదీ ఇక్కడ పనికిరాదు. అరటి పండ్లు కూడా సమర్పించవచ్చు. పటిక బెల్లంతో పాటు సమర్పించాలి. ఇది మరువకూడదు! ఈ విధంగా మీరు దర్శించుకొంటే ముఖ్యంగా మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఉజ్జేశ్వర పురాణంలోని ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ అంశంలో కేవలం సూచనప్రాయంగా చెప్పినది నేను మీకు వివరంగా చెబుతున్నాను. మన ఇతిహాస పురాణాలలో సూక్ష్మాతిసూక్ష్మంగానే ఎన్నో విషయాలుంటాయి..”

***

ఉజ్జేశ్వరం కథ మారిపోయింది. పేరిశాస్త్రికి నిజంగానే ఊపిరి ఆడడం లేదు. ఇద్దరు  ఉప అర్చకులను తెచ్చుకున్నాడు. కొద్దిపాటి వ్యవధిలోనే ఉజ్జేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆ ఉప-ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాడు. అందరి నోటా ఈ ఉప ఆలయమే నానుతోంది. రావి చెట్టు పిచ్చగా పాపులర్ అయిపోయింది. ఏ చానెల్‌లో చూసినా దీని మీద చర్చ. ప్రధాన ఆలయంలో పుష్కరం మాట అక్కడ ఉంచి, ఇక్కడి పుష్కరాలు మరోలా ఏర్పాటు అవుతున్నాయి. మిగతా ఉప-ఆలయాల వారూ కొంత లబ్ధి పొందారు. కానీ ఇక్కడ జరిగిన తిరకాసు ఏందబ్బా అని ఆలోచించారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఓ పెద్దాయన గొప్ప ఆలోచన చేసాడు..

***

‘శక్తి టి.వి.కీ స్వాగతం..’ యాంకర్ చెబుతోంది. “..ఇటీవల ఉజ్జేశ్వరం ఆలయంలోని రక్షక స్వామి ఉప ఆలయం చర్చలోకి వచ్చింది. తండోపతండాలుగా ఈ ఆలయం ముందరున్న రావి చెట్టునూ, రక్షకస్వామి వారినీ దర్శించేందుకు జనం వస్తున్నారు. చాలామంది వారు చేసిన అప్పులు కూడా తీరిపోతున్నాయని చెబుతున్నారు. పోటేశ్వరరావు గారు విడుదల చేసిన ఈ రహస్యం గురించి పలువురు పెద్దలు ఎంతో భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విషయం మీద మాట్లాడేందుకు మన స్టూడియోకి ఈ రోజు ఊరకపాటి వారు, సుగుణాలరావు గారు, జన నిర్జన వేదిక అధ్యక్షురాలు విశాలాక్షిగారు విచ్చేసారు. ముందుగా ఊరకపాటివారు.. సార్, మీరేమంటారు? అసలు అప్పులు తీరటం అనేది ఒక క్షేత్రమహిమలో ఉంటుందా?”

ఊరకపాటి వారు చేతుల మీది కుర్తా చేతులను వెనక్కి లాగారు.

“అమ్మా! మొట్టమొదటి మాట – స్థల పురాణాల గురించి ఈ విధం మాట్లాడటం ఎంత మాత్రం సముచితం కాదు. ఉజ్జేశ్వరం అనే క్షేత్రం ఇప్పటిది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న క్షేత్రం. మనం కూడా కొద్ది తరాలుగా వెళుతున్నాం, వస్తున్నాం. అక్కడ  ప్రధాన దైవం ఉజ్జేశ్వర స్వామి వారు. వారు స్వయంభువుగా వెలిసారు. అంత మటుకే. ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు స్వామి వారు మనలను అన్ని విధాలుగా ఆశీర్వదించాలని కోరుకోవటంలో తప్పు లేదు. ఒకరు అప్పులు తీరుస్తారని, ఒకరు పెళ్ళిళ్ళు చేయిస్తారని చెప్పటం సరైనది కాదు.”

“సుగుణాలరావు గారూ.. మీరేమంటారు?”

“ముందుగా అందరికీ నమస్కారం. మానవ జీవితం సమగ్రమైనది. ఇందులో ఎన్ని భిన్నమైన అంశాలుంటాయో, దైవాన్ని కూడా అన్ని విధాలుగా దర్శించి సేవించటం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఆ మాటకొస్తే తిరుమల వెంకన్నని మరి వడ్డీకాసులవాడని కొలుస్తాం కదా?”

“మీరేమంటారు ఊరకపాటి వారు?”

“మీరు క్షుణ్ణంగా వరహాపురాణం చదవాలి..”

యాంకర్ నవ్వింది. “అదలా ఉంచండి. మరో వివాదం వైపు మనం వెళ్ళటం మంచిది కాదు. మేడమ్ విశాలాక్షి గారూ.. మీరేమంటారు?”

“ఏం లేదండీ..” ఆమె చెబుతోంది. “..ఇదంతా కేవలం వ్యాపారం కోసం జరుగుతున్న ప్రచారం. గతంలో లేనిది ఇప్పుడెందుకొచ్చిందందీ? అక్కడ పటికబెల్లం ఒక్కటే అని ఎవరు చెప్పారందీ? ఆ ఒక్కటీ చెబితే  బాగుండదని అరటి పండ్లు కూడా జోడిస్తారా? వీరిద్దరూ బాగుపడాలా? మరి కొబ్బరికాయల వాళ్ళ సంగతి ఏమిటండీ..”

“అమ్మా.. ప్రజల విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలను కాదనటం మంచిది కాదు”

“అవి సృష్టించటం సమంజసమా? ఓ.కె. నేను ఆరు నెలల లెక్కలు తీసాను. ఈ వ్యవహారం వలన ప్రధాన దేవాలయం అయిన ఉజ్జేశ్వర స్వామి వారి ఆదాయం తగ్గిందని తెలుస్తోంది. ఇదెలా ఉంది?”

“ఆదాయం వ్యయం అనేవి ఆలయాల వ్యవహారాలలో అంత మంచిది కాదు. రాజపోషణ ఉండాలి”

“రాజపోషణ ప్రక్కన పెట్టి ప్రజా పోషణ ఇన్ని విధాలుగా సాగుతోంది. ఈ ఒరవడి సమాజానికి మంచిది కాదు..”

యాంకర్ అందరినీ ఆపుతోంది.

“సార్, ఊరకపాటి గారూ, ఇంతకీ చివరగా మీరేమంటారు?”

“అమ్మా! వ్యక్తికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఆ దిశగా జీవనయానం సాగాలి. ఈ విధంగా క్షేత్రాల గురించి ప్రసంగాలు చేయటం సమంజసం కాదు.”

“మేడమ్ మీరేమంటారు?”

“ఇలాంటి అన్యాయాలను, అప ప్రచారాలను ప్రభుత్వంతో పాటు కలసి అందరూ ఖండించాలి. ఏమీ తెలియని అమాయక ప్రజలను మోసం చెయ్యటం మంచిది కాదు”

“మీరేమంటారు సుగుణాలరావు గారూ?”

“అమ్మా! ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ముందుకు వస్తూ ఉంటుంది. దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. బలవంతంగా ప్రజలను ఏదో పేరుతో దోచుకునేవారిని మీరు నిలదీయండి. రక్షకస్వామి అనే ఉప-ఆలయం వారు అక్కడ అడ్డంగా నిలబడి ఎవరినీ దోచుకోలేదే?”

“ఇంతటితో ఈ చర్చ ముగింపుకు వచ్చింది. మరో ఆసక్తికరమైన అంశంతో మరల కలుద్దాం. నమస్కారం!”

అందరూ నమస్కారాలు చేసారు.

***

ఉజ్జేశ్వరం కథ అక్కడితో ముగియలేదు. ఇదే చర్చ రకరకాల చానెళ్ళలో పలు విధాలుగా సాగిపోయింది. ఉప ఆలయంలో మటుకు రద్దీ మరింత పెరుగుతూనే వచ్చింది. సంవత్సరాలు గడిచిపోయాయి. పేరిశాస్త్రి ఎంతో పెద్దవాడైపోయాడు. ఆయన మనవడు అర్చకుడిగా ఉంటున్నాడు. ఆ రావిచెట్టుకు ఆనుకుని ఉన్న గోడ అవతల ఓ పెద్ద ఆశ్రమం వెలసింది. పేరిశాస్త్రి పేరు రావిశాస్త్రిగా మారింది. ఆ తరువత రావిస్వామిగానూ,  అలా అలా రాయిస్వామి గానూ మారింది. ఒక సంస్థానం తయారయింది. క్షేత్రమహిమ మరింత పెరిగింది. రాయిస్వామి దగ్గర ఉజ్జేశ్వరం బ్రహ్మోత్సవాలలో ఈ మధ్య 24 రోజుల దీక్ష తీసుకునేవారు మాల వేసుకుని మరల ఇక్కడే మాల తీసేస్తున్నారు.  పేరిశాస్త్రి పరమార్థం నెరవేరిపోయింది. ప్రతి దసరాలోనూ ఇక్కడ పోటేశ్వరరావు గారు 24 రోజులు ప్రవచనాలు చేయడం పరిపాటి అయిపోయింది. శక్తి చానెల్ వారు దానిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఊరకపాటి వారు ఒకసారి ఉజ్జేశ్వరం దర్శనానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో పోటేశ్వరరావు గారు వేదిక మీద కూర్చుని గొంతు సద్దుఉంటున్నారు. ఊరకపాటి వారు ఏమనుకున్నారో ఏమో వేదిక మీదకెళ్ళి ఆయనకు నమస్కారం చేసేసుకున్నారు. కెమెరాలన్నీ అటువైపే తిరిగిపోయాయి. గోల ఎక్కువైపోయింది. ఊరకపాటి వారు కార్యక్రమం అయిపోయేవరకు ఉండి గుడి ప్రాంగణం నుండి ఇవతలికి వస్తే ఓ కొంటే టి.వి. చానెల్ అమ్మాయి అడగనే అడిగింది. “సార్, గతంలో మీరు పోటేశ్వరరావు గారిని ఈ రక్షకస్వామి దేవాలయం గురించి విచిత్రంగా చెప్పినందుకు విమర్శించారు. మరి ఈ రోజు ఇలా ఆయన ప్రసంగాని కి వచ్చి పూర్తిగా విని లేస్తున్నారు. దీనికి కారణం తెలుసుకోవచ్చా?”

ఊరకపాటి వారు కుర్తా చేతులు పైకి లాగారు. చేతికి అమర్చుకున్న బంగారు ఆభరణం వింతగా మెరిసింది.

“ఎవరి తత్వచింతన వారిది..!” చెప్పాడు. “..దేశకాల పరిస్థితుల గురించి పురాణాలలోను, శాస్త్రాల లోనూ పలు చోట్ల చెప్పటం జరిగింది. ఇదీ అంతే! ఇక్కడికి వస్తే అప్పులు తీరిపోతాయని చెప్పినప్పుడు అవసరం లేకపోయినా అప్పులు చేసేవారు ఎక్కువైపోతారని బాధపడ్డాను. కానీ నిజంగా చిక్కులలో ఉన్నవారికి మంచి, సరైన దారిని పోటేశ్వరరావు గారు చూపించారు కదా? నాణానికి రెండు వైపులా ఉంటుంది మరి. శలవు!”

కెమెరా ఆఫ్ అయిన తరువాత ఎవరో అంటున్నారు – “ప్రాచుర్యం కోసం లౌక్యం ఎలా వాడాలో ఏ పురాణంలో ఉందో చెబితే మేమూ చదువుతాం కదా?”

***

పేరిశాస్త్రి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒక విచిత్రమైన ప్రచారం చేయించి సొమ్ము చేసుకోవటం అపచారం కాదా అని బాధ పడుతున్నాడు ఈ మధ్య!  అయినా ఆ ఉపదైవం చెప్పినట్లు కదా, నేను అలా చేసింది, అని కూడా సద్దుకున్నాడు. కానీ పడుకున్నప్పుడు దిండ్లను, పరుపులను సద్దుకున్నట్లు ఆలోచనలను కూడా సద్దుకోగలిగితే, బండరాయి కూడా ఆనుకున్న తరువాత మెత్తగా మారగలదు! నిద్ర పట్టటం లేదు. అర్ధరాత్రి దాటింది. ఇబ్బందిగానే లేచి తాళం చెవులు తీసుకొని మరో దారి లోంచి రావిచెట్టు వరకూ వచ్చి అలసిపోయి అక్కడ కూర్చున్నాదు. గుడికి ఎదురుగా ఉన్న నాగవల్లికి ఈ మధ్య బంగారు తొడుగు పెట్టి దాని మీద చిన్న మందిరం ఏర్పరిచి ఓ చిన్న చెక్క తలుపు పెట్టి ఓ చిన్ని తాళం కూడా బిగించారు. ప్రతి నాగపంచమికి అందులోకి ఓ తెల్లని దివ్య సర్పం వచ్చి కూర్చుంటుందని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ ఆవరణను తనివితీరా చూసుకున్నాడు. ఆ రోజులలో, ఆ పరిస్థితులలో ఈ దైవం విగ్రహం లోంచి మాట్లాడింది. ఈ ఒక్కసారీ ప్రయత్నం చేసి చూడాలనుంది. ఇన్ని సంవత్సరాలలో ఈ ఆలోచన రాలేదు. జాగ్రత్తగా లేచి గుడి వైపు వెళ్ళాడు.  చుట్టుపక్కల ఎవరూ లేరు. తాళం తీసి తలుపులు తెరచి లోనకెళ్ళి తలుపులు మూసేసాడు. దీపం కొండెక్కలేదు.

రాయిస్వామిగా ఎంతో గౌరవం పొందుతున్నాడు. ఎన్నో ప్రసంగాలు చేసాడు. ఈయన ఫొటో పర్సులలో పెట్టుకుని వ్యాపారం చేసేవారు లేకపోలేదు. అసలు దైవం అంతే ఏమిటి? ఎందుకో చిక్కు ప్రశ్న వేసుకున్నాడు.

“నీ బాధేమిటి?” వినిపించింది.

చుట్టూతా చూసాడు. స్వామి మాట్లాడుతున్నట్లు గ్రహించాడు.

“స్వామీ! నేను చేసింది తప్పే కదా? ఈ చివరి దశలో తలచుకున్నప్పుడల్లా బాధగా ఉంది.”

“స్థల పురాణం, దాని మహిమ, ఆ జరిగిన కథ ద్వారా ప్రధానమైన దైవాన్ని సేవించుకోవటం క్షేత్ర ధర్మం. ఏదో తాయిలం లేకుండా ఆ కథ ద్వారా తత్వచింతన సామాన్యులకు రాదు. అది కొంత కాలం ఉంటుంది. అందుచేత నువ్వు ప్రాచుర్యం పొందిన తరువాత నీ చేత నేనే ఆత్మవిశ్వాసం, సత్యం, ధర్మం పట్ల అనురక్తి వంటివి ఎక్కువ చెప్పిస్తున్నాను. గమనించావా?”

“నిజమే. ఆత్మసంతృప్తి  కోసం నేను వాటి గురించే ఎక్కువ చెబుతున్నాను. కానీ ప్రజల ధోరణి చూసి బాధగా ఉంది.”

“లోకం అలానే ఉంటుంది. కానీ లోకుల పట్ల ప్రాచుర్యం పొందిన వారి బాధ్యతను నువ్వు తెలియజేస్తూ ఉండాలి. వేదార్థం, శాస్త్రార్థం వంటివి గురువు వద్ద అభ్యాసం లేకుండా, అవగాహన లేకుండా ధర్మశాస్త్రల పట్ల ఒక నిష్కర్ష, ఒక నిర్వచనం చెప్పకుండా ఉండేట్లు చేయటం నీ పని.  స్వాధ్యాయం, స్వంత ఆలోచన అనేవి ప్రజలలో పెంచే ప్రయత్నం చేయి. ఇక వెళ్ళు. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఎవరికైనా దొరికిపోతే, నిన్ను దొంగగా మార్చి సొమ్ము వేరేవారు చేసుకుంటారు!”

పేరిశాస్త్రి ఎంతో ఆనందంగా బయటకి వచ్చి, గుడికి తాళం వేసి తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు.

***

కాలం గడుస్తోంది. స్వామి చెప్పినట్లు ప్రవచనాలు చెబుతున్నాడు పేరిశాస్త్రి. ఓ రాత్రి నిద్రపట్టక ఓ చానెల్ పెట్టాడు. ఒక చర్చా కార్యక్రమం సాగుతోంది.

యాంకర్ చెబుతోంది. “..ఇటీవల ఉజ్జేశ్వరంలో ప్రఖ్యాతి గాంచిన రాయిస్వామి వారి ప్రసంగాలు పోటేశ్వరరావు గారు, ఊరకపాటి వారు చెబుతున్న అంశాలను ఖండిస్తున్నట్లుగా ఉన్నాయని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్న అంశం మీద మన ముందు ఈ రోజు పోటేశ్వరరావు గారు, ఊరకపాటి వారు, సుగుణాల రావు గారు, విశాలాక్షి గారు ఉన్నారు.”

పేరిశాస్త్రికి ఒళ్లు మండింది. చానెల్ మార్చేసి ఇంకొటి పెట్టాడు.

“మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఈ రోజు మన ముందు ప్రఖ్యాత జ్యోతిష విద్వాంసులు విశ్వంభర శాస్త్రి గారున్నారు. శాస్త్రి గారూ..”

“ఆశీర్వాదం!”

“మీరు చాలా సార్లు ఉజ్జేశ్వరం లోని రాయిస్వామి గారి గురించి ప్రస్తావించారు. మీకూ, ఆయనకూ ఏంటండీ సంబంధం?”

“సంబంధం అంటే అలాక్కాదమ్మా! ఈ రాయిస్వామి వారు తొలుత అక్కడి ఉప దేవాలయంలో అర్చకుడు మాత్రమే. పెద్దగా చదువుకున్నవాడు కాడు! ఆ రోజుల్లో నేను ఆయన జాతకం చూసి ఫలాన సమయం నుండి దశ తిరుగుతుంది అని చెప్పాను. నిజానికి పేరిశాస్త్రి.. అంతే చాలామందికి తెలియదు, ఈయన అసలు పేరు పేరిశాస్త్రి. ఆ పేరిశాస్త్రి ఇలా ఆశ్రమం పెట్టటం, ప్రముఖులందరూ ఆయన వద్ద సలహాలు తీసుకోవటం, ఇలాంటివి చెయ్యటం, ఈయన రావిశాస్త్రి నుంచి రావిస్వామి, అలాగ చివరకు రాయిస్వామిగా సెటిల్ అయిపోవటం జరిగింది..”

పేరిశాస్త్రి ఆ రిమోట్ పట్టుకుని ఆ పడక కుర్చీలోనే వాలిపోయాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here