సాహిత్య చరిత్రను ఇముడ్చుకున్న ‘ఉపాసన’

0
10

[dropcap]సి[/dropcap]రికోన వాక్స్థలి బృందం వారు ఇటీవల నిర్వహించిన చారిత్రక నవలల పోటీలో బహుమతి పొందిన నవల ఉపాసన. దీని రచయిత కల్లూరు రాఘవేంద్రరావుగారు కథారచయితగా సుప్రసిద్ధులు. ఇది నవలా ప్రక్రియలో వీరి తొలి రచన అంటే నమ్మబుద్ధి కాదు.

ఈ నవల 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన అచ్యుతరాయల కాలంలో ప్రారంభమై 1940 ప్రాంతంలో ముగుస్తుంది. అచ్యుతరాయల కాలంలో నవల ప్రారంభమైనా అంతకు ముందే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గొడుగుపాలుని కథ, ముక్కుతిమ్మన శిరోవేదనకు జరిగిన చికిత్సా వృత్తాంతము, గువ్వల చెన్నుని కథ పాఠకులకు అదనపు కానుకలు. నవల ముఖచిత్రంపై గద్వాల సంస్థాన చరిత్ర అని పేర్కొన్నారు. లోపలి పేజీలో తరతరాల మేడవరం వంశస్థుల చరిత్రలో ఇమిడిపోయిన గద్వాలు సంస్థాన సాహిత్య చరిత్రగా కొంత స్పష్టం చేశారు. పదహారు అధ్యాయాల ఈ నవలలో గద్వాల ప్రసక్తి ఆరవ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. మొదటి మూడు అధ్యాయాలలో మేడవరం అన్నంభొట్లు వృత్తాంతం ఉంది. తరువాతి రెండు అధ్యాయాలలో తరువాతి తరం వారైన మేడవరం శివరామ శాస్త్రి, మేడవరం నాగంభొట్లుల గురించి ఉంది. మిగిలిన అధ్యాయాలలో మేడవరం సుబ్రహ్మణ్యశాస్త్రి గారి చరిత్ర ఉంది.

దేవీ ఉపాసకులైన మేడవరం సుబహ్మణ్యశాస్త్రులు గద్వాల ప్రభువు సీతారామ భూపాలుని కోరిక మేరకు సహస్రచండీ యాగాన్ని నిర్వహించడం, తరువాత కొన్నాళ్ళకు గద్వాల రాణి ఆదిలక్ష్మమ్మ ఆహ్వానంపై గద్వాల సంస్థానాన్ని సందర్శించి రెండు రోజులు పూజలు నిర్వహించి, తరువాత హైదరాబాదులోని సచ్చిదానంద స్వాముల వారి మఠంలో 20 రోజులపాటు పూజా కార్యక్రమాలను నిర్వహించడం, గద్వాలలో మహారాణిగారిచేత నవరాత్ర దీక్షను చేయించడం, ఈ పూజల ఫలితంగా నిజాం ప్రభువు నుండి రాణిగారి పెద్ద కుమార్తె సుపుత్రుడిని దత్తత తీసుకోవడానికి ఫర్మానా లభించడం, దత్త పుత్రుడికి పట్టాభిషేకం చేయడం, నిస్సంతుగా ఉన్న రాణిగారి చిన్న కుమార్తె గర్భవతి కావడం ఇదీ స్థూలంగా మిగిలిన కథ. ఈ కథతో బాటుగా గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యకవి, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదర కవులు, ఆదిపూడి ప్రభాకరకవి మొదలైన వారి సాహిత్య చరిత్రను అంతర్లీనంగా చొప్పించారు. ఆ కాలంలో వెంకటగిరి సంస్థానం, ఆత్మకూరు సంస్థానం మొదలైన సంస్థానాలలో జరిగిన సాహిత్య సేవనుకూడా దీనిలో రచయిత ‘కథాను’గుణంగా స్పృశించారు.

కథలో సందర్భానుసారం ఎన్నో ఆశుపద్యాలను ఉదహరించారు రచయిత. అక్కడక్కడా వాడిన “దొరల చిత్తం – మాను నీడ”, “బాపన సేద్యం బత్యానికి చేటు”, “పులి కంటే గిలి మెండైనది” వంటి సామెతలు నవలకు సొగసును చేకూర్చాయి. రచయిత శైలిని గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన పనిలేదు. ఉపయోగించిన భాష కాలానికి అనుగుణంగా ఉంది. ఈ పుస్తకం పాఠకులకు ఒక మంచి నవల చదివిన అనుభూతిని మిగుల్చుతుంది.

మైసూర్ మహారాజు రైలులో రాయచూరు వెళుతూ గద్వాల స్టేషనులో గద్వాల ప్రభువు సీతారామభూపాలుని కలిసినట్లు ఈ నవలలో ఒకచోటు ఉంది. కానీ ఆ రైలు మార్గంలో గద్వాల స్టేషన్ తగలదు.

కథలో ఒక చోట పుల్లప్పల్లెలోని మార్నేని సోదరులకు, ముష్టూరి మాధవరావు సోదరులకు వైరాన్ని వివరిస్తూ “కొన్ని దినములకు ఇరువురి మధ్య వేల సంఖ్యలో ఒక యుద్ధం తప్పలేదు” అంటారు. ఇది కొంత అతిశయోక్తి. పల్లెలలో పదుల సంఖ్యలో మహా అయితే వందల సంఖ్యలో యుద్ధం జరగవచ్చు కానీ వేల సంఖ్యలో అనేది సత్యదూరం. బహుశా దీనిని ఒక అలంకారంగా సరిపెట్టుకోవచ్చు.

మహారాణి పిలుపుమేరకు గద్వాల సంస్థానానికి వచ్చిన మేడవరం సుబ్రహ్మణ్యశాస్త్రిని అక్కడ ఉన్న అతని శిష్యులు దర్శిస్తారు. గద్వాల ఆస్థాన పండితుడు, మేడవరం వారి ప్రియశిష్యుడు అయిన గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి ప్రస్తావన రెండు మూడు మార్లు వస్తుంది కానీ అతడు గురువు గారిని సందర్శించడు. తరువాత ఎప్పుడో హైదరాబాదులో పూజా కార్యక్రమాల చివరి రోజు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ గాడేపల్లి గద్వాలలో లేకపోవడంపై (ఉంటే గురువు గారిని కలిసి ఉంటాడు కదా) కొంత స్పష్టత కొరవడింది. అంతకు మునుపెన్నడో సీతారామ భూపాలుడు జీవించి ఉన్న కాలంలో 1924కు ముందు వేపర్ల సంస్థానంలో పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావడానికి రాజుగారి అనుమతితో గద్వాల వదిలి వెళ్ళిన గాడేపల్లి వీరరాఘవశాస్త్రి మళ్ళీ ఇప్పుడు అంటే రమారమి 1940 ప్రాంతంలో గద్వాలకు తిరిగి వచ్చినట్లు అంటే సుమారు 16 సంవత్సరాలు గద్వాలకు దూరంగా పాఠకులు భ్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సంఘటనలనూ రచయిత ప్రక్కప్రక్క పేజీలలో (పే.125-126) పేర్కొంటారు. అయితే ఇవన్నీ ఘోరమైన తప్పిదాలేమీ కావు.

ఈ పుస్తకాన్ని రాఘవేంద్రరావు గారు శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల తరఫున ముద్రించారు. ఈ గ్రంథమాల 50కు పైగా గ్రంథాలను ముద్రించట్లు ముందు మాటలవల్ల తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలను రాఘవేంద్రరావుగారి తండ్రి కల్లూరు అహోబలరావుగారు స్థాపించారు. వారి హయాములో ముద్రించబడిన గ్రంథాలను 1వ పుషము, 2వ పుష్పము ఇలా ప్రచురణలను పుష్పాలుగా పేర్కొనేవారు. రాఘవేంద్రరావుగారు కూడా అదే ఒరవడిని కొనసాగించి 50వ పుష్పంగానో, 51వ పుష్పంగానో దీనిని పేర్కొని ఉంటే బాగుండేది.

మొత్తానికి ఒక మంచి చారిత్రక నవలను పాఠకలోకానికి అందజేసిన కల్లూరు రాఘవేంద్రరావు గారికి, ఈ నవలకు బహుమతిని యిచ్చి ముద్రణకు కారణమైన సిరికోన బృందానికీ హృదయపూర్వక అభినందనలు.

***

ఉపాసన (చారిత్రక నవల)

రచన: కల్లూరు రాఘవేంద్రరావు

పేజీలు: xviii +198

వెల:₹200

ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల

నెం.12, 5వ క్రాస్, 8వ మెయిన్,

మోహన్ బిల్డింగ్స్, సప్తగిరి లే అవుట్,

విద్యారణ్యపుర (పోస్ట్), బెంగళూరు 560 097

చరవాణి:9493271620

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here