ఉప్పు ఉపయోగాలు

0
10

[ఉప్పు ఉపయోగాల గురించి బాలబాలికలకు వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్ ఈ రచనలో.]

[dropcap]“ఉ[/dropcap]ప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయా” అంటూ చిన్నప్పుడు వేమన పద్యాలు చదువుకున్నారు కదా!

పిల్లలూ, ఉప్పు లేని కూర తిన్నారా ఎప్పుడైనా? చప్పగా ఉంటుంది. ఉప్పున్న కూరలే రుచిగా ఉంటాయి. ఎంతటి ధనవంతుడైన లవణమన్నం తినవలసిందే గానీ బంగారపు అన్నం కాదు అంటూ పెద్దవాళ్ళు చెపుతుంటారు. షడ్రుచులలో ఉప్పు కూడా ఒకటి. ఉగాది నాడు ఆరు రుచులతో కలిపి పచ్చడి చేసుకొని తింటాము. ఈ ఆరు రుచులలో కూడా ఉప్పు లేనిదే ఉగాది పచ్చడి కూడా రుచిగా ఉండదు. అందుకని ఈ ఉప్పు రుచుల్లో రాజు అన్నమాట. పండ్లలో రాజైన మామిడి కాయను కూడా ముక్కలుగా కోసుకొని ఉప్పు అద్దుకొని తింటాం. బీ.పి వచ్చినవారిని కొద్దిగా ఉప్పు తగ్గించి తినండి అని డాక్టరు చెపితే “అబ్బా చప్పిడి కూరలు తినాలా” అని నీరసపడిపోతుంటారు. ఆహార పదార్థాలలో ఉప్పుకు ఇంతటి ప్రాధాన్యమున్నదనమాట.

మరి ఆహారంలో ఇంత విరివిగా వాడుకునే ఉప్పుని బ్రిటిషువారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఏం చేశారో తెలుసా. ఉప్పు పై పన్ను విధించారు. దాంతో భారతీయులకు కోపం వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్నే లేవదీశారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ ఈ ఉద్యమానికి నాయకుడిగా వ్యవహరించారు. అదే ఉప్పు సత్యాగ్రహం. ఇది 1930వ సంవత్సరం మార్చి 12 వ తేదీన మొదలయింది. అహింసాయుత పద్ధతిలో సాగిన ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. సబర్మతి ఆశ్రమం నుండి దండి దాకా ఈ యాత్ర సాగటం వలన దీనిని దండి సత్యాగ్రహం అని కూడా అంటారు. సరే  ఎందుకీ వివరాలన్నీ అంటారా? మనం ఇప్పుడు ఉప్పు గురించి తెలుసుకోబోతున్నాం.

ఉప్పు శాస్త్రీయనామం తెలుసుకదా! సోడియం క్లోరైడ్ అంటే NaCl. ఇది సహజ సిద్ధంగా దొరుకుతుంది. మరి ఎక్కడ  ఉంటుంది. సముద్రము నీళ్ళను ఎప్పుడైనా నోట్లో పోసుకున్నారా, ఉప్పగా ఉంటాయి కదా! అంతులేని జలరాశి మద్యలో ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు లేవు అంటూ సముద్ర ప్రయాణంలో నీళ్ళ దొరకకపోవడాని గురించి చెపుతారు. అంటే సముద్రపు నీరు దాహం తీర్చడానికి పనికిరాదు. ఈ సముద్రము నీటి నుంచే ఉప్పును తయారు చేసుకుంటాం. సముద్రపు నీళ్ళను పాయలుగా మళ్ళించి చుట్టూ మడులు కట్టేస్తారు. మడి లోపలే నీళ్ళు ఉంటాయి. వాటినలా కొన్నిరోజులు వదిలేస్తే సూర్యుని వేడికి అందులోని నీరంత ఆవిరై పోతుంది. నీరంత ఆవిరై పోగా ఉప్పు రాళ్ళూ తయారౌతాయి. నీటిలో ద్రవరూపంలో ఉన్న ఉప్పు ఇప్పుడు ఘన రూపం లోకి మారి ఉప్పు  స్పటికలు ఏర్పడుతాయి. ఇలాంటి స్పటికలలో ఉండే కలుషిత పదార్థాలను ప్యాక్టరీలలో తీసేస్తారు. అప్పుడు శుద్ధమైన ఉప్పు లభ్యమౌతుంది. మనకు ఒక లీటరు సముద్రము నీటి నించి 35 గ్రాముల ఉప్పు లభిస్తుంది. ఉప్పు కేవలం రుచికే కాదు, ఆహారం నిలవ ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని ఒక ఉదాహరణ చెపుతాను చుడండి. మన ఇళ్ళలో ఆవకాయకు బూజు పడితే అమ్మమ్మ ఏమంటుంది. “ఉప్పు సరిపాళ్ళలో పడకపోతే ఆవకాయ ఎలా ఉంటుంది పాడవక”, అందుకే లెక్క ప్రకారం కొలిచి మరి ఆవకయలో ఉప్పు కలుపుతారు. ఏ నిలువ పచ్చడైనా ఉప్పుతోనే సంవత్సరం దాకా చెడిపోకుండా ఉంటుంది. చింతకాయ కూడా ఉప్పుతో కలిపి తొక్కి నిలువచేసుకుంటారు. చూశారా ఉప్పు ఎంత ఉపయోగాకారో?

పుర్వాకాలల్లో ఉప్పును పడవల మీదా, ఒంటెల మీద, బండ్ల మీద ఒక చోట నుండి మరొక చోటికి రవాణా చేసేవారు. ఉప్పు రవాణా జరిగే రోడ్లను salt roads అనేవారు. అత్యంత ప్రాముఖ్యత కల్గిన ఉప్పు కోసం పూర్వం దేశాల మద్య యుద్ధాలు కూడా జరిగేవి.

సోడియం క్లోరైడుల సమాన మిశ్రమ రూపమే ఉప్పు. ప్రధానంగా ఇది సముద్రపు నీటి నుండి మరియు ఖనిజ నిక్షేపాల ద్వారా లభ్యమౌతుంది. వీటిని సీ సాల్ట్ అని, మైన్ సాల్ట్ అని పిలుస్తారు. గనుల నుంచి లభించే ఉప్పును ఎక్కువగా మెత్తడి పొడి రూపంలో ఉండే టేబుల్ సాల్ట్ తయారికి ఉపయోగిస్తారు. సముద్రము నీటి నుంచి తయారయ్యే ఉప్పు ఎక్కువ రాళ్ల ఉప్పుగా ఉంటుంది. ఉప్పును గనుక నీటిలో కరిగించినట్లయితే సోడియం, క్లోరైడ్ అణువులుగా విడిపోతాయి. ఉప్పును 227 ఫారన్ హిట్ డిగ్రీల దగ్గర వేడి చేసినప్పుడు ద్రవ పదార్థంగా వినియోగించుకోవటం చాల తక్కువగా ఉంటుంది. పారిశ్రామికంగా ఉపయోగాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా 264 మిలియన్ టన్నుల ఉప్పు తయారవుతుంది. ప్రధానంగా చైనా, అమెరికా, భారత్, జర్మని, కెనడా దేశాలు ఉప్పును తయారు చేస్తాయి. గనుల ద్వారా లభించే ఉప్పు కేంద్రాలలో పెద్దది పాకిస్తాన్‌లో ఉన్నది. ఈ గనిలో 19 అంతస్తులు ఉంటాయి.

Khewra Salt Mine, Pakistan

400 కి.మీటర్ల మేర దారులు ఉన్నాయి. ‘రూన్ అండ్ పిల్లర్’ పద్ధతిలో ఉప్పును తవ్వి తీస్తారు. మతపరంగా కూడా ఉప్పుకు చాలా ప్రాధ్యానమున్నది. ప్రమాదకర నెగటివ్ ఎనర్జీలను దరికి రాకుండా చేస్తుందని మత విశ్వాసుల అభిప్రాయం. ఒక చేతిలో నీళ్ళ గిన్నె మరో చేతిలో ఉప్పు గిన్నె ఉంచుకుంటే చాలు అని భావించేవారు.

ఉప్పు పారిశ్రామికంగా కూడా ఉపయోగపడుతుందని అనుకున్నాం కదా! చలి దేశాలలో రోడ్ల పైన పేరుకుపోయిన మంచును తొలగించటానికి ఉప్పును వాడతారు. 8% ఉప్పు దీనికే సరిపోతుంది తయారయిన ఉప్పులో ఒక 6% వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఆహారంలో వినియోగించే ఉప్పు కూడా 6% యే. మిగతాదంతా పారిశ్రామిక ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. మానవులకు మరియు ఇతర జీవులకు ఆరోగ్యపరంగా ఉప్పు ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్ కలిగిన ఉప్పును వాడడం వాళ్ళ థైరాయిడ్ గ్రంథిలో లోపాలు రాకుండా నివారించవచ్చు. మానసిక వైకల్యం రాకుండా కాపాడటంలో కూడా అయోడైజడ్ సాల్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చవకగా దొరికే ఉప్పుకు ఇంత చరిత్ర, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పిల్లలూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here