“ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” అదుపులో వున్న యుద్ధోన్మాదం

0
9

[box type=’note’ fontsize=’16’] భారతీయ ఆర్మీ సమర్థతను ప్రదర్శించి, వెన్ను తట్టే లాంటి ప్రయత్నమే యెక్కువ భాగం కనిపించిన ఈ సినిమాలోని కాస్త నాటకీయతను, రెగ్యులర్ హిందీ సినెమా లక్షణాలను పక్కన పెట్టగలిగితే దీన్ని చూసి మెచ్చుకోవచ్చు” అంటున్నారు పరేష్. ఎన్. దోషిఉరి: ది సర్జికల్ స్ట్రైక్” సినిమాని సమీక్షిస్తూ. [/box]

2016లో ఉరి సంఘటనకు జవాబుగా భారత దేశం నిర్వహించిన సర్జికల్ స్ట్రైకుల కథకు కొంత కాల్పనికత జోడించి తీసిన చిత్రమే “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్”.

యెన్నికల కాలంలో వచ్చే చిత్రాలను (the accidental prime minister, ఉరి, మణికర్ణిక, కథానాయకుడు వగైరా వగైరా) కాస్త జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. మన మెదళ్ళ మీద సినెమాల ప్రభావం తక్కువేమీ కాదు. కాబట్టి కథను కథలా తిన్నగా తీశారా, లేక వొక రకమైన అభిప్రాయాలూ, భావజాలమూ బట్వాడా చేయడానికి వాహికగా వాడుకుంటున్నారా అన్నది ఆలోచించాల్సిన విషయం.

ఆశ్చర్యంగా ఇలాంటి ఇతర చిత్రాలతో పోలిస్తే దేశభక్తి, శత్రుదేశం, యుద్ధోన్మాదం ఇలాంటివన్నీ వొక తూకంతో, అదుపులో పెట్టి మారీ తీశారు. రెచ్చిపోయి తీయలేదు. కాబట్టి ఆ మేర చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్ ను మెచ్చుకోవాల్సిందే.

క్లుప్తంగా కథ చెప్పుకుందాం. 2016 లో ఉరి లో వున్న మన ఆర్మీ బేస్ మీద పాకిస్తాన్ చేసిన దాడిలో 19 మంది సైనికులు మరణించారు. దానికి తగిన జవాబు ఇవ్వవలసిందే. ఆ దాడిలో కరణ్ కాశ్యప్ (మోహిత్ రైనా) కూడా చనిపోతాడు. అతను యెవరంటే ఈ చిత్రంలో నాయకుడైన విహాన్ సింఘ్ షేర్గిల్ (వికీ కౌశల్) బావ. కూతురినీ అనాథ, భార్యను విధవరాలు చేసి దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కరణ్ బావమరిది కూడా భారతీయ సైనికుడే. ఇండియన్ ఆర్మీలో కమాండో గా తన వీరత్వం, శౌర్యం ప్రదర్శించి అందరి గౌరవ మర్యాదలు గెలుచుకున్న విహాన్ పేరు సంపాదించడమే కాకుండా ప్రధాన మంత్రితో (రజిత్ కపూర్) వో విందులో కలిసే అవకాశం పొందుతాడు. తర్వాతి ప్రణాళిక యేమిటి అని ప్రధాన మంత్రి అడిగితే ఢిల్లో తన తల్లి (స్వరూప్ సంపత్) ఆల్జైమర్స్‌తో బాధపడుతోంది, ఈ సమయంలో ఆమెతో గడపడానికి ముందే ఉద్యోగ విరమణ తీసుకుంటున్నట్టు చెబుతాడు. దానికి ప్రధాని మరి ఈ దేశం కూడా నీకు తల్లే కదా అంటాడు. అనడమే కాకుండా అతనికి బార్డర్ డ్యూటి కాకుండా ఢిల్లీలో రెసిడెన్షియల్ పనిలో పెడతాము, నువ్వు తల్లికీ, దేశమాతకీ యేకకాలంలో సేవ చేయవచ్చు అంటాడు. దానికి విహాన్ ఒప్పుకుంటాడు. విహాన్ తల్లికోసం వో నర్సును (యామి గౌతం) యేర్పాటు చేస్తారు.

మరో పక్క ప్రధాని అంతరంగిక సభల్లో పాకిస్తాన్ చర్యలకు యెలా స్పందించడం అన్నది చర్చకు వస్తుంది. నేషనల్ అడ్వైజర్ అయిన గోవింద్ భారద్వాజ్ (పరేశ్ రావల్) దీనికి సర్జికల్ స్ట్రైక్ సరైన సమాధానమవుతుందీ అంటాడు. పాకిస్తాన్ కు యే మాత్రం అనుమానం రాకుండా, వాళ్ళ నేల మీద వాళ్ళ సైన్యాన్ని ముట్టడించడం సూచిస్తాడు. దీనికి ఇతర సభ్యులు కూడా ఆమోదించేసరికి, ప్రధాని ఈ పనిని గోవింద్ పర్యవేక్షణలో జరగాల్సిందిగా నిర్ణయిస్తాడు.

యుధ్ధవ్యూహాలు జరుగుతుంటాయి. ఈ లోగా విహాన్ మిత్రుడొచ్చి నువ్వు ఈ సమయంలో వుండాల్సింది ఇక్కడ కాదు, సరిహద్దుల్లో. ఈ దేశానికి నీ అవసరముంది. నువ్వు వెళ్ళి నిన్ను ఆ మిషన్ లో చేర్చుకోమని అడగాలి అనంటాడు. ఆ విధంగా 80 మంది సైనికుల గ్రూప్ లో విహాన్ కూడా చేరడం జరుగుతుంది. యే విధంగా పాకిస్తాన్ నేలపై అడుగు పెట్టాలి, యే విధంగా వాళ్ళ స్థావరాలు తెలుసుకుని, అక్కడకు చేరి మట్టు పెట్టాలి వగైరా వివరంగా చర్చకు వస్తాయి. ఇద్దరు స్త్రీలు: సమాచారం సేకరించడంలో సహాయపడే ఏజంట్ (యామి గౌతం), మంచి నైపుణ్యం గల పైలట్ (కృతి కులహారి) కూడా వుంటారు ఆ జట్టులో. అయితే వాళ్ళ పాత్ర పూర్తిగా నిర్మించలేదు. డీఆర్‌డీవో లో వో సభ్యుడు తయారుచేసిన పక్షి లాంటి డ్రొన్ ను వాడుకోవాలని ప్రధాని సిఫారసు చేస్తాడు, అది ఇంకా పరీక్షింపబడలేదనీ, ప్రయోగదశలోనే వుందని చెప్పినా కూడా. (ఇలాంటివి పెట్టకపోతే సినెమా యెలా అవుతుంది?) వీళ్ళు యే విధంగా తమ మిషన్ ను జయప్రదం చేస్తారు అన్నది మిగిలిన కథ.

ఇలాంటి సబ్జెక్ట్ ను తీసుకున్నప్పుడు ప్రేక్షకుడిలో ఉద్వేగమూ, భావావేశమూ కలిగించేలా సన్నివేశాల రూపకల్పన, అలాంటి సంభాషణల రచన చేయడం చూస్తాము. ఇందులో లేవని కాదు, వున్నాయి కాని ఇతర ఇలాంటి చిత్రాలతో పోలిస్తే తక్కువ. ఇక మనం ఈ వార్తలను చదివినవారమే, ఉరి లో కట్టుదిట్టంగా రక్షణ వుండలేదని, ఇలాంటి కొన్ని వివాదాస్పద వార్తలూ విని వున్నాము. కాని ఈ చిత్రంలో కేవలం వొక్క కోణం నుంచి మాత్రమే కథ నడిపి, భారతీయ ఆర్మీ సమర్థతను ప్రదర్శించి, వెన్ను తట్టే లాంటి ప్రయత్నమే యెక్కువ భాగం కనిపిస్తుంది.

ఇక వొక చిత్రంగా చూస్తే మాత్రం ఇది బాగా తీశారనే చెప్పాలి. ముఖ్యంగా మితేష్ మిర్చందాని చాయాగ్రహణం. చిన్న పాత్రే అయినా మోహిత్ రైనా బాగా చేశాడు. ప్రధాని పాత్రలో రజిత్ కపూర్, గోవింద్ పాత్రలో ప్రకాశ్ రావల్ బాగా చేశారు. విహాన్ తల్లిగా చేసిన స్వరూప్ సంపత్ ని చాన్నాళ్ళ తర్వాత తెరపై చూస్తాము. కాని ఆమె పాత్ర కూడా మొదట్లో ఆ కాసేపే. ఇంత మంది మధ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వికీ కౌశల్ గురించి. తన మొదటి చిత్రమైన “మసాన్” లోనే తన స్థాయిని చూపించిన నటుడు క్రమంగా యెదుగుతూ వస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆర్మీ మనిషిగా కనబడడంకోసం నెలల తరబడి శరీరానికీ, మనసుకూ శిక్షణ తీసుకున్నాడు. తన మంచి చిత్రాల చిట్టాలో దీన్ని కూడా చేరుస్తూ. కాస్త నాటకీయతను, రెగ్యులర్ హిందీ సినెమా లక్షణాలను పక్కన పెట్టగలిగితే దీన్ని చూసి మెచ్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here