మనమూ-వాళ్ళూ : “ఉస్ దిన్”

0
2

[dropcap]భా[/dropcap]రత దేశానికి ఒక పక్క స్వాతంత్రం వచ్చింది, మరో పక్క దేశ విభజన అయ్యింది. భారత్, పాకిస్తాన్లుగా విడిపోయాం. అప్పటి రక్తపాతం ఇంకా పచ్చి గాయాలుగానే వున్నాయి. కానీ అది అక్కడే ఆగిపోలేదు. పరస్పర అనుమానం, ద్వేషం, పగలతో ఆ సీన్ మళ్ళీ మళ్ళీ recreate అవుతూనే వుంది. కేవలం మనోభావాల ఆధారంగా ఈ దృశ్యాన్ని చూస్తే అర్థం చేసుకోలేము, దానికి మెదడూ, సమ్యమనం, తటస్థ వైఖారి (డిటాచ్మెంట్) అన్నీ అవసరం. ఏడు దశాబ్దాలు దాటినా మారని పరిస్థితి. ఇది మన వరకే కాదు, ప్రపంచమంతటా వున్న విషయం. మనమందరం అనుకోవాల్సిన చోట, మనమూ వాళ్ళూ అని వేరుగా చూసినంత కాలం సమస్యకు పరిష్కారం వుండదు.

ఇది చదివి చాలా తెలిసిన విషయమే అనిపిస్తుంది కదా. అవును తెలిసిన విషయమే. అయితే ఇదంతా పన్నెండు నిముషాల లఘు చిత్రంగా మలచడానికి ఆ దర్శకుడి సృజనాత్మకత మనల్ను అబ్బుర్పరుస్తుంది.

టైటిల్ అప్పుడు వచ్చే షాట్ పై నుంచి పడి రెండుగా విరిగిన క్రికెట్ బాల్. బాల్ గా దాన్ని పోల్చుకుంటాం, కానీ ఆ రెండు సగాలకీ కాస్త ఇంకేదో వుంటుంది అది తర్వాత గాని అర్థం కాదు. ఆ తర్వాత ఎదురెదురు నిలబడ్డ ఇద్దరు పిల్లలు చెమ్మా చెక్కా ఆడుతుంటారు. వాళ్ళ పెదవి కదలికలకు అనుగుణంగా కాకుండా కాస్త తక్కువ వాల్యూంలో గోల లాంటి ధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత మనం చూడ గలిగేది ఆ పిల్లల వెనుక రెండు బారుల్లో పెద్దవాళ్ళు నిలబడి వుండడం. అందరివీ కోపంగా వున్న ముఖాలు. పెదాల కదలికల వల్ల కొన్ని బూతులను పోల్చుకోవచ్చు. పిల్లల ముఖాల్లో ఇదివరకు కనబడిన సంతోషం మాయమై కళ్ళు నీటితో నిండి వుండడం చూస్తాము. నేపథ్యంలో గోల శబ్దం పెరుగుతూ వుంటుంది. అందరూ తెల్లని వస్త్రాల్లో వుంటారు. రాజ్ కుమార్ రావ్ చివరికి తెగేసి చెబుతాడు, ఇక ఇది ఏ మాత్రం సాగదు, ఇకనించి మీరు అటూ, మేము ఇటూ వుందాము అని. ఎదురెదురు పోర్షన్లలో వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు వొకరిని వొకరు విడువకపోతే పెద్ద వాళ్ళు బలవంతంగా లాక్కుని వెళ్తారు.

పిల్లలు పిల్లలే కదా. ఇప్పుడు రెండు ఇళ్ళూ తెరిచి వున్నాయి. తన ఇంటినుంచి ఓ అబ్బాయి బాల్ వేస్తే మరో అబ్బాయి తన ఇంట్లోంచి బేట్ చేస్తాడు. బంతి అవతలి ఇంట్లో వెళ్ళి పడుతుంది. ఆ ఇంటాయన కోపంతో ఆ బంతిని రెండు ముక్కలు చేసి ఈ ఇంటి వైపు విసురుతాడు. రాజ్‌కుమార్ రావు ఆ బేట్ ను నేలకేసి బాది విరగ్గొడతాడు. ఇప్పుడు రెండు తలుపులూ వేసి వున్నాయి. ఇవతలి గదిలో పెద్దవాళ్ళు కోపంగా మాట్లాడుకుంటే, ఓ మూల పిల్లవాడు బంతి రెండు భాగాలనీ అతికిస్తుంటాడు. దానికి అతను వాడేది band-aid ను.తర్వాత దృశ్యంలో రావు అంటాడు నేను అవతలివైపు శబ్దం విన్నాను, వాళ్ళ దగ్గర గన్ వుంది అని. పెద్దాయన ఎందుకలా అనుకుంటావ్, అది ఏదో పడి విరిగిన చప్పుడు కావచ్చు కదా . రావు వొప్పుకోడు, మనమూ గన్ కొనాల్సిందే అంటాడు. అవతలింట్లో కూడా ఇలాంటి అనుమానాలే, ఇలాంటి సంబాషణలే. గన్నులు అమ్మే వర్తకుడు, రావు ఎదురెదురు కూర్చుని వున్నారు. గన్ చేతులు మారుతుంది. విషయం అక్కడితో ఆగుతుందా? ఆ గన్ వర్తకుడు ఏం చేసినట్టు? తర్వాతి సీన్ లో లో ఏంగల్ షాట్ లో ఓ బల్ల మీద పరచిన ఎర్రటి వస్త్రం. (కలర్ స్కీం గమనించండి, మొదట్లో తెల్ల వస్త్రాలు, ఇప్పుడు ఎర్ర వస్త్రం, చివర్లో చీకటీ నలుపూ వాడాడు). ముందు వొక వంద రూపాయల కట్ట పెట్టబడుతుంది. మరో చెయ్యి చిల్లర పెడుతుంది. ఇంకో చెయ్యి ఉంగరాలు, వెండి సామాను, నగలూ ఇలా చాలా సొమ్ము, చివరికి అవీ చాలకపోతే పిల్లవాడి చదువుకునే పుస్తకాలు కూడా చేరాక రెండు చేతులు ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కడతాయి. ఇప్పుడు ఆ బల్ల చుట్టూ నిలుచున్న మనుషులు కనిపిస్తున్నారు. తర్వాత మనం చూసేది ఇంట్లోకి వొక canon వస్తుంది.(కేనన్ కాకపోతే మరొకటి, మొత్తానికి హెవీ వెపన్). పెద్దాయన అంటాడు,నువ్వు తెచ్చినట్టు వాళ్ళకు తెలిస్తే అని. తెలవనీ, అవసరం, మంచిది కూడానూ అంటూ తలుపు తీస్తాడు. అవతలి తలుపు తెరిచే వుంది, అక్కడా ఇలాంటిదే ఓ కేనన్ వుంటుంది. ఇప్పుడిక ఏదీ ఆగేలా లేదు. ఇప్పుడు పెద్దాయన తప్ప (పిల్లవాడిని చూపించలేదు) స్త్రీలతో సహా అందరి దగ్గరా గన్లు ఉన్నాయి. ఎదురెదురు కాల్పులు జరుగుతాయి. ఒక్కొక్కరే నేలకూలుతారు. అంతటా రక్తం.తెరిచి వున్న, పెద్దాయన్ చదివే మత పరమైన గ్రంథమో, మరొక గ్రంథమో దాని మధ్యనుంచి కూడా రక్తం కారుతుంది. అందరి తెల్ల వస్త్రాలు ఎర్రగా మారాయి. నిలబడ్డ రావు మూడు సార్లు గన్ ఫైర్ చేస్తే అతని గుండెలకు మూడు చిల్లులు పడతాయి ఒక షాట్ లో. రావు ఆఖరి ఘడియల్లో వున్నారు, ఆ సవాల మధ్య. ఆ తర్వాతి పరిణామం రెండు విధాలుగా చూపిస్తాడు దర్శకుడు. రావు అతికష్టం మీద తిరిగి చేయి చాచుతూ ముందుకు పాక్కుంటూ వెళ్తాడు. అది అక్కడున్న గన్ ట్రిగర్ వైపు వెళ్తుంది. అదే scene reenact అవుతుంది. రావు అతికష్టం మీద తిరిగి చేయి చాచుతూ ముందుకు పాక్కుంటూ వెళ్తాడు. ఇతని చేయి కలవడానికి అక్కడ మరొక చేయి వుంటుంది. తర్వాతి మాంటేజీలు చిల్లులు పడ్డ గోడలు, మూసుకుంటున్న తలుపుల మీద భారత్, పాకిస్తాన్ నేం ప్లేట్లు. ఆ తర్వాత ఒక కెమెరా కదలిక చీకటి గా వున్న ఆ వరండాలను దాటుకుంటూ మైలపడ్డ మెట్లను దిగుతూ నేల మీద ఫోకస్ అవుతుంది. అప్పుడే పైనుంచి వచ్చి పడుతుంది ఓ బాల్. పడుతూనే రెండుగా పగిలిపోతుంది. ఆ రెండు భాగాలనూ అతికించిన band-aid కూడా రెండు ముక్కలవుతుంది.

చెప్పబడిన విషయం మనకు మొదటి సీన్ నుంచీ తెలిసిన విషయమని అర్థమై పోతుంది. అయితే కొత్తగా ఎలా చెప్పాడు అన్నది మనం చూడాల్సింది. సంభాషణలు చాలా అంటే చాలా స్వల్పం. ప్రతీదీ దృశ్యపరంగానే చెప్పబడింది. ఆ మిజాన్సెన్ లు బాగున్నాయి. మనం వాడటం మానేసిన బ్లాక్ ఔట్- బ్లాక్ ఇన్ లు మళ్ళీ ఇందులో చూస్తాము. ఒక పధ్ధతి ప్రకారంగా ఇరువర్గాల మధ్య వున్న ఘర్షణల తీవ్రత పెరుగుతూ వున్నప్పుడు, ఆ స్థాయీ భేదాల మధ్య punctuation marks లా. ఆ టేబల్ సీన్ లో డబ్బు, సొమ్ములూ కాకుండా పిల్లవాడి పుస్తకాలు కూడా పెడతారు. అంటే భవిషత్ తరం విద్య, interests, అక్కర, భవిష్యత్తు లు కూడా పణంగా పెట్టడం అన్నట్టు.

ఇందులో నటన, సంగీతం అంత గొప్పగా ఆకర్షించవు. కారణం కథ మొత్తంగా చెప్పే బాధ్యత దర్శకుడు విక్రం గుప్తా, అతని DOP తీసుకున్నారు. విక్రం గుప్తా “మై హూఁ న”, “గదర్” లాంటి చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేసాడు. Man’s world అనే టీవీ మినీ సెరీస్ చేసాడు.

ఇది చూస్తుంటే నాకు నార్మన్ మెక్లారెన్ తీసిన “నైబర్స్” అన్న లఘు చిత్రం గుర్తొచ్చింది. అది మనుషులు నటించినా ఒక కార్టూన్ చిత్రం లా వుండి, నవ్విస్తూ ఏడిపిస్తుంది. ఇదే అంశం : మనమూ-వాళ్ళూ. వీలైతే అది కూడా చూడండి.

ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. చూడండి.

లింక్:
https://youtu.be/UiOkXTFk_iA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here