ఉత్తమ ఆలోచన

0
11

[బాలబాలికల కోసం ‘ఉత్తమ ఆలోచన’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]మ[/dropcap]యూరపురం రాజు జయేంద్రుడికి చెట్లంటే ప్రాణం. ఆయన తన అంతఃపురం, కోట చుట్టూ మంచి ఉద్యానవనాలు పెంచాడు. అవి పచ్చగా పూలతో పండ్లతో కళకళలాడుతూ కనబడసాగాయి.

ఒకరోజు జయేంద్రుని ఆస్థానానికి దేవదత్త అనే యోగి వచ్చాడు. క్షేమ సమాచారాలు మాట్లాడుకొనిన అనంతరం జయేంద్రుడు దేవదత్తునితో తనకోట పక్కన ఉన్న ఉద్యానవనంలోకి విహరించడానికి తీసుకవెళ్ళాడు. అలా రకరకాల చెట్లు చూపిస్తూ వాటిని గురించి వివరించసాగాడు జయేంద్రుడు. ఆ తోట లోని పచ్చదనాన్ని, రంగుల పువ్వులను చూచి, పక్షుల కిలకిలారావాల్ని విని దేవదత్తుడు పులకించిపోయాడు!

అలా తోటలో కొంతదూరం వెళ్ళాక పెద్ద మర్రిచెట్టు వద్ద దేవదత్తుడు ఆగి ఆ చెట్టును తదేకంగా గమనించసాగాడు.

“గురువుగారూ, ఆ చెట్టు మాపూర్వీకులు రెండువందల సంవత్సరాల క్రితం వేసినది! అందుకే దానిని శ్రద్ధతో కాపాడుతున్నాను” చెప్పాడు జయేంద్రుడు.

దేవదత్తునికి భూమిలోపల ఏముందో తెలుసుకునే శక్తి ఉంది. “జయేంద్రా మీ పూర్వీకులు వేసిన ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈచెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే వారు ఏ కారణం చేతో ఒక నిధి అంటే బంగారుగల పెట్టెను పెట్టారు. చెట్టు పెరిగిపోవడం వలన ఆ నిధి చెట్టు కింద నిక్షిప్తమై పోయింది! నీవు చెట్టును కొట్టి వేసి ఆ నిధి తీసుకోవచ్చు” అని చెప్పాడు.

“మహానుభావా ఆ మాట మాత్రం అనకండి, కేవలం బంగారే కాదు వజ్ర వైఢూర్యాలు ఉన్నా నాకు వద్దు. నా స్వార్థం కోసం ఓ నిండు ప్రాణం గల చెట్టును, అదిగాక మా పూర్వీకులు వేసిన ఈ చెట్టును కొట్టలేను” అని దేవదత్తునికి చెప్పాడు రాజు.

జయేంద్రుని ఉత్తమ ఆలోచనకి, మంచి మనసుకి దేవదత్తుడు సంతోషించి రాజు గారిని ఆశీర్వదించాడు.

తోట అంతా తిరిగాక ఇద్దరూ అంతఃపురానికి వెళ్ళారు. భోజనం తరువాత దేవదత్తుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి రాజు గారికి కలలో వృక్షదేవత కనబడి ఈవిధంగా చెప్పింది, “రాజా అంత సంపద దొరుకుతున్నా నీవు దానిని త్యజించి చెట్టు రక్షణ గురించి మాత్రమే ఆలోచించావు. ప్రకృతి రక్షణలో నీకు నీవే సాటి. అందుకే నీ రాజ్యం సభిక్షంగా ఉండి సకాలంలో వానలు పడుతున్నాయి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. నీవు చెట్లను, జంతుజాలాన్ని, పక్షుల్ని నిరంతరం కాపాడు. ఆ మంచితనమే సదా నీకు రక్ష. నీ సంతతికి, ఉద్యోగులకి కూడా ఇదే విషయం చెప్పి వాళ్ళను నీ మార్గంలో పెట్టు. వారి కుటుంబాలు సఖసంతోషాలతో ఉంటాయి” చెప్పింది వృక్షదేవత.

గబుక్కున రాజుగారు నిద్ర లేచారు. అక్కడ దేవత లేదు. కానీ ఆమె కనిపించిన ప్రదేశంలో పండ్లు, పువ్వులు కనబడ్డాయి! ఆ పండ్ల విత్తనాలను తన తోటల్లో నాటించాడు. ఆ చెట్ల పండ్లను చూసిన ఆస్థాన వైద్యుడు ఆ పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని అవి చాలా అరుదుగా దొరికేవని వైద్యుడు రాజుగారికి వివరించాడు.

రాజు గారు కోటవైపు తిరిగి ఆ మర్రిచెట్టుకి మనస్సులోనే నమస్కరించుకొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here