ఉజ్బెకిస్తాన్‌లో మా రైలు ప్రయాణం

0
9

[ఇటీవల ఉజ్బెకిస్తాన్‍లో పర్యటించి పలు యాత్రాస్థలాలు దర్శించి ఆ అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా. నర్మదరెడ్డి]

[dropcap]నా[/dropcap]కు ప్రయాణాలంటే ఇష్టం. ఎన్నో దేశాలు తిరిగాను. 2017 లో సిల్క్ రూట్‌లో నేను ప్రయాణం చేశాను. ఈ సిల్క్ రూట్‍లో ప్రయాణం చేసేటప్పుడు కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ఎక్కువ టైమ్ కేటాయించలేకపోయాను. అందువల్ల ఈసారి ఉజ్బెకిస్తాన్ ప్రత్యేకంగా చూసి రావాలని అనుకున్నాను. క్రితంసారి ఈ రూట్‍లో ప్రయాణం చేస్తూ మేము మంగోలియా ఎడారి తర్వాత చైనా, రష్యా ఇవన్నీ ఒక ట్రైన్‌లో వెళ్ళాము. రష్యా నుంచి మొదలుపెట్టి మంగోలియా ఎడారి తర్వాత చైనా వెళ్ళాము. నిజంగా ఇప్పుడే ఇంతో కష్టమైన ఈ ప్రయాణాన్ని – అప్పుడు మార్కోపోలో ఎలా చేశాడో అని ఆశ్చర్యపోయాను.

ఉజ్బెకిస్తాన్ మీదుగా సిల్క్ రూట్‌లో ప్రయాణం చేసినప్పుడు కుబ్లయ్ఖాన్ దగ్గర బసచేశారు మార్కోపోలో. ఆ కాలం నాటి చేతి వ్రాతని, ఆయన సంతకాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. దీన్ని నేను 2013 లో తైవాన్ వెళ్ళినప్పుడు మ్యూజియంలో చూసాను.

ఇప్పుటి మా ఉజ్బెకిస్తాన్ ప్రయాణంలో భాగంగా నేను, పద్మ, గిరిజ, రేవతి – ఇంద్రారెడ్డి, సింగ్ గారు, డాక్టర్ చారి గారు, శ్రీనివాస గారు – మొత్తం ఎనిమిది మంది 2024 మే నెలలో బయలుదేరాము.

మేము తాష్కెంట్ చేరేసరికి రాత్రి 11 అయింది. పడుకునేసరికి 12 అయింది. ఇమిగ్రేషన్ తర్వాత మా వెహికల్స్ వెతుక్కోవడం, పికప్ వాళ్లని కలవడం ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. మమ్మల్ని పికప్ చేసుకోడానికి వచ్చిన వాళ్ళు తమ కారులో, మాకు బస ఏర్పరిచిన ‘ఉజ్బెకిస్తాన్’ అనే హోటల్‌కి తీసుకెళ్లారు. చాలా పెద్ద హోటల్. మేం నలుగురం ఆడవాళ్ళం మాత్రం ఇందులో ఉన్నాము. మగవాళ్ళు నలుగురు వేరే హోటల్లో దిగారు. నేను పద్మ ఒక రూమ్‌లో ఉన్నాం. రాత్రి మధ్యలో ఏసి పని చేయక, గదంతా వేడెక్కిపోయింది. రూం సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసినా ఎవరు రాలేదు. అలాగే తలుపులు తెరుచుకొని పడుకున్నాము. మర్నాడు ఉదయం కిందికి వెళ్లేసరికి 100 మంది దాకా ఉన్నారు లౌంజ్‍లో. మేము మా బ్రేక్‌ఫాస్ట్ తినేసి, ఆ హోటల్లోనే ఉన్న ఎక్స్చేంజ్ బ్యాంకులో మా డబ్బులని మార్చుకున్నాం.

దగ్గరలోనే ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించాం. లాల్ బహాదూర్ శాస్త్రి గారు 1964లో యుద్ధ విరమణ సంధి కోసం తాష్కెంట్ వచ్చి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తరువాత అక్కడి నుంచి ఒక పెద్ద హోటల్ కి వెళ్ళాము. ఆ హోటల్లో చాలా పెద్ద పెద్ద బావుల్లాగా ఉన్నాయి. బావిని మనము చూస్తాం కదా చుట్టూ చుట్టినట్టుగా. అలా చుట్టూ చుట్టినట్టుగా ఉన్న దానిలో అక్కడ వంటలు వండుతున్నారు. ఆ పెద్ద పెనం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పెద్ద పెద్ద బాయిలర్ టైప్‌లో ఉన్న డిషెస్‌లో వండుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున వంట చేయడం అనేది నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి రోజు ఒక వెయ్యి టన్నుల భోజనాన్ని ఇక్కడ వండుతారట.

ఇందులో ఒక చోట చూసినది ఏంటంటే వందలాది కేజీల టమాటా, క్యారెట్లు, ఉల్లి అలనాటి సాంప్రదాయ పద్ధతిలో ఒక వంట వండితే రెండవ వంట మటన్ చికెన్. తర్వాత అన్ని రకాల కూరలు కూడా అక్కడ తయారు చేస్తున్నారు. ఇవన్నీ వండటం ఒక ఎత్తు అయితే 2 వేల మంది అక్కడ తినడానికి రావడం అనేది నాకు చాలా చాలా కలిగించింది అయితే నేను వంట దగ్గర ఫోటోలు దిగాను కానీ భోజనం దగ్గర కూర్చొని తినడానికి అడిగితే అయిపోయిందని చెప్పారు. అయ్యో అనుకున్నాను. అయితే ఆరోజు మేం ఆడవాళ్ళం, మేం వండుకున్న ఉప్నా తినేసాం, కానీ జంట్స్ మాత్రం పలావు తినాలని కోరిక తోటి ఉప్మా తినలేదు. తర్వాత ఊరంతా తిరిగి బ్రెడ్ జామ్‌ల తోటి వాళ్లు ఆకలి తీర్చుకున్నారు.

అక్కడి నుంచి మాకు మొత్తం తాష్కెంట్ చూపించారు. తాష్కెంట్‌లో చక్కటి మదరాసాలు ఎన్నో. పురాతనమైన కట్టడాలు అవి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగం కాబట్టి దానికి సంబంధించిన ఎన్నెన్నో చారిత్రక కట్టడాలను చూసి చాలా ఆనందించాము. ఇక్కడే ఒక పెద్ద విగ్రహం సిటీకి మధ్యలో ఉంది. యుద్ధంలో చనిపోయిన వారి స్మారక చిహ్నంగా అక్కడ పెట్టారు. అక్కడ సైనికులకు నివాళులర్పించి మేమంతా ఒక ఫోటో దిగేసి అక్కడ నుంచి బయలుదేరి ఒక బట్టల ఎగ్జిబిషన్ లాంటి ప్లేస్‌కి వెళ్ళాము. కుర్తాలు, కార్పెట్లు చేతితో తయారు చేసిన దిండ్లు, ఎన్నెన్నో రకాలు అమ్ముతున్నారు. ఒక 100 షాపుల వరకు ఉన్నాయి. అవన్నీ తిరిగి చూసి మేము దగ్గర్లోని అతి ఎత్తైన టవర్ దగ్గరికి వెళ్ళాము. ఆ టవర్‍ను చూసేసి హోటల్‌కి తిరిగి వచ్చాం.

***

మర్నాడు శాండిల్‌వుడ్‌తో కట్టిన ఒక పెద్ద కట్టడాన్ని చూశాము. అది చాలా పురాతనమైనది. ఇప్పుడు అది మసీదుగా మారింది. ఇంతకుముందు అది మదరసా. చదువు చెప్పే వాళ్ళక్కడ. ఇప్పుడు మసీదు లాగా ఉపయోగిస్తున్నారు.

ఆ మసీదులోకి ప్రవేశిస్తున్నప్పుడు తల మీద ఒక కవర్ లాంటిది వేసుకొని మాత్రమే లోనికి వెళ్ళాలని చెప్పారు. అక్కడే ఒక స్టాండ్ మీద చిన్న స్కార్ఫ్ లాంటివి పెట్టారు. వాటిని తల మీద ధరించి లోపలికి వెళ్ళాం. అక్కడ చక్కగా కూర్చోడానికి – గీతల్లాగా క్లాత్‌ని వేశారు. చక్కగా ఒక్కొక్క వరసకి ఒక్కొక్క విధంగా ఒకటి వైట్, ఒకటి క్రీం కలర్‌లో ఉంది. ఆ గోడలపై చెక్కిన శిల్పాల సౌందర్యం అద్భుతం. వాటిని తిలకించి మేము బయటికి వచ్చాము. కొందరు ఉజ్బెకిస్తాన్ లేడీస్ వచ్చి, అనుమతి అడిగి మాతో ఫోటోలు దిగారు. కాసేపు మేము సెలబ్రిటీస్ అయిపోయినట్టు భావించాం! వారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు.

రెండో రోజు కూడా మేము అలాంటి కట్టడాలని చూస్తూ చూస్తూ చాలా ప్రదేశాలు చూసాము. అబ్బబ్బ ఎంత పెద్ద పెద్ద మదరసాలో. అలాంటి కట్టడాలు మసీదులు ఉజ్బెకిస్తాన్‌లో వందలు వందలు ఉన్నాయి. చాలా వరకు చూసాము.

మర్నాడు వేరే ప్లేస్‌కి రైలు ప్రయాణం చేయాలని, మాకు రాత్రి ట్రైన్ టికెట్స్ తెచ్చి ఇచ్చారు ఆర్గనైజర్స్. మర్నాడు ఉదయం 11:30 కి ట్రైన్. ఉదయం, వాళ్ళు వచ్చి పికప్ చేసుకొనే లోపు, దగ్గరున్న ప్లేసెస్ మళ్ళా చూసి వద్దామని వెళ్ళాం. అక్కడ ఉజ్బెకిస్తాన్ రాజు విగ్రహం చాలా పెద్దది ఉంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాము.

ఇక్కడ మాకు గైడ్‌గా వచ్చిన అమ్మాయికి 29 ఏళ్ళ వయసట. ఎంతో అందంగా ఉంది. ఇక్కడ ఎవరు నల్లటి బురఖాలు మాత్రం వేసుకోలేదు. వాళ్ళు మసీదులోకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అవి వాడుతున్నారు తప్ప, మామూలుగా తెల్లటి బుర్కాలు వేసుకుంటున్నారు. ఇక్కడ 94% ఇస్లాం మతమే ఉంది. ఉజ్బెకిస్తాన్ ఆసియా ఖండంలో ఉంది. తూర్పుదిక్కులో కిర్గిస్తాన్, దక్షిణ దిక్కున ఆఫ్ఘనిస్తాన్, పడమర దిక్కులో కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి పూర్వకాలంలో సమర్ఖండ్ రాజధానిగా ఉండేదట. మేము సమర్ఖండ్‌కి ట్రైన్‌లో వెళ్ళాము. సందట్లో సడేమియా అన్నట్లు మేము మా టికెట్స్ పోగొట్టుకున్నాము. దాంతో నేను పద్మ గబగబా టికెట్స్ అమ్మే దగ్గర కౌంటర్‌కి వెళ్లి మా టికెట్స్ పోయాయని చెబితే, ఆయన కంప్యూటర్‍లో ప్రింట్ తీసి టికెట్స్ ఇచ్చాడు. ఇక్కడ 80% ఉజ్బెకిస్తాన్ భాష మాట్లాడతారట. ఈ అధికార భాషని ఉజ్బెక్ అంటారు.

ఇక్కడ చాలామంది రష్యన్స్ ఉన్నారు, టర్కీ వాళ్ళు ఉన్నారు. కానీ విద్యా బోధన కూడా ఉజ్బెక్ భాషలోనే చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయట. నేను మయన్మార్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడం గమనించాను. ప్రభుత్వ పాఠశాలలన్నీ అధికార భాషలోనే ఉన్నాయని మా గైడ్ చెప్పింది. అయితే చాలామంది ఇప్పుడు స్పెషల్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంట. అలాగే ఒక లాంగ్వేజ్ కింద ప్రవేశపెట్టాలని కొన్ని కొన్ని స్కూల్స్‌లో ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు.

మేమిక్కిన ట్రైన్ చాలా చాలా బాగుంది. చక్కటి ఫాస్ట్ ట్రైన్స్ అన్నమాట. సమర్ఖండ్‌కి మేము మూడు గంటల్లో చేరాము. అక్కడకి చేరగానే వాష్ రూమ్‌కి వెళ్ళాలని అడిగితే మా గైడ్ చక్కటి హోటల్‍కి తీసుకెళ్లింది. అక్కట టీ తాగాకా, మమ్మల్ని – నీలం రంగులో చక్కటి చిన్న చిన్న చిప్స్ తోటి తయారు చేసిన పెద్ద భవనానికి తీసుకెళ్ళింది. ఆ భవనము నీలిరంగులో మెరిసిపోతోంది. అంత చక్కటి నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం! అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారో నిజంగా అర్థం కాలేదు. ఈరోజు మనం ఒక ప్లేట్ కొనాలంటేనే ఎంతో ఎక్కువ ధర పెట్టాలి, అలాంటిది అంత పెద్ద పెద్ద భవనాల్ని ప్లేట్లతో ఎలా కట్టారో. అవి బ్లూ డైమండ్ లాగా మెరిసిపోతున్నాయి. అక్కడ గుర్రం మీద ఎక్కిన ఒక సైనికుడి విగ్రహము పార్క్‌లో ఉంది. ఆ విగ్రహం దగ్గర మేము ఒక ఫోటో దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ వీధులన్నీ తిరిగాము.

ఒక ఆర్ట్ ఎగ్జ్‌బిషన్‌కి వెళ్ళాం. అప్పటి కళలతోటి బట్టతో తయారు చేసిన బొమ్మల్ని కీలుబొమ్మలాట అని మనం అనేవాళ్ళం కదా, అలాంటి బొమ్మలను తయారు చేసిన ప్రదర్శనకి వెళ్ళాము. కాసేపు అక్కడ కూర్చున్నాం. చాలా ఫోటోలు ధిగేసి అక్కడ పెయింటింగ్స్ వేసే బొమ్మలను చూశాం. తర్వాత ఒక చిన్న హోటల్లో వాళ్ళు తయారు చేసే పలావ్ తినాలనుకున్నాం, కానీ తయారు చేయడానికి మూడు గంటలు టైం పడుతుందట. మాకు అంత సమయం లేకపోవడంతో, వెనక్కి వెళ్ళిపోయాం.

ఆ రోజుల్లో యూరప్ నుంచి వచ్చే వాళ్లూ, ఈ సిల్క్ రూట్లో ప్రయాణం చేసే యాత్రికులు అందరూ ఇక్కడ ఈ ప్రదేశంలో.. అంటే సమర్ఖండ్‌లో బస చేసేవారట. ఈ బస చేసే వీధులన్నీ చూస్తూ తిరిగాము. ఒకచోట 24 వెరైటీస్ ఆఫ్ టీ – అమ్ముతున్నారు. నేను వాటిని వీడియో తీసుకున్నాను. 24 రకాల ఉజ్బెకిస్తాన్ టీ రుచి చూశాము. అక్కడే వాళ్ళు ఆనాటి కాలంలో ధరించిన చక్కటి టోపీలు, బట్టలు అన్ని ఉన్నాయి. మేము ఆ టోపిలు పెట్టుకొని ఫోటోలు దిగేసి అక్కడినుంచి బయల్దేరాం. ఒకప్పుడు మదరసాలు ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చక్కటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా తయారయింది. అక్కడ అన్ని రకాల చున్నీలు, బుర్కాలు, బట్టలు, పర్సులు అమ్ముతున్నారు. కొన్ని కొనుకున్నాం. అక్కడ మాకు కొందరు తెలుగు వాళ్ళు కలిశారు. వాళ్లు అక్కడ విశేషాలు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏడు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారంట. “చక్కగా ఉంది, ఇక్కడ చాలా మంచి వాళ్ళు” అని చెప్పారు.

***

కరిమువ్వ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కరీమువ్వ అనే అతను పరిపాలించాడట. ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో చక్కటి హోటల్స్. పాత కాలపు హోటల్స్ లాగా బస చేసుకునే తీరుగా ఉండి, ఆహార పదార్థాలని కట్టుకుని తిరిగేవారి కోసంలా ఏర్పాట్లున్నాయి. పూర్వం ఈ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు వాళ్లు – మారకపు చిహ్నంగా అంటే డబ్బును ఉపయోగించకుండా తాము తెచ్చిన వస్తువులుని వీళ్లకు అమ్మే వాళ్ళు. వీళ్ల దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గర సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఈ సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని వాళ్ళు తెచ్చిన బట్టలతోటి మార్పిడి చేసుకొని వెళ్లేవారట. ఇవన్నీ మాకు మా గైడ్ చెప్తూ ఆ దారి వెంబటి నడిపించింది. అక్కడ ఒక బృందం చక్కగా పాటలు పాడుతూ చెవులకు విందు చేశారు. అవన్నీ చూస్తూ వీడియోలు తీసుకుంటూ మేము అక్కడి నుంచి ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్లి అక్కడి ఎత్తైన శిఖరం చూశాం.

మేము బయల్దేరి వచ్చిం తరవాత బుకారాలో 2 గంటలు ఆగవల్సి వచ్చింది. మేము ప్రొద్దున లేవగానే ఉప్మా చేసుకుని స్టేషన్‌కి వెళ్లి తిన్నాం, ఎందుకంటే ఇంక అక్కడ ఏం దొరకదు. కాబట్టి అందరం కల్సి టిఫిం చేసేసరికి బుకారా నుంచి బయల్దేరే ట్రైన్ వచ్చింది. అందరం ఆ ట్రైన్ ఎక్కేసి మళ్లీ తాష్కెంట్‌కి చేరుకున్నాము. చుక్ చుక్ రైల్లో మా ప్రయాణం అనే ఒక పుస్తకం రాయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ చుక్ చుక్ రైల్లో ప్రయాణానికి నాందిగా ఉజ్బెకిస్తాన్‌లో మొత్తం ప్రయాణం అంతా కూడా మేము ట్రైన్లోనే చేశాము. నాకు చాలా సంతోషం అనిపించింది.

తాష్కెంట్ చేరాకా, పలావ్‍కి ప్రసిద్ధమైన ఆ ప్లేస్‌కి మళ్ళీ తీసుకొని వెళ్లారు ఆర్గనైజర్స్. ఎందుకని అంటే, దాదాపు 2,000 మంది వచ్చి రుచి చూసే ఆ పదార్థాన్ని తినకుండా మీరు వెళ్లకూడదన్నారు. పలావ్ సెంటర్లో మాకు ఫుడ్డు దొరికింది. చాలా సింపుల్ సుగంధ ద్రవ్యలతో తయారు చేసిన ఆ పలావ్ తిన్నాము, నిజంగానే దాని రుచి అమోఘం! అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాం.

అక్కడి నుంచి మమ్మల్ని ఫౌంటెన్స్ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ ఫౌంటెన్స్ ఉన్న ప్రదేశంలో ఆ రోజు సాయంత్రం తేనీరు తాగి చిన్ని బస్సు అంటే బస్సు కాదు బస్సు బొమ్మ, ఆ బొమ్మ ముందు ఒక ఫోటో దిగాం.

కాఫీలు టీలు చిన్న చిన్న ప్లేట్సు గాలిలో ఎగురుతున్నట్లుగా ఒక పార్కులో పెట్టారు. అక్కడ కూడా ఒక ఫోటో దిగేసి మేము ఆ ఫౌంటెన్ దగ్గరకి వెళ్ళాము. ఆ ఫౌంటెన్స్‌లో నుంచి చక్కటి గీతాలతోటి నీళ్లన్నీ నాట్యం చేస్తున్నాయి. రకరకాలుగా రకరకాల భంగిమలతోటి నాట్యం చేస్తుంటే అబ్బురంగా చూస్తూ మొత్తానికి మేము తడిచిపోయి అక్కడ నుంచి బయలుదేరి రూమ్‌కి వచ్చాము.

రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయి, భోజనానికి ఒక హోటల్ కి వెళ్ళాము. ఆ హోటల్లో ఆరోజు రాత్రి చక్కగా డీజే పెట్టారు. మేమందరం కలిసి డాన్స్ చేస్తూ తింటూ బాగా ఎంజాయ్ చేసాము. మర్నాడు సాయంత్రం మా ఫ్లైట్.

మళ్ళీ కొన్ని ప్రాంతాలూ చూసి, చక్కగా షాపింగ్ చేసుకుని సాయంత్రానికి ఎయిర్పోర్ట్‌కి వచ్చాము. ఎయిర్పోర్ట్‌కు రాగానే మా దగ్గర ఉజ్బెకిస్తాన్ కరెన్సీ బాగా మిగిలిపోయింది. ఎవరిని అడిగినా తీసుకోవడం లేదు. చివరికి ఒక అబ్బాయి తాను తీసుకుంటానని చెప్పి, ఆ డబ్బులు తీసుకొని చాలా తక్కువ ధరకు డాలర్స్ ఇచ్చాడు. అవి తీసుకొని మేము ఇంటికి బయలుదేరి వచ్చాము.

ఎన్నో మధుర స్మృతులను మిగిల్చిందీ చుక్ చుక్ రైలు ప్రయాణం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here