వాక్కులు-12

0
10

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

[dropcap]వా[/dropcap]క్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్థాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

331
తల్లి, తోబుట్టువు, భార్య, కూతురు, స్నేహితురాలు.. మగవాడికి‌ వరాలు.
“స్త్రీలు”

332
గొప్పతనానికి అనువాదంగా కవిత్వం వచ్చింది.
“సాయం, మేలు, స్నేహం”

333
నిద్రలేచాక వెలుగు నిజంలా కనిపించింది.
“పని, ఫలితం”

334
నన్ను నేను నాలో నింపుకున్నాను.
“ఆనందం”

335
చెడు ఇంతవఱకూ చెడిపోలేదు.
“ప్రపంచం”

336
చచ్చి బతుకుతోంది, బతికి చస్తోంది మనసు.
“మనుగడ”

337
ఆకలి తన ఆకలిని తీఱ్చుకుంటూనే ఉంది.
“కసి”

338
మొదలు, తుదలేని వస్త్రం మనపై, మనకై ఉంది.
“ఆకాశం”
(వస్త్రంలాగా అనే అర్థాన్నిచ్చే ‘పటవచ్చ’ అన్న ఒక బ్రహ్మసూత్రాన్ని చదివాక)

339
జనాల్ని‌‌ బాధిస్తూ ఊళ్లో మురికి‌కాలువ పాఱుతోంది.
“మేధావర్గం”

340
పాలు విరిగిపోయాయి.
“చదువుకున్నవాళ్లు”

341
అయినవాళ్లే అందమైన చిత్రాన్ని చింపేస్తున్నారు.
“తెలుగు”

342
మళ్లీ చక్కబడాల్సిన అద్భుతమైన చిత్రం ఉంది.
“తెలుగు”

343
వక్రతవల్ల, వక్రతతో మేధావులు బాగును ఓగు చేస్తున్నారు.
“తెలుగు”

344
మతిచెడ్డ ఆంబోతులు పడ్డాక పంట విలవిల్లాడుతోంది.
“తెలుగు”

345
తెలుగుకవిత పెనునిప్పుకు తగలబడిపోతోంది.
“కమ్యూనిజమ్”

346
రొచ్చులో పడడం కాదు, రొచ్చే వచ్చి పైనపడింది.
“కమ్యూనిజమ్”

347
ఎక్కడివో కొడవలి, సుత్తి ఇక్కడి కవితపై పడ్డాయి.
“ఛిద్రం, గాయం, హననం”

348
కవిత్వం నదిలో కమ్యూనిజమ్ కలిసిపోయింది.
“మురుగు, దుర్గంధం”

349
పనికిమాలిన తెలుగువాడు కాలాన్ని మలినం చేస్తున్నాడు.
“కవి, పండితుడు, విమర్శకుడు”

350
ప్రాణంపై దెబ్బపడి జీవనం అయింది.
“మనిషి”

351
తెలుగులో నెమలి అన్న శీర్షికతో కాకి‌ బొమ్మ‌‌ గియ్యబడ్డది.
“గజల్”

352
అనురాగంతో ఆకాశం బుగ్గపై భగవంతుడు ఓ ముద్దును ముద్రించాడు.
“జాబిల్లి”

353
అర్థాన్ని ఇచ్చిన పదం ఆకాశానికి‌ సాటిగా‌ ఉంటుంది.
“నాన్న”

354
వక్రతకు‌‌ సక్రమమైన అభివ్యక్తి వచ్చింది.
“మనిషి”

355
మతం రగిలాక హితం ఉంటుందా?
“నరమేధం, విధ్వంసం”

356
కవిత్వం తోటకు కార్చిచ్చు అంటుకుంది.
“కులవాదం”

357
పాములు సమాజాన్ని కాట్లేస్తూనే ఉన్నాయి.
“మేధావులు”

358
తెలుగు సాహిత్యంలో వికారం విస్తృతంగా వివృతమయింది.
“ఎమ్.ఎ., ఎమ్ ఫిల్., పిహెచ్.డి.”

359
గొప్ప ప్రతిభ గానమయింది.‌ గొప్పగానానికి ప్రతిభ అమరింది.
“బాలసుబ్రహ్మణ్యం”

360
ఊహకందని గానానికి ఊపు వచ్చింది.
“బాలసుబ్రహ్మణ్యం”

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here