వాక్కులు-3

0
16

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

61
తలపుతో తలపు గుద్దుకుంది.
“సృజన, రచన”

62
మనువుకు సంబంధం లేకుండా వేలాది కులాలు ఉన్నాయి.
“మోసం, మదం, కుత్సితం”

63
తెలుగుకవితకు పిచ్చిపట్టింది.
“ప్రక్రియలు”

64
లేని కవిత్వంపై విశ్లేషణల శ్లేష్మం పేరుకుంది.
“పనికిమాలినతనం”

65
గతాన్ని కాల్చింది, వర్తమానాన్ని కాలుస్తోంది, భవితను కాలుస్తుంది.
“దోషం”

66
పేరుకుంటున్న మురికి వాస్తవాల్ని కొరికేస్తోంది.
“పాత్రికేయం”

67
వ్యక్తిత్వం అనేది చాల కాలంగా లేకుండా పోయింది.
“వ్యక్తులు”

68
బలమైన తప్పు జరిగింది.
“ప్రాంతీయత”

69
కులంతో బతుకుతున్నారు, కులవివక్ష అంటారు.
“చెడ్డతనం, దగుల్బాజీతనం”

70
సృష్టిలో విస్తారంగా ఔన్నత్యం ఉంది.
“స్త్రీత్వం”

71
మట్టుపెట్టడం ఎప్పటి నుంచో ఉంది.
“గిట్టనితనం”

72
విచిత్రంగా తనను తానే మోసుకుంటూ అతడు నలిగిపోతున్నాడు.
“మనిషి”

73
నదిలో స్నానం చేసిన తెమ్మెర మదిపై వీస్తోంది.
“మధురస్మృతి”

74
ఉదయం నుంచి జరుగుతున్న వాటిని చూసి బాధపడింది రోజు.
“చీకటి”

75
పనిచేస్తూoటే ప్రయోజనం సిద్ధిస్తుంది.
“ఉదయం”

76
పడిలేచినవాడు సత్ఫలితాల్నిస్తాడు.
“సూర్యుడు”

77
తప్పిదం ఒప్పిదం అయిపోయింది.
“బతుకు”

78
తలపుకు మోక్షం వచ్చింది.
“వలపు”

79
చెవిటి బుఱ్ఱకు గొప్ప పాట వినిపించదు.
“ఇంగితజ్ఞానం”

80
అడగబడని ప్రశ్నకు సమాధానం ఇవ్వబడ్డది.
“కవిత”

81
పొద్దు పువ్వు కనిపించే పరిమళాన్నిచ్చింది.
“వెలుగు”

82
తలపులు మందహాసం చేస్తున్నాయి.
“ఆశలు”

83
గాలి వీస్తూనే ఉంది.
“జ్ఞాపకం”

84
తెలివి, తెలివిడి లేకుండా తేలిగ్గా పనిచెయ్యచ్చు.
“విశ్లేషణ”

85
నిజం వద్దు ఇజం కావాలి.
“మేధావి”

86
మనిషి జీవనాన్ని కౌగిలించుకున్నాడు.
“జీవితం”

87
ప్రపంచం పేలుతోంది.
“మతస్థులు”

88
ప్రజలకు నిప్పంటిస్తున్నారు.
“ఉద్యమం”

89
పువ్వు పుట్టడం నేను చూశాను.
“కొత్తకవిత”

90
మళ్లీ తన జ్ఞాపకం మదిలో మెదిలింది.
“తెమ్మెర”

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here