వాక్కులు-5

0
10

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

121
తెలుగు రాకపోతే ఏం? తెలివి, తెలివిడి లేకపోతే ఏం? ఆగరు, మారరు.
“కవులు, పరిశోధకులు”

122
కోట్లాది రూపాయలతో దేశానికి హాని జరిగింది.
“మతోన్మాదం”

123
మేధావులు విదేశీ డబ్బుతో ఎంతో కృషి చేస్తున్నారు.
“మంటలు, విధ్వంసం”

124
అర్హతకు మించినదాన్ని పొందాడు. ఆపై అన్యాయం అని అరుస్తున్నాడు.
“కులస్థుడు”

125
మతోన్మాది మట్టికి నిప్పంటించి చలి కాచుకుంటున్నాడు.
“మనదేశం”

126
అభిరుచి గమనం, రుచి గమ్యం.
“జీవితం, జీవనం”

127
మనిషి తన దెబ్బ తానే తిన్నాడు.
“జీవనం”

128
మహనీయులెందఱో ప్రయత్నించినా మనిషి రోగిగానే ఉన్నాడు.
“బుద్ధి, ఆలోచన”

129
జననానికి మరణం వచ్చింది. మరణానికి జననం వచ్చింది.
“జీవి”

130
కత్తినుంచి రక్తం కాఱుతూనే ఉంది.
“మతం”

131
ఎప్పుడో అంటుకున్న నిప్పు ఇంకా రగులుతూనే ఉంది.
“మతం”

132
భద్రత ఛిద్రం అయిపోయింది.
“మతం”

133
శాంతి శవం అయింది.
“మతం”

134
దేశాలు, ప్రదేశాలు పొడిచెయ్యబడ్డాయి.
“మతం”

135
చొరబడింది చెడపు చేస్తూనే ఉంది.
“మతం”

136
ఆలయాలు, గ్రంథాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి.
“మతం”

137
గుప్పెడంత మెదడుకు కొండంత ఉన్మాదం పట్టింది.
“కులం”

138
చాల పెద్ద కుట్ర జరిగిందని సమాజంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది‌.
“కులం”

139
మతస్థులు ఎప్పుటినుంచో మంట పెడుతూనే ఉన్నారు, మట్టి మండుతూనే ఉంది.
“భారతదేశం”

140
కులాలకు పెద్ద పట్టిక కట్టారు.
“రాజకీయం”

141
మతరహిత దేశం అని అన్నారు కానీ, కులరహిత దేశం అని అనలేదు.
“కుటిలత్వం”

142
పడిన గుంటలో ముందుకు పెరుగెడుతున్నాడు మనిషి.
“వయసు, ఎదుగుదల”

143
అభిప్రాయాల్లో మధ్యతరగతి మనిషి తప్పిపోయాడు.
“అవగాహనారాహిత్యం”

144
అర్థంకాని భాషలో కావ్యం చదవబడుతోంది.
“ఎఱుక”

145
తనకు తాను అడ్డమైపోయాడు మనిషి.
“మనుగడ”

146
తెలివిడి అలవడలేదు మనిషికి.
“పతనం”

147
వినడం చాతకాని మనిషి‌ చెప్పడం మాత్రమే చేస్తున్నాడు.
“చెత్త, చెడుపు”

148
కనిపిస్తున్నదాన్ని చూడడం చాతకావడంలేదు మనిషికి.
“అసహనం, గందఱగోళం”

149
తననుంచి‌ తాను‌ కోలుకోవడంలేదు మనిషి.
“జీవనవ్యాధి”

150
అహర్నిశలూ అసత్యం కోసం పనిచేశాడు మనిషి.
“నగ్నసత్యం”

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here