వాక్కులు-6

0
12

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

151
మనిషి పోకడ పొల్లుపోయింది.
“రాపిడి, రగడ”

152
ప్రజలు ఉమ్మేస్తున్నా తుడుచుకోరు.
“మేధావులు”

153
దేశంపై దాడి జరుగుతోంది.
“మతం, ఇజం, మేధావులు”

154
దేశానికి ఏ మేలూ జరగలేదు; ఏ వెలుగులకీ ప్రస్థానం?
“కమ్యూనిజమ్”

155
విదేశీధనం, విధ్వంసక భావజాలం కలిసి పనిచేస్తున్నాయి.
“విద్వేషవాదం”

156
మేధ అన్న మురుగులోంచి కొన్ని‌ తలలు అఱుస్తూంటాయి.
“వికృతం, వికారం”

157
ఉనికి కోసం పిచ్చ వాగుడు రచ్చ చేస్తోంది.
“విశ్లేషణ”

158
కలల్లోనూ భయం వేస్తోంది.
“క్షేత్రవాస్తవికత”

159
నాలుకంతా చేదయిపోయింది.
“యథార్థం”

160
నీళ్లులేని నది‌ ఒడ్డున చేపలు విలవిల్లాడుతున్నాయి.
“మంచివాళ్లు”

161
మహాత్ముడయ్యేందుకు మంచి మర్మం ఉంది‌‌.
“వికారత్వం”

162
తన సంతానం భ్రష్టుపట్టినా గొప్ప జనపిత అవచ్చు.
“మహాత్మ”

163
విదేశీ భావజాల బానిసలు తెగ పనిచేస్తున్నారు.
“మేధావులు”

164
తప్పుడు చరిత్రలో తప్పిపోయి తప్పుడువాడయ్యాడు.
“పౌరుడు”

165
చరిత్ర, దేశం చేటుబారాయి.
“నాయకులు, మేధ”

166
ప్రకృతి ప్రశస్తమైన కవిత చెప్పింది.
“స్త్రీ”

167
వ్యాఖ్యానించబడలేని విషయం‌ మూర్తిమత్వాన్ని పొందింది.
“స్త్రీ”

168
అద్భుతం ఆకృతై అభినయిస్తోంది.
“స్త్రీ”

169
మెఱుపుకు మనసుంది.
“స్త్రీ”

170
ముసలి నాగులు తెలుగు కవితను‌ కాటేస్తున్నాయి.
“కవులు”

171
తెలుగు కవిత్వంలో ముసలి మురుగు దట్టంగా పెరుకుపోయి కీడు చేస్తోంది.
“కవులు, పరిశోధకులు, విశ్లేషకులు”

172
చింతనకు చెదపట్టింది.
“కమ్యూనిజమ్”

173
మనిషికి గాయం అవుతూనే ఉంటుంది.
“కులం”

174
గాయానికి చీముపడుతూనే ఉంది.
“ప్రాంతీయత”

175
అగ్నికి ఆకలి తీఱదు.
“ద్వేషం”

176
దగుల్బాజీతనం‌ పేట్రేగుతూంటుంది.
“నాస్తికత్వం”

177
రాయబడాల్సిన కవిత సరైన భాష కోసం వేచి ఉంది.
“మంచితనం”

178
శబ్దజాల మహారణ్యంలో గొప్ప భావాలు తప్పిపోయాయి.
“మానవత్వం, సంస్కారం, మంచితనం”
(శబ్దజాలం మహారణ్యం అని ఆదిశంకరులు అన్నారు)

179
శాస్త్రాలు భ్రష్టుపట్టాయి.
“సంక్షేమం, సౌమనస్యం, సౌభాగ్యం”

180
గోల లేకుండా మేలు జరిగింది.
“ఉదయం”

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here