వాలే పొద్దు

0
13

[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘వాలే పొద్దు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]శి[/dropcap]శిర ఋతువు ప్రభావంతో ఒక్కో ఆకూ రాలుతోంది.. హేమంతం వెళ్లిపోయి, చెట్లకున్న ఆకులు పండిపోయాయి. బాగా ఎండి ఇక కొమ్మకంటుకుని ఉండే ఓపిక లేదన్నట్లు ఒక్కో ఆకూ రాలిపోతున్నాయి..

***

వెనుకకు రెండు చేతులు పెట్టుకుని ఎండిన ఆకులను తొక్కుతూ నడుస్తూ వెళుతున్నాడు మురారి.

ఇప్పుడిప్పుడే ఆ వాతావరణానికి అలవాటు పడుతున్నాడు. కొత్తలో కొంత ఇబ్బంది పడినా.. ఇప్పుడు అలవాటు చేసుకున్నాడు.

కొంచం అలసటగా అనిపించి ఒక బెంచి చూసుకుని కూర్చొన్నాడు. చెట్ల గాలి చల్లగా మెత్తగా ఎవరో విసనకర్ర వీస్తున్నట్లు ఉంది. దూరం నుండి సన్నని మురళీ గానం వినిపిస్తున్నది.

వెనుకకు తల ఆన్చి కళ్లుమూసుకున్నాడు మురారి. కళ్లు మూసుకుంటే చాలు గతం గుర్తుకు వస్తుంది. గతం అంటే సత్య.. సత్య లేకుండా నేను ఎట్లా ఉన్నాను? అసలు ఊహే భయంకరంగా ఉండేది.. ఇలా అకస్మికంగా వదిలి వెళ్లిపోయింది ఏంటో..

పక్కనెవరో కూర్చున్నట్లు అనిపించి చిన్నగా ఉలిక్కిపడ్డాడు.. కళ్లు తెరిచి పక్కకు తిరిగి చూసాడు.

మురారి చూడగానే ఆమె “నమస్తే” అన్నది.

సమాధానంగా చిరునవ్వుతో నమస్తే పెట్టాడు మురారి.

“నా పేరు మహిత.. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. పది రోజులనుండి గమనిస్తున్నాను.. మీరు కొత్తగా వచ్చిన్నట్లున్నారని.. పలకరించాను” అన్నది..

“అవునండి! నా పేరు మురారి.. పదిహేను రోజులైంది వచ్చి” అని ఇంకేం చెప్పాలో తెలియక ఆగిపోయాడు.

“ఇక్కడే ఉంటారుగా కలుద్దాం” అంటూ మహిత వెళ్లిపోయింది.

వచ్చినప్పటినుండి బయటకు రాగానే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు ఇక్కడ ఇది మామూలే ఉన్నట్లుంది అనుకున్నాడు మురారి.

తన వాకింగ్ కూడా పూర్తిచేసి రూం కి వచ్చాడు.

హైదరాబాదు నగర శివార్లలో ఉన్న ‘ఆశ్రిత’ అనే ఒక సీనియర్ సిటిజన్ కమ్యూనిటీ హోమ్స్.. 12 ఎకరాల్లో కట్టిన వరుస ఇండ్లు.

ఒక బ్లాక్‌ని నాలుగు భాగాలు చేసి సింగల్ బెడ్ రూం పోర్షన్లు కట్టారు. అందులో ఒక చిన్న వంటిల్లు అన్ని సరుకులు పెట్టే ఒక కబోర్డు.. సింక్ గ్యాస్ స్టౌ పెట్టుకునే అరుగు ఆరడుగుల స్థలంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎప్పుడైనా టీ కాఫీలు చేసుకోవడానికి వీలుండేలా ఉంది.

ముందు 2 కుర్చీలు ఒక టిపాయి పట్టే చిన్న సిట్ అవుట్, బెడ్ రూం కూడా అన్నీ సౌకర్యాలతో ఉంటుంది. సిసి కెమెరాలుంటాయి .

టిఫిన్‌కి, భోజనానికి వెళ్లగలిగిన వాళ్లు డైనింగ్ హాలుకి వెళ్లి చేయవచ్చు. నడవలేని వాళ్లకు బాటరీ కార్లు ఉంటాయి. అదికూడా చేతకాని వాళ్లకు వాళ్ల దగ్గరికే భోజనం తీసుకువచ్చి తినే దాకా ఉండి ప్రేమగా వడ్డించి వెళతారు. ఇరవై నాలుగ్గంటలూ వైద్యసదుపాయం. విజిటింగ్ డాక్టర్లు, నర్సులు, అవసరమై సిటీ వెళ్లాలంటే కారు డ్రైవరు సదుపాయం కూడా ఉన్నది.

అక్కడి ఉద్యోగులందరూ ఎంతో ఆప్యాయంగా బాబాయ్ తాతయ్య పిన్ని పెద్దమ్మ అంటూ వరసలు పెట్టి పిలుస్తూ ఉండి అదొక వృద్ధాశ్రమము అని అక్కడ ఉన్న వారు అనుకోవడానికి వీలులేకుండా చేస్తారు.

రోజూ యోగా, వ్యాయామం, మెడిటేషన్, చేయగలిగిన వాళ్లు అందరు కలిసే చేస్తారు. వాకింగ్ ఎవరికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్తారు. ఎక్కువ నియమాలు ఉండవు. తోడు అవసరం ఉన్న వాళ్లకు పనివాళ్లు ఇరవై నాలుగ్గంటలూ ఉంటారు.

వాతావరణం కూడా నిశబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. పరిసరాలు ఎంతో శుభ్రంగా పూలమొక్కలతో అందంగా ఎత్తైన చెట్లతో నిండుగా అక్కడికి వచ్చిన వారి మనుసుకు హాయి గొలిపే విధంగా ఉంది. ముఖ్యంగా వృద్ధాశ్రమం లాగా అనిపించదు.

మురారి తన వాకింగ్ పూర్తిచేసి , యోగా హాలులో మెడిటేషన్ చేసి , భజన మందిరంలో కొద్దిసేపు ఉండి, డిన్నర్ హాలులో భోజనం చేసి రూంకి వచ్చాడు.

మంచం మీద దిండు కానుకొని పుస్తకం చదువుతూ కూర్చున్నాడు.. కళ్లు దురదలనిపిస్తే కళ్లద్దాలు తీసి వెనకకు తల ఆనించి కళ్లుమూసుకున్నాడు.

“థాంక్యూ! మౌరీ! నా మాట విన్నందుకు. నీకు నెమ్మదిగా అలవాటవుతుంది. నేనెప్పుడూ నీ మనుసులోనే ఉంటాను! ప్లీజ్ బాధపడకు, దిగులు పడకు..ఓకే నా!” నుదుటి మీద ముద్దు పెడితే చల్లగా తగిలినట్లు అనిపించడంతో కళ్లు తెరిచాడు.

తనను తాను ఒంటరిగా చూసుకునేసరికి తట్టుకోలేక పోయాడు. బాధతో కదిలిపోయాడు. దుఃఖము రావడం లేదు. కానీ గుండెను బలంగా ఎవరో పొడిచినంత బాధ కలుగుతోంది.. సత్యా! సత్యా! అని గుండె ఘోషిస్తున్నట్టు అనిపించింది. సత్య చనిపోయినప్పటినుండి ప్రతి రోజు ఏదో రకంగా తనను ఇలా పలకరించినట్లు అనిపిస్తుంది.. తన చుట్టే తిరుగుతూ ఉన్నదేమో అనిపిస్తుంది మురారికి.

సత్య పద్దెనిమిదేళ్లు ఉన్నపుడు మురారితో పెళ్లి జరిగింది.. ఇరవైమూడేళ్లకు ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయింది. అత్తగారూ ఆడపడుచులు మరుదుల మధ్య పెళ్లి పేరంటాలతో ఎప్పుడు అయిపోయాయో కానీ నలభైయ్యైదు ఏళ్లు గడిచిపోయాయి. పెద్దవాళ్లు ఉన్నన్ని రోజులు కలిసి ఉన్నా వాళ్లు పోగానే ఎవరికి వారు ఇళ్లు కట్టుకుని ఎవరి కుటుంబాలు వాళ్లు ఏర్పర్చుకొన్నారు.

సత్య మురారిల ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకొన్నారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు. ఒకరు అమెరికాలో ఇంకొకరు ఆస్ట్రేలియాలో భర్తా పిల్లలతో స్థిరపడినారు.

అన్ని బాధ్యతలు ముగించుకొని ఊపిరి పీల్చుకునే సరికి సత్య మురారీలు ఇద్దరూ సీనియర్ సిటిజన్స్ అయ్యారు. ఒకరికొకరుగా ఆనందంగా సరదాగా గడిపేవారు.

ఇద్దరూ ఆరోగ్యవంతులే! మురారికి అరవైతొమ్మిదేళ్లున్నా బిపి తప్ప మరే జబ్బు గానీ అనారోగ్యం కానీ లేదు. సత్య కూడా చకచక అన్ని పనులు చేస్తూ ఎవరైనా ఏ సహాయమైనా అడిగినా తప్పక చేసేయడం అలవాటు. సత్యకు ఫ్రెండ్స్ ఎక్కువ. చుట్టాలతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ బాగా ఇష్టపడతారు. మురారి మాత్రంగా రిజర్వడ్‌గా ఉంటాడు.

రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో వచ్చిన ‘ఆశ్రిత’ ఆర్టికల్ చదివి వెళ్లి చూసివద్దాము అని ఇద్దరు కలిసి వెళ్లారు.

అక్కడి నుండి వచ్చాక ఒక రోజు ఏదో మాటల్లో

“మొన్న మనం వెళ్లిన కమ్యూనిటీ గురించి మీరేమనుకుంటున్నారు?” అన్నది సత్య.

“బాగుంది! ప్రశాంతంగా” అన్నాడు మురారి

“అవునండి! చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. పూర్వం రాజులు తమ రాజ్యాన్ని యువరాజుకు పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమానికి వెళ్లేవారు కదా! అది ఎంత మంచి పద్ధతో కదా! కాలం మారింది దానినే మనం వృద్ధాశ్రమం అనుకోవచ్చు.. మనం కూడా ఇలాంటి వాటికి వెళ్లిపోవాలి. ఇప్పుడు ప్రపంచం చాలా విశాలమైంది. ఈ తరానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. ఉన్న అవకాశాలను అందుకోవడానికి వాళ్లు వెళ్లవలసిన అవసరం తప్పనిసరైనది. పిల్లలకు అడ్డు చెప్పి వారి భవిష్యత్తును, కలలను నీరుకార్చలేము కదా! అందుకే ఇప్పుడు మన ముందున్న అవకాశాలను మనం అర్థం చేసుకోవాలి కదా!” అంటూ ఆగింది సత్య

“ఏ విషయం నీవు మాట్లాడేది?” అన్నాడు మురారి.

“ఏం లేదండీ! మన ఫ్యూచర్ గురించి ఆలోచించుదాము అంటున్నాను.” అన్నది

“మనకేమైంది సత్యా! మన తల్లితండ్రులకు సేవ చేసే భాగ్యం దొరికింది. వాళ్ల ఆశీస్సులతో చక్కని జీవితం అనుభవించాము.. పిల్లలూ స్థిరపడి పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు.. బాధ్యతలన్నీ అయిపోయాయి. ఇంకేంటి?” అన్నాడు మురారి.

“నిజమే! నేను చాలా అదృష్టవంతురాలిని. తల్లితండ్రుల వంటి అత్తమామలు, తోబుట్టువుల వంటి మరుదులు ఆడపడుచులు, అర్థం చేసుకునే మీరు, వజ్రాల్లాంటి కూతుళ్లు, రత్నాల్లాంటి అల్లుళ్లు, ముత్యాల్లాంటి మనవలు మనవరాళ్లూ.. ఇంకేం కావాలి!”

“అదే కదా నేనంటుంది! నీవు తృప్తిగా సంతోషంగా లేవా?” అన్నాడు

“లేకేం! చాలా తృప్తిగా ఉంది. ఇప్పటివరకు అంతా సజావుగా జరిగిపోయింది.. ఇక ముందు ఎలా ఉంటుందో!” అన్నది

“ఏమవుతుందని నీ అనుమానం!?” సత్యనే నిశితంగా చూస్తూ

“ఇప్పటిదాకా గడిచిన జీవితం ఒకెత్తు.. ఇక ముందు గడవబోయే జీవితం ఒకెత్తు కదా!”

“ఎహే! ఏం కాదు నువ్వు అన్నీ ఎక్కువ ఆలోచిస్తావు.., జరిగేది జరగక మానదు. రేపేమౌతుందో అని ఆలోచించి నేటిని బాధాకరం చేసుకోవడంలో అర్థం లేదు..” అని మురారి అంటూ ఉంటే అడ్డుపడుతూ

“నిజమే! మీరన్నది.. నేనూ అలాగే అనుకునేదాన్ని.. కానీ రోజులు ఒకేలాగా ఉండవు.. మొన్న మా చిన్నత్త మాట్లాడిందని చెప్పాను కదా! ఆమె మాటలు, ఆమె బాధ విన్న తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందండి.”.. అంటూంటే..

“ఏమైంది దొడ్డమ్మ గారికి.. “అన్నాడు.

“చెప్పాగా.. అత్త ఊరికెళ్లి ఒక్కతే ఉన్నదని.. మామ ఉన్నన్ని రోజులూ మహారాణిలా అన్ని తనే చూసుకునేది. ఆయనపోయి మూడేళ్లవుతోంది.. బాగా చితికి పోయింది మానసికంగా.. అంతకు ముందే ఉన్న కాళ్లనెప్పులు మరింత ఎక్కువే ఇంటిలో కూడా నడవలేక పోతోంది. ఒక్కదానికోసం వంట చేసుకోవడమేమిటని, చేసుకోలేక, ఏదో ఒకటి తిని గడుపుతుంది.”

“అయ్యో! కొడుకుల దగ్గరకు పోవచ్చు కదా!”.. అన్నాడు బాధగా మురారి

“ఎవరి పనులు వాళ్లవి.. వాళ్లకూ పిల్లలూ ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటాయి కదా!”

“ఉంటే ఏంటి.. కన్నతల్లి బరువా? అడ్డా?” అన్నాడు మురారి.

“చూడండీ! ఎవరి ఆలోచనలు వాళ్లవి ఎవరి ప్లాన్లూ వాళ్లవి కదా ! అయినా ఇప్పుడది కాదు విషయం..నా ఆలోచనంతా మన కోసం.. ఇప్పటికే ఇద్దరం డెబ్భైకి చేరబోతున్నాము.. ఇద్దరం కలిసి ఉన్నంతవరకు ఏ బాధా లేదు.. ఇద్దరిలో ఏ ఒకరికి ఏదైనా జరిగితే?” ఒక నిమిషం అలా ఆగింది సత్య తనని తాను నిభాయించుకోవడానికి..

మురారి.. “అయితే? మన పిల్లలు లేరా? మన పిల్లలు అందరి లాంటి వారు కాదు.. నీవేం అనుమానపడక్కర లేదు..” కొంచం కఠినంగానే అన్నాడు.

“అనుమానం కాదు.. మన పిల్లల మీద అనుమానపడితే నా మీద నా పెంపకం మీద అనుమానపడినట్లే!” అన్నది సత్య..

“మరింకేంటి??”

“మనం ఎవరి మీద ఆధారపడవద్దు అనేది నా అభిప్రాయం.. వృద్ధాప్య సమస్యలు ఎన్నో ఉంటాయి అనే సంగతి మనకు తెలియనిదా? మన చుట్టూ ఎంత మందిని చూడడం లేదూ?

ఏదైనా జబ్బో గిబ్బో వచ్చి ఆసుపత్రి పాలైతే ఎవరు చూస్తారు? అక్కడి నుండి పిల్లలు పసి పిల్లలను వదిలి రాగలరా?

ఏదైనా ఒక రోజు రెండురోజలతో పోయేదికాదు. పనులు ఉద్యోగాలు వదులుకొని పిల్లలను మనకోసం మన దగ్గర ఉండిపొమ్మనడం ఎంత వరకు న్యాయం.

కొడుకులైనా కూతుర్లైనా.. మనమే మంచి భవిష్యత్తు కోసం వాళ్లను చదివిస్తాము.. మంచి జీవితం కోసమని సరైన జోడిని చూసి పెళ్లి చేస్తాము. మనవలను మనవరాళ్లను ఇవ్వమని తొందరపెడతాము. మళ్లీ అవన్నీ వదిలేసి మాకే సేవచేయండి అంటూ పిలవడం.. పిల్లలు మమ్మల్ని చూసుకోలేదంటూ వాళ్లను నిందించడం ఎందుకు?” అంటూ ఉద్రేకంగా అన్నది సత్య.

“అంటే.. పిల్లలకు తల్లితండ్రుల పట్ల బాధ్యత లేదా? మనం మన తల్లిదండ్రులను చూసుకోలేదా?” అన్నాడు

“నిజమే! మనం చేసాము.. మన పరిస్థితులు వేరు కదా! మనం వాళ్లున్న చోటనే ఉద్యోగాలు చేసాము. మనమే మన తల్లితండ్రుల దగ్గర ఉండాలని అనుకొన్నాము.

కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ల చదువులు ఉద్యోగాలు జీవన విధానం మారిపోలేదా! గత ముప్పై, ముప్పైయైదు ఏళ్ల నుండి ఇంజినీరింగ్ చదివిన ప్రతి ఒక్కళ్లూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయాలనుకోవడం.. విదేశాలకు వెళ్లాలనుకోవడం సాధారణమైన విషయమైంది. ప్రతి ఇంటి నుండి కనీసం ఒక్కరైనా అమెరికా వెళ్లారు..అది అప్పుడు గర్వంగా ఫీలయ్యేవారు..”

“అయితే ఏంటి సత్యా! నీ ఆర్గ్యూమెంట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు.” చిరాగ్గా అన్నాడు మురారి

“ఏమీ లేదు చాలా సింపుల్.. దేశవిదేశాలలో అవకాశాలు వెతుక్కొని వెళ్లిన పిల్లలను ఇప్పుడు మధ్యలో రమ్మనడం భావ్యమా అంటున్నాను!! వాళ్లు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు.. అదంతా వదిలి ఎలా రాగలరు?

ఇప్పుడు మనం ఆరోగ్యం బాగానే ఉంది.. ఇంకో పదేళ్ల కి ఇలాగే ఉంటామా!

మనం జంటగా ఉండగా ఏ బాధా లేదు.. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా! కీడెంచి మేలెంచ మన్నారు..”

“ప్లీజ్ .. సత్యా ఇంక ఈ విషయం వదిలేద్దాం.”

“సరే! ఒకే ఒక మాట చెపుతాను ఆ తర్వాత ఇంకెప్పుడూ. ఈ విషయం మాట్లాడను.. ఇది కఠినంగా ఉంటుందేమో.. ఇది నిజం. మనకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏదో ఒకటి ఎన్నుకోవాలంటాను.. ” అన్నది

“సరే.. చూద్దాము..”

ఈ సంభాషణ తర్వాత ఈ విషయం గురించి చాలా రోజులు ఏమీ మాట్లాడలేదు సత్య..

ఎప్పుడు చేసిందో ఒక రూం బుక్ చేసింది .. దానికి సంబంధించిన కాగితాలు బీరువా లాకర్‌లో పెట్టి వాటితో ఒక ఉత్తరం పెట్టింది.

***

మూడు నెలల క్రితం కళ్లు తిరిగి పడిపోయిన సత్యను ఆసుపత్రికి తీసుకెళ్తే ఫోర్త్ స్టేజ్‌లో బ్రెయిన్ ట్యూమర్ అన్నారు.

ఎక్కువ ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే తెలిసిన నెల రోజులకు నిశ్చింతగా వెళ్లిపోయింది.. అన్నీ అయ్యాక బీరువా లాకర్‌లో పేపర్లు తీసారు. అందులో లెటర్ నా చేతిలో పెట్టారు.

“డియర్ మౌరీ!

భయపడకు, దుఃఖపడకు, మరణం చాలా సహజం.. ఒకరు ముందు ఒకరు వెనుక.. నేను ఒకసారి చెప్పాను కదా మనలో ఎవరు ఒంటరిగా మిగిలినా ‘ఆశ్రిత’లో రూం తీసుకున్నాను. అక్కడికి వెళ్లు..

కావలినవన్నీ అక్కడ అమర్చాను.. మనం ఎవరికీ భారం కావద్దు అనుకున్నాం కదా!

సరేనా!

నీ సత్య..”

***

ఇక ఒక నెలరోజుల్లో వ్యవహారాలన్నీ చూసుకొని ‘ఆశ్రిత’ కు వచ్చేసాడు..

కూతుర్లు అల్లుళ్లూ అందరూ ఇష్టం లేకున్నా ఆశ్రితకు వచ్చి వాళ్లతో మాట్లాడారు. ఏ చిన్న ప్రాబ్లెం ఉన్నా ఫోన్ చేయమని చెప్పి ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.. అప్పుడు అలా వాదించింది ఇందుకేనేమో.. సత్య చెప్పినపుడు కొంత చిరాకు కోపం వచ్చినా.. ఇప్పుడు ఇక్కడ వందల్లో వృద్ధులను చూస్తుంటే అందరనుకున్నట్లు ఇదేదో తప్పు కాదు ఇదే కరెక్ట్.. అనిపించింది.. మురారికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here