నిరంతర ప్రవాహం…. వాన వెలిశాక – పుస్తక సమీక్ష

0
7

[dropcap]క[/dropcap]విత్వం అంటే ఏమిటి ? కవిత్వం ఎవరు రాయాలి? ప్రేమంటే ఏమిటి వంటి అనేకానేక ప్రశ్నలకు సమాధానం కవిత్వ కళాతత్వం తెలిసినవాడు సామాజిక వాస్తవికత మీద సైద్ధాంతిక తీర్పునిస్తూ తుఫానులాంటి ఆవేశం మదిలో నింపుకుని కవిత్వం తాను రాస్తూ ఎదుటివారితో రచింపజేసే విలక్షణ కవి కళారత్న బిక్కికృష్ణ. చరమగీతం, వేకువపిట్ట, చినుకు, ప్రేమాంజలి, కాలం నది ఒడ్డున,వల్లరి వంటి పుస్తకాలు వెలువరించి 30 పుస్తకాలు ప్రచురించి 300 వ్యాసాలు రచించి 10 టి.వి లో “ అక్షరం” సాహిత్య కార్యక్రమం నిర్వహించి వివిధ సామాజిక సంస్థలలో సాహితీసంస్థలలో సేవలందిస్తూ పలు కవి సమ్మేళనాలు విజయవంతంగా నిర్వహించి రచయితలకు శిక్షణనిస్తూ వివిధ అవార్డులను సొంతం చేసుకుని పలుపురస్కారాలను అందుకుని కవిత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నకృషీవలుడు బిక్కికృష్ణ రచించిన మరో కవితాసంపుటి “వానవెలిశాక”.

ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డా.ఎన్.గోపి ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ బిక్కికృష్ణ కవిత్వాన్ని మృత్యుంజయ మంత్రంగా భావిస్తారన్నారు.మంచి వక్త, ప్రయోగశీలి, కపటంలేని వాడు, మాటకు హృదయానికీ ఎడంను తుడిచేసినవాడు, మంచికవి అని అభివర్ణించారు.

సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు, కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి దేశాన్ని పూలురాలిన చెట్టులాగుంది అని బిక్కికృష్ణ కవిత్వ వాక్యాన్ని ప్రశంసిస్తూ బిక్కికృష్ణ కవిత్వ పరుగుని ఆయన కవిత్వం పరుగెడుతుందని, పాఠకుడిని తరుముతాయని అందుకని సప్తమాశ్వం అనడం సబబని తెలియజేసారు. గ్రామీణ సంస్కారం జీర్ణించుకున్న కవి బిక్కికృష్ణ ప్రపంచీకరణ పరిణామాలను కలమారా రంగురంగుల సిరాలతో చిత్రించాడని అన్నారు.

సుప్రసిద్ధ కవి, నవలారచయిత సాగర్ శ్రీ రామకవచం బిక్కికృష్ణను సహజకవి అంటూ అతని వైదుష్యం,పరిపక్వత, నిర్మాణ కుశలత ఇతర కవులనుంచి అతడ్ని విభిన్న కవిగా నిలబెట్టి తాను కవిత్వమూ వేరు వేరు కాదని నిరూపిస్తున్నదన్నారు. ప్రకృతికి పరవశించడం ఇతని కవిత్వంలో కళామర్మం . ప్రతికవితలో ఊహా శబలతతో సౌందర్య తృష్ణని, సౌందర్య పుష్టిని కలిగించే కవితానిర్వహణ సామర్థ్యం కలిగిన కవిగా తీర్మానిస్తూ వానవెలిశాకలోని కవితలు మనలోని మానవత్వాన్ని తట్టిలేపే కవితలుగా రూపొందించారన్నారు.

మనసు తడిపిన కవిత్వం.. అంటూ వి.వింధ్యావాసినీ దేవి (తెలుగు అధ్యాపకురాలు, కె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూలు) “భావవీణ”  అనే సంచికలో గాఢమైన భావుకత, బలమైన తాత్విక నేపథ్యం, నిబద్ధతతో కూడిన సామాజిక స్పృహ,సున్నితమైన మానవ సంబంధాలపట్ల అచంచలమైన నమ్మకం, అనిర్వచనీయమైన ప్రేమతత్వంపై ఆరాధనాభావం, ప్రకృతిపట్ల సౌందర్య దృక్పథం అన్నింటినీ మించి కవిత్వం పట్ల అనురక్తి వెరసి “ వాన వెలిశాక “ కవితా సంపుటిగా ఆవిష్కృతమైనదని తమ వ్యాసంలో పేర్కొన్నారు.

వానవెలిశాక పుస్తకంలో తన కవిత్వ నేపథ్యంలో బిక్కికృష్ణ తన కవితా ప్రస్థానాన్ని వివరిస్తూ కవితలవర్షం కురిపిస్తూ అనంత కరువుజిల్లా బిడ్డగా

మల్లెమొగ్గల్లాంటి అన్నపుమెతుకుల కోసం

అక్షరాల విత్తుల్ని మెదడులో నాటుకుని

మొక్కగా, చెట్టుగా, మహా వృక్షంగా

ఎదిగిన రైతుబిడ్డ నేనని ప్రకటించారు.

71 కవితలతో రూపొందించిన ‘వానవెలిశాక’ కవితల సంకలనం చెదిరిన రంగులకలతో మొదలై కొత్త డిక్షన్ తో ముగుస్తుంది.

ఆద్యంతం కవి ఊరు వాతావరణం,

తెల్లని ఆకాశంలో అరుణబింబంలా

తెల్లజొన్నరొట్టెపై ఎర్రగారం నంజుకుని

కవి అమ్మ, అర్బన్ రూరల్ మనుషుల మనస్తత్వాల చిత్రీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో విలువల పతనం ప్రజాచైతన్యం, విప్లవాల అనివార్యత, ప్రేమ, కరుణ, జాలి, స్నేహం ఇత్యాది మానవీయ హృదయగత రాగబంధాల చిత్రణ, వస్తువైవిధ్యం శిల్పసోయగంతో రూపుదాల్చింది వానవెలిశాక  .

బిక్కికృష్ణ కవిత్వంలో ప్రధానంగా మనసుకు హత్తుకునే అంశం అమ్మ పట్ల ప్రేమ. మట్టికుండ అమ్మ అనే కవిత ద్వారా ఆకలిదాహం తీర్చే మట్టికుండ  అమ్మంటే అంటూ వెన్నముద్ద తినిపించిన అమ్మ ప్రేమ  ఇప్పుడు నిజంగానే జాబిల్లిలా మారి వెన్నలై దీవిస్తుందని అంటాడు. అమ్మా నాన్నతో కలిసి నడుస్తున్న దృశ్యాన్ని ఓ కవితలో చిత్రీకరిస్తూ అమ్మ ..మా వెంట పచ్చని చెట్టులా నడిచొస్తుందంటాడు. మరొక చోట అమ్మని, కవిని కలిపి అద్భుతంగా వ్యక్తీకరిస్తాడు.

నిజంగా ఆకాశం అమ్మే

అమ్మ గర్భంలో పిండాన్ని సూరీడు

తెల్లారేకల్లా వెలుగుపూల తెరచాటున

కవిగా నేలపై ప్రభవిస్తుంటాడని అంటూ చివరికి ప్రేమే కవిత్వమైతే మా అమ్మవుతుందని నక్కచ్చిగా తేల్చి చెబుతాడు.

బిక్కికృష్ణ కవిత్వంలో ప్రేమ తత్త్వం మనకు చాలా సందర్భాలలో ప్రేమను గురించి పలు కవితలలో ప్రస్తావించబడింది.

ప్రేమ కూడా నదిలాంటిదేమో

అందుకే సముద్రం చేరేవరకు ఆగదు

అంటూ ప్రేమ ముగింపు విషాదమనే తార్కిక భావనలో నింగ నేల నీముందున్న వారి మనుషులు పశువులు చెట్లపై పక్షులు సమస్త దృశ్యాలను నీలోకే వొంపుకోడమే ప్రేమంటే అని ప్రేమను ప్రకృతిలో మమేకమవడమంటూనే ..కవిత్వం రాయడమంటే ప్రేమను ప్రేమించడమనీ కవిత్వాన్ని ప్రేమకు అన్వయిస్తాడు.

ప్రేమించడమంటే త్యాగాల రాగాల కన్నీటి మేఘమై కరిగిపోవడమంటాడు .ఒకచోట ఎవరిని ప్రేమించాలో వివరిస్తూ ..

అందుకే పేదలను ప్రేమించడం నేర్చుకోండని..అధికార పీఠాలకు గంటలు కొట్టి మరీ చెప్పండని సూచిస్తాడు.

కవిత్వం బిక్కికృష్ణను కవిగా చేయడమే కాదు కవిత్వం కోసం కృషి చేసే రుషిగా మార్చేసింది. కవిత్వం డిక్షన్ లో పలు యువకవులను తగు సలహాలతో సూచనలతో ప్రోత్సహిస్తూ కవిత్వం కోసం కలవరిస్తూ

ఓ కవి సూర్యుడా ! కవిత్వం కోసం కలవరింతలు

కష్టాల నిప్పు కట్టెల్ని ఎగదోసి కవిత్వపు మంటలు రాజేయ్

బతుకు పొయ్యిపై హృదయపాత్రలో కావ్యరసం వండమని

కాలం నది ఒడ్డున కవితా సంపుటిలో సూచించారు. వానవెలిశాక కవితా సంపుటిలో కవిత్వం పండును అమ్మ తిన్నందుకే

నేనో కవిగా పుట్టి కవిత్వపు మంటైపోయానని ప్రకటించారు.

కవిత్వం మెరుపుతీగ అంటూ …  అసలు కవిత్వమంటే తెలుసా ?   కనిపించని గాలి.. పూలరెమ్మలను ఊపినట్టు

లిపిలేని భావాలేవో నిను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు

నీ గుండె గిజిగాడు నేర్పుగా అల్లుకునే గూడు కవిత్వం! .. అంటూ

పెన్నును  గన్నుగా అడవిపై విసిరేసిన

మృతవీరుని కనుగుడ్డులో మెరిసే ఆఖరి మెరుపు తీగే కవిత్వం ! అంటాడు .

మరో చోట ప్రేమే కవిత్వం

కవి మనసంటే కవిత్వమే!

కవిత్వానికి నిర్వచనాలు ఇస్తూనే ఏది కవిత్వమో వివరిస్తూ ఎన్నోచోట్ల కవిత్వం రాయడమంటే ఏమిటో చెప్పే ప్రయత్నాలు అనేకానేకం చేస్తుంటాడు బిక్కికృష్ణ.

కవిత్వం రాయడమంటే గుండె పెనంపై దేశపటం దోసెను చిత్రించడం !

కవిత్వం రాయడమంటే కవి తనలోని పశుత్వాన్ని చంపి రుషిత్వాన్ని మేల్కొల్పడం

అపుడపుడు ..ప్రకృతి ముందు ప్రియురాలి ముందు పసివాడైపోవడం… అని వివరిస్తాడు.

నిరంతర అన్వేషణే కవిత్వం అని పేర్కొంటూ కవి నవ్వితే కవిత్వం పూల జల్లులా పెదవులపై రాలి పడాలి!

కవి ఏడ్చినా కవిత్వం హోరుగాలిలా కనురెప్పల్లో తుఫానులా ముసుర్లు కమ్మాలి!

అని కవి మనకు కవిత్వం కవి కంటిచూపులో చూపిస్తాడు. పేలే స్టెన్ గన్ కవిత్వమంటే..

హఠాత్తుగా కురిసే ..మనసులను తడిపే జడివాన !

ఎన్నిసార్లు ఎంత చెప్పినా తనివి తీరని తపన కవిత్వం గురించి అందరికీ చెప్పాలనే తృష్ణ బిక్కికృష్ణ కవిత్వంలో అణువణువునా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కవిత్వం పట్ల ప్రేమను కొత్తడిక్షన్ అనే కవితలో ..      కవితల విత్తులు జల్లి నేల రుణం తీర్చుకోవాలి

ఆకాశంలో అరుణబింబమై పోవాలి

అవసరమైతే నీరునై, నిప్పునై, గాలినై

పంచభూతాలకు కవిత్వం నేర్పించాలి.. అనే ఆరాటాన్ని వ్యక్తపరుస్తూ ..తన కవిత్వం మానవత్వానికి కొత్త డిక్షన్ మనిషి చైతన్యానికి సరికొత్త డైరెక్షన్ గా అభివర్ణించారు.

కవిగా బిక్కికృష్ణ తన చుట్టూ ఉన్న ఆవరణంలో ప్రపంచీకరణని దుయ్యబడుతూ  రాజకీయాలను, అవినీతిని, ఓటర్ల దుస్థితిని, పల్లెటూర్ల దయనీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసారు. దేశం పట్ల తన ఆవేదనని

ఇప్పుడు మనుషులు ఎక్కడా కనిపించరు

ఖాళీదేహాలు ..కలలు కనిపించని  గాజుకళ్ళు!

ఆత్మవిశ్వాసం లేని దిగులు గుండెలు!

సంతోషం తొణికిసలాడని ముఖాలే కనిపిస్తాయి

పూలు రాలిన చెట్టులాగుంది దేశం ! ..

వ్యక్తపరుస్తాడు.

వాన వెలిశాక ఆకాశం స్వచ్ఛంగా ఉండమని ఉద్భోదిస్తూ వెన్నల, సూర్యుడు, మానవత్వం వంటి అంశాలను సృజిస్తూ స్వచ్ఛమైన కవిత్వధారని మనకందించిన బిక్కికృష్ణ మనిషిని ప్రేమించమని, కవిత్వాన్ని నిరంతరం అన్వేషించమని పుస్తకాల పూలతోటలో సంచరిస్తూ కరుణరసం నింపుకుని విలువల విలువైన కాగితాలపై మానవత్వానికి కొత్త డైరక్షన్ గా కవిత్వం అని సూచిస్తూ సరికొత్త చైతన్యాన్ని కలిగించే మహాకవిగా వానవెలిశాకలో నిలువెత్తు కవిత్వ కళాతత్వంతో మనముందు నిలుస్తాడు బిక్కికృష్ణ.

ఆ అనుభూతిలో భాష, నిర్మాణం, శిల్పం, వస్తువు, కలగలిపి చక్కని చిక్కని కవితామృతాన్ని మన హృదయాలకు అందించి ఒక గొప్ప కవిత్వం చదివామన్న సంతృప్తిని మనలో కలిగిస్తారు బిక్కికృష్ణ. ఈ కళారత్న మరెన్నో కవితా సంపుటాలు వెలువరించి కవిత్వాన్ని మరింతగా ముందుకు నడిపించాలని ఆశిద్దాం.

***

పేజీలు: 144 వెల: రూ 140
ప్రతులకు: 8374439053

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here