వారాది రాముడు

5
6

‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

[dropcap]అ[/dropcap]నగనగా ఓ మారుమూల ఊరు. ఆ ఊరి పేరేదైతేనేం….? పేరుతో మనకు పనిలేదు. అది రాయలసీమలోని ఓ పేద పల్లెటూరు. అట్లా అని అంత పచ్చి పల్లెటూరూ కాదు, మరీ పెద్ద ఊరూ కాదు…. ఒక పెద్ద పల్లెటూరు! నాగరికతకు బహు దూరంగా, ప్రధాన రహదారికి కూడా దూరంగా… ఎక్కడో ఒక మూల దాక్కున్నట్టుగా…. వ్యావహారికంలో కుందూనదిగా మారిన కుముద్వతీ నది ఒడ్డున వుంటుంది.

ఆ నదే ఆ ఊరికి జీవనాడి. నది మరీ పెద్దదేమీ కాదు కానీ, ఎండాకాలంలో యేదో కొద్దిరోజులు తప్ప మిగతారోజుల్లో సమృద్ధిగా నీటితో కళకళలాడుతుంటుంది. ఆ నది పారినంత దూరమూ ఇరు పక్కల వున్న గ్రామాల గొంతు తడుపుతూ…. ఆ నిరుపేద ఊళ్లకు ఊరటనిస్తుంది. పల్లపు గ్రామాలు కొన్నింటిలో ఆ ఏటినీటితో పంటలు కూడా పండిస్తుంటారు.

ఆ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ! అక్కడి రైతుల చూపులు ఎప్పుడూ ఆకాశంలో మేఘాల కోసం వెదుకుతూ వుంటాయి.

ఈ కథాకాలం వందేళ్ల వెనకటిది! ఆ వూళ్లో అదృష్టం కొద్దీ… సాధారణ రాయలసీమ గ్రామాలలో వుండే కక్షలూ, కార్పణ్యాలూ లేవు! రెండు సంపన్న కాపు (రెడ్డి) కుటుంబాల మధ్య పోటాపోటీ వున్నా… అది కక్షలు పెంచుకుని, పార్టీలు పెట్టుకునే స్థాయికి రాలేదు!

అప్పటికే కొద్దికొద్దిగా ఆధునిక పోకడలు చుట్టుపక్కల టౌన్లలో కనిపిస్తున్నప్పటికీ, ఆ వూరిలోకి కాఫీ తప్ప ఎలాంటి ఆధునికతా ప్రవేశించలేదు.

ఊళ్లో ఆయుర్వేదం తెలిసిన జంగం సోమన్న మాత్రమే ఒక్కగానొక్క వైద్యుడు. అతడు చిన్నతనంలో ఇంట్లో చెప్పకుండా శ్రీశైలం పోయి, అక్కడ ఎవరో సిద్ధుడి దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నాడట! ఊరి వాళ్ల ప్రాణాలన్నీ సోమన్న చేతుల్లోనే వుంటాయి.

అందుకే అతన్ని ఆ ఊరివాళ్లు శ్రీమహావిష్ణువులాగా చూసు కుంటుంటారు. గౌరవిస్తుంటారు!

ఆ ఊళ్లో ఒక శివాలయం, ఒక ఆంజనేయస్వామి దేవాలయం, కోమట్ల బజారులో ఈమధ్యే నిర్మించిన ‘అమ్మవారిశాల’ గా పిలవబడే కన్యకాపరమేశ్వరి ఆలయం వున్నాయి. అవే ప్రధాన కూడళ్లు ఆ వూరికి. అంతేగాక ఆంజనేయుని గుడిముందున్న పెద్ద గంగరావి చెట్టు, దాని చుట్టూ కట్టిన పెద్ద అరుగు… అదే ఆ వూళ్లోని వాళ్లకు రచ్చబండ! రాజకీయాలు, మంచిచెడ్డలు అన్నీ అక్కడే చర్చకు వస్తాయి. ఆ పక్కనే వున్న వీరభద్రుని దేవాలయ ప్రాంగణం అక్కడి వ్యాపారకేంద్రం!

ఆ వూళ్లోని ఇళ్లన్నీ అంటుడు మిద్దెలు! అంటే ఈ వీథి మొదట్లో ఒక ఇంటి పైకి ఎక్కితే….సందు చివర ఇంటిదాకా మిద్దెలపైనే నడుచుకుంటూ పోవచ్చు.

అలా ఎందుకు ఆ ప్రాంతాల్లో ఇళ్లు అట్లా దగ్గర దగ్గరగా… వీథులు ఇరుకుగా కట్టుకునేవారంటే….

పూర్వం ఆ ప్రాంతాల్లో దీవిటీ దొంగలు అనే దోపిడీమూకలు ఊళ్లపై దాడులు చేసేవారట! వారు ఒక దిక్కునుంచి వస్తే ఇంకో దిక్కునించి తప్పించుకోవడానికి వీలుగా అట్లా కట్టుకునేవారట! తర్వాత ఆ ఊళ్ల మీది నుంచి పోయే సైన్యదళాలు కూడా ఊళ్లమీద దాడిచేసేవట! అందుకే అక్కడి నిర్మాణాలు అలా వుండే వన్నమాట!

ఆ వూళ్లోని ఇళ్లన్నీ రాతితో కట్టినవే!

ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఊళ్లలో రాతిగనులు వున్నాయి. వాటిలో పలకలు పలకలుగా రాతిబండలు బయటికి తీస్తారు. వాటిని ఇటుకల కంటే పెద్ద సైజులో కోసి, మట్టీ, సున్నం కలిపిన అసులు వాటి మధ్య నింపి గోడలు కడతారు. పలుచని బండలను చప్పట (ఫ్లోరింగ్) గా పరుస్తారు. గోడలమీద దూలాలు, దంతెలు పరిచి, వాటిపై కట్టుకునేవారి ఆర్థిక స్థితిగతులను బట్టి వెదురు తడికెలో, బండలో పరుస్తారు. ఆపైన దానిపై మట్టి పోస్తారు. ఇంటి పై కప్పు పైన ప్రతి గదికీ ఒక కిటికీ వంటిదాన్ని అమరుస్తారు. దానిని ‘గవాక్షం… గవాక్షి’ అంటారు. ఆ గవాక్షాలే ఇంట్లో గాలి వెలుతురుకు ఆధారం! ఇళ్లు పక్కపక్కనే వుండటంతో కిటికీలు పెట్టుకునే వీలువుండదు.

ఆ ఊళ్లోని శ్రీమంతుల ఇళ్ల పై కప్పులు గారతో తయారుచేసినవి కూడా వున్నాయి. సున్నం, బెల్లం, ఇసుక మరికొన్ని పదార్థాలు కలిపి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేస్తారు. ఇది కొంచెం సిమెంటులాగా వుంటుంది.

పైకప్పు పైన పడిన వాననీళ్లు కిందికి పారడానికి తూములు పెడతారు. వాటిని ‘దోనెవారాలు’ అంటారు. నీళ్ల విషయానికొస్తే మామూలు వాడుకకైతే ఊరిలో ఐదారు ఉప్పునీటి బావులున్నాయి. మంచినీళ్లకు మాత్రం ఊరికి ఉత్తరాన మైలు దూరంలో వున్న కుందూనది దగ్గరికి పోయి, చెలిమెలలో నీరు తోడుకోవలసిందే!

లేదంటే ఊరికి మరోవైపున మైలున్నర దూరంలో వున్న ‘ఏడు కపిలెల బావి’ అనే పెద్ద మంచినీళ్ల బావి దగ్గరికి పోవాల్సిందే! అక్కడ ఎక్కువగా పీపాబండ్లవాళ్లు ఎక్కువగా పోతుంటారు! ఆ బావి దగ్గరికి పోవాలంటే ఊరి బజారులోనుంచి పోవాల్సివస్తుందని, దూరమని చాలామంది ఆడవాళ్లు నది దగ్గరికే పోతుంటారు. నది నీళ్లు మహారుచి…ఆరోగ్యం కూడా!

ఊళ్లో శ్రీమంతులు, వ్యాపారస్థులు కొందరు సొంతంగా పీపాబండ్లు పెట్టుకున్నారు. మనుషులను పెట్టుకుని నీళ్లు తెప్పించుకుంటారు. మరికొందరు నీళ్ల బ్రాహ్మల చేత తెప్పించుకుంటారు. ఇంకాకొందరు పీపాబండ్లవాళ్ల దగ్గర నీళ్లు కొనుక్కుంటారు. ఇలా పేదవారికి జలవిక్రయం ఒక జీవనోపాధిగా మారింది.

వానాకాలం వస్తే నీళ్లకు మరీ గండం! చుక్కనీరు పడితే చాలు…రేగడినేలలు కావడంతో బురదబురదగా తయారవుతాయి దారులు. బండి దొర్లక నానా తిప్పలు పడాల. అందుకే ఇంటి ఆవరణలోకి వుండే దోనెవారాల కింద పెద్దపెద్ద ఔత్ కానాలు (తొట్లు) కట్టించుకుని, నీటిని నిలవచేసుకుంటారు. గంగాళాలు, బిందెలు నింపుతారు. తొట్లలో ఉప్పునీటి బావి నీరు ఓ బిందెడు పోస్తే నీళ్లు తేటపడి వాడుకకు పనికివస్తాయి. బిందెల్లోని నీళ్లలో చిల్లగింజ అరగదీసి కలపడమో, పటికపొడి కలపడమో చేస్తారు. దాంతో నీళ్లు తేటపడతాయి. తాగడానికి పనికొస్తాయి.

వాన పడేటప్పుడే బట్టలు ఉతుక్కోవడం వంటి పనులు చేసేసుకుంటారు.

ఆ ఊళ్లలో రెండే ఋతువులు. మండిపోయే ఎండాకాలం…. మరీ అంత ఎండవుండని కాలం….అంతే!

ఆ ఊళ్లో పగళ్లు ఊరివారందరికీ కాయకష్టంతో గడుస్తాయి. రైతులు, రైతుపడతులూ అందరూ పొలాలకెళ్లేవాళ్లే! తక్కిన వృత్తుల వారంతా ఎవరి పనులలో వారు క్షణం తీరిక లేకుండా వుంటారు. సాయంత్రం ఇళ్లకు వచ్చి స్నానాలు చేసి, పశువులకు స్నానాలు చేయించి, మేపులు వేసి, బావినీళ్లు తెచ్చుకోవడం, పశువులకు తాగించడం వంటి పనులు మగవాళ్లు చేస్తారు.

పశువుల దగ్గర పాలుపిండుకొని, రోజూ వర్తనగా తమ దగ్గర పాలు పోయించుకునే వారి ఇళ్లకు పాలు పోసి వస్తారు ఆడవాళ్లు.

రాత్రికి, మరుసటిరోజు పొద్దునకు సద్ది కట్టుకోవడానికి జొన్నరొట్టెలు, పప్పు, కూర చేసి, అందరికీ భోజనాలు పెట్టి, అప్పుడు రామా.. అని దోమతెర కట్టిన కుక్కినులక మంచాలపైన నడుం వాలుస్తారు ఆ వూరి శ్రామిక స్త్రీలు.

రాత్రులు ఆ వూళ్లో చాలా ప్రశాంతంగా గడుస్తాయి. పత్తిచేలల్లో పగిలిన పత్తికాయల లాగా, ధనియాల పొలంలో నిండుగా పూసిన తెల్లని అందమైన పూలలాగా ఆకాశం నిండా పరచుకున్న నక్షత్రాలు ఆ ఊరిలోకి తొంగితొంగి చూస్తుంటాయి. వీరభద్రుని ఆలయం ముందున్న గంగరావి చెట్టు గాలికి గలగలలాడుతూ ఒకింత భయపెడుతూ వుంటుంది. గుళ్ల ధ్వజస్తంభాలకు కట్టిన గంటలు గాలికి కదులుతూ గలగలమంటూ నిశ్శబ్దాన్ని భంగం చేస్తుంటాయి.

రాత్రంతా నిద్రాదేవి తన మంత్రదండం పట్టుకుని వీథులన్నీ పహారా కాస్తుంటుంది. వీథికుక్కలు మాత్రం తమ అరుపులతో ఆమె పనిలో కొంచెం అడ్డంకులు కలిగిస్తుంటాయి. పగలంతా అలసిసొలసిన శ్రామికులు మాత్రం మైమరచి నిద్రిస్తూనే వుంటారు.

***

తొలికోడి కూతకు అంటే మూడు గంటలకు రైతులంతా నిద్రలేస్తారు. పశువులకు మేపువేసి, తిరిగి మంచాలపై, అరుగులపై బద్ధకంగా నడుం వాలుస్తారు. ఒక్క అరగంట పడుకుందాంలే….అని. కాస్త మగత నిద్ర పట్టీపట్టంగానే…ఆ చీకట్లను, నిశ్శబ్దాన్నీ చీల్చుకుంటూ శ్రావ్యమైన, ఎన్నో యేళ్లుగా అలవాటైన పాట ఒకటి వినవస్తుంది.

వయసువల్ల గొంతు బొంగురుగా, చిన్న వొణుకుతో వున్నా ఆ స్వరం వినసొంపుగానే వుంటుంది.

“మేలుకొనవే అహోబల నారసింహా..

మేలుకొనవే తిరుపతి వేంకటేశా…

మేలుకొనవే యాగంటి ఈశ్వర…

మేలుకొనవే మహానందీశ్వర….

మేలుకొనవే శ్రీశైల మల్లేశా…

మేలుకొనవే కొత్తూరు సుబ్బరాయా…

మేలుకొనవే వెల్లాల ఆంజనేయా…

మేలుకొనవే భద్రాద్రిరామా…

మేలుకొనవే కనకదుర్గా..”

ఇట్లా భారతదేశంలోని క్షేత్రాలన్నింటిలోని దేవతలందరినీ నిద్రలేపుతుందా స్వరం!

ఇంతకీ ఆ స్వరం ఎవరి తాలూకు అనుకుంటున్నారా?

హా…చెబుతానుండండి! ఆ స్వరం సొంతదారు ఎవరంటే….ఆ ఊరి ప్రధాన పురోహితుడు పరమేశ్వర శర్మగారి తల్లి అలివేలమ్మ!

ఆ ఇంటిముందున్న రెండు వాకిళ్లు, మూడు అరుగు లలో…ఒకింత ఎడంగా వున్న చిన్న అరుగు ఆవిడ కార్యస్థానం! ఏ కాలమైనా, పగలైనా, రాత్రయినా ఆమె అక్కడే వుంటుంది. అరుగుకు రెండువైపులా తడికెలు కట్టి, ఆమెకు కాస్త మరుగు ఏర్పరచాడు ఆమె కొడుకు పరమేశ్వరయ్య. ఆ తొలిఝాము వేళ రకరకాల పాటలు పాడుకుంటూ, వక్కాకు దంచుకుంటుంది అలివేలమ్మ. చిన్న ఇత్తడిరోలు, రోకలి… రోట్లోని ఆకూవక్కా…. ఆ రోకటిపోటు, రోలునూ, రోకలినీ అనుసంధిస్తూ వున్న ఇత్తడి గొలుసు చేసే సవ్వడి… ఆమె జానపదబాణీలో పాడే పాటలకు పక్కవాద్యాలుగా పనిచేస్తాయి.

ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఉచ్చస్వరంలో పాడే ఆమె పాట, ఆ రోకటి చప్పుడు రెండుమూడు వీథుల వరకూ వ్యాపించి…. అందరినీ నిద్రలేపుతుంది.

“తెల్లవారిపోతావుంది…అలివేలమ్మ పాట అందుకుంది. అమ్మనాయనోయ్! లేయండ్రోయ్” అని ఒకరినొకరు నిద్రమేల్కొల్పుతారు. ఆ ఊళ్లో ఆ విధంగా మలికోడి చేసేపని అలివేలమ్మ చేస్తుంది. ఆమె తెల్లని రంగుతో పొట్టిగా వుంటుంది. ఆమె భర్త గతించి ఎన్నో ఏళ్లయింది. ఎర్రనిచీరను తలపైనుంచీ కప్పుకుని వుంటుంది. నుదుట విబూది పట్టెలు పెట్టుకుంటుంది. ఆమె వయసు ఎనభై ఐదు పైమాటే!

అయినా చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది. సూదిలో దారం కూడా ఎక్కించగలదు. ఒక్క క్షణం తీరికగా వుండదు. ఇంటికి వచ్చీ పోయే వాళ్లను మాట్లాడించడం, ఒత్తులు చేయడం, ముని మనవలనూ, మనవరాళ్లనూ ఉయ్యాల వూపడం, పెద్దపిల్లలకు కథలు, పద్యాలు చెప్పడం, వాళ్లకు అన్నాలు కలిపి ముద్దలు చేతిలో పెట్టడం, నిద్రపుచ్చడం వంటి సవాలక్ష పనులు చేస్తుంది. ఆమె పాడే లాలిపాటలకు వాళ్లింటి పిల్లలే కాదు… చుట్టుపక్కల పిల్లలు కూడా నిద్రపోతారు. అంత శ్రావ్యంగా వుంటాయి ఆ పాటలు!

అంతేనా? ఆమెకు తేలుమంత్రం, ఇరుకుమంత్రం, దిష్టిమంత్రం వంటి అనేక మంత్రాలు వచ్చు. ఎవరికైనా కామెర్లు వచ్చినా, వరుసజ్వరాలు (మలేరియా) వచ్చినా ఆమె నాటుమందు తయారుచేసి ఇస్తుంది. ఆ విధంగా ఆమె వద్దకు నిత్యం ఎవరో ఒకరు వస్తూనే వుంటారు.

అంతేనా? చంటిపిల్లలు పాలు తాగకపోతే చక్కెర, విభూతి మంత్రించి ఇస్తుంది. పెద్దపిల్లలకైతే ఉప్పు మంత్రించి ఇస్తుంది. పిల్లలు పీడకలలతో బెదురుకోని నిద్రపోకపోతే దానికీ ఓ మంత్రం వుంది ఆమె దగ్గర! అన్నింటికీ మూలమంత్రమైన నరసింహమంత్రం నిరంతరం ఆమె నోటిలో మెదులుతూనే వుంటుంది.

ఇట్లా ఊళ్లోని ఆడవాళ్లంతా ఆమె దగ్గర వరుస కడుతూనే వుంటారు. చల్లనిమాట…చక్కని పాట ఆమెది!

***

అప్పుడప్పుడే వేగుచుక్క పొడుస్తున్న వేళలో అందరూ లేచి పనులకు వొంగుతారు.

మగవాళ్లు పశువుల కొట్టాల్లోని పశువులను వీథివాకిట్లో కట్టేసి, పశువుల శాలలను శుభ్రం చేసుకోవడం, ఉప్పునీళ్ల బావికి పోయి, నీళ్లు తీసుకొనిరావడం, సేద్యానికి పనిముట్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేస్తారు. ఆడవాళ్లు ఇళ్లూవాకిళ్లూ ఊడ్చుకోవడం, కళ్లాపి చల్లు కోవడం, ఇల్లు అలికిముగ్గు పెట్టు కోవడం, ఆవులూ, బర్రెగొడ్ల దగ్గర పాలు పిండుకోవడం, ఆ పాలను తాము వర్తనగా పోసే ఇండ్లలో పోసిరావడం వంటి పనుల్లో మునిగిపోతారు.

‘సుర్…. సుర్…’ మని పాలు పిండుకునే చప్పుళ్లూ, పొలానికి పోవడానికి సిద్ధమవుతున్న ఎద్దుల మెడలలోని గంటలచప్పుడూ, వెన్న చిలుకుతున్న ‘ఛర్…. ఛర్ ‘మనే సవ్వళ్లూ, చెట్లమీద కువకువ లాడుతున్న పక్షుల కిలకిలా రావాలూ ఆ ప్రభాతసమయంలో ఇంకా రెండుమూడు దేశాల అవతల వున్న సూర్యునికి ఆహ్వానగీతాల్లా వున్నాయి.

మేలుకొలుపులు అయిపోయి ‘నామరామాయణం’ అందుకుంది అలివేలమ్మ. ‘శుద్ధబ్రహ్మ పరాత్పరరాం’ అంటూ.

“లే అన్నపూర్ణా! విన్నావా? అమ్మ లేచి పాట కూడా మొదలు పెట్టింది. లేచి పనులు కానీ…!” అని భార్యను నిద్రలేపినాడు పరమేశ్వరయ్య.

“అయ్యో! ఇంత మొద్దునిద్ర పట్టిందేందో… ఎన్నడూ లేనిది ఈవేళ…!” అంటూ ఉలిక్కిపడి లేచింది అన్నపూర్ణమ్మ.

“నువ్వు భ్రమరి మీద చింతతో రాత్రంతా సరిగా నిద్రపోలేదు కదా! మరి త్వరగా మెలకువ ఎట్లా వస్తుందనుకున్నావ్?” ఊరడించాడు పరమేశ్వరయ్య.

లేచి మంగళసూత్రాలు కళ్లకద్దు కోని, చీర సర్దుకొని, భర్త పాదాలకు దండం పెట్టింది. తరువాత అత్తగారి దగ్గరికి పోయి నమస్కరించింది అన్నపూర్ణమ్మ.

వరిపొట్టును కాల్చి, ఆ బూడిదలో పచ్చకర్పూరం, ఉప్పు కలిపి ‘పండ్లపొడి’ని తయారు చేస్తాడు పరమేశ్వరయ్య.

ఆ పొడితో దంతధావనం చేసుకుని, అత్తగారికీ చేయించి, ఆమెకు కాలకృత్యాలు తీర్పించింది.

ఇంతలో వేడినీళ్ల హండా కింద మంట రాజేసి, తల్లి స్నానానికి సిద్ధం చేసినాడు పరమేశ్వరయ్య.

అలివేలమ్మకు స్నానం చేయించి, ఆమె కూర్చునే అరుగు శుభ్రం చేసి, చాపవేసింది అన్నపూర్ణమ్మ. తడికె మీద ముందురోజు ఆరేసిన మడిచీరను చుట్టుకుని, స్తోత్రాలు, అష్టోత్తరాలూ మొదలుపెట్టింది అలివేలమ్మ.

ఇంతలో కోడళ్లు ఇద్దరూ లేచి ఇళ్లూవాకిళ్లూ కసవూడ్చడం ప్రారంభించినారు.

భార్యాభర్తలిద్దరూ పశువుల శాలలోకి పోయి రెండు ఆవుల దగ్గరా, రెండు బర్రెగొడ్ల దగ్గరా పాలు పిండుకున్నారు. మరో బర్రెపాలు పెద్దకొడుకు పిండుకున్నాడు.

దాలిపై పెద్దకుండలో పాలు కాచడానికి పెట్టింది అన్నపూర్ణమ్మ. రెండు కుంపట్లు వెలిగించి, ఒక దానిపైన ఆవుపాలూ…మరో కుంపటిపైన బర్రెపాలు కొన్ని కాచింది. వేడినీళ్లు పెట్టి డికాక్షన్ వేసింది.

పాలకోసం యేడుస్తున్న చిన్నమనుమడిని ఎత్తుకొని, పాలు చల్లార్చి తాగించింది.

ఇంతలో పరమేశ్వరయ్య దగ్గర వేదం, మంత్రభాగం నేర్చుకోవడానికి పక్కవూరి నించి వచ్చి, వాళ్లింట్లోనే వుండే విద్యార్థులిద్దరూ మిద్దెపై నున్న గది నుంచి దిగివచ్చినారు.

అందరికీ కాఫీ కలిపి పెద్దపెద్ద ఇత్తడి లోటాలలో ఇచ్చింది. అలివేలమ్మకూ పంపింది కోడలితో. ఆ కాఫీ పరిమళం ఇల్లంతా చుట్టుకుంది.

అప్పటికే ఆ వూళ్లలో కాఫీ అలవాటు వేళ్లూనుకుంది. మొదట్లో అలివేలమ్మ వ్యతిరేకించింది గానీ, కొడుకు, కోడలికి కాఫీపై వున్న ప్రేమకు తానూ తలవంచింది.

మొదట్లో “మా తాత గవర్నేరు కాదు…మా నాయన కలకటేరు కాదు…నేను కాఫీనీళ్లు తాగడానికి!” అని నిరసించేది. పోను పోను అందులోని సౌకర్యమూ, రుచీ గమనించి “కాఫీ మడుగుకు (మడి) పనికివస్తుందిలే!” అని సమర్థింపు మొదలుపెట్టింది.

ఆ కాలంలో కాఫీపొడి దొరికేది కాదు ఆ వూళ్లలో. నంద్యాలకో, కర్నూలుకో పోయినప్పుడు ఒకటి రెండు బస్తాల కాఫీగింజలు కొని తెస్తాడు పరమేశ్వరయ్య. వాటిని యేరోజుకారోజు వేయించుకోవడం, చేతిమిషనుతో పొడి చేసుకోవడం పెద్దపని! అయినా కాఫీమీద ప్రేమతో ఈ కష్టాన్నంతా సహిస్తుంది అన్నపూర్ణమ్మ.

అందరూ వేడివేడి ఆ కాఫీని ఊదుకుంటూ పరవశంగా తాగినారు.

కోడళ్లకు చెప్పవలసిన పనులన్నీ అప్పజెప్పి బిందెలు అందుకుంది అన్నపూర్ణమ్మ. ఒక బిందెపైన చిన్న నిమ్మకాయంత పసుపుముద్ద పెట్టుకుంది. ఒక విస్తరాకు చింపులో పట్టెడు సున్నిపిండి వేసుకొని కొంగున ముడేసుకుంది. భర్తకు ఒక పెద్దబిందె, ఒక చిన్న బిందె అందించింది. విద్యార్థులకు చెరొక పెద్దబిందె అందించింది. తానొక బిందె తీసుకుంది. ఒక ఇత్తడి బకెట్ నిండా మాసిన బట్టలు పెట్టుకుంది. అందరూ ఏటివైపు బయలు దేరారు.

పెద్దకొడుకు లక్ష్మీపతి పశువులశాలలో నుంచి చిన్న ఎద్దును తెచ్చి పీపాబండికి కట్టి, వాడుక నీళ్లు తీసుకురావడం కోసం ఏటివైపు బండిని తోలుకుంటూ పోయినాడు.

అప్పటికి తెల్లవారుఝామున ఐదు అవుతున్నది. పరమేశ్వరయ్య విద్యార్థులిద్దరితో ‘పోతన భాగవతం’లోని పద్యాలు వల్లెవేసుకుంటూ ముందు నడుస్తున్నాడు. ఎదురుపడిన వాళ్లందరూ ఆయనకు నమస్కరించి పక్కకు తప్పు కుంటున్నారు. మంచాల మీద కూర్చున్నవాళ్లు దిగ్గున లేచి ఆయనకు నమస్కరిస్తూ గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. కళ్లాపి చల్లే ఆడవాళ్లు వాళ్ల పని ఆపి, పక్కకు తొలగి, వినయపూర్వకంగా తలవంచుకుని నిలుచు కుంటున్నారు.

పరమేశ్వరయ్య చెయ్యెత్తు మనిషి. ఎర్రటి మైఛాయతో, గోష్పాదమంత పిలకతో, నుదుట త్రిపుండ్రాలతో, మధ్య మూడో కన్నులా మెరుస్తున్న కుంకుమతిలకంతో… నడుస్తున్న సదాచారంలా, మనిషి రూపంలోకి మారిన వేదమంత్రంలా, శుభమేదో నడిచివస్తున్నట్టుగా, సదా చిరునవ్వుతో వుంటాడు. నిరంతరం యేదో ఒక పని చెయ్యవలసిందే! చుట్టూ పదివూళ్ల పౌరోహిత్యం ఆయనది. భూవసతి కూడా సమృద్ధిగా వుండటంతో ఎవరినీ యాచించడు ఆయన. నిరుపేదలైనా, శ్రీమంతులైనా ఆయన వాళ్ల పనిని తృప్తిగా చేసిపెడతాడు. ఎక్కడా మంత్రలోపం కానీ, క్రియాలోపం గానీ చెయ్యడు. ఎవరెంత సంభావన ఇస్తే ‘శివార్పణం’ అని తీసుకుంటాడు. పేదవారికి తానే సహాయం చేస్తాడు. ఆయన ముహూర్తం పెట్టకుండా పెళ్లి చేసుకున్నవాళ్లు ఆ ప్రాంతంలో అరుదు. ఆ ఊళ్లలో ఆయన చెయ్యి పడకుండా ఒక్క కార్యక్రమమూ జరుగదు. ఆ ఊళ్లలో ఆయన తొక్కని గడపలేదు. చేయించని నోములూ, వ్రతాలూ లేవు.

ఎప్పుడూ పౌరోహిత్యం పనులూ, పొలం పనులూ,జాతకాలు వెయ్యడం, వారం వారం ప్రశ్నచెప్పడం, ముహూర్తాలు పెట్టడం వంటి పనులతో క్షణం తీరిక వుండదు ఆయనకూ, ఆయన ఇద్దరు కొడుకులకూ! ఆడపిల్లలిద్దరూ అత్తగారిళ్లలో సంసారాలు దిద్దుకుంటున్నారు. అనుకూలవతి అయిన భార్య ఆయనకు అడుగడుగునా సహకరిస్తూ వుంటుంది. ఇలా ఆయన జీవితం సాఫీగా సాగిపోతూవుంది. యాభైఅయిదేళ్లు పైబడిన వయసు ఆయనది!

ఆయనకు పదడుగుల వెనకగా అన్నపూర్ణమ్మ నడుస్తూవుంది. ఆమె అలవాటు ప్రకారం ‘సీత సమర్త’ పాట అందుకుంది. ఆమె వయసు యాభైయ్యేళ్ల పైమాటే! మరీ పొట్టీ పొడుగూ కాకుండా చామనఛాయతో వుండే మనిషి. ఎల్లవేళలా ముఖం నిండా, పాదాల నిండా పసుపుతో, నుదుట సూర్య బింబంలా వెలిగే కుంకుమబొట్టుతో, మెడనిండా నల్లపూసల సౌరుతో, నాలుగుపొరల చంద్రహారంతో, పుష్యరాగాల కమ్మలతో…. భూలోకవిహారానికి వచ్చిన పార్వతీదేవిలా వుంటుందామె!

అలవాటు ప్రకారం నోటిలో పాట సాగుతోంది. కానీ, ఈరోజు ఆమె మనసులో మనసు లేదు. ఆమె మనసంతా ‘బొమ్మక్క’ అని తాము పిలుచుకునే భ్రమరి చుట్టూ తిరుగుతోంది. ఆ పిల్ల గురించిన ఆలోచన ఆమెకు ఊపిరి ఆడనివ్వడం లేదు.

“బొమ్మక్క ఎట్లా వుందో యేమో! రాత్రి ఏమైందో? మూడురోజులైంది పిల్లకు నొప్పులు మొదలై….కాసేపు నొప్పి రావడం….ఆగిపోవడం…పిల్ల అలసిపోతున్నది. బెదురుకుంటున్నది…నిన్న సాయంత్రం పోయి ధైర్యం చెప్పి, వైద్యుడిని విచారించి, మంత్రసానిని విషయం అడిగి తెలుసుకోని వచ్చింది. బిడ్డ కదలికలు బాగానే వున్నాయి కాబట్టి భయం లేదని చెప్తున్నారు వాళ్లు. తొలిచూలు కాన్పులో ఇవన్నీ సాధారణమే నంటున్నారు. పక్కవూరి నించి నాటువైద్యుడిని పిలిపించినారు. మంత్రసాని మంగలి మల్లమ్మ మరి ఇద్దరిని పక్కవూళ్ల నించి పిలిపించుకుంది తనకు సాయంగా!

భ్రమరి తండ్రి నారాయణ, తల్లి రాజమ్మ దిగులుతో నిస్త్రాణగా అయిపోయినారు. ఎవరికీ యేమీ దిక్కుతోచని పరిస్థితి!

నారాయణ తన భర్తకు దూరపు చుట్టం. శివాలయం పాతపూజారి గతించిన తరువాత ఆయనకు వారసులెవ్వరూ లేకపోవడంతో, ఊరివారిని ఒప్పించి, నారాయణను పూజారిగా నియమింప జేసినాడు తన భర్త. తమ బంధువుల పిల్ల రాజేశ్వరిని నారాయణకు ఇప్పించి పెళ్లిచేసింది కూడా తామిద్దరే!

ముచ్చటగా ముగ్గురు పిల్లలు నారాయణకు.

పెద్దపిల్ల భ్రమరాంబ, రెండోది శారద, మూడోవాడు శంకరుడు పదేళ్లవాడు.

గుళ్లో పూజారిగా వుంటూ, తన భర్త దగ్గర పౌరోహిత్యం పనులకు పోతూ యేదో గుట్టుగా సంసారం సాగిస్తున్నాడు నారాయణ.

“పెద్దపిల్ల భ్రమరి…పెద్ద అందగత్తె కాకపోయినా, పెద్దజడ, పెద్దకళ్లు, నవ్వుముఖంతో, చలాకీతనంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఆమె కలుపుగోలు స్వభావం, కష్టపడే మనస్తత్వం, సర్దుకుపోయే తత్వం, ఎన్నో చేతిపనులు చేయగల చాకచక్యం, యే విషయాన్నయినా క్షణకాలంలో గ్రహించగల నేర్పు ఆమె సొంతం! ఇట్లా ఎన్నయినా చెప్పుకుంటూ పోవచ్చు ఆమె గురించి!

అసలు తానే తన చిన్నకొడుక్కు బొమ్మక్కను చేసుకుందామనుకుంది. కానీ, మేనరికం వుండటం వల్ల చేసుకోలేకపోయింది.

దాంతో తమ బంధువుల పిల్లవాడయిన రామేశ్వరానికి ఆ పిల్లను ఇప్పించి పెండ్లిచేసినారు తానూ, తన భర్తా.

రామేశ్వరం ఈ చుట్టుపక్కల వూరివాడే! గుళ్లో పూజారిగా చేస్తాడు. వీథిబడి నడుపుతాడు. పొలం బాగానే వుండటంతో జరుగుబాటుకు ఇబ్బంది లేదు.

బొమ్మక్క ఎంత తెలివైనదో! తమ్ముడికి తండ్రి చదువు నేర్పుతూంటే, వాడి కంటే ముందు తానే నేర్చుకునేదట! ఆడపిల్లకు చదువు నేర్పిస్తే ఊళ్లోవాళ్లు ఆక్షేపిస్తారని భయపడి, లోపలిగదిలో మంచం చాటున కూర్చోబెట్టి పెద్దబాలశిక్ష వరకూ నేర్పించినాడట నారాయణ! లెక్కలయితే నిముషాల మీద నేర్చేసుకుంటుందట! తండ్రికి రాని లెక్కలు కూడా తాను చేసి చూపుతుందట! చాటుగా వార్తా పత్రికలు చదువుతుందట! పుస్తకాలు కూడా చదివి అర్థం చేసుకుంటుందట! ఇదంతా నారాయణ తనకు చాటుగా చెప్పినాడు.

పెళ్లయిన తర్వాత భర్తకు గుడి నిర్వహణలోనూ, వీథిబడి నడపడంలోనూ సహాయ పడుతుందట. రామేశ్వరునికి కొంత ఇంగిలీషు కూడా వచ్చివుండటంతో భార్యకు ఇంగిలీషు కూడా నేర్పుతున్నాడట! ముందు ముందు ఆ వూళ్లో ఇంగిలీషు బడి కూడా పెడతారంట ఇద్దరూ కలిసి!

అంతేకాదు… తండ్రి దగ్గర, అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంతో చిట్కావైద్యాలు కూడా చేస్తుందట!

హవ్వ! చెప్పుకుంటే జనం యేమంటారో యేమోగానీ, పంచాంగం చూడటం, జాతకాలు చెప్పడం, ముహూర్తాలు పెట్టడం కూడా నేర్చుకుందట!

ఆ పిల్లకు రాని విద్య లేదంట. అత్తమామలు కూడా ఆ పిల్ల మంచితనం వల్ల ఆ పిల్ల యేమి చేసినా సమర్థిస్తారట…ఇది మరీ చోద్యం కాదూ!

చుట్టుపక్కల ఆడవాళ్లు భ్రమరితోనే జాబులు రాయించు కోవడం, రామాయణం, భారతం చదివించుకోవడం, వైద్యాలు చేయించుకోవడం వంటి వన్నీ చేస్తారట! దానికి రాని విద్య లేదటమ్మా! అని మనసులోనే నోరునొక్కుకుంది అన్నపూర్ణమ్మ.

ఇంతలో ఆమె భర్త వెనుదిరిగి ఆమె బాగా వెనకబడి వుండటం చూసి, కొన్ని అడుగులు వెనకకు నడిచి వచ్చి… “ఏమి? ఇంత వెనకబడి పోతివే! భ్రమరి గురించేనా నీ ఆలోచనంతా? నిన్న ఊళ్లోని పెద్దలంతా రచ్చబండ దగ్గర కూర్చోని భ్రమరి విషయమే మాట్లాడితిమి. దేవుడి మీద భారం వెయ్యడం తప్ప ఏమీ చేయలేమని అందరూ తీర్మానించినారు. ఎందుకంటే కర్నూలుకు తీసుకొని పోవడానికి ఎవరి దగ్గరా జీపులు లేవు. ఒకవేళ ఎక్కడి నించైనా తీసుకొచ్చినా… దారిలో యేదైనా విషమిస్తే ప్రమాదం కదా! బస్సులో పోవాలన్నా రహదారి మీద వరకూ బండిలో పోవాల. ఈ లోపల యే సమస్య వచ్చినా కష్టమే!

అందుకే రేపటినించీ నా పనులన్నీ పిల్లలకు అప్పగించి, ‘సుందరకాండ’ పారాయణం మొదలుపెడతాను. పొద్దునా సాయంత్రం ఆ పనిమీదే వుంటాను. నా శిష్యులిద్దరూ రామరక్షాస్తోత్రం వీలయినన్నిసార్లు చేస్తారు.

కామిశెట్టి లక్ష్మయ్యశెట్టి భాగవతంలో ‘కృష్ణజన్మఘట్టం’ పారాయణం చేస్తానన్నాడు. వడ్ల రామానుజాచారి ‘గజేంద్రమోక్షం’ వీలయినన్నిసార్లు చదువుతాడు. మన ఆంజనేయస్వామి గుడి పూజారి మాధవాచార్యుల కొడుకు చక్రి రామాయణంలో ‘బాలకాండ’ పారాయణం చేస్తానన్నాడు. మాధవాచార్యులు ‘విష్ణుసహస్రం’ పదకొండుసార్లు పారాయణం చేస్తాడు. జంగం లింగమయ్య శివపురాణం చదువుతాడు. గంగుల రామిరెడ్డి మనుమడి పుట్టెంటుకల కోసం యాగంటికి పోతున్నాడు. అక్కడ భ్రమరి, రామేశ్వరాల పేరు మీద అభిషేకం చేయిస్తానన్నాడు. శివాలయంలో నారాయణ, రామేశ్వరం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఆంజనేయస్వామికి, వీరభద్రునికి ప్రత్యేకపూజలు జరిపిస్తారు. అమ్మవారిశాల పూజారి శివానందం అమ్మవారికి కుంకుమపూజ, లలితాసహస్ర పారాయణం, త్రిశతి చేయిస్తానన్నాడు. వీళ్లందరూ తమ పారాయణ ఫలితాన్ని రామేశ్వరునికీ, భ్రమరికీ ధార పోస్తారు. నరిసిరెడ్డి గ్రామదేవత సుంకులమ్మకు బోనం పెడతానన్నాడు. భ్రమరి ఈ గండం నించి బయటపడితే నారపరెడ్డి ఈ సంవత్సరం పెద్దమ్మ జాతర ఘనంగా చేయిస్తానని మొక్కుకున్నాడు. నరిసిరెడ్డి భార్య, నారపరెడ్డి భార్య అహోబిలంలో గండాదీపం మోస్తామని మొక్కుకున్నారంట! భ్రమరి అత్తగారు అహోబిలం నరసింహునికి నిలువుదోపిడీ ఇస్తానని మొక్కుకుందట! ఊళ్లో అనేకమంది ఆడవాళ్లు ఆంజనేయ స్వామికి ‘గండాదీపం’ మోస్తామని మొక్కుకున్నారట! అన్నట్లు అమ్మ మొన్నటినించే ‘నృసింహకవచం’ రోజంతా చదువుతూనే వుంది. ముల్లాసాహెబు దాదేఖాన్ రేపు భ్రమరి గురించి తమ ప్రార్థనలలో దేవునికి నివేదిస్తాననీ, దువా చేస్తాననీ, మసీదుకు వచ్చే వారం దరితో ‘దువా’ చేయిస్తాననీ అన్నాడు. ఇంతమంది ఇన్ని ప్రార్థనలు చేస్తూవుంటే దేవుడు ఆ పిల్లను గడ్డన పడేయకపోతాడా…? చెప్పు! ఊరికే దిగులుపడవాకు. నువ్వు పెద్దదానివి. అందరికీ చెప్పవలసినదానివి. నువ్వే ఇట్లా దిగులుపడితే ఎట్లా చెప్పు? ఊరందరికీ నారాయణ పట్ల అభిమానం వుంది. భ్రమరి అంటే వాత్సల్యం వుంది. దానికి యేమీ కాదు. ధైర్యంగా వుండు!” అని వీపు తట్టాడు పరమేశ్వరయ్య.

అన్నీ నిన్న రాత్రి భర్త చెప్పినవే అయినా తలవంచుకుని ఓపికగా వినింది అన్నపూర్ణమ్మ. ‘సరే’ అన్నట్లు తలవూపింది. ఏదో మొండి ధైర్యం ఆమెను ఆవరించింది.

 ‘సీతసమర్త’ పాట ఎక్కడ ఆగిపోయిందో గుర్తురాలేదు. ఈసారి ‘సీతాదేవి బైకలు (వేవిళ్లు)’ పాట అందుకుంది. కానీ, పాట దారి పాటదే! ఆలోచన దారి ఆలోచనదే అయింది.

“ఎంత శాణిమంతురాలు (చాకచక్యం, తెలివి కలది) అయితేనేం.. గోరంత ఆయుష్షు లేకపోయినాక! అర్ధాయుష్షుపిల్ల బొమ్మక్క దక్కుతుందో….లేదో! సీతమ్మతల్లీ! నీవే బొమ్మక్కను కాపాడు!” ఆక్రోశించింది ఆమె చిత్తం. పాట నెమ్మదిగా సాగుతున్నది…అలవాటు మీద. “ఈ ముదనష్టం పిల్లవాడు ఏ క్షణాన దాని కడుపున పడినాడో! తల్లిగండాన పుడుతున్నాడు” మనసులోనే మెటికలు విరిచింది అన్నపుర్ణమ్మ.

***

అందరూ ఏటి దగ్గరికి చేరుకున్నారు. ఒకరిద్దరు చాకలి వాళ్లు బట్టలు ఉతుక్కునే ఏర్పాట్లలో వున్నారు. అక్కడక్కడా ఒకరిద్దరు ఏట్లో స్నానాలు చేస్తున్నారు.

అన్నపూర్ణమ్మ పెద్దకొడుకు లక్ష్మీపతి పీపాబండిని ఏటిలోకి తీసుకుపోయి, విద్యార్థుల సాయంతో నీళ్లు నింపుతున్నాడు.

అన్నపూర్ణమ్మ రోజూ ఏట్లో తనకలవాటయిన చోటికెళ్లి నీళ్లు నిలిచి గుంటగా వున్నచోట బట్టలు నానబెట్టింది. అడ్డంగా బిందెపెట్టింది. ఆ కాలంలో బట్టలసబ్బులు లేవు. చాకలివాళ్లు వారానికి రెండుసార్లు మురికి బట్టలను అందరి ఇండ్లవద్ద నుంచీ తీసికెళ్లి యేటి దగ్గర బానలో వేడినీళ్లూ, చవిటి సున్నంలో ఉడకబెట్టి ఉతుకుతారు. మిగతారోజుల్లో మామూలు నీళ్లలో ఉతుక్కోవలసిందే! అయినా యేటినీళ్లకు బట్టలు బాగానే శుభ్రం అవుతాయి.

ఇంతలో పరమేశ్వరయ్య స్నానానికి యేటిలోకి దిగినాడు. అది చూసి ఒక శిష్యుడు వచ్చి అమ్మగారి దగ్గర సున్నిపిండి తీసుకుని వెళ్లి గురువుగారి వీపు, మెడ, కాళ్లు, చేతులు రుద్దసాగాడు. ఆయన స్నానం పూర్తిచేసుకుని, తడి బట్టలతోనే ఏటిలోని బండ మీద కూర్చుని సహస్రగాయత్రీజపం మొదలుపెట్టినాడు.

అన్నపూర్ణమ్మ బిందెలన్నీ ఇసుకపెట్టి తోమింది. వాటిని ఒడ్డున పెట్టి బట్టలు ఉతకడం పూర్తిచేసింది.

పీపా నిండడంతో లక్ష్మీపతి బండిని ఏట్లోనించి బయటికి తీసుకొచ్చి “అమ్మా! ఉతికిన బట్టలు ఇట్లాయివ్వు. బండ్లో పెట్టుకుంటాను” అని తడిబట్టలను బండిలో పెట్టుకున్నాడు. బండి వూరి వైపు సాగింది. విద్యార్థులిద్దరూ స్నానాలు చేసి సంధ్యలు వార్చుకుంటున్నారు.

అన్నపూర్ణమ్మ ఏట్లో దిగి స్నానం మొదలుపెట్టింది. ఒళ్లంతా పసుపు రుద్దుకుంది. సున్నిపిండితో ఒళ్లు నలుచుకుంటూండగా….ఇంతలో తమ పక్కవీథిలోని అమ్మణ్ణి పరుగుపరుగున వచ్చింది. “ఇది విన్నావా అత్తా! ఇంతకుముందే పద్మావతి కనబడి చెప్పింది. బొమ్మక్క పరిస్థితి యేమంత బాగా లేదట అత్తా! రాత్రంతా వచ్చే నొప్పీ…. పోయే నొప్పీతో ఎవరూ నిద్రపోలేదట! బిడ్డ అడ్డం తిరిగిందేమోనని మంత్రసాని పద్మావతితో రహస్యంగా అనిందంట. ఇట్లా అయితే తల్లీ పిల్లా బతకడం కష్టమంటున్నారంట! పిల్ల పిచ్చికళన పడిందంట. రామేశ్వరమయితే చాటుగా పోయి కంటికి మంటికి ఏకధారగా యేడుస్తున్నాడట! రాజమ్మ ఒదిన, నారాయణ అన్న అయితే ఒణికిపోతున్నారట! బొమ్మక్క బతుకు తుందో ….లేదో…అని భయమైతుందత్తా!” అంటూ ఆమె వెనకచేరి సున్నిపిండి అందుకొని, అన్నపూర్ణమ్మ వీపు రుద్దడం మొదలుపెట్టింది అమ్మణ్ణి.

ఒక్కసారి దిగులుతో కుంగిపోయింది అన్నపూర్ణమ్మ. కానీ, భర్త మాటలు గుర్తుకు తెచ్చుకుంది. ‘ఊళ్లో అందరూ తనను పెద్దదానిగా గుర్తిస్తారు. సలహాలు అడుగుతారు. అలాంటి తానే భయపడితే వీళ్లు చిన్నపిల్లలు ఇంకా బేజారయితారు.’ అని మొండిధైర్యం తెచ్చుకుంది.

“అమ్మణ్ణీ! అంత దిగులు పడనవసరం లేదమ్మా! ఆ పిల్లకు యేమీ కాదు. క్షేమంగా ప్రసవం అయి పాలూ-నీళ్లూ యేర్పడతాయి. చూస్తూ వుండు! మీ మామ ఈరోజు నించీ ‘సుందరకాండ’ పారాయణం చేస్తున్నారు. ఆయన పారాయణ చేస్తే తిరుగుండదు తెలుసా? అది బ్రహ్మాస్త్రం వలె పనిచేస్తుంది. ఆంజనేయస్వామి ఇంత ఘోరం జరగనిస్తాడా? ఊళ్లో వాళ్లంతా బొమ్మక్క కోసం పూజలు, పారాయణాలు చేస్తున్నారంట తెలుసా? అమ్మణ్ణీ! మనమొక పని చేద్దామే.. మనం నీళ్లు తీసుకొని పోయి, త్వరగా యేదో ఒకటి ఉడకేసుకొని, కాస్త ఎంగిలిపడి, పనులన్నీ పిల్లలకు అప్పగించి, ఆంజనేయుల గుడి దగ్గరికి పోదాం! ఆ పక్కింట్లోనే అనసూయమ్మ అనే ‘అమ్మగారు’ వుంటారు గదా! ఆమె పరమభక్తురాలు. ఆమెను సలహా అడుగుదాం…ఏదైనా పూజనో, పారాయణమో చెప్తే చేద్దాం. అంతకంటే నాకేమీ తోచడం లేదే అమ్మడూ!” అన్నది కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.

“సరే అత్తా! నేనూ యేదో ఇంత వండేసి, కాస్త నోట్లో పడేసుకోని, చిన్నపిల్లలను పెద్దపిల్లకు అప్పజెప్పి తొరగా వచ్చేస్తాను నారాయణ అన్న ఇంటికి. మనవాళ్లందరికీ చెప్తాలే! అందరం కలిసి అనసూయమ్మ ఇంటికి పోదాం!” అన్నది అమ్మణ్ణి.

తాను తెచ్చిన మాసిన బట్టలను గబగబా వుతికేసింది అమ్మణ్ణి. ఇద్దరూ స్నానాలు ముగించి చెరో చెలమ దగ్గరికి పోయినారు.

“ఉండత్తా! నేను చెలమను శుభ్రం చేస్తాను” అంటూ చెలమలోకి దిగి, నీళ్లన్నీ చుట్టూ చిమ్మివేసి, ఇసుకను పైకి తోడి చెలమను లోతు చేసింది అమ్మణ్ణి. నీళ్లు స్వచ్ఛంగా ఊరసాగినాయి. అన్నపూర్ణమ్మ చెలమలోకి దిగి, బిందెను పొందించుకొని, లోటాతో ఒక్కొక్కటిగా నీళ్లు తోడి బిందె నింపసాగింది. ఒక బిందె నిండేసరికి, విద్యార్థులిద్దరూ వచ్చి, “పెద్దమ్మా! నువ్వు పోయి జపం చేసుకోపో! మేమిద్దరం నీళ్లు నింపుతాములే!” అన్నారు.

సరేనంటూ ఆమె చెలమలో నించి లేచి, అక్కడే వున్న చాకలివారు యేర్పరచుకున్న చిన్నగుడి దగ్గరికి పోయి, అక్కడ వున్న అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకోని, ఒక శుభ్రమైన బండపై తువ్వాలు పరచుకొని గౌరీపంచాక్షరి మొదలుపెట్టింది.

ఆమె జపం పూర్తయ్యేసరికి విద్యార్థులిద్దరూ చెరో చెలమ దగ్గరా కూర్చుని బిందెలన్నీ నింపేసినారు. అమ్మణ్ణికీ సాయం చేసినారు.

పరమేశ్వరయ్య జపం పూర్తయింది. తలమీద ఉత్త రీయాన్ని కుదురువలె చుట్టు కున్నాడు. పెద్దబిందె ఒకటి ఆయన తలపై పెట్టినారు పిల్లలు. చేతికి ఒక చిన్న బిందె అందించినారు. ఆయన రుద్రాధ్యాయం అందుకున్నాడు. పిల్లలిద్దరూ ఆయనతో పాటు రుద్రం చెబుతున్నారు. అన్నపూర్ణమ్మ తలపై కుదురుపెట్టి, దానిపై బిందెను పెట్టినారు. నీళ్ల బకెట్టును చేతికందించినారు. అమ్మణ్ణికీ తలపై బిందెపెట్టి, భుజాలపై ఉతికిన బట్టలు పెట్టినారు. తామిద్దరూ భుజాల మీద పెద్ద బిందెలనెత్తుకున్నారు. గురువుగారిని అందుకోవడానికి వడివడిగా ముందుకు నడిచినారు.

అన్నపూర్ణమ్మ తన నోటికి వచ్చిన స్తోత్రాలనూ, అష్టోత్తరాలనూ చెప్పుకుంటూంది. దారి పొడుగునా ఎవరో ఒకరు ఆపి భ్రమరి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే వున్నారు. అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు నడిచింది ఆమె.

ఇల్లు చేరేసరికి ఏడున్నర గంటలు దాటింది. కోడళ్లు ఇళ్లూవాకిళ్లూ అలికి ముగ్గులు పెట్టినారు. పిల్లలకు స్నానాలు చేయించి, చద్దన్నాలు పెడుతున్నది చిన్నకోడలు.

పీపాబండిలోని నీళ్లను భర్త, మరిదితో కలిసి ‘బచ్చలింట్లో’ని (స్నానాలగది) తొట్లలో, వంటింట్లో ‘జాలాది’ (జలదారి, తూము) దగ్గర వున్న తొట్టిలో నింపుతున్నది.

పెద్దకొడుకు తల్లి తలమీది బిందెను అందుకున్నాడు. చేతిలోని ఇత్తడి బకెట్‌ను అందుకుంది పెద్దకోడలు. విద్యార్థులిద్దరూ బిందెలను వంటింట్లో అరుగుమీద దింపి, గురువుగారి చేతిలోని బిందెలను కూడా అరుగు మీద వరసగా పెట్టినారు. నీళ్ల బిందెల్లో కొద్దిగా పటికపొడిని కలిపింది పెద్దకోడలు. కాసేపటికల్లా నీళ్లు తేరుకొని, తాగడానికి యోగ్యంగా తయారవుతాయి. మడిబిందెలను వంటచేసే దగ్గర పెట్టింది పెద్దకోడలు. అలివేలమ్మ మౌనంగా జపం చేసుకుంటున్నది.

సగం తడిపొడిగా వున్న చీరతోనే తులసిపూజ పూర్తిచేసి, పశువులశాలలోకి పోయి, గోపూజ కూడా చేసి వచ్చింది అన్నపూర్ణమ్మ. తరువాత మడుగు(మడి)చీర కట్టుకుని వచ్చి, వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కోడళ్లు కూరగాయలు తరిగి ఇవ్వగా వంట అన్యమనస్కంగా చేస్తున్నది ఆమె. పరమేశ్వరయ్య వీథి అరుగు మీద కూర్చుని వ్యాసపీఠంపై రామాయణాన్ని పెట్టుకోని, సుందరకాండ పారాయణం మొదలుపెట్టినాడు. నైవేద్యం కాగానే తన కోసం వేచివుండకుండా భార్యను భోజనం చేసి బొమ్మక్క సంగతి చూడ మన్నాడు. తాను నిదానంగా భోంచేస్తానన్నాడు.

వంటపూర్తయి, నైవేద్యం కాగానే తనకూ అత్తగారికీ భోజనం వడ్డించుకుంది. ఏదో తిన్నానంటే తిన్నాననిపించుకోని, ఒక టెంకాయ చిప్పలో తాను చేసిన అల్లం పచ్చడిని పెట్టుకోని, పైన ఆకును మూతగా పెట్టుకొని నారాయణ ఇంటివైపు నడిచింది అన్నపూర్ణమ్మ. నారాయణ ఇల్లు శివాలయానికి పక్కనే వుంటుంది.

అక్కడంతా వొచ్చే జనం, పోయే జనంగా వున్నారు.

ఎవరో పోయి ముల్లాసాహెబు దగ్గర మంత్రం వేయించుకొచ్చి, విభూతిని భ్రమరి నుదుటిపైన, పొట్టపైన రాస్తున్నారు. ఇంకెవరో పూజ చేసిన కుంకుమను దాని నుదుట పెడుతున్నారు.

అన్నపూర్ణమ్మను చూసేసరికి రాజమ్మా, నారాయణా ఆమె దగ్గరికి వచ్చి, చేతులు పట్టుకున్నారు కన్నీళ్లతో.

భ్రమరి అత్త, మామ కూడా దీనంగా చూస్తున్నారు ఆమె వైపు. శారదా, శంకరుడు మొహంలో కళాకాంతీ లేకుండా పీక్కునిపోయి వున్నారు.

“ఒదినా! నా పిల్ల నాకు దక్కుతుందంటావా?” చెంపల మీద నుంచి కన్నీళ్లు కారుతుండగా వాపోయినాడు నారాయణ.

బాగా దిగులుతో కునారిల్లి పోయినారనీ, తాను గట్టిగా మందలించకపోతే పరిస్థితి ఇంకా అయోమయంగా తయారైంతుదనీ భావించి కొంచెం గట్టి స్వరంతో ఇట్లా అన్నది అన్నపూర్ణమ్మ.

“నారాయణా….రాజమ్మా! ఎందుకీ యేడుపులు, పెడబొబ్బలు ? ఆపండి ఇంక! ఇప్పుడే మైందయ్యా? అంతగా యేడుస్తున్నావ్ ? భ్రమరి మూడు రోజుల నించి నొప్పులు పడుతున్నాది. ఈ రోజు నాలుగో రోజు. అంతేకదా! దీనికే ఏదో జరగరానిది జరిగిపోయినట్టు ఈ రాద్ధాంతాలేమి? పిల్ల భయపడిపోదా? మా అమ్మ మా తమ్ముడిని కన్నప్పుడు ఆరు రోజులు నొప్పులు పడిందంట! ఆమెకేమైంది? ఎనభైయేళ్లొచ్చినా గుండ్రాయి వలె వుందా? లేదా? ఎంతోమందికి ఇట్లా జరుగుతూనే వుంటుంది. ఇవన్నీ ఆడవాళ్లకు మామూలే! నీకు తెలియదు అంతే!

మనం ఎవరికైనా అపకారం చేసినామా? మనకు అపకారం జరుగడానికి? ఆ దేవుడు అంత న్యాయం, ధర్మం లేనివాడా? ఆయన మనవంటి సాధుజీవులకు అపకారం జరగనిస్తాడా? ఇంకో విషయం…మీ అన్నయ్య సుందరకాండ పారాయణం మొదలుపెట్టినారు. అది బ్రహ్మాస్త్రం కదా! ఊరుకోండిక… అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఆంజనేయస్వామి అన్నీ చూసుకుంటాడు. ఊళ్లో అందరూ బొమ్మక్క గురించి తాపత్రయ పడుతున్నారు. పూజలు, పారాయణాలు చేస్తున్నారు. అసలు పొద్దున్నించీ యేమన్నా తిన్నారా? లేదా? పన్నెండవుతున్నాది. దేవుని మీద భారం వేసి మనం చేసేపని మనం చెయ్యాల! ఇంక ఎవరూ యేడవకూడదు!” అని ధాటిగా మాట్లాడింది అన్నపూర్ణమ్మ.

అందరూ కాస్త ఊరడిల్లి ధైర్యం తెచ్చుకున్నారు.

“పద్మావతీ! వంట అయివుంటే అందరికీ అన్నాలు పెట్టు!” అని అక్కడే వంటింటి గడపలో నిలుచుకుని వున్న పద్మావతిని ఆదేశించింది ఆమె.

పద్మావతి నారాయణకు చెల్లెలి వరుస అవుతుంది. ఆ పక్క వీథిలోనే వుంటుంది.

“ఎప్పుడో వంట చేసిపెట్టినాను అక్కా! వీళ్లెవరూ నామాట వినడమే లేదక్కా! నువ్వు పోయి భ్రమరిని చూడక్కా! ఒకటే యేడుస్తుంది ఆ పిల్ల.” అనింది పద్మావతి.

భోజనం యేర్పాట్లలో పడిపోయింది ఆమె.

భ్రమరి పడుకున్న పురిటిగదిలోకి పోయింది అన్నపూర్ణమ్మ. ఆ పిల్ల భయంతో బిక్కమొహం వేసుకుని వుంది. నొప్పులు అందుకోవాలని గదిలోనే అటూఇటూ నడిపిస్తున్నారు మంత్రసానులు. వాళ్లను భోజనం చేసి రమ్మని పంపింది అన్నపూర్ణమ్మ.

బొమ్మక్కను మంచంపై కూర్చోబెట్టి, తానూ పక్కన కూర్చొని ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది.

“బొమ్మక్కా! ఇంత తెలివైనదానివి. ఇట్లా నీరుకారి పోతావా? నువ్వు ఇంత చప్పబడిపోతావని ఎన్నడూ అనుకోలేదే అమ్మడూ! కష్టం వచ్చింది. నిజమే! కష్టాలు అందరికీ వొస్తాయి. ధైర్యం తెచ్చుకోవాల! దైవం పైన నమ్మకం పెట్టుకోవాల. ఏడ్చుకుంటూ అయినా అనుభవిం చాల్సిందే…నవ్వుతూ అయినా అనుభవించాల్సిందే! ధైర్యం కోల్పోయేకొద్దీ నీకు ఆలోచన తోచదు. మరీ అయోమయంలో పడిపోతావు. ఆడవాళ్లకు ఈ కష్టాలు తప్పవమ్మా! ఇంత కష్టపడినా …నీ బిడ్డను చూసు కుంటే నీ కష్టమంతా హుళక్కి అయిపోతుంది తెలుసా? నీకే ఈ కష్టం వొచ్చిందనుకుంటున్నావా? మా మేనత్త కూతురైతే వారం రోజులు నొప్పులు పడిందంట తెల్సా? ఊరివారంతా నీకోసం పూజలు, పునస్కారాలూ చేస్తున్నారు తెల్సా? మీ మామ ‘సుందరకాండ’ పారాయణ మొదలుపెట్టినారు. ఇంక కాగల కార్యాలన్నీ ఆ ఆంజనేయస్వామి చూసుకుంటాడు తల్లీ! దిగులుపడవాకు. పండంటిబిడ్డను ఎత్తుకుంటావు. మేమంతా వున్నాము. నీకేమీ కాదు! దైవస్మరణ చేసుకో…” అని ఓదార్చింది అన్నపూర్ణమ్మ.

“అత్తా! నువ్వు మాట్లాడుతూ వుంటే నాకెంతో ధైర్యమొచ్చిందత్తా! నువ్వు నా దగ్గరే వుండత్తా…నీకు పుణ్యముంటుంది…వీళ్లంతా యేవేవో మాట్లాడుతుంటే నాకు భయమైతుందత్తా!” అని అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకోని వాపోయింది పద్ధెనిమిదేళ్ల భ్రమరి.

“పిచ్చిపిల్లా! నిన్ను విడిచి నేనెక్కడికి పోతానే? ఎక్కడున్నా నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా… ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా?”

అట్లా మాట్లాడుతూ ఆ పిల్ల జడవిప్పి, తలదువ్వి జడవేసింది. ఇంతలో భోజనాలు చేసివచ్చిన మంత్రసానులతో చెప్పి వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది.

వేడివేడి అన్నంలో తాను తెచ్చిన అల్లం పచ్చడి వేసి, చారెడు నెయ్యివేసి, కలిపి చేతిలో ముద్దలు పెట్టింది. మిగతా భోజనమంతా పూర్తిచేసింది బొమ్మక్క. మూడు రోజుల నించి భయంతో సరిగా భోంచెయ్యని భ్రమరికి కాస్త కడుపులోకి అన్నరసం పడేసరికి కళ్లు మూతలు పడినాయి.

ఇంతలో అమ్మణ్ణి ఐదారుమంది ఆడవాళ్లను పిలుచుకొని వచ్చింది. కొందరు మగవాళ్లు కూడా వచ్చినారు. వాళ్లలో ఆ వూరిలో భజన నిర్వహించే గోవిందరెడ్డి, అతని నేస్తులు వున్నారు. అందరికీ విషయం చెప్పింది అమ్మణ్ణి.

మన ఊరి పాప కోసం యేమైనా చేస్తామన్నారు వాళ్లు. అందరూ కలిసి ఆంజనేయుని గుడి పక్కనే వున్న అనసూయమ్మ ఇంటికి పోయినారు. అప్పటికే అక్కడ కొందరు ఆడవాళ్లు వున్నారు. వాళ్లకు స్తోత్రమేదో నేర్పిస్తున్నది ఆమె.

ఇంతమంది ఒక్కసారి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది అనసూయమ్మ.

అనసూయమ్మ బాలవితంతువు. అయినా ఆమె అత్తగారు, మామగారూ సహృదయంతో ఆమెను తమ వద్దే వుంచుకుని కూతురువలె చూసుకున్నారు. ఆమె పదేళ్ల వయసులోనే వితంతువు కావడంతో…ఆమె జీవితానికి ఆధారం కావాలనే ఉద్దేశంతో ఆమె మామగారు తానే స్వయంగా చదువు నేర్పించినాడు. ఊరివాళ్లు ఆడదానికి, అందునా వితంతువుకు చదువు ఎందుకని, ధర్మవిరుద్ధమని ఆక్షేపించినా ఆయన లెక్కజెయ్యలేదు. ఆమెకు రామాయణ భారతాది పురాణాలూ తానే దగ్గరుండి చదివించి, ఆమె మనసును ఆ చిన్నవయసులోనే దైవం వైపు మళ్లించిన సంస్కారి ఆయన.

అత్తామామా గతించిన తరువాత మరిది తన కొడుకు ఉద్యోగరీత్యా వేరే దూరం ఊరికి పోవడంతో… పుట్టింటికి వచ్చింది అనసుయమ్మ. అన్నగారికి భారం కావడం ఇష్టం లేక వాళ్ల ఇంటి దగ్గరే చిన్నఇల్లు బాడుగకు తీసుకొని ఆ వూళ్లోనే వుంటున్నది ఆమె. ఆమె జీవించడానికి సరిపడినంత ఆదాయం ఆమెకు తన పొలంపైన గుత్తల రూపంలో వస్తుంది.

ఆమె రామభక్తురాలు.

అనసూయమ్మ ఆ వూరికి వచ్చినప్పటినించీ, ఆ వూరి ఆడవాళ్లలో ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది. ఆడవాళ్లందరికీ ఆంజనేయులగుడి ఒక కేంద్రంగా మారింది. పురాణాలు చదివి వినిపించడం, భజనలు చేయించడం, పాటలు, పూజా పద్ధతులు, స్తోత్రాలూ నేర్పించడం, పిల్లలకు పద్యాలు నేర్పడం, కథలు చెప్పడం వంటి పద్ధతులతో ఆమె ఊరి వారి మనసును జయించింది. మరీ పొట్టీ, పొడుగూ కాకుండా, పచ్చని ఛాయతో ఆపాదమస్తకమూ ఎర్రని చీరను చుట్టుకుని వుంటుంది ఆమె.

ఆమె మధ్యాహ్నం వేళల్లో చేసే పురాణపఠనం వినడానికి ఆ వూళ్లోని ఆడవాళ్లు వస్తూ వుంటారు. అన్నపూర్ణమ్మ, అమ్మణ్ణీ, కరణం సుబ్బారాయుడి భార్య కాత్యాయనీ, ఆవూరి రెడ్డి కందుల నారపరెడ్డి భార్య అక్కమ్మా, ఆ వూరిలో మరొక శ్రీమంతుడు పెద్దింటి నరిసిరెడ్డి భార్య ప్రభావతీ, కోమటి వీథి నుంచి కర్నాటి వీరమ్మా, మేడా నాగమ్మా, పెసల సుబ్బమ్మా లాంటి కొంచెం పెద్దవాళ్లు వస్తారు. ఎందరో చిన్నవయసు ఇల్లాళ్లూ, పెళ్లికాని పిల్లలూ, కొందరు మగవాళ్లూ ఆమె శిష్యులే! ఎవరు ఏ సమయంలో వచ్చినా, వాళ్లకు కావలసినవి నేర్పడం, ప్రేమతో సలహాలు ఇవ్వడం వంటి ఉపకారాలు చేస్తుంటుంది అనసూయమ్మ. అందుకే ‘అమ్మగారు’గా పిలిపించుకుంటూ అభిమానం సంపాదించుకుంది ఆమె. ఆమెకు డెబ్భైయ్యేళ్లు పైనే వుంటాయి.

అందరూ ఆమెకు నమస్కారాలు చేసినారు. అందరినీ చాపల మీద కూర్చోమని చెప్పింది అనసూయమ్మ. అంతమంది ఒకేసారి ఎందుకు తనదగ్గరికి వచ్చినారో అర్థం కాలేదు ఆమెకు.

“అనసూయమ్మక్కా! భ్రమరి పరిస్థితి నీకు తెలియనిది కాదు కదా? దాని సంగతి యేమవుతుందో… తల్లీపిల్లా ఎట్లా బయట పడతారో అర్థం కావడం లేదు. నువ్వే యేదైనా ఉపాయం చెప్పి బయటపడేయాల!” అని ఆమె చేతులు పట్టుకోని దీనంగా అర్థించింది అన్నపూర్ణమ్మ.

“అవునమ్మా… విన్నాను ఆ పిల్ల విషయం. రామజపం చేసి రోజూ ఆ పిల్లకు ధారపోస్తూనే వున్నాను…ఈ మూణ్నాళ్ల నించీ. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నిన్నటి నించీ నా మనసులో ఒక విషయం స్ఫురణకు వస్తూ వున్నాది. కాని, అది అందరికీ ఒప్పితం అవుతుందో… లేదో….ఊళ్లో పెద్దవాళ్లు ఏమంటారో ఏమోనని సందేహిస్తున్నాను.” అన్నది అందరినీ పారజూస్తూ అనసూయమ్మ.

“చెప్పమ్మా చెప్పు..ఎంత కస్టమైనా సరే..ఎన్ని దూడ్లయినా (డబ్బు) సరే…నేను మా రెడ్డిని ఒప్పిస్తా! మనూరి ఆడపిల్ల ఇంత కస్టంలో వుంటే దుడ్లకు చూసుకుంటామా? ఎట్టనన్నా సరే….అమ్మయ్య బయటపడితే చాలు!” అనింది నారపురెడ్డి భార్య అక్కమ్మ.

“నేను కూడా సిద్దమే! మా రెడ్డిని దేనికైనా ఒప్పిస్తా! పూజారయ్య బిడ్డ పానం దక్కితే చాలు!” అన్నది నరిసిరెడ్డి భార్య ప్రభావతి.

అక్కడ వున్న జనమంతా అనసూయమ్మ ఏమి చెబితే అది చేస్తామన్నారు.

“నాయనా! ఇది డబ్బులతో అయ్యేది కాదు. ఊరివాళ్లంతా కులమత బేధాలు లేకుండా ఒక్కమాట మీద నిలబడాలె! మన వూరి పొలిమేరలో మంచినీళ్ల బావి వుంది కదా! ఏటి దగ్గర్నించి అయినా సరే… అక్కడి నించి నారాయణ ఇంటి వరకు వరుసలో కులమత బేధాలు, ఆడమగ, చిన్నపెద్ద అందరూ వారధి కట్టి నిలుచుకోవాలె. ముందు ఒకరు ఒక బిందెడు నీళ్లు రామనామం చెబుతూ బావిలో నించి చేదాలె. ఒకరి నించి ఒకరు అందుకుంటూ ‘శ్రీరామ జయ రామ జయజయ రామ” అనే నామం చెబుతూ నారాయణ ఇంటికి చేర్చాల. అంతవరకూ అందరూ రామభజన చేస్తూ వుండాల. ఆ వరుసలో యే కులం వాళ్లున్నా, యే మతం వాళ్లున్నా ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు. ఆ బిందెలోని నీళ్లు ఒక్క లోటాడు భ్రమరి చేత తాగిస్తే సులభంగా ప్రసవం అవుతుంది. వరుసలో నిలబడిన వారందరూ తాము రాముని సేవలో వున్న వానరులమని, ఆంజనేయ స్వాములమని భావించుకోవాల. అలనాడు సీతమ్మ కష్టాలు బాపడానికి సముద్రం మీద లంకకు వానరులంతా కలిసి వారధి ఎట్లా అయితే కట్టినారో… ఆ వారధి మీద నుంచి రాముడు నడిచిపోయి రావణుణ్ని చంపి, సీతమ్మ చెర ఎట్లా అయితే విడిపించి నాడో… మేము కూడా మన ఊరి ఆడపిల్లకు వొచ్చిన కష్టం బాపడానికి వారధి కడ్తున్నామని అనుకోవాల! నీళ్ల బిందెలో వున్న రాముడు రామభక్తులు నిర్మించిన ఈ శరీరాల వారధిపైన నడుచుకుంటూ పోయి, మన బొమ్మక్కకు కాన్పు కాకుండా అడ్డుపడుతున్న ఆ పిల్ల కర్మలను అడ్డుతొలగించి కాపాడుతాడు. ఇక్కడ మడుగు మైల, అంటూ సొంటూ యేమీ లేదు. అందరూ రామసేవకులే! అందరూ ఆంజనేయులే. రామనామంతో ఆ పసిదాని కష్టంతో పాటు ఊళ్లోని సమస్యలన్నీ శుభ్రం అయిపోతాయి.” అని చెప్పి ‘యేమంటారు?’ అన్నట్టు అందరినీ చూసింది అనసూయమ్మ.

అందరూ ‘ఇక జరగదు’ అనుకున్న పని ఇంత సులభంగా నెరవేరుతుందా….అనే ఆనందంతో మాటరానట్టు అయ్యారు. అందరూ ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నారు. వాళ్లు మాట్లాడే లోపలే ఆమె మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది.

“ఇది కొత్త పద్ధతేమీ కాదు. మనవాళ్లు మరిచిపోయినారు…అంతే! మా అత్తగారి చిన్నతనంలో వాళ్ల వూళ్లో ఎవరో ఒకామెకు ప్రసవం కష్టమైతే…ఊరివారంతా ఇట్లా వారధి కట్టితే.. తల్లీపిల్లా ప్రాణప్రమాదం నుంచి బయటపడినారట! అయితే పుట్టిన పిల్లవాడికి ‘వారాది రాముడు’ అని పేరు పెట్టాల. ఆడపిల్ల అయితే ‘సీత’ అని పేరు పెట్టాల!” అని ముగించింది అనసూయమ్మ.

“అదెంత పని అమ్మయ్యా (ఆ ఊళ్లలో బ్రాహ్మణ స్త్రీలను అమ్మయ్యా… అని పిలుస్తారు)! మా రెడ్డి తలచుకుంటే అందరినీ కూడేస్తాడు. ఆ పాప పానాలు పోతుంటే కులమతాలు చూసుకుంటామా? నేను ఇప్పుడే పోయి యేర్పాట్లు చేస్తా!” అనింది ప్రభావతి.

“నేనూ పోయి మా ఇంటాయన (భర్త)కు చెప్పి ఒప్పిస్తానక్కా! ఈ ఆపత్కాలంలో పిల్ల ప్రాణాలతో బయటపడడం ముఖ్యం కానీ, కులమతాలూ, అంటూసొంటూ ఎవరు పట్టించుకుంటారులే!” అన్నది అన్నపూర్ణమ్మ. అందరూ అవునంటే అవునన్నారు.

అనసూయమ్మకు నమస్కరించి, గుంపుగా బయలుదేరినారు. దారిలో కనబడినవాళ్లందరికీ విషయం చెప్పుకుంటూ పోయినారు. వార్త ఊరు ఊరంతా వ్యాపించింది. అందరిలో ఒక ఆశను వెలిగించింది.

ఊళ్లో పెద్దవాళ్లంతా సమావేశమై…తప్పనిసరి పరిస్థితి వలన అంటూసొంటూ, కులం, మతం అన్నీ పక్కన పెట్టి నారాయణ కూతురి ప్రాణం నిలబెట్టడమే ముఖ్యం అనుకున్నారు.

ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా వుండే నారపురెడ్డీ, నరిసిరెడ్డీ ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి చేయీ చేయీ కలిపినారు. బావా అంటే బావా అనుకున్నారు. నిజానికి వాళ్లిద్దరూ బంధువులే! వాళ్లిద్దరి భార్యలూ వొదినా…అంటే వొదినా అని పలకరించుకుని పనిలోకి దిగినారు. ఊరంతా దండోరా వేయించినారు.

దండోరా వేసే అంకన్నతో పాటు పలువురు యువకులు పోయి, విషయాన్ని జనానికి వివరించి నారు.

అందరూ బిందెలు పట్టుకోని ఏడుకపిలెల బావి దగ్గరకు చేరుకుంటున్నారు. “రాములవారి కార్యం స్తానం చెయ్యకుండానా?” అని అందరూ బిందెలతో నీళ్లు చేదుకొని, నెత్తిమీదినించి బుడబుడా పోసేసుకున్నారు. ఆడవాళ్లు కొందరు ఇళ్ల దగ్గర స్నానాలు చేసినారు. మగవాళ్లు కొందరు ఉప్పునీళ్ల బావి దగ్గర నీళ్లుపోసుకోని, అందరూ తడిగుడ్డలతో నిలుచుకున్నారు.

ముందు రామేశ్వరం, నారాయణా, పరమేశ్వరయ్య, కరణం సుబ్బరాయుడూ, ఆయన కుటుంబం, ఆ తరువాత నరిసిరెడ్డీ, నారపరెడ్డీ కుటుంబాలు, ఆ పక్కన వడ్ల రామానుజాచారీ, మరి వాళ్ల వీథి వాళ్లూ, కంసాలి బ్రహ్మయ్య, మరి కొన్ని వారి కుటుంబాలూ వరుస కట్టినారు. కోమటి బజారు వాళ్లు ముసలివాళ్లను అంగళ్లలో కూచోబెట్టి, వరసలలో నిలుచు కున్నారు. అప్పుడే పొలాల నించి వచ్చిన కూలీలంతా విషయం తెలుసుకోని, వరుసలో నిలబడ్డారు.

ఎన్నడూ బయటకురాని తురకవీథిలోని ఆడంగులందరూ తెల్లని ముసుగులతో వచ్చి వరుసలలో నిల్చుకున్నారు…వాళ్ల పిల్లలు, మగవాళ్లతో సహా!

కొందరు సందేహిస్తుంటే…”ఒక ఆడమనిసి పానం కాపాడనీకి మనం ఒకరోజు బయటికొస్తే యేమైతాదిలే! రాండ్రి…. రాండ్రి…నేనున్నాగదా…” అని తురకవీథిలో పెద్దక్కగా పిలవబడే మహబ్బీ అందరికీ నచ్చజెప్పింది.

“అంతేలే అక్కా! సాటి ఆడపిల్లకు కట్టం వొచ్చినప్పుడు మనం ఆడోళ్లమే ముందుకు పడకపోతే ఎట్లా అయితాది?” అని ఆమెకు వంతపాడినారు కొందరు ఆడంగులు వరసలో నిల్చుకుంటూ.

“రామా.. రామా…అనాల్నంట! అంటారా మరి?” అన్నాడు వసీంఖాన్ ….కొంత నిష్ఠూరంగా.

“ఒక ఆడపిల్ల పానం దక్కు తాదంటే ‘రామా’ అన్నా ‘కిట్నా’ అన్నా నట్టమేమీ లేదులే అన్నా” అన్నది ఒక ముస్లిం చిన్నది.

“మనవూరి పీర్లపండగ చేసేదంతా వాళ్లే కదన్నా! వాళ్లు మన పండగ అంత బాగా చేస్తారు కదా! మనం ఒక ఆడమనిసి కోసం ‘రామా’ అంటే యేమీ కాదులే…” అన్నది హబీబూన్ . అలా చర్చలు నడుస్తూనే వున్నాయి.

వాళ్ల పక్కనే ఈ మధ్యనే క్రిస్టియన్ మతం పుచ్చుకున్న ఏసోబు, అతని కుటుంబం నిలుచుకున్నారు. మాల, మాదిగ కుటుంబాల వాళ్లు కూడా వరుసలలో నిలుచుకున్నారు.

గొల్లవెంకన్న, వీరన్న వాళ్ల కుటుంబాలు వచ్చినిలుచుకున్నారు వరుసలో. బోయవీథి వెంకటేశు, సహదేవుడు, ఓబులేసు వాళ్ల కుటుంబాలన్నీ నిలుచుకున్నాయి వరుసలో.

మేదరివాళ్లు, జంగంవాళ్లు, బలిజవాళ్లు, చాకలి వీథిలోని వారు, మంగలివీథిలోని వారు, ఎరుకలవాళ్లు, బ్రాహ్మణవీథిలోని వారు, కాపులు అందరూ ఏ తేడా లేకుండా వరుసలో నిలుచుకున్నారు.

ఆ వూరు ఆ చుట్టుపక్కల చిన్నవూళ్లకు ఒక కేంద్రం లాంటిది కావడంతో పక్కవూళ్ల వాళ్లంతా నిలుచుకున్నారు. ఆరోజు ఊళ్లో కాపోళ్ల ఇంట్లో పెండ్లి జరిగింది. పెండ్లికొచ్చిన వాళ్లంతా తడిబట్టలతో వరుసలో నిలుచుకున్నారు. అందరికీ ఇదొక వింతగా వుంది. ఏదో తెలియని ఆనందంగా కూడా వుంది. ఒక మంచిపనిలో భాగస్వాములమ వుతున్నామన్న సంతోషం వారిని నిలవనీయడం లేదు. పిల్లలు అటూ ఇటూ పరుగులు తీస్తూ మళ్లీ వరుసలోకి వస్తున్నారు.

అందరినోటా రామనామమే!

వూరిలోని భజన బృందం వాళ్లు “రామనామము రామ నామము…రమ్యమైనది రామనామము…” అని భజన మొదలుపెట్టినారు. అందరూ వంత పాడుతున్నారు.

ఇంతలో మరో బృందం మరో రకమైన నామాలను అందుకున్నారు.

“సాకేత రామా రావయ్యా!

పట్టాభిరామా రావయ్యా!

దశరథరామా రావయ్యా!

పావననామా రావయ్యా!

సీతారామా రావయ్యా!

రాజారామా రావయ్యా!

కౌసల్యరామా రావయ్యా!

భద్రాద్రి రామా రావయ్యా!

రావణాంతకరామా రావయ్యా!

తాటకాంతక రామా రావయ్యా!

వాలి సంహారకా రావయ్యా!

అయోధ్యరామా రావయ్యా!

వారధిరామా రావయ్యా!

ధర్మోద్ధారక రామా రావయ్యా!

సీతమ్మ తోటి రావయ్యా!

ఆంజనేయుని తోడుకోని రావయ్యా!

వారధి కడితిమి రావయ్యా!

కష్టాల కడలిని దాటించవయ్యా!

నీ పిల్లలమయ్యా రామయ్యా!

కన్నతండ్రివై కాపాడవయ్యా!

పసిబిడ్డ పానం కాపాడవయ్యా?”

ఇట్లా నోటికి వచ్చింది వచ్చినట్టుగా పాడుతున్నారు. తమ మనసులోని బాధే పాటైతే అట్లాగే వుంటుందేమో!

“కొందరు ‘హరిహరీ నారాయణా ఆదినారాయణా” అని పాడుకున్నారు.

బావి దగ్గర మొదట రామేశ్వరం “శ్రీరామ జయరామ జయజయ రామ” అని అందరూ అంటూండగా బిందెకు తాడు కట్టి బావిలోకి వేశాడు. ‘రామారామా’ అని ఆక్రోశించింది అతని హృదయం. అతని కన్నీళ్లు బావిలో రాలిపడినాయి. మొదటిబిందెను మామగారికి అందించినాడు. అందరూ రామమంత్రం ఆగకుండా చెబుతున్నారు. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి సాగింది రాముడు కొలువైన రామభాండం!

కరణం సుబ్బారాయుడు బిందె వెంట నడుస్తూ …అందరినీ హెచ్చరిస్తూ…నామం చెప్పిస్తూ ముందుకు నడుస్తున్నాడు. బిందెలు ఎవరెవరో తెచ్చిస్తున్నారు. రామేశ్వరం పూనకం పట్టినవాడి వలె నీళ్లు తోడియిస్తూనే వున్నాడు.

మొదటి బిందె రామనామంతో సహా శివాలయం తీసుకొచ్చినారు. అన్నపూర్ణమ్మ అందుకొని అనసూయమ్మకు ఇచ్చింది. అందులోనించి ఒక లోటాడు నీళ్లు భ్రమరి నోట్లో పోసింది ఆమె.

రామనామంతో, రామమంత్రంతో పవిత్రమై, ఊరందరి శుభేచ్ఛలతో నిండిన ఆ పవిత్రజలం భ్రమరి గొంతులోకి దిగగానే చిత్రం జరిగింది. అంతవరకూ వచ్చీపోతున్న నొప్పులు ఒక్కసారిగా తీవ్రమైనాయి. గంటసేపటికల్లా మంత్రసానుల సాయంతో సులువుగానే ప్రసవించింది భ్రమరి.

“వారది రాముడు పుట్టినాడు” అన్న వార్త ఒక్కపెట్టున మల్లెపూల పరిమళంవలె వ్యాపించింది. అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు.

నీళ్లబిందెలు వస్తూనే వున్నాయి. నారాయణ ఇంట్లోనూ, శివాలయం లోనూ తొట్లన్నీ నిండినాయి.

చుట్టుపక్కల వాళ్లంతా తమ ఔత్ కానాలు నింపివేసుకున్నారు. వద్దు అని చెబుతున్నా బిందెలు పంపడం ఆగలేదు.

‘వారది రాముడు’ పుట్టినాడన్న సంగతి రామేశ్వరానికి చేరింది. నవ్వూ యేడుపూ కాని మొహం పెట్టి ఇంటివైపు పరుగుపెట్టాడు.

వారాధిరాముడు పుట్టినాడన్న వార్త విన్నాక, వారధి కట్టిన వారి ఆనందానికి హద్దులు లేవు.

వరుస వీడి అందరూ గుంపులు గుంపులుగా చేరి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కొందరు అక్కడక్కడా అరుగుల మీద కూర్చొని భజనలు మొదలు పెట్టినారు. అందరినీ రాముడు ఆవేశించినాడు. పరవశంతో మునకలు వేస్తున్నారు. వాళ్లకే అర్థంకాని దైవానుభూతి ఒకటి వారిని ఆవేశించింది. ఎవరికి వాళ్లు భ్రమరిని, వారాధిరాముడిని తామే కాపాడినామన్న భావనతో వున్నారు. ఆ భావం వారిని నిలకడగా వుండనివ్వడం లేదు.

‘పరోపకారం చెయ్యడంలో ఇంత ఆనందం వుంటుందా….’ అని లోలోపలే ఆశ్చర్యపోతున్నారు.

అందరి హృదయాలూ వారి ఇచ్ఛతో సంబంధం లేకుండా ‘రామా…రామా’ అని జపిస్తున్నాయి.

స్త్రీలంతా ఒక జట్టుగా బావి దగ్గరినించి తిరిగివస్తూన్నారు.

ప్రభావతి అక్కమ్మ పక్కకు వచ్చి, “వొదినా! ఇంత మంచిపని స్వార్థం లేకుండా అందరం చేసిననాము కదా…అందరూ ఆకలిగొని వుంటారు. యేమైనా తినడానికిస్తే బాగుంటుంది కదా!” అన్నది.

“ఇంతమందికి ఇప్పటికిప్పుడు ఏమి చేస్తామంటావు ప్రభావతీ! శ్రీరామనవమికి చేసినట్టు పానకం, పణ్యారం (వడపప్పు) చేద్దామా? అదైతే గంటలో చెయ్యొచ్చు. అప్పుడే పొద్దుగూకుతావుంది” అన్నది అక్కమ్మ.

ఈ సంభాషణను అందరు ఆడవాళ్లూ విన్నారు. ఎవరికి వాళ్లు యేవో నిర్ణయాలు చేసుకున్నారు.

అక్కమ్మ శివాలయంలోనూ, ప్రభావతి ఆంజనేయుల గుడిలోనూ పానకం, పణ్యారం తయారుచేసినారు. వచ్చినవాళ్లందరికీ విస్తరాకులలో పణ్యారం, రైతుసంఘం నించి తెప్పించిన సత్తులోటాల్లో పానకం పోసి పంచినారు.

ఊళ్లోని కోమట్ల బజారులోని స్త్రీలు గెనుసుగడ్డలు (చిలగడదుంపలు) తెప్పించి బెల్లం వేసి ఉడికించి, వాళ్ల బజారులో పంచినారు. కొందరు రైతులు తోటలో పండిన అరటిపండ్లు, జామపండ్లు, చీనీకాయలూ (బత్తాయి) అందరికీ పంచిపెట్టినారు.

కొందరు కాపుయువకులు ఒక వంటవాడిచేత పులగం, సెనిక్కాయల పచ్చడి చేయించి పంచిపెట్టినారు.

బలిజవీథిలోని ఆడవాళ్లు నిమ్మకాయ చిత్రాన్నం గంగాళం నిండా చేసి పంచిపెట్టినారు.

ఆరోజు కోమట్ల వీథిలో బుగ్యాలు (బజ్జీలు) వేసి అమ్మే శేషయ్య తన దగ్గర పిండి వున్నంత వరకూ బుగ్యాలు వేసి, తన అంగడి దగ్గరికి వచ్చినవాళ్లకు ఉచితంగా ఇచ్చినాడు.

తురకవీథిలోని మహబ్బీతో చేరి ఆడవాళ్లందరూ సేమ్యాపాయసం వండి అందరికీ పందారాలు పెట్టినారు.

ఆరోజు ఎవరూ ఇళ్లలో అన్నం వండుకోలేదు. పిల్లలు ప్రసాదాల కోసం పరుగులు పెట్టి తెచ్చుకున్నారు. అమ్మలకు తెచ్చిచ్చినారు.

అన్నపూర్ణమ్మ వారధిరామునికి వెచ్చనినీళ్లతో స్నానం చేయించింది.

ప్రసవవేదనతో అలసిన భ్రమరికి వేడి కాఫీ తాగించింది అనసూయమ్మ.

“ఎంత గండాల గౌరమ్మవే తల్లీ! ఎంత ప్రమాదం తప్పిందే అమ్మా!” అంటూ కూతురు బుగ్గలు పుణికింది రాజమ్మ.

అంతకు కాసేపటి క్రితమే కొత్తబంగారు లోకంలోకి వచ్చిన వారధిరాముడు తల్లి పక్కన పడుకొని పాలకోసం వెతుక్కుంటున్నాడు.

“నా బంగారు వారధిరాముడు నాకు దక్కినాడు. నాకు ఈ అదృష్టం చాలు! బతికినన్నాళ్లూ రాములవారిని సేవించుకుంటా!” అని ప్రేమగా గుండెలకు హత్తుకొని పడిన శ్రమంతా మరిచిపోయింది.

వాళ్లిద్దరినీ మంచం పక్కగా నిలుచుకుని చూస్తున్న రామేశ్వరం

“వారధిరాముడు గండాలన్నీ దాటుకోని నీ దగ్గరికి వచ్చినాడు భ్రమరీ! వాడిని ఎట్లా పెంచుతావో యేమో!” అన్నాడు గుండెలనిండా గాలి పీల్చి వదులుతూ….చిరునవ్వుతో.

పక్కింట్లో సంగీతం నేర్చుకుంటున్న పిల్ల ఎవరో “ఉండేది రాముడొకడే ఊరకె చెడిపోకే మనసా!” అని పాడుతున్నది.

“రాముడుద్భవించినాడు రఘుకులమ్మునా…” పాడుకుంటున్నది అలివేలమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here