వార్తలతెగులు – ఎందుకిలా?

0
10

[dropcap]ఇ[/dropcap]ది తప్పుడు సమాచారం (misinformation) రాజ్యమేలుతున్న కాలం అంటే తప్పు లేదేమో. దీనిని వార్తలతెగులు (infodemic) కూడా అభివర్ణిస్తారు కొందరు. నేరుగా మాట్లాడ్డం ద్వారా తెలిసేవి కాక మనకి రోజూ న్యూస్ ఛానెళ్ళు మొదలుకుని వాట్సాప్ ఫార్వర్డుల దాకా బోలెడు సమాచారం అందుతూ ఉంటుంది. ఇందులో కొన్ని నిజాలు, కొన్ని సాపేక్షంగా నిజాలు, కొన్ని అవి నిజాలని మనల్ని నమ్మిస్తాయి, కొన్ని నిజమా? అని సందిగ్ధంలో పడేసేవి, కొన్ని పూర్తి అబద్ధాలు. మరి ఇలా అన్ని వైపుల నుండీ అక్కర ఉన్నదీ, లేనిదీ ఏదో ఒకటి వచ్చి మీద పడుతూ ఉంటే మనం ఏం చేయాలి? తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి? అన్న అంశం గురించి ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. తప్పుడు సమాచారం గురించి అవగాహన కలిగిస్తూ స్థానికంగా Factly వంటి సంస్థలు తెలుగులో కూడా విశేష కృషి చేస్తునాయి. అయితే, అసలింత స్థాయిలో ఎందుకు తప్పుడు సమాచారం దశదిశలా వ్యాప్తి చెందుతోంది? నేటి వార్తలతెగులుకి కారణాలేమిటి? అన్న అంశం గురించి ఇటీవల తెలుసుకున్న విషయాల సారాంశం ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను.

కెల్లీ గీన్‌హిల్  అని ఒకావిడ అమెరికాలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్. ఆవిడ ప్రపంచం తప్పుడు సమాచారాల యుగంలా ఎందుకు ఉంది? అన్న విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఆరు సామాజిక ధోరణులు అంటూ ఒక జాబితా తయారు చేసింది. అవేమిటో మొదట చూద్దాము:

  1. పెరిగిన ఆందోళన, భయం: మనకి ప్రస్తుత సమాజంలో, ప్రపంచంలో, అనేక విషయాల ఎన్నో భయాలు, ఆందోళనలు. బంగారం కొట్టు వాడు మోసం చేస్తున్నాడా? కోడిగుడ్డు తినొచ్చా? తెల్లసొన మాత్రమే తినాలా? జిమ్‌కి వెళ్తే హార్ట్ అటాక్ వస్తుందా? బ్రిడ్జి మీదుగా పోతున్నపుడు మనం చూసిన న్యూస్ ఐటెంలోలా బస్సు బ్రిడ్జిలో పడిపోతే? టీకా వేసుకున్నాక కోవిడ్ వస్తుందా? – ఇలా ఒకటని కాదు. ప్రస్తుతం మన జీవితాల్లో అనేక అంశాల గురించి ఇలా రకరకాల చింతలు మన మనస్సులో రాజ్యమేలుతున్నాయి. వీటి మధ్య తప్పుడు సమాచారాన్ని గుర్తించి, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోంది.
  2. అపనమ్మకం: యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రజలకి ప్రజా వ్యవస్థలపై ఉన్న నమ్మకం చాలా చాలా తగ్గిపోయిందని అమెరికాలో చేసిన ఒక పరిశోధనలో తేలింది. ప్రజా వ్యవస్థలంటే ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు వంటివి మొదలుకుని వార్తా పత్రికల దాకా అన్నీ. ఇది ఆ దేశానికే పరిమితం కాదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితే మరి వార్తల తెగులుకి పోషణ స్థలం (breeding ground). ఇలా జనం ప్రజా వ్యవస్థని నమ్మక, ప్రపంచంలో జరిగే పరిణామాలు అర్థం కాక అయోమయంలో ఉన్నప్పుడే పుకార్లు, గూడుఫుఠాణీ కథనాలు అన్నీ నిజాలుగా చెలామణీ అవుతాయి.
  3. ధృవీకరణమైపోయిన చర్చలు: ఇటీవలి కాలంలో ఎటు చూసినా చర్చల్లో రెండే వర్గాలు – మధ్యే మార్గంగా ఉన్న వారిని కొనసాగనివ్వరు. ఇది సోషల్ మీడియాలో మామూలు చర్చల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. కిటో డైట్ అన్నా, హిందూ మతం అన్నా- ఏ అంశం అయినా సరే, అర్జెంటుగా రెండు ధృవాలుగా జట్లు కట్టి అందరినీ ఎటోకటు తోసి ఓ ట్యాగ్ ఇవ్వడం ఇప్పటి ఆనవాయితీ. అయితే, నిజంగా సామాజిక, శాస్త్రీయ అంశాలు ఇలా ఉండవు. మధ్యలో బోలెడు ఉంటుంది. కానీ, ధృవీకరణం వల్ల ఎవరికీ నప్పే నిజాలు వారు చెప్పుకుని, తమ కథనంలో పట్టని నిజాలని పక్కకి తోసేయడం సాధారణం అయిపొయింది. దీనితో సగం నిజాలూ, పావు నిజాలు, పదో వంతు నిజాలు కూడా పూర్తి నిజాలలా కన్పిస్తాయి.
  4. విచ్ఛేదకరమైన సమాచార సాధనాలు: ఒక ఇరవై ఏళ్ల క్రితం వార్తలంటే ఏవో గుప్పెడు టీవీ/రేడియో చానెళ్లు. కొన్ని పత్రికలూ -ఇంతే. వాళ్ళు ఏది చూపిస్తే అదే వార్త. వాళ్ళ అజెండాలో, వాళ్ళ ప్రమాణాలు అన్నీ వారికుండేవి. ఇందువల్ల ఏది పడితే అది వార్తల్లో అంశంగా మనకి తెలిసేది కాదు. మరి ఇప్పుడో? వద్దంటే వార్తలు. ఎక్కడ చూసినా ఏదో ఒక వార్త. సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. ఒక వార్తా దశ దిశలా వ్యాపించడం క్షణాల్లో పని. ఈ వ్యాప్తి కి రెండో పార్శ్వము – తప్పుడు వార్తలు కూడా ఇలాగే క్షణాల్లో వ్యాపించగలవు మరి ఇప్పుడు!
  5. కొత్త రకం సమాచార నియంత్రకులు: ఇన్ని వార్తల మధ్య ఇపుడు మనం ఏమి చూస్తాము? ఎలాంటివి చదువుతాము? అన్నది నియంత్రించేవి – గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వెబ్సైట్ల కృతిమ మీద ప్రక్రియలు అంటే ఆశ్చర్యం లేదు. ఒకోసారి గూగుల్ సెర్చిలో వచ్చే మొదటి ఫలితంలోనే తప్పుడు సమాచారం ఉంటుంది. ఇది కావాలని చేసినది కాదు – ఒక వెబ్సైట్ ఇలా సెర్చిలో ప్రధానంగా కనబడ్డం వెనుక మన ప్రశ్నకి, దానికి ఉన్న సంబంధం ఒక్కటే కారణం కాదు. వందలకొద్దీ ఇతర అంశాలుంటాయి. మరి మనం గూగుల్‌లో ఉంది అంటే నిజం అనుకుంటాము. సంప్రదాయ పద్ధతిలో నేనివే చూపిస్తా – నా పాఠకులు/వీక్షకులు ఇవే చూస్తారు అన్న తరహా నియంత్రణ కాదిది. అదొక తరహా యాంత్రిక నియంత్రణ. దీనిలో తప్పుడు సమాచారం రాకడా, పోకడలని కనిపెట్టడం, నియంత్రించడం రెండూ కష్టమే.
  6. గాలి కబుర్లని, భయాలని వ్యాప్తి చేసే వారి పెరుగుదల: పై కారణాలని వాడుకుంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయాలన్న ఆసక్తి గలవారి సంఖ్యా ఇప్పుడు ఎక్కువే. ఇందులో దేశ ప్రభుత్వాలూ ఉన్నాయి. అమెరికా ఎలెక్షన్లని రష్యా సోషల్ మీడియాని వాడుకుని నియంత్రించింది అంటూ గతంలో రేగిన దుమారం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ కాక ఒకోసారి శాస్త్ర పరిశోధనలలో స్వాభావికమైన సందిగ్ధతని వాడుకుంటూ మీడియాలో ప్రచారం కోసం సగం నిజాలని చెప్పేవారూ ఉన్నారు. ఈమధ్యనే కెనడాలో ఇంకా శాస్త్రవేత్తల పరిశోధనకు పోనీ ఒక పరిశోధనా పత్రాన్ని పట్టుకుని టీకా వ్యతిరేకులు ఎలా వాడుకున్నారన్న వార్త వచ్చింది. ఇలాంటివి ఈ కాలంలో కోకొల్లలు గా కనిపిస్తున్నాయి.

మొత్తానికి ప్రస్తుత ప్రపంచంలో సమాచారం వ్యాప్తి చెందే పద్ధతి మనకి భయాందోళనలు కలిగిస్తూ, ప్రతి విషయం పైనా ఏది నిజం? ఏది అబద్దం? అన్న అయోమయానికి గురి చేయడం కోసమే తయారైన ఒక సాధనంలా ఉంది. దీనివల్ల తప్పుడు సమాచారాన్ని గుర్తించడం క్లిష్టతరం అయింది. ఇది ఒకరి సమస్య కాదు. మనందరిదీ.

మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయగలం? ఏదన్నా వార్తని చూస్తే ఎలా స్పందించాలి? ఇవిగో రెండు సూచనలు:

  1. తప్పుడు సమాచారాన్ని కొంతైనా గుర్తించగల సామర్థ్యం పెంపొందించుకోవడం: ఏదన్నా ఫార్వార్డ్ రాగానే వెంటనే తిరిగి ఇంకొకరికి ఫార్వార్డ్ చేసేసేముందు – అసలు ఎక్కడ్నుంచి వస్తోంది? ఎవరు రాశారు? నమ్మదగ్గదిగా ఉందా? (ఉదాహరణకి: జంతువులపై మాత్రం పరిశోధన చేసి ఫలితాలు మానవజాతికి అంటగడితే నమ్మకూడదు) ఫలానా వెబ్సైటులో వ్యాసం అంటే – ఆ వెబ్సైట్ వెనుక ఉన్నది ఎవరు? శాస్త్ర పరిశోధన అంటే – అది శాస్త్రవేత్తల మధ్య రివ్యూ అయిన వ్యాసమా? అది అర్థం చేస్కునే నేపథ్యం మనకుందా లేదా? ఇలాంటివి ఆలోచించుకోవడం అవసరం. ఏదన్నా ఇదీ మరీ నమ్మశక్యం కానీ నిజంలా ఉందంటే బహుశా అది నిజం కాదేమో? అన్న అనుమానం అన్నా రావాలి గుడ్డిగా నమ్మే ముందు. అర్జంటుగా కొత్త వార్తా అందరికీ పనిచేయాలి అని తొందరపడకుండా నిజానిజాలు బేరీజు వేయడానికి ప్రయత్నించమని సారాంశం. శాస్త్ర పరిశోధనలు కూడా ఒకోసారి స్థిరమైన నిర్ణయాలకు రావు అన్న ఎరుక కూడా ఉండాలి.
  2. భయం మన జీవితాన్ని శాసించకుండా చూసుకోవడం: దైనందిన జీవితం పూర్వపు రోజులకంటే కష్టతరమై పోయింది, రేపేమి జరుగుతుందో తెలియని సందిగ్ధత ఎక్కువైపోయింది అన్న వ్యాఖ్య నేను తరుచుగా వింటూ ఉంటాను. హాలీవుడ్ సినిమాలైతే వివిధ రకాల యుగాంతం తరహా సినేరియాలు ఊహిస్తాయి. అయితే, నిజంగా చూస్తే ప్రపంచం లోని చాలా ప్రాంతాలలో ఇప్పుడున్నంత భద్రత గతంలో లేదు. కనుక భయపెట్టే వార్తలు మనల్ని మరీ ఎక్కువగా శాసించకుండా జాగ్రత్త పడాలి.

రెండేనా?? అనుకోవచ్చు. నిజానికి ఇది పెద్ద టాపిక్. పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయి ఈ అంశం మీద.

 “Relax: A Guide to Everyday Health Decisions with More Facts and Less Worry” అనే పుస్తకం వుంది. రచయిత టిమోథి కాల్‌ఫీల్డ్ .  కెనడాలో ని ఒక యూనివర్సిటీ లో న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. వైద్యశాస్త్ర పరిశోధనలు, వాటి ఉపయోగాలు, వీటిల్లో న్యాయపరమైన అంశాలు అన్నది ఈయన పరిశోధనాంశం. ప్రవృత్తి ఈ అంశాలని స్పృశిస్తూ పాపులర్ సైన్స్ రచనలు చేయడం. ఈ పుస్తకం అలాంటిదే. మన రోజూవారీ జీవితంలో తీసుకునే నిర్ణయాల (పళ్ళు రెండు సార్లు తోముకోవాలా? ఎంతసేపు పడుకోవాలి? పొద్దున్నే లేవాలా? మూడుపూటల తిండిలో ఏ పూటకి ప్రాధాన్యం? వంటివి) గురించి ఏవన్నా పరిశోధనలు ఉన్నాయా? లేకపోతే మనకేది వర్కవుట్ అయితే అది చేస్కోడం ఉత్తమమా? అన్నది ఈ పుస్తకంలోని విషయం.  తప్పుడు సమాచారాన్ని గుర్తించి, అందుతున్న సమాచార వెల్లువనుంచి కెషీర నీర న్యాయాన్ని పాటిస్తూ అసలు సమాచారాన్ని గుర్తించటమనే అసిధారా వ్రతాన్ని ప్రతిక్షణం మనమంతా చేస్తూనేవున్నాము. ముఖ్యంగా మళ్ళీ కోవిడ్ మరో రూపు ధరించి ప్రపంచాన్ని ముంచెత్తుతూన్న సమయంలో, ఇంకో రూపు ధరిస్తోంది, అది వచ్చిన ముగ్గురిలో ఒకరు పోతారని ప్రకటనలు వెలువడుతున్న సమయంలో వినిపిస్తున్న ప్రతిదాన్నీ ఎంత వరకు నమ్మాలన్న విషయం ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది. సమాచారం తెలుసుకుని నిజానిజాలు గ్రహించి భయపడకుండా వుండేందుకు విచక్షణనుపయోగించాల్సివుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here