వాసన

0
13

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Vasane’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు.]

[dropcap]ప[/dropcap]ళ్ళెంలోకి మూడు అట్లను వేసి, కిచెన్ వైపు పరుగెత్తిన లలిత రెండు క్షణాల్లో నా ఎదుట వచ్చి నిల్చున్నప్పుడు చేతిలో పచ్చడి పాత్ర కనిపించింది. మిక్సి బహుశ నేను స్నానం చేస్తున్నప్పుడు గరగర తిప్పుండాలి. తను చేసిన కొబ్బరి పచ్చడి పరిమళం నన్ను తన వైపుకు లాగినా సందర్భం హెచ్చరించింది.

“పచ్చడి వద్దులే. ఆవకాయ పెట్టు, చాలు” అన్నాను మెల్లిగా. తను మండిపడింది.

“బుజ్జి కూడా పచ్చడి వద్దు అని పొడి వేసుకుని తిని వెళ్ళింది. ఇప్పుడు మీరు కూడా వద్దు అంటే ఎలా? చేసిన పచ్చడి ఏం చెయ్యను? తలకు రాసుకోనా?”

ఆమె కళ్ళలో విసుగుతో కూడిన కోపం.

తన సమస్య నాకర్థమయింది. కానీ నాకు నాదే సమస్య ఉంది. అది తనకు తెలియనిదేమీ కాదు. ఈ రోజెందుకో మరచిపోయింది.

“నీకు తెలుసు కదా బంగారం! ఈ మధ్య నాకు ఉదయాన్నే కొబ్బరి పచ్చడి తింటే చాలా త్రేన్పులు వస్తాయి. ఈ రోజు పదకొండింటికి ఫాకల్టీ మీటింగ్ ఉంది. అక్కడ నేను త్రేనుస్తూ కూర్చుంటే ఎలా కనిపిస్తుంది చెప్పు? అసహ్యంగా శబ్దం. దాంతో పాటే వాసన. నాకూ ఇబ్బందిగా ఉంటుంది. కూర్చున్నవాళ్ళకూ అంతే” పళ్ళెం వైపు చూస్తూనే మెల్లగా అన్నాను. తన నుండి ఎలాంటి సమాధానం రాలేదు. తల ఎత్తాను.

లలిత పచ్చడి పాత్ర పట్టుకుని బొమ్మలా నిలుచునుంది. కళ్ళల్లో పశ్చాత్తాపం. “బాధపడకండి. నేను మర్చిపొయ్యాను. మన పనివాడు క్రిందటి నెలంతా ఉత్త లేత కొబ్బరి కాయలే తెచ్చిచ్చాడు. కూరకు, చారుకు మాత్రమే వేశాను. మొన్న కేకలేశాక నిన్న నాలుగు కాస్త ముదురు కాయలు తీసుకొచ్చాడు. చాలా రోజులకు మంచి కొబ్బరికాయలు దొరికాయని, కొంత కొత్తిమెర, పుదీనా వేసి చేశాను. పచ్చి మిరపకాయలు కూడా మంచివి దొరికాయి. చూడండి! ఎంత ఘుమఘుమలాడిపోతోందో!! బుజ్జీ తినలేదు. మీరు వద్దంటున్నారు. అందుకే బాధపడ్డాను. మీరే చెప్పండి. అంతా నేనే తినగలనా? ఫ్రిజ్‌లో పెట్టినా మధ్యాహ్నానికల్లా పుల్లటి వాసన వస్తుంది. ఎంతో ఆశతో చేసిందంతా ఇలా వ్యర్థమవుతుందనిపించి అలా కోప్పడాను” మెల్లగా చెప్పింది. మళ్ళీ తనే “కోపగించుకోకండి, ప్లీజ్” అనింది. నాకూ పాపం అనిపించింది. “కోపమేమీ లేదు బంగారం! నువ్వు తినగలిగినంత తిని, ఫ్రిజ్‌లో ఉంచెయ్యి. అదేం పాడవదులే. రాత్రి భోజనానికి ఒక అరగంట ముందు తీసి బయట పెట్టు. అన్నంలో తింటాన్లే” అని సమాధాన పరిచేలా సమస్యను పరిష్కరించేలా అన్నాను. తను తల తిప్పేసింది. “అయ్యో! సరిపోయింది! రాత్రిపూట వేడి అన్నానికి తోడుగా ఉదయం చేసిన పచ్చడి వడ్డించనా? అసలు కుదరదు. ఈ రోజు పచ్చడి చేయడం నా తప్పు. నేనే దిద్దుకుంటాను” అంటూ కిచెన్ లోకి వెళ్ళి పొడి, నెయ్య తీసుకొచ్చి దోసెల పైన వేసి “నిదానంగా తినండి. ఈ రోజు మీకు పది గంటలకి కదా క్లాసు? ఇంకా చాలా టైముంది” అంటూ సర్దుబాటు చేసింది. ఇంకో దోసె తీసుకొచ్చిన లలితన వద్దని వారించాను. కిచెన్‍లోకి వెళ్ళిన తను క్షణంలో తిరిగొచ్చింది “కొద్దిగా చట్నీ వేసుకోండి. మీరు రుచి చూస్తేనే నాకు నెమ్మది. ఒక సగం చంచాడు? పోనీ పావు చంచాడు? ఒక చిటికెడు?” అంటూ బతిమాలసాగింది. నవ్వుతూ సరే అన్నాను. మొహం ఇంత చేసుకుని లోపలికెళ్ళి చట్ని పాత్ర తీసుకొచ్చింది.

మూడో అట్టు తినడం అయిపో వస్తున్నా కాఫీ ఘుమఘుమ రాలేదు. లోపలికి తొంగి చూశాను. లలిత పాల పాత్రలోని మీగడ తీసి ఒక డబ్బాలో వేస్తూ కనిపించింది. నా పళ్ళెంలో పడ్డ ఘుమఘుమ నెయ్యి ముడిపదార్థం అది.

చెయ్యి కడుక్కుని తన వెనక నిలుచుని కాఫీ చేతికొచ్చేవరకూ తన జడతో ఆటలాడసాగాను. తను నిశబ్దంగా నవ్వుతోంది.

బుజ్జి పెద్దదవుతోంది. తను స్కూలుకు వెళ్ళినప్పుడే ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీరే సమయం మరి.

***

స్టాఫ్ క్వార్టర్స్ నుండి డిపార్ట్‌మెంట్ పది పన్నెండు నిమిషాల నడక అంతే. ఈ రోజు నాకు ఫస్ట్ అవర్ లీజర్ కాబట్టి నిదానంగా నడిచే వెళ్ళాను.

అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రోజు మీటింగ్ రద్దయిందని తెలిసింది. అది చెప్పిన మేనేజర్ నవీన్, హెచ్.ఓ.డి సెలవని చెప్పాడు. “ఉన్నట్టుండి సెలవేమిటి? ఒంట్లో బాగుంది కదా?” అన్నాను. “ఏమో సార్! పొద్దున తొమ్మిదింబావుకు ఫోన్ చేసి ఈ రోజు సెలవు అన్నారు. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు” అన్నాడు. ‘సరే. మంచిదేలే’ అనుకుంటూ నా ఛేంబర్ వైపు నడిచాను. కానీ జరిగింది మంచిది కాదని కొన్ని నిమిషాల్లో తెలిసింది.

నా సహోద్యోగి అలివేలు చెవిలో చెప్పిన విషయం ప్రకారం, హెచ్.ఓ.డిగారైన ప్రొ.రాఘవేంద్ర, తమ కొత్త ప్రకటన అంటూ నిన్న మాకంతా గర్వంగా చూపిన పుస్తకం సారా సగటుగా కృతి చౌర్యమట! ఎవరో ఒక యువ రచయిత్రి తను రాసిన పుస్తకం రాత ప్రతిని పంపి, చూసి పెట్టమని ఈయన కిచ్చిందట. ఈ శాల్తీ దాన్ని తన పేరిట ప్రకటించుకుని “మీ రచన నాకు చాలా నచ్చింది. అందుకే దాన్ని నా పేరిటనే ప్రకటించుకున్నాను. కోప్పడకండి” అని ఆమెకు వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడట. ఆ రచయిత్రి మండిపడి, ఈయనను కోప్పడడమే కాకుండా, ఇక్కడికి వచ్చి, ఆయన ఛేంబర్‌లో విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదరించిందంట. దానికి భయపడిన హెచ్.ఓ.డి నిన్న సాయంత్రం నుండి మొహం చాటేశారట.

ప్రొ. రాఘవేంద్ర భక్తి సాహిత్యంలో పెద్ద విద్వాంసుడు. ఆ ఆధ్యయన క్షేత్రంలో ఆయన సాధన చెప్పుకోదగింది. కానీ ఆయన మంచివాడు కాదన్న విషయం యూనివర్సిటీ బయట చాలా మందికి తెలిసిన విషయమే. విద్యార్థులు రాసి తీసుకొచ్చిన కవితల్ని తన పేరిట పత్రికలకు పంపి, వేయించుకున్నారన్న ఆపాదనలను చాలా మంది నుండి విన్నాను. ఒక సారైతే ఒక పిజి విద్యార్థి అలా పేపర్లో పడిన కవితను నా ముందుంచి, ఒక చివరి పంక్తి తప్ప మిగతాదంతా తనదే అంటూ చిన్నబోయిన మొహంతో చెప్పాడు. అలాగని విషయాన్ని పెద్దది చెయ్యడమూ కష్టమే, తన పి.హెచ్.డి ఇబ్బందుల్లో పడుతుందని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నాకు వాడి నిరాశ, నిస్పృహల పైన జాలి కలిగింది. కానీ నేను కూడా ఏమీ చేయలేని అసహాయక పరిస్థితి. అది నన్ను శూలంలా గుచ్చింది. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అకడెమిక్ వాతావరణంలో కృతచౌర్యం లాంటి దుర్గంధాన్ని చల్లేవాళ్ళకు కొదవేం లేదు. మనం చెయ్యకుండా ఉండాలంతే. అదొక్కటే మనం చెయ్యగలిగింది కూడా” అంటూ నా సీనియర్ సహోద్యోగి సూర్యనారాయణ శాస్త్రి గారు ఆ రోజు సమాధాన పరచారు.

కానీ, ఇప్పుడు మొత్తం పుస్తకాన్నే, అదీ తన కింద చదువుతున్న విద్యార్థి కూడా కాని, ఏ రకంగానూ తన పట్టులో లేని యువ రచయిత్రి కృతిని ఇలా తన పేరిట ప్రకటించుకోవడం చాలా అక్షమ్య అపరాధంగానూ, నమ్మక ద్రోహంగానూ అనిపించింది. దీని గురించి శాస్త్రిగారితో క్లాసులన్నీ అయిపోయాక సాయంత్రం మాట్లాడదామని అనుకున్నాను.

గొప్ప రచయితల ఆత్మకథల్లో రాయబడిన వివరాలు, వారు రచయితలుగా ఎలా ఎదిగారో తెలుసుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి అని నిన్న ఉపోద్ఘాతం ఇచ్చాను. ఈ రోజు రష్యన్ రచయిత మ్యాక్సిం గోర్కి మూడు భాగాల ఆత్మకథ ‘మై చైల్డ్‌హుడ్, మై అప్రెంటిస్‌షిప్, మై యూనివర్సిటీ’ ల వివరాల్ని చెప్పాలి. దాని వివరాల్ని మనసులో మరో సారి మననం చేసుకుంటూ క్లాసు వైపు అడుగులు వేశాను.

“నువ్వు నా మెడలో వేలాడే పతకమైతే కాదు. నిన్ను నేను పోషించలేను. ఇంట్లో నుండి బయటికి వెళ్ళు. నీ జీవితాన్ని నువ్వే మలచుకో” అంటూ తన నిర్దయుడైన, అసహాయకుడైన తాత చెప్పినది మొదలు, పదేళ్ళ లేత అలెక్సి మ్యాక్సిమోవిచ్ పెష్కోవ్ ఇంటినుండి బయటికి వచ్చి, వీధుల్లో, వోల్గా నదిలో సంచరించే స్టీమర్‌లో, దాని వంటగదిలో, ఏవేవో ఫ్యాక్టరీల్లో తన జీవితాన్ని మలచుకుని, మ్యాక్సిం గోర్కీ అనే విశ్వవిఖ్యాత రచయితగా పెరిగిన కొన్ని చిత్రాలు అతడి ఆత్మచరిత్రలోనూ, ఆయన కథల్లోనూ మనకు దొరుకుతాయి అని నా లెక్చర్‌లో చెప్పాను. విద్యార్థుల ప్రశ్నలు, వాటికి నా వివరణల నడుమ, ఒక విద్యార్థి ఆయన పేరును ‘మ్యాక్సిమమ్ గోర్కి’ అన్నందుకు అందరి నవ్వుల మధ్య యాభై నిమిషాలు గడిచిపోయిందే తెలియలేదు.

అదే ఆలోచనల్లో క్లాస్ రూం నుండి బయటికి రాగానే ఎదురుగా కనిపించిన నా జూనియర్ సహోద్యోగి రిజ్వాన్ అహమద్ “గుడ్ మార్నింగ్ సర్” అని గట్టిగా అని, రెండడుగులు నావైపు వచ్చి చిన్నగా “నేను మా తదుపరి హెచ్.ఓ.డి. గారితో మాట్లాడుతున్నాను కదూ!” అంటూ చిలిపి నవ్వు చిలకరించినప్పుడు గబుక్కున ఈ లోకానికి వచ్చాను. రిజ్వాన్‌కు గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా మరచిపోయాను. అతడి సాందర్భిక మాటలకు నవ్వుకున్నాను.

అంటే ఈ విషయం అందరికీ తెలిసిపోయినట్టే అనిపించింది. ఉత్తర కర్నాటక వైపుకు చెందిన జాగృతి కల్లూర్ అనే యువ రచయిత్రి గట్టి పిండం. ఇక్కడిదాకా వచ్చి ఆత్మహత్య చేసుకోదు. సరికదా ప్రొ. రాఘవేంద్రగారికి ఆత్మహత్య చేసుకునే దారి చూపుతుంది. ఆయనకు వ్యతిరేకంగా యూనివర్సిటీకి ఫిర్యాదు చేయడమే కాకుండా, మాధ్యమాలలో కూడా వార్తలకెక్కుతుంది. కొందరు విలేఖరులతో ఆమెకు మంచి మితృత్వం ఉందని రిజ్వాన్ చెప్పాడు. అలాగే చెప్తూ నాతో పాటే డిపార్ట్‌మెంటుకు వచ్చాడు. మలుపులో జత కలిసిన అలివేలు “హెచ్.ఓ.డి. లేరు, మీటింగ్ లేదు. ఇబ్బంది లేదు. పదండి సార్. మీ ఛేంబర్ లోనే ఒక అనఫిషియల్ మీటింగ్ జరిపేద్దాం” అనింది. అంతే కాకుండా డిపార్ట్‍మెంట్లో ఉన్న ఒకిద్దరిని ఛేంబర్లోకి రమ్మని చెప్పేసింది.

నా ఛేంబర్‍లో మా అనధికృత మీటింగ్ ప్రారంభమయ్యింది. ముందుగా మాట్లాడిన వసంత కుమారి “ఏమైనా తెప్పించండి సార్! ఆకలేస్తుంది” అంది. నేను నవ్వుతూ “అలాగే. అదేం కావాలో క్యాంటీన్‌కు చెప్పి తెప్పించుకోండి” అంటూ నా ఇంటర్ కామ్‌ను ఆమె వైపు జరిపాను.

నేను తరగతిలో ఉన్నప్పుడు వీళ్ళ మధ్య దీని గురించి చర్చ జరిగినట్టు వాళ్ళ మాటల వల్ల తెలిసింది.

ఇటీవలి కాలంలో యూనివర్సిటి అధ్యాపకులు చేస్తున్న కృతిచౌర్యం గురించి యుజిసి, హెచ్.ఆర్.డి మంత్రిత్వ శాఖ కఠినమైన నియమాలను రూపొందించాయి. కృతిచౌర్యం అని ఋజువవుతే ఈయన వెంటనే డిస్మిస్ అవుతారు. ఆ అవమానం వద్దనుకుంటే విచారణ ప్రారంభం కాక ముందే తనే రాజీనామా ఇచ్చెయ్యడమే దారి. మొత్తానికి మా డిపార్ట్‌మెంట్ లో కొద్ది రోజుల్లో హెచ్.ఓ.డి. పోస్ట్ ఖాళీ అవడం తథ్యం. నిదానంగా ఇదంతా చెప్పిన సూర్యనారాయణ శాస్త్రి ఒకసారి అందరివైపూ చూసి, చివరికి నా పైన దృష్టి సారించి, చివరికి నా వైపు చూసి అర్థగర్భితంగా నవ్వారు.

సీనియారిటీ లిస్టులో నా పేరే పైనుంది అని నాకు తెలుసు. శాస్త్రి నా కంటే పది సంవత్సరాలు పెద్దవాడైనా ఇప్పటికే ఒకసారి హెచ్.ఓ.డి. అయ్యాడు కాబట్టి నాకు ప్రతిస్పర్ధి కాడు. కావాలని కూడా ఆయనకు లేదు. ఆయన ఎదురు చూస్తోంది డీన్ పదవిని. దానికి ఆయన కొంత కాలం కాచుకోవాలి.

తరువాత ఎప్పుడో నాకు వచ్చి తీరాల్సిన పదవి ఒక సంవత్సరం, సంవత్సరంన్నర ముందుగానే వస్తే నాకూ సంతోషమే. కానీ అది ఇలా రావడం నాకు నచ్చడం లేదు. ఉన్నాయనకు ప్రమోషన్ వచ్చి ఆ స్థానం నాకు వస్తే సంతోషించేవాడిని. లేదా ఆయన అవధి అయిపోయేదాకా నేను ఓపికగా కాచుకోగలను.

కానీ, ఇవేవీ ఇప్పుడు నా చేతిలో లేవు. రాఘవేంద్ర గారిది స్వయంకృతాపరాధం. దాని పరిణామాన్ని అనుభవించాల్సిందే. నేను నాకొచ్చే బాధ్యతను తీసుకోవాలసిందే.

రాఘవేంద్ర గారిని ఒకసారి కలిసి మాట్లాడే విషయం చర్చకు వచ్చింది. కానీ అందరూ ఒక గొంతుతో ‘నో’ అన్నారు. ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ ఆయన ఎత్తుకున్నా మేమేం మాట్లాడాలి? ఆయన చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకోవాలా లేక తిట్టాలా? లేదా తరువాతి పరిస్థితుల గురించి సంతాపం ప్రకటించాలా? ఇవన్నీ కాఫీ, పకోడాల మధ్య మమ్మల్ని సతాయించిన ప్రశ్నలు. కానీ నాకు మాత్రం ఆయనతో ఒకసారి మాట్లాడాలి అనిపించసాగింది. అయితే, దీని గురించి అక్కడ చేరిన వారందరిదీ వద్దు అనే అభిప్రాయమే ఉండడం వల్ల నా ఆలోచనను నాలోనే అణచుకున్నాను.

తరువాత ఇంకా ఏమేమో విషయాలు చర్చకు వచ్చాయి. వెనుక ఇలాంటివేవో చేసి, నెగ్గుకు వచ్చి ఇప్పుడు పెద్ద వ్యక్తులుగా మారిన కొందరి గురించి నాగేశ్ చెప్తే “ఇప్పుడలా లేదు. మూల రచయిత దగ్గిర రాత ప్రతి లేకున్నా, అది తనదే కృతి అని కోర్టులో ఋజువు పరచగలగడానికి ఇప్పుడు అనేక మార్గాలను తంత్రజ్ఞానం కనిపెట్టిందట. దొంగతనం దాగదు” అన్నారు శాస్త్రిగారు. చివరికి “హెచ్.ఓ.డి ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తుండవచ్చు?” అంటూ అలివేలుగారు అనేసరికి అందరి మాటలకి దాణా దొరికినట్టయింది. తమాషా తమాషా జవాబులు రాసాగాయి. మొత్తానికి ఆయన పట్ల ఎవరికీ సదభిప్రాయం లేదని, ఇదివరకూ వేర్వేరుగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలన్నీ ఇప్పుడు ఒకే గొంతుతో బయటపడ్దాయి. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ హెచ్.ఓ.డి నవుతున్నాను, నేను తీసుకోవాలసిన జాగ్రత్తలేమిటి, నా నడవడికలో జరగాల్సిన మార్పులేమిటి అని నాకు అర్థమవసాగింది.

పకోడాలు, కాఫీ అయిపోయినాక అందరూ వెళ్ళిపోయి, చివరికి నాతో మిగిలింది రిజ్వాన్, అలివేలు మాత్రమే. నా పట్ల మిగతావాళ్ళకంటే ఎక్కువ గౌరవం, నమ్మకం చూపే వీళ్ళిద్దరికీ నా ఆలోచనలను చెప్పాలనిపించింది.

“ఆయన సహోద్యోగులమైన తప్పిదానికి మనం ఆయనతో మాట్లాడడం మంచిది” అన్నాను. అలివేలు అభిప్రాయం బాణంలా దూసుకువచ్చింది: “నేనైతే మాట్లాడను. మీరూ మాట్లాడకండి”. గొంతు కూడా కఠినంగా ఉంది. “కాల్ చేస్తే ఆయన తీసుకోరు సార్. రాడ్రిగ్స్ రెండు సార్లు చేశాడు అప్పుడే” అన్నాడు రిజ్వాన్ కొద్ది సేపాగి.

కాల్ చేయడం సబబు అని నాకనిపించలేదు. ఇంటికే వెళ్ళి, ఎదురుగా కూర్చుని మాట్లాడడమే మంచిది. ఇద్దరికీ అదే చెప్పాను. అలివేలు నన్ను కాల్చేలా చూస్తే, రిజ్వాన్ మొహంలో ఒక చిలిపి నవ్వు. కుతూహలంగా చూస్తుంటే ఆ నవ్వు పెద్దదయింది. “మొహమద్ అలి జిన్నా, అదే పాకిస్తాన్ సృష్టికర్త, సంవత్సరం తిరక్క ముందే ఒంట్లో బాగోలేక, రాజధానికి దూరంగా జియారత్ ఆరోగ్యధామంలో చేరినప్పుడు, ఆయనను చూడడానికి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ వెళ్ళారట. ఆయన చూసి వెళ్ళగానే జిన్నాగారు తమ పి.ఎ.తో ఏమన్నారో తెలుసా? ‘ఈయన వచ్చింది ఎందుకో తెలుసా? నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను, అధికారం నా చేతికి ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి!’ అన్నారట.” రిజ్వన్ నవ్వు ఆకాశాకాన్నంటింది. నేనూ చిన్నగా నవ్వాను. అలివేలు “అరె! ఇదేంటి సార్ మీరనేది!” అంటూ నవ్వసాగింది. ఆమె ఫోన్ మోగసాగింది.

కాల్ వచ్చింది వసంత కుమారి నుండి. ఆమె గొంతు అందరికీ వినబడసాగింది. “ఆమె ఇక్కడికే వచ్చిందట. ఉదయం ఆమెను జయశ్రీ బస్టాండులో చూసిందట”

“అవునా! అంటే ఇప్పటికి విసీని మీట్ చేసుంటుందయితే” అలివేలు ప్రతిక్రియ. దానికి బదులుగా వసంత కుమారి “ఇంకాలేదు. నేను జానీని అడిగాను. రాలేదన్నాడు. వస్తే చెప్తానన్నాడు” అన్నది.

వసంత కుమారికి కాంటాక్ట్‌లు ఎక్కువ. ఆమె పరిధిలో విసీ పిఎ కూడా ఉన్నాడు!

“మైసూరు సిటీకి వచ్చినావిడ యూనివర్సిటీ రాకుండా ఉంటుందా?” అంటూ మాటలు ముగించింది అలివేలు.

జాగృతి కల్లూర్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చినట్టు లేదు. ఈ ఊళ్ళో తనకున్న మిత్రులతో సమాలోచనలు జరుపుతూ ఉండవచ్చు. అది కాస్త అయిపోగానే రాఘవేంద్రగారిని వెతుక్కుని డిపార్ట్‌మెంట్ పైన దాడి చెయ్యవచ్చు లేదా తన మొరను నేరుగా విసిగారికే మోసుకుని పోవడం మాత్రం ఖచ్చితం!

ఇంత సంభాషణ ముగించి రిజ్వాన్, అలివేలు బయలుదేరారు. తలుపు సగం తెరచిన అలివేలు అక్కడినుంచే గట్టిగా “ఫోనూ చేయకండి. ఆయనను వెతుకుతూ పోకండి. గమ్మున ఇంటికెళ్ళి సుష్టుగా భోంచేసి, హాయిగా నిద్రపొండి. లేకపోతే మీ ఫోనును, కార్ కీని దాచెయ్యమని లలితక్కకు చెప్తాను” అంది. ఆ మాటలకు రిజ్వాన్ నవ్వుకంటే నా నవ్వే జోరుగా వినిపించింది.

తరువాత అక్కడ వెలసిన మౌనం నడుమ నేను ఆలోచనలో పడ్డాను.

బాధితురాలు వేగంగా ప్రతీకారానికి సిద్ధమైంది! రాఘవేంద్ర కష్టాలు ప్రారంభమయ్యాయి! సహోద్యోగిగా నేను కొన్ని నిరపాయకారమైన పనులను చేసితీరాలి. రాఘవేంద్రగారిని కలిసి, ఆయన నా మాటలు వినేటట్టయితే, రెండు మాటలు చెప్పాలి. ఎన్‌క్వైరీ, గిన్‌క్వైరీ అంటూ నెలల తరబడి అందరి నోళ్ళలో పడి అవమానం పాలవడం వద్దు అని హితవు చెప్పాలి. తప్పు ఒప్పుకుని, పుస్తకాన్ని మార్కెట్లోకి వెళ్ళకుండా ఆపి, ఆమె పేరిటే ఆ పుస్తకం ప్రచురణ అయ్యేలా చేసుకుంటే సమస్య పరిష్కారం కావడానికి వీలుందేమో చూడమని చెప్పాలి. ఈ విషయంలో నేను ఆయనకు ఎంతవరకూ సహాయపడగలను అని కూడా పరిశీలించుకోవడం మంచిది. సహోద్యోగిగా ఆయనకు అంత మాత్రం చెయ్యకపోతే ఎలా మరి? చివరికి ఏ దారీ కనబడకపోతే రాజీనామా చెయ్యండి అని నేను నేరుగా చెప్పడం అవసరం లేదనిపిస్తుంది. చాలా సమయం వరకూ వార్తల్లో ఉంటూ తనకు చెడ్డపేరు వస్తుందని అనిపించడం గురించి చెప్తే చాలు. రాజీనామా గురించి ఆయనే నిర్ణయం తీసుకుంటారు!

ఈ ఆలోచన కొనసాగుతుండగా ఈ సమస్య మరొక ముఖం కనబడసాగింది. జాగృతి కల్లూర్ సరైన వకీలును పట్టుకుని ఈయన పైన క్రిమినల్ కేసు పెడితే! ఈయనకు జైలే గతి!

ఈ ఆలోచన వచ్చాక నాకంటే పదకొండు సంవత్సరాల సీనియర్ అయిన రాఘవేంద్రగారిపైన జాలి కలిగింది. శాస్త్రిగారికి ఫోన్ చేసి చెపితే ఆయన “మరి ఇలాగెందుకు చెయ్యాలి ఆ అప్రాచ్యుడు? అదేదో సామెత ఉంది కదా ‘ఊరుకోలేక గీరుకున్నారు’ అన్నట్టు! స్వయంకృతాపరాధం మరి! అనుభవిస్తాడు లెండి” అనేశారు.

ఇదే ఆలోచనలో మధ్యాహ్నమంతా గడిచిపోయింది. మరో క్లాసు ముగించి వచ్చాక కూడా నాలో ఇంకా రాఘవేంద్రగారిని కలవడమా వద్దా అన్న హ్యామ్లెట్ కాంప్లెక్స్ తగ్గలేదు.

ఇక ఆ జాగృతి కల్లూర్ ఇటు డిపార్ట్‌మెంటుకు కానీ, అటు విసీ ఆఫీసుకు కానీ రాలేదని తెలిసింది. మరి ఎవరితో అంత దీర్ఘమైన సమావేశం జరుపుతోందో!

కొసరి కొసరీ ఆలోచించి చివరికి రాఘవంద్రగారి ఇంటికి వెళ్తే నాకు కలిగే నష్టమేమీ లేదు, లాభం సంగతి నేను ఆలోచించలేదు, కాబట్టి వెళ్తే ఆయనకొక అరక్షణం పాటు నెమ్మది కలగవచ్చు అనిపించి వెళ్దామని తీర్మానించినప్పుడు సమయం మూడుంపావు. నా ఈ నిర్ణయాన్ని ఎవరికీ చెప్పాలనిపించలేదు. మరీ ముఖ్యంగా అలివేలుకు. ఆమెకు తెలిస్తే తప్పకుండా వద్దంటుంది. తలుపుకు అడ్డంగా నిలబడుతుందేమో కూడా! జీవితంలో కొన్నిసార్లు మనకిష్టం లేని పనులను కూడా మనవి కాదనుకుని చెయ్యాల్సివస్తుందని ఈ అమ్మాయికి తెలియదు. ఉడుకు రక్తం!

ప్రొ.రాఘవేంద్రగారు నాలా స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉండడం లేదు. ఇదే ఊరివాడైన ఆయనకు పిత్రార్జితమైన పెద్ద ఇల్లుంది. అది పాతబడిపోయిందని భార్య, పిల్లలు గొడవ పెడితే ఇటీవలే దాన్ని పడగొట్టి జబర్దస్త్‌గా కొత్త ఇల్లు కట్టారు. యూనివర్సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరం.

ఇంటికెళ్ళి కారు తీసుకుని బయలుదేరాను. మొహం పైన ప్రశ్నార్థకంతో కనిపించిన లలితకు ఏమీ చెప్పలేదు. అంత సమయం కూడా లేదు. మామూలుగానే రోజూ సాయంత్రం ఆ రోజు విషయాలన్నీ ఏకరువు పెట్టేటప్పుడు చెప్తే చాలు.

***

తలుపు తెరిచింది రాఘవేంద్రగారి భార్య స్వర్ణ. అక్కడా ఇక్కడా ఆమెను చూసిందే తప్ప నాకు ఆమెతో పెద్ద పరిచయం లేదు.

నిద్రలో నుండి లేచి వచ్చినట్టు కనిపించింది. నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఆవులిస్తూనే “రండి రండి” అంటూనే తలుపును బార్లా తెరిచారు. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాక, “ప్రొపెసర్ గారు ఇంట్లో లేరు” అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. యూనివర్సిటీకి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరైనా లాయర్ ను వెతుక్కుంటూ వెళ్ళారా? “డిపార్ట్‌మెంట్‌కు కూడా రాలేదు. మాట్లాడనూ లేదు. చూసి పోదామని వచ్చాను అంతే. ఆయన వచ్చాక వచ్చి వెళ్ళానని చెప్పండి. నేను బయలుదేరుతాను” అంటూ లేచి నించున్నాను. “కూర్చోండి, కూర్చోండి. ఇక రావలసిన సమయమే. వచ్చేస్తారు” అంటూ ఆత్రంగా నాతో అని మరోసారి ఆవలించారామె. “ఈ రోజు ఆయనకు ఏవేవో పనులు పడ్డాయండీ. ఆ పిల్ల చాలా సతాయించింది. అందుకే సెలవు పెట్టి తిరుగుతున్నారు” అన్నది. నేను ఆలోచించడానికి మునుపే “ఏ పిల్ల?” అన్న ప్రశ్న నా నోటినుండి బయటికి వచ్చింది. అలాగే లేచి నించున్నవాణ్ణి సోఫాలో కూలబడ్డాను.

కాస్త సంబాళించుకుని “అదేం సతాయింపండీ?” అన్నాను మెల్లగా. ఆమె నా ఎదురుగ్గా కూర్చుని మరోసారి ఆవలించింది. “అదే ఆ జాగృతి. మొగుడు వదిలేసిన కష్టాల్లో ఉంది పాపం! మంచి స్కాలర్. భక్తి సాహిత్యాన్ని కాచి వడపోసింది. కానీ ఏం ఉపయోగం? ఒక పక్కా ఉద్యోగం లేదు. అప్పుడప్పుడు తన కష్టాలు చెప్పుకునేది. నిన్న సాయంత్రమయితే భోరుమని ఏడ్చేసింది. ‘నేను ఎన్ని రోజులనుండి నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను. మీరేమో పట్టించుకోవడం లేదు. నేను మీ చెల్లెల్నో, కూతుర్నో అయ్యుంటే ఇలా చేసేవారా’ అంటూ అరిచేసింది. పాపం ఈయన దాంతో మ్రాన్పడిపోయి ఒక అరగంట మాటల్లేకుండా అలాగే కూర్చుండిపోయారు. తరువాత ఇక్కడి ప్రైవేట్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ ఈయన స్టూడెంటే కదా? అంతా ఏర్పాటు చేసి, వచ్చెయ్యి అన్నారు. ఆ అమ్మాయి దొరికిన బస్సు పటుకుని ఉదయాన్నే వచ్చింది. ఇప్పుడు డ్యూటీలో చేర్చడానికి తీసుకుని వెళ్ళారు. టెంపరరీ పోస్టే. ‘ఇలాగే కొనసాగించు. తరువాతి ప్లాన్‌లో మా డిపార్ట్‌మెంటులో రెండు అసిస్టెంట్ పొఫెసర్ పోస్టులు శాంక్షన్ అవుతాయి. అప్పుడు నిన్ను పర్మనెంట్ అని తీసుకుంటాము’ అని చెప్పారు”

నాకు ఊపిరి ఆగిపోయినట్టనిపించింది. లోపలినుండి త్రేన్పు రాబోయి, బయటికి రాక ఛాతీలో గరగరమని చప్పుడయింది.

“..ఈయన ఎలాంటివారని మీకు తెలుసు కదా? నమ్మినవారిని ఎన్నడూ వదలరు..” ఆమె చెప్తూనే ఉన్నారు. నేను సర్దుకోలేక సతమతమవుతున్నాను. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు. ఆమె “రాక రాక వచ్చారు. కాఫీ కూడా అడగకుండా కూర్చో పెట్టేశాను” అన్నది చెవిన పడి మేలుకున్నాను. “వద్దు మేడం” అనబోయిన నాకు మళ్ళీ త్రేన్పు తన్నుకుని వచ్చి ఛాతీ పై భాగంలో ఆగిపోయి వెనిక్కి వెళ్ళిపోయింది. “ఆయన పని ఇప్పటికి అయిపోయుండాలి. ఇక వచ్చేస్తూ ఉంటారు. అప్పటిదాకా ఒక గుక్క కాఫీ గుటకేస్తూ కూర్చోండి” అంటూ ఆమె లేచి నా వైపు కూడా చూడకుండా సరసరమని లోపలికి వెళ్ళారు. ఎల్ ఆకారపు డ్రాయింగ్ రూం మరో మూలకు వెళ్ళి “రండి. ఇక్కడే డైనింగ్ హాల్లో కూర్చుందురుగానీ” అంటూ అక్కడున్న డైనింగ్ టేబల్ వైపు చెయ్యి చూపించి మాయమయ్యారు. నాక్కూడా ఒక గ్లాసుడు వేడి కాఫీ అవసరం అనిపించింది. అక్కడికెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ ఆమె లోపలినుండి హఠాత్తుగా ప్రత్యక్షమై, కిటికీ తెరలను లాగి చీకటి చేసి, అక్కడ ఒక స్విచ్ నొక్కారు. నా నెత్తి మీద రంగు రంగుల దీపగుచ్ఛం వెలిగి ఆ ప్రదేశాన్ని నింపింది.

ఒక చిన్న గోడకవతల ఉన్న కిచెన్‌లో ఉన్న ఆమె తనకంటే ఒక అడుగు ఎత్తున్న ఫ్రిజ్ తలుపు తీసి పాల పాత్ర తీసుకున్నారు. దాన్ని నోటి వద్దకు తీసుకొచ్చి, “ఫూ.. ఫూ.. ఉఫ్” అంటూ మీగడను జరుపుతూ చిన్న పాత్రలోకి కొన్ని పాలను వేసుకున్నారు. అంతలో ఏదో గుర్తొచ్చినదాన్లా పాత్రను కింద ఉంచేసి నా వైపు తిరిగారు. “నా కవిత ప్రింటయ్యిందండీ! చెప్పడమే మరచిపోయాను. ఉండండి. తీసుకొస్తాను” అంటు వచ్చి టేబల్ పైనున్న మాసపత్రికను తీసుకున్నారు. మళ్ళీ సశబ్దంగా ఆవలిస్తూ పత్రిక పుటలు తిప్పుతూ నా వైపుకు వచ్చారు. మొహం పైన చిరునవ్వుతో “చూడండి” అంటూ ఆ పత్రికను నా మొహానికి పెట్టారు. నావైపుకు వంగి “నా ఫోటో కూడా వేశారు చూడండి” అంటూ పెద్దగా అన్నారు. ఆమె నోటి వాసన నా ముక్కుకు సోకింది.

నేను మొహం తిప్పుకున్నాను. ఆమె దాన్ని గమనించనట్టుగా తన ఫోటో పైన వేలు పెట్టి చూపుతూ బర్రున త్రేన్చి, “సారీ”అంటూ నవ్వి “చూస్తూ ఉండండి. కాఫీ తెస్తాను”అన్నారు. నా ముక్కుకు మళ్ళీ ఒకసారి దుర్గంధం సోకింది.

కడుపులో అదెంత సేపటినుండి ఉందో, అదేముందో మరి, నోరు ఎప్పటినుండి కడగలేదో, ఆ వాసనకు నాకు కడుపులో తిప్పినట్టయింది. కళ్ళు, నోరు తమంతట తామే మూసుకున్నాయి. కానీ, ఆ సమయంలో కూడా నా అణకువ తన పని చేసుకుంటూ పోయింది. ముక్కు వైపు వెళ్ళిన చేతిని సగంలోనే ఆపింది. మళ్ళీ కళ్ళు తెరచినప్పుడు ఆమె మళ్ళీ పాల పాత్రను ‘ఉఫ్.. ఉఫ్..’ అంటూ కనిపించారు. మళ్ళీ కొన్ని పాలను చిన్న పాత్రలోకి వంపుకుని ఫ్రిజ్‌లో పెట్టడానికి నా వైపుకు తిరిగిన ఆమె మొహం పైన సన్నటి చిరునవ్వు కనిపించింది. దానిపైన కొద్దిగా గర్వం తొణికిసలాడింది. చిన్నగా తనలో తనే పాడుకుంటూ స్టవ్ వెలిగించి చిన్న పాత్రను దాని పైన పెట్టారు. “ఎక్కువ వేడిగా ఏం అక్కరలేదు కదా? బాగా ఉక్కగా ఉంది. కొంచెం వేడి చాలు కదా?” అన్నారు. నేనేం మాట్లాడలేదు.

ఆమె నా ముందు తెచ్చిపెట్టిన కాఫీని నా కడుపులోకి దింపకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ, అలివేలు మాట వినకుండా నేను చేసుకున్న స్వయంకృతాపరాధం నుండి తప్పించుకునే మార్గాన్ని వెతుకుతూ పైకి చూశాను. దీపగుచ్ఛం రంగులు కళ్ళకు గుచ్చుకున్నాయి. అంతలో జేబులోని మొబైల్ కిర్రుమంది. ఈ కాల్ ఇక్కడినుండి తప్పించుకుని వెళ్ళే మార్గాన్నేమైనా చూపగలదా? అనుకుంటూ ఫోన్ తీశాను. పేరు చూసి ఉలిక్కిపడ్డాను.

ప్రొ. రాఘవేంద్ర!

“ఎక్కడున్నారు మహాశయా?” అంటూ పెద్దగా మాట్లాడడం ప్రారంభించారు. నా గొంతే లేవలేదు. ఆయనే కొనసాగించారు: “మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే మీరే లేరు! మేడంకు కూడా మీరెక్కడికి వెళ్ళారో తెలీదు! ఊళ్ళోనే ఉన్నారు కదా?” నవ్వు వినిపించింది. “విషయమేమిటి సార్?” అన్నాను. నా గొంతు నాకే వినబడలేదు. ఆయన వైపు నుండి వినిపించింది “డా. జాగృతి కల్లూర్ తెలుసుగా? ట్యాలెంటెడ్ యంగ్ స్కాలర్. మన డిపార్ట్‌మెంట్‌కు అమూల్యమైన ఆస్తి కాగలరు ఆమె. కానీ ఇప్పుడు మనమేం చెయ్యగలం చెప్పండి? ఈమె విద్వత్తు వ్యర్థం కాకూడదని కావేరి మోడల్ జ్యూనియర్ కాలేజ్‌లో ఒక టెంపరరి లెక్చరర్‌గా వేయించాను. కానీ ఆమెలాంటి స్కాలర్లకు తగిన ఉద్యోగం కాదని తెలుసు. మన డిపార్ట్‌మెంట్‌లో గెస్ట్ ఫాకల్టీ అని చెప్పి చూపించి వారానికిన్ని క్లాసులని అవకాశం ఇద్దాం. యూనివర్సిటీ వాతావరణం పరిచయం కావాలిగా మరి! దానికంటే ఎక్కువగా ఆమె విద్వత్తు మన విద్యార్థులకు దక్కాలి. దానికి మీ సహకారం కావాలి. అందుకే ఆమెను మీకు పరిచయం చేయిద్దామని మీ ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ మీరే లేరు! ఇలాంటి ఉదయోన్ముఖ స్కాలర్ లను మనం పెంచాలి. ముఖ్యంగా మీరు పెంచాలి. నా తరువాత మరి మీరే కదా! ఇలాంటి ఒక మంచి పనికి ఇప్పటినుండే నాంది ప్రస్తావన కావించండి. దీనివలన మీకే సౌకర్యం. సాహిత్యానికి సంబంధించిన చర్చలకు మంచి కంపెనీ అవుతారు ఈమె. అలాగే మీ పనులలోనూ సహాయ పడగలరు. ఇప్పుడు నా విషయాన్నే తీసుకోండి. నా కొత్త పుస్తకం ఉంది కదా. దాని విడుదల రోజు కృతి పరిచయం ఈవిడే చేస్తారు. దానికి తగ్గ వ్యక్తి ఈమె. అంతే కాదండీ! ప్రోగ్రాంకు నేను మినిస్టర్ గారిని తెస్తే ఈవిడ మీడియావాళ్ళను తెస్తారు. సభ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు జాగృతి మీకు బాగా సహాయంగా ఉంటారు అని నేను చెప్పడం. ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతారు కదా ఆ పిల్ల బుద్దుల రిజ్వాన్, పిల్ల చేష్టల అలివేలు లాంటివాళ్ళ నుండి మీకు ఉపయోగం ఉండదు. వేస్ట్ పీపల్! ఆ శాస్త్రి ఉన్నాడే వాడూ అంతే! తన పని తాను చక్కగా చేస్తాడు తప్ప మీకు ఏ విధంగానూ సహాయపడడు. వీళ్ళందరినీ వదిలెయ్యండి. మన డిపార్ట్‌మెంట్లో మీకు సరైన అకడమిక్ కంపానియన్ అయ్యే తాహతు డా.జాగృతి కల్లూర్‌కు మాత్రమే ఉంది. ఆమెను తగిన పర్మనెంట్ స్థానంలో కూర్చోపెడదామండీ! సీనియర్స్ అయిన మనం చెయ్యాల్సిందదే కదా! మన తరం ముగింపుకొచ్చింది. మన స్థానాన్ని డా. జాగృతి కల్లూర్ లాంటి ప్రతిభావంతుల చేతిలో పెట్టాలి..” హెచ్.ఓ.డి ప్రొ.రాఘవేంద్రగారు అలా చెప్తూనే ఉన్నారు. ఆయన భార్య శ్రీమతి స్వర్ణ రాఘవేంద్ర కాఫీ గ్లాసు తీసుకొచ్చి నా ముందుంచారు. అటు ఆవిడ భర్త “..నేను చెప్పడమేమంటే ఈ జాగృతి ఒక్కసారి మన డిపార్ట్‌మెంటుకు అడుగు పెట్టనివ్వండి. మీరే చూస్తారు! ఇప్పుడున్న ఈ గలీజు పాలిటిక్స్ దుర్గంధం అంతా తొలగిపోయి తేట సాహిత్యపు సుగంధం పరచుకుంటుంది. అన్నట్టు మర్చిపోయాను. ఇంకో విషయం. ఈమె మీలాగే కథలు కాకరకాయలు రాస్తుంది. మీకు ఇంకేం కావాలి చెప్పండి? సరే. అయితే తరువాత మాట్లాడుదాం. మీ మేడం ఘుమఘుమలాడే కాఫీ మా ముందుంచారు ఇప్పుడే. ఈ జాగృతి అయితే అప్పుడే సర్రుమంటూ తాగేస్తోంది కూడా” అంటూ మాటలు ముగిస్తే ఇటు ఆయన భార్యగారు తమ కాఫీ గ్లాసుతో నా ముందు కూర్చున్నారు.

కన్నడ మూలం: శ్రీ ప్రేమశేఖర్

తెలుగు: చందకచర్ల రమేశ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here