వాయులీనం

0
12

[బాలబాలికల కోసం ‘వాయులీనం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]ము[/dropcap]కుందానికి సంగీతంలో కొంత ప్రవేశముంది.

ఒక రోజు కృష్ణ దేవాలయంలో సంగీత వాద్య కచేరీ జరుగుతోంది. ఆ కచేరీలో వాయులీనం (వయొలిన్)  వాయించే వ్యక్తి వాయించిన అద్భుత కీర్తన ముకుందాన్ని ఎంతో కదిలించింది. ఏది ఏమైనా వాయులీనం తను నేర్చుకుని దానిమీద పట్టు సాధించాలనుకున్నాడు.

కచేరీ తరువాత ఆ వాయులీన వాద్యకారుణ్ణి కలసి తాను కూడా వాయులీనం నేర్చుకుంటానని, తనను శిష్యుడిగా చేర్చుకోమని చెప్పాడు.

“నాయనా నీకు సంగీత జ్ఞానం ఉందా?” అడిగాడు వాయులీన విద్వాంసుడు.

“ఉంది గురువుగారూ అంటూ త్యాగరాజు పంచరత్నాలలో ‘ఎందరో మహానుభావులు..’ శ్రావ్యంగా పాడి వినిపించాడు.

“తప్పక నేర్పిస్తాను, ప్రతి ఆదివారం పక్కఊరు ధర్మపురికి వచ్చి నా దగ్గర నేర్చుకో” అని ముకుందం వీపు తట్టి చెప్పాడు.

చెప్పినట్టే ముకుందం ధర్మపురికి వెళ్ళి వాయులీనం నేర్చుకోసాగాడు. తన తండ్రి పొలం మీద వచ్చిన డబ్బుతో ఓ వాయులీనం కొనుక్కున్నాడు. త్వరలోనే వాయులీనం మీద పట్టు సాధించసాగాడు.

ఒక ఆదివారం ముకుందం వాయులీన విద్వాంసుడి వద్ద సాధన చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అలా ఒక నిర్మానుష్య ప్రదేశం వద్దకు వచ్చేసరికి ఒక దొంగ చురకత్తితో వచ్చి, “మర్యాదగా నీవద్ద ఉన్న డబ్బు ఇవ్వు, లేకపోతే ప్రాణాలు పోతాయి” అని కర్కశంగా అన్నాడు.

“అయ్యా నేను సంగీతం నేర్చుకుంటున్న పేదవాడిని. నా దగ్గర డబ్బు బంగారం లేదు, కావాలంటే చూడండి, ఇది వాయులీనం అనే వాయిద్యము. దీనిని నేను బాగా నేర్చుకుని నలుగురికి నేర్పిస్తూ, కచేరీల్లో వాయిస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాను” అని నమ్రతతో చెప్పాడు.

అప్పటికీ ఆ దొంగ ముకుందం మాటల్ని నమ్మక అతని చొక్కా జేబులు వెతికాడు. వాయులీనం పెట్టె తెరచి చూశాడు. వాయిద్యం తప్ప ఏమీ కనబడలేదు.

“నీ దగ్గర డబ్బు, నగలు లేవు కాబట్టి ఒక మంచి పాట దీని మీద పలికించు వింటాను” అన్నాడు.

బతుకు జీవుడా అనుకుంటూ ముకుందం ఓ చెట్టు కింద కూర్చుని ‘పలుకే బంగారమాయెనా?’ అనే రామదాసు కీర్తన శ్రావ్యంగా వాయించాడు.

ఆ కీర్తన లోని శ్రావ్యత ఆ దొంగ మనసు మార్చింది. మొదటిసారి ఆ దొంగ కళ్ళుమూసుకుని ఆ కీర్తన వింటూ ఒక విధమైన సంగీత ఆనందాన్ని అనుభవించాడు.

“నీ వాయులీన సంగీతం నన్ను కదిలించింది” అన్నాడు దొంగ.

“ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చదువు లేకపోయినా న్యాయ మార్గంలో డబ్బు సంపాదించిన వారెందరో ఉన్నారు. దాని వలన గౌరవం పెరుగుతుంది. చెడ్డపనులతో సంపాదన వలన సంఘంలో భయపడుతూ బతకాల్సివస్తుంది. ఆలోచించు. మా ఊరు కనకపురం అక్కడికి రా, మా నాన్న స్నేహితుడుకి ఎంతో పొలం ఉంది. ఆయనకు పొలంలో పనిచేసే మనుషులు కావాలని మా నాన్నతో చెబుతుంటే విన్నాను. నీవు వస్తే ఆయన దగ్గర పనికి చేరవచ్చు. తిండి కూడా ఆయనే పెడతాడు” చెప్పాడు ముకుందం.

ముకుందం మాటలు దొంగలో పరివర్తన తెచ్చాయి. “తప్పకుండా వస్తాను ఇక దొంగతనాలు చేయను. నా పేరు భీమశంకరం” చెప్పాడు.

ముకుందం చిరునామా కనుక్కుని రెండో రోజే ముకుందాన్ని కలిశాడు. అతను దొంగ అని చెప్పకుండా తండ్రికి పరిచయం చేసాడు ముకుందం. ముకుందం తండ్రి అతన్ని తన స్నేహితునికి పనికోసం అప్పగించాడు. అతనికున్న కండబలం చూసి తన పొలంలో ధాన్యాన్ని బస్తాలలోకి ఎత్తి బండిమీద వేసే పని అప్పగించాడు. ముకుందం భీమశంకరానికి ఒక మంచి బతుకు మార్గం చూపించాడు.

చూశారా సంగీతానికి ఉన్న శక్తి అది. అందుకే మన పెద్దలు సంగీతానికి పశువులు, శిశువులు, పాములు స్పందిస్తాయని చెప్పారు. అదే సంగీతం భీమశంకరం ఆలోచనలు కూడా మార్చింది.

అందరం సంగీతాన్ని ఆస్వాదిద్దాం, ఆనందంగా ఉందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here