వచ్చావా నువ్వు?

2
9

[మహాదేవి వర్మ గారు రచించిన ‘ఆగయే తుమ్?’ కవితని అనే అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Mahadevi Verma’s poem ‘Aa Gaye Tum’ by Mrs. Geetanjali.]

~

[dropcap]వ[/dropcap]చ్చేసావా నువ్వు?
తలుపులు తెరిచే ఉన్నాయి!
ఇంకేం.. లోపలికి వచ్చేయి!
ఆగాగు.. ఒక క్షణం ఆగు!
గుమ్మం బయటున్న కాళ్ళ పట్ట మీద
నీ అహాన్ని దులిపేసుకుని రా!
వాకిట్లో సువాసనల మధుమాలతి అల్లుకొని ఉంది చూడు..
నీ అలకలన్నీ దాని పక్కనున్న పిట్ట గోడ అవతలే పారబోసి రా!
ఇక అక్కడే ఉన్న పవిత్రమైన తులసి మొక్కకి
నీ మొక్కులన్నీ నివేదించుకుని మరీ లోపలికి రా!
ఊపిరాడనివ్వని నీ రోజూ వారి పనులన్నీ
పెరట్లో గోడ కొక్కాలకి తగిలించేసి లోపలికి రా!
చెప్పులతో సహా చెడు ఆలోచనలేమన్నా ఉంటే విడిచి మరీ లోనకి రా.
బయట కిలకిల లాడుతున్న పిల్లలనుంచి
కొంచెం అమాయకత్వమో.. మంచితనమో అడుక్కొని మరీ రా!
గుమ్మం ముందరి ఆ పూల తొట్లలో గులాబీలకు పూచిన
చిరునవ్వుని కొంచెం తెంపి ముఖానికి పులుముకొని రా!
రా.. రావోయి.. నీ బాధలన్నీ నాకు ఇచ్చేయి!
నీ అలసటని నా లాలనతో
విసనకర్రలా చల్లగా విసిరి పోగొడతాను.
చూడు.. నీ కోసం ఈ సాయంత్రాన్ని ఎలా పరిచానో..
పసివాడిలా ఎర్రని సూర్యుడు అస్తమించడానికి బయలుదేరాడు!
ఇటు చూడు.. ప్రేమ.. విశ్వాసాలనే నిప్పులతో కలిపిన
చాయ్ కుంపటి మీద కాగుతున్నది.. మెల్లిగా గుటకలు వేస్తూ తాగు మరి..
ఇలా వినయం.. వినమ్రతా అనే అమృతాన్ని
నిత్యం తాగుతూ ఉన్నావనుకో..
ఇక.. జీవించడం కష్టమేమీ కాదు..
రా.. లోపలికి
తలుపులు తెరుచుకునే ఉన్నాయి.
కానీ.. అన్నిటినీ వదిలించుకుని రావాలి మరి..!

~

మూలం: మహాదేవి వర్మ

అనుసృజన: గీతాంజలి


ఆధునిక హిందీ కవయిత్రులలో మహాదేవి వర్మ ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురిలో ఆమె ఒకరు. ఆధునిక మీరా అని ప్రసిద్ధికెక్కిన మహాదేవి వర్మ హిందీ కవితల్లో అత్యంత సరళత్వాన్ని ప్రవేశపెట్టారు. ఖడీబోలీ మాండలికంలో రచనలు చేసి సాహిత్యాన్ని సామాన్యులకు చేరువ చేశారు. మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లోనే కాకుండా చిత్రలేకనంలోనూ అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచారు. నిహార్, రశ్మి, నీరజ, సంధ్యాగీత్, దీప్‌శిఖ, అగ్ని రేఖ వంటి కవితా సంపుటులు, అతీత్ కే చల్‍చిత్ర్, మేరా పరివార్, స్మృతి కీ రేఖాయేఁ ఇతర ప్రసిద్ధ రచనలు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాలను పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here