కాజాల్లాంటి బాజాలు-140: వద్దు వదినా!

0
11

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]“మ[/dropcap]నిషిలో ఆసక్తి ఉండాలే కానీ బోలెడంత సందడి చేసుకోవచ్చు.”

ఈ వదిన ఇంతే.. ఉండుండి ఒక స్టేట్ మెంట్ పడేస్తుంటుంది.

వదిన మాటల్ని నేనేమీ పట్టించుకోకుండా టీవీలో వచ్చే సినిమా చూడడంలో పూర్తిగా మునిగిపోయేను.

ఆ రోజు ఏదో పని మీద అన్నయ్యింటికి వెళ్ళి, అక్కడే సాయంత్రం దాకా ఉండి పోదామనుకున్నాను కనక తీరుబడిగా టీవీలో సినిమా పెట్టుకుని చూస్తున్నాను. మా ఇంట్లో నాకా తీరుబడి ఉండదు కదా! ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు.. ఇల్లన్నాక ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది.

“నేన్చెప్పేది వింటున్నావా!” రెట్టించింది వదిన.

“అబ్బ, ఏంటి వదినా.. మంచి సినిమా మధ్యలో గొడవ!” విసుక్కున్నాను.

“అదే.. ఆ సినిమాలో కనిపించేదాని గురించే చెప్తున్నాను.”

“ఏంటదీ!”

“అందులో హీరో ఏం చేస్తున్నాడూ!”

ప్రశ్నించింది వదిన టీచర్ లాగా.

“సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” వెంటనే చెప్పేను.

“అబ్బా.. అదికాదు.. అతని హాబీ అడుగుతున్నాను..”

“అదా.. యూ ట్యూబ్‌లో రీల్స్ అప్లోడ్ చెయ్యడం అతని హాబీ అని చెప్పేడుగా!”

శ్రధ్ధగా పాఠం వింటున్న విద్యార్థి లాగా జవాబు చెప్పేను.

“అదే నేనూ చెప్పేది. ఆసక్తి అంటూ ఉండాలే కానీ మనం కూడా అలాంటి పనులు చెయ్యొచ్చంటున్నాను.”

పక్కలో పిడుగు పడ్దట్టు హడిలిపోయేను.

“మనవా! వీడియోలు తియ్యడమా! ఎక్కడ తీస్తాం! ఎలా తీస్తాం.. తీసి ఎక్కడ పెడతాం!” ఆశ్చర్యంగా అడిగేను.

“ఏంటి స్వర్ణా నువ్వూ.. ప్రపంచం అంతా ఇంత ముందుకు పోతుంటే నువ్వింకా ఎక్కడున్నావ్”

హూ.. ఈ వదినకి నాలో తప్పు పట్టుకోవడం మహా బాగా వచ్చు అనుకుంటూ “అసలు సంగతేవిటో చెప్పు” అన్నాను సీరియస్‌గా మొహం పెట్టీ.

“అదే.. మనం కూడా ఇలా వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెట్టడమనేది హాబీగా చేసుకుంటే ఎలా ఉంటుందంటావ్!”

ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.

“అసలు మనకి భంగిమలు తప్పితే ఫొటో తియ్యడమే సరిగా రాదే.. ఇంక వీడియోలు ఎలా తీస్తాం!”

“హూ. అందుకే నీలో పుష్ లేదనేది. ఏ పని చెయ్యాలన్నా ముందు నీకు దానిలో ఉన్న లొసుగులూ, కష్టాలే కనిపిస్తాయేంటీ! మనం వీడియోలు తీస్తాం, వాటిని యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాం. ఇంక చూసుకో దానిని చూసి మన వెనక ఎంతమంది ఫాలోయర్లు పడిపోతారో.. ఆహా.. తల్చుకుంటుంటేనే ఎంత బాగుందో!”

పరవశించిపోతున్న వదినని చూస్తుంటే నాకు నవ్వాగలేదు.

“వదినా, ఏదైనా ఫిల్మ్ తియ్యాలంటే దానికో కథా కమామీషూ ఉండాలి”

“ఏవీ అక్కర్లేదు. మనం కథా కమామీషూ కోసం ఏవీ తంటాలు పడక్కర్లేదు. మనం మొబైల్‌ని పట్టుకుందుకు వీలుగా సెల్ఫీలు తీసుకునే ఒక స్టిక్ మొబైల్‌కి ఫిట్ చేసుకుని, ఆ మొబైల్ అడ్డంగా తిప్పేసి వీడియో బటన్ నొక్కెయ్యడమే. దాని పని అది చేసుకుపోతుందంతే. అలా రోడ్డంట వెడుతూ ఎక్కడైనా ఓ నలుగురున్న గుంపు కనిపిస్తే అందులో దూరిపోయి అక్కడ జరుగుతున్న సంఘటనని వీడియో తీసి అప్లోడ్ చేసామనుకో. మన అదృష్టం బాగుంటే అది క్లిక్కయి లక్షలకొద్దీ వ్యూయర్స్ వచ్చేస్తారు.”

అర్థంకానట్టు చూసేను వదిన్ని.

“అబ్బా స్వర్ణా. ఈ సిటీలో రోజూ ఏదో మూల ఏదో ఎగ్జిబిషనో.. మీటింగో.. ఊరేగింపో జరుగుతూనే ఉంటుంది. రోజుకోవైపు వెడుతుండడమే! అందాకా ఎందుకూ, మొన్నీమధ్య కొత్తగా ఓ మాల్ ఓపెన్ అయింది కదా.. అక్కడికి చిన్నా పెద్దా చాలామంది వస్తారు. ఏవో కొనుక్కుంటారు. వెళ్ళి వాళ్ళకి అడ్డం పడిపోయి ఏం కొన్నారో.. ఎందుకు కొన్నారో.. ఎందుకు నచ్చిందో.. ఆ కొన్నది ఎవరికిస్తారో.. ఎందుకిస్తారో.. ఇలా అప్పటికప్పుడు బోల్డు ప్రశ్నలు అడిగెయ్యడమే. ఆహా.. మననే కదా అడిగేరు అని ఉబ్బిపోతూ వాళ్ళు కూడా సంబరపడిపోతూ చెప్పేస్తారు. అందాకా ఎందుకూ! ప్రస్తుతం బుక్ ఫెయిర్ నడుస్తోంది కదా! అలాంటిచోట మనం బోల్డు వీడియోలు తీసుకోవచ్చు.”

“బుక్ ఫెయిర్ లో వీడియోలేంటి వదినా! అక్కడికి అందరూ బుక్స్ కొనుక్కుందుకు వస్తారు.” .

“హూ.. అందుకే నిన్ను అప్‌గ్రేడ్ అవమటుంట. అక్కడ ప్రతి స్టాల్ కీ వెళ్ళి స్టాల్లో వాళ్లనీ, వచ్చేవాళ్లనీ ఏం బుక్స్ ఉన్నాయీ, ఎందుకు కొంటున్నారూ.. అని అఖ్ఖర్లేని ప్రశ్నలన్నీ అడగడమే”

“అడగ్గానే చెప్పేస్తారు పాపం..” ఉక్రోషంగా అన్నాను.

“ఎందుకు చెప్పరూ! హోసి పిచ్చిపిల్లా! మొహం మీద కెమెరా పెట్టి అడిగితే వాళ్లకి ఏదో పట్టాభిషేకం చేసినట్టు ఫీలయిపోయి ఉన్నవీ లేనివీ బోల్డు చెప్తారు. అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ పోవడమే.. వాటిలో ఒక్కటి క్లిక్ అయిందా ఇంక మన జాతకమే మారిపోతుంది.” వదిన ఆకాశంలో విహరించడం చూసి నాకు నవ్వొచ్చింది.

“అంత బుర్ర లేకుండా మాట్లాడతారని నేననుకోను. నువ్విలా గాల్లో మేడలు కట్టడం మాని కాస్త కిందకి దిగు”.

నాక్కూడా కాస్త ఇంగితజ్ఞాన ముందని వదినని హెచ్చరించేను.

నేనన్న మాటలకి వదిన నవ్వుతూ టీవీని మార్చి యూ ట్యూబ్‌లో ఒక వీడియో చూపించింది. అందులో ఒక ఇరవైయేళ్ళమ్మాయి స్కూటీ మీద వెడుతోంది. పిల్ల చక్కగా, తెల్లగా, నాజూకుగా, చురుగ్గా నవ్వుమొహంతో కనిపిస్తోంది. సిగ్నల్ దగ్గర బండాపి, గ్రీన్ సిగ్నల్ పడడం కోసం ఎదురుచూస్తోంది. అంతే ఒక్కసారి ఆమె మొహం మీదకి కెమేరా ఫోకస్ అయింది.

“చాలా స్మార్ట్‌గా ఉన్నారు. మీ పేరేంటండీ!” కెమెరా పట్టుకున్నవాళ్ళు కనపడడం లేదు కానీ వాళ్ల ప్రశ్న వినిపించింది.

అది వినగానే ఆ పిల్ల మొహం వెలిగిపోయింది. “డాలీ..” అంది ముద్దుగా నవ్వుతూ.

“ఏ కాలేజ్!”

“కాలేజా.. నేనా..” అంటూ నవ్వింది సంతూర్ అడ్వర్టైజ్‌మెంట్‌లో లాగా.

“అయామె సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ..” అంది స్టైల్‌గా జుట్టు మొహం మీదకి పడకుండా తలని వెనక్కి విసురుకుంటూ.

“వావ్.. యూ లుక్ లైక్ ఎ స్టూడెంట్..”

“థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్”

“మిస్ డాలీ.. మీరు ఇంత అందంగా ఉన్నారు కదా.. రాబోయే మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారూ!”

వెంటనే ఎదురుగా ఉన్న కెమెరాలోకి చూస్తూ ఆ పాప ఇలా అంది.

“మా డాడ్ నాకు పెట్టిన ముద్దుపేరు డాలీ.. బొమ్మలా ఉంటానని..” మెరుస్తున్న కళ్ళను మరింత టపటప లాడిస్తూ చెప్పింది.

“ఓహ్.. సో క్యూట్..” వీడియో తీస్తున్న వాళ్ళ మాట వినిపించింది.

ముద్దుముద్దుగా మాట్లాడుతూ తనకెలాంటి మొగుడు కావాలో చెప్పడం కొనసాగించిందా పిల్ల.

“మా డాడ్ నన్ను చాలా గారంగా పెంచేరు. నన్ను చేసుకునేవాడు కూడా నన్ను అంత గారంగానూ చూడాలి. మా మామ్ ఇప్పటికీ నాకు అన్నం కలిపి ముద్దలు నోటి కందిస్తుంది. అలా అరచేతిలో పెట్టుకుని చూసుకునేవాడు కావాలి. లక్షలజీతం అందుకుంటూ, పెద్ద కారులో నన్ను తిప్పుతూ, నేనడిగినవన్నీ కొనిస్తూ, పుట్టిన్రోజుకీ, పెళ్ళిరోజుకీ సర్ప్రైజు గిఫ్టు లిస్తూ, విహారయాత్రలకి తీసికెడుతూ, నోటిలో మాట నోటిలో ఉండగానే నా కోరిక తెల్సుకుని తీర్చే వాడయి ఉండాలి”

ఈ పిల్ల ఎక్కి తిరుగుతున్నదేమో ఓ బుల్లి స్కూటీ. కానీ వచ్చేవాడికి మటుకు పేద్ద కారుండాలా! వింటున్న నాకు మతిపోయినంత పనైంది. ఇంక ఆ మహానుభావుడు ఈ పిల్ల కాళ్ళు పడుతూ కూర్చోవాలి తప్పితే ఉద్యోగం ఎలా చెయ్యగలడూ.. అలా చెయ్యలేనప్పుడు లక్షలకి లక్షలు ఎలా సంపాదించగలడు!

టక్కున ఆ వీడియోని ఆపేసేను.

“అసలీ పిల్లకి మతుందా! ఎంతసేపూ తన హక్కుల గురించే మాట్లాడుతోంది తప్పితే పెళ్ళయేక ఆ పిల్లకి కూడా కొన్ని బాధ్యతలుంటాయని తెలీదా!”

నా ప్రశ్నకి వదిన నవ్వింది.

“తెలుసో తెలీదో మన కనవసరం. ఈ వీడియోకి లక్షలకొద్దీ వ్యూయర్స్ ఉన్నారు. మనకి కావల్సింది అదీ.”

వదిన మాట నాకెందుకో నచ్చలేదు.

“అంటే అబ్బాయిలకి ఏవీ వాయిస్ లేదా!” అడిగేను.

“ఎందుకు లేదూ! వాళ్ల వాయిస్ వాళ్ళూ వినిపించేరు. ఇదిగో, ఈ వీడియో చూడు.” అంటూ ఇంకో వీడియో పెట్టింది వదిన.

అందులో ఒక యువకుడు స్టడీగా నిలబడి మాట్లాడుతున్నాడు.

“నాకు మంచి కంపెనీలో పెద్ద జీతమే వస్తుంది. నా భార్యాపిల్లలని చక్కగా పోషించుకునే శక్తి నాకు ఉంది. అందుకని నా భార్య ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు. మా అమ్మానాన్నా నా మీద ఆధారపడిలేరు. వాళ్లకి పెన్షను వస్తుంది. కానీ ఏడాది కోసారి నన్ను చూడడానికి ఇంటికొస్తే నా భార్య కాదనకూడదు.”

“ఈ రోజుల్లో ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యొద్దంటే వీణ్ణి ఎవరు చేసుకుంటారు వదినా.. ఇప్పుడు అమ్మాయిలందరూ మంచి చదువులతో, చక్కటి జాబ్స్‌తో ఉన్నారు కదా!”

“అదేమరి. చూసేవా..ఇద్దరిలో ఎంత వైవిధ్యమో. ఈ వీడియోని కూడా బోల్డుమంది ఫాలో అయ్యేరు. అయినా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలతో మనకి పని లేదు. మన పని కనిపించిన వాళ్ళందరి మొహాల మీదా కేమెరా పెట్టేసి, వీడియో తీసేసి, అప్లోడ్ చేసెయ్యడమే. ఓ పది తీస్తే అందులో ఒక్కటైనా క్లిక్ అవదా! ఒక్కటి క్లికయితే చాలు..ఇంక మనకి ఢోకా ఉండదు.” వదిన పరవశంతో చెప్పుకుపోతోంది.

నాకు ఇంకా ఏంటో అంతా అర్థం అయీ కానట్టు ఉంది.

“అందుకని, నువ్వు రేప్పొద్దున్నే వచ్చేసెయ్యి. మీ బాబయ్య వియ్యంకుడింట్లో షష్టిపూర్తి ఫంక్షన్ ఉంది కదా. అక్కడ మొదలెడదాం మన ప్రయోగం”

“షష్టిపూర్తి ఫంక్షన్‌లో అందరూ మన చుట్టాలే ఉంటారుగా. ఛా.. బాగుండదు. వాళ్ళేమైనా అనుకుంటారు.”

“హేవీ అనుకోరు. పైగా వాళ్ళు యూ ట్యూబ్‌లో కనిపిస్తున్నందుకు సంబరపడిపోతారు.”

“కానీ అక్కడ వాళ్లని ఇలా పెళ్ళిళ్ళ విషయం అడిగితే ఏం బాగుంటుందీ! అందరూ చుట్టాలు కదా!”

“అది కాపోతే ఇంకోటడుగుతాం.. బాహుబలి సినిమా గురించడుగుతాం.. ఆర్.ఆర్.ఆర్.లో నాటు పాట గురించి అడుగుతాం. ఇవేమీ కావంటే వాళ్ళకి పులిహార ఇష్టమో, దధ్ధోజనం ఇష్టమో అడుగుతాం. ఈ ప్రపంచంలో కాదేదీ అడగడానికి అనర్హం.”

వదిన మాటలకి నా దగ్గర ఇంకా సందేహాలున్నా అడిగే ధైర్యం చెయ్యలేకపోయేను.

ఇంటి కొచ్చిన దగ్గర్నించీ మర్నాడు బాబయ్య వియ్యంకుడింటి ఫంక్షన్‌కి వెళ్ళాలా వద్దా అని తెగ తర్జనభర్జన పడుతున్నాను.

వెడితే ఈ యూ ట్యూబ్‌లో రీల్స్ గొడవకి అందరిలో నవ్వుల పాలవుతానేమో.. వెళ్ళకపోతే వదినకి ఏవని సమాధానం చెప్పాలీ!

ఏం చెయ్యాలో కాస్త సలహా ఇచ్చి పుణ్యం కట్టుకుందురూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here