కాజాల్లాంటి బాజాలు-141: వదిన డైరెక్షన్

2
12

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఇ[/dropcap]దేంటీ.. పొద్దున్న లేస్తూనే ఈ మెసేజ్! ఆశ్చర్యపోయేను. రోజూ పొద్దున్నే కాఫీ తాగుతూ కాసేపు వాట్సప్‌లో మెసేజులు చూడడం నా కలవాటు. అలాగే ఇవాళ కూడా వాట్సప్‌కి వెళ్ళగానే నాకు ఒక గ్రూప్‌లో అన్నయ్య ఫొటోతో పాటూ కింద ఈ మెసేజ్ కనిపించింది.

“ఈ ఫొటోలో కనిపించిన వ్యక్తికి ఎవరైనా వారింట్లో ఆశ్రయమిచ్చినా, ఒక్క పూటైనా సరే అన్నం కానీ, టిఫిన్ కానీ పెట్టినా, ఆఖరికి కాఫీ అయినా ఇచ్చినా.. లీగల్‌గా శిక్షకు పాత్రులగుదురు. ఆ శిక్ష ఐదువేల రూపాయిల జరిమానాతో పాటు చేసిన నేరానికి తగ్గట్టు జైలు శిక్ష కూడా విధించే అవకాశమున్నది. ఈ ప్రకటన నేను వారి శ్రీమతి పేర వకాలతా పుచ్చుకుని ఇస్తున్నాను. గమనించగలరు.”

కింద ఆ లాయర్ పేరూ, ఫోన్ నంబరూ ఉన్నాయి.

గబగబా మా చుట్టాలూ, స్నేహితులూ ఉన్న గ్రూప్స్ అన్నీ చూసేను. అన్నింటిలోనూ ఇదే మెసేజ్. ఏమైంది అన్నయ్యకి! అసలు ఏం చేసేడు అన్నయ్య! ఏదైనా చేస్తే మటుకు వదిన లాయర్ ద్వారా ఇలాంటి మెసేజ్ పంపిస్తుందా! ఏమనుకుంటోంది ఈ వదిన! అన్నయ్యకి మేమెవరమూ లేమనుకుంటోందా! ఏదో కాస్త తెలివైందీ, చురుకైందీ కదా అని ఆవిడగారిని మేమందరం సలహాలు అడుగుతుంటే తనంత వారు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరనుకుంటోందా! అసలు సంగతేవిటి!

మా చుట్టాలందరిలోనూ నా ఒక్కదానికే అన్నయ్యతోటీ, వదినతోటీ చనువు ఎక్కువ. ఈ మెసేజ్ చూడగానే అందరూ విషయమేవిటని నాకే ఫోన్ చేస్తారు. ఏం చెప్పాలి! అదిగో.. అప్పుడే ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే భ్రమరాంబ పిన్ని. అయితే పిన్ని కూడా ఈ పాటికి ఈ మెసేజ్ చూసే ఉండాలి.

పిన్ని చేసిన ఫోన్ కట్ చేసి నేను వెంటనే వదినకి ఫోన్ చేసేను.

“గుడ్ మార్నింగ్ స్వర్ణా.. ఇంత ఆలస్యంగా చేస్తావనుకోలేదు..” అన్న వదిన మాటలకి నాకు పుండు మీద కారం జల్లినట్టైంది.

“వెరీ బేడ్ మార్నింగ్. ఏవిటీ వాట్సప్ మెసేజిలు!” సూటిగా ప్రశ్నించేను.

“ఏం.. చదువుకోలేదా!” వెటకారంగా అడిగింది.

“చదివేను కనకే అడుగుతున్నాను. మా అన్నయ్య చేసిన మహాపరాథం ఏవిటి!”

“మొగుడూ పెళ్ళాలం. మా ఇద్దరి మధ్యా బోల్డు విషయాలుంటాయి. అన్నీ చెప్పాలా!”

హూ.. నేనేనా తెలివితక్కువదాన్నీ!

“చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు ఆ మెసేజ్ మన చుట్టాలూ, స్నేహితుల గ్రూపు లన్నింటిలోనూ పెట్టేవు. అందుకని అడిగే హక్కు మాకుంది.”

“అయితే విను. మీ అన్నయ్య నా వంటకి పెట్టే వంకలు భరించలేక నేనేది వండితే అది ఏ రకమైన కామెంటూ చెయ్యకుండా తినాలని షరతు పెట్టేను. ‘అలా అయితేనే వండి పెడతానూ, లేకపోతే మీ వంట మీరు వండుకోవల్సిందే’ అన్నాను. దానికి మీ అన్నయ్య కామెంట్ చెయ్యకుండా తినడం తన వల్ల కాదనీ, తనకి కావల్సినట్టు చేసి పెట్టడం నా బాధ్యత అనీ, దిబ్బా దిరుగుండం అనీ ఏవేవో పాత సూక్తులు మొదలెట్టేరు. ఆయనకి కావల్సినట్టు వండి నాలో పతివ్రతా లక్షణాలు ఉన్నట్టు నిరూపించుకోమన్నారు. నేను వండినదేదైనా కామెంట్ చెయ్యకుండా తిని, ఆయనలో సతీవ్రతా లక్షణాలున్నట్టు నిరూపించుకోమని నేనూ ఎదురు తిరిగేను. మా ఇద్దరిమధ్యా ఇదిగో ఇలా మాట మీద మాటొచ్చింది. ..

‘సతీవ్రతాలక్షణాలు కూడా ఉంటాయా!’

‘ఆహా.. ఉన్నాయి. మీకు తెలియనంతలో లేనట్టేనా! ఏ ప్రవచనకారులనయినా అడగండి. భార్యను భర్త ఒక్క మాట అనకుండా ఎంత పవిత్రంగా చూసుకోవాలో చెపుతారు.’

‘అన్నీ అక్కర్లేదు కానీ ఏదో ఒకటో రెండో నీకు తెలిస్తే చెప్పు వింటాను’.

‘ఒకటి, భార్య సలహా తీసుకోకుండా భర్త ఇంటి విషయాల్లో ఏ నిర్ణయమూ తీసుకోకూడదు..’

‘హబ్బో..’

‘రెండోది, భార్య ఏది వండినా మాట్లాడకుండా మహాప్రసాదంలాగ తినాలి.’

‘కల్పించు, కల్పించు.. నువ్వన్నవన్నీ నమ్మడానికి నేనేమైనా వెర్రాణ్ణనుకున్నావా! మహా ఈ ప్రపంచంలో నువ్వు వండి పెట్టకపోతే ఇంక నాకు తిండే దొరకదన్నట్టు మాట్లాడుతున్నావే! మా వాళ్ళు బోల్డుమందున్నారు. నాకు కావల్సినట్టు చేసిపెడతారు.’

 ‘అలా చేసిపెడితే నేనూరుకుంటానా!’

‘ఏం చేస్తావ్’

‘నాకు కావల్సినవి ఇవ్వాల్సిన బాధ్యత మీ కెలా ఉందో మీకు వండి పెట్టాల్సిన బాధ్యత నాకుంది. అది నా హక్కు. అలాంటి నా హక్కుని వదులుకుంటానా!’

‘ఏం చేస్తావ్!’

‘మీకు మతిస్థిరం తప్పింది కనక మిమ్మల్ని ఎవరింటికీ రానివ్వద్దని చెపుతాను’.

ప్రవాహంలా చెపుతున్న వదిన మాటలు వింటున్న నేను హడిలిపోయేను.

“అన్నయ్యకి మతి స్థిరం తప్పిందా! నువ్వంటే మటుకు నమ్మేస్తామనుకుంటున్నావా!” గట్టిగా అరిచేసేను ఫోన్‌లో.

నా మాటలకి వదిన పకపకా నవ్వింది.

“మీ నమ్మకం ఎవరికి కావాలి! ‘నా మొగుడు పిచ్చివాడు’ అని ఏ భార్య అయినా కోర్టులో చెప్పిందీ అంటే ఇంక దానికి తిరుగులేదని మా లాయరుబాబాయి చెప్పేడు. అయినా సరే నేను ఇంకా మంచిదాన్ని కనక ఏదో బెదిరించేనంతే. కానీ మీ అన్నయ్య వింటేనా! ఇవాళ మీ ఇంటికీ, రేపు మీ బాబయ్య ఇంటికీ.. ఇలా అందరిళ్ళకీ తలో రోజూ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయేరు. దాంతో నాకు ఒళ్ళు మండింది. మా లాయర్ బాబాయితో అలా వాట్సప్ మెసేజ్ ఇప్పించేను. అందరూ నీకు ఫోన్ చేసి అడుగుతారు, నాకు తెల్సు. అందరికీ ఇదే చెప్పు. ఎవరు మీ అన్నయ్యని ఇంట్లోకి రానిచ్చి ఏది పెట్టినా శిక్షార్హులవుతారని.” అని ఖచ్చితంగా చెపుతూ ఫోన్ పెట్టేసింది వదిన.

నాకు కాళ్ళూ చేతులూ చల్లబడినట్లయిపోయి కుర్చీలో కూలబడిపోయేను. వదిన చెప్పిన మాటలు నాకు నమ్మబుధ్ధెయ్యలేదు. ఇలా మెసేజిలు పంపడానికి ఇంకోటేదో కారణం ఉండాలి. నాకు తెలిసినంతవరకూ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అన్నయ్యావదినలు గొడవలు పెట్టుకోరు. నాకు బాగా తెల్సు. అన్నయ్యకి కావల్సినట్టు వదిన వండి పెడుతుంది. వదిన ఏది వండినా అన్నయ్య ఆనందంగా తింటాడు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యనా ఏదైనా అభిప్రాయభేదం వచ్చినా వాళ్ళల్లో వాళ్ళే కిందా మీదా పడి తేల్చుకుంటారు తప్పితే ఇలా ఇంటి విషయాలని పదిమందిలోకీ తెచ్చేవాళ్ళు కాదు అన్నయ్యా, వదినా కూడా. మరి ఈ మెసేజికి అర్థమేవిటి!

అనుకున్నట్టే చుట్టాలు, స్నేహితులనించి ఫోన్లు రావడం మొదలైంది. వాళ్ళకేదైనా చెప్పాలంటే ముందు అసలు సంగతి నాకు తెలియాలి కదా! అందుకే డైరెక్ట్ గా అన్నయ్యకే ఫోన్ చేసేను.

“ఏంటి చెల్లాయ్, వాట్సప్ లో మెసేజ్ గురించేనా!” అడిగేడు నవ్వుతూ.

“అసలేమైందన్నయ్యా!” ఆత్రంగా అడిగేను.

“పెద్దబాబాయి కూతురు నీరజకి మొన్నామధ్య పెళ్ళైంది, గుర్తుందా!”

“ఊ.. దానికి మనమందరం వెళ్ళేం కదా!”

“అది నిన్న మా ఇంటి కొచ్చింది. వచ్చిన దగ్గర్నించీ ఒకటే ఏడుపు. ఏవిటంటే వాళ్ళాయన ఇది చేసే ప్రతి పనిలోనూ తప్పులే ఎత్తి చూపిస్తుంటాడుట. కొత్తగా పెళ్ళైన వాళ్లకి ఇంటిపనులూ, వంట పనులూ ఏవొస్తాయి చెప్పూ! అదేవీ ఆలోచించకుండా అస్తమానం ఇది బాగులేదు, అది బాగులేదు అంటూ దెప్పుతూ ఉంటాడుట. వంట ఎంత కష్టపడి చేసినా ఏదోకటి అనకుండా ఉండడుట. ఏ మనిషికైనా పొద్దుగూకులూ అలా మొహమ్మీద నీకేం రాదూ, అని తిడుతుంటే ఎలా ఉంటుంది చెప్పూ.. పైగా నీరజ తాలూకు మనల్నెవర్నీ ఇంట్లోకి రానీకూడదుట, ఈ నీరజ ఎవరింటికీ వెళ్ళకూడదుట. అంతే కాదు.. వాళ్ళమ్మా నాన్నలకి ఫోన్ కూడా చెయ్యకూడదంటాడుట. ఆఖరికి పాపం కాస్త గాలి పీల్చుకుందుకు బాల్కనీలోకి కూడా వెళ్ళకూదదుట. నీరజ ఆ విషయాలన్నీ చెపుతుంటే మీ వదినకి నీరజ మొగుడి మీద చాలా కోపం వచ్చింది. భార్యంటే ఏవిటో అతనికి తెలియచెప్పాలనుకుంది. ఎవరింటికైనా వెడితే ఒక పూట పెడతారు.. రెండు పూటలు పెడతారు. అదీకాదంటే డబ్బులిచ్చి వంట మనిషిని పెట్టించుకోవాలీ.. లేకపోతే హోటల్లో తినాలి. వాటిని మటుకు ఏ వంకలూ పెట్టకుండా చచ్చినట్టు తినకతప్పదు.

జీవితాంతం ఒక్క భార్య తప్పితే ఇంకెవరు మగవాడి మంచిచెడ్డలు చూస్తారూ! అలాంటి భార్యకి కూడా కొన్ని హక్కులంటూ ఉంటాయి కదా! అవి చాలామంది మగవాళ్లకి తెలీవు. అలా ఆ విషయం ఆ నీరజ మొగుడికి డైరెక్ట్‌గా చెపితే బాగుండదని మీ వదిన నన్ను ఇందులోకి లాగింది.

నేను ఆవిడ చేసిన వంటలకి వంకలు పెట్టినట్టు, ఒళ్ళు మండి మీ వదిన తన హక్కులు వినియోగించుకుంటున్నట్టు అలా మెసేజ్ పెట్టింది. అది చూసేకయినా భార్య తప్ప తనకి ఇంకో దిక్కు లేదని గ్రహించుకుని నీరజ మొగుడు తెలుసుకుని, సవ్యంగా ఉన్నాడా.. సరే.. లేకపోతే ఇంకో ప్రయోగం చెయ్యాలనుకుంటున్నాం నేనూ, మీ వదినా.. ఇంతకీ నీకిప్పటికి ఎంతమంది ఫోన్ చేసేరూ! నువ్వేం చెప్పేవూ!”

అన్నయ్య మాటలకి తెల్లబోయేను. “ఈ రోజుల్లో కూడా ఇలాంటి మొగుళ్ళున్నారంటావా అన్నయ్యా!”

నీరసంగా అడిగేను.

“ఈ రోజుల్లో చాలామందికి భార్యని గౌరవించాలని తెలుస్తోందమ్మా. కానీ ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. మన గ్రహచారం బాగులేకపోతే నీరజకి వచ్చినట్టు అలా మారని మనిషి మొగుడౌతాడు.”

“మీరిలా చేస్తే నీరజ మొగుడికి అర్థమౌతుందంటావా!”

“మరీ అంత తెలివి తక్కువ వాడనుకోను. ఇలాంటి వాళ్ల మీద తల్లి ప్రభావం చాలా ఉంటుంది. అయినా లీగల్‌గా అన్నాం కనక కాస్త భయపడే ఛాన్సుంది. నేనూ, మీ వదినా మేం చెయ్యాల్సింది చేసేం. ఇంక మిగిలినదంతా మీరే చెయ్యాలి.”

“మేమా!” ఆశ్చర్యంగా అడగబోతుంటే “వదిన మాట్లాడుతుందిట..” అంటూ ఫోన్ వదిన కిచ్చేడు అన్నయ్య.

“స్వర్ణా, నీకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్పు. ఈ విషయంలో నిజంగానే మేవిద్దరమూ మాటా మాటా అనుకున్నామనీ, మీ అన్నయ్య ఎవరింటికి వస్తానన్నా ఏదో కారణం చెప్పి రానివ్వద్దనీ, కాదూ కూడదని రానిస్తే కోర్టుకు వెళ్ళాల్సొస్తుందనీ, నువ్వు కూడా అదే పని చేస్తున్నావనీ చెప్పు. ఇలా అందరూ మాట్లాడుకుంటుంటే అది ఆ నీరజ మొగుడిదాకా వెడుతుంది. మనింటి ఆడపిల్లని ఏమైనా అంటే ఊరుకోమని ఆ నీరజ మొగుడికి తెలియాలి.”

వదిన మాటలు నాకు అంతగా నచ్చలేదు.

“అటూ, ఇటూ పెద్దవాళ్ల చేత అతనికి చెప్పిద్దాం వదినా!”

“అన్నీ అయ్యేయి. అతనో మూర్ఖుడు. పాతకాలంలో లాగా ఇప్పటి ఆడపిల్ల కూడా చెప్పు కింద తేలులా ఉండాలనుకునే మనిషి. ఇలాగ ఏదోకటి చెయ్యకపోతే నీరజ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది.”

“కానీ వదినా, నువ్వూ, అన్నయ్యా నలుగురిలోనూ ఎంత పల్చనైపోతారూ!” అన్నాను బాధగా.

“మేవేమయినా పర్వాలేదు. ఈ ప్రపంచంలో భార్యాభర్తలు ఒకరి నొకరు చూసుకోవాలి తప్పితే ఇంకెవరూ వాళ్లని పట్టించుకోరన్న విషయం ఆ నీరజ మొగుడికి తెలియాలి. అందుకే మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ మీ అన్నయ్యని రానివ్వనట్టు అతని ముందు బిల్డప్ ఇవ్వాలి. రేప్పొద్దున్న అతని పరిస్థితి అలాగే ఉంటుందేమో ననే భయం అతనికి కలిగించాలి.”

“అంతేనంటావా!” నీరసంగా అడిగేను.

“అంతే. మనకి నీరజ ముఖ్యం. తను సవ్యంగా కాపరం చేసుకోవడం ముఖ్యం. అందుకోసం ఈ నాటకం ఆడక తప్పదు. సరిగ్గా అందరికీ అర్థమయ్యేట్లు చెప్పి ఈ నాటకం రక్తి కట్టించే బాధ్యత నీదే..” అంటూ వదిన ఫోన్ పెట్టేసింది.

నిజమే కదా! ఇలా ఏదోకటి చెయ్యకపోతే ఇలాంటి మూర్ఖులని మార్చడం కష్టమే అనుకుంటూ ఎలాగైనా ఈ నాటకం అనుకున్న ఫలితం ఇవ్వాలనుకుంటూ వదిన చెప్పినట్టు చెయ్యడానికి సిధ్ధపడ్డాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here