కాజాల్లాంటి బాజాలు-125: వదిన గురువు వినీల

1
8

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]“ఎం[/dropcap]తైనా ఈ కాలం పిల్లల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి స్వర్ణా..” అంది వదిన పొద్దున్నే ఫోన్ చేసి..

“ఆ మాట మనం నిన్ననే అనుకున్నాంగా..” అన్నాను నేను మళ్ళీ అదే మాట ఎందుకు చెపుతోందా అనుకుంటూ..

మా కజిన్ శారదక్కయ్య కొడుకు రఘూ వినీలని పెళ్ళి చేసుకుని ఈ ఊళ్ళోనే కొత్తగా కాపరం పెట్టాడు. పెళ్ళికి వెళ్ళడానికి నాకూ, వదినకీ కుదరకపోవడం వల్ల, నేనూ వదినా వాళ్ళింటికి వెళ్ళి కొత్త దంపతులని చూసి వద్దామని అనుకుంటూనే ఉన్నాం. దానికి తోడు మొన్న శారదక్కయ్య ఫోన్ చేసి కోడలు ఇల్లు ఎలా దిద్దుకుంటోందో చూసి రమ్మని అడగడం వల్ల కూడా మేమిద్దరం రఘు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.

అప్పటికే వినీల గురించి శారదక్కయ్య ద్వారా మేం చాలా విన్నాం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి, మల్టీనేషనల్ కంపెనీలో పని చేసేదనీ, పెళ్ళయాక వీళ్ళేమీ చెప్పకుండానే తనంతట తనే ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటానంటూ ఉద్యోగం మానేసిందనీ చెప్పింది. ఈ రోజుల్లో అలా ఉద్యోగం మానేసే ఆడపిల్లల్ని చూడని మేము ఆశ్చర్యపోయాం. అందుకే ఆ పిల్లని చూడడానికి వెళ్ళాలనుకున్నాం.

వినీలకి ఇంటి అడ్రస్ అడగడానికి ఫోన్ చేసి ఇలా వస్తున్నామని చెప్పగానే ఫోన్ లోనే ఎంతో సంతోషం కనపరిచేసింది.

“లంచ్‌కే వచ్చెయ్యండాంటీ.. సర్దాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం..” అంది.

ఆ అమ్మాయి కలుపుగోలుతనానికి నేనూ, వదినా తెగ ముచ్చట పడిపోయాం. మొహమాటానికి ఎందుకులే అన్నా వదలలేదు. సరేనని నిన్న లంచ్ టైమ్‌కి కాస్త ముందుగానే రఘూ వాళ్ళింటికి వెళ్ళాం. అప్పటికే రఘూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు.

వినీల మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. చూడగానే బాగుందనిపించే రూపం, చిరునవ్వే పలకరింపుగా ఉండే అందమైన కనుముక్కుతీరు, తీరైన మాట.. వినీలని చూడగానే మాకు చాలా సంతోషమనిపించింది.

ఇల్లు చాలా బాగుంది అనడం కంటే వినీల ఇంటిని చాలా కళాత్మకంగా తీర్చింది అనడం బాగుంటుందేమో ననిపించింది ఆ ఇల్లు చూస్తుంటే. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉండడం మాత్రమే కాదు.. అందమైన ఆ వస్తువులు అక్కడ ఉండడం వల్ల ఆ ఇంటికే అందం వచ్చినట్టనిపించింది.

ఇల్లంతా నీట్‌గా సర్ది ఉంది. నేల చూసి బొట్టు దిద్దుకోవచ్చన్నంత అద్దంలా ఉంది ఫ్లోరింగ్. ఇన్నేళ్ళ మా అనుభవాన్నంతా మర్చిపోయి, ఆ పిల్ల మాపింగ్ చెయ్యడానికి ఏం వాడుతుందో అడిగెయ్యాలనిపించింది ఒక్కసారి. నోట్లోంచి వచ్చే మాటని బలవంతంగా ఆపుకున్నాను.

పలకరింపు లవగానే ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళతో పాటు, అప్పటికే తయారుచేసి ఉంచిన మామిడిపళ్ళ రసం రెండు పెద్ద గ్లాసులనిండా అందమైన ట్రేలో పెట్టి తెచ్చింది. ఆ ట్రే, గ్లాసులూ చూస్తుంటేనే తెలిసిపోయింది వినీల చేసే ప్రతి చిన్న పనిలోనూ ఎంత కళాత్మకత ఉందో!

వాళ్ళ అమ్మానాన్నల గురించీ, తమ్ముడి చదువు గురించీ అడిగాక ఇంక ఆపుకోలేక అడిగేసాను నేను..

“అంత మంచి ఉద్యోగం ఎందుకు వదిలేసేవమ్మా.. పోనీ పిల్లలు పుట్టేదాకానైనా చేసుకోవచ్చుకదా!” అని.

అందంగా నవ్వింది వినీల.

“అత్తయ్యగారు కూడా ఆ మాటే అన్నారండీ. కానీ ఇప్పుడు నేను వినీలని కాదు.. రఘూ భార్యను. ఏది చేసినా అతనిని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. నేను ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయి వస్తే రఘూ ఇంటి కొచ్చేటప్పటికి నీరసపడిన మొహంతో ఉన్న నన్ను చూసి ఎంత బాధపడతాడూ! అతను ఇంటి కొచ్చేసరికి నేను నవ్వుతూ ఎదురొస్తే ఎంత సంతోషపడతాడూ! అందుకనే రఘూ కోసమే నేను జాబ్ వదిలేసానాంటీ..” అంది.

నేనూ వదినా తెల్లబోయాం.. ఈ రోజుల్లో ‘నేనూ జాబ్ చేస్తున్నానూ, నాకూ వ్యక్తిత్వం ఉందీ.. నాకూ స్వతంత్రం కావాలీ..’ అనే ఆడపిల్లల్ని ఎక్కువగా చూస్తున్న నేనూ వదినా వినీల పాతతరం వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఒకళ్ళ మొహాలొకళ్ళం చూసుకున్నాం.

 పోనీలే.. మన రఘూ అదృష్టవంతుడు.. వాడి గురించి ఆలోచించే భార్య దొరికింది.. ఇంక శారదక్కయ్యకి రఘూ గురించి బెంగుండదు అనుకుని స్థిమితపడ్దాం.

వినీల ఇల్లంతా చూపించింది. ఏ గదికి ఆ గదే ప్రత్యేకంగా ఉంది. ఎక్కడి కక్కడ మంచి మంచి పెయింటింగ్సు, ఇండోర్ ప్లాంట్సు చూస్తుంటే ఈ పిల్లకి ఎంత ఈస్తటిక్ సెన్స్ ఉందో అనిపించింది.

పెళ్ళికి మేము వెళ్ళలేక పోవడం వలన పెళ్ళికి పుట్టింటివారూ, అత్తింటివారూ పెట్టిన నగలూ, పట్టుచీరలూ చూపించింది. అన్నీ ఎంత బాగున్నాయో.. అవి బాగుండడం మాటటుంచితే ఆ చీరలూ, నగలూ వినీల అమర్చిన తీరు చాలా బాగుంది. అన్నీవెతుక్కోకుండా వెంటనే కనపడేలాగా, అలా కనిపిస్తూనే అందంగా, పొందికగా, ఎక్కువ చోటు ఆక్రమించకుండా పెట్టుకుంది. ఈ పిల్ల పొందికైన పిల్లే.. రఘూ అదృష్టవంతుడు అనుకోకుండా ఉండలేకపోయాం మేమిద్దరం.

మరింక వంటగదయితే చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నమోడరన్ గాడ్జెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉంటే వంట చెయ్యడం ఎంత హాయీ అనుకున్నాం నేనూ, వదినానూ. అన్నీ ఎక్కడివక్కడ నీట్‌గా ఉన్నాయి. వంటగట్టు మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడా మాకు వండిన పదార్థాలు కనిపించలేదు. కనీసం వండుతున్నట్లు గిన్నెలు కూడా కనిపించలేదు. ఈ పిల్ల వంట చేసిందా లేక ఇప్పుడు చేస్తుందా అని అనుమానం వచ్చింది మాకు.

హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం.. అలా అలా బోల్డు కబుర్లొచ్చేసాయి మా మధ్య,. వినీల ఎంత కలుపుగోలు పిల్లో అనిపించింది.

మేము హాల్లో మాటల్లో ఉండగానే ఎవరో ఒకమ్మాయి లోపల కెళ్ళింది. ఓ అరగంట తర్వాత మా ముందు నుంచే వెళ్ళిపోయింది. బహుశా మెయిడ్ అయి ఉండవచ్చనుకున్నాం.

భోజనం టైమవగానే “రండాంటీ భోంచేద్దాం..” అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. అంతకుముందు లేవవి టేబుల్ మీద. ఎప్పుడు ఎక్కడినించి వచ్చాయో కానీ డైనింగ్ టేబుల్ అంతా అందమైన డిష్ లలో ఉన్న ఆహార పదార్థాలతో నిండిపోయి ఉంది.

ఎన్ని రకాలు చేసిందో… ఎప్పుడు చేసిందో.. ఎంత రుచిగా చేసిందో కానీ తియ్యగా మాట్లాడుతూ, కొసరి కొసరి వడ్డించింది మాకు వినీల. ఈ మధ్య ఎప్పుడు తినలేదు నేనూ వదినా అంత భోజనం.

వెనక్కి వచ్చేటప్పుడు మాకిద్దరికీ చక్కటి జరీ అంచులున్న మెత్తటి వెంకటగిరి జరీ చీరలు ఎంతో అందంగా పేక్ చేసి, బొట్టు పెట్టి ఇచ్చింది. అసలు ఆ పేకెట్టు చూస్తే విప్పబుధ్ధిపుట్టదు.. అంత అందంగా చేసింది చీరల పేకింగ్.

వెనక్కొస్తూ దారంతా మేమిద్దరం ఆ వినీల గురించే మాట్లాడుకున్నాం. అంత అందమైనదీ, చురుకైనదీ, కళాత్మకహృదయం ఉన్నదీ, చక్కటి పాకశాస్త్ర ప్రవీణురాలూ, మంచి పనిమంతురాలూ అన్నింటికన్న ఎక్కువగా రఘూ గురించే ఆలోచించే మనిషీ శారదక్కకి కోడలుగా దొరకడం ఎంత అదృష్టమో అనుకున్నాం.

అప్పుడే అనుకున్నాం.. మా రోజుల్లోలా కాదు ఈ రోజుల్లో పిల్లలు ఇల్లు ఎలా పెట్టుకోవాలో నేర్చుకుని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారూ.. ఈ కాలం పిల్లల దగ్గర చాలా నేర్చుకోవాలీ.. అని..

అందుకే ఇప్పుడు ఆ మాటే వదినతో అన్నాను.. “ఆ మాట మనం నిన్ననే అనుకున్నాంగా..” అంటూ..

“అదికాదు.. ఇవాళ పొద్దున్న వినీలకి ఫోన్ చేసాక నాకు ఇంకో విషయం తెల్సింది.. అందుకని అన్నాను.” అంది వదిన.

“ఏంటీ!” కుతూహలంగా అడిగేను.

“నిన్న మనకి అంత మంచి లంచ్ పెట్టినందుకు, అంత బాగా కలిసిపోయినందుకు థాంక్స్ చెపుదామని ఇవాళ పొద్దున్న వినీలకి ఫోన్ చేసాను. థాంక్స్ చెప్పగానే ‘అయ్యో ఆంటీ.. ఈమాత్రం దానికి అంత పెద్ద మాటలెందుకండీ!’ అంది. ఏదో మర్యాదకి అంటోందేమోననుకుని, ‘అది కాదమ్మా.. అంత కష్టపడి ఎంతో రుచిగా వండి పెట్టావు, ఇల్లంతా ఎంతో నీట్‌గా పెట్టుకున్నావు.. నీ డిన్నర్ సెట్ ఎంత బాగుందో.. ఎక్కడ కొన్నావ్..!’ అనడిగాను.

దానికి వినీల ‘అయ్యో.. ఆ వంట నేను వండలేదాంటీ.. బైట నించి ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. వాళ్లకి మంచి పేరుంది. వేరే వాళ్లకన్నా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ, వాళ్ళే వచ్చి టేబుల్ మీద నీట్‌గా సర్ది, మళ్ళీ వాళ్ళే వచ్చి. మిగిలినవి తీసుకుపోయి అంతా క్లీన్ చేసేస్తారు. ఆ డిష్ లన్నీ కూడా వాళ్ళవే. పీస్‌కి ఇంతని అద్దె తీసుకుంటారు. కావాలంటే వాళ్ల మనుషులు ఉండి, సెర్వ్ చేసి వెడతారు.. నేనే మనం ముగ్గురమే కదా అని అఖ్ఖర్లేదన్నాను.’ అంది.

దానికి తెల్లబోయిన నేను ‘పోనీ వంట వచ్చేదాకా వంట మనిషిని పెట్టుకోలేకపోయావా!’ అనడిగేను.

‘వంటమనిషి ఉందాంటీ.. వంటమనిషీ, ఒకళ్ళు గిన్నెలు కడగడానికీ, ఇంకోళ్ళు ఇళ్ళు తుడవడానికీ. ఇంకోళ్ళు డస్టింగ్‌కీ, ఇంకోళ్ళు పై పనులు చేయడానికీ ఉన్నారు. ఈ మనుషులందర్నీ అజమాయిషీ చెయ్యడానికే అలసిపోతున్నాను ఆంటీ’ అంది. నేను తెల్లబోయాను.” వదిన చెపుతున్న మాటలకి వదినే కాదు నేనూ తెల్లబోయి అడిగాను..

“ఇద్దరు మనుషులకి ఇంతమంది వచ్చి పనిచేసి పెడుతున్నారా”

వదిన మళ్ళీ మొదలెట్టింది ఫోనులో, “అంతేకాదు.. ఇంకోటి అసలైంది విను.. వినీల మాటలు విని నేనన్నానూ..

‘పోనీలే అమ్మాయీ, నీ దగ్గర మంచి ఈస్తటిక్ సెన్స్ ఉందీ.. అన్నీ బాగా అందంగా, నీట్‌గా అమర్చుకున్నావ్.. ముఖ్యంగా నీ బట్టల బీరువా ఎంత బాగా పెట్టుకున్నావో..’ అన్నాను.

దానికి జవాబుగా ఆ పిల్ల ఏమందో తెల్సా!..” వదిన కాసేపు ఆపింది..

నేను ఆతృత ఆపుకోలేకపోయాను. “ఏమందీ!”

‘అయ్యో.. అవన్నీ నేను సర్దలేదాంటీ.. ఇలా ఆర్గనైజ్ చెయ్యడానికి డబ్బులిస్తే మనుషులొచ్చి చేస్తారు. వాళ్ల చేత చేయిస్తాను..’ అంది.”

ఇదేదో నేను కొత్తగా వింటున్నాను. “మనింట్లో అలమార్లో చీరలు వేరేవాళ్ళు సర్దడవేంటి వదినా! ఏదో కొత్తగా ఉందే!” అన్నాను.

“అవును. వాళ్లని ఆర్గనైజర్స్ అంటారుట. అమెరికాలో ఇలా వచ్చి చేసేవాళ్ళుంటారుట. ఈ మధ్య ఇండియాలో కూడా ఇలా చేస్తున్నారుట.. ఈ మాట కూడా వినీలే చెప్పింది.” అంది వదిన.

నేను తెల్లబోయాను.

“ఆ వినీల కనీసం బట్టలు కూడా సర్దుకోలేదా!” ఆశ్చర్యంగా అడిగాను.

“ఆ మాటే నేనూ అడిగాను ఆ పిల్లని. ఎందుకు సర్దుకోలేనాంటీ.. కానీ ఇలా డస్టింగ్ చేసీ, గిన్నెలు సర్దుకునీ, బట్టలు మడత పెట్టుకునీ లాంటి పనులన్నీ చేసి నేను అడ్దం పడితే నన్నెవరు చూస్తారూ! మళ్ళీ రఘూకే కదా ఇబ్బంది. అందుకనే అన్నింటికీ మనుషులని పెట్టేసుకున్నానూ!” అంది.

ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించింది నాకు ఒక్క క్షణం.

“వదినా, మనం ఇలా ఆలోచించుంటే ఇన్నేళ్ళు ఈ సంసారానికి ఇంత చేసేవాళ్ళమా!” అనడిగాను దీనంగా..

“అదే కదా ఇప్పుడు నేను చెప్పినమాట.. ఎంతైనా ఈ కాలం పిల్లల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి స్వర్ణా..” అని.. “ఈ కాలం పిల్లలు ఎంత తెలివి మీరిపోయారు చూడూ! ఉద్యోగం చేసుకుంటూంటే పోనీ టైమ్ లేదనుకోవచ్చు. కానీ ఇంట్లోనే ఉంటూ కూడా ఇలా ఆలోచిస్తోందంటే ఎంత జాణా!” అంది వదిన ఆశ్చర్యంగా..

వదిననే అబ్బుర పరచిన వినీలని తల్చుకుంటూంటే అమ్మో అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here