కాజాల్లాంటి బాజాలు-130: వదిన – విల్లాలు

6
8

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఆ[/dropcap]గస్టు 23, 2023 ప్రపంచమంతా మెచ్చుకునేట్టు భారతదేశం చంద్రునిపై విజయకేతనాన్ని ఎగరవేసింది. మన త్రివర్ణ పతాకం ఇంతవరకు ఏ దేశము దిగని చంద్రుని దక్షిణధృవంపై రెపరెపలాడింది. చంద్రయాన్ 3 విక్రమ్‌ను విజయవంతంగా చంద్రుడిమీద దించిన ఇస్రో లోని శాస్త్రవేత్తలను ప్రథానమంత్రితో సహా అందరూ ప్రశంసించారు.

ఇంకా అంతటి ఆనందం నుంచి తేరుకోనేలేదు.. ఇవాళ పొద్దున్నే వదిన దగ్గర్నించి ఫోన్ వచ్చేసింది.

‘స్వర్ణా, నీకు బాంక్లో పెద్ద ఆఫీసర్లు ఎవరైనా తెలుసా” అంటూ..

ఇప్పుడు ఇంత అర్జంటుగా ఆ ఆఫీసర్ల వివరాలెందుకో అర్థం కాక “ఎందుకు వదినా!” అనడిగేను.

“మామూలు చిన్న ఆఫీసర్లు కాదు.. మనకి లోన్ శాంక్షన్ చేయించే పరపతి గల ఆఫీసర్లు కావాలి. నాకూ కొందరు తెలుసనుకో.. నీకూ ఎవరైనా తెలుసేమోనని అడుగుతున్నాను.”

తను మాత్రం ఎక్కడా తగ్గకుండా అడిగింది వదిన.

“అసలు విషయమేంటి వదినా! నీకు లోనేమైనా కావాలా!”

“నాకే కాదు. వింటే నీకు కూడా కావల్సొస్తుంది. నీకు ఆ రోజుల్లో ఎన్నిసార్లు చెప్పేనూ.. ఒక్క నాలుగైదెకరాలు కొని పడేసుకోమనీ.. హబ్బే.. ఎప్పుడు నా మాట విన్నావు కనక.. ఇప్పుడు చూడు.. చంద్రుడు మీదకి విక్రమ్ లాండ్ అయిందా.. ఇంకొన్నాళ్లలో మనిషి కూడా వెడతాడు. అలాంటి ముందు చూపు ఉంది కనకనే అయిదారేళ్ళ క్రితమే మేము చంద్రుడి మీద ఓ పదెకరాలు తీసేసుకున్నాం. ఇప్పుడు వాటిని బ్లాకుల్లాగ మార్చి, విల్లాలు కడితే ఎంతెంత లాభాలూ..”

వదిన మాటలు వింటున్న నాకు ఇదివరకెప్పుడో తను చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్లకి తెలిసిన వాళ్ళెవరో చంద్రుడి మీద స్థలాలు అమ్ముతున్నారనీ, తనో పదెకరాలు తీసుకుంటోందనీ, నన్ను కూడా ఓ పదో ఇరవయ్యో తీసుకోమనీ వెంటపడింది వదిన. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి, చంద్రుని మీదకి రాకెట్లను పంపి, అసలక్కడ మనుషులు జీవించగలరో లేదో అని ఇంకా పరీక్షిస్తున్న సమయంలోనే వదినలాంటి వాళ్ళు చంద్రుడి మీద స్థలాలు కొనడం అమ్మడం చేస్తుంటే నవ్వు రాదూ! అసలు అక్కడ స్థలాలు ఎలాంటివి ఉన్నాయనీ, అవి ఎవరివనీ, అవి ఎవరు ఎవరికి అమ్ముతున్నారని అని అడిగితే వదిన చెప్పిన సమాధానానికి నాకు నోట మాట రాలేదు.

“అవన్నీ నాకు తెలీదమ్మాయ్. మాకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ వాళ్ళ వెంచర్. మాకు వాళ్ళ మీద చాలా నమ్మకం. కొన్నాళ్ళు పోతే ఈ స్థలాలు కోట్లు పలుకుతాయిట.. ఇప్పుడైతే లక్షలే. అందుకే మా వాళ్ళందరం కొనేసుకుంటున్నాం. మీ అన్నయ్య గింజుకున్నారు కానీ మొత్తానికి మా బావగారు ఒప్పించేరు. అప్పుడే నీకూ చెప్పేను, నువ్వు వినలేదు. ఇప్పటికైనా తొందరగా ఓ విల్లాకి డబ్బు కట్టెయ్యి. కొన్నాళ్ళు పోతే అవీ ఉండవు. తర్వాత బాధపడతావ్”.

ఇదివరకు వదిన చెప్పిన మాటలు గాలిలో మేడల్లా అనిపించి కొంతా, అంత ఇంటరెస్ట్ లేక కొంతా వదిన మాట వినిపించుకోలేదు. ఇప్పుడు అలా గాలిలో కొన్న ఎకరాల్లో వదిన విల్లాలు కడుతుందా!. నాకేమిటో అంతా గందరగోళంగా అనిపించింది.

“ఇంకా అసలక్కడ మనుషులు ఉండగలరో లేదో తెలీనిదే ఈ విల్లాలూ అవీ ఎలా కడతారు వదినా!”

“అవన్నీ తెలిసి, అందరికీ తెలిసిపోయాక మనకి ఎకరం కాదు కదా వందగజాల స్థలం కూడా దొరకదు. అప్పుడు చవకలో వచ్చింది కనక కానీ, ఇప్పుడు కొందామంటే అసలక్కడ స్థలాలే లేవు తెల్సా!”

నాకు ఏం మాట్లాడాలో తోచలేదు.

“అది కాదు వదినా. అక్కడికి ఇంకా మనుషులే వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళగలిగినా మాస్కులూ గట్రా పెట్టుకుని, ఆక్సిజన్ మోసుకుంటూ వెళ్ళాలి. దానికి కూడా ఇంకో పది పదిహేనేళ్ళు పడుతుంది. అప్పటిదాకా మనముంటామా!”

ఉన్న మాట ధైర్యంగా చెప్పేసేను వదినతో..

“మనం కాకపోతే మన పిల్లలు వెడతారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వాళ్ళ పెద్దలు కొన్న స్థలాల్లో ఇళ్ళు కట్టుకోలేదూ! అలాగే మన పిల్లలూనూ. ఒకప్పుడు అమెరికా ఊరికి ఒకరో ఇద్దరో వెళ్ళేవారు.. మరి ఇప్పుడో ప్రతి ఇంట్లోంచీ ఇదరు పిల్లలు అక్కడే ఉంటూన్నారాయే. అసలు నీకూ, మీ అన్నయ్యకీ ముందుచూపు అనేదే లేదు. అందుకే ఉన్న చోటే సద్దుకు పోతున్నారు. నాకు అలాంటివి సరిపడవు.. నేనూ, నా పిల్లలు అందరిలోనూ గొప్పగా బతకాలి. మిగిలినవాళ్లతో పాటు వీళ్ళు కూడా ఎప్పటికైనా చంద్రుడి మీద ఉన్న ఇళ్లలోనే ఉంటారు. అందుకే ఇప్పట్నించీ మనం ప్రయత్నించాలి. రేప్పొద్దున్న అందరూ చంద్రమండలానికి వెళ్ళిపోతుంటే మన పిల్లలు చిన్నబుచ్చుకోరూ!”

అమెరికానీ, చంద్రగ్రహాన్నీ ఒకే గాటలో కట్టేసిన వదిన మాటలకి ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు.

“అది సరే ననుకో.. మరి ఎప్పుడో వెళ్ళి ఉండబోయే ఇళ్ళకి ఇప్పట్నించీ బాంక్ లోన్లెందుకూ!”

హమ్మయ్యా.. ఆఖరికి వదిన జవాబు చెప్పలేని ప్రశ్న సంధించేను అని సంతోషపడిపోయేను.

వదిన ఏం తక్కువదా!

“ఆ మాత్రం తెలీదా స్వర్ణా.. మొదటి అడుగు వెయ్యడమే కష్టం. నిన్నటి చంద్రయాన్3 విజయంతో ఆ అడుగు పడనే పడింది. ఇంక మనుషుల్ని పంపడం అవీ తొందరలోనే జరిగిపోతాయి. ఇప్పటికే అక్కడ మల్టీప్లెక్స్‌లకీ, బంగారం షాపులకీ, బట్టల షాపులకీ ప్లాన్లు వేసేసుకుంటున్నారుట. ఇంకొన్నాళ్లకి ఛాట్ భండార్, మిర్చీబజ్జీ లాంటివి కూడా వచ్చేస్తాయ్. అన్నీ ఇంత తొందర తొందరా అయిపోతున్నప్పుడు ఇంకా పదేళ్ళదాకా ఎందుకూ వచ్చే రెండు మూడేళ్ళలోనే మనుషులు చంద్రుడి మీదకి వెడతారేమో. మరి అలాంటప్పుడు ఇప్పట్నించీ లోన్ కోసం అప్లై చేసుకోపోతే ఎలా!”

వదిన మాటలకి ఇంక నా దగ్గర ప్రశ్నలూ లేవు.. సమాధానాలూ లేవు.

కళ్ళముందు గిర్రున చంద్రుని మీంచి వేళ్ళాడుతూ వదిన కట్టే విల్లాలు తిరుగడం మొదలుపెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here