కాజాల్లాంటి బాజాలు-133: వదినా – వాట్సప్ గ్రూపూ..

4
13

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]“ఈ[/dropcap] మగాళ్లకి బుర్రలు ఎందుకు పని చెయ్యవో అర్థం కాదు స్వర్ణా!”

ఫోన్ ఎత్తగానే వదిన చేసిన ఈ స్టేట్‌మెంట్ విని అవాక్కయ్యేను. నేను తేరుకోకుండానే మళ్ళీ మొదలెట్టింది వదిన.

“ఒఖ్ఖ మీ అన్నయ్యే అనుకున్నాను ఇన్నాళ్ళూ.. అలాంటి ప్రబుధ్ధులు ఇంకా ఉన్నారని ఇప్పుడే తెల్సింది.”

ఇంక వదినని ఆపకపోతే లాభం లేదనిపించింది.

“ఎవరినైనా ఎన్నైనా అనుకో.. కానీ మా అన్నయ్య నంటే మటుకు నేనూరుకోను.”

“హబ్బో.. అన్నగారి నంటే పౌరుషం పొడుచుకొచ్చిందేం! ఆయనతో నేను పడ్ద బాధ చెప్పడం మొదలెడితే మహాభారతమంత ఔతుంది.”

“ఆహా.. నీతో నేనూ, మా అన్నయ్యా పడ్ద బాధ మొదలెడితే ఆ మహాభారతానికి భాష్యం రాసినంత ఔతుంది.”

ఏమైనా సరే ఇంక వదినతో ‘తగ్గేదేలే’ అనుకున్నాను.

“అబ్బా, చెప్పేది వినకుండా మధ్యలో అఖ్ఖర్లేని మాట్లెందుకూ!” విసుగ్గా అంది వదిన.

“అలా రా దారికి. మా అన్నయ్యని ఏమీ అనకుండా ఉంటే ఎన్ని మాట్లైనా వింటాను.”

వదిన మీద గెలిచాననే సంతోషంతో అన్నాను.

“తల్లీ, ఈ తెలివితక్కువ మొగుళ్ళతోటి పడే బాధల గురించి చర్చించుకుందుకు కొంతమంది ఆడవాళ్లం కలిసి ఒక వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నాం. అందులో నిన్నూ చేర్చుదామని ఫోన్ చేసేను.”

“అందరు పెళ్ళాలూ మొగుళ్ళకి లోకువైనట్టే అందరు మొగుళ్ళూ పెళ్ళాల దృష్టిలో తెలివితక్కువ వాళ్ళే.”

“నీ గొప్ప స్టేట్‌మెంట్లకోసం ఇక్కడెవరూ వేచి చూడట్లేదు కానీ, ఇంతకీ నువ్వు ఆ గ్రూప్‌లో చేరతావా లేదా.. అది చెప్పు.”

“ఆ గ్రూప్‌లో ఏం చేస్తారూ!”

“చెప్పేనుగా.. మొగుళ్ళు చేసే తెలివితక్కువ పనులని సరిదిద్దుకోవడం ఎలాగో ఒకరి కొకరు పరిష్కారాలు చెప్పుకుంటారు.”

“అసలు మొగుళ్ళు చేసేవి తెలివితక్కువ పనులని మీకెలా తెల్సూ!”

వదిన విసుక్కుంది.

“చూడూ స్వర్ణా.. ఈ గ్రూప్ పెట్టిన పదినిమిషాలకే అప్పుడే యాభైమంది చేరేరు. వాళ్ళకి ఆ మాత్రం తెలీకుండానే చేరేరంటావా!”

వదిన మాటలకి కాస్త ఆలోచించేను. ఆ గ్రూప్‌లో ఈ యాభైమందీ కూర్చుని తీరుబడిగా ఎవరి మొగుడు చేసిన తెలివితక్కువ పని వాళ్ళు చర్చకు పెట్టి, పదిమంది చేత దానికి పరిష్కారం చెప్పిస్తారన్న మాట. అంటే ఇంటిగుట్టు రచ్చ కెక్కించడవే కదా.. అనుకుని, “నేను చేరనులే వదినా” అన్నాను.

“ఏవో.. నీ మొగుడేదో బృహస్పతి అనుకుంటున్నావా! మీ ఆయన చేసిన పనులు నాకు తెలీవా!”

నాకు ఒక విధమైన ఉడుకుమోత్తనం లాంటిది వచ్చింది. నా మొగుణ్ణి ఏవైనా అనుకుంటే నేను అనుకోవాలి కానీ ఊళ్ళోవాళ్లందరి చేతా ఎందుకు మాటలు పడేలా చేస్తానూ! అందుకే అన్నాను.

“నా మొగుడితో నేను పడతాను కానీ వదినా, నువ్వే ఆలోచించు.. నలుగురిలో ఇలా కట్టుకున్న మొగుడి పరువు తియ్యడం ఏవైనా బాగుంటుందా! అన్నయ్య గురించి నువ్వేవైనా చెప్పేవనుకో.. వాళ్లందరి ముందరా అన్నయ్య ఎంత లోకువైపోతాడూ!”

నా మాటలకి వదిన ఫక్కున నవ్వింది.

“హయ్యొ పిచ్చి స్వర్ణా.. ఎవరైనా మొగుణ్ణి లోకువ చేసుకుంటారా! అసలు ఈ గ్రూప్ ఎందుకు పెట్టుకున్నామో చెప్తాను విను. మనం ఆడవాళ్లం ఏదైనా విషయం తెలిస్తే నలుగురికీ పంచుకుంటాము. నీకు అర్థమయేలా చెప్పాలంటే ఒక కొట్లో చీరల్ని తక్కువ ధరకి ఇస్తున్నాడంటే ఆ వార్త నలుగురికీ చెప్పీ, అసలు ఆ వార్త నిజమా కాదా.. ఒకవేళ నిజమే అయితే ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నాడు.. పాత స్టాక్ అవడం వలనా.. లేకపోతే షాప్ మూసేస్తుండడం వలనా.. అసలు అన్నింటికన్న ముందు నిజంగా తక్కువ ధరకి ఇస్తున్నాడా.. లేకపోతే ముందే ధర పెంచేసి ఇప్పుడు తగ్గిస్తున్నాడా.. ఇంతకీ అక్కడ కొన్న బట్ట నాణ్యత ఎలా ఉంటుందీ.. లాంటివి బోల్డు విషయాలు మాట్లాడుకుంటాం కదా! కానీ ఈ మగవాళ్ళు ఏ విషయమూ నోరిప్పి ఎవరినీ అడగరు. అటువంటప్పుడు సరైన సమాచారం లేకుండా గోతిలో పడిపోతుంటారు. అలా ఎవరి మొగుళ్ళు ఎలాంటి గోతిలో పడ్డారో, వాటిలోంచి బైటపడే మార్గాలేమిటో లాంటి చర్చలు చేస్తామన్న మాట.”

వదిన ఊపిరి పీల్చుకుందుకు ఆగింది.

“వాళ్ళు గోతిలో పడ్డారని మీరెందుకు అనుకుంటున్నారూ!”

“ఎందుకు అనుకోమూ! అసలు ఇలాంటివాటికి బోల్తా పడేది వాళ్ళేగా. వాళ్ళు ఆఫీసులో మంచి పనిలో ఉంటారు. ఇలాటి శాల్తీ ఎవడో ఫరెగ్జాంపుల్ ఏ చీటీలు కట్టించుకునేవాడే అనుకో.. వస్తాడు. తిమ్మిని బ్రహ్మిని చేసేసి, ఇప్పుడు మీరు ఇంత కడితే రేప్పొద్దున్న మీ అమ్మాయి పెళ్ళికీ, అబ్బాయి చదువుకీ ఇంతొస్తుందీ అని అంకెలు వేసి చూపిస్తాడు. వీళ్ళు కట్టేస్తారు. ఆ కాగితాన్ని అలాగే డ్రాయరులో పడేసి మర్చిపోతారు. అప్పుడు నష్టం ఎవరికీ! మనకేగా. అలాంటివాటిని ఎలా పరిష్కరించుకోవాలో చర్చిస్తామన్న మాట.”

“అలాంటి పనులు మనమూ చేస్తాంగా.. ఇన్‌స్టాల్‌మెంట్‌లో బోల్డు కొంటుంటాం ఆడవాళ్ళం. సగం మగవాళ్లకి చెప్తాం.. సగం చెప్పం. మరి మనం చేసిన చేతలు చర్చకి పెట్టక్కర్లేదా!”

“ఇదిగో చూడూ.. నీ అడ్దమైన ప్రశ్నలకీ ఇప్పుడు జవాబు చెప్పే ఓపిక లేదు. చేరతావా.. చేరవా.. ఏదోటి చెప్పు.”

నేను ఆలోచించేను. ఏదో గేదెని నీళ్ళల్లో పెట్టి బేరమాడినట్టు అసలు సంగతేంటో తెలీకుండా వదిన ఇలా నిలదీస్తే ఎలా!

ఒకవేళ ఒప్పుకుంటే రేప్పొద్దున్న నించీ గుడ్ మార్నింగ్‌లు మొదలు గుడ్ నైట్ వరకూ బోల్డు మెసేజ్‌లు వచ్చి పడతాయి అందులో. వాటి నన్నింటినీ డిలీట్ చేసుకోవడం ఓ పెద్ద పనైపోతుంది. ఒప్పుకోకపోతే వాళ్ళు మాట్లాడుకునే మంచి విషయాలన్నీ మిస్ అయిపోతానేమో! ఏం చెప్పడం అనుకుంటుంటే ఒక ఆలోచన వచ్చింది.

“వదినా, ఓ పని చెయ్యి. ఓ నాల్రోజులు ఆ గ్రూప్‌లో మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు ఫార్వార్డ్ చెయ్యి. అది చూసి నాకు నచ్చితే చేరతాను.”

హేవిటో.. ఈ వదినతో సావాసం చేసి వదిన తెలివితేటలన్నీ నాకు వచ్చేసినట్టున్నాయి అనుకుని అలా వదిన్ని అడిగినందుకు నన్ను నేనే మెచ్చేసుకున్నాను.

హూ.. మా వదినా తగ్గేదీ!

“కుదర్దు స్వర్ణా. గ్రూప్ నియమాల ప్రకారం గ్రూప్‌లో మాట్లాడుకున్న సంగతులు ఏవీ బైట పెట్టకూడదు. నీకిష్టమైతే చేరు.. లేకపోతే లేదు.” వదిన ఖరాఖండిగా చెప్పేసింది.

నేను కాస్త తగ్గేను. “అలా అంటే ఎలా వదినా! తీరా నువ్వక్కడ మా అన్నయ్య గురించి ఏదైనా తప్పు చేసినట్టు చెప్పేవనుకో.. నేను ఎలా ఊరుకోగలనూ! అందుకే అడుగుతున్నాను.”

“ఊహు. కుదర్దంటే కుదరదంతే. ఏ విషయం ఈ సాయంత్రంలోగా చెప్పెయ్యి. ఎందుకంటే ఇప్పటికే యాభైమంది అయ్యేరు కదా! వందమందికి మించి చేర్చుకోకూడదని అడ్మిన్స్ నిర్ణయించేసుకున్నాం. ఉంటాను మరి.”

వదిన ఫోన్ పెట్టేసింది.

ఇప్పుడేం చెయ్యడం! చేరటమా.. వద్దా.. మొగుళ్లమీద నేరాలు చెప్పే గ్రూప్ అంటే చేరకూడదనే ఉంది. కానీ అసలు వీళ్ళు మొగుళ్ళ మీద ఏం చెప్పుకుంటారా అని ఆసక్తిగానూ ఉంది.

భలే డైలమాలో పడిపోయేను. కాస్త సలహా ఇచ్చి పుణ్యం కట్టుకుందురూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here