కాజాల్లాంటి బాజాలు-7: వదినా… వారెవా!

0
7

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కొక్కసారి బైట తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నాలాంటి ఆడవాళ్లకి వాళ్ళు వండింది వాళ్లకి తినబుధ్ధి కాదు. ఎంచక్క వేడి వేడి అన్నం ఓ గుప్పెడు కంచంలో ఎవరైనా పెడతారా అని చూస్తుంటాను.

అలాంటి అవకాశం వచ్చిందీ రోజు. మా ఊర్నించి నాతో కలిసి చదువుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేరు. వాళ్ళు మా వదినకి కూడా బాగా తెలుసు. అందుకని అందరం కలిసి భోజనానికి బైట హోటల్ కెడదామంది వదిన. మా వదిన, మా ఫ్రెండ్స్ విజయ, పద్మ, రేణూ, నేనూ.. మొత్తం అయిదుగురం. హోటల్‌కి వెడితే ఈ పెరిగిపోయిన రేట్లతోనూ, ఆ పైన వేసే జి.ఎస్.టి తోనూ ఆరిపోతామేమోననిపించింది మాకు. గంటలతరబడి కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనే తపనే తప్పితే ఏవో స్పెషల్స్ తినెయ్యాలనే ఆసక్తి మాకు లేదు.

అందుకే “ఇంతోటి మనం తినే తిండికీ అంత ఖర్చు అవసరమా, అందరం తలో చెయ్యీ వేసుకుని వండేసుకుందాం, మన చేతిలో పనేగా” అన్నారు మా ఫ్రెండ్స్. కానీ మా వదిన ఒప్పుకోలేదు. “అయిదుగురం వెడదాం, ఇద్దరి బిల్లే కడదాం” అంది. అదెలా అనడిగిన మాతో ”నేనున్నానుగా పదండి” అంటూ అందరినీ తాజ్ హోటల్‌కి లాక్కుపోయింది.

మేం అయిదుగురం వెళ్ళి ఓ పొడవాటి టేబిల్ చూసుకుని కూర్చుని,  కూర్చున్న కుర్చీలు కాకుండా పక్క కుర్చీల్లో మా హాండ్‌బాగ్‌లు పెట్టేసుకుని, ఇంకెవరికీ ఆ టేబిల్ వైపు చూసే ధైర్యం కూడా చెయ్యకుండా ఆక్రమించేసాం.

ఇంక మా కబుర్లలో పడ్దాం. ఆవకాయ నుంచీ అంతరిక్షం వరకూ, అగ్గిపుల్ల నుంచి ఆడపడుచు వరకు, రంగస్థలం నుంచి సమ్మోహనం వరకూ, పప్పులుసు నుంచి పెద్దాపరేషన్ వరకూ, సి.ఎమ్ నుంచి, పి.ఎమ్ వరకూ మా కబుర్లు హద్దులు లేకుండా సాగిపోతున్నాయి. ఎక్కడ మొదలెడుతున్నామో, ఎలా కొనసాగిస్తున్నామో కూడా తెలీకుండా మా గోలలో మేం ఉన్నప్పుడు వెయిటర్ మెను కార్డ్ ఇచ్చేడు.

సూప్ ఆర్డర్ చెయ్యాలికదా ముందూ.. ముగ్గురం కార్న్‌సూప్ అంటే ఇద్దరు వెజ్ సూప్ అన్నారు. అప్పుడు ఎంటరయ్యింది వదిన ఫీల్డ్ లోకి. “బౌల్‌లో ఉన్నమొత్తం సూపంతా ఒక్కళ్ళం తాగలేం కదా… అలా బౌల్ మొత్తం ఒక్కళ్ళే ఖాళీ చేస్తే తర్వాత వెరైటీలు తిండానికి కడుపులో ఖాళీ ఉండదు. అందుకని మనం ఇలా పంచుకుందాం…” అంటూ వెయిటర్‌ని పిల్చి, 1/3 కార్న్‌సూప్, ½ వెజ్ సూప్ ఆర్డరిచ్చింది. వెయిటర్ ఎంత మంచివాడో పాపం రెండురకాల సూప్‌లనీ అయిదు బౌల్స్‌లో సమానంగా పంచి తెచ్చేడు. సూప్‌తో పాటు ఇచ్చిన స్టార్టర్లతో రెండు సూప్స్ మొత్తం అయిదుగురం కానిచ్చేసేం. భలే ఉందే అనుకుంటుంటే వదిన మళ్ళీ కర్రీలు కూడా అలాగే రెండు వెరైటీలు అయిదుగురికీ వచ్చేలా చేసింది. రోటీలు కూడా అంతే..

అన్నం తినకపోతే నాకు తిన్నట్టుండదు అన్న పద్మ మాటలకి మా వదిన “దానికేం భాగ్యం” అంటూ ఒక బౌల్ కర్డ్ రైస్, నాలుగు ఖాళీ బౌల్స్ తెప్పించి అది అందరికీ సద్దేసింది. అదేమిటో భలేగా కడుపు నిండిపోయింది.

“భోజనం చేసేక కాస్త వేడి కాఫీ పడితేకానీ ఈ భుక్తాయాసం తగ్గదు” అన్న రేణూ మాటలకి “అలాక్కానిద్దాం” అంటూ 2/5 కాఫీకి ఆర్డరిచ్చింది వదిన. పాపం వెయిటరు రెండు కప్పుల కాఫీని అయిదు కప్పుల్లోకి సర్ది తెచ్చిచ్చేడు. మేం తింటున్నామో కబుర్లు చెప్పుకుంటున్నామో తెలీకుండానే మూడుగంటలు గడిచిపోయేయి.

“ఇంక మనం కదలకపోతే వీళ్ళే తోలేస్తారేమో…” అని నేనంటే “హోటల్లో భోంచేసి ఐస్‌క్రీమ్ తినకుండా వెళ్ళిపోదామా…” అని నిలదీసింది విజయ.

“అవును, అదీ నిజమే…” అంటూ మళ్ళీ ఒకటి కసాటా, ఇంకోటి బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్‌లని 2/5 ఆర్డరిచ్చేసింది వదిన. నాకు ఆ వెయిటర్ ఎక్కడ తిట్టుకుంటున్నాడోనని ఒకటే దడ. అటూ ఇటూ తిరుగుతున్న ఆ సూపర్‌వైజర్ ఎక్కడ పొమ్మంటాడోనని బెంగ.

పాపం వెయిటర్, బహుశా ఇదివరకు తూనికలు కొలతల ఆఫీసులో పనిచేసిన అనుభవం ఉందేమో రండురకాల ఐస్‌క్రీమ్‌లని అయిదు కప్పుల్లో సర్ది తెచ్చి మా ముందుంచేడు. తాపీగా ఐస్‌క్రీమ్‌ తింటూ మరో అరగంట కబుర్లు చెప్పుకుని బిల్ తెమ్మన్నాం.

ఆ బిల్ చూసి ఆశ్చర్యపోయేన్నేను. ఇద్దరు వెడితే ఎంతవుతుందో అయిదుగురికీ అంతే అయింది. నా ఆశ్చర్యం చూసిన మా వదిన, “హోటలువాడికేనా తెలివితేటలుంటా… మనకీ ఉన్నాయి” అంది నవ్వుతూ.

‘వారెవా వదినా’ అనుకున్నాను సంబరంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here