కాజాల్లాంటి బాజాలు-123: వదినతో అంత వీజీ కాదు..

1
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]రెం[/dropcap]డేళ్ళ తర్వాత ఈ మధ్యనే కాస్త ఇంట్లోంచి బైటపడి నలుగురి మధ్యకీ వెళ్ళడం మొదలెట్టేక మళ్ళీ నాలో ఇదివరకటి ఉత్సాహం తన్నుకుంటూ పైకొచ్చేసింది. అందుకే వచ్చేవారం ఎలాగైనా సరే గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేసి చుట్టాలూ, స్నేహితులూ కలిసి ఓ ఇరవైమందిని లంచ్‌కి పిలిచి, ఎంజాయ్ చెయ్యాలని నిర్ణయించేసుకున్నాను. అనుకున్నదే తడవుగా వదినతో నా ఆలోచన పంచుకున్నాను.

“నువ్వా!” అంది వదిన ఆశ్చర్యంగా..

“అదేంటీ. అలా అడిగేవూ..” అన్నాను అంతకన్న ఆశ్చర్యం ఒలకబోస్తూ..

“సరే.. చెయ్యి.. చూద్దాం..” అంది వదిన అదేదో సవాల్ చేస్తున్నట్టు.

నాకు ఉక్రోషంలాంటిది వచ్చేసింది. నాకేమీ చేతకాదనుకుంటోందా మా వదినా.. మహా ఈమెకే అన్నీ తెలిసినట్టూ, నాకేమీ తెలీనట్టూ ఏం పోజు కొడుతోందీ.. అనుకున్నాను.

“నేనే.. అచ్చంగా నేనే..” గట్టిగా చెప్పేను..

“సరే.. ఆల్ ద బెస్ట్..” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన..

“హూ..” అనుకున్నాను. నేనేమిటో వదిన దగ్గర నిరూపించుకునే సందర్భం వచ్చినందుకు సంబరపడిపోయేను.

మర్నాటినించే ఏర్పాట్లు మొదలుపెట్టేను. చుట్టాలూ, స్నేహితుల్లో ఎవరెవర్ని పిలవాలో రాసుకున్న లిస్ట్ చేతిలో పట్టుకుని ఒక్కొక్కరికీ ఫోన్ చెయ్యడం మొదలెట్టేను..

ముందు ఫోన్ పెద్దావిడ కదా అని మా పంకజం పిన్నికే చేసేను..

“ఎన్నాళ్లయిందే నీ మాట వినీ.. మంచి పని చేస్తున్నావు. చక్కగా అందరం కలుద్దాం.. ఇంతకీ ఎప్పుడంటావూ!” అంది.

“ఈ వీకెండ్.. అదే శనాదివారాల్లో అనుకుంటున్నాను పిన్నీ..”

“శనివారం పెట్టకమ్మా.. ఆ రోజు నేను ఉపవాసం.. ఏవీ తినను..”

“అలాగా.. అయితే ఆదివారవే పెట్టుకుందాం..”.

“మరైతే అందరం తలో ఐటమూ చేసి తెచ్చుకుందామా..!”

“అఖ్ఖర్లేదు పిన్నీ.. నేను బైటనించి తెప్పించేస్తానులే.. ఈ సిటీల్లో ఓ మూలనించి ఇంకోమూలకి రావడానికే బోల్డు టైమ్ పడుతుంది.. ఇలా వంటలూ గట్రా పెట్టుకుంటే ఇంక కబుర్లు చెప్పుకుందుకు టైమే ఉండదూ..”

“నిజం చెప్పేవే తల్లీ.. సరే.. పదకొండుగంతలకల్లా. నేనూ, మీ బాబాయీ మీ ఇంట్లో ఉంటాం.. సరేనా!”

అంటూ ఫోన్ పెట్టేసింది పంకజంపిన్ని.

నాలో ఉత్సాహం పొంగిపొర్లింది.. ఇంత ఈజీగా అయ్యే పనిని నేను చెయ్యలేనని వదిన ఎంత హేళన చేసిందీ అనుకుంటూ తర్వాత ఫోన్ విజయక్కకి చేసేను.

“బలే చేస్తున్నావే.. తప్పకుండా కలుద్దాం.. ఇంతకీ ఎప్పుడూ!” ఎంతో సంతోషంతో అడిగింది విజయక్క..

“ఈ ఆదివారవే అక్కా..” అన్నాను.

“ఆదివారమా.. ఆ రోజెందుకు పెట్టేవే.. అ దేవుణ్ణైనా భువికి దించొచ్చు కానీ ఆదివారం మీ బావగారిని మటుకు ఇంట్లోంచి కదల్చలేం. శనివారం పెట్టకూడదూ!” అంది.

శనివారం పంకజం పిన్ని ఉపవాసం ఉండే సంగతి చెప్పగానే..

“ఆ.. ఆవిడ వారానికి నాల్రోజులు ఉపవాసం ఉంటాననే అంటుంది.. మళ్ళీ ఏదో కారణం చెప్పి ఈ రోజుకి మానేస్తున్నానంటూ శుభ్రంగా భోంచేస్తుంది.. ఎన్ని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో చూడలేదూ.. ఆవిణ్ణి పట్టించుకోకూ.. నువ్వు శనివారవే పెట్టు.. నేనూ, మీ బావగారూ పదకొండుగంటలకల్లా వచ్చేస్తాం..” అంటూ ఫోన్ పెట్టేసింది.

నాకేం చెయ్యాలో తెలీలేదు. శనివారం పెట్టాలా.. ఆదివారం పెట్టాలా..

సలహా చెపుతుందని కజిన్ వరలక్ష్మికి ఫోన్ చేసేను.. సంగతి వినగానే ఎగిరి గంతేసినంత పని చేసింది వరలక్ష్మి. బహుశా అందరూ ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బైట పడదామా అనుకుంటున్నారేమో..

“మంచిపని చేస్తున్నావే.. శనివారవో.. ఆదివారవో తర్వాత తేలుద్దాం కానీ.. ఇంతకీ ఐటమ్స్ మాటేవిటీ.. అందరూ తలోటీ తెస్తున్నారా..”

“అబ్బే… లేదు విజయక్కా.. ఫుడ్ బైట నించి తెప్పించేస్తాను. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం..”

“బైట్నించి తెప్పిస్తావా.. కొంపదీసి ఏ హోటల్ కైనా ఆర్డరిస్తావేమో.. వాళ్ళు ప్రతిదాంట్లోనూ వెల్లుల్లి పడేస్తున్నారు.. వెల్లుల్లి వాసనుంటే నేను ముట్టనే ముట్టను.. శుభ్రంగా కాటరింగ్‌కి ఆర్డర్ చెయ్యి.. అన్నట్టు ఇంకో మాట.. స్వీట్లూ అవీ మేం ఎక్కువగా ఏవీ తినవనుకో.. అయినా.. నూనెలో దేవేవి కాకుండా ఏ పాలతోనో, కోవాతోనో చేసేవి తెప్పించు.. వాళ్ళు ఏం నూనెను వాడతారో ఏంటో.. అన్నట్టు ఇంకోమాట.. వాళ్లతో చెప్పు.. అన్నం కాస్త ఉడికేలా చూడమని.. మొన్న మా మరిదిగారింట్లో కాటరింగ్ వాళ్ళు తెచ్చిన అన్నం మేకులే అనుకో..” అంటూ ఫోన్ పెట్టేసింది.

వరలక్ష్మక్కయ్య మాటలకి నా గుండెల్లో రాయి పడింది.

ఇలా ఒక్కొక్కళ్ళకీ ఫోన్లు చేస్తుంటే ఒక్కొక్క రకంగా వాళ్ళకి కావల్సినవి స్పష్టంగా చెప్పేరు.

ఒకరేమో.. హోటల్ ఫుడ్డే బాగుంటుందంటూ.. ‘ఎంచక్కా, నీట్‌గా పాక్ చేసి పంపుతారూ.. ఎన్నాళ్ళిలా పాత పధ్ధతిలోనే ఉంటాం..’ అంటారు.

ఇంకోళ్ళేమో …. ‘హోటల్లో ఎవరెవరు ఏ ఏ చేతులు పెడతారో.. శుభ్రంగా తెలిసున్న వంటవాళ్లచేత ఇంట్లో వండిస్తే.. మనవేం తింటున్నామో మనకి తెలుస్తుందీ’ అంటారు.

మరొహళ్ళు ‘ఇంట్లో వంటలంటే మాటలా.. ఈ రోజుల్లో ఇంటికి నలుగురు చుట్టాలొస్తేనే ఇంట్లో వండకుండా బైట్నించి ఫుడ్ తెప్పించేసి, ఆ ఇంటి ఇల్లాలు కూడా వచ్చిన అతిథులతో సమానంగా కూర్చుని కబుర్లు చెపుతోంది.. హాయిగా సుఖపడక ఎందుకొచ్చిన తిప్పలూ..’ అంటారు.

వేరొకళ్ళు “కాటరర్స్‌ని సరైనవాళ్లని చూసుకోవాలి. కొంతమంది మరీ కారాలు పోసేసి, నూనోడుతూ పంపిస్తారు. మొన్న మా బావగారింట్లో మెతుకు నోట్లో పెట్టుకోలేకపోయేం. ఇంటికొచ్చి ఉప్మా కలీబెట్టుకుని తిన్నామంటే నమ్ముతావా!” అంటారు.

ఇంకోళ్ళయితే “ఏవోనమ్మా.. తినేదేదో శుభ్రంగా తినాలి.. ఎవరొండేరో… ఎక్కడొండేరో…ఎలా వండేరో తెలీకుండా తింటే ఎలా ఒంటబడుతుందీ..” అంటారు.

అదే మరోళ్ళు “చక్కగా అందరం కలుస్తున్నాం కనక ఏవైనా వన్ మినిట్ గేమ్స్ కానీ, తంబోలా కానీ ఆడదాం” అంటారు.

ఇంకోళ్ళు “బొత్తిగా పదకొండుగంటలకే ఎవరొస్తారే.. విజయ, వరం వీళ్ళందరూ ఇంట్లో పని తెముల్చుకుని బయట పడేటప్పటికే పదకొండు దాటుతుంది. అందర కల్సేటప్పటికి ఒంటిగంట అవనే అవుతుంది.. మీ బాబాయేమో షుగర్ పేషెంటాయె.. అంతసేపు ఖాళీ కడుపుతో ఉంటే ఎలా.. మేం రావాలంటే అందర్నీ పదిగంటలకల్లా వచ్చెయ్యమని చెప్పు..” అంటారు.

“చూడూ.. నేనైతే స్టీల్ కంచంలోనే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని, కుర్చీలో కూర్చునే తినగలనమ్మా.. ఓ చేత్తో ఆ డిస్పోజబుల్ ప్లేట్లు పట్టుకుని మరో చేత్తో తినలేను..” మరో గొణుగుడూ..

“చేయించే ఐటమ్స్ కాస్త రుచిగా చేయించమ్మా.. బొత్తిగా నోరు చచ్చిపోయింది.. చివర్న ఐస్క్రీమ్ మర్చిపోకు..” ఇంకోళ్ళ గుర్రు..

“అన్నీ చేయించి కిళ్ళీలు మర్చిపోతారు చాలామంది.. అలాంటి పని మటుకు చెయ్యకేం..” మరొహళ్ళ హెచ్చరిక..

“కిళ్ళీలొద్దమ్మో.. మొన్నామధ్య ఏదో ఫంక్షన్‌లో కిళ్ళీ తింటే సున్నం ఎక్కువ పూసేసేడో ఏంటో.. నోరంతా పొక్కి పోయింది.. వక్కపొడో… షోంఫో తెప్పించు..” ఇంకోరి సలహా..

“అన్నట్టు ఫ్రూట్స్ కూడా తెప్పించి పెట్టు.. వెళ్ళేటప్పుడు అందరి చేతుల్లోనూ రెండరటిపళ్ళో.. ఆపిల్సో పెడితే బాగుంటుంది.”

అందరి దగ్గర్నించీ ఈ మాటలన్నీ వింటున్న నాకు బుర్ర గిర్రున తిరిగిపోయింది. గెట్ టుగెదర్‌ని తుంగలో తొక్కేసి ఏ అడవుల్లోనో తపస్సు చేసుకుంటే మంచిదనిపించింది. జుట్టు పీక్కుంటూ మరో దారి కనపడక, ‘అన్యథా శరణం నాస్తి..’ అనుకుంటూ మా వదినకే ఫోన్ చేసేను.

నేను చెప్పినదంతా విని ఫక్కున నవ్వింది వదిన.

“నవ్వకుండా ఇప్పుడేం చెయ్యాలో చెప్తే సంతోషిస్తాను..” అన్నాను బింకంగా.

“నేను చెప్పినట్టు చేస్తావా!”

“ఊ..”

“దీనికి రెండే మార్గాలున్నాయి.. నీకు ఏది బాగుంటే అది చెయ్యి.”

“ఏంటవీ..!”

“గెట్ టుగెదర్ పెడుతున్నది నువ్వే కనక నీకు వీలైనరోజు, వీలైన సమయం చూసి పెట్టు. నీకు తెల్సినంతవరకూ ఎక్కువమంది తినే ఐటమ్స్ తెప్పించు. అందరూ కలిసి ఎలా సరదాగా గడపాలని నువ్వనుకుంటున్నావో అలాంటి ఏర్పాట్లు.. అంటే గేమ్సూ…గట్రా ఏర్పాటు చెయ్యి.”

“అలా చేస్తే బాగుంటుందా! అందరూ సంతోషంగా కలవాలని కదా అనుకుంటుంటా.. ఎవరు చిన్నబుచ్చుకున్నా నాకు బాధగా ఉంటుంది.”

“అయితే నీకు రెండో ఆప్షనే గతి..” అంది వదిన గంభీరంగా..

“ఏంటదీ!” ఆత్రంగా అడిగేను.

“అందర్నీ వచ్చేటప్పుడు ఎవరి లంచ్ బాక్స్‌ని వాళ్లని తెచ్చుకు వచ్చెయ్యమని చెప్పు..”

“ఛీ.. ఇంతా చేసి ఇదా నువ్విచ్చే సలహా.. ఎవరి లంచ్ వాళ్ళు వండుకు తెచ్చుకునేటప్పుడు వాళ్ళింట్లోనే తినొచ్చుకదా! మా ఇంటి దాకా రావడం ఎందుకూ..”

“కదా! సరిగ్గా చెప్పేవు. నలుగురిలో కలిసి ఎంజాయ్ చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని మనకి కావల్సినవి వదులుకోవాలి. అలా వదులుకోలేనూ.. ఇంట్లో నాకు జరిగినట్టే బైటా జరగాలీ అనుకున్నప్పుడు ఇంక బైటకి రాకూడదు. అవ్వా కావాలి.. బువ్వా కావాలి.. అనే ఇలాంటివాళ్లతో డీల్ చెయ్యాలంటే ఇంతకన్న మార్గం లేదు. పై రెండింటిలో ఏదోకటి చూజ్ చేసుకో..” వదిన ఫోన్ పెట్టేసింది..

వదిన చెప్తున్నదీ సరైనదిగానే అనిపించింది. కానీ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవడం.. మళ్ళీ వదినకే ఫోన్ చేసి ఆ మాట అడగితే చులకనైపోతానేమో.. అసలే మా వదినతో మాట్లాడడం అంత వీజీ కాదు.. ఎలా మాట్లాడాలబ్బా.. అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here