కాజాల్లాంటి బాజాలు-53: వదినతో సరదాగా..

6
6

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కసారిగా అందరూ కరోనా కల్లోలంలో పడిపోయేరు. ప్రపంచం మొత్తం ఒక ప్రళయం వచ్చినట్టు దడదడలాడిపోయింది. అంత విపత్తు వచ్చి మీద పడితే మొదట్లో వున్నంత భయం మనుషుల్లో ఇప్పుడు కనిపించటంలేదు. నిజంగా భయం పోయిందా లేక ఇంక తప్పదురా భగవంతుడా రోజువారీ పనులు చేసుకోక తప్పదుకదా అని చేసుకుంటున్నారా అని ఆలోచిస్తే రెండోదే సరియైనదనిపించింది.

రెండు నెలల పైగా నడిచిన కరోనా సమయంలో మంచీ, చెడ్డా ఒకసారి విశ్లేషించుకోవాలనిపించింది. ఒక్కదాన్నీ ఆలోచించుకుంటే యేం లాభం! వాదనకి మరో మనిషి వుండాలి కదా! వదినకన్న మంచిమనిషి నాకెక్కడ దొరుకుతారూ! అందుకే పనంతా చేసేసుకుని, వదిన కూడా ఆ టైమ్‌లో ఖాళీగానే వుంటుందని వదినకి ఫోన్ చేసి, తనతో కలిసి విశ్లేషించడం మొదలెట్టేను.

నేను – ఏంటి వదినా విశేషాలూ!

వదిన – ఈ కరోనాలో కల్లోలాలు తప్ప విశేషాలింకేం వుంటాయమ్మా కొత్తగా అడుగుతున్నావూ!

నేను – అదే.. ఆ కల్లోలాల గురించి మాట్లాడదామనే పిలిచేను. ఇంతకీ అన్నీ కల్లోలాలేనా! కనకంలాంటి కబుర్లేం లేవా!

వదిన – లేకేం. అవీ వున్నాయీ. అవునూ.. ఇంతకీ నువ్వు మీ ఆయనకి కొన్ని పనులైనా అప్పచెప్పేవా లేదా!

నేను – ఓహో.. అయితే నువ్వు మా అన్నయ్యకి యేమేం పనులు అప్పచెప్పేవో!

వదిన – హబ్బ.. మీ అన్నయ్య పనులు కూడానూ.. మొన్న నేను కూరలు తరుగుతుంటే ఎంతో ప్రేమగా వచ్చి, “నువ్వు వేరే పనులేమైనా వుంటే చూసుకో, నేను నీకు ఈ సాయం చేస్తానూ..” అని కూరల ముందు కూర్చున్నారు. ఆహా.. యేమి నా భాగ్యమూ అనుకుంటూ వంటింట్లో గిన్నెలు కడుక్కుని వచ్చేటప్పటికి తరిగిన కూరలకన్న తీసేసిన తొక్కులు యెక్కువున్నాయి.. ఆ మిగిలిన కూర వండి యెవరి ముక్కులో పెట్టనూ!

నేను – కూరల సంగతి మా అన్నయ్యకేం తెల్సు వదినా!

వదిన – కూరలు సరే.. నీ మేనల్లుడికి ఆన్‌లైన్ క్లాసులు అవుతున్నాయి. అదంతా సెట్ చేసి, కాస్త వాడి పక్కన కూర్చోమంటే యేం చేసేరో తెల్సా!

నేను – (కుతూహలంగా) ఏం చేసేడూ!

వదిన – పక్కన కొడుకు టీచర్‌కి కనపడకుండా ఒళ్ళో పెట్టుకుని మ్యాజిక్ క్యూబ్‌తో పజిల్ చేసుకుంటుంటే మీ అన్నయ్య ఆ టీచర్ చెప్పినవన్నీ నీట్‌గా బొమ్మలతో సహా ఒక నోట్ బుక్‌లో యెక్కిస్తూ కూర్చున్నారు. ఇదేమిటని అడిగిన నాతో, “పాపం, చిన్నపిల్లాడు, అలా ఆన్‌లైన్ చెప్తే అర్థం అవటల్లేదేమో, నేను తర్వాత చెపుదామని నోట్స్ రాసుకున్నానూ” అన్నారు. నాకు తల దేనికేసి బాదుకోవాలో అర్థం కాలేదు.

నేను – నిజవేకదా వదినా.. పిల్లలకి కంప్యూటర్ మీద గేమ్‌లు ఆడ్డమే తెల్సు కానీ యింకా అలా పాఠాలు వినడం తెలీదుకదా! తర్వాత వాడికి అర్థమయ్యేట్టు చెప్పుంటాడులే.

వదిన – అయ్యో.. ఆ సౌడభ్యం కూడానా! ఆ పాఠం బయాలజీ.. అది ఆయనకీ అర్థం కాలేదేమో.. “నీది ఇంటర్లో బైపీసీ కదా.. ఈ పాఠం వాడికి చెప్పెయ్యి” అంటూ ఆ పుస్తకం నా మొహాన పడేసేరు. అదేదో ఆ టీచర్ చెప్పినప్పుడు వాడు వినేలా చేస్తే పోయేదానికి నాకు వున్న పన్లకి తోడు అదోటి పెట్టేరు..

నేను – అయ్యోపాపం..

వదిన – ఏవిటో స్వర్ణా. అందరూ మనకి పనులు చెప్పేవాళ్ళే. ఆ టీచర్ కూడా పిల్లలకి అర్ధమయీ కాకుండా ఓ పది నిమిషాలు యేదో చెప్పేసి, దాని మీద ప్రాజెక్ట్ అంటూ వీళ్లకి హోమ్ వర్క్ యిచ్చేస్తోంది. వీళ్లకి అటు పాఠవూ తెలీట్లేదు, అటు ప్రాజెక్టు చెయ్యడవూ తెలీట్లేదు. అదీ నేనే చెయ్యాల్సొస్తోంది.

నేను – అయినా వదినా.. ఇలా అన్నయ్యకి తెలీని పనులు చెప్పకపోతే తెలిసిన పనులు చెప్పొచ్చుకదా!

వదిన – సరిలే.. మీ అన్నయ్యకి వత్తాసు బాగానే వుంది. అలా అనుకునే నిన్న ఇంట్లో కావల్సిన సరుకుల లిస్ట్ యిచ్చి, మీ అన్నయ్యని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చెయ్యమన్నాను.

నేను – అహా యింకేం.. ఇలాంటి పనులయితే నిమిషంలో చేసేస్తాడు మా అన్నయ్య..

వదిన – ఆ చెయ్యకేం.. అదేదో సినిమాలో పవన్ స్టార్ కయినా తిక్కకి ఓ లెక్కుంది కానీ మీ అన్నయ్య తిక్కకి ఒక లెక్కంటూ లేదు కదా! నేను చెప్పినవన్నీ ఓ పది సైట్లు చూసి, ధరలన్నీ సరిపోల్చుకుని, తక్కువ ధర యేది యెక్కడుంటే దానికి ఆర్డర్ చేసేరు. కొంతమంది ప్రస్తుతం స్టాక్ లేదు, కొన్నాళ్ళలో పంపిస్తాం అంటే వాళ్లకి ఆర్డర్ పెట్టి వూరుకున్నారు. అవేంటో తెల్సా.. ఇంట్లోకి అత్యవసరంగా కావల్సిన కందిపప్పు, మినప్పప్పులాంటివి. అఖ్ఖర్లేని పౌడర్లూ, షాంపూలూ మటుకుమర్నాడే వచ్చేసేయి. స్వర్ణా, మేం పప్పొండుకుని పదిరోజులైంది తెల్సా! ఏవిటో.. ఆపుకోలేక నీ ముందు బైట పడిపోయేను.

నేను – అయ్యయ్యో, వదినా.. నువ్వేంటీ.. అలా అన్నయ్య యేం చేస్తే దానికి వూరుకుని వుండిపోవడవేంటీ! అయ్యో, ఇక్కణ్ణించి నేను కందిపప్పు పంపుదామన్నా వీలుకాని పరిస్థితులే!

వదిన – హా..హా..హా.. స్వర్ణా. పడ్డావా బుట్టలో.. ఈమధ్య అసలు సర్దాగా మాట్లాడుకోవడం మర్చిపోయానేమోనని నీతో అలా మాట్లాడేనంతే.. నేను వేరే ఆర్డరిచ్చి అన్నీ తెప్పించేసుకున్నాలే. మీ అన్నయ్యని ఇదివరకెప్పుడైనా నమ్ముకున్నానా యేంటీ.. యిప్పుడు అనుకుందుకు.. నాకు కావల్సినవన్నీ తెప్పించేసేను. పనిలోపని.. ఇదివరకు “ఇదెందుకూ! బోల్డు డబ్బు వేస్టూ” అని మీ అన్నయ్య అన్నవన్నీ ఇప్పుడు తెప్పించేసుకున్నాను.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం నేనేగా.

నేను – అవునులే.. గీకేది మా అన్నయ్య కార్డేగా!

వదిన – హా హా హా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here