కాజాల్లాంటి బాజాలు-127: వదినెంత మంచిదో!

0
8

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఏ[/dropcap]విటో.. జీవితమంటే విరక్తి వచ్చేస్తోంది.. తెల్లారిలేచి వండుతూనే ఉన్నాను, తింటూనే ఉన్నాము, పనులు చేసుకుంటూనే ఉన్నాము.. అయినా సరే.. ఏదో నిర్లిప్తత..

దీనిని ఎలా అధిగమించడం.. మళ్ళీ హుషారుగా ఎలా ఉండడం.. చకచకా పనులు ఎలా చేసుకోవడం.. ఎలాగోలా దీనినుంచి బయటపడాలి.. తిండీ, నిద్రా తప్ప మరింక జీవితం లేదా అన్నట్లుండే ఈ స్థితి నుంచి ఎలా బయటపడడం. అనుకున్నదే తడవుగా దానికోసం మార్గాలేవున్నాయో ననుకుంటూ గూగుల్ సెర్చ్ మొదలుపెట్టాను..

అబ్బో.. చాలా పరిష్కారాలున్నాయి.. అంటే నాలాంటివాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారన్న మాట.. ఆ మాట అనుకోగానే మనసు కాస్త శాంతించింది. అదేదో సామెత చెప్పినట్టు నీతోపాటు ఇంకోళ్ళు కూడా బాధలో పాలు పంచుకుంటున్నారంటే ఎంత మనశ్శాంతీ..

హమ్మయ్యా అనుకుంటూ పెద్దలు చెప్పిన ఆ పరిష్కారాలు తీరిగ్గా చదువుతూ, జంతికలు తింటూ యూట్యూబ్‌లో ఆ పరిష్కారాలు చూస్తూ ఒక వారం రోజులు గడిపేసేను. అదేవిటో.. అవన్నీ చదివాక, చూసాక.. ఇదివరకటి నిరాశ పోయి ఆ స్థానంలో నేనెందుకు బతికున్నానా అనే ఆలోచన వచ్చేసింది.

ఇంకిలా లాభం లేదని ఆ పరిష్కారాలలో దేనినైనా ఆచరణలో పెట్టి చూస్తేనో అనిపించింది. అనిపించిందే తడవు కళ్ళు మూసుకుని ఒకదాని మీదకి వేలు పెట్టేను.. ఆ పరిష్కారం ఇలా ఉంది..

‘మీరు ఒకే పనిని రోజుల తరబడి చేస్తుంటే అది మీకు యాంత్రికమైపోయి మీ మనసు స్పందించడం మానేస్తుంది. అందుకని మీరు రోజూ చేసే పనిని కాస్త మార్పు చేసుకుంటూ ఉండండి.’ అని.

రోజూ ఏం చేస్తాం.. వండుకు తినడమేగా.. దానిలో మార్పు తేవడమెలాగా అనుకుంటుంటే బుర్రలో ఫ్లాష్ వెలిగింది..

‘హా… వండడం మానేసి బైట తెప్పించుకోవచ్చుగా..’ అని.

అంతే ఒక నాలుగురోజులపాటు మూడుపూటలా బైటనుంచి రకరకాల పదార్థాలు తెప్పించేసాను..

మొదటిరోజు ‘ఆహా ఎంత బాగుందీ ఈ పరిష్కారం’ అనిపించి తీరుబడిగా కూర్చుని, ‘మాయాబజార్‌’తో మొదలుపెట్టి ‘శంకరాభరణం’ వరకూ రెండు సినిమాలు చూసేసాను.

రెండోరోజు ‘వీడు కాస్త ఈ పార్సిల్ వేరే విధంగా చేస్తే బాగుంటుందేమో..’ అనిపించింది.

మూడోరోజు ‘వీడు దొండకాయ చేసినా బెండకాయ చేసినా ఒక్కలాగే ఉన్నాయేవిటీ..’ అనిపించింది.

నాలుగోరోజుకి వాళ్ళు వేసిన కారాలకి అలవాటు లేక కడుపులో మండడం మొదలెట్టింది.

చక్కగా, కమ్మగా, శుచిగా, శుభ్రంగా, వేడివేడిగా అసలు మేమేం తింటున్నామో మాకు తెలిసేలా వండుకునే నాకు ఇంక బైట తిండి తినబుధ్ధి అవలేదు.

హంతే.. ఆ పరిష్కారం నాకు పడదనుకుని రెండో పరిష్కారం ఏవిటా.. అని చూసేను..

రోజూ కనీసం అరగంటపాటైనా వాకింగ్ చేస్తే మనిషిలో చురుకుతనం వస్తుందని తెల్సింది..

హోస్.. ఇంతేనా! ఇదివరకు ఎంత యాక్టివ్‌గా ఉండేదానినీ.. ఇలా వాకింగ్ చేసేసి మళ్ళీ అంత యాక్టివ్ గానూ అయిపోదామని మర్నాటినుంచే వాకింగ్ మొదలుపెట్టేను.

మా ఇంటికి రెండు వీధులు దాటితే పార్క్ ఉంది. అక్కడ నడవడానికి వీలు కూడా ఉంది. అందుకని పొద్దున్నే బయల్దేరదామని స్థిరనిర్ణయం తీసుకుని పడుకున్న నాకు తెల్లారగానే బోల్డు సందేహాలు వచ్చేయి.

ఇప్పుడు నేను వాకింగ్‌కి కాఫీ తాగి వెళ్ళాలా.. లేక తాగకుండా వెళ్ళాలా! తాగకుండా వెడితే ఒక్క అడుగు కూడా వెయ్యలేను. కాఫీ తాగి వెడదామంటే అల్లప్పుడెప్పుడో ఒక డాక్టర్ టీవీ చూస్తున్నప్పుడు ఇచ్చిన సలహా గుర్తొచ్చింది. కాఫీ తాగగానే బీపీ ఎక్కువవుతుందనీ, ఆ సమయంలో వాకింగ్ వెడితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, అందుకని కాఫీ తాగి మటుకు వాకింగ్‌కి వెళ్ళొద్దనీ ఆయన అన్న మాట సమయానికి గుర్తు వచ్చినందుకు చాలా సంతోషమేసి, సరే సాయంత్రం వెడదాం లే.. అనుకున్నాను.

సాయంత్రమైంది. మధ్యాహ్నం నుంచీ వాకింగ్‌కి వెళ్ళాలని నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానేమో.. సరిగ్గా సాయంత్రం అయిదున్నర అయ్యేసరికల్లా ఇంట్లోంచి బైట పడ్డాను.

నాలుగడుగులు వేసేనో లేదో రెండిళ్ళవతలున్న సరోజగారు గేట్లో కూరలు కొంటూ కనిపించారు.

“బాగున్నారాండీ..” అన్న మాటతో మొదలైన మా సంభాషణ వాళ్ల పిల్లల గురించీ, మా పిల్లల గురించీ క్షేమసమాచారాలు తెలుసుకుంటుంటేనే పావుగంట గడిచిపోయింది. ఎన్నాళ్లకో కనిపించారు కదాని ఆనందంగా మాట్లాడేసుకుంటున్న నాకు సడన్‌గా వాకింగ్ మాట గుర్తొచ్చి, మర్యాదగా ఆవిడ దగ్గర శెలవు తీసుకుని ముందుకి కదిలాను.

అలా నడుస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకాయన నవ్వుతూ అన్నమాట గుర్తొచ్చింది. ఆయన.. ‘మీ ఆడాళ్ళు వాకింగ్‌కి అని బయల్దేరతారూ.. తీరుబడిగా పెళ్ళి ఊరేగింపులో నడిచినట్టు నడుస్తారూ.. అలా నడిచేం లాభం.. బ్రిస్క్ వాక్ చెయ్యకపోతే నడిచినా ఒకటే.. లేకపోయినా ఒకటే’ అన్నారు.

ఆ మాట గుర్తు రాగానే నడుం నిఠారుగా నిలబెట్టి, ఠీవిగా తల పైకెత్తి, కాళ్ళూచేతులూ బాగా ఝాడిస్తూ, గర్వంగా ఫీలయిపోతూ నడవడం మొదలెట్టేను.

అలా నాలుగడుగులు వేసి, మా సందు తిరిగానో లేదో ఆ వీధిలోనే ఉంటున్న మా ఫ్రెండ్ రజని కజిన్ ఎదురయింది. అసలు రజని హైద్రాబాద్ లోనే ఉందో.. లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళిందో కనుక్కుందామని మొదలైన మా సంభాషణ ఆ కజిన్ పిల్లల చదువుల భారంతో ఓ పావుగంట ఖర్చైపోయింది. మళ్ళీ నన్ను నేను అసలు ఇంట్లోంచి ఎందుకు బయల్దేరేనో గుర్తు చేసుకుని ఆ కజిన్ దగ్గర శెలవు తీసుకుని పార్కు వరకూ ఇంక అటూ ఇటూ చూడకుండా వెళ్ళిపోయాను.

పార్కులోకి అడుగు పెట్టగానే ఏవిటో మనసంతా తేలిగ్గా, హాయిగా అయిపోయింది. అదేమిటో చిన్నప్పట్నించీ ఇలా సాయంత్రాలు పార్కుల్లో ఆడినదాన్నేమో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ అక్కడే బెంచీ మీద కూలబడిపోయి, ఒక్కసారి బాల్యంలోని మధురస్మృతుల్లోకి జారిపోయాను.

అలా ఎంత సమయం గడిచిపోయిందో కానీ మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. అమ్మో.. అప్పుడే ఏడయిపోతోందే.. మళ్ళీ ఇంటికెళ్ళి వంట పనిలో పడాలి అనుకుంటూ ఇంటికొచ్చేసేను..

ఇంటికి రాగానే ఆ రోజు వాకింగ్ మొదలుపెట్టినట్టు కేలండర్ మీద నోట్ చేసుకుంటూ, ఈసారి ఏ డాక్టర్ నైనా అడగాలి.. ఎన్నాళ్ళు వాకింగ్ చేస్తే నాలో ఈ నిరాశ పోయి మళ్ళీ నా చురుకుతనం నాకు వస్తుందో అనుకున్నాను.

అలాగ రోజు విడిచి రోజు వారంరోజులపాటు మధ్యలో కబుర్లాడుకుంటూ వాకింగ్‌కి వెళ్ళిన నేను నాలో ఎంతవరకూ చురుకుదనం వచ్చిందా అని సమీక్షించుకున్నాను..

హబ్బే.. చీమంత కూడా రాలేదు. మళ్ళీ ఇదివరకటి నిర్లిప్తతే నన్ను ఆవహించుకుంది. ఒకవేళ నేను మానసికంగా ఆరోగ్యంగా లేనేమో.. ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్‌కి వెడదామా అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ ధైర్యం కూడా చెయ్యలేకపోయేను. మరేం చెయ్యాలి దేవుడా అనుకుంటూంటే మా వదిన ఫోన్ చేసింది. హర్రే.. ఇంత మంచి వదిన విషయం మర్చిపోయేనేంటీ అనుకుంటూంటే వదినే అడిగింది..

“ఏంటి స్వర్ణా.. ఈమధ్య ఫోన్ చెయ్యట్లేదూ! సలహాలేవీ అఖ్ఖర్లేదా!…” అంటూ..

వెంటనే అనేసేను.. “ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా వదినా.. నువ్వే చేసావూ..”

“ఏమైందీ!” నా గొంతులో ఆరాటాన్ని కనిపెట్టిన వదిన అడిగింది.

నేను అప్పటివరకూ పడ్డ బాధంతా చెప్పేసేను..

వదిన నవ్వింది.. “ఇంత చిన్న విషయానికి అంత బాధపడాలా! నన్ను ముందే అడగొచ్చుగా..” అంది.

“ఇది చిన్న విషయమా..” ఆశ్చర్యంగా అడిగిన నాకు వదిన సమాధానం మరింత ఆశ్చర్యాన్ని పెంచింది.

“నీకే కాదు స్వర్ణా.. ఏ మనిషికైనా ఒకే పనిని కొన్నాళ్లపాటు చేస్తే ఒకవిధమైన యాంత్రికత వచ్చేస్తుంది. అప్పుడే మనం దానినుంచి బ్రేక్ తీసుకోవాలి.. ఆ బ్రేక్ తీసుకోవడమనేది వాళ్ళ వాళ్ళ అభిరుచులూ, పరిమితులని బట్టి ఉంటుంది. మనలాంటి గృహిణులకి మాత్రం నాకు తెలిసున్నంత వరకూ పుట్టింటికి వెడితే చాలు ఆ బ్రేక్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ పుట్టింటి అనుభవాలను మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే అమాయకమైన ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఛార్జి అవుతాము..”

“నాకు పుట్టిల్లంటూ ఇప్పుడెక్కడుంది వదినా.. అందరూ ఎక్కడెక్కడో సెటిలయిపోయారు..”

విచారంగా అంటున్న నా మాటలని వదిన మధ్యలోనే అడ్డుకుంది..

“అదేంటి స్వర్ణా, అంత మాటనేసావూ! నీకు నేనూ, మీ అన్నయ్యా లేమూ.. మమ్మల్ని పరాయివాళ్ళుగా చేసేసావా! మా ఇంటికొచ్చి ఓ నాల్రోజులుండి వెళ్ళొచ్చుగా!”

వదిన అన్న మాటలకి నా కళ్ళల్లోకి చివ్వున నీళ్ళు చిమ్మాయి. దానిని కప్పిపుచ్చుతూ..

“అదేంలేదు వదినా.. అయితే ఎప్పుడు రమ్మంటావూ!”

“ప్రస్తుతం నేను మా పుట్టింట్లో ఉన్నాను. నేను హైద్రాబాదు రాగానే చెపుతాను.. వద్దువుగాని..”

వదిన మాటలకి ఆశ్చర్యపోయేను.

“అదేంటి వదినా.. రాజమండ్రిలో ఇప్పుడు మీ వాళ్ళెవరూ లేరుగా!”

“ఎందుకు లేరూ! ఆ గోదారితల్లి ఉంది.. నేను చదువుకున్న స్కూలూ, కాలేజీ ఉన్నాయి. చిన్నప్పుడు తిరిగిన వీధులు తిరుగుతూ, ఆ మార్కండేయుడి దర్శనం చేసుకుని, గోదారి గట్టుమీద కూర్చుంటే అమ్మ ఒడిలో ఉన్నంత నిశ్చింతగా ఉంది. మళ్ళీ హైద్రాబాదు వచ్చి రొటీన్‌లో పడడానికి కావల్సినంత టానిక్ నాకు ఈ ట్రిప్ అందిస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా వచ్చేస్తుంటాను. అప్పుడే వచ్చి నాల్రోజులయింది. ఓ రెండ్రోజుల్లో వచ్చేస్తాను. నేను రాగానే నీకు చెపుతాను. రెండు చీరలు బేగ్‌లో పెట్టుకుని మా ఇంటి కొచ్చెయ్యి. నాల్రోజులుండి వెడుదువుగాని..”

వదిన మాటలకి మనసంతా తేలికయిపోయింది.

మా వదినెంత మంచిదో అనుకుంటూ.. వదిన ఎప్పుడు వెనక్కొస్తుందా.. ఎప్పుడు రమ్మని ఫోన్ చేస్తుందా.. అని ఎదురుచూస్తున్నాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here