కాజాల్లాంటి బాజాలు-113: వదినోపదేశం..

6
11

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]హే[/dropcap]విటో.. ఈమధ్య నాలో నిరాశ ఎక్కువైపోతోంది. నా చుట్టూ ఉన్నవాళ్లని చూస్తుంటే నేనెందుకలా ఉండలేకపోతున్నానోనని నాలో నేనే కుమిలిపోతున్నాను. వదిన ఈ విషయం కనిపెట్టేసింది. సంగతేమిటని అడిగింది. అంతే.. ఒక్కసారిగా నాలో బాధంతా భళ్ళున బైటకి వచ్చేసింది.

“అదికాదు వదినా, ఆర్నెల్ల క్రితం వరకూ చీర కూడా సరిగా కట్టుకోడం రాని పై ఫ్లాట్‌లో ఉండే సుచిత్ర ఓ రెండునెల్ల కోర్సేదో చేసి ఇవాళ బోర్డు కట్టేసింది. ఇప్పుడు తను ఒక్క కన్సల్టేషన్‌కీ వెయ్యిరూపాయిలు డిమేండ్ చేస్తోందిట. మొన్న కనిపించినప్పుడు చెప్పింది. పైగా అదేదో చాలా మామూలు విషయంలా చెప్తూ, ‘అబ్బే.. నాకు డబ్బు ముఖ్యం కాదు. నాకిష్టమైన పని చేస్తున్నానన్న శాటిస్ఫేక్షన్ ఆ డబ్బు కన్న ఎంతో గొప్పగా కనపడుతోంది’ అంటూ పత్తిత్తు కబుర్లూ.. అక్కడికి నేనేదో ఇష్టంలేని పన్లు చేస్తూ చాలా బాధ పడిపోతున్నట్టు నావైపు జాలిగా కూడా చూసింది. నాకు ఎంత చిన్నతనంగా అనిపించిందో..”

“ఏదో తెల్సీ తెలీకుండా వాగిందనుకో.. దానికి అంత ఫీలైపోవాలా!”

వదిన నన్ను ఓదార్చింది.

“అదొక్కటే కాదొదినా.. కింద వన్నాట్టూలో ఉండే హేమలత ఓ పదిమందిని పోగేసి ఏదో మహిళామండలని పెట్టి అందర్నీ అక్కడికీ, ఇక్కడికీ తీసికెడుతూ బోల్డు పేరు సంపాదించేసింది, అదీ రెణ్ణెల్లలో.. పైగా నన్ను చూసి

“నీలా ఒంటికాయ శొంఠికొమ్ములా నేనుండలేనమ్మా.. నాకు నలుగురు మనుషులు కావాలి’ అంది.”

“అబ్బ, ఏదో చనువుకొద్దీ అందనుకుందూ..” వదిన నాకు నచ్చచెప్పింది.

“అదేంకాదు వదినా.. వాళ్ళ అక్క మొన్న వచ్చినప్పుడు చెప్పింది నాతో, ఈ మహిళామండలి పెట్టేక ఆ హేమలత చేతిలో డబ్బు బాగా ఆడుతోందిట.. కిందటి నెల్లోనే ఏకంగా మూడు పట్టుచీరలు కొనేసిందిట.”

“చాలామంది ఇవన్నీ డబ్బుల కోసమే చేస్తారు స్వర్ణా.. పైకి మటుకు ఏదో ఊళ్ళోవాళ్లని ఉధ్ధరించావన్నట్టు మాట్లాడతారు. వాళ్లతో నీకు పోలికేంటీ! ఉరుకో.”

“అదికాదు వదినా, వీళ్ళు ఇన్నిన్ని చేసేస్తున్నారు కదా, నేను ఇంట్లో ఈ వంటావార్పూ తప్ప ఇంకేమీ చెయ్యలేనా!”

సందేహంగా అడిగేను వదినని.

“ఎందుకు చెయ్యలేవూ! నీకేం చదువు రాదా.. చురుకుతనం లేదా! ముందు నీకు ఏం చెయ్యాలనుందో ఆలోచించుకో.. దాన్ని బట్టి అదెలా చెయ్యాలో చూద్దాం. కానీ ఏం చేసినా దానివల్ల నువ్వు కొంతైనా లాభపడేలా చూసుకో” అంది వదిన.

“అన్నింటిలోనూ లాభ మాశించడం తప్పు కదా వదినా!”

“తప్పేం లేదు. నువ్వేదైనా పని చేస్తున్నావంటే దాని కోసం నీ టైమూ, శ్రమా ఖర్చు పెట్టటం లేదా! వాటికేమీ విలువ లేదా! ఎవరికీ చెప్పకుండా డబ్బు తీయడం తప్పౌతుంది కానీ.. నువ్వు చేస్తున్న పనికి ఇంత పెర్సెంట్ తీసుకుంటానని ముందే చెప్పి చేస్తే తప్పేముందీ!” ఎదురు ప్రశ్నించింది వదిన.

వదిన మాటని శిరసావహించి ఆలోచించడం మొదలెట్టేను. ఇప్పుడు నేనేం చెయ్యగలను..

ఏం చేసినా వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నట్టు శ్రమ పడినందుకు నాలుగు డబ్బులు కూడా మిగలాలి కదా అనుకుంటూ, అలా డబ్బులు మిగిలేది, నేను చేయదగ్గదీ ఏవుందా అని ఆలోచిస్తుంటే వచ్చింది ఒక అద్భుతమైన అవిడియా.

తొందరలోనే కార్తీకమాసం రాబోతోంది. రెండేళ్ళనుంచీ ఈ ఎపిడమిక్ వల్ల మా అపార్ట్‌మెంట్ వాళ్ళందరం కల్సి కార్తీక సమారాధన చేసుకోలేకపోయేం. అంతకుముందు మూడో అంతస్తులో ఉండే సుధీర్ వాళ్ళు అందర్నీ కూడగట్టి ఈ సమారాధన చేస్తుండేవారు. సిటీకి దూరంగా ఉన్న తోటలో ఉసిరిచెట్టుకింద వనభోజనాలు ఏర్పాటు చేసేవారు. రెండేళ్ళక్రితం వాళ్ళు అమెరికా వెళ్ళిపోయేరు. ‘ఈ ఏడు ఆ బాధ్యత నేను తీసుకుని చేస్తేనో..’ అనిపించింది. కానీ మరుక్షణంలో ‘నేను చెయ్యగలనా!’ అని కూడా అనిపించింది. అందుకే నా ఉద్దేశం వదిన ముందు పెట్టేను.

“ఓహ్.. అయితే ఈవెంట్ మేనేజర్‌వి అవుతావన్న మాట.. బ్రహ్మాండంగా చెయ్యగలవు. ప్రొసీడ్..” అని నన్ను ప్రోత్సహిస్తూ, “డబ్బుల దగ్గర మటుకు కాస్త జాగ్రత్త.” అంది.

“నాకు లెక్కలు బాగానే వచ్చులే వదినా..” అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ.

“ఆ లెక్కలు కాదు.. ఇలాంటి వాటికి వేరే లెక్కలు కావాలి.” అంది మర్మగర్భంగా.

“అర్ధం కాలేదు వదినా..”

“సరే.. మొదలెట్టు. అన్నీ నీకే తెలుస్తాయి..” అంది.

వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేక ఇంక ఆగుతానా! ఫ్లాట్స్‌లో వాళ్లందరితో ఓ మీటింగ్ పెట్టి ఈ విషయం చెప్పేను. అందరూ చాలా సంతోషించేరు. నా మీద నమ్మకంతో మొత్తం భారమంతా నామీదే వేసేసేరు. మా ఫ్లాట్స్‌లో వాళ్లతోపాటు వదిన కూడా తన స్నేహితులని తీసుకొచ్చింది. వదిన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సే కదా అని ఇంకా సంతోషించేను.

ఏర్పాట్లన్నీ అదిరిపోయేలా చేయించేను. ఆ రోజు రానే వచ్చింది.

ఆరోజు పొద్దున్నే బోలెడు కాగితాలు క్లిప్ చేసిన పరీక్ష అట్టలాంటిది ఓ చేతిలో, పెన్ను మరో చేతిలో పట్టుకుని నా సహాయకురాలు నిర్మల చేతుల్లో ప్లాస్టిక్ సంచుల్లో మేము గిఫ్ట్ పేక్ చేసిన బహుమతులతో నడుస్తుంటే నేను జనాభా అందరితో కలిసి మేం కుదుర్చుకున్న బస్సెక్కేను..

ఇంక బస్ ఎక్కినప్పట్నించీ అంత్యాక్షరి మొదలెట్టేసేరు అందరూ. తోట చేరుకున్న వెంటనే ప్రతి ఒక్కరికీ పోటీలు పెట్టేసేను. ఐదేళ్ళనుంచీ పదేళ్ళవరకూ ఉన్న పిల్లల్ని ఒకచోట చేర్చి వాళ్లకి చిన్న పరుగుపందెం లాంటిది పెట్టేను.

పది నుంచీ పదిహేనేళ్ళవాళ్లకి ఎదురుగా ఓ స్పూన్‌లో నిమ్మకాయుంచి, దానిని నోట్లో పెట్టుకుని పరిగెట్టమన్నాను. పదిహేనేళ్ళనుంచీ ఇరవైయేళ్ళవాళ్లకి ఎదురుగా సగందాకా నీళ్ళున్న ఓ బకెట్ పెట్టి, వాళ్లకి ఒక్కొక్కరికీ చేతిలో పదేసి రూపాయినాణేలుంచి, ఓ పదడుగుల దూరంలో వాళ్లని నిలబెట్టి అందులో ఆ నాణాలు వెయ్యమన్నాను. ఎవరు ఎక్కువ వేసారో అన్నీ రాసి పెట్టుకున్నాను.

ఆ తర్వాత నుంచి ఆడవాళ్లకీ మగవాళ్లకీ విడివిడిగా పోటీలు పెట్టేను. మగవాళ్లకి ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క పాలియస్టర్ చీర ఇచ్చి మడతపెట్టమన్నాను. ఎవరు ముందు మడతపెడితే వాళ్లకి ప్రైజన్న మాట. అప్పుడు చూడాలి వాళ్ళ అవస్థ.. ఒకతనేమో ఆ ఐదుమీటర్ల చీరని ఆ చెట్ల మధ్యే కింద పొడుగ్గా పరిచేసేడు. ఓ వైపు నుంచి కొంగు ఎత్తి ఇంకో వైపు తీసికెడుతుంటే మధ్యలో చుట్టుకుపోతోంది. ఇంకొకతను ఆ చీర పట్టుకుని ఓ కుర్చీ చుట్టూ చుట్టేసి దాన్ని మడతలు మడతలుగా పైకి తీస్తుంటే మొత్తం అంతా ఓ కుప్పలా కూలిపోయింది. ఇంకొకతను చేతులు రెండూ బార్లా చాపి ఒకవైపు నుంచి తీస్తూ ఇంకోవైపు వదిలేస్తున్నాడు. నిజం చెప్పాలంటే చీరలు మడతపెట్టడానికి వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తుంటే ఎంత నవ్వొచ్చిందో!

ఆడవాళ్లకి మ్యూజికల్ చైర్స్ పెట్టేను. అరవై ఏళ్ళు దాటిన దంపతులకి మెమరీ గేమ్ పెట్టేను.

మంచి పురోహితులు పూజ చేయిస్తుంటే ఉసిరిచెట్టుకింద అందరి చేతా దీపాలు పెట్టించేను. చాలా పేరున్న కేటరర్స్‌ని నియమించి లంచ్, మధ్యాహ్నం స్నాక్స్ అందరూ ‘ఆహా.. ఓహో..’ అనేలా చేయించేను.

లంచ్ అయ్యేక దంపతులకి వన్ మినిట్ గేమ్ పెట్టేను. ఒకరు చిన్న ప్లాస్టిక్ బుట్టలాంటిది పట్టుకుని ఒకళ్ళు అటు తిరిగి నిలబడితే ఇంకోళ్ళు ఇటువైపు తిరిగి అందులో చిన్న చిన్న బంతుల్లాంటివి వెయ్యాలి. అది కూడా సరదాగానే సాగింది. కానీ మధ్యమధ్యలో ఈ ప్రైజు నాకే రావాలని ఒకరూ, వాళ్లకెందుకిచ్చారని ఇంకోరూ గొడవ మొదలెట్టేరు. ఎంతో సహనంతో వాళ్ళకి సర్ది చెప్పేను. మొత్తం అపార్ట్‌మెంటుల్లో ఉన్నవాళ్లందరికీ ఏదో ఒక బహుమతి వచ్చేలా చూసుకున్నాను. అంత చిన్న చిన్న బహుమతులకి కూడా అంత పోట్లాట వేసుకుంటున్నవాళ్లని చూస్తుంటే నాకెంతో ఆశ్చర్య మేసింది. మధ్యాహ్నం స్నాక్స్, టీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందించబడ్డాయి. ఆ తర్వాత అందరికీ బహుమతులంద జేయబడ్డాయి.

మొత్తాని కెలాగయితేనేం నా మొట్టమొదటి అడ్వంచర్‌ని విజయవంతంగా పూర్తి చేసేను.

మొదటిసారే అంత చక్కగా సారథ్యం చేసినందుకు అందరూ ఎంతో పొగిడేరు. నా మొహం మందారంలా విచ్చుకుంది.

అంతా అయ్యేక నేనూ, వదినా తీరుబడిగా కూర్చుని లెక్కలు చూసుకున్నాం. మొత్తానికి తేలిందేంటంటే కలెక్ట్ చేసిన డబ్బు కన్న ఆరువేల రూపాయిలు ఎక్కువ ఖర్చయ్యిందని. ఆ లెక్క చూసుకుంటున్న నా మొహం పాలిపోయింది.

“ఇదేంటి వదినా!” అన్నాను బిక్కమొహమేసుకుని.

ఇంత కష్టపడ్డందుకు నాకు రూపాయి మిగలకపోగా పైన నాచేతివే ఆరువేలు ఖర్చయ్యాయన్న మాట.

నా బిక్కమొహం చూసి నవ్వింది వదిన.

“ఖంగారు పడకు స్వర్ణా.. ఇది నీకు మొదటి పాఠం. ఎక్కడైనా బావ కానీ వంగతోట దగ్గర బావ కాదని మనకో సామెతుంది గుర్తుందా! పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే.. అనే నానుడి కూడా ఉంది.. పోనీ అదైనా గుర్తుందా!”

ఓ మూల డబ్బులు పోయి నేను బాధ పడుతుంటే తీరుబడిగా సామెతలు చెప్తున్న వదినని ఉక్రోషంగా చూసేను.

“నువ్వు అందరి దగ్గరా డబ్బులు వసూలు చేసేవా!”

నా కోపం చూసి సూటిగా అడిగింది. “ఊ..” అన్నాను ఖచ్చితంగా.

“మరి నా దగ్గర..” ఇంకా సూటిగా అడిగింది.

“ఛ.. నీ దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గరా డబ్బు లెందుకు తీసుకుంటానూ..” అన్నాను అది తప్పన్న భావంతో.

“అదే నువ్వు చేసిన తప్పు. ఏం.. మేము అందరితోపాటూ రాలేదా.. తినలేదా.. బహుమతులు తీసుకోలేదా..! మరెందుకు డబ్బులు తీసుకోలేదూ!” అంది.

నేనేం మాట్లాడలేకపోయేను. వదిన చెప్పింది.

“ఒక్కమాట గుర్తు పెట్టుకో స్వర్ణా. డబ్బు దగ్గర తన, పరాయి అని లేదు. అందరూ సమానులే. ఇది బిజినెస్‌లో గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి పాఠం. ఇప్పుడు చెప్పూ.. నాదీ, నా ఫ్రెండ్స్‌దీ కలిపితే నీకెంత వసూలవాలీ!” అడిగింది.

“ఎనిమిదివేలు..”

“ఇదిగో.. ఎనిమిదివేలు. మా ఫ్రెండ్స్ దగ్గర నేను వసూలు చేసేను. నా దానితో కలిపి ఇస్తున్నాను. ఈ లెక్కన చూస్తే మొట్టమొదటిసారి నువ్వు పడ్డ కష్టానికి నీకు మిగిలింది కేవలం రెండు వేలే. బిజినెస్‌లో రెండో పాఠం చెప్తున్నాను.. గుర్తు పెట్టుకో.. ప్రతీ దానికీ రెండో అకౌంట్ కూడా ఉండాలి..” అంది నవ్వుతూ..

గీతోపదేశం వింటున్న అర్జునుడి పోజులో కూర్చుండిపోయేను వదిన ముందు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here