వడ్లగింజలో బియ్యపుగింజ

0
11

[box type=’note’ fontsize=’16’] ఉండిపోవడానికే వచ్చేనన్న మనిషి వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతానంటున్నారంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో కుంటముక్కుల సత్యవాణి రాసిన ఈ కథ చెబుతుంది. [/box]

[dropcap]”ఒ[/dropcap]రేయ్ అబ్బాయ్! నేను రేపు ఉదయాన్నే వెళ్ళదలచుకొన్నాను” అన్నారు ఆనందరావుగారు.

ఉరమని పిడుగులాంటి తండ్రి మాటకు అదిరి పడ్డాడు శ్రీనివాస్.

ఏం జరిగిందంటూ కళ్ళతోనే లతను ప్రశ్నించాడు అతడు.

ఏమో అన్నట్లు లత భుజాలు కదిపింది.

“వినపడిందా! నేను ఉదయాన్నే బయలుదేరతాను. మీరు అప్పటికి లేవరని ఇప్పుడే చెపుతున్నాను.”

ఇంక చెప్పవలసినది లేనట్లు అక్కడనుండి లేచి గదిలోకెళ్ళిపోయిన తండ్రి వంక అయోమయంగా చూసేడు శ్రీనివాస్.

రాత్రి గదిలోకి రాగానే ప్రశ్నిచాడతడు భార్యను.

“మనవల్ల ఏదైనా తప్పు జరిగిందంటావా? నువ్వు పొరపాటుగా ఏమైనా అన్నావా?” అని భార్యను ప్రశ్నించాడు శ్రీనివాస్.

“నేనేమంటానండీ! అయినా ఆయన అనేలాంటి మనిషా! ఎవరికీ ఏ మాత్రం బాధ కలిగించకుండా చక్కగా ప్రవర్తిస్తారు. చేతనైన సాయం చేస్తారు. ఈయన వచ్చిన ఈ పదిరోజులనుండీ ప్రాణానికి సుఖంగా వుంది. తెల్లారి పాలుతేవడం, తెల్లారకుండా వచ్చే నీళ్ళు పట్టడం, బాబిగాడిని స్కూలుకి తీసికెళ్ళడం, తీసుకురావడం, ముఖ్యంగా నేను ఆఫీసునుండి వచ్చేలోపు ముందుగా వచ్చే బాబిగాడు ఏం పెత్తనాలు చేస్తున్నాడో అనే బెంగలేకుండా హాయిగా వుంది.” మావగారిచ్చే కోఆపరేషన్ ఏకరువు పెట్టింది లత.

మావగారు వెళ్ళిపోతే కలిగే బాధ తనకే అన్నట్లుంది, ఆమె మాటల్లో.

“ఆయన గదికి వెళ్ళి అసలు ఏంజరిగిందో కనుక్కోండి” అంది లత. ఉండిపోవడానికే వచ్చేనన్న మనిషి వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతానంటున్నారంటే ఏదో జరిగింది. అమ్మపోయాకా రమ్మన్నా రానన్న మనిషి తనంత తానుగా ఉండిపోవడినికే వస్తున్నానంటే, శ్రీనివాస్ లత చాలా సంతోషించారు. ఆ పల్లెటూళ్ళో, లంకంత ఇంట్లో, పెద్దవయసులో ఒక్కరూ వుంటున్నారన్న దిగులుపడేవారా భార్యాభర్తలు.

“వెళ్ళండి వెళ్ళి విషయం ఏమిటో కనుక్కోండి, తెల్లారాయన బయలుదేరాకా ఆపటం బాగుండదు. ఆయన ఆగరు కూడా” మావగారి గదిలోకి శ్రీనివాస్‌ని తరిమింది లత.

శ్రీనివాస్ తండ్రి మంచంపై కూర్చొని, “ఏం నాన్నా ఎందుకు కోపం వచ్చింది? నేనైనా, లతైనా మీ మనసు బాధించేమా? ఉండిపోయేలా వచ్చేరని, ఇంట్లో పెద్దదిక్కుగా వుంటున్నారని సంతోషపడుతుంటే మీ ఈ నిర్ణయంతో నేనూ లతా చాలా బాధపడుతున్నాం. తప్పు జరిగితే చెప్పండి నాన్నా! దిద్దుకుంటాం ప్లీజ్!” తండ్రి చేతులు పట్టుకు అడిగాడతడు.

“మీరు తప్పుచేయడమేమిటిరా మీ మొఖం. నా కోడలు అసలు చెయ్యదు. ఇంక నేను వెళ్ళడానికి కారణం అంటావా, అక్కడ అమ్మ పోయాకా ఒంటరినన్న దిగులు నన్ను వేధిస్తోంది. కానీ మీరు ఎన్నిసార్లు రమ్మన్నా రాకపోవడినికి కారణం మీకు అడ్డమౌతానేమో అని తప్ప వేరే కారణం లేదు. నా ఒంటరితనం, బాధను చూసిన స్నేహితులు, బంధువులు ‘ముత్యాల్లాంటి కొడుకు కోడలు, రత్నంల్లాంటి మనవడిని పెట్టుకొని ఇక్కడ బాధపడడం ఎందుకు? మనవడితో కాలక్షేపం చెయ్యి’ అని అడగకుండానే సలహాలిస్తుంటే, బయలుదేరొచ్చేను. కానీ ఇక్కడకి వచ్చినా ఉదయం రెండు గంటలు, సాయంత్రం పది నిముషాలు తప్ప నేను చేసేదేమీ లేదు. మీకా ఆఫీసులు హడావిడి, బాబిగాడికా సాయంత్రం వచ్చినప్పటినుండి టీ.వీ. తప్ప వేరే లోకం లేదు. వాడికి ఎన్నో కథలూ కబుర్లూ చెపుదామనుకొంటే, వాడితో మాటలే వుండటంలేదు. వాడికి ఆ టీ.వీ. తప్ప తాతయ్య అక్కరలేదు” చిన్నపిల్లాడిలా ఉక్రోషంగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తే ఆయన బాధ అర్థమైయ్యింది శ్రీనివాస్‌కి.

“నాన్నా మీ బాధ అర్థమైయ్యింది. రేపటి నుండి మీ మనవడు మీతో కాలక్షేపం చేస్తే చాలుగా, మీరు వెళతానని అనరుగా?” అడిగాడు కొడుకు.

అంతే అంతే అన్నట్టు  తలవూపాడు ఆనందరావుగారు.

తండ్రి గదిలోంచి బయటకు వస్తూనే టీ.వీ. కనెక్షన్ తీసేసి, రిమోటు అటక మీదకు విసిరేశాడు శ్రీనివాస్. హాయిగా నిద్రపోతున్న కొడుకు బుగ్గపై ముద్దు పెట్టుకుంటున్న భర్తను “ఏమన్నారు మావగారు” అని అడిగింది లత. “ఏమీ లేదోయ్ ‘వడ్లగింజలో బియ్యపుగింజ’. అంతే” అన్న శ్రీనివాస్ మాటలకు

అయోమయంగా చూసింది లత.

“ఏమైతే నీకెందుకు, నాన్న ఇక వెళ్ళరులే” అన్న మాటలు ఆమె చెవులకు విందు చేశాయి.

‘హమయ్య’ అని హాయిగా నిట్టూర్చి నిద్రలోకి జారుకొంది లత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here